[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘హరిచరణ స్మరణ పరాయణ శ్రీ నారాయణతీర్థ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 4వ భాగము.]
భామాకలాప రచన
సిద్ధేంద్రయోగి వ్రాసిన భామాకలాపానికి మార్పు చేర్పులు అనేకం జరిగాయి.
“భామనే సత్యా భామనే
భామరో! శృంగార జగదభిరామనే, ముఖవిజిత
హేమా! భామనే, ద్వారకాపురాధుని రామనే, వయ్యారి సత్యా..”
ఇది సిద్ధేంద్రయోగి మూలం. దీనికి ఆకివీడు గ్రామ నివాసి శ్రీ మంగు జగన్నాథ పండితుడు ఇలా మార్పులు చేశారు:
“భామనే సత్యా భామనే
వయ్యారి సత్యా భామనే
భామనే పదియారు వేల
కోమలులందరిలోన
రామరో! గోపాలస్వామికి, ప్రేమధామమైన ముద్దుల భామ”
సిద్ధేంద్రయోగి వ్రాసిన చాలా దరువులను తాను మార్పు చేసినట్టు మంగు జగన్నాథ పండితుడు స్వయంగా వ్రాసుకున్నారు.
నారాయణతీర్థులు మేలట్టూరు వారికోసం వ్రాసి ఇచ్చిన పారిజాతాపహరణం కావ్యంలోని సత్యభామని సిద్ధేంద్రయోగి పెంపు చేసి భామాకలాపంగా అభివృద్ధి చేశాడని మరికొందరు చెప్తారు. తెలుగు ‘పారిజాతాపహారం’ అనేది నారాయణతీర్థుల యక్షగాన రచన కాగా, పారిజాతాపహరణం సంస్కృత రచన సిద్ధేంద్రయోగిదని పండితులు నిర్థారించారు.
“చల్లపల్లి ముక్త్యాల సంస్థానములను
పండితాఖండలుండయి ప్రతిభఁ జూపి
మహితనాట్యప్రబంధ నిర్మాతయగుచుఁ
బారిజాతాపహరణంబు వ్రాసెఁ గృతిని”
అని విశ్వనాథవారు చల్లపల్లి ముక్త్యాల సంస్థానాలలో పండితుల సమక్షంలో ప్రతిభ చూపించి, నాట్యప్రబంధంగా ఈ పారిజాతాపహరణాన్ని వ్రాసినట్టు పేర్కొన్నారు.
నారాయణతీర్థుల వారికి వసారాలో పడుకునీ కళ్ళుమూసుకుని తరంగాలు పాడుకునే అలవాటు ఉండేది. ఆయన పాటలకు మైమరచిన బాలకృఘ్ణడొచ్చి, తీర్థులవారి బొజ్జ మీదెక్కి ఆనందతాండవం చేసేవాడు. తాండవ కృఘ్ణడి ఈ నృత్యం రోజూ శిష్యుడు సిద్ధయ్య చూస్తూనే ఉన్నారట! తెల్లారి ఆ తాండవం ఎలా ఉందో గురువుగారికి అభినయించి చూపేవాడట!
“ఎంత అదృష్టవంతుడివి.. బాలగోపాలుడు నాకు కనపడడేవిటో..!” అని కళ్ళు తుడుచుకునీ, “ఈసారి కృఘ్ణడు కనబడితే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో..” అన్నారట. కృష్ణుడు నాకు కనిపించలేదంటే తీర్థులవారు అంధుడని వ్రాసేశారు కొందరు.
ఆ రాత్రి బాలకృఘ్ణడు కనపడగానే సిద్ధయ్య, “జగద్గురూ! మా గురూగారికీ, నాకూ మోక్షం ఎప్పుడు?” అనడిగాడు
“నా దర్శనం అయ్యిందిగా..! నీకు మోక్షం ఈ జన్మలోనే, నీ గురువుకు మాత్రం మరో జన్ముంది!!” అన్నారట.
“బాల గోపాల కృష్ణ పాహిపాహి/నీలమేఘ శరీరా నిత్యానందం దేహి” అంటూ తీర్థులవారు అది వినంగానే, సంబరపడిపోయారు. కైవల్యపథం చేరేందుకు ఇంక ఒక్క జన్మే మిగిలి ఉందని తెలిసి.. అలాగే, తన శిష్యుడు తన కన్నా పుణ్యాత్ముడని తెలిసీ..!!
“ఆలోకయే శ్రీ బాల కృష్ణం-సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం ||ఆలోకయే||
చరణ నిక్వణిత నూపుర కృష్ణం-కర సంగత కనక కంకణ కృష్ణం ||ఆలోకయే||”
అని, ఆయన మనసు ఆనందంతో తాండవం ఆడింది. కూచిపూడి కళాప్రదర్శనలో ప్రదర్శించే నారాయణతీర్థుల జనరంజక తరంగాలలో ఇవి రెండూ ముఖ్యమైనవి.
