[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది – పద్యకావ్య రచన పోటీలో ₹ 10,000/- బహుమతి పొందిన శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి ‘హృదయావి’ కావ్యాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము.]
~
సాంద్రమైన పద్యమొకటి చప్పరించి
నేత్రము లరమోడ్చి, హసించి, నేవళికము
నెమరు వైచి, “ఆహా, కవీ! యమృతసుతుడ”
వనుచు భావించికొనును హృదంతరమున. (16)
ప్రాణములు ధారవోయగా వలయుగాదె
యీ రసపరిశ్రమమునకు? నీ నవీన
మధురతోత్కర్షణమునకు, మంజుమతికి?
ననుచు భావించికొనును హృదంతరమున. (17)
“ఒలికినా నొకకొంత వియోగ యోగ
ముల నడుమ కొంత జీవించి మ్రోగినాను
కవితగా; చుట్టి విసరితి ధవళశాంతి”
ననుచు భావించికొనును హృదంతరమున. (18)
అదను చూడదు, కుశలము నడుగదు, ఒడు
పు విడుపుల లెక్క సేయదు, పోయి వత్తు
నను పలుకులు విన; దవరోహణము జెందు
నపుడు గడుసరి పిల్ల కావ్యమను కన్య. (19)
ఒక భావమ్ము తనంతతాను మదిలో నోపన్ పవిత్రైక భూ
మికలన్ శ్రీమధునిష్ఠలో జవము లున్మీలింపగా పర్ణమై
బకమై సారసమై విషాదశకమై వాసంత శాఖాంచల
ప్రకరమ్మై వికసించిపోవును సువర్ణప్రాకృతశ్రాంతిలో. (20)
భావపాతమున కుతిక పట్టుకున్న
పక్షి వోలె పెనగు; గగుర్పాటు లడరి
నిలువులు పడిపోవు; విశాల నీల గహన
గగనమందు తారక వలె కళుకులీను. (21)
మరల వచ్చునులే భావపరమలహరి
యనుచు విషయాంతరాసక్తు లలమనీక
నచ్చజెప్పికొనును; తన్ను మెచ్చికొనును
తోడొకడు లేని యేకాకివాడు గనుక. (22)
ధర్మకర్తవ్య మనివార్య కర్మ ద్రోసి
నపుడు నంతస్సృజన నష్టమైనయంత
వగచు; నెదురుచూపు బలము బ్రతికియుండ
మూకవల్లకి వోలె ననేకఫణితి. (23)
మఱపున నొక్క యూహ మటుమాయము నొందినదై, పురాసమీ
కరణములోని శబ్దములు గ్రక్కున తప్పుకుపోవ, వ్యాకులాం
తరము పదే పదే వెదకి దన్ను వెలార్చెడు లేమొదళ్ళకై
పరగును తీపియాశ లెగబాఱ నవే స్మృతులందు గ్రమ్మఱన్. (24)
అమృతవాగవతారము నన్ని దిశల
చూచినట్లై యనారతశోభ లొలయ
ముద్దు మౌనమ్ములో నరమోడ్చి కనులు
సెలవుల చివళ్ల బూయించు జీవహసము. (25)
అనుకొను నొకసారి శారదాశింజినీ
ధ్వానముల్ రాజ్యాంగమైనయట్లు
తలపోయు నొకసారి తంతన్యమాన మా
ర్దవ విభూతి లతలు ప్రాకినట్లు
ఆశించు నొకసారి యమలతత్త్వము రేగి
క్రూరప్రవృత్తులు క్రుంగినట్లు
వాంఛించు నొకసారి వలపువస్తువు హృద
యము జనులకు పాఠమైనయట్లు
కవి యొకడు కలమును గైకొని యశ్లీల
పరహనన గుణముల వాసనలను
కొట్టివైచినట్లు; కోమలతలు, శాంతి
క్రమ్మికొన్న యట్లు కలలు కనును. (26)
వీడిపోలేని తనమున వెలికి వచ్చి
కాగితముపైన నమరిన కవిత లోని
పదము పదమును తడుము నాప్యాయనమున
కనుల – లేగను నాకు గోకాంత వోలె. (27)
అపపదమ్ములు దొరలిన యంత నడ్డు
గీత గీయడు; కలము తాకించి చుట్టు
గా లిఖించి, దాచికొనును బేల మనసు
లో నిరంతర స్నేహితాలోచనముల. (28)
అతని గర్భాన కలవు మహాకవీంద్ర
కృతిసువర్ణములు, రసనిర్మిత రహస్య
తతి శిలాజముల్ జీర్ణమై బ్రతుకు వాని
ముక్త సారస్వతాస్తిత్వమూర్తి యందు. (29)
కావ్యము నెద జేర్చికొను జాగ్రతలు మీర
పాల పాప నెత్తినటుల పల్లవించి
వెన్ను నరచేత నానించి చెన్ను పుటల
ద్రిప్పు నొయ్యారముగ విడదీయు సొగసు. (30)
(సశేషం)