[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది – పద్యకావ్య రచన పోటీలో ₹ 10,000/- బహుమతి పొందిన శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి ‘హృదయావి’ కావ్యాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము.]
~
కవిత ప్రేమ వంటిది – పూర్వకాలమునకు
చెందిన శిథిల విదిత విశేషరీతి
జేరినను, ఘనానంద సత్శేవధిని సృ
జింపగల దీ క్షణమ్ము పూయింపగలదు. (46)
కవిత ప్రేమ వంటిది – క్రొత్త కువకువ రుచి
నభినవించి యాంతర భిత్తి నద్దికొనిన
యంత విద్యుత్తు ప్రాకిన యట్లు జొచ్చి
చూపు జగమును సౌందర్యదీపకరణి. (47)
కవిత ప్రేమ వంటిది – నిజగణన నిర్వ
చనములకు చిక్కి మర్యాద దనరగలదు;
స్వేచ్ఛ జరియింప గలదు రసాచ్ఛమహతి
యనుచు మనసార ధ్యానించి యనుభవించు. (48)
కెరలు వాని నయన జీవకేంద్రముల గ
విత్వ కళలూరు, చెలువారు విద్య జాలు
వారు, విరితీరు లెగబారు; నారితేరు
సౌరు ముడిదేరు, సిరితీరు, హోరులారు. (49)
అతని హృదయమనర్ఘము, వితత చిత్ర
పటము, లలితగంభీరంపు వలపువాక;
సత్త్వమృన్నిర్మిత మనోజ్ఞ చంద్రశాల;
చారు సద్గుణకౌముదీపూర రాత్రి. (50)
యుగములు క్షణములు, క్షణములు
యుగములు తత్పరతలో, వియోగములో సా
గగ కవనరసకృషిని బా
గుగా బ్రతికెడు కవిహాలికుడు వాడెపుడున్. (51)
ఆ గమనింపు, లా గుఱుతు, లా గరిమల్, కమనీయతల్, రిరం
సా గమకమ్ములో సడలి జారిన లోకువ తేకువల్, మహా
భాగ నిధాన కాల కణపంక్తు, లుదార విదార శేముషీ
సాగర వీచులున్ కవిత చప్పుడులై పెనవైచు నాతనిన్. (52)
మూలల మాటు నీడలను ముద్దలు చుట్టి ముఖాన నేచు యో
బాలుని వంటిదైన గది వానిది కేలిడి పిల్చినట్టులై
కాలిడి, కూరుచుండి, లలి కాగితమొక్కడు చేరదీసి స్వే
చ్ఛాలత నక్షరాల గతి సామముగా పొదలించె నెంతయున్. (53)
శాంతమైన యావరణము స్వాంతమందు;
భవ్య విధురేఖ గగనాన – ప్రతిభ కాపు
తొడిగి పదచిత్రణములు ప్రదోషతోష
పులకితాంకురములవోలె తలలనెత్తె. (54)
౨
(తన కవిత పూలవల్లి. తనకు యతులూ, ప్రాసలూ, గణాలతో కూడిన ఛందోనియమావళి ఒక పాలవెల్లి.)
నీ కొరకోయి జాబిలి! కనీనికలన్ నభమున్ గ్రహించుచో
బ్రాకుడుపాప లుల్లసన వాహికలౌను కదా! పటూన్నత
వ్యాకృతులన్ భవచ్ఛవులు పందిరి గట్టు గదా వనాధిదే
వీ కమనీయ మూర్తికి; లభింతువు చల్లని పుణ్యపాకమై. (1)
వనములలోకో, పోత ప
వనములలోకో మదీయభాతి వృథా పో
వునను దిగులు సెందవు, స
ద్గుణమతివి విధూ! యమృతము గురిపించుటలో. (2)
గగన మందు నీవు – కలతకు వీడ్కోలు
చలువ మనసు కొసల సాహసములు;
వెన్నెలలు, పదములు, వెన్నెలకోలులు
సంయమీంద్ర హృదయశాలలందు. (3)
దర్పణమున చిఱుతతనములో దక్కిన
తల్లివైపు ప్రేమధామ మీవు
భాగ్య లబ్ధ సహజబాంధవుడవు నీవు
ధన్య కవిత మూలధాతువీవు. (4)
నన్ను పెద్దజేసి, నానాడు దూరమై
ఏడిపించినావు – ఓడిపోయి,
వయసు పెరిగి, మనసు వ్రయ్యలై, నీ స్పర్శ
గురుతు చెడిన జాతకుడను నేను. (5)
ఎడద లోపొరల నిలచియే కలదు ఋ
ణానుబంధము నీకును నాకు నడుమ
నా మనోగవాక్షము మూసినాను గాని
ఆవల కలవు నీవన్న యాశ నాది. (6)
(సశేషం)