Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హోరుగాలిలో గాలివానలో పడవ ప్రయాణం

[శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావు రాసిన ‘హోరుగాలిలో గాలివానలో పడవ ప్రయాణం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

హోరున వర్షం పడుతుంది.

చిరిగిపోయిన నల్లని గొడుగు వేసుకొని తడుస్తూ గబ గబా కంగారుతో పరుగులాంటి నడకతో నడుస్తుంది ఎంకటలచ్చిమి. చేతిలో చిన్ని ప్లాస్టిక్ డబ్బా దానిలో నేమ్ అస్పష్టంగా కూడా కనిపించని ఖాళీ టాబ్లెట్స్ రేపర్. ఆమె పట్టుకున్న గొడుగు నుండి ఒక్క వర్షం నీటి బొట్టు కూడా వృథా కాకుండా ఆమె తలమీద పడుతూనే ఉంది. వెంట్రుకల మీద పడిన నీళ్ళు నుదురు మీద నుండి దబ దబా జారిపడి కనురెప్పలను క్రిందకు బలవంతంగా

దించేస్తున్నాయి. దానితో ఆమెకు దారి కూడా కనిపించటం లేదు. పైగా చీకటి. అక్కడక్కడ గోతులు, గుంతలు.

అప్పుడప్పుడు ఉరుములు.. మెరుపులు..

ఆ భయంకర వాతావరణంలో తననెవరో తరుముకొస్తున్న శబ్దాలు. తననెవరో చెట్టు చాటునుండి చూస్తున్న అలికిడి. అంతేకాదు ఎవరో అస్పష్టపు ముసుగు మనిషిలాంటి వ్యక్తి కదలికలు. ఇంకో పక్క దూరం నుండి పోలీస్ పెట్రోలింగ్ వాహనం. పెద్దగా సైరన్ వేస్తూ దూసుకొస్తున్న శబ్దం. మరో పక్క నిద్రా దేవత, ఆకలి రాక్షసి ఇద్దరూ కలిసి ఒకేసారి తన కంఠాన్ని నులిమి పాడేస్తున్న అనుభూతి.

ఇవన్నీ ఎంకటలచ్చిమి మహా ప్రయత్నానికి అడ్డు రావడం లేదు. ఆమె సాధించాలనుకున్న ప్రయత్నం బాపతు పట్టుదల, దీక్ష అలాంటివి మరి.

సడన్‍గా ఆమె వెనుక నుండి ముందుకు వచ్చి ఆగింది పోలీసు పెట్రోలింగ్ వాహనం.

“ఎవరు నువ్వు..? ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళుతున్నావు” ఎయిర్ విండ్ మిర్రర్ డౌన్ చేసి ప్రశ్నించింది ఓ పోలీసు కంఠం.

ఆమె ప్లాస్టిక్ డబ్బా తెరిచి చూపించింది. నెమ్మదిగా ఏదేదో చెప్పింది.

‘సరే కొంచెం.. ఎదరకు వెళ్ళు’ అన్నట్టు చేత్తో చూపించి.. కదలి వెళ్ళిపోయింది ఆ వాహనం.

ఎంకటలచ్చిమి డబ్బా జాగ్రత్తగా మూత పెట్టింది. చుట్టూ బెదురుగా చూసింది. అంత వర్షంలోనూ దూరంగా మర్రిచెట్టు చాటు నుండి ముసుగు మనిషిలాంటి వ్యక్తి తనను పరిశీలనగా పరిశీలిస్తున్నట్టుగానే అనిపించింది. మళ్లీ పరుగులాంటి నడక లంకించుకుంది.

ఈ ఏరియా కాకపోతే మరొక ఏరియా తెల్లవారే వరకు తిరిగి తిరిగి తను అనుకున్నది సాధించి తీరాలి. అది సంపాదించే తను తిరుగుముఖం పట్టాలి.

భయం.. భీతి.. బెరుకు.. అసహనం.. అసహాయత.. అనుమానం.. కలవరపాటు..తడబాటు.. ఇవన్నీ పక్కన పెట్టేసింది ఎంకటలచ్చిమి.