“గోవర్ధన గిరిధర గోవింద / గోకులపాలక పరమానంద
శ్రీ వత్సాంకిత శ్రీ కౌస్తుభధర / భావక భయహర పాహి ముకుంద”
“పాహి పాహి మాం పరమకృపాళో-దేహిమే త్వయి దేవసుభక్తిమ్॥
అసురసంహార శ్రీవిజయగోపాల-అమరసంరక్షణ విజయగోపాల”
“నందనందనం నిజభక్త-చందన మాకలయ॥
నందాదిమునీంద్ర భావ్యా-నంద మాళి కలయ॥”
“నంద యశోదా నందన కృష్ణ -ఇందువదన శ్రీ కృష్ణ
కుందరదన కుటిలాలక కృష్ణ మందస్మిత శ్రీ కృష్ణ”
“పూరయ మమ కామం గోపాల – పూరయ మమ కామమ్॥
వారంవారం వందన మస్తుతే -వారిజ దళ నయన గోపాల॥”
“ఏహి ఏహి విజయగోపాలబాల- పాహీహ మాం పాలయ లోకపాల” ఇలా ఒకటేమిటీ శ్రీకృష్ణలీలాతరంగిణిలో ప్రతీ కీర్తన దేశీయుల్ని పులకింపచేస్తుంది.
తమిళనాడుకు వెళ్ళబోయేముందు ఆయన ఎందరికో ఈ తరంగ గానంలో శిక్షణ ఇచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి, సింగరాయ కొండ పరిసరప్రాంతాలలో 60 గ్రామాలలోని వారికి ఈ తరంగాలలో స్వయంగా శిక్షణ ఇచ్చారని మన పండితులు భావిస్తున్నారు. సరళ సంస్కృత భాషలో ఎంతో సుందరంగా, సంగీత రసం చిందించే ఈ తరంగాలు బాగా విని, చాలామంది నేర్చుకుని పాడి ప్రచారం చేశారు.
తెలుగువారు-రాధ
చింతలపూడి యెల్లనార్యుడు ‘రాధామాధవం’ అనే కావ్యాన్ని వ్రాసి కృష్ణదేవవరాయల మెప్పు పొందినట్టు, రాధామాధవ కవిగా ప్రసిద్ధిపొందినట్టు తన కావ్యంలో వ్రాసుకున్నాడు.
లక్ష్మీనారాయణులు వైకుంఠంలో ఉన్నప్పుడు లక్ష్మికి రామావతారం ఒక్కసారి గుర్తుకు వచ్చిందిట. ఆ దివ్యమంగళ దేహునితో మరొక్కసారి క్రీడించాలని ఆమెకో కోరిక కలిగి, అది నెరవేరే ఉపాయం చెప్పవలసిందిగా తన అన్నగారైన పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. శివుడు విష్ణువుని కలిసి కృష్ణావతారం ధరించబోతున్నావు కాబట్టి ఆ అవతారంలో లక్ష్మీదేవి ముచ్చట తీర్చమని సూచిస్తాడు. విష్ణువు లక్ష్మీదేవిని గోకులంలో అవతరించవలసిందిగా సూచించాడు. బృందావనం సమీపంలో సహస్రగోపుడనే రాజుగారి ఇంట పుట్టింది. ఆమె పేరు రాధ. సఖీ జనం ద్వారా కృష్ణుడి సౌందర్యం గురించి రాధకి, నారదుడి ద్వారా రాధ సౌందర్యం గురించికీ తెలిసి ఇద్దరూ ఒకరికొకరు ఆకర్షితులౌతారు. సహస్రగోపుడు తన కూతురికి స్వయంవరం ప్రకటించి రాజా మహరాజులకు ఆహ్వానాలు పంపుతాడు. రాధ కృష్ణుని వరిస్తుంది. రాజు లందరూ కృష్ణుని ఎదిరిస్తారు. రాధ అన్న భద్రుడు కూడా ఎదిరిస్తాడు. కృష్ణుడు అందరినీ ఓడించి రాధను దక్కించుకుంటాడు. ఈ కావ్యం అంతా రుక్మిణీకళ్యాణాన్ని అనుసరించి సాగుతుంది.
ఈ కావ్యం వెలువడేనాటికి ఒరిస్సాలో చైతన్య మహాప్రభు ఉద్యమం బలంగా సాగుతోంది. ఆయన తెలుగునేలపైన పర్యటించాడు.
రాజమహేంద్రవరంలో గజపతుల రాజప్రతినిధి రాయరామానంద చైతన్య మహాప్రభు భక్తుడయ్యాడు. ఆయన్ని అనేకమంది తెలుగు ప్రముఖులు అనుసరించారు. ఈ ప్రభావం అంతా బహుశా చింతలపూడి యెల్లనార్యుడిపైన ఉండవచ్చు. రాధామాధవం కృతి దానిఫలితంగా అవతరించి ఉంటుందని సముద్రాల వెంకట రాఘవాచార్యులవారు భావించారు. కానీ, “చైతన్యరేఖ లద్దానిలో జొనుపుటకు వెనుకాడెనని తోచుచున్నది” అని వ్రాశారాయన. చైతన్యమహాప్రభు ప్రభావం తెలుగువారి మీద ప్రసరించిన తొలి దశగా ఈ కావ్యాన్ని భావించవచ్చు. ఇది బహుశా క్రీ.శ. 1515 ప్రాంతాలనాటి సంగతి.
