Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హిమాలయాలు పిలుస్తున్నాయ్!

[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘హిమాలయాలు పిలుస్తున్నాయ్!?’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

“ధనములలో గొప్పధనం విద్యాధనం! విద్యలలో గొప్ప విద్య ఆధ్యాత్మిక విద్య!” స్వామీ బ్రహ్మ విద్యానంద సరస్వతీ మారాజ్.

“ఏ యూనివర్సిటీలో అభ్యసించాలి స్వామీజీ?” అడిగాడు శాంతి రెడ్డి

“యూనివర్సిటీల్లో కాదు. చిన్మయా మిషన్ వారి సాందీపని విద్యాలయ, ముంబైలోగానీ, ఋషికేశ్ దయానంద ఆశ్రమంలోని ఆర్ష విద్యాపీఠం లోగానీ, కైలాష్ ఆశ్రమంలో గానీ, యోగ వేదాంత ఫారెస్ట్ అకాడమీ శివానంద ఆశ్రమం లోగానీ అభ్యసించాలి” చెప్పారు.

“ధన్యవాదములు స్వామీజీ!” శాంతి రెడ్డి.

***

ఆ రోజు 15/08/2016. స్వామి దయానంద ఆశ్రమం. స్వామీజీ జన్మదినం! స్వామిజీ సమాధి అయిన తర్వాత సంవత్సరo. ప్రపంచంలోని 50 మంది అదృష్టవంతులు సమావేశం అవుతున్నారు అక్కడ. వారంతా ఆ రోజు ప్రారంభించబోయే నాలుగు సంవత్సరాల వేదాంత కోర్సుకు ఆన్‌లైన్ టెస్ట్‌లో సెలెక్ట్ అయినవారు. ఇండియా లోని రాష్ట్రానికి ఒక్కరిని సెలెక్ట్ చేశారు. అలాగే ప్రతి దేశంనుండి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశారు. అయితే ఒక మినహాయింపు కూడా వుంది. నేనూ నా శ్రీమతి సువర్ణ కూడా కోర్సుకు సెలెక్ట్ కావడం ఒక వింత!

***

‘శ్రేయాంసి బహు విఘ్నాని’ అన్న శాస్త్ర వాక్యం నాకు బాగా వర్తిస్తుంది. నేను తలపెట్టిన ప్రతీ పనికి ఆటంకాలు కలిగించేవారు ఎక్కువైపోయారు. యాజమాన్యానికి నా మీద చాడీలు చెప్పే శేషాంబ, మాయాకుమారి, పచ్చగడ్డి లక్ష్మి, మామిడికాయల విషయంలో తమకు అన్యాయం జరిగిందనుకొనే నలుగురు స్టాఫ్ మెంబెర్స్, వీరిని ప్రోత్సాహించడానికి ఆశ్రమ కో-ఆర్డినేటర్, ఒరిజినల్ మిచ్చిఫ్ మేకర్ శ్రీమాన్ ఇళ్ల కృష్ణారావు, ట్రెజరర్ తఫానంద తోడయ్యారు. మా యాజమాన్యమునకు వున్న బలహీనత ఎవరు చాడీలు చెప్పినా వింటుంది, నిజానిజాలు తెలుసుకొనే ప్రయత్నం చేయరు. ఎవరి మీదా ఏ చర్య తీసుకోరు. నిజాలు కాదు నిర్లిప్తతే వారి విధానం!

నేను వేరు ఈ ప్రణవానంద సేవాశ్రమం వేరు అని ఏనాడూ భావించలేదు. రోజులో ఎక్కువ భాగం ఆశ్రమ సేవలో ఉంటున్న నాకు ఈ మధ్య ఇక్కడి రాజకీయాలకు చిరాకు కలుగుతుంది.

నాకు తెలీని మార్పుఏదో జరగబోతోందని అనిపిస్తుంది.

నన్ను నడిపించే వాని శాసనాన్నినేను పాలించాలి కదా?

మామిడి చెట్ల మొదళ్లకు సున్నం పూయించడం, బదనిక కట్ చేయించడం, గోశాలలో ఆవులు గచ్చుమీద జారి పడిపోకుండా గంట్లు కొట్టించడం అనే నా ప్రపోజల్స్ కో-ఆర్డినేటర్, ట్రెజరర్లు సంయుక్తంగా రిజెక్ట్ చేసి పడేసారు. రొంగలి వారూ, అద్దేపల్లివారు సొంత నిధులతో చేయించేయడానికి సిద్ధం అన్నారు. అది నాకు సబబుగా తోచలేదు.

