[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘హరిచరణ స్మరణ పరాయణ శ్రీ నారాయణతీర్థ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మొదటి భాగము.]
“శరణం భవ కరుణాం మయి-కురు దీనదయాళో
కరుణారసవరుణాలయ-కరిరాజకృపాళో॥
అధునా ఖలు విధినా మయి-సుధియా సురభరితం
మధుసూదన మధుసూదన-హర మామకదురితమ్॥
1.
వరనూపురధర సుందర-కరశోభితవలయ
సురభూసురభయవారక-ధరణిధర కృపయా
త్వరయా హర భర మీశ్వర- సురవర్య మదీయం
మధుసూదన మధుసూదన-హర మామకదురితమ్॥
2.
ఘృణిమండలమణికుండల-ఫణిమండలశయన
అణిమాదిసుగుణభూషణ-మణిమంటపసదన
వినతాసుతఘనవాహన-మునిమానసభవన
మధుసూదన మధుసూదన-హర మామకదురితమ్॥
3.
అరిభీకర హలిసోదర-పరిపూర్ణసుఖాబ్ధే
నరకాంతక నరపాలక-పరిపాలితజలధే
హరిసేవక శివనారా-యణతీర్థపరాత్మన్
మధుసూదన మధుసూదన-హర మామకదురితమ్॥”
శ్రీ నారాయణతీర్థులు ‘కలి’ వలన కలిగే కల్మషాల్ని పోగొట్టి కోరిన కోర్కెల నీడేర్చే నారాయణుడి చరితాన్ని గీతంగా మలిచి సమస్త మానవాళీ పాడుకుని ఆ పరమాత్మను చేరుకోవటానికి ఒక దగ్గిర దారిగా అందించారు.
‘గోపుర మణి చిత్తమాతంగ మహనీయాలానభూతుడైన బాలకృష్ణుడిలో నిగమగోచర నిత్య నిర్మలానంద ఘన’మైన పరమాత్మ తత్త్వాన్ని దర్శించి మృదు మృదంగ తాళగతి పారవశ్యంతో గానం చేసి మనందరి చేతా దర్శింపచేన వాగ్గేయకారుడు, కర్మయోగి శ్రీ శివనారాయ్తణ తీర్థులవారి రచన ఇది.
ఎక్కడ సంగీత సభ జరిగినా శ్రోతల్ని మైమరిపించేలా దేవగాంధారిలో తప్పనిసరిగా వినిపించే ఈ కీర్తన భక్తకవి, సాక్షాత్ భగవత్స్వరూపుడు, శ్రీ శివనారాయణతీర్థులవారి శ్రీకృష్ణలీలాతరంగిణి సంస్కృత యక్షగాన ప్రబంధంలోది.
కవిత్వం ప్రదర్శన యోగ్యమైనప్పుడు దానికి రాణింపు ఎక్కువగా ఉంటుంది. శ్రీకృష్ణలీలాతరంగిణి యక్షగాన పద్ధతిలో వ్రాసిన ఒక అద్భుతమైన నృత్యరూపకం. తమ ప్రతిభనంతా చాలినంత ప్రదర్శించుకో గలిగే వీలున్న గొప్ప రచన.
ఎక్కడో తమిళనాడులో తంజావూరు దగ్గర, కావేరీ ఒడ్డున వరుగూరనే మారుమూలపల్లెలో సంస్కృతభాషలో తన సారస్వతాన్ని వెలయించిన శ్రీ నారాయణతీర్థులవారిని చాలా కాలం తమిళుడే అనుకున్నారంతా! కానీ, అటు తమిళ పరిశోధకులు, ఇటు తెలుగు పరిశోధకులు ఒక వైపు, సంస్కృత వాఙ్మయ చరిత్రకారులు ఇంకొకవైపు చేసిన పరిశోధనల పుణ్యమా అని శ్రీ నారాయణతీర్థులవారు పదారణాల తెలుగుబిడ్డ అనే సత్యం వెలుగులోకి వచ్చింది. ఆయన తెలుగు నేలపైనే పుట్టి పెరిగాడు. తెలుగు, సంస్కృత సారస్వతాల్ని వంటపట్టించుకున్నాడు. ఆదినుండీ భక్తిమార్గంలో సాధన చేశాడు. జయదేవుడు, లీలాశుకుడు అన్నమయ్యల తరువాత అంతటి భక్తకవిగా ప్రసిద్ధి పొందాడు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ రాష్ట్రాల్లోనే కాక, ఇతర రాష్ట్రాల్లో కూడా నారాయణతీర్థుల వారి కీర్తనలు జనబాహుళ్యంలో ప్రసిద్ధి పొందాయి.
తీర్థులవారు శ్రీ కృష్ణలీలాతరంగిణిలో తన పేరును వరనారాయణతీర్థ, శివనారాయణతీర్థ, యతినారాయణతీర్థ, ముని నారాయణతీర్థ, శివనారాయణానంద ఇలా చెప్పుకున్నారు. శివనారాయణతీర్థ అనేదే ఎక్కువ వ్యాప్తిలో ఉంది.
ఏ పేరుతో కొలిచినా అది ఆ మహనీయుడి పాదపద్మాలకే చేరుతుంది.
