[శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు రచించిన ‘గురజాడ వారసత్వం; రెండు చాసో కథల మాడ్లిన్ సెంటిమెంటు’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]
I
ఇద్దరూ విజయనగరంలో పుట్టకపోయినా అక్కడే జీవించారు.
దేశ వివిధ సామాజిక రంగాలలో వారసత్వం హాని చేస్తోంది; ముఖ్యంగా రాజకీయంగా. సాహిత్య వారసత్వం ఎంతవరకు సాధ్యం అన్నది ఆలోచించవలసిన విషయం. గురజాడ వేంకట అప్పారావు గారికి చాలామంది కుటుంబ వారసులున్నారు విదేశాల్లో కూడా. శ్రీరంగం శ్రీనివాస రావు గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు గురజాడ సాహిత్య వారసులుగా పరిగణించబడుతున్నారు. వీరిద్దరికీ కూడా సాహిత్య వారసులున్నారు. ఆస్తి, రాజకీయ వారసత్వాలలో గొడవలుంటాయి, సాహిత్య వారసత్వంలో అంతగా ఉండవు. ఎవరన్నా ముందుకొచ్చి నేను కూడా గురజాడ సాహిత్య వారసుడిని అంటే అడ్డుపడక్కరలేదు.
గురజాడ రాసింది నాలుగున్నర లేక ఐదు కథలు మాత్రమే. ఆయన రాసిన మొత్తం రచనలు అచ్చులో 1400 పుటల పైన తేలాయి ‘గురుజాడలు’ వలన. కథలు మాత్రమే చాగంటి సోమయాజులు గారు రాశారు. అవి షుమారుగా 50. మొత్తం అచ్చులో 500 పుటలు వుంటాయో లేదో. అవి కవితాత్మకంగా ఉంటాయి. నాటక రచనకు చాసో కూడా పూనుకునుంటే మనకు మరో కన్యాశుల్కాన్ని సృష్టించి వుండేవారా గురజాడ సాహిత్య వారసుడిగా?
ప్రాంతీయ భాషలు, యాసలు ఆ రచనలలో లాగే నేడు హాస్యానికి వాడుకుంటే గొడవలవుతాయి. ఒక రాష్ట్రం ఏర్పడటానికి దాన్ని ఒక కారణంగా చూపించడం తెలిసిన విషయమే. ఐతే ఆ ఇద్దరి రచనలలో ఆ భాష, యాస బ్రాహ్మలకు పరిమితమయినది కాబట్టి; రాసినవాళ్లు ఆ కులంవాళ్లే కనుక పేచీ లేకపోయింది.
గురజాడ నాస్తికుడు కాదు. కానీ ఆయన వారసుడిగా ఇతరులు భావించే చాసో నాస్తికుడిని అని చెప్పుకున్నారు. Devils/Demons/The Possessed [1871-72] అన్న నవలలో Alexei Nilych Kirillov అనే ఒక భయంకరమైన నాస్తిక పాత్రను దోస్తోయేవిస్కీ [Dostoyevsky] సృష్టించాడు. దేవుడు లేడు/దు సుమా అని రుజువుచేయడానికన్నట్లు ఆత్మహత్య చేసుకుంటాడు. వాడు నూటికి నూరు శాతం నాస్తికుడు అని మనం భావించవచ్చు.
పెంపుడు తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలను, తద్దినాలు పెట్టేవారట చాసో. తన నమ్మకాల కన్నా మరణించిన ఆత్మీయుల నమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వడం న్యాయం అని గ్రహించడం వల్లనేమో. పిల్లలవి దేవుళ్ళ పేర్లే. ప్రతి వ్యక్తికీ, రచయితకు ఒకటికన్నా ఎక్కువ జీవితాలు, ఒకటికన్నా ఎక్కువ మొహాలు [ఆంగ్లంలో చెప్పుకోవాలంటే Janus-faces] ఉంటాయి సహజసిద్ధంగా. గురజాడవారికీ చాదస్తాలుండేవి; వాటి జోలికిప్పుడు వెళ్ళను. ఇంతకముందు ఒక వ్యాసంలో వెళ్లాను కాస్త.