ఆ అర్ధరాత్రి దూరంగా కనిపిస్తున్న ఓ మందుల షాపు దగ్గరకు వెళ్లి ఆతృతగా తన దగ్గర ప్లాస్టిక్ డబ్బా మూత తెరిచి చూపించింది ఎంకటలచ్చిమి. ఆ షాపు ఓనరు దానిని పరిశీలనగా చూసి ‘అర్థం కావడం లేదు’ అన్నట్టు చెయ్యి ఊపి మళ్లీ ఆమెకు ఇచ్చేశాడు. ఆమె బాక్స్‌కు మూత పెట్టి నడక లంకించుకుని. కొంచెం దూరం వెళ్లి అనుమానంతో వెనక్కు తిరిగి చూసింది.

తనను వెంబడిస్తున్న ఆ ముసుగు మనిషి లాంటి వ్యక్తి.. తను వెళ్ళిన మందులషాపు దగ్గర నిలబడి ఉండడం స్పష్టంగా గమనించింది. తన గురించి ఆరా తీస్తున్నాడా.

ఎంకటలచ్చిమి చాలాసేపు ఆ ఏరియాలో తిరిగి తను అనుకున్నది సాధించే సమయం పూర్తికాక పోవడంతో మరో ఏరియాలో ప్రవేశించింది.. ఆ పెద్దనగరంలో.

వెనక్కు తిరిగి చూసింది. ఆ ముసుగు మనిషి లాంటి వ్యక్తి తనను వెంబడిస్తున్నట్టుగానే అనిపించింది.

అర్ధరాత్రి అంత భారీ వర్షంలో.. ఒక ముసుగు మనిషి లాంటి వ్యక్తి అసలు తనను వెంబడించడం దేనికి..

అతని కదలికలను పసిగడుతూనే వేగంగా నడుస్తుంది ఎంకటలచ్చిమి. అసలు ఆ ఆకారం ఒక ముసుగు మనిషి కాకపోవచ్చు. తన భయం తాలూకు అనుమానం కావచ్చు కూడా.. ఏమో ఏదైనా తను మాత్రం అసలు భయపడటం లేదు.. ఎందుకంటే ఆమె దృష్టి అంతా ఆమె కార్యసాధన మీదే ఉంది!

ఈసారి ఇంకా పెరిగింది వర్షం.. గాలి వీస్తూనే ఉంది..

ఉరుములు మెరుపులు వస్తూనే ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనూ ఎంకటలచ్చిమి ఓ ఆసక్తికర సంఘటన తనకు కొంచెం దూరంలో గమనించింది.

ఆ ముసుగు మనిషిలాంటి ఆకారం తనను వెంబడించడమే కాదు తనను దాటుకొని బాగా ముందుకు వెళ్ళిపోయింది

అన్ని ఏరియాలకు ఒకే పెట్రోలింగ్ వాహనం కావడంతో తన ముందు వెళుతున్న ఆ పెట్రోలింగ్ వాహనాన్ని చెయ్యి అడ్డు పెట్టి ఆపి దగ్గరకు వెళ్లి ఏదో గుసగుసగా చెప్పినట్టు చెప్పాడు ఆ ముసుగు మనిషి లాంటి వ్యక్తి. అతడిని పోలీసులు ఏదో అడిగారు. అతను ఏదో చెప్పాడు.

చివరికి.. ‘నేను ప్రయత్నిస్తాగా మీరు వెళ్ళండి’.. అన్నట్టు పోలీసులతో అతను చెప్పినట్టు.. ఆమె అర్థం చేసు కుంది. ఆ ఆకారం నిజమైన ముసుగు మనిషి అని తెలిసాక కూడా ఆమె ఏ మాత్రం భయపడలేదు.

భయం దేనికి? చంపేస్తారా? మరీ మంచిది. ఎప్పటికైనా తప్పనిది ఆది ఒకటేగా. దాన్నుంచి ఈ భూ ప్రపంచంలో ఏ వ్యక్తి తప్పించుకోలేడు. ఇక తను ఎంత? తన అర్భక బ్రతుకెంత..? అసలు తను బ్రతకాలా? బ్రతకాలి.. బ్రతకాలి.. బ్రతికి తీరాలి.. తను లేనిదే బ్రతక లేని ఒక ప్రాణం గురించి.. ఖచ్చితంగా ఏ మాత్రం అనుమానం లేకుండా నూటికి నూరుపాళ్లు తను బ్రతికే తీరాలి.

