[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘గురజాడ వారితో గిరీశం!!’ అనే గల్పికని పాఠకులకు అందిస్తున్నాము.]
గిరీశం: అయ్యా నమస్కారం.
గురజాడ: ఆఁ ఏమోయ్,గిరీశం ఎట్లా ఉన్నావ్?! అంతా కుశలమేనా?!
గిరీశం: నాకేమీ లోటు లేదయ్యా! మీ పుణ్యాన ఇంకో వెయ్యేళ్ళైనా నన్ను మర్చిపోరు, తెలుగువాళ్ళు! మీరు మలిచిన శిల్పాన్ని, మీకు నే చెప్పేదేముంది?! ఈ లోకం సంగతే అంతు పట్టట్లేదు గురువు గారూ, ఎటునుంచి ఎటు పోతోందో తెలియట్లేదు. దారీ తెన్నూ ఒకటిగా తోచడం లేదు.
గురజాడ: అంత ఏం మునిగిపోయిందయ్యా, కాలంతో పాటు మార్పులు సహజమే కదా?!
గిరీశం: అది నిజమేనండీ, కానీ.. అన్నీ చెప్పి,పెద్దలు మిమ్మల్ని విసిగించను, రెండే రెండు విషయాలు చెపుతానండీ. దీని సిగ దరగా, ఏం మార్పండీ అయ్యగారూ! మీరు రాసిన కాలంనాటి అమ్మాయిలు కాదండీ, కాలికింద పడి ఉండటానికి! చిచ్చర పిడుగులే!
మొత్తం సన్నివేశం — సన్నివేశమేమిటి గురూగారూ, అంకానికి అంకమే మార్చేస్తే!
ఆనాడు పెళ్ళిళ్ళకు డబ్బులిచ్చిన వారు, నేడు, ధనరాశులు నగలూ ఎన్ని కలిసొచ్చినా, అదనంగా ఒక షరతు లాంటిది పెడుతున్నారట! అన్నీ – అనగా అంతస్తూ, జాతకమూ, ఎత్తూ, పొడుగూ, వన్నె, వాసీ, ఈడూ, జోడూ కలుస్తున్నాయని తల్లిదండ్రులు ఎంత చెప్పినా, ఒక పట్టాన సుముఖత చూపించటల్లేదట పెళ్ళిళ్ళకు!
ఇప్పుడు కావాల్సింది స్వేచ్ఛట, దానికే అగ్రతాంబూలమట, అన్నింటికంటే!
గురజాడ: స్వేచ్ఛ అంటే? దేంట్లో?!
గిరీశం: అయ్యా మనవి చేసుకుంటున్నాను. కట్టూ బొట్టూ, మాటా మంచీ అన్నిట్లోనండీ! ఇది అది అని కాదు – నేనూ నీతో సమానమైన, ఇంకా మాట్లాడితే ఒక బెత్తెడు ఎక్కువైన దానినే, నన్ను ఆ రకంగా చూడాలి, చూసుకోవాలి. ఇష్టమైతే ఇంకా మాటాడుకుందాము, లేదంటే వెళ్ళిరా అంటున్నారటండీ అమ్మాయిలు, అబ్బాయిలతో, యే సంకోచాలు లేకుండా!
గురజాడ: మంచిదే కదూ ఆ విషయం! వారూ బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారుగా, మగవారికి సమాన హోదాలో!
గిరీశం: అయ్యా అంతటితో ఆగలేదండీ, అసలు వివాహమే ఎందుకనే ప్రశ్న లేవనెత్తుతున్నారటండీ! ఇష్టమైనన్ని నాళ్ళు ఏ కట్టడులూ లేక కలిసుంటాం, లేదా ఎవరి దారిన వారు పోతాం అన్నది ఇప్పుడు చలామణీలో ఉన్న మాటగా వినబడి, కనబడుతోందండీ!
