Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హాట్ కేకు

బాగా అమ్ముడు పోతే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి అంటారు కదా..?!

మరి హాట్ కేకులే బాగా అమ్ముడు పోతేనో..?.. ఏమనాలి ?!

నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఒక రోజు.

ఆ మరుసటి రోజు నా పుట్టిన రోజు. మాములుగా అయితే నేను ఇలాంటివి జరుపుకోవడానికి పెద్దగా ఇష్టపడను. పెళ్లయి పిల్లలు పుట్టాక , మా పిల్లల కోసం కేకు తేవడం అలాగే మా శ్రీమతి ఇష్టంగా ఒక షర్ట్ కొనిస్తే వేసుకోవడం లేదా పాయసం చేస్తే తినడం గత కొన్నేళ్లుగా అలవాటయిపోయింది. నాకు షుగర్ వచ్చాక పాయసం కూడా మానేసాను.

ఈసారి కూడా అలాగే పిల్లల కోసం కేకు తెద్దామని బర్త్ డే ముందు రోజు బేకరీకి బయల్దేరాను. నేను హైదరాబాద్ వచ్చి దాదాపు సంవత్సరం అవుతోంది. ఇక్కడి కి వచ్చాక ఇది నా మొదటి బర్త్ డే. అందుకే ఈసారి ఆఫీసులో కూడా మా వింగ్ వరకు స్వీట్స్ ఇద్దామనిపించింది. కానీ ఈ మధ్య ఎవరో ఏదో ఒక సందర్భానికి స్వీట్స్ ఇస్తూనే ఉన్నారు. వెరైటీగా ఉంటుందని కేకులు ఇద్దామని నిర్ణయించుకున్నాను.

మా ఆఫీసు హైద్రాబాదు, సెక్రటేరియట్ ఎదురుగా ఉంటుంది. అందుకనే దగ్గర్లోనే ఖైరతాబాదులో ఇల్లు అద్దెకు తీసుకున్నాను. పైగా మా చెల్లి వాళ్ళు కూడా ఖైరతాబాదు లోనే ఉంటారు. మాక్కూడా హైద్రాబాదు కొత్త కావడంతో చేదోడు వాదోడుగా ఉంటుందని మా చెల్లి వాళ్ళ ఇంటికి దగ్గర్లోనే వెతికి ఇల్లు అద్దెకు తీసుకున్నాను. మాకు దగ్గర్లో మంచి బేకరీ ఏది ఉందో కనుక్కుందామనుకునే లోపే మా పిల్లలు మంచి రేటింగ్ ఉందని నీలోఫర్ బేకరీని సెలెక్ట్ చేసారు. ఇక చెప్పేదేముంది నాకు అదే తప్పనిసరైంది.

ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వస్తూ నీలోఫర్ బేకరీకి వెళ్ళాను. పిల్లల కోసం ఓ రెండు కేకు పీసులు ..ఒకటి చాకొలేట్ ఇంకోటి పైనాపిల్ ఫ్లేవర్‌వి తీసుకున్నాను. ఇక ఆఫీసులో ఇవ్వడానికి మా వింగ్‌లో ఇరవై ఏడు మంది ఉంటారు. వాటిని సెలెక్ట్ చెయ్యడానికి డిస్ప్లే కోసం పెట్టిన అన్నింటినీ చూస్తూ ఉన్నాను. వాటిల్లో ఎగ్ లెస్ కేకులు ఏమున్నాయో వెతుకుతుంటే కనపడింది హనీ ఫింగర్ కేకు. చిన్నగా ముద్దుగా ప్రతి పీసు ప్యాక్ చేసి ఉంది. ఇవేదో బావున్నాయనుకుని, ఓ ముప్పై తీసుకుందామనుకున్నాను మొదట. అప్రయత్నం గానే కౌంటర్‌లో వ్యక్తిని అడిగాను ఓ నలభై పీసులు కావాలని. ఎందుకంటే నా కోసమో మా కొలీగ్స్ కోసమో ఎవరో వస్తూనే ఉంటారు. కొన్ని ఎక్కువగా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్.

