[2024 డిసెంబర్ 16 నుంచీ 2025 జనవరి 13 వరకు ధనుర్మాసం సందర్భంగా ‘హృదయాంజలి’ అనే రచనని అందిస్తున్నారు గోనుగుంట మురళీకృష్ణ.]
గోదాదేవి జన్మించిన స్థలం తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు. అక్కడ శ్రీరంగనాథ స్వామి దేవాలయం పూర్వం పాండ్యరాజుల కాలంలో కట్టినది. అక్కడ శ్రీకృష్ణుడు రంగనాథస్వామిగా కొలువై ఉన్నాడు. గోపికలు శ్రీకృష్ణుడు తమ భర్త కావాలని కాత్యాయనీ వ్రతం చేసినట్లుగా గోదాదేవి రంగనాథుడే భర్త కావాలని కోరి ధనుర్మాస వ్రతం చేస్తుంది. తిరుప్పావై ప్రబంధంలోని ముప్పై పాశురాలతో రోజుకొక్క పాశురం చొప్పున ముప్పై రోజుల పాటు ఈ వ్రతం చేస్తుంది గోదాదేవి. మన తెలుగు నేలపై కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం నెలరోజులు స్వామివారికి సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాశురాలు గానం చేస్తారు. ఈ క్రోధి నామ సంవత్సరం మార్గశిర మాసం బహుళ పాడ్యమి మొదలు పుష్యమాసం పౌర్ణమి వరకు (2024 డిసెంబర్ 16 నుంచీ 2025 జనవరి 13 వరకు) ధనుర్మాసంగా జరుపుకుంటారు.
Art by Mrs. Gonugunta Sarala
ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని స్తుతించే చక్కటి సినీ గీతం ఒకటి గుర్తు చేసుకుందాం. ఈ గీతం ‘ప్రేమబంధం’ (1976) చిత్రం కోసం వేటూరి రచించగా కె.వి.మహదేవన్ సంగీత నిర్వహణలో పి. సుశీల కమనీయంగా గానం చేశారు. ఇందులో నర్తకిగా జయమాలిని నటించింది. సినిమా కథతో ఈ పాటకు సంబంధం లేదు కాబట్టి కథను ప్రస్తావించటం లేదు. ఒకచోట నర్తకి నాట్య ప్రదర్శన ఇస్తూ ఈ పాట పాడసాగింది.
“అంజలిదే గొనుమా ప్రియతమా
మజుల బృందా నికుంజ నిరంజన”
అంజలి అంటే నమస్కారం, నికుంజం అంటే పొదరిల్లు, నిరంజనుడు అంటే దోషం లేనివాడు అని అర్థం. మనోహరమైన బృందావనం లోని పూపొదరిళ్ళలో విహరించే దోషరహితుడైన పరమాత్మా! నాకు ఎంతో ప్రియమైన నీకు ఇదే నమస్కరిస్తున్నాను, స్వీకరించు అని భావం. తర్వాత వచ్చే మూడు చరణాలలో శ్రీకృష్ణ లీలలు ఇలా వర్ణిస్తున్నాడు కవి.
“గుజ్జు రూపమున కమిలిన కుబ్జను
బుజ్జగించి లాలించి సొగసిడి
ముజ్జగాలకే ముద్దబంతిగా
మలచిన దేవా! మహానుభావా!”
కుబ్జ కురూపి, మరుగుజ్జు. ఆమె శరీరంలో మూడు వంకరలు ఉండటం చేత ఆమెకు ‘త్రివక్ర’ అని పేరు. ఆమె కంసుడి కొలువులో మాలలు కట్టి, మంచి గంధం తీసే పరిచారిక. బలరామ కృష్ణులను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో ధనుర్యాగం పేరుతో మధురకు పిలిపిస్తాడు కంసుడు. వారిని అవమానించాలనే ఉద్దేశంతో, ఆహ్వానించటానికి కురూపి అయిన కుబ్జని నియోగించాడు. వారికి చందనం వంటి అనులేపనాలను తీసుకుని వెళ్లి ఎదురేగింది కుబ్జ.
