[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘హరిచరణ స్మరణ పరాయణ శ్రీ నారాయణతీర్థ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 2వ భాగము.]
వ్రాసినవి కాదు పాడినవి
అన్నమయ్యకైనా, తీర్థులవారికైనా, త్యాగయ్యకైనా వ్రాయటం అనే మాటని ఉపయోగించటం సరికాదు! వారు వెలార్చినవి. తాటాకులూ గంటాలూ పుచ్చుకుని మఠం వేసుకుని కూర్చుని వ్రాసిన రచనలు కావు. భక్తి పారవశ్యంలో తన్మయస్థితిలో అప్పటికప్పుడు అలవోకగా ఆలపించిన పాటలు, రాగాలే ఈ పదాలు, తరంగాలు లేదా కృతులు. వాటిని ఆయన శిష్యకోటి లిపిబద్ధం చేసి ఉండవచ్చు..
గర్భాలయంలో కృష్ణుని ఎదుట ఏకాంతంగా కూర్చొని ఆయన కీర్తనలు గానం చేస్తుంటే ఆంజనేయస్వామి తాళం వేసేవాడని భక్తుల నమ్మకం. ఏదైనా కీర్తనకు ఆంజనేయుడు తాళం వేయకపోతే అది ఆయనకు నచ్చలేదని తీసేసేవాడట. శ్రీకృష్ణకర్ణామృతంలో కొన్ని భాగాలు లుప్తమైనట్టు అనిపించటానికి ఇదొక కారణం అని చెప్తారు. తీర్థుల గానానికి అనుగుణంగా శ్రీ కృష్ణుడు నాట్యం చేసేవాడని, ఆయన గజ్జెల చప్పుడు కూడా బైటకు వినిపించేదనీ చెప్పుకుంటారు.
నారాయణతీర్థులు కారణంగా వరాహపురికి విశేష ఖ్యాతి లభించింది. తీర్థులవారు కృష్ణాష్టమి ఉత్సవాలను దగ్గరుండి నిర్వహింప చేసేవారు. చుట్టుపక్కలనుండి జనం తండోపతండాలుగా రావటంతో ఈ దేవాలయం విశేష ప్రశస్తి పొందింది.
వాయులీన విద్వాంసుడు ముత్తుస్వామి అయ్యర్ అక్కడ ఆ ఉత్సవాలు కొనసాగించటానికి ఎక్కువ కృషి చేశారు. తిల్లైస్థానం నరసింహభాగవతార్, నల్లూరు వెంకటసుబ్బయ్య ఈ ఇద్దరూ నారాయణతీర్థుల తరంగాలను తమిళ గ్రంథలిపిలోనూ, తెలుగులోనూ పుస్తకరూపంలో తెచ్చారు. 1920, 1948, 1953లలో ఈ కీర్తనలు ప్రచురితమైనాయి.
ఆచార్య వరాహూరు గురుస్వామి శాస్త్రి, కళ్యాణసుందరం, శ్రీ కంఠశాస్త్రి కంచిపరమాచార్య నేతృత్వంలో 1966లో కృష్ణ లీలా తరంగిణిని పరిష్కరించి ముద్రించారు.
జయదేవుడు- లీలాశుకుడు అన్నమయ్య-నారాయణతీర్థులు
జయదేవుడే (12వశతాబ్ది) లీలశుకుడిగా(13వశతాబ్ది), అన్నమయ్యగా (1408, మే 9 – 1503, ఫిబ్రవరి 23) జన్మించాడని అన్నమయ్య తరువాత 72 యేళ్లకి నారాయణతీర్థులవారు (1575-1680) జన్మించారు. కాబట్టి అన్నమయ్య అవతారమే తీర్థులవారని మరికొందరు సంభావిస్తారు. లీలాశుకుడు జయదేవుడి కన్నా ముందువాడని, ఆయనే జయదేవుడిగా జన్మించాడనే కథనం కూడా ఉంది.
జయదేవుడు వంగదేశీయుడు. లీలాశుకుడు తెలుగువాడు కృష్ణాజిల్లా శ్రీకాకుళం వాడని కృష్ణకర్ణామృత పీఠికలో పెరుమాళ్ళయ్య గారు పేర్కొన్నారు. జయదేవుడి అష్టపదులు, అన్నమయ్య పదాలు, నారాయణతీర్థుల తరంగాలు వాగ్గేయకారులుగా పాడి, అభినయించి భాగవత కథను ప్రచారం చేయటం ఈ మూడింటిలో సమానాంశాలు. పరమాత్మలో లీనం కావటానికి జీవుడు పడే తపన, నాయికా నాయకుల శృంగారం, మధురభక్తి, ఆధ్యాత్మికభక్తి వీటి సమ్మేళనం ఈ ముగ్గురి రచనలు.
అన్నమాచార్య అచ్చతెనుగులో కీర్తనలు రచించినప్పటికీ, సంస్కృత రచనలు కూడా సమానస్థాయిలో చేసి ఉభయ పాండిత్యాన్ని నిరూపించుకున్నాడు. నారాయణతీర్థులవారు కూడా సంస్కృతంలో అద్భుత తరంగాలను రచించినా, తెలుగులో పారిజాతాపహారకావ్యాన్ని రచించి రెండు భాషల్లోనూ తన అధికారాన్ని నిలుపుకున్నాడు. యక్షగానపద్ధతిని మేళవించి, తీర్థులవారు తన తరంగాలకు ప్రదర్శన యోగ్యతను సాధించారు. తంజావూరులో యక్షగానకళ అభివృద్ధికి ఆ విధంగా తీర్థులవారు నాందీ పలికారు.
మధురభక్తి రసాయనం
భక్తికీ ప్రేమకూ తేడా లేదు. వాడుక భాషలో మనం భగవంతుని మీద ప్రేమని భక్తి అనీ, సాటి మనుషుల మీద ఉండేది ప్రేమ అనీ అంటున్నాం.. లౌకికమైన ఈ ప్రేమ కూడా భక్తిలో అంతర్భాగమే. భక్తి లేని ప్రేమ కామం అవుతుందే గానీ అది నిజమైన ప్రేమ కాబోదు.
శంకరాచార్యులంతటివాడిగా ప్రసిద్ధిపొందిన అద్వైత ప్రవర్తకులు, భక్తి ప్రాధాన్యతను ప్రచారం చేసిన వంగదేశీయుడు మధుసూదన సరస్వతి లౌకిక కార్యాలలో భక్తిని ఇలా వివరిస్తారు: “కృష్ణుడిపైన నంద, యశోదల ప్రేమ వాత్సల్యభక్తి. కృష్ణుడిపట్ల ప్రేమను ప్రకటించిన ‘కుబ్జ’ది దాస్యభక్తి. అక్రూరుడు, నారదుడు లాంటి భక్తులు ప్రదర్శించింది శాంతభక్తి. కంసుడు ఆజన్మాంతం కృష్ణధ్యానంలోనే గడిపాడు. కృష్ణుడెప్పుడు వచ్చి తనను సంహరిస్తాడోననే భయంతోనే జీవించాడు. ఇది శత్రునిహితభక్తి అంటారు. పరమాత్మ సాయుజ్యానికి ఆయనతో వైరాన్ని ప్రదర్శించటమే ఈ భక్తికి పరమావధి. ప్రేయసీ ప్రియులమధ్య ఉండే అనురాగబంధాన్ని మధురభక్తి అంటారు. గోపికాదులకు కృష్ణనామమే మహామధురం. అది మధురభక్తి.