ఇక, జరిగిన, వివాహాలలో కూడా ఏ వివాహం ఎంతకాలం నిలబడుతుందో, చెప్పటం ఎవరి వల్లా కావటల్లేదండీ! వివాహాల సంఖ్యతో పోటీ పడి విడాకులు పెరుగుతున్నట్టు ఉన్నదండీ, ఏం చెప్పను ఆ విషయం?!
కుటుంబ వ్యవస్థ ఏమైపోతుందో అని దిగులుగా ఉన్నది స్వామీ. మీరే ఏదైనా తరణోపాయం చెప్పాలి మళ్ళీ ఏదో నాటకమో, కథో వ్రాసి, సాహిత్యం ద్వారా!
గురజాడ: ఏవిఁటీ ఇవి గిరీశం మాటలే, ఎంత మార్పయ్యా నీలో!
గిరీశం: అయ్యో, అంతా మీరిచ్చిన తర్ఫీదూ, బోధే కదా మాస్టారూ! సౌజన్యరూపులు తమరు!
గురజాడ: అది సరే, ఏదో రెండోది అన్నావు, అదే విషయమో?!
గిరీశం: అయ్యా, ఔనౌను! అమ్మాయిల వైఖరి పట్ల ఆవేదనలో తస్సాదియ్యా, మర్చిపోయాను. ఆ రెండోది రాజకీయమయ్యా! ఎంత మార్పు, ఎంత మార్పు! తెల్లవారితో పోరాడి తెచ్చారు కదండీ, స్వాతంత్ర్యం, ఆ తరాల వారు! దాని మీద ఇసుమంత కూడా లక్ష్యం ఉన్నట్టు తోచదండీ ఇప్పటి వారికి! నీతికి తెల్లారినట్టే ఉంది! అహఁ, అంటే సామాన్య జనానికి కాదండీ! ముఖ్యంగా నాయకులమని చెప్పుకు దేశాన్ని నొల్లుకునే
వినాయకుల కండీ! చూశారా స్వామీ, అనుకోకుండానే మనసులో మాట బయటకు తన్నుకుని వచ్చేసింది! కుల ఖల కలకలం ఎక్కువై పోయిందండీ విపరీతంగా!
ఎక్కడికక్కడ ఇట్లా గోడలు కట్టేస్తే,ఎవడి గోడూ ఎవడికీ వినిపించక అందరూ ఏకాకులై నష్టపోతారు కదండీ!
నాకు తెలీక అడుగుతాను, అందరూ కలిసుండటానికి, సంఘంలో సుఖశాంతులతో జీవించటానికి, ఈ కులమూ, మతమూ జాతి ఆడా మగా ఎందుకండీ తేడాలు?!
ఎవరైతే మంచి చెప్పాలో, అందరినీ కలివిడిగా ఉంచాలో వారే విడగొడితే, ఇంక చెప్పేదేముందయ్యా?! శాసన సభ దేవాలయం అంటారు, అక్కడే అనరాని మాటలూ ఆడతారు! ఆ భవంతి మెట్లకు మొక్కుతారు, కానీ బయట చేసేవన్నీ స్వలాభపు పనులేనయ్యా!
అందుకు కాదూ, మీరానాడే అన్నారు, సొంత లాభం కొంత మానుకుని.. పొరుగు వాడికి సాయపడవోయ్.. అని!
సూక్తుల్లో మంచి ముత్యం స్వామీ మీ మాట, కలకాలం నిలిచేది, “దేశమంటే మట్టి కాదోయ్,దేశమంటే మనుషులోయ్” అని!
దానికి పూర్తి విరుద్ధమేనయ్యా ఇప్పుడు జరుగుతున్నది- అంతా సొంత లాభమే,పైగా పొరుగు నష్టానికి ఎప్పుడూ ముందడుగే!
సాటి మనుషులంటే లెక్కే లేదు ఏ కోశానా! వారు కేవలం ఓటుకు ఉపయోగపడే సంఖ్య మాత్రమే!