కౌంటర్ లోని వ్యక్తి లెక్క పెట్టి పదహారు మాత్రమే ఉన్నాయనీ కాసేపాగితే లోపల ఉన్నాయేమో చూసి చెప్తా అని చెప్పాడు. ఖాళీగా ఉండడమెందుకని ఓ సింగల్ టీ కి ఆర్డర్ ఇచ్చి తాగుతున్నాను. ఇంతలోనే కౌంటర్ లోని వ్యక్తి చెప్పాడు “సారీ సర్. ఇంతే ఉన్నాయి. మీకు ఎప్పటికి కావాలి?” అని. “వీలయితే ఇప్పుడే లేకపోతే రేపు ఉదయాన్నే ఇస్తారా… అయినా ఉదయం ఏడింటికల్లా ఇవ్వగలుగుతారా?” అని అడిగాను.

రేపు ఉదయం ఐదున్నరకే బేకరీ ఓపెన్ చేస్తారని ఆరింటికల్లా కేకులు రెడీ అవుతాయని చెప్పాడు కౌంటర్ లోని వ్యక్తి. చేసేదేం లేక ఉసూరుమంటూ ఇంటికి బయల్దేరాను. ఇంటికి తీసుకెళ్ళినవి పేస్ట్రీలవ్వడంతో పిల్లలు ఓపెన్ చేసి చూసుకుని ఫ్రిజ్ లో పెట్టేసారు. కేకులకోసం ఉదయం త్వరగా వెళ్లాలని త్వరగా భోంచేసి ఉదయం ఆరింటికి అలారం పెట్టుకుని పడుకున్నాను.

***

మరుసటి రోజు ఉదయాన్నే లేచి వాకింగ్‌కి వెళ్లి వచ్చేటప్పుడు కేకులు తేవాలని ప్లాను వేసుకుని పడుకున్నాను. నేనొకటి తలిస్తే దేవుడొకటి తలిచినట్లు ఉదయం నాల్గింటికే మెలకువ వచ్చింది. కారణం షుగర్ బాగా డౌన్ అయిపోయింది. ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తున్నాయి. లేచి నోరు పుక్కిలించి ఫ్రిజ్‌లో పాలు తీసుకుని కాస్త షుగర్ వేసుకుని కాఫీ కలుపుకుని తాగితే గాని ఒళ్ళు కుదుట పడలేదు. టైం నాలుగున్నర అయింది. ఇప్పుడే లేచి ఏం చేస్తాం లెద్దూ అని ముసుగు తన్ని పడుకున్నాను.

“ఏవండీ.. హ్యాపీ బర్త్ డే… మర్చి పోయారా ఈ రోజు మీ బర్త్ డే… చిన్నపిల్ల స్కూల్‌కి రెడీ అవుతోంది కాస్త స్కూల్ వ్యాన్ దాకా దిగబెట్టి రాకూడదూ?” అని మా శ్రీమతి లేపితే గాని తెలీలేదు టైం ఏడున్నర అయిందని. అలారమ్ మోగిందో లేదో కూడా తెలీకుండా గుర్రు పెట్టేసాను. గబా గబా షర్ట్ వేసుకుని మా చిన్నమ్మాయి ని వ్యాన్ ఎక్కించడానికి వెళ్తూ చెప్పాను మా శ్రీమతికి “అలాగే వెళ్లి కేకు లు తెస్తా” అని.

నా అదృష్టం… ఆ రోజు స్కూల్ వ్యాన్ వెంటనే వచ్చేసింది. అమ్మాయిని వ్యాన్ ఎక్కించి బండిలో నీలోఫర్ బేకరికి వెళ్ళాను. కౌంటర్‌లో నిన్నటి వ్యక్తి కాకుండా వేరే ఎవరో ఉన్నారు. వెంటనే చూసాను నాక్కావాల్సిన హనీ ఫింగర్ కేకులు ఉన్నాయేమోనని. ఉన్నాయి కానీ నలభై ఉంటాయా లేదా అని సందేహం. సరే కౌంటర్ లోని వ్యక్తి ని అడిగాను ఓ నలభై హనీ ఫింగర్ కేకు లు ఇవ్వమని.

“సర్ క్యాషా కార్డా?” అడిగాడు అతను.