ఈ మధురభక్తిని లౌకిక దృష్టితో చూస్తే కనిపించే తత్త్వార్థాలు వేరు. భాగవత హరివంశాలు అంతకన్నా ఎక్కువ లోతుల్లోకి మనల్ని తీసుకు వెళ్లలేదు. బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణజన్మఖండం, గర్గసంహిత, బ్రహ్మపురాణం, దేవీభాగవతంలాంటి పురాణ సంహితల్ని అధ్యయనం చేయాలంటారు శ్రీ వాసిలి వేంకట లక్ష్మీనరసింహారావు ‘మధురకవితాతరంగిణి-శ్రీ కృష్ణలీలా తరంగిణి’ వ్యాసంలో! ఇదంతా ‘భక్తి రసాయనం’ అంటారాయన.
భగవంతుడొక్కడే పురుషుడు, భక్తులంతా స్త్రీలే అనే భావనలోంచి పుట్టింది మధురభక్తి. గోపికా కృష్ణుల రాసలీల, రాధాకృష్ణుల ప్రణయాలలో లౌకికమైన కామకృత్యాలను కాకుండా అలౌకిక శృంగారాన్ని చూడగలిగినప్పుడే ఈ మధురభక్తి తాత్పర్యం బోధపడ్తుంది.
“ఆత్మారామాః పరానంద నిత్యతృప్తాః పునఃపునః | ఆత్మానుభూతిం గాయంత్యః కృష్ణైకరనతాంగతాః” అంటూ నారాయణతీర్థులవారు ఆత్మ-పరమాత్మల సంయోగాన్ని వర్ణిస్తారు. ఆ గోపికలు కృష్ణుడితో అభేదం చెంది ఆత్మారాములై అంటే పరమాత్మ స్వరూపమే విహార స్థానంగా కలవారై పరమానంద రసంతో శాశ్వతమైన తృప్తి కలిగి ఆ సుఖాన్ని ఇలా గానంచేస్తూ అభినయించటం తరంగాలలో కనిపించే ముఖ్యాంశం. ఇదే భాగవతభక్తి. మధురభక్తి.
పంచమహాభూతాలు, అహంకారం, మహత్తు ఈ ఏడింటినీ సప్తావరణా లంటారు. ఈ ఏడూ ప్రకృతితో కలిస్తే ఎనిమిది ఆవరణా లౌతాయి. ప్రకృతి మాయతో ఆవరించబడింది. మాయతొలగిపోతే ప్రకృతి పరమపురుషుడి సాయుజ్యాన్నిపొందుతుంది. గోపికలు సిగ్గు విడిచి కృష్ణునితో రమించారంటే అఙ్ఞానం తొలగి పరమ పురుషుడిలో లీనమయ్యారని అర్థం చేసుకోవాలని పండితులు వివరిస్తారు.
ప్రకృతి పురుషుల సంగమస్థలి రాసమండలంలో జరిగింది. రాసమండలం ఒక సంకేత స్థలి.
జయదేవకవి వర్ణించిన కామతృప్తకామినీహాసానికి తాత్త్వికార్థాన్ని జోడించకపోతే రాక్షసరతిని గుర్తుచేసేదిగా ఉంటుంది.
“వామాంకే రతికేళి సంకులరణారంభే..” అని శ్రీగీతగోవిందంలో వర్ణిస్తాడు జయదేవుడు. అది పచ్చి శృంగారంగా భ్రమింపచేస్తుంది.
“కథయకథయ మాధవ- హేరాధే” అనే తరంగాన్ని తీర్థులవారు రాధ చేత పాడిస్తూ, కృష్ణుని వేదభాగ విదితుడు, ఆయనను గోపికలు అన్వేషించటం బ్రహ్మవిద్యగా వర్ణిస్తారు. వైష్ణవభక్తితత్త్వం వ్యక్తీకరణలో జయదేవుడి కాలానికన్నా పరిణతిని గమనించవచ్చు.
“శ్రీవాసుదేవ వరాహపురి సన్నిధానే శ్రీ వెంకటాద్రిపతిరూప హరే మురారె
నారాయణాఖ్యయతిదృష్టవారాహమూర్తే నానామునీంద్ర హృదయాలయ పాహి కృష్ణ”
అంటూ నారాయణతీర్థులవారు వెంకటేశ్వరుని సన్నిధిలో శ్రీకృష్ణలీలా తరంగిణి పాడుతూ అభినయించేవారని ఈ వాక్యాలు చెప్తున్నాయి.
తరంగాల రచన ఎక్కడ జరిగిందనే విషయంలో పండితుల మధ్య ఏకాభిప్రాయం లేదు.
“జయ జయ బాలగోపాల-జయ జయ మదనగోపాల|జయ జయ విజయగోపాల-జయ జయ కల్యాణగోపాల॥
ఈ తరంగాన్ని పాడని భక్తులు ఆ ఊళ్లో లేరని చెప్తారు.
మనకన్నా తమిళనాడులో నారాయణతీర్థుల కీర్తనలు సామాన్యుల నోట ఎక్కువగా పలుకుతుంటాయి. మనవాళ్లు వాటికి ప్రశస్తి తేవటానికి చాలినంత స్థాయిలో కృషి జరగలేదేమో అనిపిస్తుంది.
నారాయణతీర్థుల వారికి సిద్ధేంద్రయోగి కాశీలోనే శిష్యుడయ్యాడనీ, వరుగూరు (వరాహూరు) వరకూ ఆయనను అనుసరించే ఉన్నాడని తమిళ పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. కొందరు తమిళ పరిశోధకులు సిద్ధేంద్రయోగికి నారాయణతీర్థులే శిష్యుడని వ్రాశారు. కానీ, ఆ కథనానికి మద్దతు లేదు. వరుగూరులో స్థిరపడ్డాకే తీర్థులవారు కృష్ణలీలాతరంగిణి ప్రారంభించాడనేది అక్కడి పండితుల అభిప్రాయం. ‘Tanjore, The Seat of Music’ గ్రంథంలో ఆచార్య ఎస్. సీతగారు కూడా ఈ విషయాన్నే వ్రాశారు.