“సుందరీ! ఎవరు నువ్వు?” అని అడిగాడు కృష్ణుడు. “నా పేరు త్రివక్ర. మీకు చందనాది అనులేపనాలు అలముట కోసం కంసుడు నన్ను నియోగించాడు” అన్నది. శ్రీకృష్ణుడి నాభి నుంచీ వక్షస్థలం అంతా చందనంతో పూసింది కుబ్జ. అప్పుడు శ్రీకృష్ణుడు నీలి శరీరం మీద పసుపు పచ్చని మైపూతలతో శోభాయమానంగా కనిపించాడు.
“నా పట్ల నీకు గల శ్రద్దాసక్తులకు, భక్తికి సంతోషించాను” అని శ్రీకృష్ణుడు ఆమె కాలి బొటనవేలు మీద తన పాదం మోపి, ఆమె చిబుకము (గడ్డము) కింద తన రెండు వేళ్ళు ఉంచి తల పైకెత్తాడు. శ్రీకృష్ణ భగవానుడి స్పర్శతో ఆమె శరీరం లోని వంకరలు మాయమైనాయి. అవయవాలు అన్నీ చక్కబడి అందమైన యువతిగా మారిపోయింది. ఆ విధంగా మరుగుజ్జు రూపంలో అందవిహీనంగా ఉన్న కుబ్జను బుజ్జగించి మూడులోకాలకే ముగ్ధమోహన మూర్తి గా మలచిన దేవా! నమస్కారం అంటున్నాడు కవి మొదటి చరణంలో. రెండవ చరణంలో ఈ విధంగా చెబుతున్నాడు.
“నిండు కొలువులో పాండవ కాంతకు
వలువలూడ్చు తరి వనిత మొర విని
మానము గాచి మానిని బ్రోచిన
మాధవ దేవా! మహానుభావా!”
దుర్యోధనుడికి పాండవుల మీద అసూయాద్వేషాలు. దానికి తోడు మయసభలో తనకు జరిగిన ప్రమాదం చూసి ద్రౌపదీదేవి పరిచారికలు నవ్వారు. సేవకులు తప్పు చేస్తే ఆ బాధ్యత యజమానిదే కనుక ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవటానికి పాండవులకు జ్యూతాహ్వానం పంపించాడు. శకుని కపట విద్యా కౌశలంతో పాండవుల ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని అపహరించి వారిని బానిసలుగా చేసుకున్నాడు. బానిసల భార్య దాసీతో సమానం అనే ఉద్దేశంతో ద్రౌపదిని సభకు పిలుచుకు రమ్మని ప్రతీహారిని పంపించాడు దుర్యోధనుడు.
ఆ సమయంలో ద్రౌపది ఋతుమతిగా, ఏక వస్త్రంతో ఉన్నది. ఈ సమయంలో పెద్దల ఎదుటికి రాకూడదని ఎంత ప్రాధేయపడినా వినిపించుకోకుండా దుశ్శాసనుడు ఆమెని సభకు ఈడ్చుకుని వచ్చాడు. ఏ స్త్రీకి అయినా ఒక్కరే భర్త ఉంటారు. ఐదుగురు భర్తలు ఉన్న స్త్రీ జారిణి తో సమానం అనీ, ఆమెని వివస్త్రని చేసినా తప్పులేదు అంటూ తమ్ముడిని ప్రోత్సహించాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడు ఆమె చీర పట్టుకుని లాగాడు. పాండవులు అందరూ తలవంచుకుని కూర్చున్నారు. సభలో వారందరూ మౌనం వహించారు. తనను కాపాడేవారు ఈ సభలో ఎవరూ లేరని అర్థం అయింది ద్రౌపదికి, తనకి దిక్కు ఒక్క శ్రీ కృష్ణుడే అనుకుని, మానసంరక్షణ చేయమని ప్రార్థించింది. దుశ్శాసనుడు చీర లాగేశాడు. దాని స్థానంలో మరొక చీర వెలిసింది. అతడు లాగుతూనే ఉన్నాడు, చీరలు పొరలు పొరలుగా అనంతంగా వస్తూనే ఉన్నాయి. చివరకు స్పృహ తప్పి పడిపోయాడు.