శ్రీకృష్ణలీలాతరంగిణి మహాయక్షగానం
జయదేవమహాకవి తన అష్టపదుల్లో ఆ గోవిందుని మన కళ్ళముందు సాక్షాత్కరింప చేస్తూ శ్రీగీతగోవిందాన్ని వెలయించారు. గీతగోవింద కథ రాధామాధవ శృంగారానికి పరిమితంగా ఆ కావ్యాన్ని రూపొందించాడు జయదేవకవి.
శ్రీ లీలాశుకయోగి భక్తుల చెవులకు అమృతం లాంటి భక్తిని అందిస్తూ శ్రీకృష్ణకర్ణామృతం వ్రాశారు. ఇది మూడు ఆశ్వాసాల్లో శ్లోకమయంగా సాగుతుంది. శ్రీకృష్ణుడి మనోజ్ఞ సౌందర్యాదిక వర్ణనలు, లీలావిలాస వర్ణనలు, ఇందులో వర్ణితాలు.
శ్రీ అన్నమాచార్యులవారు హరిభక్తిని చాటుకుంటూ 30 వేలకు పైబడిన సంకీర్తనల్ని ఆ స్వామికి అంకితంగా అందించి ఆ శ్రీహరిని భక్త సులభుడిగా నిరూపించారు. భగవంతుని మీద మన వలపుకొద్దీ ముక్తి ఉంటుందన్నారు.
శ్రీనారాయణతీర్థులవారు లీలామానుష విగ్రహుడైన ఆ కృష్ణుడి సర్వాంతర్యామిత్వాన్ని ఆయన లీలలుగా వర్ణిస్తూ యక్షగాన పద్ధతిలో శ్రీకృష్ణలీలా తరంగిణి వెలయించారు. ఇందులో సంభాషణలు, వర్ణనలూ కలగలిసి, ప్రతీ తరంగమూ ఒక సంకీర్తనగా కృష్ణపరతత్త్వ బోధకంగా ఉంటాయి. కర్ణాటక సంగీత పరిథిలో వెలిసిన గొప్ప వాగ్గేయ రచన ఇది. సరళ సంస్కృత భాషలో రచితమైన కావ్యం కాబట్టి, దక్షిణాదిని దాటి, కర్ణాటక సంగీత పరిథిని కూడా దాటి యావద్భారతదేశంలోనూ ప్రసిద్ధి పొందింది.
తరంగిణి అంటే నది. అందులోకమ్మగా పాడి కడురమ్యంగా అడేందుకు వీలైన కీర్తనలే తరంగాలు.
నదీ జలాలని దాటేందుకు ఈతగాడు తరంగాల్ని ఒకదాని వెంట ఒకటి తోసుకుంటూ ఒడ్డుకు చేరినట్టే తీర్థులవారి తరంగాలు భక్తుల్ని పరమాత్మ దగ్గరకు చేరుస్తాయనే నమ్మకాన్ని కలిగించాడు.
శ్రీకృష్ణలీలాతరంగిణిలో ప్రముఖంగా చెప్పుకోవలసింది భాష. చాలా సరళమైన సంస్కృతభాషలో ఈ రచన మొత్తం సాగుతుంది.. రోజువారీగా మనం వాడుకగా ఉపయోగించే సంస్కృత పదాల్నే ఆయన ఎంతో వేడుకగా భక్తిని మేళవించి ఈ కీర్తనల్లో ఉపయోగించాడు. తాళం వేసుకుంటూ రాగాలాపనకు అనువుగా గానం చేస్తూ తీర్థులవారు అలవోకగా పాడిన ఈకీర్తనలు యావత్తూ అనుప్రాస మాధుర్యంతో అలరారుతుంటాయి.
జయదేవుడి అష్టపదులు సంగీతాభిమానులకు కంఠతా వచ్చు, తీర్థులవారి తరంగాలు జనసామాన్యానిక్కూడా కంఠతా వచ్చు. కారణం సరళమైన సంస్కృతంలో ఈ రచన సాగటమే! “యదునందన భక్తచందన కృష్ణకృష్ణ మాంపాహి” అంటే అర్థం కాని వారుండరు.
“కృష్ణంకలయసఖి సుందరం/కృష్ణం గత విషయ తృష్ణం/జగత్ప్రభవిష్ణుం సురారిగణ జిష్ణుం సదాబాలకృష్ణం.. కలయసఖి” అని ముఖారి రాగంలో నారాయణతీర్థులే భక్తి ఒప్పారగా పాడుతుంటే విని తరించిన ఆనాటి వరుగూరు తమిళ ప్రజలు ధన్యులు.
శ్రీ జయదేవ కవి ‘గీతగోవిందం’, శ్రీ లీలాశుకులవారి ‘శ్రీకృష్ణకర్ణామృతం’, శ్రీనారాయణతీర్థులవారి ‘శ్రీకృష్ణలీలాతరంగిణి’ ఈ మూడింటినీ దగ్గర పెట్టుకుని తులనాత్మకంగా పరిశీలిస్తే, కృష్ణలీలల్ని, ముఖ్యంగా రాసలీలల్ని వర్ణించటంలో ఈ ముగ్గురూ ఎవరి ప్రతిభను వారు ప్రదర్శించగా, నారాయణతీర్థులు కృష్ణతత్త్వాన్ని నిరూపించటం అదనపు శోభనిచ్చేదిగా గుర్తించగలుగుతాం.