అప్పటికే ఆయన ఆ గ్రంథాన్ని సగం పూర్తి చేశాడని, వివిధ క్షేత్ర సందర్శనం చేసిన ప్రతీచోటా వాటిని ఆయన పాడుతూ ఉండేవారనీ మన పరిశోధకులు నమ్ముతున్నారు.
భట్టాద్రి వ్రాసిన నారాయణీయము, జయదేవుడి గీతగోవిందము, నారాయణతీర్థులవారి కృష్ణలీలాతరంగిణి సంస్కృత పదసాహిత్యంలో పేరెన్నికగన్న కావ్యత్రయాలుగా, పుణ్యప్రదమైనవిగా తమిళులు ఎక్కువగా గౌరవిస్తారు.
“కామదా కామినాం ఏషా ముముక్షూణాం చ మోక్షదా|శృణ్వతాం గాయతాం భక్త్యా కృష్ణలీలాతరంగిణీ”
ఈ తరంగాలను విన్నా, పాడినా కోరికలు ఈడేరతాయి. ముముక్షువులకు మోక్షప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణలీలాతరంగిణి ఫలశృతిలో తీర్థులవారు వ్రాశారు.
భారత దేశంలో జయదేవుడి తర్వాత కృష్ణపరంగా నృత్య పంగీతం చెప్పింది నారాయణతీర్థులవారే! కృష్ణుడికీ గోపికలకీ మధ్య ఉండే అనురాగం వస్తువుగా తీసుకున్నాడీ రచనలో తీర్థులవారు.
నారాయణతీర్థుల పుట్టుక-బాల్యం
“కోనసీమ భీమేశు నుద్యాన సీమ
సాధు గోదాపయోగర్భ సస్యభూమి
తనరు నాంధ్రీ సతీ గళోద్దామ దామ
కూచిమంచి యనంగ నక్కోనసీమ..”
అంటూ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కోనసీమను వర్ణిస్తూ, కూచిమంచి అగ్రహారంలోనే శ్రీ తీర్థులవారు జన్మించారని వ్రాశారు. గోదావరి తీరంలో జన్మించాడని కొందరు, కృష్ణానదీతీరాన జన్మించాడని కొందరు, గుండ్లకమ్మ తీరంలో జన్మించాడని కొందరు చెప్తారు. అమలాపురంలో పుట్టాడని శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు వ్రాశారు. కొందరు కృష్ణాజిల్లా కూచిపూడి అనీ, శ్రీకాకుళం అనీ, ఆగిరిపల్లి అనీ అన్నారు. ఏదీ నిర్ధారణ కాని విషయమే!
నారాయణతీర్థులవారు పూర్వాశ్రమంలో తల్లావఝ్ఝుల వంశీకులు. గుంటూరుజిల్లా కాజగ్రామం వారి జన్మస్థలి. తెలుగు స్మార్త వైదిక బ్రాహ్మణ కుటుంబం. భారద్వాజస గోత్రీకులు, ఆపస్తంభ సూత్రులు, కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ శాఖాధ్యాయి. అసలు పేరు గోవిందశాస్త్రి. తండ్రి నీలకంఠశాస్త్రి ఇవి ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయాలు. తల్లావఝులవారి కుటుంబానికి కాజ గ్రామం ఆటపట్టనీ, ఆ వంశీకులు ఈ నాటికీ తీర్థులవారి మూడు తరంగాలైనా ప్రతీ రోజూ పఠించే నియమం కలిగిన వారనీ చెప్తారు.
నారాయణతీర్థుల వారు తెలుగువాడే ననటంలో దేశవ్యాప్తంగా చరిత్ర పరిశోధకుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ, ఆయన జీవిత కథల్లోనే ఏకత్వం లేదు. సాధారణంగా కృతులను రాజులకో, సంపన్నులకో అంకితా లిచ్చుకునేప్పుడు తన వంశచరిత్రనీ, సదరు కృతిని పొందిన వ్యక్తి వంశచరిత్రనీ చెప్పుకునే ఆచారం ఉంది కాబట్టి, ఆ కావ్యాలలో రచయితల వివరాలు కొంత పదిలంగా ఉండేవి.
నారాయణతీర్థులవారు ఏ రాజునూ, ఏ ధనవంతుణ్ణీ ఆశ్రయించకపోవటం, రాజసౌధాలను సందర్శించక పోవటం, ఆయనకంటూ ఒక లౌకిక జీవితం గానీ, స్వంత గొప్పలు చెప్పుకోవలసిన అవసరంగానీ లేకపోవటాన ఆయన గురించి ఇతరులు వ్రాసిన విషయాలలో ఏకత్వం లేకుండా పోయింది. నిష్కామయోగుల జీవిత చరిత్రలు సమగ్రంగా దొరికితేనే ఆశ్చర్యపడాలి!
ఆచార్య సాంబమూర్తిగారి ప్రకారం పూర్వాశ్రమంలో నారాయణతీర్థుల పేరు నారాయణ శాస్త్రి. తెలుగువాడే గానీ, తమిళనాడులో జన్మించాడని వ్రాశారు.
తండ్రి నీలకంఠశాస్త్రి గారు కాజ గ్రామంలోనే ఉండేవాడనీ, ముక్త్యాల ప్రభువుల ఆదరాభిమానాలు పొందిన కుటుంబం అనీ, రాజపోషణ కలిగిన కుటుంబం కావటాన పొట్ట కూటికోసం తంజావూరు తరలి పోవలసిన అవసరం ఆ కుటుంబానికి లేదనీ, సన్యసించిన తరువాత తీర్థులవారే తంజావూరు రాజ్యానికి చేరారని మరొక వాదన కూడా ఉంది. ఇదే వాస్తవం అనుకుంటే తంజావూరులో తాను ఏ పాత్ర నిర్వహించటానికి బయల్దేరాడన్న విషయాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది.
కృష్ణాజిల్లా దివిసీమలో కూడా ‘కాజ’ అనే గ్రామం ఉంది. ఇది చల్లపల్లి (దేవరకోట) జమీదారీ కిందవుంది. బ్రిటిష్ వాళ్లు ఉత్తర సర్కార్లను కైవసం చేసుకున్న తరువాత మొదట కలెక్టరేటుని ఈ కాజ గ్రామంలోనే నెలకొల్పారు. తరువాత మచిలీపట్టణానికి తరలించారు. ఈ కాజ గ్రామమే తీర్థులవారి జన్మస్థలం ‘కాజ’ అని అక్కడివారు భావిస్తారు.
ఆయన తల్లిదండ్రులు తూర్పు గోదావరి జిల్లా కూచిమంచి వాస్తవ్యులనీ, తల్లావఝ్ఝుల పార్వతమ్మ, గంగాధరశాస్త్రి తల్లిదండ్రులనీ, విళంబి నామ సంవత్సర కార్తీక శుద్ధ విదియ సోమవారం పునర్వసు నక్షత్రం రోజున తీర్థులవారు జన్మించారనీ మరికొందరు పేర్కొన్నారు.