ఆ విధంగా నిండు కొలువులో పాండవ పత్నిని కాపాడిన మహానుభావుడవు నీవే కృష్ణా అని చెబుతున్నాడు ఈ పాటలో. అయితే ద్రౌపదికి అంత పెద్ద అవమానం జరిగితే కేవలం చీర ఇవ్వటం ఒక్కటేనా దేవుడు చేయగలిగింది? చక్రాయుధంతో అందరినీ ఒక్కవేటున తెగవేయవచ్చుగా! అని సందేహం వస్తుంది సామాన్యులకు. కానీ భక్తులు ఏది కోరితే భగవంతుడు అదే ప్రసాదిస్తాడు. ఇక్కడ ద్రౌపది “దేవా! నువ్వు సర్వాంతర్యామివి. ఇలాంటి దుష్కార్యం తగదని దుర్యోధనుడికి తెలియజేయి. లేదా నాకు అనంతంగా వస్త్రాలనైనా ఇవ్వు” అని ప్రార్ధిస్తుంది. అందుకే వస్త్రాలను ఇచ్చాడు శ్రీకృష్ణుడు (దుర్యోధనుడికి సద్భుద్ది ఎందుకు ఇవ్వలేదు అంటే ఇంకా లోతుగా విషయం లోకి వెళ్ళాలి. అదంతా అప్రస్తుతం). ఇక మూడవ చరణంలో శ్రీకృష్ణ లీలలను గురించి ఇలా చెబుతున్నాడు కవి.
“బృందావనిలో చందమామవై
చెలువల కలువల జేసి రమించి
బిసజ జల పత్ర బిందువువై
ఇల మసలిన దేవా! మహానుభావా!”
శ్రీకృష్ణుడు బృందావనంలో గోపికలతో రాసక్రీడ జరిపాడు. రాసక్రీడ అనగానే మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. వారితో కలసి ఆడి పాడి అలరించటమే రాసక్రీడ. అష్టభార్యలు, నరకాసురుడి చెరలో ఉన్న పదహారు వేలమంది రాచకన్యలను చేపట్టాడు. ఒకసారి నారదుడికి ఒక సందేహం వస్తుంది. ఇంతమందిని ఒకేసారి ఎలా ఆనందింప జేస్తున్నాడు? అనుకుని అందరి మందిరాలకు వెళ్లి చూస్తాడు. ప్రతి ఒక్కరి దగ్గర శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. “స్వామీ! నిన్ను పరీక్షించాలని అనుకున్నాను. నన్ను క్షమించు. నీ లీలలను అర్థం చేసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు” అని క్షమాపణ కోరుకుంటాడు. ఆ విధంగా “నేనంటే శ్రీకృష్ణుడికి ఎంత ప్రేమ?” అని ప్రతి ఒక్కరికీ అనిపించేటట్లు అందరినీ సమానంగా ఆనందింపజేస్తాడు. గోపికలు, భార్యలే కాదు, దేవకీ వసుదేవులు, పాండవులు, ద్రౌపది, అక్రూరుడు, కుచేలుడు, నారదుడు, ఉద్ధవుడు, భీష్ముడు.. ఇలా అందరినీ వారు కోరుకునే విధంగా అనుగ్రహిస్తాడు. కానీ ఎవరి పట్లా ప్రత్యకమైన అనురాగం గానీ, విరోధం గానీ ఆయనకు లేవు. అందుకే భగవద్గీతలో ఇలా చెబుతాడు.
“యే యథా మాం ప్రపద్యన్తే, తాం స్తధైవ భజామ్యహమ్
మమ వర్త్మాను వర్తన్తే, మనుష్యాః పార్థః! సర్వశః!”
(పార్థా! ఎవరెవరు ఏయే విధముగా నన్ను తెలియగోరుచున్నారో, వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కానీ ఏ ఒక్కనియందును అనురాగము గానీ, ద్వేషము గానీ లేవు).