“తల్లికిఁదండ్రి కన్నలకుఁ దమ్ములకున్ దెలుపంగరాని నా
యుల్లముగుట్టు గోప్య మిపుడుద్ధవ! నీకు వచింతు రాధ కే
నల్లుఁడనంచు రాధ మఱి యత్త యటంచుఁ బ్రసిద్ధి యుండఁగాఁ
జెల్లుగ మాకు నిద్దఱికిఁ జేరిక యేగతిఁగల్గు జెప్పుమా!”
అని ఉద్ధవుడితో రాధ చెప్తుందీ కావ్యంలో
“ఉత్తర భారతదేశమున రాధాకృష్ణులు ప్రకృతి పురుషులుగా స్తుతింపఁ బడుదురు. శ్రీ కృష్ణమూర్తికి రాధాదేవి మేనత్త యగునని దక్షిణ భారతదేశమునఁ బ్రతీతిగలదు. ఈ ప్రతీతి కాకరమేదో తెలియలేదు” (గంటి సూర్యనారాయణ శాస్త్రి సంపాదకులు)
“..లేనెఱుఁగుదు నాదు మర్మ మెఱుఁగును రాధా/మానవతి లోకులెవ్వరుఁ
గానరు మా మనసు మర్మకర్మము లరయన్”
అని కృష్ణుడన్నట్టు “శృంగార రాధామాధవ సంవాదము” వెలిదిండ్ల వేంకటపతి మహాకవి వ్రాస్తారు.
“పల్లెతావుల నున్న గొల్లదానిని దెచ్చి నవవిధానము లందు నిలిపినావు
చెలఁగి రాధామాధవుల చెల్మి పాయక బిదుదైన కీర్తిఁగల్పించినావు
ప్రౌఢలైన కిరీటపతుల కన్నెలమాని ననుఁ బ్రాణపదముగా నడపినావు
సకల విద్యారహస్య్మౌ లెఱుంగఁగజేసి దేహమానంద మొందించినావు
నేడు నాపాలిదైవంబు నీవె యనినఁ
జాల దీమాట నామహోత్సాహమునకు
నెంత సంతోషపడెదనో యెఱుకలేదె?
మొదటి కిటు చేయు సర్వఙ్ఞమూర్తివీవు”
అంటుంది రాధ కృష్ణుడితో.
ఆ తరువాత రాధ పేరుతో వెలువడిన ప్రసిద్ధ గ్రంథం రాధికా సాంత్వనం. దీని కవయిత్రి ముద్దుపళని (1730-1790) తంజావూరు నేలిన మరాఠ రాజు ప్రతాపసింహ భోగపత్ని. దీనికే ఇళాదేవీయం అనే పేరు కూడా ఉంది. దీంట్లో మితిమీరిన రతివర్ణనల కారణంగా కవిపండితులు దీన్ని అంగీకరించలేదు. బ్రిటిష్ ప్రభుత్వం చేత నిషేధింపచేశారు. బెంగుళూరు నాగరత్నమ్మగారు ఈ విషయమై గట్టి పోరాటమే చేసింది. టంగుటూరి ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ నిషేధం ఎత్తివేయించాడు.
సముద్రాల వెంకట రాఘవాచార్యులవారు “ప్రాచీన సంస్కృత వాఙ్మయమున ఆ పాత్ర యెట్లు పోషింపబడినది తెలుసుకొనుటకు ఆమె ప్రయత్నింప లేదు. సాధారణముగా నామె కాలమునాటికి లోకులు చెప్పుకొనుచున్న కొన్ని జనశృతుల నాధారముగా నుంచుకొని యామె ఈ కావ్యము రచింపబూనుకొనెను. అది ప్రబంధమగుటచేత దానిలో నామె ఉపయోగించికొన్న పాత్ర నామములను గురించి విచారించుటామె కవసరము లేకపోయెనేమొ? ఇక నది శృంగార ప్రబంధమైనపుడు, తన పోషకుడగు రాజు కుల్లాసము కల్పించుట కట్టి కావ్యము వ్రాయుచున్నప్పుడు పాత్రౌచిత్య విచారణము మాత్రమేం అవసరపడియుండును. ఈ కావ్య సృష్టిలో రాధ పాత్రకు సంఘటిల్లిన యథః పతనము ఇంతింతయని చెప్పరానిది” ఇలా ఆగ్రహించారు.
ఆయన ధర్మాగ్రహం అర్థం చేసుకోదగినది. చైతన్యమహాప్రభు నుండి పొందిన రాధామాధవ తత్త్వాన్ని పచ్చి శృంగారానికి మళ్ళించటం వలన ఆ మహా ఉద్యమానికి చెరుపు కలిగినట్టు బావించారాయన. రాధాకృష్ణుల వ్యక్తిత్వాలలోని వైశిష్ట్యాన్ని, తత్త్వాలలోని వైలక్షణ్యాన్ని, ఆదర్శమూర్తిమత్వాన్ని ఎరుకపరచటమే తీర్థులవారి లక్ష్యంగా కనిపిస్తుంది.
