[ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి సంచిక పాఠకులకు అందిస్తున్న శీర్షిక ‘కాజాల్లాంటి బాజాలు’.]
నాకో పెద్ద చిక్కొచ్చి పడింది. నా మేనల్లుడి కొడుకు పెళ్ళి. నేనుండే హైద్రాబాదులో కాదు. చెన్నపట్నంలో. ఈమధ్య పెద్దదాన్నయిపోయానేమో.. పెళ్ళిళ్ళకీ, పేరంటాళ్ళకి వేరే ఊర్లు వెళ్లడం మానేసేను. ఏ ఫంక్షనయినా హైద్రాబాదులో అయితేనే.. అది కూడా సమయం నాకు అనుకూలంగా ఉంటేనే వెడుతున్నాను. ఏం చెయ్యను.. పరిస్థితులు అలా వచ్చేయి మరి. అందుకే మా చుట్టపక్కాలు కూడా నేను రాలేనందుకు నిష్ఠూరాలాడకుండా నన్ను అర్థం చేసుకుని, నా ఆశీర్వచనాలుంటే చాలంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఆశీర్వచనాలు వాట్సప్‌లో పంపించెయ్యొచ్చు. కానీ, ఇంత దగ్గరి బంధువులు, బాగా కావల్సినవాళ్ళు శుభకార్యం చేసుకుంటుంటే వట్టి ఆశీర్వాదాలతో పాటు ఆ పెళ్ళికొడుక్కి ఏదైనా చదివించాలనిపించింది. కానీ, ఎలా..
వాళ్ల బాంక్ అకౌంట్ నంబర్ అడిగినా కూడా నాకు ఆన్లైన్లో డబ్బులు పంపడం తెలీదు. నాలాంటి సీనియర్ సిటిజన్స్ చాలామందికి ఆన్లైన్ బాంకింగ్ టెక్నికల్ నాలెడ్జి తక్కువే ఉంటుంది మరి.
అందుకే ఏం చెయ్యాలో అర్థం కాక వదినయితే ఈ సమస్యకి మంచి పరిష్కారం చూపిస్తుందని వదినకి ఫోన్ చేసేను.
“నాకు తెలుసు ఇలాంటి సమస్య వస్తుందనీ.. నీకే కాదు ఆన్లైన్లో శుభకార్యాలు చూసి ఆశీర్వదిస్తున్న వాళ్లందరికీ ఇదో పెద్ద ప్రశ్న. అందుకే దీని గురించి ఎంతో ముందుగా ఆలోచించి, చక్కని పరిష్కారం కనిపెట్టేను.”
వదిన గర్వంగా చెపుతుంటే నాకెంత సంతోషం వేసిందో!
“ఎంతైనా నువ్వు చాలా తెలివైనదానివి వదినా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు నాతోపాటు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నువ్వంటే ఒక ఆరాధన అనుకో.. ఇంతకీ ఈ సమస్యకి నువ్వు కనిపెట్టిన పరిష్కారం ఏంటీ!”
ఆతృత ఆపుకోలేకపోయేను. వదిన స్థిమితంగా చెప్పడం మొదలు పెట్టింది.