“గీతం, వాద్యం, తథా నృత్యం త్రయం సంగీత ముచ్యతే” అని సంగీతరత్నాకరం చెప్తోంది. గీతం, వాద్యం, నృత్యం కలిస్తేనే సంగీతం అవుతుంది. శ్రీ నారాయణతీర్థుల వారు శ్రీకృష్ణలీలాతరంగిణిలో ఈ లక్షణాన్ని అక్షరాలా పాటించారు.
“సొగసుగ మృదంగ తాళముల్ జతగూర్చి నిను సొక్కజేయు ధీరుడెవ్వడో” అని త్యాగయ్య కూడా ఈ మార్గాన్నే అనుసరించారు.
యక్షగాన ప్రక్రియలో..
అటు శాస్త్రీయ సంగీతానికి, ఇటు జానపద సంగీతానికీ సమాన ప్రాతినిధ్యం ఇస్తూ జనరంజకత లక్ష్యంగా అభివృద్ధి చెందిన దాక్షిణాత్య ప్రదర్శనకళ యక్షగాన ప్రక్రియ. తెలుగువారు ఈ కళకు ప్రాణం పోయగా, కన్నడ తమిళ ప్రజలు సమాదరించి పెంపుచేశారు.
తీర్థులవారి తరంగాలను యక్షగాన విధానంలో గొప్ప గాయకులు పాడుతుంటే సామాన్యుడు సైతం మైమరచిపోతాడు. దక్షిణాది లోనే కాదు, ఉత్తరాదిలో కూడా భక్తి, వేదాంతాల పరంగా కృష్ణభక్తి ప్రచారానికి నారాయణతీర్థుల వారు మార్గదర్శి! ఆయన ఈ రచనని సంస్కృతంలో చేయటం వలనే ఇది సాధ్యం అయ్యింది.
ఇందులోని కీర్తనల్ని తరంగాలు అనటం సరికాదనీ, కృష్ణలీలలకు సంబంధించిన 12 అంకాల మహానాటకంలోని ఒక్కొక్క అంకమూ ఒక్కొక్క తరంగం అని, నృత్యసంగీత, సాహిత్య వేదాంతాది బహుళశాస్త్ర పారదర్శియై విసర్గ సరళమయిన శిల్పంతో నవ్యమార్గాన సంస్కృతాంధ్రములలో యక్షగాన రచన సాగించారనీ బాలాంత్రపు రజనీకాంతరావు (రజనీ) గారు ‘ఆంధ్రవాగ్గేయకార చరిత్రము’లో వ్రాశారు.
‘కథలు-గాథలు’లో చెళ్లపిళ్లవారు నారాయణతీర్థుల శ్రీకృష్ణలీలాతరంగిణి ముగింపులో కనిపించే ‘మంగళం’ గురించి ప్రస్తావిస్తూ, “మంగళం రుక్కిణీ రమణాయ శ్రీమతే/ మంగళం. రమణీయ మూర్తయే తే!” అంటూ సాగే మంగళహారతి గేయంలో “మంగళం, నందగోపాత్మజాయ” అనటం ద్వారా శ్రీ కృష్ణుడు నందయశోదల పెంపుడు బిడ్డేననే రహస్యాన్నీ, “శీతకిరణాదికుల భూషాయ” అనటం ద్వారా ఆయన చంద్రవంశస్థుడుగానీ, గోపకులస్థుడు కాదనే వృత్తాంతాన్నీ, “నారద మునీంద్రనుత” అనటం ద్వారా నారదు డంతటివాడు స్తుతించాడంటే ఆయన తప్పనిసరిగా పరమేశ్వరుడి అవతారం అనే సత్యాన్నీ స్పష్టం చేశాడంటూ వివరిస్తారు. “లాకలూకాయల్ని నారదుడు పొగడడు కదా..!” అంటారు చెళ్లపిళ్ళవారు.
శ్రీకృష్ణలీలాతరంగిణి విశేషాలు
12వ శతాబ్దినాటి గీతగోవిందం ఈ కావ్య రచనకు సిద్ధాంతపరమైన ప్రేరణ అని పండితులు భావిస్తారు. అత్యంత సరళగ్రాంథికంలో సామాన్యుడు సైతం అర్థం చేసుకుని భక్తిమార్గానికి చేరేలా శక్తి ఆ తరంగాలకుంది.
భాగవతంలో ఉన్నట్టే గీతగోవిందంలో కథావస్తువు 12 సర్గాలుగా విభజించబడింది. నారాయణతీర్థులవారి శ్రీకృష్ణలీలాతరంగిణి కథ కృష్ణజననం మొదలుకొని రుక్కిణీకల్యాణ మహోత్సవం దాకా 12 తరంగాలుగా సాగింది. ఒక్కో తరంగం ఒక్కో అధ్యాయం లాంటిది. కొన్ని ఆశ్వాసాల్లో గేయాల్ని కూడా తరంగాలుగానే భావించారు.