శ్రీకృష్ణ తత్త్వాన్ని జీర్ణించుకున్న మండపాక పార్వతీశ్వరకవి తన ‘రాధాకృష్ణ సంవాదము’ అనే కావ్యంలో తన ఉపాసనను యిలా ఆవిష్కరించాడు. “మురళి ప్రణవంబు గోపికలు ముక్తజశము గోగణంబు చిరంతన గోగణంబు రాధ మూల ప్రకృతి లక్ష్మి బ్రహ్మవిద్య కృష్ణు డానందమయ తత్త్వమిదె నిజంబు” కృష్ణుడు ఆనందమయ రూపం, లక్ష్మి బ్రహ్మవిద్యా జ్ఞానం, రాధ ప్రకృతి స్వరూపం, గోపికా సమూహము ముక్తిజనం అని శ్రీకృష్ణతత్త్వానికి ఆయన నిర్వచనం ఇచ్చారు. శ్రీకృష్ణలీలల స్వరూప స్వభావాలను అర్థం చేసుకోలేని నవనాగరికులకు గోపికావస్త్రాపహరణం అసహ్యమని పిస్తుంది. కాని నారాయణతీర్థులవారి కీర్తన విన్నప్పుడు, అందులోని అంతరార్థం అవగతం అవుతుంది. గోపికలు తమకు ఆవరణము (వస్త్రాలు) యిమ్మని వేడినప్పుడు శ్రీకృష్ణుడు శ్రీహరిగోపీజన సంవాదం పేరుతో ఈ తరంగంలో వారికి ఇలా జ్ఞానబోధ చేస్తాడు:
కృష్ణః:
ఆవరణం మమ న హి తే దాతుం
భావయ గోపవధూజన బృంద॥
గోప్యః:
దేవ యదావరణం మమ నీతం
దేహి విభో భవతా తదనంత॥
కృష్ణః:
నీతం నైవ మయా పరకీయం
వ మమావరణం నిజదృష్ట్వా॥
గోప్యః:
హా గృహాణ భవానితి పూర్వం
దేహి తదావరణం మమ బంధో॥
కృష్ణః:
అక్షి నిమీలన మేవ మయోక్తం
సాక్షా దిహ తు గృహాణా వరణమ్॥
గోప్యః:
లోకాలోకన విహితావరణం
లోకేశ్వర మమ దేహి సముదితమ్॥
కృష్ణః:
లోకస్యావరణం న విధాతుం
లోకే కోఽపి సమర్థః పురుషః॥
గోప్యః:
కశ్చన నాలోకయతి యథాఽస్మా\న్
కలయ తథావిధ మేవావరణమ్॥
కృష్ణః:
లోక్యోనాకయతి హి లోకే
లోకం కశ్చన కమపి విరోధాత్॥
గోప్యః:
లోక్యా ఏవ వయం పరభోగ్యాః
లోకేశావరణం తు విధేహి॥
కృష్ణః:
తర్హి తదావరణై రల మల్పైః
తస్య న కించి దలోక్య మిహాస్తి॥
గోప్యః:
కి మిద మలౌకిక సిద్ధావరణం
కే వా వయ మిహ లజ్జాభరణాః॥
కృష్ణః:
యుక్తిసహం నహి భవదావరణం
యోగిభి రితి మీమాంసిత మబలాః॥
గోప్యః:
అస్మాభి ర్న విధేయం కి మపి
హ్యవగతమచ్యుత తద్వత భగవన్॥
శివనారాయణతీర్థ సుగీతం
శ్రీహరిగోపీజన సంవాదమ్॥
“గోపికలారా| మీకివ్వటానికి నా వద్ద నా ఆవరణము తప్ప మీ ఆవరణము (వస్త్రము) లేదు. బాగా ఆలోచించండి.”
“ఓ అవంతుడా! ఇప్పుడు మా ఆవరణాలను తీసుకొన్నావు కదా మా ఆవరణాలనే మాకు ఇవ్వు”
“నేను ఇతరుల ఆవరణాలను ఎప్పుడూ తీసుకోలేదు”
లోకం దృష్టిని కప్పిపుచ్చడానికి ఆవరణాన్ని గోపికలు వేడుకుంటే లోకం దృష్టి యొక్క సాక్షీ స్వరూపమే ఈ మాయావరణము అన్నాడు కృష్ణుడు. కృష్ణ బ్రహ్మనిష్ఠలైన గోపికలు కృష్ణునితో కలిసి రాసమండలవర్తులంలో గానంతో నృత్యం చేస్తూ అతడు ఉపదేశించిన అద్వైతాన్ని అనురక్తితో అనుసరించారు.
“నేను అద్వితీయుణ్ణి, సజాతీయ, విజాతీయ, స్వగత భేదము లేనివాణ్ణి, నాశరహితుణ్ణి. ఈ ప్రపంచం సృష్టి, స్థితి, లయకాలం నాకంటే వేరు కాదు. ఎందుకంటే యీ ప్రపంచానికి కారణభూతుణ్ణి నేనే. గోపికలంతా సత్తామాత్రస్వరూపుడని కీర్తించే ఆ పరమాత్మను నేనేనని తెలుసుకోండి. ఓంకారం నన్ను గూర్చే చెప్తూంది.” అన్నాడు కృష్ణుడు!