చాలా కలత కలిగించేదిగా ఉంది స్వామీ పరిస్థితి!
అధికారంలోకి వచ్చేస్తే చాలన్నదే పరమావధి, ఏ పార్టీ అయినా! వారి పదవుల కోసం, వారిచే నడపబడుతున్న, వారికై ఏర్పడ్డ వ్యవస్థగా అయిపోయింది – రాజకీయమంటే ఈ రోజుల్లో!
ఆ ఖర్చు, ఆ ఆర్భాటం,ఆ దొంగ వాగ్దానాలు, ఆ దిగజారుడు తనం, ఆ అబద్ధాల విశృంఖలత – అబ్బబ్బ చెప్పలేను, ఈ పతనం ఎటు పోతుందో, ఏ పాతాళానికి దారి తీస్తుందో?!
గురజాడ: సరేనయ్యా, ఇంకా పాతాళం చేరలేదనేగా నీ మాట! ధైర్యం వహించు. చూడు, గిరీశం, నీతులు చెపితే వినదయ్యా ఈ లోకం!
దానికి కావలిసినవి, తేలిక మాటల కథలు, పిట్టకథలూ! కాస్త వినోదం, ఒక పాలు వ్యంగ్యం! ఇవి రంగరించి కాదూ నిన్ను సృష్టిస్తా, నేను ఆనాడు!
అప్పటి సంఘం పరిస్థితులు వేరు – అప్పుడు అణచివేశారేమో ఆడవాళ్ళను, దాని ఫలితం ఇపుడు చెల్లిస్తున్నట్టున్నారు మిగతావాళ్ళు!
ఆర్థిక కారణాలు మహా బలీయాలయ్యా గిరీశం, మానవ సమాజంలో! బట్టలు డాబుగా ఉన్నాయనుకో, జేబులో రూపాయి లేకపోయినా, గౌరవిస్తుంది ఈ లోకం!
పైకి కళ్ళకు కనిపించేదే నమ్ముతుందది! లోపల అరసి చూసే తీరిక కానీ, విజ్ఞత కానీ దానికి ఆ సమయంలో ఉండదు.
నిదానం మీద గాని నిజం తేలిరాదు లోకం కళ్ళకి! దాని దృష్టి హ్రస్వం, జ్ఞాపక శక్తి స్వల్పం, సామూహికంగా!
ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగానో, కాస్త మించో చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. దానితో కొత్త రెక్కలొచ్చినట్టైంది, వారికి! డబ్బు ఇచ్చే స్వతంత్రత అంతా ఇంతా కాదు, అయినా కరెన్సీ మహిమ రకరకాలుగా చూసిన వాడివి, నీకు తెలియనిదేముందీ!
దానికి తోడు ప్రపంచమే ఒక కుగ్రామం ఇప్పుడు – అన్ని లావాదేవీలు, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతికాలు అన్నీ చేతులు కలుపుతున్న రోజులు, బుజాలూ రాచుకుంటున్నాయి, ఢీ ఢీ లూ కొట్టుకుంటున్నాయి.
వచ్చి తీరుతై, ఆలోచనల్లో మార్పులు.
అన్నీ సమానంగా చేస్తున్న స్త్రీ నేనెందుకు తగ్గి ఉండాలి అని ప్రశ్న వేస్తున్న సమాజపు విజృంభణేనయ్యా నువ్వు చెప్పిన ఈ ప్రస్తుత స్థితి!
ఇది కుదుపే కానీ ప్రళయం కాదులే, మళ్ళీ కుదుట పడుతుంది క్రమేణా!
మన మూలాలు గట్టివయ్యా, అవి కొత్త అంకురాలు తొడగనిస్తాయి, తమలో కలుపుకుంటాయి కూడా, వాటికా శక్తి ఉన్నది.
ఇక రాజకీయాలు.
