[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘ఇద్దరు దొంగలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
రాజు ఒక చిల్లర దొంగ. ఉండేది విశాఖపట్నంలో. చేసేది కూలి పని, కానీ వేష భాషలు బాగా ఉంటాయి. అందుకే వాడిని ఎవరూ దొంగ అనుకోరు. శనివారం, ఆదివారాలు పనికి వెళ్ళడు. ఆ రెండు రోజులూ, కొత్త ప్రదేశాలకి వెళ్లి, చిల్లర దొంగతనాలు, విచిత్రమైన ఆలోచనలతో చేస్తూ ఉంటాడు. ఆరోజు శనివారం.
సాయంత్రానికి ముందుకి డబ్బు సంపాదించుకోవాలి.. అదీ వాడి ధ్యాస ఇప్పుడు.
తరచూ వెళ్లే మోహన్ టైలర్ షాప్ దగ్గరకి వెళ్ళేడు. “ఏం గురూ..బావున్నావా?” ప్రశ్నించాడు మోహన్‌ని.
“బాగానే వున్నాను. ఏమిటి ఈ మధ్య కనపడడం లేదు?” అన్నాడు మోహన్.
“కొద్దిగా బిజీ పనుల్లో తిరుగుతున్నాను లే”.. అని, “టీ చెప్పు గురూ!” అన్నాడు స్టూల్ మీద కూర్చుంటూ. రాజు అక్కడ కూర్చుంటూ, మోహన్ తెప్పించిన టీ తాగి వెళ్లడం అలవాటే.
“సరే”, అని, ఎదురుగా వుండే టీ షాప్ కి సైగ చేసేడు మోహన్.. “2 టీలు” అని.
రాజు జేబు తడుముకున్నాడు.. అందులో నిన్న మార్కెట్ దగ్గర దొరికిన పాత ఖాళీ పర్సు తగిలింది. దాంతో, ఇప్పుడు తాను చేయబోయే దొంగతనానికి మనసులో ప్రణాళిక వేసుకున్నాడు.
మోహన్ బిజీగా మిషన్ కుట్టుకుంటున్నాడు. మోహన్‌కి కస్టమర్స్ ఇచ్చే విజిటింగ్ కార్డ్స్ ఓ మూలగా గ్లాస్‌లో పెట్టడం అలవాటు.
మోహన్ పనిలో ఉండడం చూసిన రాజు నెమ్మదిగా అందులో ఒక విజిటింగ్ కార్డు తీసి సైలెంట్‌గా జేబులో పెట్టేసుకున్నాడు. మోహన్ గమనించలేదు.
ఇంతలో టీలు వచ్చేయి. టీ తాగి, మోహన్‌కి బై చెప్పి, బయటకి వచ్చేసేడు రాజు.
కొంత దూరం వెళ్ళేక, ఆ విజిటింగ్ కార్డు చూసేడు. డాబా గార్డెన్స్‌లో ఒక షాపు దగ్గర ఆ అడ్రస్ కనపడింది. అది ఒక మొబైల్ షాప్. మొబైల్ సర్వీస్ అండ్ రిపేర్ వర్క్స్ అని బోర్డు వుంది. ‘ప్రొప్రయిటర్ సలీం’ అని వుంది. జేబులో కార్డులో చూపించిన పేరు సరిపోయింది.
నెమ్మదిగా తన ప్రణాళిక అమలుపరిచాలని నిశ్చయించుకున్నాడు రాజు.
తన జేబులో వున్న ఆ చీప్ పర్సుని బయటకి తీసేడు. మరో జేబులో దాచి ఉంచిన 6 నకిలీ 500 నోట్లని ఆ పర్సులో పెట్టేడు. ఆ నోట్లు ఎలా పెట్టేడంటే 500 నోటు కొద్దిగా బయటకి కనపడుతూన్నట్లు పెట్టాడు. రాజుకి ఇప్పుడు చేయబోతున్న పని కొత్త పని. ఇదివరకు చేయలేదు. అందుకని ముందు జాగ్రత్తగా తన టార్గెట్ పేద, దిగువ మధ్య తరగతి వాళ్ళ మీద చేయాలని అనుకున్నాడు.