గీతగోవిందంలో సుమారు35 రాగాల్లో తరంగాలు, శ్లోకాలు, గద్యాలు, దరువులు, చూర్ణికలూ ఉన్నాయి. ఇవి యక్షగానానికి అనువైనవి. వేదికపైన నృత్యనాటికగా ప్రదర్శించటం కోసమే శ్రీకృష్ణలీలాతరంగిణి వ్రాశారన్నది స్పష్టం. ఆ ప్రదర్శన కోసం రాధామాధవుల ప్రణయ తత్వాన్ని ప్రచారం చేయటం ఆయన లక్ష్యం. అందుకు ఈ ప్రదర్శనకలని ఒక సాధనంగా ఉపయోగించారాయన. కృష్ణుని సర్వవ్యాపకత్వాన్ని, పరమాత్మస్వరూపాన్ని నిరూపించటం లక్ష్యంగా ఈ నృత్యరూపకాన్ని రూపొందించారాయన.
గీతగోవిందం కూడా 12 సర్గల కావ్యమే! ఒక్కో సర్గలో రెండు చొప్పున 24 అష్టపదుల్ని జయదేవుడు వ్రాశాడు. కథాగమనం కోసం శ్లోకాలను ఉపయోగించుకున్నాడు కవి. 12 తరంగాలు, 145 కీర్తనలు, 267 శ్లోకాలు,30 దరువులు,30 గద్యాలతో కృష్ణలీలాతరంగిణి నిర్మితమయ్యింది.
- ప్రథమ తరంగం: శ్రీకృష్ణ ప్రాదుర్భావ వర్ణనం, కంస దౌష్ట్యం
- ద్వితీయ తరంగం: శ్రీకృష్ణ బాలలీలా వర్ణనం, పూతనవథ, యమళార్జున భంజనం, మృద్బక్షణం, విశ్వరూప ప్రదర్శనం
- తృతీయ తరంగం: శ్రీకృష్ణ గోవత్సపాలన వర్ణనం, అఘాసురవధ, బ్రహ్మ యఙ్ఞపత్నుల కృష్ణస్తుతి
- చతుర్థ తరంగం: శ్రీకృష్ణ గోపాల వర్ణనంమ్ కాళీయ మర్దనం, ఖర ప్రలంబాసుర వధ, దావాగ్ని భక్షణం
- పంచమ తరంగం: శ్రీకృష్ణ గోపీవస్త్రాపహార గోవర్ధనోద్ధార వర్ణనం
- షష్ఠ తరంగం: శ్రీకృష్ణ గోపీసమాగమ వర్ణనం, ఆధ్యాత్మికతత్త్వ వివరణ
- సప్తమ తరంగం: శ్రీకృష్ణరాసక్రీడా వర్ణనం, కృష్ణుని అద్వైత తత్త్వోపదేశం
- అష్టమ తరంగం: గోపికాగీతలు, రాసక్రీడా వర్ణనం, గోపికలు కృష్ణుని అన్వేషించటం
- నవమ తరంగం: అక్రూర సందేశం, అక్రూరుడికి విశ్వరూప సందర్శన భాగ్యం, బలరామ కృష్ణుల మధురాప్రవేశ వర్ణనం
- దశమ తరంగం: రజకాది నిగ్రహం, కుబ్జాప్రీణనం, చాణూర ముష్టికాదుల వధ, కంసనిర్హరణం, పితృదర్శనం
- ఏకాదశ తరంగం: గోపికా విరహం, ఉద్ధవుడి సందేశం, కాలయవన వధ, ముచుకుంద స్తుతి. శ్రీకృష్ణుడు ద్వారకానగర ప్రవేశం
- ద్వాదశ తరంగం: శ్రీకృష్ణరుక్మిణీకల్యాణమహోత్సవ వర్ణనం, అష్టమహిషీ కళ్యాణం
గీతగోవిందంలో కథన విధానంలో ప్రతి అష్టపది చుట్టూ చిక్కని కథ అల్లుకుని ఉంటుంది. కృష్ణుడి విరహంలో పడిన రాథ బాధే ఈ అష్టపదుల్లో కనిపిస్తుంది. హిందుస్థానీ, కర్ణాటక, ఒడిసీ బాణీలలో పాడుకోవటానికి అనువుగా ఆ అష్టపదులు ఉంటాయి. దేవాలయ ఉత్సవాలలో ఎక్కువగా వీటిని ప్రదర్శిస్తుంటారు. జయదేవుడికీ 3-4 శతాబ్దాల తరువాత నారాయణతీర్థులవారు జన్మించారు. ఆ తేడా ఇద్దరి రచనల్లోనూ కనిపిస్తుంది.
కర్ణాట సంగీతం ఒక రూపు తీసుకుని ప్రత్యేకత సంతరించుకుంటున్న దశలో తీర్థులవారి కృష్ణలీలాతరంగిణి వెలువడింది. అందువలన తీర్థులవారి భాణీలు కర్ణాట సంగీత పరిథిలో ఉంటాయి.
“వాసుదేవే భగవతి భక్తి ప్రవణయా ధియా| వ్యజ్యతే భక్తిసారాధ్యా కృష్ణలీలా తరంగిణీ..” భగవంతుడైన వాసుదేవుడిపట్ల భక్తి ప్రవణులైన ధీమంతులకు, భక్తిసారం సంపదగా కలవారికి ఈ కృష్ణలీలాతరంగణి బోధపడుతుందంటారు నారాయణతీర్థులవారు.