గోపికలు కృష్ణుని మాటలను అనుకరించడంలో వాటిలోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నమే కాని అతణ్ణి వేళాకోళం చేయాలనే ఉద్దేశ్యం కనబడదు. అందులో వారి ముగ్ధ, మనోహర ప్రకృతి రూపుదాలుస్తుంది. ప్రపంచంలో ప్రణయం అనే పదం బ్రతికున్నంత కాలం రాధా కృష్ణుల ప్రయణతత్వం నిలిచి ఉంటుంది.
రాధాకృష్ణుల ప్రణయ ఆధారంగా చైతన్య మహాప్రభు ‘మధుర భక్తి’ అనే భక్తి మార్గాన్ని ప్రచారం చేశాడు. ‘మధుర భక్తి’ తత్త్వంలో భక్తుడు ప్రేయసిగా, భగవంతుడు ప్రియుడుగా భావించి చేసే ప్రణయోపాసన ప్రధానం.
శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడు, జీవాత్మలన్నీ స్త్రీలే. భక్తుడు గోపికగా తనను తాను భావించుకొని కృష్ణ ప్రేమలో తరించడాన్ని ఆయన ప్రతిపాదించాడు. యశోదానందుల పుత్రునిగా జన్మించిన శ్రీకృష్ణుడు వృషభానుని పుత్రికగా జన్మించిన రాధాదేవి ఇద్దరు పరబ్రహ్మ స్వరూపులు.
“రాధా రాసేశ్వరీ రమ్యా రామా చ పరమాత్మన: రాసోద్భవా
కృష్ణ కాన్తా వక్ష: సంస్థితా కృష్ణ ప్రాణాధి దేవీ చ మహావిష్ణో:
ప్రసూదపి సర్వాద్యా, విష్ణుమాయా చ సత్యా నిత్యా
సనాతనీ బ్రహ్మ స్వరూపా పరమా నిర్లిప్తా నిర్గుణా పరా”
ఆమె రాసేశ్వరి. రాసమండంలో ఉదయించింది. కృష్ణునికి ప్రాణాధిదేవత. ఆమె, సనాతని, విష్ణుమాయ, రాధాశ్రీకృష్ణుని ఆనంద స్వరూపము. ఆమే ఈ సృష్టికి ఆధారం. బీజ స్వరూపుడు కృష్ణుడు. కృష్ణునిలోని శోభ రాధ. రాధాకృష్ణు లిద్దరూ తేజో స్వరూపులు. రాధ మూలప్రకృతి. కృష్ణుడు మూలపురుషుడు. ఇద్దరూ మహాభావ స్వరూపులు. బృందావన ధామంలో ఆనంద రూపిణి యైన రాధను రసభావ మార్గంలో సాధకులు, ఉపాసిస్తారు.
రాధ శబ్దాన్ని రాధాకృష్ణ తత్త్వాన్ని ఎరిగిన మహనీయులు ఒక శృంగారనాయిక అనే అర్థంలో కాక ‘సకల ప్రాణి సహజమైన కామభావానికి సహజ ఆశ్రయమైన స్త్రీ మూర్తి’ అనే అర్థంలోనూ కాకుండా, భగవత్తత్త్వానుభూతికి సాధనమైన లోకోత్తర మహాతత్త్వంగా భావించారు.. జయదేవుడు, చైతన్య మహా ప్రభువు, క్షేత్రయ్య, నారాయణతీర్థులు వీళ్లంతా..!
రాధాకృష్ణ శబ్దాలను ఆలంబనగా చేసుకొని చేయబడిన వర్ణనలను, ఈ తాత్త్విక అర్థాలకు తగినట్లుగా ఏర్పడే లోతైన పవిత్ర భావనలతోనే గ్రహించాలి గాని నీచశృంగార భంగిమల కోసం ఉపయోగించ కూడదు.
ఈ పరమార్థాన్ని దృష్టి పధంలో నిలుపుకొని రాధ, కృష్ణ, గోపికల శృంగార సన్నివేశాలను సమన్వయ పరచుకోవటం వలనే ఆ సారస్వతానికి సముచితమైన న్యాయం జరుగుతుంది.
తీర్థులవారి రాధ
శ్రీకృష్ణలీలాతరంగిణి 8వ తరంగంలో అకస్మాత్తుగా రాధ కనిపిస్తుంది. జయదేవుడు కేవలం రాధ చుట్టూ గీతగోవిందాన్ని రసమయంగా అల్లితే, తీర్థులవారు రాధను మరో కొత్త కోణంలో చూపించారు.