షాప్ దగ్గర రద్దీగా వున్నప్పుడు, ముందుకు కదిలాడు. షాప్ ఓనర్ సలీం కౌంటర్‌లో కూర్చున్నాడు. పనికుర్రాడు, వచ్చిన వాళ్లకి మొబైల్ కవర్లు, మొబైల్ ఛార్జర్లు మొదలైనవి చూపిస్తున్నాడు.
నేరుగా సలీం దగ్గరకి వెళ్ళేడు. “సార్ ఇక్కడ సలీం గారు ఎవరు?” అని ప్రశ్నించాడు.
సమాధానం సరిగా రాకపోతే, తన వ్యూహం అమలు చెయ్యడు రాజు. ఏదో అడిగేసి, అక్కడ నుండి తప్పించుకుంటాడు. కానీ అతని అదృష్టం ఇప్పుడు అతను టార్గెట్ చేసిన సలీం, ఒక పరమ లోభి.
“నేనే సలీం, ఏం కావాలి?” అన్నాడు.
“సార్ మీ పర్సు ఎక్కడో పాడేసుకున్నారు. నాకు దొరికింది.. ఇదిగోండి. అందులో 2000 రూపాయలు ఉన్నట్లు వుంది. మీ అడ్రస్ కార్డు అందులో ఉండడం వలన, మీకు తెచ్చి ఇవ్వగలుగుతున్నాను” అని ఏకబిగిన చెప్తూ అతనికి ఇచ్చేడు. సలీం ముఖంలో భావాలు పరిశీలిస్తున్నాడు రాజు.
ఆ పర్సు నాది కాదు అందామని అనుకున్న సలీం అందులో 2000 రూపాయలు ఉన్నాయి అనేసరికి, కొద్దిగా టెంప్ట్ అయ్యేడు.
గబుక్కున పర్సు తీసుకుని, కౌంటర్‌లోకి పెట్టుకుని, డబ్బు పైనించే లెక్కించాడు. అందులో 500 నోట్లు ఆరు కనపడ్డాయి.
‘ఇదేమిటి.. ఈ కుర్రాడు 2000 అంటున్నాడు?’ అనుకుని, ‘పోనీలే, ఊరక దొరికిన డబ్బు, పైగా అవతలి వ్యక్తి 2 వేలు అనుకుంటున్నాడు’ అనుకుని, ఆ నోట్లు పూర్తిగా బయటకి తీయలేదు. రాజు ఆశించింది అదే.
“చాలా థాంక్స్ తమ్ముడూ.. నిన్న పోయింది. నువ్వు మంచివాడివి. 2000 తిరిగి ఇచ్చేవు. ఈ 500 ఉంచుకో” అని అందులోంచి, ఒక 500 నోటు బహుమతిగా రాజుకి ఇవ్వబోయాడు.
కానీ రాజు అది తీసుకోకుండా, “థాంక్స్ అన్నయ్యా. నేను టిఫిన్ చెయ్యాలి నాకాడ చిల్లర లేదు” అని అంటూ, 5 వంద నోట్లు ఇమ్మన్నాడు.
రాజుని చూస్తే జాలి వేసింది సలీంకి. “సరే ఇస్తాలే” అని, 5 వంద నోట్లు కౌంటర్ లోంచి తీసి ఇచ్చేసి, ఆ నోటు మళ్ళీ పర్సులో పెట్టేసుకున్నాడు.
5 వంద నోట్లు తీసుకుని నెమ్మదిగా ఉడాయించాడు రాజు.
ఇంకో గంటకి గానీ, ఆ పర్సులో నోట్లు నకిలీవని సలీం గుర్తించలేకపోయాడు. ఓ చెత్త పర్సు, తన విజిటింగ్ కార్డు తప్ప, తనకి వచ్చింది ఏమీ లేదని తెలుసుకున్నాడు. అనవసరంగా ఆశకి పోయి, ఐదు వందలు కోల్పోయానని గుర్తించి బావురుమన్నాడు.
అక్కడ సలీం పరిస్థితి ఆలా ఉంటే, రెండు వీధుల అవతల చిన్న కాకా హోటల్‌లో టిఫిన్ చేస్తున్న రాజు భుజం మీద చెయ్యి పడింది. వాడు ఉలిక్కి పడ్డాడు. తిరిగి చూస్తే అది గంగారాం.
