[శ్రీ మల్లాప్రగడ రామారావు రచించిన ‘హతవిధీ!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“ఇక్కడున్నట్టు వచ్చేస్తాను”. అన్నారు శ్రీవారు.
“అంటే, ఎక్కడికీ వెళ్లరనేగా?” నవ్వు దాచుకుంటూ అడిగింది శ్రీమతి.
“కాదే. ఇలా వెళ్లి, అలా వచ్చేస్తాను”
“నాకు తెలుసులెండి. ఇలా సహకార బ్యాంక్ ప్రక్క నుంచి సముద్రతీరం వరకూ నడిచి, కృపాకర్ గారితో కబుర్లాడి, అలా పోలీస్ క్వార్టర్స్ మీదుగా, మొత్తానికి గంట దాటకుండా ఇంటికి వస్తారు. అంతే కదా”
“ఎంతమాట! నీ మాట లేకుండా గడప దాటననేగా ఈ దాష్టీకం.”
“తగ్గండి. ఎవరైనా వింటే నిజం అనుకోగలరు”
“ఇప్పుడు కొత్తగా అనుకోవడానికేముంది. ఏన్నాళ్ళు గడిచేలోగానే నీ దయవల్ల మీ వాళ్ళు, మా వాళ్ళు ‘పె.చా.మొ’ అన్న బిరుదు ప్రసాదించారుగా.
“మీరా పెళ్ళాం చాటు మొగుడు! అందరెదుటా ప్రదర్శించే మీ ఉత్తమ మొగుడు నటనలే నలుగురికీ తెలుస్తాయి కానీ, మిగతా సమయాల్లో నన్ను మీరు పెట్టే ఆరళ్లు వాళ్లకెలా తెలుస్తాయి”.
“ఆరళ్లు అంటే” అడిగింది ఆ గదిలోనే కూర్చుని, టి. వి. చూస్తున్న కూతురు.
“టీ.వీ. చూసుకోక, మా మాటలెందుకే నీకు” ముద్దుగా కసిరాడు నాన్న.
నవ్వాపుకుంటూ వంటింటి బాట పట్టింది భార్యామణి.
“మాటల మాటకేం తల్లీ! మీ నాన్న కథలు కూడా బాగా చెబుతారు. అలా చెప్పే కదా నన్ను వారితో ఏడడుగులు వేయించారు” వంటగదిలోంచే శ్రీమతి.
అమ్మనేది పూర్తిగా వినకుండానే, “కథ చెప్పు నాన్నా! కథ చెప్పు” అంటూ సోఫాలో తండ్రి పక్క చేరింది ముద్దుల పట్టి.
***
భర్త పేరు “వాసు” అని పిలవబడే వాసుదేవరావు. భార్య పేరు రుక్మిణి. ఒక్క వాసు మాత్రం ప్రేమ పొంగినప్పుడు మృదువుగాను, ఒళ్ళు మండినప్పుడు కటువుగాను “రుక్కు” అని పిలుస్తాడు.
కోపతాపాలతో నిమిత్తం లేకుండా రుక్మిణి మాత్రం భర్తని ఎప్పుడూ “ఏవండీ” అనే సంబోధిస్తుంది.
పట్టి నామకరణం ‘సీత’. తల్లి, తండ్రీ మాత్రం “తల్లీ! బంగారం!” అనీ, కొంచెం కోపం వస్తే, “అమ్మా! భూదేవీ” అనీ పిలుస్తారు.
ఇంక ఈ సెలవు రోజు సాయంకాలం సముద్రయ తీరాన మిత్రుడితో కబుర్లాడే అవకాశం లేదని తెలిసిన భర్త, తండ్రిగా మారి కథ మొదలెట్టాడు. సీత టీ.వీ. ఆపేసింది.
***
“ఒకసారి ఆఫీస్ పని మీద కాకినాడ వెళ్ళవలసి వచ్చింది. హోటల్లో దిగితే అయ్యే ఖర్చు చాలావరకు వాళ్ళే భరిస్తారు. కానీ ఫోన్‌లో ఈ విషయం చెప్పగానే, కాలేజీ రోజుల నాటి నా ప్రియ మిత్రుడు సుబ్బారావు..” మధ్యలో అడ్డుపుల్ల వేసింది పట్టి “మా ఫ్రెండ్ లక్ష్మీ వాళ్ళ నాన్నే కదా. వాళ్ళు మన వీధిలోనే ఉంటారు కదా!” కూతురు తెలివితేటలకి మురిసిపోతూ, అవునన్నట్టు బుర్ర ఊపి, కొనసాగించాడు వాసు.