చాసో అభ్యుదయ రచయితల సంఘ స్థాపకులలో ఒకరై, చనిపోయేనాటికి [02-01-1994] అధ్యక్షుడిగా కూడా వున్నారు. వారి అభ్యుదయ వాదానికి అనుగుణంగా మరణానంతరం నేత్రాలను మృత దేహాన్ని చెన్నై లోని వైద్య కళాశాలకు ఇచ్చివేయడం ఆదర్శప్రాయం. చాసో ఎవరికి వారసుడో [గురజాడ] ఆయన అలాంటి ఆలోచన చెయ్యలేదు.
గురజాడ వారికీ చుట్ట అలవాటుందో లేదో నాకు తెలియదుగాని వారి సాహిత్య వారసుడు చాసో గారి ముఖానికి చుట్ట అలంకారంగా ఉండేది. ఆయన్ను వ్యక్తిగతంగా చూడకుండా ఈ మాటలు రాయటం లేదు. రోజుకు ముప్పై చుట్టలు తగలబెట్టే వారుట, ఆలోచనాపరుడు కాబట్టి. గొంతు క్యాన్సర్ వచ్చింది వాటి వల్లో వేరే కారణాల వల్లో.
కన్యాశుల్కం వెంకటేశం చిరుప్రాయం నుంచే చుట్టలు మొదలుపెట్టాడు. పొగ తాగకపోతే దున్నపోతై పుట్టును అని శిష్యుడిని ప్రోత్సహిస్తూ గిరీశం ఒక పద్యం ఉటంకించాడు ‘బృహన్నారదీయం నాలుగో ఆశ్వాసం’ నుంచీ. మధురవాణి పదేపదే ముద్దుపెట్టుకున్న కరటక శాస్త్రి శిష్యుడూ చుట్ట తాగేవాడు; ఆ విషయం మధురవాణి కనిపెట్టింది షెర్లాక్ హోమ్స్ చెల్లిలా. ముద్దు పెట్టుకోబడుతున్నపుడు చుట్టకంపు, పాచి కంపు దాచుకోడం అసాధ్యమనుకుంటా. ఒక్కొక ప్రాంతానికి ఒక్కొక అలవాటుంటుంది. కొందరు శ్రీకాకుళం స్త్రీలకు అడ్డపొగ పడితేనేగాని మైకం ఎక్కదు. కాలంతోపాటు వద్దన్నా కొన్ని మార్పులు, చేర్పులు తప్పవు. మార్పులకు చేర్పులకు మార్క్సిజంతో పనిలేదు. చావు-పుట్టుకలను మార్క్స్ వాదం ఆపాలనుకోదు, ఆపలేదు. ‘అన్నీ వేదాల్లో వున్నాయిష’ అని అనుకున్నట్టే ‘అన్నీ మార్క్సిజంలో వున్నాయిష’ అని కావలిస్తే అనుకోవచ్చు.
చాసోకు కూడా, గురజాడ వారిలాగే వితంతువులంటే సాధారణ బ్రాహ్మలకుండే చులకనభావం లేకపోలేదని తేలుతుంది. భర్త పోయిన అభాగ్య స్త్రీనే ‘విధవ’ అంటారు. అలాంటి విషయం ప్రస్తావించేటప్పుడు కనీస మర్యాద, అనుకంప అవసరం. చివరకు ‘కర్మసిద్ధాంతం’ రాయాలన్నా ఒక బ్రాహ్మణ వితంతువు రంకు అవసరమైంది. కర్మసిద్ధాంతం నిజానిజాలు అంత తేలికగా తేలేవి కాదు; ముఖ్యంగా ఒక వితంతువు లైంగిక సంబంధము గీటురాయిగా. పన్నెండు మంది అమెరికన్ పండితులు సమావేశం అయి వివిధ మత, ఇతర గ్రంథాలు ఆధారంగా చర్చించిన పిదప వ్యాసాలూ రాశారు. వాటి ఆంగ్ల సంకలానికి సంపాదకత్వ బాధ్యతను తీసుకున్నది Wendy Doniger O’Flaherty. ఆమె హిందూ మత విషయాల మీద వివాదాస్పద పుస్తకాలు రాసిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ పుస్తకంలో కర్మ దాని విపాకం లేవుష అని చీపురుతో తుడిచిపారెయ్యలేదు ఎవరు. అది హిందూ మతంలో కాక జైన మతం తెచ్చినదని ఒక మేధావి అభిప్రాయం. ఆ పుస్తకం పేరు “Karma And Rebirth In Indian Classical Traditions” [1980]. మిడిమిడి జ్ఞానాన్ని సమాజం మీద రుద్దే ప్రయత్నం తమ గురించీ తాము అధికంగా ఊహించుకుంటూ ఏ రచయితా చెయ్యకూడదన్నది మౌలికాంశం.
