[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది – పద్యకావ్య రచన పోటీలో ₹ 10,000/- బహుమతి పొందిన శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి ‘హృదయావి’ కావ్యాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము.]
~
ముత్యముల జరీ బుట్టలో మోసి తెచ్చి
నీవు కానుక జేసిన పూవులన్ని
నా శిరసుపైన జారిన నవ్వు గురుతు
విడిచి పోలే దనాహూత భీతులందు. (7)
నిన్ను నాడు దాచుకొన్నది మూలాన
నిబ్బరంపు పోగు నిలిచె నేమొ
చీకినట్టి లోని శీలంపు పొరలలో
ఆప్తుడా! ఫలించు ననఘకర్మ. (8)
నీ వెన్నెల పొదువు నిసువులేబిడికిళ్ల
తో మేను చెట్టును ప్రేమజూచి
నీ వెన్నెల స్పృశించు నిద్దంపు సుషిమమ్ము
తో మనసు కొలిమి తోడు నిలచి
నీ వెన్నెల నిమురు నెయ్యరి యరచేతి
తో రుద్ధ హృదయమ్ము దోహదించి
నీ వెన్నెల కలుపు నేమంపు వెచ్చన
తో కలల కొసళ్ల బ్రాకజేసి
భంగపడిన బుజముపైన వాలునొక్క
లేత బరువైన కండువా రీతి, హొయలు
వోవు నీ వెన్నెల చెలియ పూలచీర;
అమల శిశుచక్రవర్తి పల్యంకసీమ. (9)
హృదయ భిత్తిపై మిగిలియున్నది గతమున
నేను పులిమికొన్నట్టి వెన్నెలల రంగు
నిట్టనిలువున నమృతమై నిలచియున్న
కనుల ముంగిటి శేవధి గాంచినాను. (10)
అని కొన్ని వ్రాసి, యటుపై
మనసాడక, సాగలేక, మానగ లేమిన్
కనుపింపని యుద్ధమ్మును
వినిపింపని రీతి మొదలు పెట్టెను తనలో. (11)
వచ్చు నూహ యొకటి వచ్చి రానట్లుగా–
రాకున్న మేలేమొ! రమ్య పదము
తోచు నొకటి యేమి తోపింపదు వెనుక
తోపకుండిన హాయి తోచునేమొ
మెరయు నింకొక మాటు మేలైన భావము
కాని పూర్వోపయుక్తమని తెలియు!
అసమగ్ర సంభావనాఽఽవర్తముల కొన్ని
కాలమ్ముల వరకు కలియ దిరిగి,
దారి లేమి గని, మొదటకు వచ్చి యొకింత
యసహాయుని విధాన నలసి పోవు;
ఆపుసేయుదమన్న నాపలేనితనము,
కోరుకొన్న విసువు– గుండె యేదొ
పట్టునకు దొరికి పడిపడి విదలింప
నీయదు, కదలదు; రాయబార
ము కుదర, దనునయము సహకరింపదు;
కలయిక, విరహమ్ము, కలసి క్రమ్ము
“మరియొక్క త్రుటిపాటు మది నుంచెదను, వచ్చు
నేమో” యని తలచు– రామి, రోసి
మునుపు వచ్చినది యల్లన స్మరించి, బలము
పుంజుకొని యతించి పోత పోయ –
పదమొకటి తనను వాడగా వేడును
బాగు పదము దివ్యపథము నుండి
పలుకదు, ప్రార్థన పనిజేసి పలికెనా
కవితలో నమరదు కమ్రముగను;
యమరెనా భావనాహారమున తగదు,
చేయు టదేమన్న చిక్కు తెగదు;
పట్టదు నిద్దుర, పై మూలలను జూచు,
నడచు, వేయగలేని యడుగుల నిడి;
నడచును ముందుకు, నడచి – యెదురు వచ్చు
నల్లన, నాసీనుడై వసించు;
ముసిరిన వర్ణాళి రుసరుసల నడుమ
నడయాడు నతడు ప్రణాళికొకటి
యందమి, నొకసారి యందిన యట్లైన
పెదవిమూలల జాచు విధవిధముగ;
వ్రాసి, దిద్ది, మరల వ్రాసి, యిమిడినది
చూచి, శిశువు మాడ్కి చొక్కి మురియు;
మాటిమాటికి నడ్డు వాటిల్లు నప్పుడు
వెలుగురేఖలు కనుపింపనపుడు
భావపారమ్యము పండక, యరకొర
సుడులయందున తాను పడినయపుడు
కవితను పఠియింప కనుల ముంగిట నుంచు
వాడు నేడెవరని వగచునపుడు
గాటను కట్టి, ప్రకారములను గాంచి
కవిని గుర్తించుట గాంచినపుడు
నేరిచి యపకీర్తి నిలుపుట దేనికో
ఈ శిరోవేదన యెందుకొరకొ
యనుకొనిన యప్డు విడిచిపో మనసు రాని
యొక మహత్తరమైన ప్రేమకు నమాయి
క చిరబద్ధుడు, సౌందర్య కథన శీలి,
గూఢ హృదయవంతుడు, తెలుగు కవి వాడు. (12)
స్ఫురణారుణ కిరణమొకటి
వరియించు బలీయమైన వాంఛ గృహము వీ
డి రయమున వెలికి యడుగిడి
తరలెను దిక్కుతెలియని మథనతప్తుండై (13)
