యాంత్రికత అన్నది మన దైనందిన జీవితాలలో ఎక్కువ పరిమాణంలో చోటు చేసేసుకుంది అన్నది నిర్వివాదాంశము. ఎంత సంపాదిస్తూ వున్నామో, అంతే పరిమాణంలో మానసికోల్లాసం లభిస్తోందా – అన్న ప్రశ్న మనకి మనం వేసుకుని, ఆలోచించడం మొదలుపెడితే, తేలిపోయేదేమిటంటే – మనకి అందుబాటులో లేని సౌకర్యం లేదు. కాని, ‘మనకేమి లోటు, మనం హాయిగానే వున్నాము’ అని గుండెల మీద చేయి వేసుకుని నిబ్బరంగా మనం అనుభవిస్తున్న సుఖాల గురించి ప్రకటించుకునేటంత ధైర్యం మనలో ఏ ఒక్కరికీ లేదు.
మనసులో ఏదో ఒక మూల సందేహం, చేసే పని యొక్క ఫలితం మీద అస్పష్టత వలన డోలాయమానంగా వుండి, దాని వలన కొంత ఆందోళన వుంటుంది. ఇటువంటి స్థితి మనకే వున్నదా – లేదా మన చుట్టూ వున్న అందరికీ వున్నదా? దీని నుండి తప్పించుకునే మార్గం వున్నదా?
ఇక మన ఆరోగ్యం విషయానికొస్తే దాని యొక్క నియంత్రణ అంటే మానసిక మరియు శారీరిక ఆరోగ్యాలు మనమే నియంత్రించుకుంటూ ఎంతవరకూ వైద్యుల అవసరం లేకుండా ఎంత గడపగలుగుతున్నాము? అలా వుండటం వలన మనం సుఖపడి, ఎంతవరకూ ‘ఇతరులని’ – అంటే మన జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు. వారెవరైనా సరే! వారితో ఇబ్బందికరమైన సందర్భాలలో చిక్కుకుని పోయి కుృంగిపోకుండా ఎలా బయట పడగలుగుతాము.. అనుకుంటూ వుండగా, నాకు అనుకోకుండా బ్నిం గారు, మే 23 2024 న ఒక ప్రకటనని వాట్సప్‌లో పంపారు.
ఇది ఆ ప్రకటన.
వివరాల కొరకు ప్రతిమా రాపర్తి అనే స్నేహితురాలిని సంప్రదించి, దీని ద్వారా వారు కొన్ని కోర్సులు చేసి, లబ్ధి పొందారు కనుక, వారిని అడిగి వివరాలు తెలుసుకుని, మీరూ ప్రయత్నించండని సలహా ఇచ్చారు.
నేను బ్నిం గారిని పెయింటింగ్ గురించి సలహాలడిగాను గనుక నాకు ప్రకటనలో ‘ఆక్సిలిక్ పెయింటింగ్’ మహిళల విభాగంలో కనిపించగానే వెంటనే ఆ కోర్సులో సందేహం లేకుండా అడుగుపెట్టి తరువాత వర్లీ ఆర్ట్, హోం డెకరేటివ్ ఆర్టికల్స్ విత్ వేస్ట్ మెటీరియాల్, కంప్యూటర్ బేసిక్స్, యూట్యూబ్ అప్రోచ్, వీడియో ఎడిటింగ్, ఎరోబిక్స్ అండ్ యోగ, కర్ణాటక సంగీత పరిచయం, అన్నమయ్య గీతాలాపన, కూచిపూడి నృత్య ప్రవేశం చేసేసాను. వీటిల్లో కొన్నిటి పట్ల అభినివేశం, కొంత పరిచయం వుంది కాని వాటిని కొనసాగించడం కుదరలేదు. ఇన్నాళ్ళకి ఆ కోరిక తీరుతోంది. అయితే నాకు ఈ వేదిక మీద పరిచయం అయిన చాలామంది పరిస్థితి ఇదే! ‘నాలాగా ఎందరో’ అనిపిస్తుంది అందరికీ!
అందుచేత ఒకసారి ప్రవేశించిన వారెవరూ ‘ఫ్రీగురుకుల్’తో వున్న సంబంధాన్ని తెంచుకోలేక పోతున్నారేమో అనిపిస్తుది. అదే సహానుభూతిని ఇక్కడ గురువులుగా వున్నవారూ, శిష్యరికం చేస్తున్నవారూ కూడా పంచుకుంటున్నారు. అందుకే అంత తేలికగా తెంచుకోలేరు.
అసలు విద్య అనేది వాణిజ్యంతో ముడిపడి వున్న కారణంగా మనలో చాలామంది మన జీవనభృతికి ఎక్కువగా తోడ్పడేదానిని ఎంచుకుని, అది మన నైజానికి భిన్నంగా వున్నా సరే, ఎలాగో అలా దానినే పట్టుకుని వ్రేలాడి మనలో నిగూఢంగా దాగియుండి, మనకు మానసికోల్లాసం కలిగించి, మనను ప్రత్యేకంగా సమాజంలో నిలుపగలిగిన శక్తి కలిగిన కళల నెన్నిటినో విస్మరించి, వాటి పట్ల అశ్రద్ధ వహించి తత్పలితంగా ఆందోళనకి, ఏదో తెలియని అస్పష్టమైన బాధకి, నిరాశకి గురై యంత్రాలవలే బ్రతుకలేక ఉద్యోగాలు వ్యాపారాలు మొదలైన వాటిల్లోకి దూసుకుపోవాలని పరుగు పెట్టి, ఎక్కడ ఆగిపోవాలో అంతుపట్టక, ఎటు వైపు మళ్ళితే మనకు సాంత్వన లభిస్తుందో గ్రహించలేని సందిగ్ధావస్తలో వున్నప్పుడు ఈ సంస్థ (Free Gurukul org) అందించే చేయూత నిజంగా ఎడారిలో మన దాహార్తిని తీర్చే నీటికుంట ఎదురైనట్లే వుంటుందని నేను అంటాను.