Art by Mrs. Gonugunta Sarala
అలా అందరినీ సమానంగా చూసినా తామరాకు మీద నీటిబొట్టులా, అంటని విధంగా ఉంటాడు. ఈ పాటలో కూడా అదే చెబుతున్నాడు కవి. బిసము అంటే తామరాకు. బృందావనంలో చందమామ లాగ చెలియలను, కలువలను ఆనందింపజేసినా (చంద్రకాంతి పడగానే కలువ పూలు వికసిస్తాయి. అలాగే చందమామ వంటి శ్రీకృష్ణుడిని మోము చూడగానే గోపికల ముఖ కలువలు వికసించాయి అని కవి భావం), తామరాకు మీద నీటి బిందువులా ప్రవర్తించిన మహానుభావుడవు నీవే కృష్ణా! అని చెబుతున్నాడు.
శ్రీకృష్ణుడు అష్టభార్యలను వివాహం చేసుకుని సంతానాన్ని కన్నా, ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అని అంటారు. ఎందుకంటే మనసు స్ఖలనం (చలించటం) కానంత వరకూ బ్రహ్మచారి కిందే లెక్క అని వేదాంతుల భాష్యం. ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన గుర్తు చేసుకుందాం. ఒకసారి ఒక రాజకుమార్తె చెలికత్తెలతో కలసి జలక్రీడలు ఆడుతూ ఉంది. ఇంతలో అటుగా శుక యోగీంద్రుడు వెళుతూ కలినిపించారు. శుకుడు అవధూత (దిగంబర సన్యాసి). అయినా ఆ స్త్రీలు ఆయనని పట్టించుకోలేదు. మరికొంత సమయానికి శుకుడిని పిలుస్తూ వ్యాస ముని అటువైపే వచ్చాడు. వెంటనే స్త్రీలు గబగబా ఒడ్డుకు వచ్చి బట్టలు కట్టుకుని సిగ్గుపడుతూ నిలబడ్డారట. అది చూసి వ్యాసుడు ఆశ్చర్య పోయాడు. “నా కుమారుడు యువకుడు, అవివాహితుడు. పైగా దిగంబరంగా ఉన్నాడు. అతడిని చూసి మీరు సిగ్గుపడలేదు. నేను వృద్ధుడను, సన్యాసిని. నన్ను చూసి సిగ్గుపడుతున్నారేమిటి?” అని అడిగాడు. “స్వామీ! మీకు ఇంకా పామరత్వం పోలేదు. స్త్రీ పురుషులను వేర్వేరుగానే చూస్తున్నారు. కానీ శుకయోగీంద్రులు అవివాహితుడు అయినా ఆయనకు స్త్రీ పురుషు భేద భావము లేదు. వారి దృష్టిలో సర్వమూ బ్రహ్మమయమే! అందుకే మేము ఆయనను చూసి సిగ్గుపడలేదు” అని సమాధానం ఇచ్చారట.
కాబట్టి వేదాంతం ప్రకారం వివాహితుడు అయిన వాడు సంసారి గానీ బ్రహ్మచారి కాదు. మనసు చలించకుండా, మనో నిగ్రహం కలిగి చరాచర ప్రపంచంలోని జీవులన్నిటినీ సమానంగా చూడగలిన వాడే బ్రహ్మచారి. శ్రీకృష్ణుడు కూడా అస్ఖలిత బ్రహ్మచారి అని శ్రీకృష్ణ తత్వం అర్థం చేసుకున్న వారికే తెలుస్తుంది.
ఈ మనోహర గీతం ‘ప్రేమబంధం’ చిత్రం లోనిది. జయమాలిని నర్తించింది. జయమాలిని అనగానే వెంటనే క్లబ్ డ్యాన్సర్ అనిపిస్తుంది ప్రేక్షకులకు. కానీ ఆమె ఈ పాటతో పాటు ‘శివ శివా అనలేల రా..’ (భక్త కన్నప్ప), ‘రారా రసిక రాణ్మౌళీ..’ (దాన వీర శూర కర్ణ), ‘బాలను లాలించరా గజాననా..’ (శ్రీ వినాయక విజయం) వంటి చక్కటి భావగర్భితమైన గీతాలకు అభినయించింది.
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.