అంతర్ధానం చ కృష్ణస్య తతో గోపీ ప్రలాపనం
కృష్ణస్యాన్వేషణం భూయస్తాసాం శ్రీకృష్ణదర్శనం
ఏతచ్చరిత్ర మధునా సంగృహితం హరేః కృతమ్॥
బృందావనంలో గోపికలతో విహరిస్తున్న కృష్ణుడు అకస్మాత్తుగా అంతర్థానమైపోయాడు. గోపికలంతా భయంగా ఏమయ్యాడంటూ చెట్టూ పుట్టా వెదకసాగారు. అంతలో కృష్ణుడి అడుగుజాడలు కనిపించాయి. వాటి వెంటే నడుస్తూ, కృష్ణుని వెదకుతూ వెళ్ళగా వెళ్ళగా ఒక చోట వాళ్ళకు కృష్ణపాదముద్రలతోపాటు మరో జత పాదముద్రలు కూడా కనిపించాయి. వాటిని అనుసరిస్తూ వెడితే చివరికి ఒక పొదరిల్లు కనిపించింది. పొదరింట్లో కృష్ణుడు లేడు. రాధ ఉంది. ఆశ్చర్యపోయిన గోపికలు కృష్ణుడేడని అడిగారు. రాధ కృష్ణుని పరతత్వాన్ని వాళ్లకు వివరించి జ్ఞానబోధ చేస్తుంది. గోపికలు కూడా కృష్ణుడి పరతత్వాన్ని గ్రహించి స్తుతిస్తూ గానం చేశారు.
“భావయే సఖి హే భావయే సఖి భావదృశ మీశమ్॥
మధురిపు మిహ రాసభువి విహరంతం
మాధవ మింద్రియాదిషు వసంతమ్॥” అంటూ..
మాధవం దర్శయ హే మందార — మాధవం దర్శయ॥
మాధవమిహ రాధికారాధిత మథ సాధకజన ఫలసాధకమధునా॥
అని కీర్తించుకున్నారు. కృష్ణుడు అనుగ్రహించి వాళ్ళకు సాక్షాత్కరిస్తాడు. దీన్ని బట్టి తీర్థులవారు గోపికలతో కృష్ణుడి రాసలీలలను వర్ణిస్తూనే వాటి వెనుక దాగిన కృష్ణపరతత్త్వాన్ని, రాథాకృష్ణ లీలలలోని ఆధ్యాత్మిక భావనను సూటిగా వివరించి చెప్పటానికే సంకల్పించుకున్నారని అర్థం అవుతుంది.
నామసిద్ధాంత భజన సాంప్రదాయం
శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భక్తితత్త్వానికి విశేష ప్రాధాన్యత ఉంది.
వ్యక్తుల మధ్య పరస్పరం ఉండే ప్రేమ, ప్రీతి, అనురాగం, మమకారం ఆప్యాయత, ఆరాధన లాంటి భావాలే భగవంతునికీ భక్తునికీ మధ్య ఆపాదించబడినప్పుడు ఆ భక్తి ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
భాగవతం ద్వాదశస్కంధం, మూడవ అధ్యాయంలో శ్రీశుకబ్రహ్మేంద్రులవారు, పరీక్షిత్తు మహారాజుతో ఇలా చెప్పాడు:
“కలేః దోషనిధేః రాజన్! అస్తి హ్యేకః మహాన్ గుణః।
కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్తసంగః పరం వ్రజేత్॥”
“కృతే యత్ ధ్యాయతః విష్ణుం త్రేతాయాం యజతః మఖైః।
ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్॥”
“రకరకాల దోషాలకి ఆలవాలమైన కలియుగంలో విశిష్టమైన ఒక గొప్ప గుణం వుంది. శ్రీకృష్ణపరమాత్మని కేవలమూ సంకీర్తన చేయడం ద్వారా భక్తుడు ఇహలోకసంబంధమైన సంసార అనురక్తి నశించి పరంధామాన్ని పొందుతాడు. కృతయుగంలో తపోమయ ధ్యానం ద్వారాను, త్రేతాయుగంలో యఙ్ఞ, యాగాది విధుల ద్వారాను, ద్వాపరయుగంలో విశేషమైన పూజాదికాల ద్వారాను ఏ పరమఫలం పొందుతారో, కలియుగంలో శ్రీహరియొక్క సంకీర్తన చేయడం ద్వారానే పొందవచ్చు!”
“నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయే న చ।
మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద!॥”
“నేను వైకుంఠంలోకాని, యోగుల హృదయాలలోకాని ఉండటం లేదు. నా భక్తులు నన్నుగురించి సంకీర్తనని చేసే చోట నేను స్థిరంగా ఉంటున్నాను” అని స్వయంగా శ్రీకృష్ణులవారే నారదదేవర్షికి చెప్పారు. నామసిద్ధాంతానికి. సంకీర్తనా విధానానికి, సామూహిక భజనసాంప్రదాయాలకు వ్యాసభగవానుడి భాగవతమే మూలం. అది శ్రీకృష్ణుడే ఇచ్చిన ప్రేరణ.
వైష్ణవులు పన్నిద్దరాళ్వారులు పాడిన పాశురాలను దివ్యప్రబంధాలుగా భావించటం మొదలయ్యాక వైష్ణవ ‘భక్తి’కి ప్రత్యేకతలు ఏర్పడసాగాయి. శ్రీరామానుజులవారు ఉన్నతమైన భక్తిని పొందటానికి సాధన సప్తకాలు కావాలని వాటిని పొందలేని సామాన్యులకు భగవంతుని శరణాగతి ఒక్కటే మార్గమనీ ప్రకటించారు. కర్మ, జ్ఞాన, భక్తి యోగాలకంటే శరణాగతుడవటమే ఉత్తమోత్తమ బావన!
