[మంజరి గారు రచించిన రెండు నవలల సమాహారమైన ‘హిట్ లిస్ట్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
మంజరి అనే కలం పేరుతో ప్రసిద్ధులైన శ్రీ గంధం నాగేశ్వరరావు గారు రచించిన రెండు డిటెక్టివ్/అపరాధ పరిశోధనా నవలలు – హిట్ లిస్ట్, టార్గెట్ నెంబర్ టూ లను డిటెక్టివ్ నవలా స్రవంతిలో భాగంగా ఒకే పుస్తకంగా ప్రచురించారు క్లాసిక్ బుక్స్ ప్రచురణలవారు.
‘హిట్ లిస్ట్’ నవల స్వాతి వారపత్రికలో సీరియల్‍గా వెలువడింది. ‘టార్గెట్ నెంబర్ టూ’ తొలుత స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది, ఆపై కన్నడంలోకి, సంస్కృతంలోని అనువాదమైంది.
ఈ రెండు థ్రిల్లర్స్ గురించి పుస్తకం వెనుక అట్ట మీద బ్లర్బ్ ఇచ్చేసారు. అవి చదివితే రెండు నవలల సారం తెలుస్తుంది. అందువల్ల నేను మళ్ళీ ఈ నవలల సమ్మరీని చెప్పే ప్రయత్నం చేయను. వాటినే ఇక్కడ వ్రాస్తున్నాను.
~
హిట్ లిస్ట్:
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రరిస్ట్ క్యాంపు నుండి విద్రోహ చర్యల కోసం ట్రైనింగ్ పూర్తి చేసుకున్న బిట్టూ భారత్ బయలుదేరాడు. అతనికి ముందుగా ఓ వ్యక్తిని చంపమని ఉత్తర్యులు ఇచ్చాడు క్యాంపు కమాండర్. బిట్టూ ఢిల్లీలో అడుగుపెట్టిన సంగతి తెలిసి ‘రా’ ఏజెంట్ వెంటపడ్డాడు.
విజయవాడలో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. హంతకుడ్ని పట్టుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెర్రరిస్ట్ విజయవాడ చేరుకున్నాడు తరవాత ఏం జరిగింది? ఊహకందని మలుపులుతో చక చకా చదివిస్తుంది ఈ నవల.
టార్గెట్ నెంబర్ టూ:
ఎవర్ గ్రీన్ ఖలిస్థాన్ ఉద్యమానికి జీవం పొయ్యాలని ముఖ్యమైన నాయకులు సమావేశమయ్యారు. జైళ్ళ నుంచి తమ నాయకుల్ని విడిపించడానికి, అంతర్జాతీయంగా భారత్ మీద ఒత్తిడి తేవడానికి అద్భుతమైన పథకం రూపొందించారు. ఆ పనికి యువకుడైన హర్భజన్ సింగ్‌ని ఎన్నుకున్నారు.
హైదరాబాద్ చేరుకుని అమెరికన్ రాయబారిని హతమార్చడానికి పథకం సిద్ధం చేసాడు హర్భజన్ సింగ్. చివరి క్షణంలో పథకానికి ఎవరో అడ్డు తగిలారు. అప్పుడు మొదలైంది గేమ్. అనూహ్యమైన కథనంతో, గుక్క తిప్పుకోనివ్వని సస్పెన్స్‌తో సాగే నవల ‘టార్గెట్ నెంబర్ టూ’.
~
ఈ రెండు సారాంశాలు వందశాతం సరైనవి. రెండు నవలలు చాలా ఉత్కంఠగా సాగుతాయి. ఒకటికి మించి మరొకటి అనుకోవాలి. మామూలుగా థ్రిల్లర్స్/పరిశోధనాత్మక నవలలు పాఠకులని ఆకర్షించాలంటే, వాటిలో ఏమేమి ఉండాలో ఒకసారి చూద్దాం.