ఏమిటి? అన్నట్లు వాడి వైపు చూసేడు.
వారం క్రితం బస్టాండులో ఒక మహిళ పర్సులో పెట్టుకున్న గొలుసు కొట్టేసేడు రాజు. ఆ దొంగతనం సమయంలో పరిచయమయ్యాడు గంగారాం వాడికి. గంగారాం దొంగ నోట్ల ముఠాలో సభ్యుడు. మొదటి సరిగా ఎక్కువ డబ్బు ఆశ చూపి రాజుకి 20 ఐదు వందల నోట్లు ఇచ్చి, మార్చి 6000 తెస్తే చాలు, అందులో ఒక వెయ్యి ఇస్తానని చెప్పాడు. దొంగ నోట్లు చెలామణీ చేసే గాంగ్, కొత్తగా చేరే వాళ్ళని ఒక నిఘాలో ఉంచుతుంది. ఆ నిఘాలో భాగంగా గంగారాం రాజుని వెంబడించి ఆ కాకా హోటల్‌లో పట్టుకున్నాడు.
“నీకు ఇచ్చిన పని అయిందా?” అన్నాడు గంగారాం.
“ఇంకా అవలేదు” అన్నాడు రాజు నిర్లక్ష్యంగా.
“ఎప్పటికి అవుతుంది?” అన్నాడు గంగారాం.
“మంగళవారం పని పూర్తి అవుతుంది” అన్నాడు రాజు.
మంగళవారం దీపావళి పండగ. ముందురోజు నుండీ దీపావళి సామాన్ల షాపుల సేల్స్ లక్షల్లో ఉంటుంది. ఒక షాప్‌లో పనిచేసే కరీంకి 7000 రూపాయల దొంగ నోట్లు ఇచ్చేడు రాజు. సోమవారం సేల్స్ డబ్బులో ఆ 7000 కలిపేసి, మంచి నోట్లు 7000 తెస్తానని చెప్పాడు కరీం. అందులో ఒక వెయ్యి వాడికి ఇవ్వడానికి రాజు ఒప్పందం చేసుకున్నాడు. అందుకే వాడు ధీమాగా మిగిలిన 3000 సలీంకి అంటగట్టేడు. వాడి కమీషన్ ఎలాగూ గంగారాం ఇస్తాడు. శనివారం మందు కోసం ముందుగా 3000 రూపాయల నకిలీ నోట్లు వాడేసేడు వాడు.
“మంగళవారం నాడు కలుస్తాను. ఆ రోజు డబ్బు ఇచ్చెయ్యాలి” అంటూ గంగారాం లేవబోయాడు.
ఇంతలో మఫ్టీలో వున్న కానిస్టేబుల్ గంగారాం కాలర్ ఒక చేత్తో, టిఫిన్ తింటున్న రాజు కాలర్ ఒక చేత్తో పట్టుకున్నాడు.
ఊహించని ఆ పరిణామానికి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల జనం వింతగా చూస్తున్నారు.
ఇంతలో పోలీస్ జీప్ అక్కడికి వచ్చి ఆగింది.
వారం క్రితం జరిగిన గొలుసు దొంగతనం కేసులో ఇన్‌స్పెక్టర్ ప్రకాష్‌కి రాజు, గంగారాంల ముఖాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో దొరికాయి. అప్పటినుండి, వాళ్ళ మీద ఇద్దరు కానిస్టేబుళ్లతో మఫ్టీలో నిఘా వుంచేడు. వాళ్లిప్పుడు ఈ కాకా హోటల్ దగ్గర దొరికేరు.
అనుకోకుండా, ఇన్‌స్పెక్టర్ ప్రకాష్‌కి దొంగతనం కేసుతో బాటు, నకిలీ నోట్ల కేసు కూడా ఛేదించే అవకాశం వచ్చింది.
సమాప్తం
శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ A.P.E.P.D.C.L లో పర్సన్నల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించి, పదవీ విరమణ చేశారు. వారిని 9440602019 అనే నెంబరులో సంప్రదించవచ్చు.