“అవునమ్మా! అప్పుడు నువ్వు బుజ్జితల్లివి. సుబ్బారావు మామయ్య బదిలీ మీద మూడేళ్లు ఆ ఊర్లో కాపురం పెట్టాడు. నేను హోటల్ మాట ఎత్తగానే వాడు ‘ససేమిరా’ అన్నాడు “
“అంటే” కళ్ళతోనే అడిగింది సీత.
“అంటే అలా ఎంత మాత్రం కుదరదని అర్థం బంగారం!’ అని వివరించి, మళ్లీ కథలోకి వచ్చాడు వాసు.
“మిత్రుడి ఇల్లు సౌకర్యంగా ఉంది. మూడు పడక గదులున్నాయి.”
“ఊ! నీకు గెస్ట్ రూమ్ ఇచ్చారన్నమాట” అంది పట్టి.
“మా తల్లికి ఎంత తెలివో!” మురిసిపోయింది వంట చేస్తూనే ఇటు వైపు ఒక చెవి ఉంచిన రుక్కు.
“అవునమ్మా!” అంటూ కథ కొనసాగించాడు.
“సుబ్బారావు భార్య విమల వంటలు బాగా చేస్తుంది. ఆ ఉదయం నోట్లో వేస్తే కరిగిపోయే ఇడ్లీలు నాలుగు, కమ్మటి కొబ్బరి పచ్చడితో లాగించి, ఆఫీసుకు బయలుదేరా. మధ్యాహ్నం హోటల్ భోజనం ఏదోలా ఉంది. ‘సరే, రాత్రి సుబ్బారావు ఇంట్లో రుచికరమైన భోజనం చేయవచ్చు కదా’ అనుకున్నాను.
మళ్లీ వంటింట్లోంచి ఆటంకస్వరం. “తల్లీ బంగారం! మీ అమ్మ తప్ప ఎవరు వంట చేసినా మీ నాన్న లొట్టలు వేసుకుంటూ తింటారు.”
బంగారం నవ్వుతూ నాన్న వైపు చూసి “చెప్పు” అంది.
శాంతించిన నాన్న మళ్లీ కథలోకి వచ్చాడు.
“మీ అమ్మ చెప్పినట్టే వంకాయ కొత్తిమీరకారం కూర, గోంగూర పచ్చడితో భోజనం. ఇష్టంగా తిన్నాను. ఐతే, తేడా కనబడింది. కూరా, పచ్చడీ సుబ్బారావు కంచంలో ఎక్కువా, నా కంచంలో తక్కువా వడ్డించినట్టనిపించింది.”
మళ్లీ వంటింటి జోక్యం. “ఎంతైనా మొగుడు కదా! కొందరు బయటపడతారు. నాలాంటి వాళ్ళు బయట పడరు.”
“అమ్మా! చెప్పనీయమ్మా నాన్నని”. కసురుకోవడానికి కొంచెం తక్కువగా తల్లితో కూతురు.
మళ్లీ కథలోకి వచ్చాడు వాసు.
“ఎన్నెన్ని కబుర్లో చెప్పుకుని ఏ రాత్రికో నిద్రపోయాం నేనూ, సుబ్బారావు.
మర్నాడు పలహారాలప్పుడు వాడి కంచంలో మూడు, నా దాంట్లో రెండు పెసరట్లు పడగానే రాత్రి వచ్చిన సందేహం బలపడింది. సుబ్బారావు తలపైకెత్తకుండా పెసరట్లు లాగిస్తున్నాడు. అయితే మీ అమ్మ ఏమనుకుంటే అనుకోనీ, ఆ పెసరట్ల రుచి అమోఘం. ఆ మాటే అన్నాను ఆంటీతో”
‘రుచిదేముందండి అన్నయ్యగారు! ఆకలితోవున్న ప్రాణికి ఇంత తిండి పెడితే పుణ్యమే కదా!’ అంది ఆంటీ. సుబ్బారావు నేల చూపులు చూస్తున్నాడు.
కార్యాలయానికి బయలుదేరడానికి సిద్ధమవుతూ సూట్ కేస్ సర్దుకుంటుంటే, నాకిచ్చిన గదిలోకి వచ్చిన సుబ్బారావు ‘అదేంట్రా’ అన్నాడు. “ఏం లేదురా! రాత్రి ఫోన్ వచ్చింది. మా జోనల్ ఆఫీసర్ రేపు వస్తున్నారంట. వారితో పాటు నేను కూడా ఉండాలి” అన్నాను. వాడేమీ మాట్లాడలేదు. నా బస హోటల్ కి మారింది.”