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు వేదాద్రిలోనే నరసింహునిపైన భక్తితో తీర్థులవారు ఆటపాటలు నేర్చుకొన్నట్లు వ్రాశారు.
“కూరిమి తలిదండ్రులతోఁ/బాఱుఁడు వేదాద్రియందు భక్తివశత గై/త్యారిని నరసింహేశరుఁ/జేరిక భజియించుచుండె సిరు లొలయంగన్” అని వ్రాశారాయన. అద్రిప్రోన్నతమైన ఆయన శేముషీ కృషే ప్రధానం కాబట్టి, ఎక్కడ ఎప్పుడు పుట్టాడనేది అప్రధానమే!
ఆయన జన్మతిథి నాడే మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారు కూడా జన్మించారు, ఆ మహనీయుని అవతారమే ఈ బాలమురళీ అని సంగీత ప్రియుల విశ్వాసం. తీర్థులవారి ఆరాధనోత్సవాల్లో బాలమురళీ కీర్తనలను కూడా పాడుతుంటారు.
వాసుదేవశాస్త్రి అనే పండితుడు తీర్థులవారికి సంస్కృతాంధ్ర సాహిత్యాలు నేర్పించాడు. పఠెం విరూపాక్షశాస్త్రి ఆయన సహాధ్యాయి.
చిన్నప్పుడు తరచూ ఒంటరిగా వెళ్ళి ఊరుకు దూరంగా ఒక చెట్టుకింద కూర్చుని ధ్యాన్నంలో ఉండిపోయి గురుకులానికి ఆలస్యంగా వెళ్ళటం, తోటివిద్యార్థులు గురువుకు అతనిమీద కొండెములు చెప్పటం, గురువు పరీక్షించి, అతని ఉన్నతిని గుర్తించి ప్రశంసించటం ఇలా పన్నెండేళ్లు శాస్త్రాభ్యాసంలో గడిపాడాయన.
తీర్థులవారి గురువైన శివరామతీర్థులు కంచిలో ఉండేవారని విక్రమశకం 1718 (క్రీ.శ. 1675)లో ‘గురుచంద్రిక’ అనే సంస్కృత గ్రంథం వ్రాశారని. చెరువు లక్ష్మీనారాయణశాస్త్రిగారు వ్రాశారు. ‘గురుచంద్రిక’ను ఆ గురువు గారు ఏ వయసులో వ్రాసి ఉంటారో తెలియదు కాబట్టి నారాయణతీర్థులవారి జన్మతిథి నిర్ణయానికి ఈ సమాచారం ఏమాత్రం ఉపయోగించలేదు.
మాధవనలుడనే వ్యక్తి అనేక జన్మలెత్తి చివరికి నారాయణతీర్థుడిగా అవతరించాడని ఒక కథనం ఉంది.
శ్రీ జనమంచి శేషాద్రిశర్మగారు ‘ఈనాం రిజిష్టర్ల’ ఆధారంగా ఆయన గోదావరి జిల్లా కూచిమంచి అగ్రహారంలోనే 1700 సంవత్సరంలో జన్మించాడనీ వ్రాశారు. ఇది నమ్మశక్యంగా లేదు. తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో తులజాజీ ప్రభువు వ్రాయించిన ‘పంచకోశమంజరి’ అనే గ్రంథంలో అప్పటికి 100 యేళ్ల క్రితం నారాయణతీర్థులవారు జీవించాడని ఉంది. ఈ తులజాజీ ప్రభువు 1773లో తన రాజ్యాన్ని కర్ణాట ప్రభువులకు కోల్పోయి, భారీ మూల్యం చెల్లించి తిరిగి రాజ్యాన్ని పొందాడు. ఈ ఆధారంగా బహుశా 1670ల వరకూ తీర్థులవారు జీవించి ఉంటారని, పూర్ణాయుష్కుడు కాబట్టి 1570 కన్నా ముందు జన్మించి ఉంటాడని పండితులు ఒక నిర్ణయానికి వచ్చారు. “మొత్తానికి ఆయన క్రీ.శ. 1575 ప్రాంతాన జన్మించి, 1614 లోపుగానే దక్షిణాది వెళ్లి, అక్కడ దాదాపు 1680 వరకూ జీవించి ఉన్నట్టు చెప్పవచ్చు” అని రజనీగారి నిర్థారణ. క్రీ.శ. 1700 వరకూ ఉన్నాడని, 120 యేళ్లు బ్రతికాడని, ఒక యోగి దీర్ఘాయుష్మంతుడు కావటంలో ఆశ్చర్యం లేదనీ ‘ఆంధ్రయోగులు’ గ్రంథంలో డా. బిరుదురాజు రామరాజుగారు వ్రాశారు.
తంజావూరు రాజ్యంలో నారాయణతీర్థులవారు కనీసం 70 యేళ్లపాటు నివసించి ఉండాలి. ఇంత సుదీర్ఘకాలం తంజావూరు రాజ్యంలో ఆయన నెరవేర్చిన అధ్యాత్మిక కార్యాల వివరాలపై అధ్యయనం జరగాలి. దక్షిణాది ఆధ్యాత్మిక ప్రగతిలో తెలుగువారి పాత్రని వెలుగులోకి తేవటానికి ఈ అధ్యయనం ఉపయోగపడ్తుంది.
తీర్థులవారి పెళ్లి కథ
“గొంతెత్తి పాడెనా, కొమ్మలోఁ గోకిల/మసలు వసంతాంతాగమ మ్మటంచు
సివమెత్తియాడెనా, చెట్టు పంగల నెమ్మి/కడఁగు వర్షాసమాగమ మటంచు
వేదరహస్యముల్ విప్పెనా, మ్రాన్పాటు/భజియింత్రు త్రయ్యర్థపారిషదులు
నామకీర్తనఁ జేసెనా, బాలకృష్ణుండు/ఘల్లుఘల్లున వచ్చి గంతులిడును
కూడి శివరామతీర్థులన్ గురువు నొద్ద/సాధువయి నేర్చె సర్వశాస్త్రములు తద్ద
నెగడె నింతలో విద్యలన్నింటఁ బెద్ద/గాగ నెంతెంత వారికిఁగళలు దిద్ద”
అని, తీర్థులవారి వ్యక్తిత్వ పరిణతి బాల్యంలోనే ఉన్నతంగా ఉందని విశ్వనాథ సత్యనారాయణ గారు వర్ణించారు. చిన్న వయసు లోనే ఆయన ప్రతిభాసంపన్నుడిగా పేరు తెచ్చుకున్నారు.
దుర్మతి నామసంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు కృష్ణాజిల్లా వేదాద్రిలో జరిగే ఉత్సవాలలో తీర్థులవారి తండ్రికి గింజుపల్లి అగ్రహార వాస్తవ్యులు రూపెనగుంట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారితో పరిచయం జరిగి గాఢస్నేహం ఏర్పడి వియ్యంగా మారింది.