ఒక ముత్యాల రథమ్మువోలె నడచెన్ యోగించి రాగించు శీ
ర్షిక కోసమ్మొక యూహ కోస మొక యుద్రేకమ్ము కోసమ్ముగా
నకళంకప్రభలుప్పతిల్లిన స్ఫుటమ్మౌ స్ఫూర్తి కైసేత బూ
ర్వ కవీంద్రాశయశిల్పముల్ తన మనోభావాల నూగింపగన్. (14)
ఒక కవి స్మృతిని పలుకరించి “నీవయే
నే” నని మురిపించు; నిమ్మళమున
వేరొక కవి తోచి వెనువెంట “నాలోన
నీవు వసించెద” వని వచించు;
నింకొక కవినాథు డేతెంచి “నా రస
వాదము నీ కలభ్య” మని చెప్పు;
మరియొక్క కవి “మన మార్గము భిన్నము
కాని నీయందు నే గలను కాదె”
యనును; హృదయాళువు లయిన యమల కవన
నిర్మితి నిపుణ కవులెల్ల నిలువ వరుస
వారి వాక్ప్రభలకు నభివాదము లిడె
స్ఫురణ బ్రభవింప తత్పద్యసూత్రపాళి. (15)
కమ్మని చాటుధార తొలుకాడి పరంపరగా బ్రకృష్ట ప
ద్యమ్ములు- కావు, స్నేహితు లుదంచితశాంతిని వెల్లువై హృదం
తమ్ము వికస్వరమ్మయి పథమ్ము ప్రభామయమై విభావరీ
సమ్మద మిమ్మడించె నిటు సత్కవితై సరసానుభూతులన్. (16)
ఇది యొక గ్రామవీథి; నవహేలల కౌముది విస్తరించికొ
న్నది యణువణ్వునందు, యొకనాటిది కాని దురంతభావనా
విదళిత చిత్తశల్క పరివేష్టిత గాత్రుడనై యెకాకినై
కదిలితి నేను – కంట తడి గాలములెన్నియొ మ్రింగి గొంతులో
నదిమిన సంగతుల్; కథలు, యాత్రలు, రాత్రులు, దిగ్దిగంతశ
స్త దురితసంఘ భంగిమల చాయలు, మోజులు, దంభనాళి, ష
ట్పదసుమవాటికా గిరు, లపాంపతు, లాప్తులు, శత్రువుల్, వ్యథల్,
పదవులు, నవ్వులన్ పులుము పాపపు గెల్పులు, యుద్ధముల్, మిషా
స్పద కటుభాష్యముల్, తెరలు, వ్యాళములున్, బరువుల్, విలాస సం
పదలు మనీష నిండుకొన వర్తిలి నర్తిలుచున్న యంత ని
య్యది యొక గ్రామవీథి; యపుడంచిత సత్కవి పద్యమేదొ ది
వ్య దయను గుండె బొల్చె; వికచామల కోమల రాత్రిపుష్పమ
ల్లది నను జూచె నంత కనులార, నవానిల శాబకమ్ము క
మ్మదనము తోడుగా నొలసె, మన్నన జేసె సుమమ్ములన్ని, గో
ష్పదపరిపూత ధూళికణపంక్తి సుతారపు రీతి నాటె నా
పదముల యందు, దీర్ఘ విటపాంచల సంచలదామ్రపర్ణముల్
పదములు పాడె, నభ్రగమబాలక నిద్రిత శుద్ధనేత్రముల్
విదలిచె శాంతి, మేఘములు వెన్నెల జల్లెడపట్టె నిండ, నిం
పొదవెను శర్వరీసమయ పుంజిత రంజిత గేహదేశముల్;
మృదువొ, కఠోరమో, కలిగి మించెను ప్రేమ మహోర్మిలీల, న
య్యది నిలువెల్ల వ్యాపనమునందె త్వగంకురముల్ నటింప, నీ
యది యొక ప్రేమవీథి; యిట యామిని జాముల నేనునొంటరై
కదిలితినంత – నాదు పదకంపనమే నవతాండవమ్ము, నా
హృది విషయాభివర్జితమహిష్ఠ విఫుల్లసరోరుహమ్ము, నా
పదిలపు పల్కు పెన్మినుకు భాష్యము, చూపు నభోంతరాళ కా
శ దహరలోక లోకన సుశక్తము, సత్త్వము నిస్సమానమున్. (17)
అని ముదమ్మున నెమ్మది నాలపించి
చాలనమ్మున కుడుపు ప్రసారణమున
పలవరింత పుట్టింప విపంచి రవళి
గదలినాడు నిరంతర పదవిహారి. (18)
పరమయోగాంగముద్ర గాపడము వెట్టి
సలుపు గరగించుకొన్నట్టి సంయమి వలె
నమలినధ్యానము వలన నయ్యె వాని
శుభ్రచిత్తమ్మున కవన శుద్ధ జన్మ. (19)
అది నదీతీరము, నిశీథిని; దరి జేరు
వాతముల, తరంగముల, భావముల నడుమ
నిలచె నా భావుకతపస్వి- కొలువలేని
కవిత లీ రీతి వరుసలు గట్టెనపుడు. (20)
ఆహా! సాంధ్యపురంధ్రి తక్కెడను మాహాంధ్యమ్ము వంచెన్, నిశా
వ్యాహారమ్ములు సంగమించెను యమివ్యాఖ్యోక్తతత్త్వమ్ములో;
సాహాయ్యమ్ము లభించె బీదలకు జ్యోత్స్నారూపమిత్రమ్ముగా,
నీహారాంచిత పత్ర మోడె జననీ నీకాశ చిత్తమ్ముకున్. (21)
(సశేషం)