ఆ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండున్నర గంటల సమయం ఆ ఏరియాలో మరొక మందుల షాప్‌ను ఆమె వెతుకుతుండగా మళ్లీ అడ్డగించింది అదే పెట్రోలింగ్ వాహనం. ఆమె.. తన పని పూర్తికాలేదు.. అన్నట్టు చెప్పింది. ఆ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ముందుకు వెళ్ళిపోయారు. ఏది ఏమైనా ఆ పోలీసులు తనను అనుమానంగానే చూస్తున్నట్టు ఆమెకు అనిపించింది.

ఎంకటలచ్చిమి తిరిగి తిరిగి తిరిగిన చోటకే తిరిగి తిరిగి.. చిట్టచివరికి ఒక మందులషాపు చూసి ఆనందంతో అక్కడకు వెళ్లి తన దగ్గర ప్లాస్టిక్ డబ్బా మూత తెరిచి వాళ్లకు చూపించింది. ఆ షాపు వాళ్లు లైట్ కాంతిలో ఆమె ఇచ్చిన టాబ్లెట్స్ రేపర్‌ను చాలా సేపు నిశితంగా పరిశీలించి.. అర్థం కాలేదు అన్నట్టు ఆమెకు తిరిగి ఇచ్చేశారు. ఆమె ఏదో అడిగింది వాళ్లు కొంచెం ఎదురుగా వెళ్లి పక్కకు తిరిగి అక్కడ ప్రయత్నించమన్నారు. ఆమె మరో ప్రయత్నం చేద్దాం అన్నట్టు నడక మొదలు పెట్టింది.

 ఎంకటలచ్చిమి నడుస్తుంది.. నడుస్తుంది.. నడుస్తుంది. నడిచిన చోటే నడుస్తుంది. తిరిగిన చోటే తిరుగుతుంది.

సమయం తెల్లవారు మూడున్నర దాటింది. మరో గంటన్నరలో తెల్లతెల్లగా తెల్లవారిపోతుంది.

***

“హలో విశ్వం.. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా..”

“ట్రై చేస్తున్నాను సార్ ఎలాగైనా ఈ రోజు గేమ్ ఫైనల్‌కి వచ్చేస్తుంది. నో డౌట్.”