ఉర్లామ్, దేవిడీ అంటే ఎవరైనా భక్తితో చేతులు జోడించాలి ఆ సంస్థానం చరిత్ర తెలిసుంటే. విజయనగరానికి ఎక్కువ దూరంలో లేవు గనుక ఆ ఊరికి చెందిన చాసో గారికి తెలిసుండదు అనే సాహసం చేయను. గురజాడవారు కూడా రామప్పంతులు చేత ‘బసవరాజు పద్దులు’ అని వ్యంగ్యంగా అనిపించారు. ఉర్లామ్, దేవిడీ జమీంరులుగా మొదట బుద్ధవరపు బసవరాజు, కొన్నాళ్ల తరువాత ఆయన వారసుడు కందుకూరి బసవరాజు మొదట్లో వున్నారు. ఆ ఊర్లు మరో కాశీగా మారి ఆ జమీందార్ల ఆదరణ [కట్నకానుకలతో సహా] పొందని తెలుగు పండితులు ఆ రోజులలో లేరు. వాళ్ళ అన్నసంతర్పణల గురించి తన “నా ఎరుక”లో ఆదిభట్ల నారాయణదాసు గారు అద్వితీయంగా వర్ణించారు. ఉర్లం వారు ఇతరులకు అపాత్రా దానాలు చెయ్యడం తప్ప బూతు పనులు చెయ్యలేదు. కందుకూరి వీర బసవరాజు మాత్రం తాను ఆ జమీందారీకి వారసుడనని ప్రైవీ కౌన్సిల్ దాకా వెళ్లి ఓడిపోయాడు. ఈయన తప్పుడు పద్దులు [విజయనగరం జమీందారీ వారసత్వ తగాదాలో గురజాడ వారి ఆధ్వర్యంలో జరిగినట్టు] సృష్టి చేసి ఉంటే ఆంగ్లేయులు కటకటాల పాలు చేసుండేవారు. ఉర్లం వారు ఇతరులకు అపాత్రా దానాలు చెయ్యడం తప్ప బూతు పనులు చెయ్యలేదు. వాళ్లలాగే చాగంటి వారూ లింగధారీ నియోగులులే కాక దేశీ ప్రభుత్వం జమీందారీలను రద్దు చేసే వరకు జమీందారీ కుటుంబం. అరవై ఎకరాల భూమిని చాసో గారు కోల్పోయి ఇబ్బందిపడ్డారుట పాపం. ఆ సంస్థాన పండితుడు చాసో గారికి అవసరమయ్యాడు పేరమ్మతో అక్రమ సంబంధానికి. నిహిలిజాన్ని నిరసిస్తూనే దోస్తోఏవిస్కీ పైన పేర్కొన్న అద్భుతమైన నవల రాసింది.
గొప్ప రచయితలు గ్యాలరీ మెప్పును దృష్టిలో ఉంచుకుని రాయరు. అలా రాయకపోవడం గొప్ప రచయితల లక్షణం. రాస్తే డొల్ల రచయితలవుతారు. కుష్వంత్ సింగ్ ఒకచోట రాశాడు ‘Indians are sex-starved’ అని.