నారాయణతీర్థులవారు చిన్ననాటినుండీ తనను తాను రాధగా భావిస్తూ కృష్ణధ్యానం చేసేవాడని, వివాహం అయినా గృహస్థాశ్రమం గడపకుండా సన్యసించి, పండితులకు నెలవైన కాశీలో శతశాస్త్రాలూ అభ్యసించి జీవితకాలం సాధనచేసి రచించిన మహాకావ్యం ఇదని ఉత్తరాది సంస్కృతపండితుల అభిప్రాయం.
శ్రీకృష్ణుడే దశావతారాలు ధరించాడు!
శ్రీమన్నారాయణుని దశావతారాల గురించి నారాయణతీర్థులవారు ఒక శ్లోకంలో ఇలా వ్రాశారు:
“మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః| రామో రామశ్చ బుద్ధః కలికి రేవ చ||”
ఇది దశావతారాల పట్టిక. ఇందులో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, బుద్ధ, కల్కి అవతారాలున్నాయి. శ్రీకృష్ణుడు లేడు. కృష్ణుడి స్థానంలో బలరామదేవుడున్నాడు. కృష్ణుడు లేని దశావతారాలేమిటీ? బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అతీతుడైనవాడు శ్రీకృష్ణుడు. ఆయన గోలోక వాసి, ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు. ఆయనే త్రిమూర్తులు, ఆయనే త్రిమూర్తుల అవతారాలు కూడా! శ్రీకృష్ణుడే దశావతారాలను ధరించాడనేది దీని సారాంశం. కాబట్టి, దశావతారాల్లో శ్రీ కృష్ణుడు ఉండడు.
“హల ముసలములను గరముల
నల వగచియు రాజరాజు ననుఁగు తనయుడై
హలహతి నతిభయయుతగను
నల కరిపురిఁజేసినట్టి హరీ! బలరామా!!”
అని బలరామావతారానికి నారాయణతీర్థులవారి వర్ణనకు రాజా శ్రీ మేకా రంగయ్య అప్పారావు చేసిన తెలుగు ఇది!
పోతనగారు ‘మహానందాంగనా డింభకుడు’గా శ్రీ కృష్ణుని సంభావించుకుని శ్రీకృష్ణలీలావిశేషాల వర్ణనలతో శ్రీమదాంధ్ర భాగవతంలో దశమస్కంథాన్ని రూపొందించారు. దేవతా అవతారాలలో విశేషమైన లీలలతో బోధలతో, ఘనచేతలతో రంజిల్లచేయగల అవతారం శ్రీకృష్ణావతారమే. ఆబాలగోపాలమూ ఆ కృష్ణరసాయనంలో లీనమైనవారే!
కృష్ణ అనే నామంలోనే ఒక ఆకర్షణ ఉంది. దేశీయుల్నేకాదు, విదేశీయుల్ని కూడా అమితంగా ఆకర్షించిన అవతార విశేషం శ్రీకృష్ణావతారమే. భారతీయ సాహిత్య సంగీతాల్లో కృష్ణుడు లేని చోటులేదు.
ఆ పరబ్రహ్మను కన్నతల్లి, పెంచినతల్లి పవిత్రులైన దేవకీదేవి, యశోదాదేవి. వారి ఆనందాన్ని కొలిచి చూపగలమా? కేవలం ఆ తల్లులకే కాదు ఆనాటి గోపకులమంతా గోపభామ లందరూ ఆ కృష్ణుని మాయలో పడినవారే.
ఆ క్షణమే అమాయకునిగా ప్రవర్తించి ఆ మరుక్షణమే నేను పరబ్రహ్మను అని చెప్పి అందరినీ అబ్బుర పరుస్తాడు శ్రీ కృష్ణుడు.
“ఆత్మానాం మానుషం మన్యే రామం దశరథాత్మజం” అంటూ రామాయణ కావ్యంలో తనను తాను సామాన్య మానవుడిగా, దశరథుడి పుత్రుడిగానే భావించుకుంటున్నాననే శ్రీరాముడు చెప్పుకున్నాడు. కానీ, శ్రీకృష్ణుడు అలా కాదు. జన్మించగానే శంఖ, చక్ర, గదాధారిగా దేవకీ వసుదేవులకు తన నిజరూపంలో దర్శనం ఇచ్చాడు. తన అవతార రహస్యాన్ని వెల్లడిస్తాడు. మనిషిలా ప్రవర్తించి అనేక అద్భుతాలు చేస్తూ, తానే పరబ్రహ్మననే ఎరుకని కలిగిస్తూవచ్చాడు. గోపబాలురతో మొదలుపెట్టి రాధ దాకా అందరికీ తానే పరమాత్ముణ్ణనే ఎరుక కలిగించాడు.
చతుర్భుజుడైన ఆ పరమాత్మను సాక్షాత్కరింపజేసుకున్న శ్రీ నారాయణతీర్థులవారు ఈ రహస్యాన్ని అత్యద్భుతంగా ఉపయోగించుకుని మాధుర్యభరితమైన కీర్తనల్లో శ్రీకృష్ణుని బాల్యక్రీడావిశేషాలు, రుక్మిణీ మనోవల్లభుడైన ఘట్టాలను మనోహరంగా చిత్రిస్తూ శ్రీకృష్ణపరమాత్మతత్త్వాన్ని నిరూపించేందుకు పూనుకున్నారు.