దుర్మతి సంవత్సర ఫాల్గుణ శుద్ధపంచమి శుక్రవారం నారాయణశాస్త్రికి సుబ్రహ్మణ్యశాస్త్రిగారి అమ్మాయి అచ్చమ్మతోనూ, సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కొడుకు నాగేశ్వరశాస్త్ర్రికి నారాయణశాస్త్రిగారి చెల్లెలు లక్ష్మితోనూ కుండమార్పిడి పెళ్లిళ్లు జరిగాయి.
ఒకసారి అత్తారింటికి వెడుతూ నారాయణశాస్త్రి నది దాటే ప్రయత్నంలో వరదలో చిక్కుకున్నాడు. మరణం తధ్యం, బతికే ఆశలేదు. వరద లోంచి బయటపడితే సన్యసిస్తానని జంథ్యం తెంపి నదిలో వేసి మొక్కుకుని, ఆపద్ధర్మ సన్యాసం లేదా ఆతురసన్యాసం స్వీకరించాడు. “యద్యాఽతురస్స్యానసా వాచా వా సన్న్యసే సేత్” అని జాబాల్యోపనిషత్తు చెప్పింది. జీవితానికి ప్రమాదం ఏర్పడి, బ్రతుకుతాడనే నమ్మకం లేనప్పుడు మనస్సుతో గానీ, వాక్కుతో గానీ, ప్రేషోచ్చారణం చేసి సన్యసించవచ్చునని దీని భావం.
ఒకవేళ ప్రమాదం నుంచి బైటపడితే, “ఆతురోజీవతి చేత్రమనన్న్యాసః కర్తవ్యః” తగిన గురువు దగ్గరకు పోయి యథావిధిగా మంత్రోపదేశం పొంది ‘సన్యాసకల్ప’ ప్రకారం సన్యాసం స్వీకరించాలని జీవిత శేషమంతా యతి ధర్మాన్ని పాటించాలని సన్యాసోపనిషత్తు చెప్తోంది. సత్+న్యాసం= బ్రహ్మంలో ఉండటం అని సన్యాసానికి అర్థం. ఇలా ఆపద్సన్యాసం స్వీకరించి వరద ప్రమాదంలోంచి ప్రాణాలతో బయటపడ్డారు తీర్థులవారు.
అత్తవారింటికి వెళ్ళాక ఆయనకు భార్య అమ్మవారి రూపంలో కనిపించటం, భార్యకు ఈయన సన్యాసిలా కనిపించటం, ఆయన తన ఆపత్సన్యాస వైనం అందరికీ చెప్పి సన్యాసిగా మారి ఇంటిని వదిలి దేశాటనకు వెళ్ళటం ఇలా సాగుతుంది ఆ కథ.
నిజానికి ఈ కథ లీలాశుకుడి గురించి తమిళ, కేరళ దేశాలలో ప్రచారంలో ఉంది. సిద్ధేంద్రయోగి గురించి కూడా ఇదే కథ చెప్తారు. బిల్వమంగళుడు, తులసీదాసు జీవితాలలో కూడా ఇలాంటి కథలే కనిపిస్తాయి. ఇది తమిళనాడులో వెణ్ణార్ నదిని దాటుతుండగా జరిగిందని మద్రాసు విశ్వవిద్యాలయం సంగీతశాఖాధ్యక్షులుగా ఉన్న పద్మభూషణ్ ఆచార్య పిచ్చు సాంబమూర్తి గారు వ్రాశారు.
ఈ కథల్లో వాస్తవాలెలా ఉన్నా సంసార జీవితం త్యజించి భార్య అనుమతితో సన్యాసం స్వీకరించాడన్నది ఇక్కడి ముఖ్య విషయం.
సన్యసించిన వ్యక్తి విధిగా దేశాటన చేయాలి. ఆ విధంగా ఆయన అనేక క్షేత్రాలను సందర్శిస్తూ, తమిళనాడు నుండి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి, కృష్ణాజిల్లా ముక్త్యాల, నూజివీడు, చల్లపల్లి సంస్థానాలకు చెందిన దేవాలయాలలో కొంతకాలం గడిపాడని ఆచార్య సాంబమూర్తిగారి వాదన.
దేశాటన క్రమంలోనే తీర్థులవారు కూచిపూడిలో కొంతకాలం ఉన్నాడని, సిద్ధేంద్రయోగిని శిష్యుణ్ణి చేసుకుని సన్యాస దీక్ష నిచ్చాడని మరొక వాదన కూడా ఉంది. కూచిపూడి భాగవత కళ అభివృద్ధికి ఆ విధంగా కారకుడైన నారాయణతీర్థుల వారి తరంగాలను నేటికీ కూచిపూడి భాగవత ప్రదర్శనల్లో అభినయించి, వాటిని సజీవం చేస్తున్నారు. కూచిపూడిలో ఉన్నప్పుడే శ్రీకృష్ణలీలాతరంగిణి యక్షగానాన్ని వ్రాయటం ప్రారంభించాడని, కడపటి భాగాన్ని తమిళనాడు వరాహూరు (వరుగూరు)లో పూర్తిచేశాడని ఆచార్య సాంబమూర్తిగారి వాదన.
ముచుకుందుడు కృష్ణస్తుతి చేస్తూ, “వేదాద్రి శిఖర నరసింహ మా కలయామి” అని ప్రార్థించినట్టు శ్రీకృష్ణలీలాతరంగణిలో తీర్థులవారు వ్రాశారు. ఆయనకు ఇంచుమించు రెండు శతాబ్దాల పూర్వుడైన శ్రీనాథ మహాకవి రాజమహేంద్రవరం రెడ్డిరాజయిన వీరభద్రారెడ్డికి కాశీఖండం కృతి ఇచ్చాడు. అందులో “వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలీ కల్హార మాలికా గంథలహరి..” అంటూ వేదాద్రి నరసింహుడు తన కాశికాఖండ రచనకు ఉద్బోధకంగా పేర్కొన్నాడు. నారాయణతీర్థ తరంగాల పేరుతో అముద్రితంగా కొన్ని తరంగాలు ఇక్కడ వ్యాప్తిలో ఉన్నాయి. వాటిలో ఒక దానిలో “నందబాలం నవనీత చోరం బృందావన సంచారం లాలిత శ్రీ అంతర్వేది లక్ష్మీనృసింహం..” అని ఉన్నది. ఈ సాక్ష్యాలను బట్టి బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తీర్థులవారిని గోదావరీ తీరవాసిగానే భావించారు. “ఆ వేదాద్రి గోదావరీ సాగరసంగమం వద్ద నున్న అంతర్వేదియే” అని రజనీగారు వ్రాశారు. కానీ, నారసింహ క్షేత్రాలు ఎక్కడ ఉన్నా వాటన్నింటినీ వేదాద్రి అనే వ్యవహరిస్తారని వేటూరివారు ఆక్షేపించినా, తీర్థులవారి బాల్యం గోదావరీతీరాన వేదాద్రి అంతర్వేదిలోనే అని ఎక్కువమంది భావన.
