[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘గురుభక్తి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
శిరసు అవనతమౌతుంది
కళ్ళు పాదాలను పలుకరిస్తుంటాయి
పెదాలపై వణుకు
పదాలలో తత్తరపాటు
మాటల్లో సంస్కారం ప్రత్యక్షమౌతాయి
భుజాలు వంగిపోతుంటాయి
చేతులు జంటలై
ముందుకో వెనక్కో కట్టుకుంటాయి
కాళ్ళు నిటారుతనాన్ని
క్షణాల్లో కొని తెచ్చుకుంటాయి
ప్రశ్నలు జవాబులు
పాతవి కొన్ని.. కొత్తవి మరికొన్ని
పదేపదే పునరావృతమౌతుంటాయి
శాలువాలు కప్పుకున్న గొప్పదనం
పూమాలలు వేయించుకున్న పురోగతి
వందనాలు అందుకున్న విజయం
అందలాలు ఎక్కి నిలిచిన అధికారం
వినయమై తల వంచుకుంటుంది
శిల్పమై.. శిల్పి ముందు నిశ్చలమౌతుంది
అది
పసిప్రాయంలోని భయమే కావచ్చు
ఎలప్రాయంలోని బెదురే అయి ఉండొచ్చు
కాలాన్ని వెనక్కి విసిరేస్తూ
గెలుపోటములను గుప్పెట పడుతూ
సాగిన జీవనయానంలో మాత్రం
అది భక్తియే.. గురువు పట్ల భక్తియే
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