నేను గోశాల, మామిడి తోట, స్టోర్, బాయ్స్ హాస్టల్, ఆఫీస్‌లో ఈమెయిల్స్ లాంటి సేవలన్నిటి నుండి స్వచ్చందంగా వైదలగుతున్నట్టు కాగితం రాసి నా దగ్గర పని చేస్తున్న నానీ చేత అధిష్టానానికి పంపించి ఫ్రీ అయ్యాను.

నా జీవితానికి ఈ ఆశ్రమమే ఆఖరి మజలి అనుకుంటూ నాలుగు సంవత్సరాలు గడిపేసిన నేను ‘వాట్ నెక్స్ట్’ అనే ప్రశ్నతో నిమిషాలు లెక్కపెడుతున్నాను. తిరిగి ఇంటికి, నా వ్యాపారం లోకి వెళ్లాలని లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు.

రష్యన్ సాహిత్యం తీసుకొని పేజీలు తిరగేస్తున్నాను. ఒక వాక్యం నాకు బాగా నచ్చింది. “నేచర్ ఈస్ నాట్ వాట్ యు థింక్! షీ హాస్ ఏ సోల్, షీ హాస్ ఫ్రీడమ్, షీ హాస్ లవ్, అండ్ షీ కెన్ స్పీక్!” నాకు స్వామి తత్త్వవిదానంద తరచూ వాడే “నేచురల్ థింగ్స్ హాపెన్స్ నేచురల్లీ” అన్న మాట గుర్తుకొచ్చింది.

మొబైల్ మ్రోగింది. లిఫ్ట్ చేశాను.

“హరిః ఓమ్! ఐయామ్ స్వామి బ్రహ్మ విద్యానంద సరస్వతి ఫ్రమ్ ఆర్ష విద్యాపీఠం, ఋషికేశ్, ఆర్ యు యన్. వి. శాంతి రెడ్డి?” అన్నారు.

“ఎస్ సార్! శాంతి రెడ్డి స్పీకింగ్.” అన్నాను.

“ఓకే! డోంట్ సే ‘సార్’ అగైన్. కాల్ మి స్వామి! యు హావ్ అప్లైడ్ ఫర్ లాంగ్ టర్మ్ వేదాంత కోర్స్. యాస్ ఏ ప్రాసెస్ అఫ్ ఇంటర్వ్యూ ఐ ఆస్క్ యు సం క్వశ్చన్స్, ప్లీజ్ గివ్ సింపుల్ ఆన్సర్స్” అన్నారు స్వామీజీ.

“ఎస్ స్వామీజీ!” అన్నాను వినమ్రంగా.

(సంభాషణ అంతా ఆంగ్లంలో)

“ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, విన్నా మనకు కనిపించేది వినిపించేది అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది తయారు కావడానికి మూల పదార్ధము ఏది? అంటే మట్టి నుండి కుండ పుట్టినట్టు!” స్వామీజీ ప్రశ్న.

“ఇసుమంత కూడా అనుమానం లేకుండా.. ఈ అజ్ఞానానికి కారణం వక్ర మార్గం పట్టిన విజ్ఞానమే!” చెప్పాను

“మంచి జవాబు!” అంటూ మెచ్చుకొని..

“నీవు కొడుకువా? భర్తవా? తండ్రివా?” అడిగారు.

“ఈ శరీరంలో ఉన్నంత వరకూ నేను ఒకరికి కొడుకుని, మరొకరికి భర్తను, ఇంకొకరికి తండ్రిని.. ఈ శరీరం విడిచి పెట్టేస్తే నేనంటే నేనే!” చెప్పాను.

“నీవు నిర్వహించే కర్మను ఎవరు నిర్దేశిస్తారు?” అడిగారు.

“నా నిర్ణయమే నిర్దేశిస్తుంది. యథా క్రతుర్భవతి తథా కర్మ కరోతి.” అన్నాను

“దేనిని ఆత్మ జ్ఞానం అనవచ్చు?” అడిగారు.

