Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హృదయావి-1

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది – పద్యకావ్య రచన పోటీలో ₹ 10,000/- బహుమతి పొందిన శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి ‘హృదయావి’ కావ్యాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము.]

మంగళాచరణము

~

లేత నిఱుపేద గుండెతో లేలిహాన
ఘన సమమ్మైన జగమున మనము దూర్చి
అలయు సుజనుల కనులు శీతలము జేయు
తెలుగువాణి మనోగతముల నుతింతు. (1)

చెదరినట్టి వస్తువులను చేయి చేసి
కొని యమరిక దిద్ది, తనివిగొన్న యెడద
శిశువు చిలిపి యల్లరి జూచు విశదవృత్తి
తల్లిదండ్రుల యునికి యాదరువు నాకు. (2)

మునుపు కుసుమించి, లౌక్యకామన నశించు
శుద్ధసౌజన్యభావనా సూనములను
వాడనీయక నిరతమ్ము వారిబిందు
వుల తడుపు శ్రీ సదయ గురువును స్మరింతు. (3)

భౌతికాతీతసామ్రాజ్య నీతి బూని
దర్శన ఫలమ్మయిన కవితావనితను
నా గృహద్వారబంధమున గొనితెచ్చి
నిలుపు సత్కవివరుల కంజలి యొనర్తు. (4)

పణమున వెట్టి వ్యక్తిత ప్రపంచముపై నధికారమందగా
ననుకొనలేని ధీవరుల యార్ద్రమనస్సుకు మ్రొక్కి, స్వాదుతా
వనముల లేచివుళ్ల నునుపచ్చిదనమ్మున దేలు దివ్య భా
వనముల ప్రోగుజేసెదను పద్యము లీ పెనుసంబరమ్ముగన్. (5)

~

(అతడొక అవిదిత కవి. ఉత్పలకోమలమైన వాని మనసులో ఆవర్తించే సాంద్రానుభూతులూ మంద్రవికారాలూ అనేకం. వాటికి ప్రత్యక్షాంతర్ధానాలు తప్ప ఆరోహణావరోహణ క్రమాలు, నిర్హేతుకసహేతుక నిబంధనలూ ఉండవు.)

వెలుతురుపొట్లముల్ పవిలి వెండితనమ్ముల సూనృతాంశువుల్
చిలికిన యట్లు సంకలనశేవధియైన జవంపుచూపుతో
తొలి వలపంత తాకి యెలతూలిక యేలిన చేతి వ్రేళ్లతో
కళలిడు మేధతో కవి యొకండు గమించె గృహమ్మువైపుగా. (1)

అనిమిషత్వము ఱెప్పల నాక్రమింప
నడుగుదమ్ముల వేగము లవఘళింప
ప్రావరణపు కొసల్ పరిపరి చలింప
నడచు యతని లోనడతలో నవత లమరె. (2)

అడుగు దీసి యడుగు వేయునంత వాని
డెందమున కోటి కుసుమ సంస్పందనములు
సింధు సందోహ తుంద సంబంధ మంద్ర
మౌనములు; యగ్నికుధ్ర సమాన రుతులు. (3)

నిన్న వాక్కును గొనలేక కన్నులందు
చెమ్మగా పుట్టి వెంటనే జీర్ణమయిన
భావ రింఛోళుల మరల స్పర్శజేయు
వాంఛ సుళ్లు తిరిగి నిలువంగలేడు. (4)

మొన్న శబ్దస్రవంతి సంపూర్ణమహిమ
జాలువారంగ గమనించి సోలువెంట
భావమేదో మనస్సున పండలేని
యలజడి జడుల మరచిపో నలవికాదు. (5)

“ఒకపరి పొంగువారి మృదులోక్తులలో చవి పాదుకొల్పి, ద
ప్పిక నెలవైన నీ చటులపేశల సారతరాత్మపైన నో
పిక నభిషేకముల్ సలిపివేయగదే, సరి యొక్కసారి యిం
చుక” నను లోని వాణికి బ్రచోదనమీయగ లేడు వద్దనిన్. (6)

లోని లోతులలో నుండి తాను తనను
సంతరించి యేకాంతసిద్ధాంత సరణి
పద్యమల్లువేళల, మూలప్రకృతి పాఠ
ములను చల్లు వేళల పరిపూర్ణుడతడు. (7)

మననములోకి జాఱి,యనుమానము దూరగలేని రాసక
ల్ప నిజసమాధిలో బొరలి, పావన కావ్యకళాకుటీర మం
దున నయనోత్సవమ్ములకు దోహదమౌ సమయమ్ములో జిరం
తన పరిచింతనాభిరతధామము నేలును సార్వభౌమతన్. (8)

అతని చూపులో నే సృష్టి తతులు కలవొ?
అతని తలపులో నే స్థితి గతులు కలవొ?
అతని మనసులో నే లయ జతులు కలవొ?
అతని యాత్మలో నే తురీయతలు కలవొ? (9)

కవితకు దగ్గరై వరలు కాలము సంగమశీతలమ్మె కా
ని, విధి విలాస శాపముల నేమములన్ దొలగించి శాశ్వత
చ్ఛవి విరజిమ్మలేదని, విశాలవచస్తతి మాయమై సృజిం
చు వర మదృశ్యమందు ననుచున్ గుబులౌను సతమ్ము వానికిన్. (10)

మనసా! తొందర జెందుమా, పలుకులే మౌనమ్ములో దోగి జీ
వనదీ పూరములై తరంగితముగా పాటిల్లు వేళాయె – నీ
క్షణముల్ తర్కవిదూరముల్; పఱచి యాశాంతమ్ముగా నిన్ను నీ
వు- నవోన్మేషణ నా ప్రవాహమయిపోవోయీ! పునారక్తితో. (11)

మనసా, పూర్వపు పుణ్యపాకమిది యామంత్రించెనా నిన్ను! కా
రణమేదో వెతుకంగబోకు వికచప్రజ్ఞాళికిన్, చాటుమా
టున త్రుళ్లింతలువోవనేల కవితాడోలాయమానాంతర
మ్ము నెపమ్మే త్రపకున్? తలిర్చి యిపుడే ముక్తారుచుల్ చిందుమా! (12)

రేపటి చిగురింతల లే
రూపుల నాశించి నేటి లోకోత్తరమౌ
ఈ పూతపయి పరాకగు
చూపుల జూచుట వలదు ప్రసూతి నియతిలో. (13)

కలిత విశ్రాంతి ఛందస్సుగంధవీచి
డెందమును ముద్దిడగ హాయినొందుమా! వి
రాజమాన కవనభావరాజిలోన
ననుచు భావించికొనును హృదంతరమున. (14)

ఒక మధూహ నేడుదయించె నుండి యుండి
వైద్యుతప్రతతివిధాన ఫలితమయ్యె
పూర్వపుణ్యము గాదె యీ భోగగరిమ
యనుచు భావించికొనును హృదంతరమున. (15)

(సశేషం)

Exit mobile version