“స్వర్ణా, దేనికైనా పరిష్కారం కనుక్కోవాలంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి. ఇదివరకు రోజుల్లో అంటే మన పెద్దవాళ్ళ టైమ్‌లో పెళ్ళిళ్ళకి ఏవైనా చదివించాలంటే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ కలిసి తలో పాతికో పరకో వేసుకుని, ఆ పెళ్ళి చేసుకునేవాళ్ల కాపరానికి ఉపయోగపడేలా ఓ బిందో, స్టీల్ డ్రమ్మో కొనిచ్చేవారు. ఆ తర్వాత ఆఫీసులు, ఉద్యోగాలు వచ్చేక ఆఫీసు వాళ్లందరూ కూడా ఇలాగే చేసేవారు. ఆ తర్వాత్తర్వాత ఎవరికి వాళ్ళు విడి విడిగా డబ్బులు కవర్లో పెట్టి, పైన వాళ్ల పేర్లు రాసి అందించేవారు. ఇలాగ ఇచ్చే పధ్ధతు లెన్ని ఉన్నా అసలైనది ఏవిటంటే, ఆ పెళ్ళిజంట పక్కన ఒక మనిషి కూర్చుని, ఎవరు ఏవేవి చదివిస్తున్నారో లిస్ట్ రాసేవాడు. ఇదంతా ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది కానీ, అప్పుడు మటుకు అలాగే జరిగేది. ఇప్పుడు కూడా అంతే కదా! పెళ్ళిమండపం పక్కన ఓ మనిషి నోట్ బుక్, పెన్నూ పట్టుకుని కూర్చోడం చూస్తూనే ఉన్నాం కదా! అప్పట్లో పెద్ద సంసారాలు కదా! బోల్డుమంది చుట్టపక్కాలుండడంతో అలా జరిగేది.
కానీ ఇప్పుడు ఇలా పైన చెప్పినట్టు జరగాలంటే ఎలా కుదుర్తుందీ. అసలే చిన్న సంసారాలయిపోయేయి. పైగా అలా జరగాలంటే మనం స్వయంగా పెళ్ళికి వెళ్ళాలి కదా!
ఈ ఇంటర్నెట్ వచ్చేక అందరూ చూడాలని ఈమధ్య చాలామంది పెళ్ళిళ్ళని, శుభకార్యాలనీ లైవ్‌లో ఆన్లైన్లో చూపించేస్తున్నారు. పెద్దవాళ్ళూ, వెళ్లడం కుదరనివాళ్ళూ అలా ఆన్లైన్లో చూసి ఆశీర్వాదాలు చేసేస్తున్నారు. కానీ, చిక్కంతా ఇక్కడే వచ్చింది. పెళ్ళి చూస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు కానీ చదివింపులకి అవకాశం లేకుండా పోయింది. అందుకే మన వేణూ చేసే ఫంక్షన్‌కి రేప్పొద్దున్న వాట్సప్‌లో నీకో ఇన్విటేషన్ వస్తుంది చూడు. దానిని నేనే డిజైన్ చేసేను. మనం దాని గురించి రేపు నువ్వు చూసేక మాట్లాడుకుందాం.”
“అదేంటి వదినా! రేపటిదాకా సస్పెన్సా!”
“అలాగే అనుకో” అంటూ వదిన ఫోన్ పెట్టేసింది.
మర్నాడు వదిన చెప్పినట్టే వాట్సప్‌లో మా బాబయ్య కొడుకు వేణూ దగ్గర్నించి ఇన్విటేషన్ వచ్చింది. తన కొడుకు ఒడుగుకి అందర్నీ ఆహ్వానిస్తూ, అది జరిగే చోటూ, సమయం మొదలైన వివరాలతో పాటూ లైవ్‌లో ఆ ఒడుగుని ఆన్లైన్లో చూసే లింక్ కూడా ఇచ్చేడు. అన్నింటికన్నా అందరి దృష్టినీ ఆకర్షించేలా ఆ కార్డ్‌లో సగం పైగా ఆక్రమించి ఉన్న ఒక వటువు బొమ్మ. వటువు పచ్చటి పసుపు బట్టలతో, కొత్తగా వేసుకున్న యజ్ఞోపవీతంతో, భుజమ్మీద దండంతో, పైనున్న అంగవస్త్రాన్ని చేతిలో జోలెలా పట్టుకుని నిలబడడం, ఎదురుగా ఉన్న ఒక ముత్తైదువ ఆ జోలెలో ఏదో వస్తువు వేస్తుండడం, ఆ వటువు బొమ్మ కింద “భవతీ భిక్షాం దేహీ!” అక్షరాలూ, ఎదురుగా ఉన్న ఒక ముత్తైదువ ఆ జోలెలో ఏదో వస్తువు వేస్తూ, ఆ అబ్బాయిని దీవిస్తుండడం కనిపించింది.