కాశీనుండి దక్షిణ యాత్రకు వస్తూ, గోదావరిజిల్లా కూచిమంచి అగ్రహారంలో మూడేళ్లున్నారని, అక్కడే శ్రీకృష్ణలీలా తరంగిణి రచన ప్రారంభించాడని మరి కొందరు భావిస్తే, గుంటూరు జిల్లా వెల్లటూరులో ప్రారంభించాడని మరికొందరు చెప్తారు.తీర్థులవారు “జయజయ రమానాథ జయజయ ధరానాథ/జయజయ వరాహపురి శ్రీ వెంకటేశ…” అని వ్రాశారు. ఈ వాక్యాన్ని బట్టి వరాహపురం అంటే ఆదివరాహ క్షేత్రమైన తిరుమలేనని వావిళ్లవారి వ్యాఖ్యానం. దీన్ని బట్టి తీర్థులవారి కార్యక్షేత్రం వరుగూరు కాకుండా తిరుపతే అవుతుంది. దీనివలన తీర్థులవారికి తమిళనేలతో సంబంధమే లేకుండా పోతుంది.
కంసుని సభకు వచ్చిన కృష్ణుణ్ణి కీర్తించే, “అవలోకయత శ్రీగోవిందంభో భో భూమావవలోకయత:” అనే కీర్తనలో “ఏకాంత దైవతం యాదవాబ్ధిసముదితం శ్రీకాకుళనగరీ శ్రీభూమి సహితం నాకవల్లభ గీతం నారాయణతీర్థ రచితం వికట మోహ రహితం విజయగోపాల మసితమ్॥ అనే చరణంలో ‘శ్రీకాకుళనగరీ శ్రీభూమి సహితం’ వాక్యాన్నిబట్టి తీర్థులవారిది కృష్ణాజిల్లా శ్రీకాకుళం కావచ్చని ఇంకో అభిప్రాయం. విశ్వనాథ వారు “తీర్థులవారు కృష్ణాజిల్లా కూచిపూడి అగ్రహార నివాసి” అని ‘కృష్ణలీలాతరంగిణి’ గ్రంథ ప్రస్తావనలో వ్రాశారు.
“కరుణామయాఽవలోకమయాం శ్రీ నృసింహ/శూరా సురసంహార శోభనాద్రి శ్రీ నృసింహ..”
తీర్థులవారి ఈ స్తుతిలో కనిపించే శోభనాద్రీశ్వరుడు కృష్ణాజిల్లా నూజివీడు సమీపాన ఉన్న ఆగిరిపల్లి గ్రామంలోని శోభనాద్రీశ్వరుడు కావచ్చునన్నారు.
ఆయనకు చిన్ననాటినుండీ పరిణామశూల అనే కడుపునొప్పి వ్యాధి ఉంది. తీవ్రమైన ఆ కడుపునొప్పి తగ్గించుకోవటానికి అద్దంకి దగ్గర సింగరాయకొండ గ్రామం నరసింహక్షేత్రం సందర్శించి, 40 రోజులు గుడిప్రదక్షిణాలు చేశాడు. నొప్పి తగ్గిన తరువాత అక్కడ స్థిరపడి కృష్ణలీలాతరంగాలు వ్రాశాడు, అద్దంకి సీమలో 60 గ్రామాల వారికి అభినయపూర్వకంగా ఆ తరంగాలు నేర్పాడని చెప్తారు. శ్రీకాకుళంలో పారుపల్లి తిరుమలరావు, సింగరాయకొండ దగ్గర చక్రాయపాలెంలో పాలపర్తి హనుమంతరావు తీర్థుల వారికి శిష్యులయ్యారు. బెజవాడ, ఆగిరిపల్లి, వేదాద్రి, నెల్లూరు, తిరుమల, రామేశ్వరం, తంజావూరు ప్రాంతాల్లో కృష్ణభక్తి ప్రచారం చేస్తూ తీర్థులవారు గడిపారు.
ఆత్మజ్ఞానసిద్ధి కలిగేవరకూ కాజ గ్రామానికి దగ్గర్లోనే ఒక కొండ మీద నారాయణతీర్థులు తపస్సు చేశారు. అప్పుడు ఆకాశవాణి అతన్ని కాశీకి వెళ్లవల్సిందిగా ఆజ్ఞాపించిందనేది ఒక కథనం. తీర్థులవారు తన జీవన గమ్యానికి మార్గదర్శం చేయగలిగే గురువు కోసం వెదకుతూ కాశీ బయల్దేరాడు.
నేలకొండపల్లి, కోదాడ, ఖమ్మం, వరంగల్లు మీదుగా హనుమకొండ చేరి, రావులపాటి వెంకట కృష్ణయ్యగారింట కొన్ని రోజులుండి. శుక్ల సంవత్సర మాఘ శుద్ధ దశమినాడు కాశీకి చేరాడనీ ఆచార్య బిరుదురాజు రామరాజుగారు వ్రాశారు.
కాశీలో హరిశ్చంద్ర ఘట్టం దగ్గర ఆయనకు గురువు శివరామానందతీర్థ పరిచయం అయ్యారు. ఆయనకు సాష్టాంగపడి ఙ్ఞానభిక్ష కోరాడనీ, యోగ్యతను పరీక్షించి, ప్రమోదూత చైత్ర శుద్ధ విదియనాడు శివరామానందతీర్థ ఆయనకు క్రమసన్యాసం ఇచ్చి నారాయణతీర్థగా నామకరణం చేశారని ఓ కథనం. ఇది కాశీలో కాదు, కంచిలొ జరిగిందని మరో వాదన కూడా ఉంది.
సంగీత గురువు శివరామానందతీర్థ
“భవభయ తిమిర దివాకర/శివరామానంద తీర్థ శిష్యోత్తముడౌ
శివనారాయణతీర్థులు/సవరణతోఁ బారిజాత చరిత రచించెన్”
అని ‘పారిజాతాపహార’ యక్షగాన ప్రతిలో తన గురువు గురించి వ్రాసుకున్నారని చెప్తారు. కాశీలో గోపాలసరస్వతి అనే గురువు దగ్గర వేదాంతం నేర్చుకున్నాడనీ, అక్కడ బ్రహ్మవిద్యా ప్రచారంలో పాల్గొన్నాడనీ కొందరు చెప్తారు. ప్రధాన గురువు, నారాయణతీర్థులవారి వ్యక్తిత్వాన్ని మలచిన గురువు రామానందయోగి. ఆయన్నే శివరామానందతీర్థ అని పిలుస్తారు.