“ప్రొసీడ్ ప్రొసీడ్.. నువ్వు చాలా అలర్ట్‌గా ఉండాలి. నా ఉద్దేశం ప్రకారంగా మొదట్లో ఆవిడ పిచ్చిది అని భావించాను. ‘అదేం అయి ఉండకపోవచ్చు’ అంటూ నువ్వు ఖచ్చితంగా చెప్పడంతో ఈ కేసు ఏ మలుపు తిరిగి ఎక్కడ ఆగుతుందో తెలుసు కోలేకపోతున్నాను.. అడిగితే ఆవిడ తనపే రు ’ఎంకటలచ్చిమి’ అని చెప్పింది. ఆడకూతురు.. పెద్ద వయసు కాదు.. నలభై యాభైకి మధ్యలో ఉండొచ్చు. పోనీ బ్రోతల్ హౌస్ మెయింటెయిన్ చేసే లేడీ అనుకోవడానికి.. ఆవిడ ముఖం, మాటలు బట్టి ఆవిడకు అంత సీన్ లేదు అనిపిస్తుంది.. అయినా మన నగరంలో అసాంఘిక కార్యకలాపాలు ఎప్పుడో కట్టడి చేశాను కదా. మరి ఏ కోణంలో ఆలోచిద్దాం.. అన్న క్లూ ఇప్పుడు దొరకటం లేదు. ఆరు నెలల నుంచి ఆ ఆడది.. ఇలాగే అర్ధరాత్రి కొన్ని ఏరియాల్లో అలా ఎందుకు సంచరిస్తున్నట్లు. మన స్టాఫ్ చెప్పినదాన్ని బట్టి వారంలో కనీసం నాలుగురోజులు ఆవిడ ఇదే రకంగా ప్రవర్తిస్తుందట. మానవబాంబు కన్నా పెద్ద టెన్షన్ పెడుతోంది.. ఎనీహౌ.. విశ్వం నీ వృత్తికి సరైన న్యాయం చేసే సమయం ఇదే. ఆఁ.. అన్నట్టు చెప్పటం మరిచాను. ఆవిడ పూర్తి అడ్రస్ కూడా సేకరించాలి. పూర్తి ఫ్యామిలీ డీటెయిల్స్.. మొత్తం అన్ని రేపటికల్లా నా దగ్గర ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏ ఏరియాలో ఉన్నట్టు? ఆఁ, ఆఁ, ఆహా.. అలాగా..12 గంటలు దగ్గర నుండి ఆవిడనే అనుసరిస్తున్నావా? వెరీగుడ్, వెరీగుడ్.. గతంలో కూడా ఇలాగే మా డిపార్ట్మెంట్‌కి ఒక కేసు విషయములో చాలా సహకరించావు. మా అధికారుల తరఫు నుంచి నీకు మంచి గిఫ్ట్ వచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఉంటాను.. బై ది బై ఏదైనా ప్రమాదం జరిగినా.. లేదా అనుకోని సంఘటనలు ఎదురైనా నాకు ఫోన్ చేస్తే నిమిషాల్లో అక్కడికి వస్తాను. రిస్కు తీసుకోవద్దు.. ప్రాణాలు ముఖ్యం కదా.. ఉంటాను.”

***

సమయం తెల్లవారుజామున 4 .30 నిమిషాలు. ఎంకటలచ్చిమి నిస్పృహతో లేదు.. తను అనుకున్న మెడిసన్ దొరకకపోయినా తను వచ్చిన పని పూర్తిగా పూర్తయినది అన్న భావనలో వెనుతిరిగి నడుస్తుంది. వర్షం పూర్తిగా తగ్గింది. అయినా ఆమె గొడుగు ముడచలేదు. తను తన ఇంటికి వెళ్లేసరికి ఇంచుమించుగా తెల్లవారవచ్చు. చాలు ఇక తను అనుకున్న పని ఈ రోజుకు పూర్తయినట్లే..

చుట్టూ పరికించి చూసింది.. ఆ ముసుగుమనిషి లాంటి వ్యక్తి కానీ ముసుగుమనిషి కానీ ఎక్కడా కనిపించలేదు. ఆమె ఇప్పుడు తన నడకలో వేగం కొంచెం పెంచింది.

నడిచింది నడిచింది.. ఇంచుమించు నగరం చివరకు వచ్చేసింది. కొంచెం దూరంగా ఆ కనిపించే బడ్డీకొట్టు దానిని ఆనుకొని పెద్ద రాళ్ల గుట్టలు. అవి దాటేక రెండు మూడు చిన్న పూరి గుడిసెలు.. అవి దాటాకా..ఆ కనబడే అతి చిన్ని పూరి గుడిసే ఎంకటలచ్చిమిది.

అది ఓ పక్కకు ఒరిగిపోయింది. దాన్ని సమీపించింది ఆమె. తాటాకు తలుపు.. నెమ్మదిగాతోయబోయింది..

“ఆగు” వెనుకనుండి ముందుకు వచ్చి..గట్టిగా అరిచాడు ఆ ముసుగుమనిషి లాంటి వ్యక్తి. భయపడింది ఎంకట లచ్చిమి.

