మాదేముంది లెండి
నిమిత్త మాత్రులంకదా,
నిర్ణయాలు వాళ్లవి,
ఆచరించాలిసింది మేము,
మంచో చెడ్డో
వారికే తెలియాలి,
వారు విసిరే ….
సంక్షేమ సూత్రాలు మాకు
శిరోధార్యం కదా…!
లాక్డౌన్ రంధిలో
రగడలకు తావులేకుండా ,
రవంతకూడా
వెసులుబాటు లేకుండా ,
ఇళ్లకే పరిమితం
కావాలన్నారు!
ఇరవైనాలుగు గంటలూ
ఇంట్లోపడివుండడం,
కష్టమని తెలిసినా,
వాళ్ళ మాటకు కట్టుబడి,
అది మా మేలు కోసమే
అని తెలిసి
అలాగేసేసాం ….
పాలకులకు సహకరించాం !
బజారుకెళితే …
భౌతిక దూరం పాటించామన్నారు ,
అలాగే పాటించాం ….
మాస్కులు కట్టుకోవాలన్నారు ,
ముసలాళ్ళిని పిల్లల్నీ
బయటికి పంపొద్దన్నారు ,
మా మంచికే అనుకుని
మనసారా ఆచరించాం.
మీ మాట
కాదన్నదెప్పుడు …?
ఇప్పుడు –
మద్యం షాపులు
తెరిచామన్నారు …
చీమలదండులా _
సామాన్యజనం ,
చూపుకందనంత
చాంతాడు పొడవంత
క్యూ కట్టారు …
భౌతిక దూరానికి
చెల్లు చీటీ పలికేసారు !
పాపం –
ఉచితం అనుకుంటున్నారేమో
లైనుకట్టిన జనం …
నలభైరోజుల
మడి జీవితానికి…
గుడ్ బై చెప్పేశారు…!
కరోనా చెలరేగిపోయి
కబాడ్డీ ఆడుకుంటుందేమో ..
చూడాలి మరి….!!
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.