“ఫోన్ పే లేదా” అన్నాన్నేను. ఉందని చెప్పి ఒకసారి కౌంట్ చేస్తానని కౌంటింగ్ మొదలెట్టాడు. నాకు ఒకటే ఉత్కంఠ. దేవుడా ఓ నలభై ఉండేలా చూడు అనుకున్నాను. ఆయన దేవుడు కదా వేరేలా తలుస్తాడు మరి. “ముప్పై ఆరు” కౌంటింగ్ ముగించాడు. చేసేదేం లేక సరే ఆ ముప్పయ్యారే ఇవ్వమని చెప్పాను.

ఇంతలోనే “భయ్యా! స్విగ్గి ఆర్డర్ కి ఆరు హనీ ఫింగర్ కేకులు ప్యాక్ చెయ్యి” అంటూ వచ్చాడు ఓ స్విగ్గి బాయ్. కౌంటింగ్ ముప్పైకి పడి పోయింది.. నా పల్స్ లాగే. “అదేంటండీ ముప్పై ఆరు ఇస్తానన్నావు కదా ఇప్పుడే?” కాస్త కోపంగానే అడిగాన్నేను. “సారీ సర్ ఆన్‌లైన్ ఆర్డర్ కదా దాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి లేక పోతే పరేషాన్ అయితది” కౌంటర్ లోని వ్యక్తి చాలా కూల్ గా చెప్పాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు నాకు… వాటిని ‘హాట్ కేకులు’ అని ఎందుకంటారో.

“ముందు నాకు బిల్ ఇవ్వండి ఇప్పుడే కాష్ ఇచ్చేస్తా” అన్నాన్నేను. ఖర్మ కొద్దీ నెట్వర్క్ ఇలాంటప్పుడే స్లో అవుతుంది ఫోన్ పే గూగుల్ పే అనుకుంటే. ఎట్టకేలకు బిల్ ఇచ్చాడు. బిల్‌లో ముప్పై ఒక్క కేకులు అని ఉంది. “అదేంటయ్యా బిల్ ముప్పై ఒకటి అని ఇచ్చావ్?’ అని అడిగాను. “సార్ మీరు ఒక కేకును టేస్ట్ కోసం తీసుకున్నారు” చెప్పాడతను. నేను మీకు టేస్ట్ కోసం కేకు తీసుకున్న విషయం చెప్పడం ఎలా మరిచానో …అది తిన్న విషయం కూడా అల్లాగే మర్చిపోయాను.

మొత్తానికి ముందుగా అనుకున్నట్లుగానే ముప్పై కేకులే నాకు ప్రాప్తం అనుకుంటూ గబగబా ప్యాక్ తీసుకుని ఇంటికి బయల్దేరాను.

ఇల్లు చేరేసరికి ఎనిమిదిన్నర. రోజూ ఈ టైం కల్లా నా స్నానం అయిపోతుంది. ఆ రోజు మాత్రం పళ్ళు కూడా తోమలేదు. గబగబా బాత్రూంలో దూరి స్నానాదికాలు ముగించుకుని దేవుడికి దండం పెట్టుకుని కొత్త డ్రెస్ తీసుకుని వేసుకోబోతూ శ్రీమతితో చెప్పాను టిఫిన్ రెడీ గా పెట్టమని. నా శ్రీమతి ఎంతో ప్రేమగా ప్లేట్లో కారం రొట్టె పెట్టుకు తెచ్చింది… నాకెంతో ఇష్టమని. నాకు మాత్రం ఎంతో కష్టంగా ఉంది ఎందుకంటే ఏ ఉప్మానో అయితే మింగేయొచ్చు. ఇది మాత్రం నమిలి తింటే గాని మింగుడు పడదు. ఇది మింగుడు పడని నిజం. హ్యాపీ బర్త్ డే కదా ఈరోజు… నవ్వు నటిస్తూ పళ్ళు కొరుకుతున్నాను…రొట్టె కూడా ఆ పళ్ళ కింద పడి నలిగి పోయింది. నిజం మింగుడు పడింది.

టైం తొమ్మిదిన్నర. కొత్త డ్రెస్ అందిస్తూ శ్రీమతి అంది “ఏమండీ ఈ సారి మీకు కొత్త షర్ట్ తీసుకోలేక పోయానండీ” అని. “పర్వాలేదు లేవే ఇది కూడా కొత్తదే కదా పైగా నువ్వే సెలెక్ట్ చేశావాయే. నువ్వే తీసిచ్చావనుకో” అన్నాను. కేకుల ప్యాక్ ఇంకో సంచిలో పెట్టమన్నాను.. ఎందుకంటే ఆఫీసు లిఫ్ట్‌లో ఎవరైనా గమనించి బర్త్ డే అని విషెస్ చెప్పారంటే ‘కేకుల లెక్క తప్పుద్ది’ అని. సంచి తీసుకుని ఆదుర్దాగా బయల్దేరాను ఆఫీస్‌కి.