“ఎవరు నువ్వు.. అర్ధరాత్రి నుండి ఇప్పటి వరకు ఎందుకు సిటీ అంతా తిరిగావు. నీ వెనుక ఎవరున్నారు? నీ చర్యలు ఏమిటి? మారు వేషంలో ఉన్న ఇతర దేశాలతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావు. పైగా అమాయకంగా అడుక్కు తినే దానిలా నటిస్తున్నావు.. నీ గురించి నా నిద్ర అంతా పాడైంది. వర్షంలో తడిసి ముద్దయ్యాను. నేను సాధారణంగా నిన్ను వదిలిపెట్టను.. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి వాళ్లకు నిన్ను సరెండర్ చేస్తాను. నిజంగా చెప్పు ఎవరు నువ్వు నీ చర్యలు ఏమిటి? పాకలో లోపల ఏమున్నాయి.. మారణాయుధాలా?..మాదకద్రవ్యాలా.. విదేశీద్రోహులా.. అసాంఘికకార్యకలాపాలా.. లేక బాంబులు తయారుచేస్తున్నారా? చెప్పు చెప్పు..” గద్దించాడు ముసుగుమనిషిలా కనబడే విలేఖరి విశ్వం.

“అయ్యా.. నాకు ముందే తెలుసు. మీరు పేపరోల్లు. మీ ఉజోగం మీది, నా నరకయాతననాది.” అంటూ తలుపు తోసింది ఎంకటలచ్చిమి. నేల మీద బట్టలు లేకుండా పడున్నాడు ఆమె మొగుడు కోటితిప్పడు.

“నా మొగుడు తాగి వత్తే నాకు యమలోకం కనపడతాది బాబు. పిచ్చియదవ.. తప్పునేదు బాబు పెల్లాన్ని కదా.. కానీ ఆడు పిచ్చిపిచ్చి పనులన్నీ సేత్తాడు బాబు.. అదేదో పట్టుకొచ్చి ఒల్లంతా రాశి ఏడిపిత్తాడు. మీరైతే తట్టు కోగలరా..” ఆమె బోరున ఏడుస్తుంది.

“నన్ను రోడ్డు మీన నిలబడి డాన్స్ కత్తమంటాడు మీరు సేయగలరా..?”..ఆమె చాలా గట్టిగా రోదిస్తోంది.

“తనకు సేతికి దొరికిన వస్తువుతో నన్ను సితక బాదు తాడు. ఈగో గాయాలు.. మీరు తట్టుకో గలరా.. బండ బూతులు తిడతాడు..గోర్లతో రక్కుతాడు.” ఈసారి ఆమె ఏడవడం లేదు. దబదబా రెండు చేతులతో నెత్తి బాదుకుంటుంది.

“ఆ యమలోకపు నరకం భరించనేక అంతకన్నా రోడ్డు మీన.. రేతిరి అంతా అలా పిచ్చిదానిలా తిరగడమే నాకు బాగుంటుందియ్యా. పోలీసుల బారి నుండి తప్పించుకోడం కోసం ఇలా ఏదో వంక ఎట్టుకొని రేతిరంతా తిరిగి తిరిగి రాడమే నాకు సుఖం అనిపిత్తది. ఒకచోట కూకుంటే ‘ఎందుకు కూకున్నావు’..అని పోలీసోల్లు ఏధిస్తారు. ఇంటికాడకి ఎల్లి పొమ్మని కేకలు ఎడతాడు. అందుకనే ఏడా దొరకని మందులు వంక ఎట్టుకుని రేతిరంతా తిరుగుతున్నాను. తెల్లవారులు తెరిచి ఉండేవి మందుల సాపులే కదా..

నా మొగుడు ఎట్టే కట్టం ముందు.. ఎంత వరదొచ్చినా, తుఫానొచ్చిన.. ఇలా తిరగడం నాకు పెద్ద బాధ అనిపించదయ్యా. ఇలా తిరగడమే నాకు సానా సుఖంగా ఉంటాది” ఆమె ఇంకా చెప్తుంది. వినలేక చెవులు మూసుకున్నాడు విలేఖరి విశ్వం.. అతని శరీరచలనం ఆగిపోయింది. నెమ్మదిగా నిలదుక్కుకోగలిగాడు.

అంతవరకూ తను తీసిన ఆమె ఫొటోస్ సెల్ నుండి డిలీట్ చేశాడు. ఆమె వాయిస్ రికార్డింగ్ కూడా తీసి పడేసాడు. జేబులో చెయ్యి పెట్టాడు.. ప్లాస్టిక్ కవర్లో ఉన్న కొన్ని రూపాయి నోట్లు తీశాడు. దోసిలిలో పట్టుకొని ఆమెకు ఇవ్వబోయాడు. ఆ నోట్ల మీద.. అంతలా వర్షం వస్తున్న వెచ్చగా ఉండే రెండు నీటి బొట్లు రాలి అలా అలా కొట్టుకుపోతున్న నీటి ప్రవాహంలో కలిసిపోయి మాయమైపోయాయి.

