Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హృదయావి-8

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది – పద్యకావ్య రచన పోటీలో ₹ 10,000/- బహుమతి పొందిన శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి ‘హృదయావి’ కావ్యాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

అరవిరి విప్పారినట్లు, మరాళము
కులికిన యట్లు, నింపొలయు నట్లు
పసిపాప రాగకల్పన సందడులు గొన్న
యట్లు, వెన్నెల కరుళ్లడరినట్లు
పాలుపొంగినయట్లు, బాలెంత నవ్విన
యట్లు, పర్వచ్ఛవులాడినట్లు
కమలకన్యక జలకణముల విదలించి
నట్లు, గోధూళి తారాడినట్లు

కవిత బఠియించినాడు సాకారపరచి
మహితశూన్యమ్ము నా సభా మధ్యమందు
తనదు నుడికార మొక కలధౌతదీప్తి
నతిశయించి వ్యాపింప స్వాయత్తసిద్ధి. (7)

అంత నా సభాధ్యక్షుడు చెంత జేరి
“మిత్రులార! ప్రస్తుత యుగమిత్రులార!
తీరు లెరిగిన సాహితీకారులార!
స్పందనల దయను వినిపింపగల” రనిన. (8)

విదితుడైన సాహిత్యంపు వేత్త యొకరు
“చాల కాలమునకు పద్యచలన” మని న
గవుచు నైదంయుగీనమై కవిత పొసగి
నప్పుడు నిలచి యుండు కాలాంతమైన. (9)

రాచరికము, పాండిత్యము, లబ్ధ దర్ప
ము గతియించెను, నియమాల పొగలు తొలగె
భావ-విప్లవాభ్యుదయ సంభవనపటిమ
మార్పు నూత్నకవాటముల్ మలచె నేడు. (10)

ఆధునిక పరికరములు, విధి విధాన
ము లుదయించెను రూపురేఖల వినూత్న
త యవసరము నేడు కవిత్వధర్మమునకు
ననెను – తలయూచి కవి నవ్వె నమలరోచి. (11)

విదితుడైన భాషాశాస్త్రవేత్త యొకరు
“మీ కవితయందు తెలుగును మ్రింగివైచు
సంస్కృతపదముల్ కొలువయ్యె చట్టుబండ”
లనెను – తలయూచి కవి నవ్వె నమలరోచి. (12)

విదితుడైన సాంకేతిక వేత్త యొకరు
“కవనకర్మను మనుజుని కంటె హరువు
గ త్రుటిలోన కృత్రిమమేధ ఘనత నల్ల
గలదు, కల్పింతు నిపుడె వేగమున జూడు” –
డనెను– తలయూచి కవి నవ్వె నమలరోచి. (13)

“అలరున్ దేశము నందు శాంతి సుఖముల్, ఆనందముల్ నిత్యమున్,
కలహం బేమియు లేక మిత్రతలతో గల్గున్ జనుల్ నెమ్మదిన్,
జ్వలనం బేమియు లేక జ్ఞానముననే జాలిన్ దలంచెన్ జనుల్,
వలపున్ ప్రేమయు నిండి, ధర్మపథమే వర్ధిల్లు గాకన్ సదా!” **^

విదితుడైన పద్యసృజనా వేత్త యొకరు
“గులక వలె నఖండయతి నిగూహితమ్ము
గ నొక చోట పడి, మధురిమను హరించె”
ననెను– తలయూచి కవి నవ్వె నమలరోచి. (14)

విదితుడైన కావ్యపఠన ప్రేమియొకరు
“కవిత వలన సమాజంపు కనులు తెరచు
నటుల నొక సత్యదర్శన మ్మందవలయు”
ననెను – తలయూచి కవి నవ్వె నమలరోచి. (15)

“దురితము కాల్చినట్టి పిడిదువ్వెన పన్నయి పోగ, భావనల్
బొరువులరీతి పైకెగయ, పూచికపుల్లల పోడుముల్ ఘృతా
న్న రజత మాధురీ మయకణమ్ములుగా పడి ముంచివేయగా
కురియు క్షణమ్ములోన నొక కోకిలనై గమకాలు రాల్చెదన్” (16)

అనెడు స్వీయకవిత చదివి, నయమార
“ఇది, ఇది, నవీనమతి; నవ హేల, నేటి
పదము” యనె నొకరు కనుల జిలుగు చిందు
లాడ – తలయూచి కవి నవ్వె నమలరోచి. (17)

ముగిసెను మేళనమ్ము; చిరుమువ్వల శయ్య సృజించు వాని గుం
డె గుడిని చుట్టుముట్టి బిగడిగ్గె మరొక్క పరాయి పంక్తిగా
నొగి విపరీత కాలకఠినోపల నిర్మిత రోధనమ్ము, వా
లుగ ముకుళించికొన్నయవి లోపలి రేకులు నీరవమ్ములో. (18)

***

ఏమోలే! మృదులాంతరంగము మృషాహేవాకలోకమ్ములో
నామోదమ్మయి శాంతివల్లరుల నాశాంతమ్ములం దాక సు
శ్రీమార్గమ్ముల బ్రాకజేసి తగు వాసిం గాంచునేమో, సుమ
స్తేమమ్ముల్ విలువైననాడు పునరుజ్జీవింతురేమో కవుల్.

(సమాప్తం)

^
This verse is an instant composition by Gemini, an AI model from Google.
https://g.co/gemini/share/e446c6636724

Exit mobile version