“నేను విన్న ప్రకారం దృశ్యాన్ని విషయంగా చేసుకోకుండా చేసే ధ్యానమే ఆత్మ జ్ఞానం అనవచ్చు.” చెప్పాను.

“శబ్దం.. మౌనం లలో ఏది మంచిది?” అడిగారు

“మౌనం” చెప్పాను.

“మేఘం యొక్క పయనానికి గమ్యం ఏమిటి?”

“ఆకాశం యొక్క హద్దుల్ని నిర్దేశించ లేకపోవుటే!”

“మౌనం అంటే?”

“శబ్దం లయం అయ్యే స్థానం.”

“అపరిగ్రహం అంటే?”

“దృశ్య స్వీకరణ నిరాకరణం”.

“నిరీహ అంటే?”

“దృశ్య చింతా నిరాకరణం.”

“స్వరూప అవస్థానం అంటే ఏమిటి?”

“ఏకాంతం.” చెప్పాను

“వెరీ గుడ్! వెల్ సెడ్!” అంటూ ప్రశంశించారు.

“తెలిసింది అన్నవాడు తెలియని వాడు!, తెలియలేదు అన్నవాడు తెలిసిన వాడు! ఎలాగో వివరించు.” అడిగారు.

“తెలిసింది అన్నవాడికి ఎంతో కొంత తెలియనిది వుంటుంది. తెలియలేదు అన్నవాడికి తనకు తెలియదన్న విషయం అన్నా తెలుసు. మొదటి వాడిలో దంభం వుంది. రెండో వానిలో నిజాయితీ వుంది.” చెప్పాను.

“ఆధ్యాత్మ శాస్త్రం ఎందుకు చదువు కోవాలనుకుంటున్నావు? ఏమిటి లాభం?” అడిగారు.

“ఎందుకంటే.. అధ్యాత్మ శాస్త్రం అనుభవ శాస్త్రమే గానీ బుద్ధిశాస్త్రం కాదు. దాన్నిబుద్ధికే పరిమితం చేసుకుంటే అది భుక్తికి పనికొస్తుందే గానీ ముక్తికి కాదు!” చెప్పాను.

“అత్యుతుడు అంటే ఎవరు?” అడిగారు.

“తన స్వరూప స్థితి నుండి జారని వాడు.” చెప్పాను.

“ఈ శరీరంతో నీ అవసరం తీరిపోతే దీన్ని ఏం చేస్తావ్?”

“ఇది నాకిచ్చిన పరమేశ్వరుడికే అప్పగించేస్తాను” చెప్పా.

“నిన్నూ, నన్నూ నీవెక్కడ చూస్తున్నావ్?” అడిగారు

“నా లోపల చూస్తున్నాను.” చెప్పాను.

“ఇంద్రియ నిగ్రహం యొక్కఆవశ్యకత ఏమిటి?” అడిగారు.

“ఇంద్రియ నిగ్రహం మనం గుమ్మం కదలనంత మాత్రం చేత వున్నట్టు కాదు. జగత్తును మన ఇంట్లోకి తెచ్చే సాధనాలు మన ఇంట్లో లేవా? మనో నిగ్రహం లేని వాడు అడవిలో వున్నా, ఆశ్రమంలోఉన్నా, ఇంట్లో వున్నా ఒక్కటే! ఇంద్రియ నిగ్రహం కలవాడికి తను వున్న తావు ఏదైనా తపోవనమే!” చెప్పాను.

“మీ దృష్టిలో సంసారం అంటే ఏమిటి?” అడిగారు.

“మీరే చెప్పండి స్వామీజీ?” వినమ్రంగా అడిగాను.

“నేను నాదీ అనుకోవడమే! ద్రష్టగా వుండాల్సిన వాడు దృశ్య స్వరూపునిగా అయ్యాననే బ్రాంతియే సంసారం!” చెప్పారు స్వామీజీ.

“మిష్టర్ రెడ్డి! ఆఖరి ప్రశ్న, ‘విద్యాతు రాణాం న సుఖం న నిద్రా’ అంటే ఏమిటి? అలాగే ‘కాంతా సమ్మితయా’ అంటే ఏమిటి?” అడిగారు.