వేగంగా చదివించే కథనం:
మంచి థ్రిల్లర్స్‌లో కథనం వేగంగా సాగుతుంది. తర్వాత ఏమవుతుందా అనే కుతూహలం పాఠకులలో నింపుతూ, త్వరత్వరగా పేజీలు తిప్పేలా చేస్తాయి. ఈ రెండు నవలలూ అలాంటివే.
మోటివ్:
ప్రతీ నేరానికి ఒక మోటివ్ ఉంటుంది. నవల చివరికి వచ్చే సరికి గానీ, మధ్యలో గాని ఆ మోటివ్ ఏమిటో పాఠకులకి అర్థమవ్వాలి. అట్టవెనుక బ్లర్బ్‌లో రెండు నవలలోని ఒక మోటివ్‌ని చెప్పారు. రెండు నవలల్లోనూ పారల్లల్‍గా సాగే మరో నేరానికి మోటివ్ ఏమిటో పాఠకులు గ్రహించేలా, తెలివిగా కథను నడిపారు రచయిత.
సస్పెన్స్, టెన్షన్:
మంచి థ్రిల్లర్స్ – పాఠకులలో ఉత్కంఠనీ, ఉద్వేగాన్ని పెంచుతూ, కథలో దాగి ఉన్న రహస్యాలనీ, సంభవించబోయే ప్రమాదాలను ఊహించేలా చేస్తూ, పాఠకులకు ఆసక్తిని కలిగించాలి. ‘హిట్ లిస్ట్’ నవలలో హంతకులు ఇద్దరా ఒకరా, సుబ్బారావు, స్థిరుడు ఒకరేనా ఇద్దరా? అనేది చాలా సస్పెన్స్‌గా ఉంటుంది. ‘టార్గెట్ నెంబర్ టూ’ నవలలో, కాదంబరిని కలిసి తిరిగి వెళ్తూ, ఈ కేసుని ఇక క్లోజ్ చేయవచ్చు అనుకుంటాడు భైరవ్. కానీ అలా జరగదు.
అనూహ్యమైన మలుపులు:
ఒక్కోసారి పాఠకులు ఊహింఛినట్టు కాకుండా, నేర్పరైన రచయిత, సంఘటనని మరో మలుపు తిప్పుతాడు. ఈ రెండు నవలలలో అటువంటి ఉదంతాలెన్నో ఉన్నాయి. ‘హిట్ లిస్ట్’ నవలలో శ్రీనివాసన్‍ని బిట్టూ షూట్ చేశాకా, బిట్టూని సుబ్బారావు ఎందుకు చంపాడన్నది చదువరులు ముందుగా ఊహించలేరు.
‘టార్గెట్ నెంబర్ టూ’ నవలలో, అమెరికన్ అంబాసడర్ జార్జ్ రిచర్డ్‌సన్‌ను చంపాలని ప్లాన్ చేసిన హర్భజన్ సింగ్ ప్రణాళిక పూర్తిగా అమలుకాకముందే, ఆ రాయబారిపై హత్యప్రయత్నం జరుగుతుంది. ఎవరో చేశారో పాఠకులకు చివరిదాక తెలియదు.
రెడ్ హెర్రింగ్స్:
తెలివైన పాఠకులను కూడా బోల్తా కొట్టించేలా మిస్‍లీడింగ్ క్లూస్ కొన్ని ఉంటాయి చక్కని థ్రిల్లర్స్‌లో. అలాంటివి ఈ రెండు నవలలోనూ కథలలో భాగంగా కలిసిపోయి ఉత్కంఠను మరింత పెంచాయి.