గురజాడ వారి పూటకూళ్ళమ్మ కూడా ఒక బ్రాహ్మణ వితంతువు, ఆమె మోసగొట్టు గిరీశంతో రంకు సలిపింది వాడికి తిండిపెట్టి, డబ్బులిచ్చి మరీ. ఆ దౌర్భాగ్యస్త్రీ లోని అసహాయతను, దైన్యాన్నీ, ఉదాత్తగుణాన్ని చూపడానికిబదులు చౌకబారు హాస్యానికి వినియోగించుకున్నారు మహాకవి గురజాడ. గిరీశంతో ఆమెది అవసరార్థ సంబంధం అని కొట్టేస్తే చేసేదేమీ లేదు. వైధవ్యంవల్లనో, వివాహం అవకపోవడం వలననో లైంగిక సుఖానికి దూరంగా వుండే, ఉండని స్త్రీలంటే పురుష పుంగవులు వ్యక్తంచేసే తేలిక వైఖరి శోచనీయం. పద్నాలుగు/పదిహేను శతాబ్దంలో శ్రీనాథుడు కూడా విశ్వస్త చేతి తిండి తిన్నందుకు విలవిలలాడాడు – తింటున్నప్పుడు గాజుల చప్పుడు వినబడలేదనేమో.
కన్యాశుల్కంలో లెక్కపెడితే వంద ‘ముండలు’, నూటొక్క ‘వెధవలు’ ఎన్నో ‘లంజలు’ దొరుకుతారు. అదంతా బ్రాహ్మణీకం మాకెందుకు అనేమో బ్రాహ్మణ/బ్రాహ్మణేతర స్త్రీవాదుల చేతుల్లోకూడా ఎర్రజండాలు రెపరెపలాడవు. గొప్ప రచయితలూ సభ్యత, సంస్కారాలకు, సున్నితత్వాన్నినికి, కనీస మర్యాదలకు కట్టుబడి వుండాలి. ఇతరుల మనోభావాలను తుంగలో తొక్కకూడదు.
ఒక ముత్తైదువ గురించీ రాసిన ‘ఏలూరెళ్ళాలి’ కథ సభ్య సమాజంలో ఆమోదయోగ్యమైనదేనా అన్నది నిస్పక్షపాతంగా ఆలోచించగలిగిన పాఠకుల విజ్ఞతకు వదిలేస్తున్నా. వడ్డీలా titillating గా కూడా ఉంటుంది ఈనాటి ‘సరసమైన’ కథల్లా, ఆరోగ్యకరమైన మానవసంబంధాలు మృగ్యం అని ఈ కథ చదివిన తరువాత మనకు అనిపించడమే కాక అది ఇతర ప్రశ్నలను లేవనెత్తుతుంది. పుట్టిన బిడ్డకు తన అసలు తండ్రి ఎవరో ఎప్పటికీ తెలియదు; పెద్దయ్యాక తెలిస్తే లబోదిబోమంటాడు. రెండోది చాసో రాయలేని కథ. మొపాసా నవల Pierre and Jean లోని కథానాయకుడు గుర్తుండి ఉండాలి. ఏలూరు కథలో బిడ్డ ప్రపంచంలోకి ఒక మోసం ద్వారా ప్రవేశిస్తాడు. మోసం తల్లిది! ఆ కథ ట్రాజెడీయా, కామెడియా, బూతా, మూడూనా? గుడిపాటి వెంకటాచలం గారి ‘ఆమె పెదవులు’లో తన కూతుర్ని ఒక యువకుడు మరుగుతాడేమోనని మధ్యవయసు తల్లే ఆ యువకుడితో లైంగిక సంబంధం పెట్టుకుని ఆనందిస్తుంది. ఆ కథకు మకుటంగా, భర్తకు అది అభ్యంతరకరం కాదు. ‘ఏలూరెళ్ళాలి’ గుడిపాటి వెంకటాచలం గారి [1894] ‘ఆమె పెదవులు’ [పెదవులుతో ఆగాడు రెండు, మూడడుగులు కిందికి దిగజారకుండా] చదివి చాగంటి సోమయాజులు గారు ఏలూరు కథ [1915] రాశారా అని అనిపిస్తోంది. అయినా, సరసమైన కథలు, మధు పుస్తకాలలో వైవిధ్యం అంతంత మాత్రం.