“స్వామిజీ! మీ రెండో ప్రశ్నకి జవాబు ‘భర్తకు భార్యే చదవదగ్గ కావ్యం’ అని భావం. ఇక మొదటి ప్రశ్నకు విద్యార్థికి సుఖం మీద, నిద్ర మీదా ఆసక్తి ఉండరాదు అని భావం” చెప్పాను.

“వెరీ గుడ్! యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ లాంగ్ టర్మ్ వేదాంత కోర్స్. రియల్లీ యు ఆర్ ఆల్రెడీ ఏ వేదాంతిన్! యు రిపోర్ట్ యువర్ ప్రెజన్స్ ఆన్ ఆర్ బిఫోర్ 15-8-2016 ఎట్ స్వామి దయానంద ఆశ్రమం ఋషికేశ్. ఓకే! బై” అంటూ ఫోన్ కట్ చేసారు స్వామీజీ. ఎగిరి గంతులు వెయ్యాలనిపించింది. సంతోషం పక్కనే దుఃఖం ఉంటుందన్న సత్యం గుర్తొచ్చి కంట్రోల్ చేసుకున్నా!

సువర్ణ సంగతేమిటి? ఆర్ష విద్యాపీఠం వారి రూల్స్ ప్రకారం రాష్ట్రానికి ఒకరినే ఎంపిక చేసుకుంటారు. నన్ను ఎంపిక చేయడంతో ఆ ప్రాసెస్ పూర్తయి పోయింది. ఎలా?

నాలుగు సంవత్సరాలు విడిగా ఉండటమనేది వూహించ శక్యం కాని విషయం. ఈ వచ్చిన అవకాశన్ని విడిచి పెట్టేద్దామన్న నిర్ణయానికి వచ్చాను. ఇద్దరూ ఒకే చోట వుండే ప్రత్యామ్నాయాల గురించి మనసు ఆలోచిస్తుంది. తమ ఆశ్రమంలో ఉండమని వేల్పూరు రమణ నిలయాశ్రమం నిండి, అలాగే తమ గోశాల నిర్వహణ చూసుకోమని కేరళ ఆనంద ఆశ్రమం నుండి వచ్చిన ఆహ్వానాల గురించి మనసు ఆలోచిస్తుంది.

మనల్నినడిపించే వాని నిర్ణయం ఎలా ఉందో???

సాయంత్రం నాలుగు గంటలకు సువర్ణ మొబైల్ మోగింది.

“నేను సువర్ణను మాట్లాడుతున్నాను. ఎవరు ఫోన్ చేసింది?” అడిగింది తెలుగులో సువర్ణ.

“నేను స్వామి బ్రహ్మ విద్యానంద సరస్వతి ఆర్ష విద్యాపీఠం ఋషికేశ్ నుండి, మీరు వేదాంత కోర్స్‌కు అప్లై చేశారు కదా. టెలిఇంటర్వ్యూ చేయడానికి ఫోన్ చేస్తున్నాను” అన్నారు ఆంగ్లంలో.

“యు అర్ వెల్కమ్ స్వామీజీ” అంది సువర్ణ.

వింటున్న నాకు మతిపోయింది. ఏదో మిరకల్ జరగబోతున్న సూచనగా నా కుడి ఎడమ కళ్ళు రెండూ కలగాపులగంగా అదురుతున్నాయి!

“ఈనాడు దేశంలో నడుస్తున్న ఆశ్రమాలపై మీ కామెంట్?” అడిగారు.

“మార్కెట్ ప్లేస్ లోని దుకాణాలు” చెప్పింది దైర్యంగా.

“ఈనాటి స్వాములపై మీ అభిప్రాయం?” అడిగారు.

“అజ్ఞానము తొలగించి విజ్ఞానాన్నిపెంచాల్సిన సన్యాసులు ప్రజల్ని మూర్ఖులుగా, మొద్దులుగా తయారు చేస్తున్నారు. వారికి కావాల్సింది గతాన్ని తల్చుకొని బాధ పడేవారు. భవిష్యత్తును వూహించుకొని భయపడేవారు.” చెప్పింది సువర్ణ.

“ఈ పరిస్థితికి సన్యాసులే కారణమా?” అడిగారు.

“కాదు. కర్మ సిద్దాంతాన్ని సరిగా గ్రహించలేని మూర్ఖ ప్రజలు.” చెప్పింది.

“వివరించు?” అడిగారు.