బాగా లేట్ అవడంతో చివరి నిమిషం హడావుడిలో ఎవరూ నన్ను పలకరించలేదు లిఫ్ట్‌లో. హమ్మయ్య అనుకుంటూ నాలుగో ఫ్లోర్‌లో ఉన్న మా వెస్ట్ వింగ్ లోకి అడుగు పెట్టాను. అప్పటికే అందరూ వచ్చి అటెండన్స్ చెప్పి వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు. కేకుల సంచి టేబుల్ మీద పెట్టి నేనూ అటెండెన్స్ చెప్పాను. ఆ రోజు పదిహేనో తారీఖు.. అందునా మార్చి నెల కావడంతో మా ఆఫీసు లో కాస్త పని వత్తిడి ఎక్కువగానే ఉంటుంది. మధ్యలో వీలు చేసుకుని కేకులు పంచాలి. మా బాసు నన్ను పిలిచే లోపే ఈ పని ముగించాలని అనుకున్నాను. నిజానికి బాసు తోనే మొదలెట్టాలి. కానీ ఆయన ఏదయినా పని పురమాయించాడంటే నా ప్లాన్ అంతా తల్ల కిందులవుతుంది. అందుకే నా పక్క నున్న కొలీగ్ వాసుతోనే మొదలెట్టాను కేకుల పంపకం. “ఓహ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే” చెపుతూ కేకు తీసుకున్నాడు వాసు. థాంక్స్ చెపుతూ ఎదురుగా ఉన్న సెక్షన్‌కి వెళ్ళాను. మా సెక్షన్ వాళ్ళూ అక్కడే ఉన్నారు. అందరికీ నా బర్త్ డే అన్న విషయం చెపుతూ కేకుల బాక్స్ ముందుంచాను. అందరూ హాపీ బర్త్ డే అని చెపుతూ కేకు తీసుకున్నారు. ప్రియమిత్రుడు వినీల్ మాత్రం ఎందుకో ముక్తసరిగా హాపీ బర్త్ డే అన్నాడు కేకు తీసుకుంటూ. మనసుకు కాస్త వెలితిగా అనిపించింది.

ఎప్పుడూ నా డ్రెస్ కొత్తదని గుర్తుపట్టే శ్రీనివాసులు కేకు తీసుకుని ఏంటి ఈ రోజు స్పెషల్ అన్నాడు. ఎప్పుడూ నా కొత్త డ్రెస్ కనిపెట్టే మీరు ఈరోజు ఇలా కొత్తగా అడగడం ఏం బాలేదండీ అంటూ విషయం చెప్పాను. ఓహ్ అలాగా.. హ్యాపీ బర్త్ డే అంటూ కేకు తీసుకున్నాడు. ఇంతలో నా వెనుకగా కూర్చునే రఘుపతి రాగానే మీకు కేకు ఇచ్చానా అని అడిగాను. ఇందాకే ఇచ్చారుగా అన్నాడు. విషయమేమంటే మా ఫ్లోర్‌లో ఏ విషయమైనా రఘుపతికి తెలిస్తే అందరికీ తెలిసినట్లే. మరి నా బర్త్ డే విషయం ఇంకా ఎవ్వరికీ తెలియలేదంటే రఘుపతికి కేకు ఇవ్వలేదని నా నిశ్చితాభిప్రాయం. హడావుడిలో ఈయనకి కేకు ఇచ్చిన విషయం గమనించలేదు నేను.

నాకు కొంచెం అవతలగా కూర్చునే విమలా మేడం కేకు తీసుకుంటూ ఇటీవల పబ్లిష్ అయిన నా కథ గురించి గుర్తు చేసుకున్నారు. ఇది కాస్త హ్యాపీ గా అనిపించింది నాకు. అటు పక్క ఉండే రమ్య మేడం “కేకు లో ఎగ్ లేదు కదా?” అని అడిగి మరీ తీసుకున్నారు.