కాళీయమర్దనం, నలకూబరుడు, మణిగ్రీవుల శాపవిమోచనం కోసం జరిపిన ఉలూకలబంధనం, యశోదాదేవికి తన చిన్ని నోటిలోనే 14 భువ నభోంతరాళాలను చూపటం, వెన్న కుండలతో ఎన్నెన్నో ఆటలు ఇలా ఇన్నింటినీ రసరమ్యంగా కీర్తనల్లో ఆలపిస్తూ, శ్రీకృష్ణపరబ్రహ్మ స్వరూపాన్ని ఆవిష్కరింపచేస్తారు.
“ఇవతాళించును జందన క్రియను హాయింగూర్చు మందానిల
మ్మువలెం, గూల్చును గంగపోలిక నఘంబుల్ చెప్ప నెవ్యండగున్
భవదుత్తుంగతరంగముల్ త్రిజగతీ ప్రఖ్యాతముల్ పూతముల్
కవి నారాయణతీర్థ సద్గురుమణీ! కల్యాణవాగ్ధోరణీ!”
అని కీర్తించారు చల్లా పిచ్చయ్య శాస్త్రిగారు శ్రీ నారాయణతీర్థ అనే ఖండకృతిలో! శివకేశవులు సమానమే తీర్థులవారికి.
శ్రీకృష్ణలీలాతరంగిణి కావ్యాన్ని ‘మూషికవాహన మునిజనవంద్య’ అనే కీర్తనతో ప్రారంభించి ముందుగా గణపతి ధ్యానం చేయటం ద్వారా తనకు శివకేశవులు సమానమేనని, తనది మూఢ వైష్ణవభక్తి కాదనీ ఆయన చెప్పకనే చెప్పినట్టయ్యింది.
“శివ శివ భవ భవ శరణం మమ భవతు సదా తవ స్మరణమ్॥
గంగాధర చంద్రచూడ జగన్మంగళ సర్వలోకనీడ॥”
అని శివస్తుతి కూడా చేశాడాయన ఈ గ్రంథంలో .
“దోషరహిత-దళితాసురబృంద/శేషభూషణ-శైవవారిధిచంద్ర/పోషితపరిజన-పుణ్యైకకంద॥”
అంటూ వినాయకస్తుతితో ఈ కావ్యరచన ప్రారంభమౌతుంది.
“రాధారుణాధర-సుధాపం సచ్చిదానంద
రూపం జగత్త్రయభూపం సదా – బాల
దామోదర మఖిలకామాకారం ఘన
శ్యామాకృతి మసుర-భీమం సదా – బాల
అర్థం శిథిలీకృతానర్థం శ్రీనారాయణ
తీర్థపరమపురుషార్థం సదా–బాల”
ఈ కీర్తన పాడకుండా భజనకార్యక్రమం పూర్తికాదంటారు. సంస్కృతభాష మీద, భాగవతం మీద, గీతగోవిందం మీద ఆయనకు గల పట్టు ఆయన చేత కృష్ణలీలా తరంగిణి పేరుతో అద్భుత కీర్తనలను వెలయింపచేసింది.
తమిళనాడు తంజావూరు సమీపాన కావేరీ తీరంలో వరుగూరు గ్రామంలో ఆయన స్థిరపడ్డారు. వరగూరులోనే ఆయన కృష్ణలీలా తరంగిణి వ్రాశాడని తమిళ పరిశోధకులు చెప్తారు. చైత్ర శుద్ధ తదియ సోమవారం నుండీ రచన ప్రారంభించారని ఇంకో వాదన ఉంది.
వరుగూరు వెంకటేశ్వర పెరుమాళ్లు కోవెలలో సాయంకాలపు అర్చనలు అయి, తెరవేశాక అక్కడ కూర్చుని ఆయన శ్రీకృష్ణలీలాతరంగిణి తరంగాలను పాడేవారిని, జనం మైమరచిపోయి వినేవారనీ వరుగూరు ప్రజల నమ్మకం. శ్రీకృషలీలాతరంగిణిలో 5వ తరంగం మొదలుకొని 8వ తరంగం దాకా గోపికా వస్త్రాపహరణం, గోపీసమాగమం, రాసక్రీడావర్ణనలు చాలా రసవత్తరంగా ఉంటాయి. భక్తితత్త్వ సర్వస్వాన్నీ ఈ 4 తరంగాల్లో నిక్షేపించాడని రసజ్ఞులు భావిస్తారు.