“తాము అక్రమంగా ప్రోగు చేసిన సంపాదనలో కొంత ఆశ్రమాలలో అన్నదానానికి విరాళంగా ఇచ్చేస్తేనో, సన్యాసులకు, బ్రహ్మచారులకు దక్షిణగా ఇచ్చేస్తేనో, తాము చేసిన పాపాలలో కొంత భాగం పోతుందనే భ్రమలో వున్న మూర్ఖులు ఉన్నంత కాలం ఈ ఆశ్రమాలకు గాని, తామర తుంపరంగా వెలుస్తున్న టెంపుల్ కాంప్లెక్స్ లకు గానీ నిధుల కొరత ఉండదు. మా చిన్నప్పుడు సినిమా నటుల వెనకాల జనం ఎలా పడేవారో అలా ఇప్పుడు హైటెక్ సన్యాసుల వెంట పడుతున్నారు” వివరించింది.

“మీ దృష్టిలో మంచి సన్యాసులే లేరా?” అడిగారు.

“ఎందుకు వుండరు స్వామీజీ,! మహాత్ములు ఎప్పుడూ వుంటారు. వారు లేకపోతే ఈ జగత్తు తల్లక్రిందులై పోదూ? సికింద్రాబాద్, డైమండ్ పాయింట్ సర్కిల్ లో బ్రహ్మ విద్యాకుటీరంలో ఏమీ ఆశించకుండా వేదాంత పాఠాలు చెప్పేస్వామి తత్త్వవిదానంద (దయానంద శిష్యులు), తోటపల్లి కొండల్లోని శాంతి ఆశ్రమంలో వంటపని-పెంటపని సమానంగా భావించి ఆశ్రమ సేవ చేసే స్వామిని వినమ్రానంద సరస్వతి నాకు తెలిసిన మహాత్ములు.” చెప్పింది.

“మంచి వివరణ” అని ప్రశంసించి, “ఆశ్రమాలలోని భోజనశాలల పై మీ అభిప్రాయం?” అడిగారు.

“ఆశ్రమంలో అయినా హాస్టల్‌లో మెస్ అయినా రుచి పట్ల మనకు వుండే భ్రమను తొలగించేవి అయి ఉంటాయి. భోజన వైరాగ్యాన్నివంట పట్టించుకోవచ్చు. నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమానికి మేము వచ్చినప్పుడు ఇక్కడ మెస్‌లో మంచి రుచికరమైన సాత్విక ఆహారం వడ్డించేవారు, దరిమిలా ఆఫీసులో ‘ఒరిజినల్ మిచ్చిఫ్ మేకర్’ అని పిలవబడే చాడీల ఇళ్ల కృష్ణారావు ప్రవేశించి ఆశ్రమ వాతావరణాన్నేమార్చేసాడు. రజస్సు, తమస్సులు తప్ప సాత్వికత అనే మాటే వినిపించకుండా చేసాడు” వివరించింది సువర్ణ.

“బాడీ లాంగ్వేజ్ అంటే ఏమిటి?”

“మనకు తెలియకుండానే మనం స్పందించే తీరు.”

“తత్త్వం తెలియాలంటే?”

“అనుభవంతో మాత్రమే తత్త్వం బోధ పడుతుంది.”

“ప్రకటించబడని ప్రతిభ గురించి..”

“మూసి ఉంచిన పెట్టెలోని వజ్రం మెరవదు.”

“ఒక నది కాలంలో అంతమౌతుందా?”

“నది కాలం అనే సముద్రంలో కలిసిపోతుంది.”

‘శంకరగిరి మాన్యాలు అంటే ఏమిటి?”

“స్మశానాలు”

“అమ్మతో పోల్చదగ్గది ఏమైనా వుందా?”

“అమ్మ, ఆకాశం కవలపిల్లలు. విశ్వానికి రెండు గుండెలు.”

“ఈ లోకం గురించి నీ అభిప్రాయం?”

“లోకం అందమైనదే కాదు, అందరికీ గౌరవంగా కూడా జీవించే అవకాశం కూడా ఇస్తుంది.”

“వేదాంత విద్య యొక్క లక్ష్యం ఏమిటి? నీవు ఈ విద్య పూర్తి చేసి ఏమి చేస్తావు?”

