[తాటికోల పద్మావతి గారు రచించిన ‘హృదయమా! కుశలమా!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నీవు నన్ను కాదని వెళ్ళినా
నీ క్షేమమే కోరుకుంటాను.
నీ పలకరింపు లేకున్నా
నా ఆలోచనలోనే నీవు ఉంటావు.
గతం జ్ఞాపకాలన్నీ మధురస్మృతులై
హృదయాన్ని తట్టుతుంటే
నీ పెదవులు నన్నే పిలిచాయి అనుకున్నాను.
నడిచే నేలంతా గులాబీలు పరిచానన్నావు.
అది ముళ్ళై బాధిస్తుంటే చూసి
ఎలా తట్టుకోగలుగుతున్నావు.
ప్రేమ మసక బారి మబ్బుల్లో దాగినా
కట్టిన మనసు వర్షమై కురవకపోదు.
అయినా పర్వాలేదు.
ద్వేషించడం మానుకో!
అగతో రగిలిపోయి విద్వేషాలతో దారుణంగా
మారణ హోమాలు సృష్టించకు.
ప్రేమించకపోయినా పర్వాలేదు.
మానవత చూసి నేర్చుకో!
ఆడపిల్లల మానప్రాణాలను బజారు కీడుస్తే
ప్రేమ మరణించదు. మరణించేది నువ్వే!
నీ హృదయం నాకిచ్చేసావు అనుకున్నాను.
ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకొని
మరొకరికి ఇవ్వాలనుకోవడం అమానుషం కాదా!
చేతులు కలిపి చేసిన బాసలు
కళ్ళు కళ్ళు కలిపి చెప్పిన ఊసులు
ఏమని సమాధానం చెప్తావు?
హృదయం అంటే బండరాయి అనుకున్నావా?
హృదయం ఉంటే దుఃఖము పొంగినప్పుడు
ఆలింగనం చేసుకునే కన్నీళ్లను తుడిచే
నీ చేతి వేళ్ళు ఆసరా కావాలి.
ప్రేమ కొన్నాళ్ల వరకు పరిమితం కాదు.
మనసిచ్చి పుచ్చుకున్నాక,
మనుషులు బ్రతికినంత కాలం
ప్రేమను కూడా బ్రతికించుకోవాలి
అవసరానికి హృదయం దొరకదు.
ఎప్పటికప్పుడు కొత్తదనం ఆస్వాదించాలనుకోవడం
ఆ పాత మధురాన్ని వదులుకోవటమే! అనుకోకు.
అంతరంగపు సౌందర్యాన్ని ఆరాధించు.
బాహ్య సౌందర్యానికి బ్రాంతిపడి పరుగులు తీయకు.
స్వచ్ఛమైన ప్రేమను స్వాగతించినప్పుడే
హృదయం ప్రతి ఉదయం ఒక శుభోదయం అవుతుంది.