“ఇందులో కథేముంది నాన్నా!” అడిగింది సీత.
“ఉందిలే బంగారం! ఊరికే మొదలెడతారా మీ నాన్న” అంటూ వంటింట్లోంచి హాల్లోకి రుక్మిణి ప్రవేశించింది.
“అమ్మా!” అని ఉరిమింది కూతురు.
“మీ తండ్రి కూతుర్ల మధ్య నేనెందుకులే” అంటూ వంటింట్లోకి సాదాగా నిష్క్రమించింది రుక్కు. అలాంటి సందర్భాలలో ముక్కు, మూతీ విరవాలని తెలియక.
మళ్లీ కథలోకి వచ్చాడు వాసు.
“ఇందులో అసలు కథ ఏమిటంటే, ఆంటీ ఇప్పుడు అప్పటి ఆంటీ కాదు. రోజూ ఉదయం వాకింగ్‌కి వెళ్తానా.” తలాడించింది తనయ.
“ఆ మధ్య మనింట్లో ఆ పనీ, ఈ పనీ చేయడానికి ఎప్పుడు పిలిచినా వస్తాడే వెంకన్న” (ఈసారి తనయ కళ్ళు కూడా మెరిసాయి) కనబడ్డాడు. ఎప్పటిలాగే ఎవరో తరుముకొస్తున్నట్టు నడక, ఒక చేతిలో క్యారియర్. ‘ఇవాళ మన వీధిలో పనికి ఎవరైనా పిలిచారా’ అని అడిగాను.”
“ఇమలమ్మగారండి. ఆ అమ్మకి మొక్కలంటే బలే ఇస్టం కదండీ. తోట పనుందంటే ఎళ్తన్నాను” అన్నాడు.
“ఔను. ఔను. మొక్కలంటే భలే ఇష్టం ఆంటీకి.”
మళ్లీ వంటింట్లోంచే. ఈసారి తిరస్కార స్వరం. “కొందరికి వార్తాపత్రికలే లోకం. పెళ్ళాళ్ళ ఇష్టాయిష్టాలు పట్టవు”
“నువ్వుండమ్మా!” పట్టి విసుగు. నవ్వు దాచుకుంటూ తండ్రి కొనసాగింపు.
“మళ్లీ మర్నాడు అదే వేళకు వెంకన్న కనబడ్డాడు తల్లీ! కానీ చేతిలో క్యారియర్ లేదు”
“మరి అన్నం”
“నేనూ అదే అడిగాను బంగారం! వెంకన్న ఏమన్నాడో తెలుసా! ‘ఇవలమ్మ గారు ఆరింట్లో పనున్న నాల్రోజులూ కారేజీ ఒద్దన్నారండి. ఆరింట్లోనే వన్నం తినమన్నారండి’ అన్నాడు.”
“ఆంటీయే!” ఆశ్చర్యంతో పెద్ద కళ్ళ బంగారం కళ్ళు మరింత పెద్దవయ్యాయి.
“అవునమ్మా! మనుషులెలా మారవచ్చో చెప్పడానికే ఈ కథ చెప్పానమ్మా.” అంటుండగానే..
జిగ్రీ దోస్త్ సరళ రావడంతో పట్టి అమ్మా నాన్నలకి బై చెప్పి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది.
వంటపని ముగించుకుని, తీరిగ్గా పతిదేవుడు సరసన చేరింది సతీమణి. ఉపోద్ఘాతంగా “మీకు అసలు బుర్ర లేదు” అని వక్కాణించింది.
“అందుకే కదా నిన్ను చేసుకున్నాను.” వాసు.
“బుర్ర లేకపోయినా పెడబుర్ర ఉంది కదా! చెప్పింది వినండి. పిల్ల ముందు ఎందుకని చెప్పలేదు. నిన్న సాయంకాలం షాపుకి వెళ్తుంటే వెంకన్న కనబడ్డాడు. పలకరింపుల తర్వాత, అతని దిగులు ముఖం చూసి “ఏమైంది వెంకన్నా” అని అడిగాను.
“ఏటి సెప్పమంతారమ్మా! ఎంకన్నా కారేజీ తెచ్చుకోవద్దు అంటే, సంబరపడిపోనాను. ఇయ్యాల నాలుగు రోజుల కూలీలో రెండొందలు తక్కువిచ్చారమ్మా!” అన్నాడు ఏడుపే తక్కువగా.” భారంగా ముగించింది రుక్మిణి.
కాసేపటికి తెప్పర్లిన వాసు నోటంట ఒక్కటే మాట వచ్చింది “హతవిధీ!”