అన్నింటికన్నా ఆశ్చర్యంగా ఆ బొమ్మ కింద స్కాన్ చెయ్యడానికి వీలైన QR కోడ్, దానికింద “మీ భిక్షను ఇక్కడ స్కాన్ చెయ్యవచ్చు” అనే అక్షరాలూ కనిపించేయి.
నాకు మతిపోయింది. చదివింపులు స్కాన్ చెయ్యడమా! అసలలాంటి అవిడియా వదినకి ఎలా వచ్చిందా అనుకుంటుండగానే వదిన దగ్గర్నించే ఫోన్ వచ్చింది.
వెంఠనే అడిగేసేను, “వదినా అసలీ అవిడియా నీకెలా వచ్చిందీ!” అంటూ.
“ఉపాయం లేని వాణ్ణి ఊర్లోంచి పొమ్మనాలీ అనే సామెతుంది తెలీదూ! అలాగే ప్రతి సమస్య పరిష్కారానికీ ఓ ఉపాయం అంటూ ఉంటుంది. దాన్ని కనిపెట్టడంలోనే మన గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు చూడు, చాలామంది పెద్దవాళ్లకి ఆన్లైన్లో బాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పంపడం తెలీకపోవచ్చు, కానీ ఈ కరోనా మహమ్మారి పుణ్యమాని అందరూ నిత్యావసరాలు కొనుక్కుందుకు గూగుల్, ఫోన్ పే లాంటి వాటిల్లో డబ్బు స్కాన్ చెయ్యడం మటుకు నేర్చుకున్నారు. అలాంటివాళ్లకి ఇలా స్కాన్ చేసి వటువుకి భిక్ష వెయ్యడం ఎంత సుఖమో కదా!”
వదిన మాటలో గర్వం తొణికిసలాడింది. నేనూరుకోలేదు.
“ఏదో పేద్ద కనిపెట్టేసేననుకోకు. ఇది ఒడుగు కనక, అందరూ భిక్ష వెయ్యాలి కనక, ‘భవతీ భిక్షాం దేహీ’ అంటూ అక్కడ స్కాన్ QR కోడ్ పెట్టేవు. మరి శుభకార్యాలంటే ఒడుగొక్కటే కాదు కదా! బోల్డుంటాయి. వాటికి భిక్ష వెయ్యమంటూ స్కాన్ QR కోడ్ పెట్టలేముగా!”
నా మాటలకి గట్టిగా నవ్వింది వదిన. “ఇలా అందిస్తే అలా అల్లుకుపోతారు కొందరు. కానీ నీలాంటివాళ్ళు దానిక్కూడా పనికిరారని తెల్సిపోయింది. సరే, అది కూడా నేనే చెప్తా విను.
ఇప్పుడన్నీ వాట్సప్ ఇన్విటేషన్లే కదా! ఆ ఇన్విటేషన్లో ఇక్కడ ఒడుగు అవుతోంది కనక వటువు బొమ్మ వేయించి భిక్ష అని పెట్టేం. అదే శ్రీమంతం ఫంక్షన్ అయితే ఒక చూలింతని కుర్చీలో కూర్చోబెట్టి అటూ ఇటూ హారతిస్తున్న నలుగురు ముత్తైదువులున్న బొమ్మ పెట్టి, ‘మీ దీవెనలు దీనిలో పంపించండి’ అంటూ స్కాన్ QR కోడ్ పెట్టేస్తామంతే.
అలాగే బారసాలయినా, అన్నప్రాసన అయినా, అక్షరాభ్యాసం అయినా, పెళ్లైనా.. ఏ శుభకార్యమైనా సరే దానికి తగ్గ బొమ్మ పెట్టడం, మీ దీవెనలు దీని ద్వారా పంపండి’ అంటూ స్కాన్ QR కోడ్ ఇవ్వడం అంతే..”
‘వారి నాయనో’ అనుకోబోయి, ఆ మాటల్ని బలవంతంగా గొంతులోనే మింగేసి ‘వాయమ్మో వదినో!’ అని మాత్రం అనుకోకుండా ఉండలేకపోయేను.
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.