“అన్నమాచార్యుల కాలంలో సంకీర్తనలుగాను, ఆధ్యాతికపదాలుగాను ప్రారంభించిన కీర్తన – నారాయణతీర్థులు, రామదాసు, సుబ్రహ్మణ్యకవి వంటి వాగ్గేయకారుల రచనలలో భజనకీర్తన గాను, ఆధ్యాత్మకీర్తన గాను పరిణమించి, మార్గదర్శి శేషయ్యంగారు, మేలట్టూరు వీరభదయ్యగారల రచనలలో ధాతుకల్పనకు (సంగీత బంధములో) కొత్తమార్గాలు అవలంభించి. ఆ నూతన రూపంలో త్యాగరాజు నాటికి కృతి అనేపేరు వహించి పరిపక్వత పొందింది. కృతులు బయలుదేరే నాటికి రాగాల స్వరూపంలో కూడా చాలా మార్చులు సంభవించాయి. ఈ మధ్యలో క్షేత్రజ్ఞాదుల పదకవితలో సాహిత్య బంధమూ రాగబంధమూ సమాన ప్రాధాన్యము వహించి రాగస్వరూపానికి దర్పణము లనదగిన పదరచనలు ప్రభవించాయి.” అంటూ వాగ్గేకారోజ్జ్వలమణి-త్యాగరాజు అనే రచనలో శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు కృతుల పరిణామక్రమానికి నారాయణతీర్థులవారి తెలుగు, సంస్కృత రచనలు ఏ విధంగా సహకరించాయో వివరించారు. సంగీత చరిత్ర పరిశోధనలో ఈ వాక్యాలు చాలా ముఖ్యమైనవి.
ఆటకూ పాటకు కూడా!
“జయజయ స్వామి-జయజయ॥
జయజయ జితవైరి-వర్గప్రచండ
జయజయ గజముఖ-జయవక్రతుండ॥”
అనే కీర్తనతో శ్రీకృష్ణలీలాతరంగిణి కావ్యం ప్రారంభమౌతుంది.
“గోపాల మేవ దైవతం భజే-గోపాల మేవ దైవతమ్॥
సర్వలోకకారణం-సత్యకామాదిగుణమ్
భక్తానుగ్రహాభివ్యక్త-భవ్యమూర్తిధారిణమ్
యాదవాబ్ధిచంద్రమిహ-యతిజనమోహాపహమ్
కంసాదివైరివిరామ-కలిత-దివ్యవిగ్రహమ్
గోపీకావనకుముద-గురుతరచంద్రోదయమ్
ఘోరసంసారకారణ-వారణకేసరిణమ్
మనసాఽపి న గణయామి-మాధవా దన్యదైవమ్
భవ్యనారాయణతీర్థ-దివ్యదృగ్విధాయినమ్”
అంటూ రుక్మిణీ కళ్యాణ ఘట్టంతో ఆ కావ్యాన్ని ముగించారు.
“ఆలోకయే రుక్మిణీ-కల్యాణగోపాలమ్॥
నీలమేఘనిభాకారం-బాలార్క సమానచేలం
నీలాంబరానుజం గో-పాలం నీలాలకాంతమ్॥”
అంటూ రుక్మిణీ కళ్యాణ వైభవాన్ని కళ్ళకు కట్టించిన కీర్తన సంగీతాభిమానుల్ని అలరిస్తూనే ఉంటుంది.
తమిళ నేలపైన గ్రామీణ స్త్రీలు సైతం నారాయణతీర్థులవారి సంస్కృత తరంగాలను పాడుకుంటూ కనిపిస్తారు. భక్తి పారవశ్యాన ఆయన పాడుతుంటే చరణాలు తరంగాలై వెల్లువెత్తి వస్తుంటాయి. శ్రీకృష్ణలీలాతరంగిణి అనే పేరు దీనికి ఆవిధంగా తగినదే!
ఇవి కేవలం పాడుకోవటానికే కాదు, గజ్జెకట్టి ఆడటానిక్కూడా ఉద్ధేశించినవి. తరంగిణి ఒక ప్రత్యేకమైన నాట్యరీతిగా భాసిల్లింది. భక్తులకు పుణ్యప్రదంగా, సంగీత వేత్తలకు, నాట్యకళాకారులకు ప్రదర్శన యోగ్యంగా నారాయణతీర్థులవారి కీర్తనలు సమకూరుతాయి. మృదంగ విన్యాసంతో ఈ తరంగాలను పాడుతుంటే నాట్యం కళ్లకు కడుతుంది. ఒకరు పాడుతున్నప్పుడే కాదు, మనలోమనంగా చదువుతుంటేనే ఆ లయలో పరవశంగా లీనమైపోతాం.
“మాధవ మా మవ దేవ యాదవకృష్ణ యదుకులకృష్ణ॥
సాధుజనాధార సర్వభావ మాధవ మా మవ దేవ॥
అంబుజలోచన కంబు శుభగ్రీవ బింబాధర చంద్రబింబానన
చాంపేయ నాసాగ్ర లగ్న సుమౌక్తిక శారద చంద్ర జనిత మదన॥”
కేదార గౌళ (నీలాంబరి) రాగంలో ఈ పాటని తమిళనాట ప్రతి ఇంటా లాలిపాటగా తల్లులు పాడుతుంటారు. తెలుగు తల్లులు జో అచ్యుతానంద జోజో ముకుంద అనే అన్నమయ్య కీర్తనను పాడుకున్నట్టే తమిళ తల్లులు తీర్థులవారి ఈ కీర్తనను పాడుకుంటారు.