అలా, శరణాగతులైన భాగవతోత్తముల కథలకు విశేషమైన ప్రాధాన్యత ఏర్పడసాగింది. అందుకు ఉత్తరాదిలో వల్లభాచార్యుడు (క్రీశ.1473-1531), చైతన్యమహాప్రభువు (1485-1533), రూపాగోస్వామి (1490-1563), మధుసూదన సరస్వతి (1540-1647) వీళ్లంతా మధురభక్తిని ప్రచారం చేశారు, అన్నమయ్య శరణాగతి తత్త్వాన్ని విశేషంగా ప్రచారం చేశాడు.
నారాయణతీర్థుల కృష్ణభక్తి సాత్త్విక భక్తిమార్గానికి చెందిన శరణాగత విధానాలకు సంబంధించినది. తీర్థులవారికన్నా పూర్వుడు అన్నమయ్య! ఆయనా మధురభక్తి శరణాగతి తత్త్వం, నామసిద్ధాంత మహిమల్నే ఎక్కువ ప్రచారం చేయటాన్ని గమనిస్తే నారాయణతీర్థుల వారికి ప్రేరణ ఎలా కలిగిందో అవగతం అవుతుంది.
నవవిధ భక్తిమార్గాలలో శ్రవణం, కీర్తనం, స్మరణం వీటికి ప్రాధాన్యత నిస్తుంది నామసిద్ధాంతం. ఇక్కడ ద్వైతులకైనా అద్వైతులకైనా భగవంతుడి పట్ల భక్తి ముఖ్యం. నమ్మిన దేవుడిని శరణు కోరటం నామసిద్ధాంతం. అన్నమయ్య, సంకీర్తనలలోనూ నారాయణ తీర్థుల తరంగాలలోనూ ఈ అంశాలను తులనాత్మకంగా మనం పరిశీలించవచ్చు.
“యజ్ఞాలలో జపయఙ్ఞాన్ని నేను” అనే గీతావాక్యానికి అనుసరణగా నామసంకీర్తనలకు ప్రాధాన్యత ఒక సిద్ధాంతంగా రూపొందిన కాలం అది. వ్యక్తిగతమైన పూజాదుల కంటే, సామూహిక భజన సాంప్రదాయాలకు, నామ సంకీర్తనలు అవకాశం కల్పించాయి. అందరూ కలిసి ముక్తకంఠంతో భగవన్నామ స్మరణ చేయటం ద్వారా భక్తిలోని తాదాత్మ్యతను అందరూ సమానంగా పొందటం ఇక్కడ ముఖ్య లక్ష్యం. దీని వలన సామూహిక సంకీర్తనల కోసం ఆలయాల ప్రాధాన్యత పెరిగింది.
రారా! గోపాలబాల! అని సాకార విగ్రహ స్వరూపుని ముజ్జగములకు మూలమైన వాడుగా చెప్పి ఆహ్వానించటం వైష్ణవభక్తిలో వచ్చిన గొప్ప మార్పు. ఈ మార్పు తేవటంలో నారాయణతీర్థులవారి పాత్ర కూడా ఉంది.
నామం అంటే ఎరిగింప తగినది అని! భక్తికి నామకీర్తనతో అన్వయం వలన పరమ భక్తి కలుగుతుందని శాండిల్య సూత్రాలు చెప్తున్నాయి. పరమాత్మ గుణమహాత్మ్యాలను కీర్తించటం ఆయన పట్ల అనురాగానికి హేతువనే భావన దీనికి మూలం. నామసిద్ధాంతం భజన సాంప్రదాయానికి దారితీసింది.
అన్నమయ్య, పురందరదాసాదులు ఈ మార్గానే అనుసరించారు. తరువాతి తరంలో నారాయణతీర్థులు, వారి తరువాతివాడు త్యాగరాజ స్వామి వీరందరూ అనుసరించిన మార్గం నామ సిద్ధాంతమే!
అనేక పేర్లున్న నదులన్నీ సముద్రంలో కలిసినప్పుడు ఆ పేర్లన్నీ పోయి సముద్రం అనే పేరే మిగుల్తుంది. ముక్కోటి దేవతల నామాలున్నాయి. అన్నీ ఆ పరమాత్ముడి పేర్లే! ఏ పేరుతో పిలిచినా పరమాత్ముడు ఒక్కడే! ఆయన నామస్మరణ మాత్రంగానే మోక్షం సిద్ధిస్తుంది, కైవల్యపద ప్రాప్తి కలుగుతుందని నామసిద్ధాంతం చెప్తుంది. ఈ సిద్ధాంత ప్రవక్త శ్రీ భగవన్నామ బోధేంద్ర సరస్వతీస్వామి.
బోధేంద్రసరస్వతి (గోవిందపురం), నారాయణతీర్థులు(వరుగూరు), శ్రీధర వెంకటేశ అయ్యవారు (తిరువిసైనల్లూరు), సదాశివబ్రహ్మ స్వామి, (పుదుక్కొట్టై), సద్గురుస్వామి (మరుదనల్లూరు) వీళ్లంతా నామసిద్ధాంత సాంప్రదాయ ప్రవర్తకుల్లో ముఖ్యులు. అన్నమయ్య వారికన్నా పూర్వుడు. తెలుగువాడు కావటాన, తెలుగులో పదకవితలు వ్రాయటాన తమిళ వైష్ణవ పండితులు ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. భగవన్నామమే ముక్తిదాయకమని మొదటగా ప్రబోధించినవాడు అన్నమయ్యే! తీర్థులవారి ప్రయాణానికి వీరంతా బాటలు పరిచినవారే!