ఒక మూడు వందల రూపాయలతో మనకు మనం కోరుకున్న కళలో ప్రవేశం, దాని పట్ల మన మక్కువని పెంచే విధంగా వుండే శిక్షణ, మనలోని జంకుని పోగొట్టి, మనం కూడా ఏదో ఒకటి చేయగలము అనేటువంటి ధీమాని మనలో కలిగించేటువంటి ప్రోత్సాహం, ఇక్కడ మీకు లభిస్తుందని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తక్కువ ఖర్చుతో అనేక విద్యలు, గొప్ప సహనం, సేవా దృక్పథం వున్న ఉన్నత స్థాయి గురువుల వద్ద నుండి మీకు ఈ మాధ్యమం ద్వారా లభిస్తాయి. ‘స్వానుభవమున చాటు నా సందేశ మిదియే’ అన్న మాట! అన్న మాటేమిటి అది అక్కడ వున్న మాటే మరి!
ఇక ఈ ఫౌండేషన్ పూర్వాపరాలలోకి తొంగిచూస్తే, 2018లో కేవలం అయిదు రంగాలలో శిక్షణను మొదలుపెట్టి, ఇప్పుడు దరిదాపు 150 (పైమాటే) – అన్ని రంగాలలో మన ఆరంగేట్రం ఇక్కడ ప్రారంభించవచ్చును. కోవిడ్ సమయంలో కూడా, వీరు మొబైల్, లాప్‌టాప్‌ల సహాయంతో ఆన్‌లైన్ శిక్షణలు దిగ్విజయంగా కొనసాగించేసి కృతకృత్యులయ్యారు. సమాజానికి దగ్గరవ్వాలనే ఆసక్తితో ఒక ఫౌండేషన్ స్థాపించిన రాజారెడ్డిగారు, ఆయనకు యథోచితంగా సహాయం చేస్తూ రాంభూపాల్ రెడ్డిగారు, సుకన్యగారు తమ సంకల్ప సిద్ధిని సాధించారనే నాకు అనిపించింది. వారికి తమ కృతజ్ఞతలను తెలియజేస్తూ, ఇంకా వారి ప్రయత్నంలో స్వచ్ఛందంగా భాగస్తులయ్యేవారు చాలామంది వున్నారు. అంతేకాదు ఆ వెబినార్ ద్వారా సందర్భోచితమైన సమావేశాలని (online) నిర్వహించి అనేక విషయాల పట్ల మనకు అవగాహనని కల్పిస్తారు.
అన్నిటికంటే ముఖ్యమూ – చివరాఖరుగా మర్చిపోకుండా చెప్పుకోవలసినది ఏమిటంటే మనం మన పిల్లలకి పుస్తకపఠనం అలవాటు చేయ్యాలి అనుకుంటే, వారికిష్టమైన మొబైల్‌ని వారి చేతికి అందించి, వీరు ఉచితంగా అందించే అనేక పుస్తకాలు, పి.డి.ఎఫ్.ల రూపంలో ఉన్నవాటికి పై వారి దృష్టిని మరల్చి, వారి ఆసక్తిని పుస్తకాల వైపుకి మరల్చవచ్చును. మీరు ఒక్కసారి వీరి వెబ్‌సైట్ కాని, లేదా ఫోను నంబరు కాని సంప్రదిస్తే, వివరాలు మీకు మరింత చేరువ కాగలవు.
నిజం చెప్పేస్తున్నా – వీరి పుణ్యమా అని నాకు 80లలో వున్నవారి దగ్గర నుండి నాకంటే వయసులో చాలా చిన్నవారి పరిచయాలు మొబైలు ద్వారా ఏర్పడి, నాకు అనేక విషయాలు నా ఇంటిగుమ్మం దాటకుండానే తెలుస్తున్నాయి. ఇంతకన్నా ఏం కావాలి ఈ రోజుల్లో! బిజీ బిజీ నిత్యకృత్యాలు ముగించేసుకుని, హాయిగా.. ‘హమ్మయ్యా’ అనుకుంటూ మనకు నచ్చినది నేర్చేసుకుని మనకు నచ్చిన వాళ్ళ ముందు, మనదైన ప్రత్యేక శైలిలో, ఆ నేర్చుకున్న విద్యకు మెరుగులు దిద్దేసి ప్రదర్శించి వేయడం; వారు ‘ఆహా’, ‘ఓహో’ అనేసేస్తే, ‘హమ్మయ్య’! మనం బ్రతుకుని ఈడ్చుకుని పోవటం లేదు, రోజులో కొన్ని గంటలైనా హాయిగా, సంతృప్తిగా, నవ్వుకుంటూ, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ‘బ్రతికేస్తున్నా’మని నిర్ధారించేసుకోవచ్చునన్నమాట! ఇది నా అనుభవం!
మీకు కూడా అలాగే అనిపించవచ్చునేమో! ప్రయత్నించండి. వచ్చే నెల 23 వ తేదీన మళ్ళీ క్రొత్త ప్రకటన వెలువడుతుంది.

