Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హృదయావి-6

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది – పద్యకావ్య రచన పోటీలో ₹ 10,000/- బహుమతి పొందిన శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి ‘హృదయావి’ కావ్యాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

అనుమతినైన కోరక విహారము కోసము నా మనస్సు నెం
చిన లలనా! పునర్భవము జెందిన నన్నొక తేటనవ్వు మో
మున గమనించుదాన! రసముగ్ధదృగంచల సంచలత్తనూ
జనిత దయాఘనావరణ! స్వాగతమమ్మ, వినంగదే ననున్. (22)

ఈ యీహామసృణత్వ మెంతటిదొ కానీ, యూహలే పాటలై
పోయెన్; లోబడి చంద్రకాంతికి నిశామోహమ్ము పైపై వృథా
మాయాంధ్యమ్ము నపాకరించు వెరవై మార్గమ్ము చూపించె, వి
ద్యా యామమ్మిది సర్వతోముదము కాంతా! పద్యముల్ బల్కనా! (23)

జవరాలా, యరచేతి నీయగదవే సాకూతహాసమ్ముతో
సవరింతున్ నును బద్యమొక్కటి విలాసమ్మౌ గతిన్; దాచుకొ
మ్ము, విధిక్రీడ విరుద్ధమైనపుడు తీపుల్నిండుగా దల్చికొ
మ్ము – వెలింగొన్న పదాధిదేవి నిలచున్ పూర్ణమ్ముగా రక్షయై. (24)

వ్రాసిన పద్యమై యెలమి పచ్చన నిండిన హృత్కుటీరమం
దాసలు వీగిపోవవు; వ్యథల్ ప్రభవించిన గాని నిత్య మా
వాసము జేయజాలవు, పెరవారికి నవ్వులు పంచియిచ్చు నీ
కోసము కాన్కగా నొసగ గూర్తును కమ్మని తెల్గు పద్యముల్. (25)

నిశ్చలమైన నావ, యభినీతము పుష్పపరీమళమ్ము, ప్రా
ఙ్నిశ్చిత బంధ తారకిత నిస్తుల శూన్యనభమ్ము తోడుగా
పశ్చిమమందు దోచిన శుభంకర పూర్ణసుధాంశుబింబ, మం
తశ్చరమైన పద్యము, విదారిత దైన్యభరమ్ము లెల్లెడన్. (26)

తలలను వంచి వెల్లువకు ధన్యత మెత్తదనంపు సొంపుతో
శిలలు జలమ్ములందు విలసిల్లెడు – “మానసవంతుడెవ్వడో
చెలగి కుతూహలాన మము చేతికి దీసి స్పృశించినంతనే
తెలియగ రాదు మా కఱకు తీరు” లటంచు దలంచి, యేండ్లుగా. (27)

సలిలసతీముఖాన విడజారిచి వెన్నెలచెండులన్ సుధా
లలితుడు బాల్యచేష్ట వెనులాగుదమన్న- నిరాకరించి య
ల్కలు నుడివింటిపై ముడులు గాగ, గ్రహించిన యామె వెండి సొం
పుల గుఱుతించి పుల్కలయిపోయినరీతి నలల్ చలించెడిన్. (28)

“బిగువుకు బేరమేమిటి కవీ? సువిశాలతలోని స్వేచ్ఛ యే
వగలను నూఱిపోయదు, జవమ్మది సారవినిర్మితమ్ము గా
ని; గుణము రూపమూల మవునే? ప్రతిరూపము గౌణభాసి యౌ
ను, గురుతుపట్టుమో” యని యనుక్తముగా ఘనముల్ వెలార్చెడిన్. (29)

బంధము నందు నిర్వచనపాదము లేదని, జోడుగుండియల్
సింధువులై మిథఃప్రణయశీల గభీరత సంగమించి స్వ
చ్ఛందపరీత మౌనమున చర్చిత చేష్టల నోలలాడుటే
బంధమటంచు కోటర నిబద్ధ విహాయసముల్ వచించెడిన్. (30)

తరగల దాళుకొన్నయవి తంత్రులుగా నెలకాంతులెల్ల, లే
పరకలు శీర్షకంపముల భావసమాధుల నోలలాడె వా
త రచిత ప్రేమలేఖ లవధారణ జేసి; తనంత తానుగా
తరువు పెకల్చె లోనలుపుతాపడముల్ హరితంపు ఋక్కులన్. (31)

ఈ మందానిలమెంత సాత్త్వికము! పూయింపంగ నేత్రాంబుధా
రా మగ్నమ్మయినట్టి మోములను స్పర్శంజేసి నోరారగా
క్షేమమ్మా! యని మాటలాడినటు వీచెన్; మిణ్గురుల్ ద్వంద్వమే
సామాన్యమ్మని మిన్కు ఛందమున నాశ్వాసమ్ముగా బల్కెడిన్. (32)

ఊగిన కొమ్మ జీవనపుటోలములం బరిశుద్ధిజేసి, హృ
ద్రాగపు వర్ణచిత్రము లుదారవిధమ్మున గీసె; తారకా
యోగమునన్ శశాంకు డుపయోగమొనర్చిన పూర్వవాక్కులై
రేగు పరాగసంతతి సులేఖిత వర్ణములట్లు నిండెడిన్. (33)

వశముం దప్పిన వాలుతుంపురులు పైపై తేమగా జారు దు
ర్దశ నాశింపనివై సమర్థ రసముద్రాశ్రీలతో తాకి యీ
నిశ నానందమఠమ్ముగా నిలుపగా; నేర్పెన్ మృదూహార్ద్రతా
కుశలత్వమ్మును పూలచెక్కిళులు చేగొన్నట్టి నా వ్రేళ్లకున్. (34)

పువుపువుపై, చొకారపు చివుళ్ల చివళ్ల పయిం బురస్క్రియన్
దవిలిన వెన్నెలల్, పుడమి తల్లికి గగ్గురు రేపు తాకుతో
చివచివ బోవు కీటకవిశేషములున్ జెరలాడు పుల్గులున్
బ్రవహణసేవ జేసెడు తపమ్ముగ చిక్కని జీవదేవికిన్. (35)

మల్లీగుచ్ఛములై పదమ్ముల కడన్మార్కొన్న ఫేనమ్ము, లు
త్ఫుల్లాంతఃకరణమ్ముతో జగములన్బోషించు చిచ్ఛక్తి, హ్రీ
వల్లీవేల్లిత కావ్యకాంత యెదలో, బంగారు పద్యమ్ములున్
జల్లించెన్ సుమనస్విచిత్తములలో జాడ్యాది మాలిన్యముల్. (36)

(సశేషం)

Exit mobile version