“భౌతిక అవసరాలు తీరడం ఈ వేదాంత విద్యకు ప్రామాణికం కాదు. మన సనాతన సాంప్రదాయన్ని ముందు తరాలకు అందించడమే నా లక్ష్యంగా పెట్టుకుంటాను.” చెప్పింది సువర్ణ.

‘వెరీ గుడ్ సువర్ణా! కీప్ ఇట్ అప్! యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ లాంగ్ టర్మ్ వేదాంతా కోర్స్. యు రిపోర్ట్ యువర్ ప్రెజన్స్ ఎట్ స్వామి దయానంద ఆశ్రమం ఆన్ ఆర్ బిఫోర్ 15/8/16. దేర్ యు విల్ ఎక్స్‌పీరియన్స్ వెరీ టేస్టీ అండ్ సాత్విక ఫుడ్, ఐ గివ్ గారంటీ! విచ్ పార్ట్ యు బిలాంగ్స్ టు అరుణాచల్ ప్రదేశ్?” అడిగారు స్వామీజీ.

“అరుణాచల్ ప్రదేశ్ ఏమిటి స్వామీజీ నాది ఆంధ్ర ప్రదేశ్” అంది సువర్ణ.

“మరి.. మీ అప్లికేషన్‍లో ఆంధ్రప్రదేశ్ అని రాయకుండా ఏ.పి. అని రాశారు ఎందుకు?” అడిగారు.

“చాలా మందిలా అలానే రాయడం చిన్నప్పటినుండి నాకు అలవాటు” అంది సువర్ణ.

“ఓకే! ఇట్ ఈస్ మై మిస్టేక్! ఆంధ్రప్రదేశ్ కాండిడేట్ సెలక్షన్ ఈ ఉదయమే పూర్తయ్యింది. నేను మానేజ్మెంట్‍కు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకొని మీ సెలక్షన్ విషయం రీ-కన్‌ఫర్మ్ చేస్తాను. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాము. యదేవ భవతి తదేవ మంగళాయ!” అని ఫోన్ కట్ చేశారు.

నాకు బాగా అర్థం అయ్యింది. అకౌంట్స్‌లో రెండు తప్పులు చేస్తే ఒక ఒప్పు అవుతుంది. అలాగే ఇప్పుడు సువర్ణ ఆంధ్రప్రదేశ్‌కు బదులుగా ఏ.పి. అని రాయడం ఒక యాదృచ్ఛికమైన తప్పైతే, స్వామీజీ దాన్నే అరుణాచల్ ప్రదేశ్‌గా గ్రహించడం రెండో తప్పు. ఈ రెండు తప్పుల ఒప్పు వలన మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? వేచి చూడాల్చిందే! సస్పెన్స్ వీడే వరకూ టెన్షనే!

రాత్రి 8 గంటలకు సువర్ణ మొబైల్ మ్రోగింది. స్వామీజీ లైన్‌లో ఉన్నారు.

“ప్రణామ్ స్వామీజీ!” అంది సువర్ణ

“సువర్ణాజీ! కంగ్రాట్స్ యువర్ అడ్మిషన్ ఈస్ కన్ఫర్మెడ్ బై ది మానేజ్మెంట్. లక్కీగా అరుణాచల్ ప్రదేశ్ నుండి ఈ కోర్సుకు ఎవరూ అప్లై చేయలేదు. అందుకే ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు రెండు సీట్స్ కేటాయించారు. మీరు ప్రయాణపు ఏర్పాట్లు చేసుకోండి.” చెప్పారు.

“ధన్యవాదములు స్వామిజీ!” చెప్పింది

మా సమస్యకు చక్కటి పరిష్కారం దొరికింది!

తర్వాతి రోజు ఉదయమే బయలుదేరి నర్సీపట్నం వెళ్లి బెల్లంకొండ టూర్స్& ట్రావెల్స్ వద్ద విజయవాడ వరకూ 11/08/16 న సింహాద్రి ఎక్స్‌ప్రెస్ లోనూ, విజయవాడ నుండి హరిద్వార్ వరకూ మధురై- డెహ్రాడూన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లోనూ టికెట్స్ రిజర్వు చేసుకొని తిరిగి ఆశ్రమానికి వచ్చాక అద్దేపల్లివారికి, రొంగలి వారికి, బంగార్రాజుకు విషయం చెప్పాను. షాక్ అయ్యారు కానీ చాలా సంతోషించారు. సాయంత్రానికి ఆశ్రమం అంతా తెలిసింది. అందరూ అభినందించారు. ఒక్క ఇళ్ల కృష్ణారావు బాచ్ మాత్రం ఏడవలేక నవ్వుతున్నారు.