“శ్రీ రామ గోవింద సుతీర్థ పాద కృపా విశేషా దుపలభ్య బోధం” అనే వాక్యం ఆధారంగా శ్రీ రామగోవింద తీర్థులవారి వద్ద నారాయణతీర్థులు శిష్యులుగా ఉన్నారని తెలుస్తుంది.
“ఇతి శివరామానంద తీర్థపాదసేవకశ్రీ నారాయణ తీర్థ విరచితాయాం శ్రీ కృష్నలీలాతరంగిణ్యాం” అని తీర్థులవారు తన గురువు శివరామానమ్ద తీర్థ పేరుని ఆశ్వాసాంత గద్యలో స్పష్టంగా పేర్కొన్నారు. లీలాశుకుడికి సోమగిరియోగి లాగే, నారాయణతీర్థులవారికి శివరామానంద అలాంటి గురువు. దేశమంతా పర్యటిస్తూ, కృష్ణభక్తి పారవశ్యంతో తరంగాలు పాడుతూ చివరికి కాశీ చేరి తనువు చాలించి ఉంటాడని సంస్కృత వాఙ్మయ చరిత్రకారుల అభిప్రాయం.
రామానందయోగి, రాయరామానంద, రామానంద తీర్థ, శివరామానందతీర్థ ఇవన్నీ రామగోవింద తీర్థులవారి పేర్లే. ఈ గురువు చరిత్ర ప్రసిద్ధుడు. సంగీత నృత్య విద్యల్ని, రాధాకృష్ణతత్త్వాన్ని, ఆదిశంకరుని ‘ప్రబోధసుధాకరం’ గ్రంథాన్ని ఈయనే తీర్థులవారికి బోధించాడు. స్వయంగా ఈ గురువే ఆయనకు నారాయణతీర్థులు అనే పేరిచ్చారు. కాగా, గురువు పేరు కూడా చేర్చుకుని తనను శివనారాయణతీర్థులుగా ప్రకటించుకున్నారు. తీర్థులవారి అద్వైత భావనకు ఈ శివనారాయణతీర్థులు నామధారణ ఒకసాక్ష్యం కూడా!
తన గురువు ఒక యతి. దేశసంచారి. విద్యలు నేరుస్తూనే గురువుతో కలిసి దేశాటన చేశాడని, అప్పుడే వేదాద్రి, శోభనాద్రి, శ్రీకాకుళం వగైరా పుణ్యక్షేత్రాలు సందర్శించాడని ఆ యా క్షేత్రాలపైన అనేక స్తోత్రాలను వ్రాశాడనీ, తన ‘శ్రీకృష్ణలీలాతరంగిణి’లో ప్రస్తావన వశాత్తూ వాటిని ఉటంకించి ఉంటాడనీ ఒక సమన్వయాన్ని రజనీగారు చేశారు.
శ్రీ రామానంద యోగి ఎవరో తెలుసుకుంటే, ఓఢ్ర (ఒరిస్సా) దేశంలో రాధాకృష్ణ ఉద్యమ ప్రభావం, చైతన్యమహాప్రభు చేసిన కృషి, వాటి ప్రభావం తీర్థులవారి మీద ఎంత ఉందీ అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరుకుతాయి. నిజానికి ఒరిస్సాలో రాధాకృష్ణ ఉద్యమం జయదేవుడితో ప్రారంభమయ్యింది. జయదేవుడి తరువాత 2 శతాబ్దాలు అది అదృశ్యంగా ఉండి, ఓఢ్రగజపతి ప్రభువు ప్రతాపరుద్ర దేవుడి 43యేళ్ల పాలనా కాలంలో (1497-1540) తిరిగి ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఆయన స్వయంగా కవి. ‘అభినవ వేణీసంహారం’ లాంటి అనేక రచనలు చేశాడు. పూరీ జగన్నాధుడి మహాభక్తుడు.
చైతన్యమహాప్రభు పూరీ రాక
చైతన్య మహాప్రభు 1509లో తొలిసారిగా ఒరిస్సా వచ్చాడు. ‘కలియుగానికి రాధాకృష్ణ ఆరాధనే శరణ్యం’ అనే సిద్ధాంతాన్ని ప్రచారం లోకి తెచ్చాడు. హరినామ సంకీర్తనకు మించింది లేదని ప్రబోధించాడు. నామ మహిమని చాటిచెప్పాడు. ‘హరేకృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే-హరే రామ హరేరామ రామరామ హరేహరే’ అనే మంత్రం మోక్షసాధనకు ప్రధానం అంటూ ఉపదేశించాడు.
బెంగాల్లో పుట్టిపెరిగి, కృష్ణభక్తిత్త్వ ప్రచారకుడిగా పేరొందిన చెందిన చైతన్యమహాప్రభు జీవిత చరమాంకంలో పూరీ జగన్నాథుడి సన్నిధిలో గడిపాడు. నిజానికి, ఆయన అక్కడకు వచ్చే సమయానికి రాధాకృష్ణ ఆరాధనా ఉద్యమం కొంత నడుస్తూనే ఉంది. కవివర రాయదివాకర మిశ్రా రచన అభినవ గీతగోవిందం లాంటి రచనలు అప్పటికే వెలువడ్డాయి. చైతన్యమహాప్రభు వచ్చిన తరువాత రాధాకృష్ణ ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. ప్రతీ యేడాదీ జరిగే జగన్నాథ రథోత్సవం ముందు చైతన్యమహాప్రభు తన శిష్యులతో కృష్ణగానం చేస్తూ ఆడుతుంటే ప్రజలు మైమరచి లీనమై పోతుండేవారు. ప్రతీ ఇంట రాధాదేవి మానసిక శక్తినిచ్చే దేవతగా కొలుపులందుకుంది.
ప్రతాపరుద్రదేవగజపతి
చైతన్యమహాప్రభు పూరీ వచ్చే నాటికి అక్కడ అధికారంలో ఉన్నవాడు ప్రతాపరుద్రదేవ గజపతి. గొప్ప ప్రతిభా సంపన్నుడు. సంస్కృత పండితుడు. ఈయన పాలనా యుగాన్ని ఒరియా సాహిత్యానికి సువర్ణ దశగా భావిస్తారు. నేటి ఆంధ్రప్రదేశ్‘లోని కోస్తాతీర ప్రాంతాలు చాలా వరకూ ఈయన ఏలుబడిలోనే ఉండేవి. ఉన్నాయి కూడా!
గజపతి గౌడేశ్వర, నవకోటి కర్ణాట కలవరగేశ్వర, యమున పురాధీశ్వర, హుస్సేన్ సాహి సుత్రాణ, శరణరక్షక అని బిరుదులు పొందిన ప్రతాపరుద్ర గజపతి. తెలుగు, కన్నడ, ఒరియా భూభాగాలలో చాలా ప్రాంతాలను పాలించాడు.