డిటేయిలింగ్:
మంచి థ్రిల్లర్స్‌లో డిటేయిలింగ్ ఉంటుంది. అంటే, చిన్న చిన్న విషయాలు, పెద్దగా పట్టించుకోని విషయాలను తెలివైన అధికారులు లేదా నేరస్థులు గుర్తిస్తారు. ఉదాహరణకి ‘హిట్ లిస్ట్’ నవలలో, సుబ్బారావుతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేయిస్తుంటాడు బిట్టూ. ఎంత వివరంగా చెప్పినా సుబ్బారావ్ టార్గెట్‌ని షూట్ చేయలేకపోతాడు, గురి తప్పుతుంది. అప్పుడు బిట్టూ, “నువ్వు ఫైర్ చేసినప్పుడు రైఫిల్ బేరల్ అంగుళంలో పదోవంతు క్రిందకి జరిగింది” అంటాడు. ఇలాంటి కీన్ అబ్జర్వేషన్స్ పాఠకులలో ఆసక్తిని పెంచుతాయి. ‘టార్గెట్ నెంబర్ టూ’ నవలలో, భైరవ్ అనే అధికారిని కలవడానికి రావల్సిన ఎస్సై శాతవాహనకి ఆలస్యం అవుతుంది. బండిలో పెట్రోల్ అయిపోయిందనీ, బంక్ దాకా తోసుకువెళ్ళడం వల్ల ఆలస్యమైందని చెప్తాడు శాతవాహన. “రిజర్వ్‌లో ఉంచాల్సిన లివర్, ఆన్‍లో ఉంచావా?” అని అడుగుతాడు భైరవ్. “మీకెలా తెలిసింది సార్?” అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు భైరవ్ చెప్పిన సమాధానం కేపబుల్ ఆఫీసర్స్ మైండ్ ఎంత షార్ప్‌గా ఉంటుందో చెబుతుంది.
అలాగే, ‘టార్గెట్ నెంబర్ టూ’ నవలలో హర్భజన్‍సింగ్ జార్జ్ రిచర్డ్‌సన్‌ను చంపేందుకు తెచ్చిన గన్ గురించి చెప్పిన వివరాలు.. ఆయా సందర్భానికి కొన్నిసార్లు డిటేయిలింగ్ ఎంత అవసరమో చెబుతుంది.
కథానాయకులు సూపర్ హీరోలు కాకపోవడం:
అపరాధ పరిశోధన ఎప్పుడూ ఒంటి చేతి మీద జరగదు. రకరకాల హోదాలలోని సిబ్బంది ఇన్‍వాల్వ్ అవుతారు. ఒక్కోసారి క్రింది స్థాయి సిబ్బందికి వచ్చిన ఆలోచన కావచ్చు లేదా రిటైరైన విశ్రాంత అధికారి ఇచ్చిన క్లూ కావచ్చు, కేసులో పురోగతికి దారి తీస్తాయి. కొన్ని సినిమాల్లో చూపించినట్టు అన్ని ఐడియాలు కథానాయకుడికే వచ్చి సూపర్ హీరోలా ఉండడం – మంచి థ్రిల్లర్స్‌లో ఉండదు. ఉదాహరణకి, ‘హిట్ లిస్ట్’ నవలలో, విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న మహిళల హత్యల విషయంలో ఏ ఆధారం దొరక్క, రిటైర్డ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ యుగంధర్ సలహా తీసుకుంటాడు భరధ్వాజ్. యుగంధర్ తన అనుభవం మీద ఎన్నో విషయాలు వివరిస్తారు. ఆయన రీజనింగ్‌కి భరధ్వాజ్ అబ్బురపడతాడు. మాటల్లో ఒక అద్భుతమైన క్లూ ఇస్తారాయన. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం, చంద్రమ్మ శరీరంలో ఇంద్రియం చాలా ఎక్కువ ఉందనీ, ఇలా రెండు సందర్భాలలో జరుగుతుందనీ, ఒకటి – ఒకరి కంటే ఎక్కువ మంది మానభంగం చేసినప్పుడు; రెండు జైలు నుంచి గాని మెంటల్ హాస్పిటల్ నుంచి గాని విడుదలైన మనిషి రతి చేసినప్పుడు గానీ అని చెప్తారాయాన. భరధ్వాజ్ ఆ క్లూ తో పరిశోధన కొనసాగించి హంతకుడిని కనుక్కుంటాడు.