ఆ సోమవారం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వెళ్లి సాయంత్రం 4 గంటలకు డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి రెండు రాత్రులు ఒక పగలు ప్రయాణించి బుధవారం తెల్లవారు ఝామున 3 గంటలకు హరిద్వార్ స్టేషన్‌లో దిగాము. స్టేషన్ ఎదురుగానే వున్న ఉత్తరాఖండ్ బస్ స్టేషన్‌లో బస్ ఎక్కి గంటలో ఋషికేశ్ చేరుకొని ఆటోలో దయానంద ఆశ్రమం బయలుదేరాము. చంద్రబాగ్ పూల్, జీయర్ మఠం మీదుగా ముని కీ రేతి లోని సీషం ఝడిలో ఉన్న స్వామి దయానంద ఆశ్రమం చేరుకొని మా రాకను సెక్యూరిటీలో రిపోర్ట్ చేసాము. వారు మా పేర ‘ముని వాటిక’లో 184 & 186 గదులు రిజర్వు అయి వున్నాయని చెప్పారు. మేము ఆశ్చర్యపోయి “మేము దంపతులం. మాకు ఒక రూమ్ చాలు” అన్నాము. ఆశ్చర్యపోవడం వారి వంతయ్యింది. వారు ఈ విషయం ఆశ్రమ జనరల్ మేనేజర్‌కు ఇంటర్‌కామ్‌లో తెలియజేశారు.

మమ్మల్ని కూర్చోమన్నారు. ఐదు నిమిషాల్లో జి.ఎమ్. వచ్చారు.

‘నా పేరు గుణానంద రాయల్, జి.ఎమ్. ఒక భార్య భర్త కలిసి వేదాంత కోర్సులో జాయిన్ కావడం నా అనుభవంలో ఇదే మొదటిసారి. సంసారం లోంచి విడివడాలని బోధించే శాస్త్రాన్ని అభ్యసించడానికి సంసారంలో వున్న ఒక జంట రావడం” అన్నారు.

“ఒక భార్య భర్త కలిసుంటే మాత్రమే సంసారం కాదు. సంసారం అనే భావన, ఆసక్తి వుంటేనే ఆ సంసారం బంధిస్తుంది. శ్రీరామకృష్ణులు అన్నది గుర్తు తెచ్చుకోండి ‘సంసారంలో వుండు కానీ.. సంసారిగా ఉండకు. పడవ నీటిలో ఉండాలి కాని నీరు పడవలో ఉండరాదు’ అన్నారు” అని నేననగానే

“ఓకే మిష్టర్ అండ్ మిసెస్ శాంతి రెడ్డీ, యు అర్ హార్టీ వెల్‌కమ్ టూ ఆర్ష విద్యాపీఠం. మీరు లగేజ్ ఇక్కడ పెట్టి మెస్‍కు వెళ్లి కాఫీ గానీ టీ గానీ తీసుకొని తూర్పువైపున గంగా తీరంలో వున్న మన గంగాధరేశ్వరుని గుడిలో కూర్చోండి, మీకు పెద్ద రూమ్ ఒక గంటలో రెడీ చేయించి కబురుచేస్తాను.” అన్నారు.

అలాగే చేసాము. గంగా తీరంలో గుడిలో కూర్చున్నాక అనిపించింది. మా జీవితంలో జరిగిన ఈ అద్భుతం ఈ జన్మలోని సత్కర్మల ఫలితమా లేక పూర్వ జన్మల సుకృతమా? అని.