కృష్ణదేవరాయల చేతిలో ఓటమి పాలై సంధి కుదుర్చుకున్న గజపతి ప్రభువు ఈయనే! కులం తక్కువ వాడంటూ శ్రీకృష్ణదేవరాయలికి తన కూతురు నివ్వటానికి నిరాకరించినవాడు. విచిత్రంగా ఇదే సంఘటన అతని జీవితంలోనూ జరిగింది. జగన్నాథుని రథయాత్ర సమయంలో చీపురు పట్టుకుని సామాన్యుడిలా వీధిని ఊడుస్తాడని కలిబురిగి రాజు ఇతన్ని ఈసడించి పిల్లనివ్వటానికి నిరాకరిస్తే, అతన్ని యుద్ధంలో ఓడించి ఆతని కన్యను గెలుచుకున్న యోధుడు. అలాంటి ప్రతాపరుద్రదేవుడు రాయల విషయంలో కులం పేరుతో వ్యతిరేక నిర్ణయం తీసుకున్నాడంటే నమ్మలేం. చివరికి అల్లుణ్ణి చంపించే ప్రయత్నం చేశాడని కూడా మన చరిత్రకారులు చెప్తారు.
ఒరియా చరిత్రకారులు కృష్ణదేవరాయలి ఈ కథలన్నీ కట్టుకథలుగానే భావిస్తారు. ప్రతాపరుద్రదేవుడి గురించి ఒరిస్సా చరిత్రకారులు చిత్రించిన విశయాల్ని, ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే తను అలాంటి కులతత్త్వవాదిగా కనిపించడు. వారి దృష్టిలో శ్రీ కృష్ణదేవరాయలు దోషి. నిష్పాక్షికంగా శోధించి నిజాన్ని నిగ్గు తేల్చకుండా ప్రజల్లో వ్యాప్తిలో ఉన్న కథనాల్నే చరిత్రగా వ్రాశారనిపిస్తుంది.
తెలుగునేల నేలిన ప్రతాపరుద్ర గజపతి
తెలుగువారిని గజపతులు కనీసం 80 యేళ్లు పాలించినా, వారికి సంబంధించిన చరిత్రలు మనవైపు పెద్దగా రికార్డు కాలేదు.
“కర్ణాటేశ్వర కృష్ణరాయనృపతేర్గర్వాగ్ని నిర్వాపకె
యత్రన్యస్తభరోఽభవేద్ గజపతిః శ్రీరుద్రభూమీపతిః
తస్య బ్రహ్మవిచార చారుమనసః శ్రీకూర్మవిద్యాధరాః
శ్యానంద మకరందశుద్ధివిధిన సాంద్రమయ మండతః”
కృష్ణదేవరాయల జైత్రయాత్రని బెజవాడ వద్ద నిలువరించగలిగిన ప్రతాపరుద్రదేవగజపతి మంత్రి బ్రహ్మవిచార చారు మనస్కుడైన శ్రీకూర్మ విద్యాధర విజయాన్ని ఈ శ్లోకం వివరిస్తోంది. విజయవాడలోని విద్యాధరపురం ఈ విద్యాధరమంత్రి పేరునే వెలిసి ఉండవచ్చు. కపిలేశ్వరపురం, విజయవాడ సమీపంలోని ముత్యాలంపాడు, పైడూరుపాడు గ్రామాలు ఈ గజపతుల కుటుంబీకుల పేర్లతో వెలసినవే!
కృష్ణదేవరాయల మరణం తర్వాత, విజయనగర సామ్రాజ్యం క్రమంగా బలహీనపడింది. ఈ కారణంగా ఒడీసా గజపతుల రాజ్యంలో చాలావరకూ శాంతి నెలకొని సంగీత సాహిత్య, నృత్యాది కళలు అపారంగా వర్థిల్లాయని ఒడీసా చరిత్రకారులు వ్రాశారు. భాషాసంస్కృతుల పట్ల అనురక్తి కలిగినవారైనప్పటికీ, ప్రతాపరుద్రదేవుడుగానీ, ఇతర గజపతి ప్రభువులు గానీ, షుమారు 8-9 దశాబ్దాలు మనల్ని ఏలినా తెలుగు ప్రాంతాలలో ఎక్కడా తమ ఒరియా భాషని గానీ, వారి కళల్ని గానీ తెచ్చి రుద్దే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు కనిపించవు. వారి గురించిన వ్యతిరేక కథనాలు కూడా మనకు ప్రచారంలో లేవు.
ప్రతాపరుద్రగజపతి ఒరిస్సాలో చైతన్యప్రభు ప్రబోధించిన రాధాకృష్ణ భక్తి ఉద్యమానికి గట్టి పునాదులు వేశాడు. రామానుజుల వైష్ణవభక్తి ఉద్యమం ఉత్తరాదికి ఎగబ్రాకకుండా ఈ రాధాకృష్ణ ఉద్యమం విజయవంతంగా అడ్డుకోగలిగిందని ఒరియా చరిత్రకారుల భావన. అందుకు ప్రోద్బలం కలిగించిన వారిలో ప్రతాపరుద్రదేవుడి మంత్రి రాయరామానంద కూడా ఉన్నారు. గజపతుల దక్షిణాది వ్యవహారాలను పర్యవేక్షించే అధికారిగా ‘రాయ రామానంద’ రాజమహేంద్రవరం కేంద్రంగా30 యేళ్లకు పైనే పనిచేశాడు. 1540ల వరకూ రాజమహేంద్రవరం లోనే ఉన్నాడు. ప్రతాపరుద్ర గజపతికి గొప్ప నమ్మకస్తుడైన మంత్రి. బలసంపన్నుడు. కుడిభుజం లాంటివాడు. బ్రాహ్మణ మేథావి.
రాయరామానంద మంత్రికి సమకాలికుడు లొల్ల లక్ష్మీధరపండితుడు. ఈయన కూడా గుంటురుజిల్లా కాజ గ్రామం వాడే. ప్రతాపరుద్ర దేవుడి ఆస్థానపండితుడుగా ఉండేవాడు. సరస్వతీవిలాసం పేరున న్యాయశాస్త్రాన్ని ప్రముఖంగా నగరపాలన – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ – గురించిన సూత్రాలను ప్రతాపరుద్రదేవుడి పేరుతో ఈ తెలుగు పండితుడే వ్రాశాడని చెప్తారు. ఆ తరువాత కృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా కవి పండితుడిగా ఉండేవాడు. గుంటూరుజిల్లా కాజ దగ్గర అనంతవరం అగ్రహారాన్ని పొందాడు. రాయరామానందకు అత్యంత సన్నిహితుడు. లక్ష్మీధరపండితుడి వార్థక్యంలో బహుశా తీర్థులవారు నూనూగు మీసాల యువకుడు కావచ్చు.
(సశేషం)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.