ఎక్కడైనా, ఏ దేశమైనా చట్టాలుంటే సరిపోదయ్యా, అవి అమలు చేసే ఖలేజా ఉన్న నాయకులు కావాలి. ఆ ఖలేజా నీతి గల నడవడి నుంచి వస్తుంది. అంటే కావల్సింది చిత్తశుద్ధి, మంచి బుద్ధి, జనహితైక బుద్ధి!
అప్పుడు రాజకీయాలు ప్రజాసేవకు గొప్ప బాటలౌతాయి.
ఏదైనా ఎవరైనా ఉల్లంఘన చేస్తే శిక్ష తప్పదు అనే భయం అందరిలో వస్తుంది, వ్యవస్థకు అదే ఒక కాపుదల!
నైతిక భయం, చట్టాల సంగతి తరువాత! ఆ భయం లేదయ్యా ఎవ్వరిలో, ఈ రోజుల్లో!
ధర్మ భయం, తప్పు చేస్తే ఎక్కడో నరకంలో కాదు ఇక్కడే శిక్ష పడుతుంది అనే భయం!
ఏదో అంటారే, Here and Now!
Fear is the Key!
Fear of being not faithful to the word given to the people at large!
ఇవాళ కొరవడుతున్నది ఇదేనయ్యా! ఈ పతనానికి కారణం కూడా ఇదే!
అయినా కంచే చేను మేస్తే,ఇక ఎవరినీ అనేది?!
పైన బాగుంటే, అది కింది వరకూ ప్రసరిస్తుంది,ధర్మం పట్ల భక్తితో కాకపోయినా,శిక్షల భయంతోనైనా!
సరేలే, ఇవన్నీ ఒక్కరోజులో అయ్యేవి కావు గానీ, కనీసం ఈ తూరైనా, మీ శిష్యుడు ఆ వెంకటేశాన్ని, గట్టెక్కిస్తావా పరీక్షల్లో?!
గిరీశం: అయ్యో రెండేళ్ళుగా అదేనండీ నా శతప్రయత్నమున్నూ! నా సమస్తం ధారపోసి తర్ఫీదు ఇస్తున్నాను, గుంటడు అందుకుంటేనా?! ఎప్పుడూ తిండి యావే! ఏ జామి చెట్టు మీద వానరావతారమెత్తి చేగోడీలు నములుతున్నాడో, చూడాలి వెళ్ళి!
అయ్యా వస్తాను, వాడికి పాఠం వేళ కూడా అయింది! నమస్కారం!
గురజాడ: ఆఁ ఆఁ వెళ్ళిరా!
***
గిరీశం: ఏమోయ్ వెంకటేశం, ఎంత చెప్పినా చదువు వైపు మళ్ళదేఁ నీ ధ్యాస! ఇట్లాగైతే ఇహ మీ నాన్న, ఆ పావకావధాన్ల ఘటాన్ని మరపించటం ఎన్నో నాళ్ళు సాగదు, తెలుసుకో! నా మాటలనే కోటలో నిన్ను రక్షించుకుంటూ వచ్చాను ఇన్నాళ్ళూ! ఇకపై నువ్వు నీ పద్ధతి మార్చుకోవాల్సిందే! సురేంద్ర నాథ్ బానర్జీ అంతటి వాణ్ణి చేస్తానంటే బుర్రకెక్కదే నీకు!
Shame on you, Mr.Venkatesam, buck up Man?!
వెంకటేశం: నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఈ కొమ్మమీద బాసింపెట్లు వేసుకుని మీరెప్పుడొస్తారా, ఎప్పుడు పాఠం మొదలుపెడతారా అని చూస్తుంటే, ఏంటి గురూజీ,నన్నే అంటారు?! అయినా ఎవరితోనండీ, అంత వినమ్రంగా, వంగి నమస్కారాలతో శ్రీశ్రీ మా గిరీశం మేస్టరుగారు మాట్లాడింది ఇంత సేపూ?!