అంతలో మా సెక్షన్ లోని మా కొలీగ్ ప్రసాద్ రావడంతో కేకు ఇచ్చాను. ఓహ్ వెరీ నైస్ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే అంటూ.. అన్నట్లు మన జడ్‌ఎం గారు నీకు గ్రీటింగ్ పంపారు… రండి మన బాస్ చేతుల మీదుగా తీసుకుందురు గాని అంటూ నన్ను మా బాసు రామారావు గారి ఛాంబర్‌కి తీసుకు వెళ్ళాడు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే మా బాసు లేచి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చి జడ్.ఎమ్ గారు పంపిన గ్రీటింగ్ ఇస్తూ “హ్యాపీ బర్త్ డే ..గాడ్ బ్లెస్స్ యూ” అని చెప్పారు. థ్యాంక్ యూ సర్ అని చెప్పి ఆయనకి కేకు ఇచ్చాను. ఎప్పుడూ ఒకట్రెండు మంది లీవులో ఉండే వాళ్ళు ఆ రోజు అందరూ హాజరయ్యారు. కేకుల లెక్క తప్పుతుందేమో అని ఒకటే కంగారు నాకు. మొత్తానికి ఒకటో రెండో మనసుకు చివుక్కు మనిపించే క్షణాలు మినహా కేకుల పంపకం సంతోషం గానే పూర్తయింది.

మిగిలిన రెండు కేకు లను జాగ్రత్తగా బాక్స్‌లో పెట్టి దాచాను. ఎవర్నైనా మర్చి పోయిఉంటే ఇవ్వాలని. నా సీటులో కూర్చుని పనిలో పడ్డాను. మధ్యలో వాట్సాప్ చెక్ చేసుకుంటూనే ఉన్నాను. మిత్రులంతా పుటిన రోజు సందేశాలు పంపిస్తూనే ఉన్నారు. ఆశ్చర్యకరంగా మా బాసు వాట్సప్‌లో కూడా మళ్ళీ బర్త్ డే గ్రీటింగ్ పంపించారు. ఇది నిజంగా నేను ఊహించని విషయమే. ఊహించని విషయం జరిగినప్పుడు వచ్చిన సంతోషం కంటే ఊహించిన విషయం జరక్కపోయినప్పుడు వచ్చే బాధే ఎక్కువ… అందుకే ప్రియ మిత్రుడు వినీల్ మనస్ఫూర్తిగా విషెస్ చెప్పలేదని, శ్రీనివాసులు గారు నా కొత్త డ్రెస్ మీద కాంప్లిమెంట్ ఇవ్వలేదని అలాగే రఘుపతి గారు నా బర్త్ డే విషయం గురించి ఎక్కువగా మాట్లాడలేదని మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూనే ఉంది.

పొద్దున్న హడావుడి లో టిఫిన్ సరిగా తినలేదు కాబోలు లంచ్ టైం కంటే ముందే షుగర్ డౌన్ అవడం మొదలైంది. మిగిలిన రెండు కేకుల్లో ఒకటి తినేసాను.. ఇంతకంటే ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుంది అనుకుంటూ.

ఆ రోజు ఠంచనుగా పని ముగించుకుని మిగిలిన కేకు ముక్కని ఖాళీ అయిన లంచ్ బాక్స్‌లో పెట్టుకుని ఐదున్నరకే ఆఫీసునుండి బయటపడ్డాను.