శ్రీకృష్ణలీలాతరంగిణి వ్రాయాలనే సంకల్పం తీర్థులవారికి కలగటానికి డా. ధూళిపాళ రామకృష్ణగారు ఒక ఉపపత్తి నిచ్చారు. తీర్థులవారు పూరీ జగన్నాథుని సందర్శించిన సమయంలో అక్కడ అన్ని సేవల సమయాలలోనూ విధిగా గీతగోవిందం లోని అష్టపదులను పాడాలనే రాజశాసనం ప్రకారం ఆచరణలో ఉండటాన్ని గమనించారు. దానికి ఆకర్షితులైన తీర్థులవారు భాగవత తత్త్వ నిరూపణ కోసం శ్రీకృష్ణలీలాతరంగిణి వ్రాసే సంకల్పం చెప్పుకున్నారట.
శిష్యోత్తంసులచే వరాహపురిలో శ్రీకృష్ణలీలా కథా
భాష్యంబుల్ పొనరించెఁ దా నభినవ ప్రస్తావనా నాట్య సం
తుష్యత్సర్వ జగంబుగా విమలసాధు ప్రేక్షణీయంబుగా
శుష్యత్పాపుఁడు నవ్యనాటక కలాశోభల్ ప్రపంచించుచున్”
అని విశ్వనాథవారు వరహాపురిలో శ్రీకృష్ణలీలా కథా భాష్యాలు చెప్తూ, అభినవ పూర్వకంగా తరంగాలను ఆలపిస్తూ, నవ్య నాటక కళాశోభ ఉట్టిపడేలా శ్రీకృష్ణలీలాతంగిణి వ్రాశారని పేర్కొన్నారు. నిజానికి వైష్ణవ భక్తి ప్రచారానికి తమిళులది అగ్రస్థానం. అయితే, వైష్ణవ భక్తి రసాన్ని గ్రోలి భక్తులు తన్మయస్థితిని పొందేలా చేసిన ఘనత తెలుగు వారిదే! ఈ ఘనతని తెలుగువారు తమిళ నేలమీదే సాధించటం విశేషం.
భగవాన్ వేదవ్యాసులవారు ఈ కలియుగంలో మూడు అవతారాలు ఎత్తారని, మొదటి అవతారం 12వ శతాబ్ది నాటి శ్రీగీతగోవింద కర్త భక్త జయదేవుడు కాగా, 24 వేల శృంగార కీర్తనలు వ్రాసిన 15వ శతాబ్ది నాటి క్షేత్రయ్య మహాకవి రెండవ అవతారం, 16వశతాబ్ది నాటి నారాయణతీర్థులవారు మూడవ అవతారం అని భక్తుల నమ్మిక. ఈ ముగ్గిరిలో సాహిత్యం, సంగీతం, నాట్యం మూడింటి సమ్మేళనంగా సంకీర్తనా విధానాన్ని ప్రవేశపెట్టిన శ్రీ నారాయణతీర్థుల ప్రభావం మేలట్టూరు, కూచిపూడి భాగవత కళల పైన ఎక్కువగా ఉంది.
నారాయణతీర్థుల వారు గానం చేసే సమయంలో ఒక తెరను కట్టేవారని, ఆ తెర వెనుక, ఆయన గానానికి అనువుగా తగిన నృత్యం ఎవరో చేస్తున్న నీడలు కనిపించేవట. గజ్జల ధ్వని వినిపించేదట. హనుమంతుడే తాళం వేసేవాడని ప్రతీతి.
రోజుల తరబడీ ఆయన తలుపులు వేసుకుని రాత్రింబవళ్ళూ ధ్యానస్థితిలో ఉంటే, కొందరు అసూయాగ్రస్థులు ఈయన రాత్రిళ్లు జారస్త్రీలతో గడుపుతున్నాన్నాడంటూ నిందమోపి ప్రచారం చేశారు. అనుమానంతో తలుపు సందుల్లోంచి చూస్తే ఓ పెద్దావిడ ఆయనకు అన్నం కలిపి నోటిలో పెడుతూ ఉండటం కనిపించింది. తలుపు తెరిచి చూస్తే, ఆమే లేదు, అన్నమూ లేదు. తీవ్రమైన సమాధిలోవున్న తీర్థుల వారిని చూసి నిశ్చేష్టు లయ్యారు.
నౌడూరి విశ్వనాథం, అద్దంకి హరిదాసు వెంకటరాయుడు, పాలపర్తి నృసింహదాసు, బొమ్మరాజు సీతారామదాసు, పోరూరి సోదరులు, తాడిగడప పెద్దశేషయ్య, నీలంరాజు ఆదినారాయణ దాసు, మైనంపాటి నరసింగరావు వంటి ప్రముఖులు గత తరంలో తీర్థులవారి తరంగాలను పాడటంలో ప్రసిద్ధులని శ్రీ మల్లాది సూరిబాబు వ్రాశారు.
(సశేషం)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.