అవి.. ‘తన కన్నీటి బొట్లు..’ అని కూడా విశ్వం తెలుసు కోలేకపోతున్నాడు.

“సరే.. నిన్ను ఇప్పుడు నీ మొగుడు ఎవడి దగ్గరకి వెళ్లి గడిపి వచ్చావు.. అని అడిగితే ఏం చెప్తావ్?”.. ఆమెను బాధపెట్టాలని కాకుండా అడిగాడు విశ్వం.

“ఆడు ఎదవే కానీ ఎర్రి ఎదవ కాదు బాబు. తెలివొత్తె ఆడు సానా మంచోడు బాబు. ఈ ఎదవ.. ఒక్క నిమిసం నేను నేకుండా బతకనేడు.. ఆడు సచ్చేదాక.. నాను బతికుండాలి. నా మొగుడు సానా మంచోడు.”

ఎంకటలచ్చిమి గట్టిగా ఏడుస్తూ ఇంకా ఏదో చెప్పబోతోంది. ఇంతలో విలేఖరి విశ్వం సెల్ ఫోన్ రింగ్ అయింది.

“విశ్వం.. ఎనీ ఇన్ఫర్మేషన్..” ఎస్సై శ్రీధర్ కంఠం.. అటునుండి.

“సార్.. ఎంకటలచ్చిమి సానా మంచిది” విశ్వం చెబుతున్నాడు.

“ఓస్ ఇంతేనా?.. ఇంకా ఏదో సస్పెన్స్ స్టోరీ చెబుతావనుకున్నాను..” అటు నుండి ఎస్సై శ్రీధర్ నిరాశగా సెల్ ఆఫ్ చేశాడు.

ఇక్కడ.. విలేఖరి విశ్వం.. గాఢమైన శ్వాస తీసి వదిలి తను కూడా సెల్ ఆఫ్ చేసి కవరులో పెట్టుకున్నాడు.

బయట.. హోరున గాలి మొదలైంది.

పెద్ద శబ్దం చేసుకుంటూ ఉరుములు.. భూమి దద్దరిల్లేలా.. ఆకాశంనుండి హోరున కుంభవృష్టి మొదల యింది.

ఇంకా తన దగ్గర డబ్బు ఉన్న.. ఈసారి.. విశ్వం ఆమెకు డబ్బులు ఇవ్వలేదు. విశ్వమంత ఆలోచన చేయడం మొదలెట్టాడు.

‘ఆమె గురించి తను ఏమి చెయ్యగలడు. ఆమె జీవితాన్ని సరిచేయాలి.. బాగు చేయాలి. ఆమె జీవనం కాలసర్పాల మధ్యలో కదల లేకుండా ఉంది.. అవసరమైతే తను ఆ కాలసర్పాల మధ్య లోకి దూకి ఆమెను రక్షించాలి. అతలాకుతలమైన ఆమె జీవితానికి ఆమె మొగుడి జీవితానికి ఒక సులభమైన మార్గము చూపించాలి. చెయ్యాలి ఆమె కోసం ఏదో ఒకటి చేసి తీరాలి.. చేసి తీరాలి. ఈ వర్షం సాక్షిగా.. కాదు కాదు.. ఈ పంచభూతాల సాక్షి గా.. చేస్తాను’.. మనసులో అనుకున్నాడు విశ్వం. తన మీద తానే ఒట్టు వేసుకున్నాడు విశ్వం.

ఆ హోరుగాలికి ఇంచుమించు పూర్తిగా కిందకు ఒరిగి పోయిన ఆ పూరి గుడిసె.. క్రింద ఎంకటలచ్చిమి.. ఆమె మొగుడుతో పాటు విలేఖరి విశ్వం కూడా ఉండిపోయాడు.

Exit mobile version