***

అంతకు నాలుగు రోజుల ముందు నాంపల్లి నుమాయిష్ ఎక్సిబిషన్‌కి వెళ్తూ అమ్మను మా చెల్లి వాళ్ళ ఇంట్లో వదిలాం. చెల్లి ఓ నాలుగు రోజులు ఉంచమనడంతో కాదనలేక అమ్మను వాళ్లింట్లోనే ఉంచాను. నిజానికి ఉదయమే ఆఫీసుకి వెళ్తూ అమ్మ ఆశీర్వాదం తీసుకుందామని అనుకున్నా బేకరీ దగ్గర లేటవడంతో కుదరలేదు. అందుకే ఇప్పుడు వెళ్లి అమ్మను తీసుకుని ఇంటికి వెళదామని స్వీట్స్ తీసుకుని చెల్లి వాళ్ళింటికి వెళ్ళాను. ఉదయమే వాట్సాప్‌లో బర్త్ డే విషెస్ చెప్పినప్పటికీ మా బావ గారు, చెల్లీ మళ్ళీ శుభాకాంక్షలు చెప్పారు. అప్పటికే ఇంటి నుండీ పిల్లలు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నారు.. పెద్దమ్మాయి అయితే, నాన్నా ఈ రోజు ఏంటి ఈవెనింగ్ ప్లాన్ అని మెసేజ్ పెడుతూనే ఉంది. బావా వాళ్ళు వాళ్ళింట్లో నే భోజనం చేద్దామని పిలిచినా పిల్లలను నిరాశపర్చడం ఇష్టం లేక అమ్మను తీసుకుని ఇంటికి బయలుదేరాను.

ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా ఎవరూ రెడీగా లేరు. పిల్లలు మాత్రం బంజారా హిల్స్ లోని ‘పరంపర’ హోటల్‌లో ఒక టేబుల్ బుక్ చేసారు ఆన్లైన్ లో రేటింగ్ చూసి. శ్రీమతి నాకొక గిఫ్ట్ కొనిస్తానని చెప్పినా టైం లేకపోవడంతో ఇప్పటికి వద్దులే అని సరిపుచ్చి హోటల్‌కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇంతలో హోటల్ నుండీ మెసేజ్ వచ్చింది త్వరగా రావాలని.

గబ గబా కారు తీసి బయలుదేరాము.

గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని ఎలాగో హోటల్ చేరుకున్నాం. హోటల్ వాళ్ళు మాకు వెల్కమ్ చెప్పి లోపలికి ఆహ్వానించారు. కుర్చీల్లో కూర్చుంటారా లేక క్రింద నా అని అడిగారు. మొదట్లో మాకు అర్థం కాలేదు. తర్వాత చూస్తే తెలిసింది సంప్రదాయ బద్ధంగా చక్కటి పరుపులు పరిచి చిన్న బల్లల పై వడ్డిస్తున్నారు. అందుకే హోటల్‌కి ‘పరంపర’ అని పేరు పెట్టారు అనిపించింది.

పిల్లలు వాళ్లకి కావాల్సిన వెరైటీ వంటకాల్ని ఆర్డర్ ఇచ్చారు. అందరం తృప్తిగా తిన్నాం. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. కానీ శ్రీమతికి నాకు గిఫ్ట్ కొనివ్వలేదని వెలితి. నాకేమో ఆఫీసులో నేననుకున్న వాళ్ళ నుంచీ అనుకున్నంత స్పందన రాలేదని వెలితి.

“నిండు కుండలో బెండు ముక్కా, వెండి నాణెం వేస్తే బెండు ముక్క మాత్రం పైకి తేలుతుంది. వెండి నాణెం అడుక్కి చేరుతుంది. నీళ్లన్నీ మరిగి అడుక్కి వెళ్లే కొద్దీ బెండు ముక్కా వెండి నాణెం ఒకే చోటికి చేరుకుంటాయి తమ మధ్య పెద్ద వ్యత్యాసం లేదన్నట్లు.

అలాగే జీవితంలో కూడా బాధించే క్షణాలే మనసు పై పొరల్లో తేలుతుంటాయి మళ్లీ మళ్ళీ జ్ఞాపకం వస్తూ. మధుర క్షణాలు లోపలే ఉండిపోతాయి. జీవితం నూరేళ్ళకు చేరువయ్యే కొద్దీ సంతోషం దుఃఖం మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదని బోధ పడుతుంది. అందుకే అంటారు కాబోలు మనిషిని నిండు కుండలా ఉండాలి అని. బెండు ముక్కని, వెండి నాణెన్నీ సమానంగా చూడ్డం అలవరచుకోగలిగినపుడే ఇది సాధ్యం.”

యాభయ్యో పడిలో పడిన నాకు ఈ విషయం చెప్పడానికే ఇంకా మిగిలి ఉన్నానన్నట్లు, చివరి కేకు ముక్క లంచ్ బాక్స్ తీయగానే కనపడింది. నాకు మాత్రం అది ఇంకా ‘హాట్ కేక్’ లానే కనపడుతోంది.

Exit mobile version