కథాస్థలం టోపోగ్రఫీపై అవగాహన:
కథాస్థలాన్ని వర్ణిస్తున్నప్పుడు లేదా ఓ ఊర్లో నేరస్థుడిని పోలీస్ అధికారి వెంటాడుతున్నాడనో రాసినప్పుడు ఆ ఊరి లోని ఆ ఏరియా భౌగోళిక వివరాలపై రచయితకి పూర్తి అవగాహన కాకపోయినా కనీస అవగాహన ఉండాలి. అప్పుడే నవల చదువుతున్న పాఠకులలో ఆ ఊరివారు, ఆ వివరాలు చదివినప్పుడు తృప్తిగా ఫీలవుతారు. ఉదాహరణకి, ‘హిట్ లిస్ట్’ నవలలో, విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్ వద్ద స్థిరుడిని ఛేజ్ చేస్తుంటాడు భరధ్వాజ. స్థిరుడు మార్కెట్ స్టాప్ దగ్గర బస్ దిగి, గాంధీ స్కూలు వైపు అడుగులు వేస్తాడు. పోలీస్ స్టేషన్ వీధి దాటుతూ, భరధ్వాజ మోటర్‍సైకిల్ రావడం చూస్తాడు. అది వన్-వే రూట్ అవడం వల్ల భరధ్వాజ బైక్ మరో వీధి గుండా రావల్సి వస్తుంది. కాళేశ్వరరావు మార్కెట్ వద్ద వన్-వే అని తెలిసిన విజయవాడ వారికి లేదా ఆ మార్కెట్ ఏరియాలో బాగా తిరిగిన వారికి – రచయిత ఎంత అథెంటిక్‍గా రాసారోననిపిస్తుంది.
క్లిఫ్‍హాంగర్స్:
ఒక్కో అధ్యాయం ముగిసి, మరో అధ్యాయానికి మారేటప్పుడు గత అధ్యాయం చివర గాని లేదా సెక్షన్ల మధ్య గాని ఆసక్తికరమైన సంభాషణ గానీ, సన్నివేశం గాని రాసి, నవల చదవడానికి పాఠకులు తొందరపడేలా చేస్తారు మంచి థ్రిల్లర్ రచయితలు. ఇలాంటి వాటిని క్లిఫ్‌హ్యాంగర్స్ అంటారు. ఉదాహరణ, ‘హిట్ లిస్ట్’ నవలలో, 8వ అధ్యాయం చివరి పేరా, 13వ అధ్యాయంలో ఒక సెక్షన్ చివర సంభాషణలు. ‘టార్గెట్ నెంబర్ టూ’ నవలలో రాజీవ్ గాంధీ హత్యకేసుపై జరిగిన పరిశోధన గురించి శిక్షణ పొందుతున్న పోలీస్ అధికారులు చెబుతూ, ఆ సెషన్‌ని ముగిస్తూ భైరవ్ చెప్పిన మాటలు.
~
రచయిత పోలీస్ శాఖలో పనిచేయడం వల్ల రెండు నవలలలోనూ పరిశోధన అంతా పకడ్బందీగా సాగింది. ఎక్కడా అభూతకల్పనలు లేవు. రెండు నవలల్లోనూ ప్రధాన పాత్రల పేర్లు ‘భ’ అక్షరంతో ప్రారంభం కావడం యాదృచ్ఛికం కావచ్చు. మొదలుపెడితే, ఆపకుండా చదివిస్తాయీ రెండు నవలలు. సస్పెన్స్, థ్రిల్లర్లు రాయాలన్న ఉత్సాహం కల యువ రచయిత, రచయిత్రులకు ఈ పుస్తకంలోని రెండు నవలలు పాఠ్యాంశాలుగా ఉపయోగపడతాయి.
***
రచన: మంజరి
ప్రచురణ: క్లాసిక్ బుక్స్
పేజీలు: 312
వెల: ₹ 275/-
ప్రతులకు:
క్లాసిక్ బుక్స్
#32-13/2-3A, అట్లూరి పరమాత్మ వీధి
మొగల్రాజపురం,
విజయవాడ 520 010.
సెల్: 85220 02536
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/dp/B0B65JQK2C
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.