[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది – పద్యకావ్య రచన పోటీలో ₹ 10,000/- బహుమతి పొందిన శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి ‘హృదయావి’ కావ్యాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము.]
~
దేవత వలె పద్యమ్ము మదిని మెరసి క
నబడు వేడుక నావాహనము ఘటింప
చదువును పదము పదమును పెదవి పైని
ప్రత్యణువు నవ్వుదొంతికి పట్టువడగ. (31)
కనుల సోకిన హరువైన కవిత వలన
నింతలింతలుగా నింపు లెగసి మదిని
ముసురుకొనగ విరివి నలుమూలల దను
క చినుగుల విశ్వపటమును కలిపి చూచు. (32)
అవలోడనంపు మెత్తన
నవలేఖించు ననుభూతిహర్మ్యముపై ని
ల్చి వికసితపద్యముల కవి
భవ కృతి మొదటి పుటపైన బ్రకటీకృతిగా. (33)
ఇష్టపడిన పదమ్ముల యింపు పద్య
ములను సాంతము వల్లించి ప్రోవు చేసి
కొనును; ధ్వని-పాక-రీతి పాలన నొనర్చు
నర్థగౌరవము ననయ మాచికొనును. (34)
రోమాంచమువాఱు హృదయ
నామాంకిత నిమిషములను నవ్యతలో, పూ
ర్వామేయాధ్వములో, పర
సీమలలో, కవితలో, శుచితలో వెదకున్. (35)
ప్రశ్నలను ప్రేమయందు, విలాసములను
భావి యందు, పరిమితిని భావమందు
దుఃఖమును చక్కదనమందు, దురిత తతుల
బేలతనమున నిరతమ్ము వేల్చునతడు. (36)
వ్రాయడు ప్రకటింపడు గణ
నాయాసముకై, లిఖించినంత కవిత కా
దే యనుకొను; బద్యమ్మొక
శ్రీయోగమని తలచు సుమశీలపుటెదలో. (37)
ఒక్కొకసారి కైసరుల యోచనలో కవితాప్రవృత్తిలో
చిక్కదన మ్మనర్ఘ రసశీలిత లాక్షణికాంతశాస్త్ర సద్
దృక్కుకు, నైక వత్సర విధేయపరిశ్రమకున్ ఫలమ్ముగా
దక్కునటంచు దోచును, పథాంతరనిష్ఫలతల్ స్ఫురింపగా. (38)
అభినవగుప్తపాదు డనినట్టి విధాన రసస్వరూప సౌ
రభ గతులో, యలంకృతి సురమ్యజగత్తున దండి వామనా
ది భణిత రీతులో, తెలుగుతీపి మహాకవికావ్య సంహత
ప్రభలొ మనంబునన్ మెరసి బాష్పములౌను ముదాన వానికిన్. (39)
శైలి, ఛందము, పాకము, శయ్య, రీతు
లనెడి గోము రేకుల నడుమన మరంద
ము వలె నాత్మ నిండారిన మోహనాబ్జ
మై కనబడు గావ్య మతని మనసునకును. (40)
ఒక్కొకసారి కైసరుల యోచనలో కవితాప్రవృత్తిలో
చిక్కదన మ్మహేతుక వశిత్వము నందున గాక, లీనతా
ఫక్కిక సంస్కరించిన విపక్వవిశేషనిజేచ్ఛ చేతనే
దక్కునటంచు దోచును, పథాంతరనిష్ఫలతల్ స్ఫురింపగా. (41)
ఏ పథానుయాన కవిత యేని హృదయ
కోశమును తాకెనా, సదావేశమున వ
చించు – “నిదియె కవిత, దీని మించు నదియు
గలదె?” యంచు శాంతులొలుకు కనులతోడ. (42)
అర్థముల శబ్దములను చేయార ముఖము
పైన దోసిళ్లతో దీసి వైచికొన్న
యట్లుగ ననిపించి, కనుల యంచున విడ
చు జలకణములు నీరవ రజనులందు. (43)
కవిత ప్రేమవంటిది – యవగాఢ విపుల
చిత్తమును స్పృశించినయంత చిన్ని చిన్ని
చూడ్కులం దొదుగు నఖర్వ చోద్యరాశి –
కాలమాగిన యనుభూతి జాలువార. (44)
కవిత ప్రేమవంటిది – తొలి కదలికల వి
కాసము మొదలు కడపటి కాంతి వరకు
రమ్యసాక్షాత్కృతి యొనర్చి లాగగలదు
యుగళభావన కావలి హోమఫలము. (45)
(సశేషం)