[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
పిల్లలూ!
మనం విహారయాత్రలకి వెళుతుంటాం. అక్కడ కొంత మంది గైడ్లుంటారు. గైడ్ అంటే పాఠ్యపుస్తకానికి సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ కాదు. కొంతమంది వ్యక్తులు ఆయా ప్రదేశాలకి వెళ్ళినప్పుడు వాటి ప్రాధాన్యతను వివరిస్తారు. వారే గైడ్లు.
పక్షులలో కూడా గైడ్‍లు ఉంటాయి. వాటిలో ఒక గైడ్ తేనెతుట్టెలను వెదికి మనుషులకి చూపిస్తుంది. అదే హనీగైడ్ పక్షి.
ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశపు అడవులలో ఈ పక్షి నివసిస్తుంది. ఇది తేనెతుట్టె వుండే ప్రదేశాన్ని వెదికి తెలుసుకుంటుంది. తేనెతుట్టె కనపడగానే చాలా ఆనందంగా అరుస్తుంది. ఆ పక్షి యొక్క ఆనందపు అరుపులు వినగానే ఆ పక్షికి తేనెపట్టు కనిపంచిందని ఆటవికులకు అర్థమవుతుంది. వాళ్ళు పక్షి అరుపులకు ఈల రూపంలో సమాధానమిచ్చి దాని వెంట బయలుదేరి వెళతారు. పక్షి ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి ఎగురుతూ వెళ్ళి తేనెతుట్టెను చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తరువాత ఇంకా పెద్దగా అరుస్తుంది. ఈ అరుపులను బట్టి ఆ ప్రదేశాన్ని చేరుకుని తేనె తుట్టెను వెదికి – ఊడదీసి తేనెను తీసుకుంటారు. కొంచెం తేనెను తమ గైడ్ కోసం ఉంచి – అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ గైడ్ మిగిలిన తేనెతో పాటు – తేనెటీగల గుడ్లని-తేనెటీగలు తయారు చేసిన మైనాన్ని కూడా తింటుంది. ఈ విధంగా ఆదివాసులకి తేనెను చూపించి, వారికి తేనెను అందించి తన ఆకలిని కూడా తీర్చుకుంటుంది. మానవులకి పనికిరాని వ్యర్థ పదార్థాలని కూడా తిని ఆయా ప్రదేశాలను శుభ్రం చేస్తుంది.
ఈ పక్షిని చూసి మనం ఏం నేర్చుకోవాలి. ఒకటి నలుగురికీ ఉపయోగపడాలని, రెండు పరిసరాలని శుభ్రపరచుకోవాలని. అలా అని వ్యర్థపదార్థాలను తినకండేం. రోగాల బారిన పడతారు.