గంట తర్వాత జి. ఎమ్. నుండి పిలుపు వచ్చింది. మాకు ముని వాటికలో డబల్ రూమ్ నెంబర్ 185 కేటాయించారు. రూమ్ లోకి వెళ్లి చూసిన మాకు మతిపోయింది. అది ఒక ఆశ్రమంలో గదిలా లేదు. ఫైవ్ స్టార్ హోటల్ లోని డబల్ రూమ్‍లా వుంది. సకలసౌకర్యాలు వున్నాయి. ఫ్రెష్ అయ్యాము. ఉదయం 7-30 గంటలకు బ్రేక్‌పాస్ట్‌కు బెల్ కొట్టారు. డైనింగ్ హాల్‌కు వెళ్ళాము. పోహా (అటుకుల పులిహోర) చేశారు. చాలా బావుంది. స్వర్గం అంటే ఎక్కడో ఎప్పుడో కాదు ఇక్కడే! ఇప్పుడే! అనిపించింది.

లంచ్ టైం కు కొంత మంది విదేశీ విద్యార్డులు వచ్చివాటికలో రూమ్స్ అక్యుపై చేసుకున్నారు. ప్రాంగణం కళకళలాడిపోతుంది. మాకు ఒక ప్రక్కన 184 లో జున్ ఇషోబ్-జపాన్, మరో ప్రక్క 186 లో యూలియా సెంక్విచ్- బెలూరస్, 187 లో కత్రిన్ కుబ్బే- స్వీడన్, 188 లో దిమిత్రి పనాయిడిస్ – సైప్రస్, 189లో మార్టిన్-ఉరుగ్వే, 190లో డామిఎన్ క్లర్క్- ఆస్ట్రేలియా 183లో జ్ఞానమయానంద-కర్ణాటక, 182లో సచిత్-కేరళ, 181 లో తపన్ రజుర్ కర్-మహారాష్ట్ర, 180 లో రవీంద్ర కౌల్ – కాశ్మిర్, రూమ్స్‌లో చేరిపోయారు. అందరూ పిల్లలే! మేమిద్దరమే పెద్దవాళ్ళం. అందరూ మమ్మల్ని ‘మమ్మీ- డాడీ’ అంటున్నారు. మాకూ అలా పిలిపించుకోవడానికి ఆనందగానే వున్నది! ఒకచోట పోగొట్టుకొన్నది మరోచోట పొందుతామన్న మాట!!

మధ్యాహ్నం లంచ్ అందరూ కలిసి చేసాము. అది ఒక అందమైన అనుభవం!

సాయంత్రం గంగా తీరంలో చంద్రభాగ గంగలో కలిసే చోట ప్రారంభించి రామ్ ఝాల వరకూ గంగా తీరంలో విహరించాము. అది ఒక మధురానుభూతి! సాయంత్రం గంగా హారతిలో పాల్గొన్నాము.

తర్వాతి రోజు 14/08/16 టిఫిన్ టైంకు కోర్సులో చేరాల్సిన అందరూ వచ్చేసారు. ముని వాటిక అందమైన పక్షులు ఎగురుతున్న పూల తోటలా ముచ్చటగా వుంది!

ఉదయం పది గంటలకు అందర్నీఆఫీస్ దగ్గరకు రమ్మని మునివాటికలో నోటీసు అంటించారు. మేమంతా వెళ్లే సమయానికి అక్కడ రెండు ఏసీ బస్సులు రెడీగా వున్నాయి. మేమంతా వైట్ యూనిఫార్మ్స్ రెండేసి జతలు కొనుక్కోడానికి, షూస్ కూడా కొనుక్కోవడానికి ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున క్యాష్ ఇచ్చారు. దాతలు ఇచ్చే విరాళాలు ఈ విధంగా కూడా సద్వినియోగం చేసే ఆశ్రమాలు వున్నాయన్న మాట! షాపింగ్ అనంతరం ఋషికేశ్ లోని ఆశ్రమాల్లో ప్రముఖమైనవి చూపించడానికి గైడ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లన్ని స్వామీ బ్రహ్మ విద్యానంద వారి సూచన ప్రకారమే జరిగాయి. ఆ రోజు సాయంత్రం తర్వాతి రోజు కోర్స్ ప్రారంభ కార్యక్రమానికి సమాయత్తం చేయడానికి స్వామీజీతో సత్సంగము ఏర్పాటు చేయబడింది.

అందర్నీ ఎక్కించుకొన్న బస్సులు ఋషికేశ్ వీధుల్లో పరుగులు తీస్తున్నాయి. మా మనసులు అంత కంటే వేగంగా పరుగెడుతున్నాయి!!!

*** స్వస్తి***

Exit mobile version