“ఇందిరామందిర భక్త సుందర హృదయారవింద| భృంగ భక్తిమకరంద నందితగోపికాబృంద” అనే చరణాన్ని పండితులు భరతుడి నాట్యశాస్త్రంలో చెప్పిన రీతులకు అనుగుణమైందిగా భావిస్తారు. ఈ చరణం తరువాత “తాంతాహతధైదత్తత్తాం-తక్కతో ధిమ్మిణాంగిణతో ధిమ్మిరే–తక్కతోధిమ్మిధిమికిటతోధిమ్మిరే” అని తాళం ఉంటుంది.
ఈ తరంగాన్ని చదువుతుంటే సంగీత జ్ఞానం, నాట్యశాస్త్ర పరిజ్ఞానం బొత్తిగా లేనివారిక్కూడా మనసు తెలియకుండానే ఆనంద నాట్యం చేస్తుంది. నారాయణతీర్థులవారి తరంగాల్లో అక్షరాలు అలలెత్తి ఆడుతుంటాయి. రాగతాళాలు తెలియకపోయినా పైకి బిగ్గరగా చదువుతుంటే ఆ పదవిన్యాసమే పాటగా పలికిస్తుంది.
సంప్రదాయ కూచిపూడి కళాప్రదర్శనలో నేటికీ నారాయణతీర్థుల జనరంజక కీర్తనలు అనేకం కనిపిస్తాయి. ప్రతిభావంతుడైన కళాకారుడు “నీ నామము నా జీవము” తరంగాన్ని మోహనాంగిలో పాడుతూ అభినయిస్తుంటే పారలౌకికమైన అనుభూతి కలుగుతుంది.
“బాల గోపాల కృష్ణ పాహిపాహి|నీలమేఘ శరీరా నిత్యానందం దేహి”
“ఆలోకయే శ్రీ బాలకృష్ణం – సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం”
“గోవర్ధన గిరిధర గోవింద-గోకులపాలక పరమానంద|శ్రీ వత్సాంకిత శ్రీ కౌస్తుభధర భావక-భయహర పాహి ముకుంద”
“పాహి పాహి జగన్మోహన-కృష్ణ పరమానంద శ్రీ కృష్ణ|నంద యశోదా నందన కృష్ణ- ఇందువదన శ్రీ కృష్ణ| కుందరదన కుటిలాలక కృష్ణ-మందస్మిత శ్రీ కృష్ణ”
ఇలా అత్యధిక ప్రజాదరణ పొందిన కీర్తనల్ని వెలయించారాయన. ఆయన సాహిత్యాన్ని పామరులు పదిలపరచుకున్నారు. అవే నేటికీ ఆధారంగా ఉన్నాయి.
తంజావూరు సరస్వతీమహల్లో ఉన్న తాళప్రతులే తీర్థులవారి జీవిత చరిత్రకు కొంతవరకూ ఆధారం.
శ్రీకృష్ణలీలాతరంగిణి మొత్తం భాగవతం దశమస్కంథంలోని వృత్తాంతం. దీని తరువాత ఆయన 11వ స్కంథంలోని కథను కూడా యక్షగానంగా వ్రాయాలనుకున్నారని, కానీ, భగవత్సాక్షాత్కారం కావడంతో సజీవ సమాధి అయ్యారనీ చెప్తారు.
‘దక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర’ గ్రంథంలో శ్రీ నటరాజ రామకృష్ణ శ్రీకృష్ణలీలాతరంగిణిని నృత్యనాటికగా సంభావిస్తూ ఇలా వ్రాశారు: “శీ నారాయణతీర్ణ యతీంద్రులు గొప్ప శీకృష్ణభక్తులు. ఆయన కృష్ణలీలను కీర్తనల రూపమున నృత్యముల కనువైన శబ్దములతో రచించినాడు, ఈ కీర్తనలే తరంగములు. సముద్రగర్భములో జనించి ఒకటివెనుక నొకటి పొంగి అలలెట్లు పైకెగయునో అట్లే యీ తరంగములలో భావరాగతాళములు అలలవోలె పొంగి పైకెగయును, నారాయణతీర్థులవారి శ్రీకృష్ణలీలాతరంగిణి అంతా కలిసిన ఒక నృత్యనాటకమే, కాని నర్తకులు దీనిని నాటకముగా ప్రదర్శింపనేరక వేర్వేరు తరంగములను గైకొని వేర్వేరు భంగుల నృత్యమాడుతున్నారు. తాళ లయలందీ తరంగ నర్తకులు దిట్టలు. తరంగములందలి లయవిన్యాసములు తాళపు విరుపులు మరింకే నృత్య పద్ధతి యందున గాని చూడలేము. తరంగనర్తకులు భక్త్యావేశముతో నీలమేఘశ్యాముని గుణగణములను కీర్తిస్తూ నృత్యమాడుతుంటే లయబహ్మమున వారు లీనమై ఆడుతున్నారా అన్న విస్మయము కలుగకపోదు” అని వ్రాశారు. అంతటి తాదాత్మ్యస్థితిని ప్రదర్శించే నైపుణ్యం ఉన్నవారు శ్రీకృష్ణలీలాతరంగిణిని ఒక నృత్యనాటకంగా ప్రదర్శిస్తే ఆ మహా రచనకు నిజమైన న్యాయం జరుగుతుంది.
(సశేషం)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.