గిరీశం: హార్ని, ఆయన తెలియదూ, నీకు! నిన్నూ నన్నూ పుట్టించిన బ్రహ్మదేవుడోయ్, ఆయన! శ్రీ గురజాడ అప్పారావు గారు. కనుకనే ఆ వినయం, ఆ మర్యాద, ఆ చెవి ఒగ్గి వినటమూనూ! లేకపోతే ఈ విజ్ఞానఖని గిరీశం ఒకరి దగ్గర తల వంచటమా, Never! సరిసరి, స్వవిషయం అటుంచు.
ఆయన ఒక మహా మేధావి, సంఘ హితైషి! ఇదే ఆ బంగాళంలోనో, ఆ అరవ దేశంలోనో పుట్టి ఉంటే ఈ పాటికి ఆయనకు బ్రహ్మరథాలూ, గజారోహణలూ గా ఉండేది విభవం!
పాపం ఆయన దురదృష్టం, మన అదృష్టం – ఈ ఆంధ్రదేశంలో పుట్టాడు. గ్రహబలమేమి.. అని కాదూ అని ఉన్నారు అయ్యవారు, అట్లాంటిదేదో అయ్యుండాలి.
వెంకటేశం: అయ్యవారూ.. అంటే.. ఎలిమెంటరీ స్కూల్లో పిలక మేస్టారేనా అండీ?!
గిరీశం: నాన్సెన్స్, ఆ బక్కపంతులు ఊసు కాదోయ్, నే మాట్లాడుతా, డింగరీ! అయ్యవారంటే మన సంగీతానికి ఆదిగురువు వంటి వారు, త్యాగరాజులవారు, వారిని గురించి! బోధపడ్డదా?!
వెంకటేశం: ఎవరైతే ఏం లెండి, నాకో కొత్త విషయం గ్రాహ్యం లోకి వచ్చిందీ వేళ! మా గిరీశం మేష్టారికి సంగీతం గూర్చి కూడా బోల్డు తెలుసని!
గిరీశం: సూక్ష్మ బుధ్ధిఔతున్నావోయ్ మై డియర్ వెంకటేశం, మనకు తెలియని శాస్త్రం ఉందనే నీ ఊహ?! అమాయక జీవీ! అరవై నాలుగు కళలూ, వేదపురాణాలు, ఛప్పన్నారు ఉపనిషత్తులూ లాంటి పురాతన జ్ఞానం నుంచీ మొదలుకొని, నేటి జాగ్రఫీలు, గీగ్రఫీలూ మేథమేటిక్సులూ, ఆంధ్రాంగ్లపారశీకాదులూ సమస్తం పుక్కిట పట్టినవాడోయ్ నీ గురువు!
యోగం రావాలంతే, ఎక్కడో తారాపథంలో నిలవదగ్గవాణ్ణి కాదూ! చాల్లే ఇక పద, ఇవన్నీ నీ తలకు మించిన విషయాలు, ఆనక బోధపరుస్తాలే, నువ్వు కాస్త కరెన్సీయో, కనీసం ఇతోధికంగా కాపర్సో తెచ్చే ఏర్పాటు చూడు!
వెంకటేశం: ఇంకా డబ్బా గురూగారూ, మా నాన్న నరసింహమై చీరేస్తాడు ప్రభో, నా వల్ల కాదు!
గిరీశం: Do not fret my boy. కూటి కోసం కోటి విద్యలన్నారు! అన్నారా లేదా, నువ్వూ విన్నావా లేదా?! కనుక ఈ గిరీశం గారు ఉపాయం చెపుతారు, వారి శిష్య పరమాణువు రొక్కం ఏర్పాటు చేస్తాడు! మధ్య నీకేల బెంగా?!
వెంకటేశం: అలాగన్నారు బాగుంది, హమ్మయ్య నాకిప్పుడు ధైర్యంగా ఉంది, పదండి మేస్టారూ!
గిరీశం: I know my child, you are as sharp as the Log in our Manyam Woods! పద, పద!