మార్క్సిస్ట్ దృక్పథంతోనే కావచ్చుగాని, రా.వి. శాస్త్రి గారు ప్రతి రచయితా తాను మంచికా, చెడుకా దేనికి దోహదం చేస్తున్నా అని ప్రశ్నించుకోవాలి అన్నారు.
టుర్గ్ నివ్ [Turgenev] గీ ద మొపాసా [Guy de Maupassant] కొన్ని కథల సంపుటిని బంధువు లెవ్ టోల్ స్టాయ్ [Lev Tolstoy] కి ఇచ్చి చదివి అభిప్రాయం చెప్పమన్నపుడు ఆయన ఒక రచయితకుండవలసిన మూడు లక్షణాలు చెప్పి అందులో ప్రధానమయినది రచయితకు తన రచనతో సరైన నైతిక సంబంధం ఉండాలి అన్నాడు. కుప్పుస్వామి మేడ్ ఈజీగా చెప్పాలంటే పాత్రల దుష్ప్రవర్తనను పరోక్షంగానైనా రచయితా సమర్థిస్తున్నట్టుండకూడదు అని [..a correct moral relation to what he described – that is having a knowledge of the difference between good and evil.] మనం కథలలో రాసే అనైతిక ప్రవర్తనకు [లైంగిక, ఇతర] మన తల్లి, మన పిల్లలు, మన తోబుట్టువులు, జీవిత సహచరి పాల్పడితే కథలలోలా ఆనందించగలమా, సరిపెట్టుకోగలమా?
మా ఆవిడ బంధువు అన్నపూర్ణమ్మ గారు ఒక బాల్యవితంతువు. ఎలాంటి మచ్చలేని ఉత్తమురాలు. వితంతువులు పవిత్రంగా ఉండాలి అని, మడికట్టుకోవాలని నేను ఇక్కడ సిద్ధాంతీకరించలేదు. అత్తవారు దగ్గిరకు తీయకపోతే తమ్ముడు పోషించాడు. చివరకు పచ్చకామెర్లతో చనిపోయింది. ఆమెను, మధుర మీనాక్షిని కూడా దృష్టిలో ఉంచుకుని ‘కీరవాణి’ రాశాను. నిడివి తగ్గించడానికి దాన్ని చిత్రవధ చేసినా, సంపాదకుడు దయతో ‘విపుల’ లో [అక్టోబర్ 2011] ప్రచురించాడు.
తాను రాసిన దానిని తానే నిర్దయగా తొలగించుకునే లక్షణం కారణంగా చాసో గారి ఎక్కువ రచనలు తెలుగు జాతికి మిగలలేదు. తెలుగుజాతికి మిగలనివి కోటి ఉన్నాయి.
మార్క్సిజాన్ని తెలుగు కథా సాహిత్యంలో ప్రవేశపెట్టింది నేనే అని చెప్పుకున్నారట చాసో, “శభాషో”. ఏతావాతా అది తెలుగు సాహిత్యానికి ఏ మేరకు మంచి, ఏ మేరకు కీడు చేసింది అన్న విషయం ఇప్పుడన్నా అధ్యయనం చెయ్యడం అవసరం. చాసో ముందే గురజాడ నేను మార్క్సిస్టు అని అన్నా, ఈ మహాకవిని తప్పుపట్టడానికి ఉండదు. మహాకవులు తప్పులు చెయ్యరు – ఉదాహరణకు శ్రీనాథుడు, శ్రీశ్రీ కూడా. మార్క్స్ అభిప్రాయాలలో కొన్నైనా మార్క్స్‌కు ముందే వెల్లడి చేసినవాళ్ళుంటారు. గురజాడ మావాడే అని కామ్రేడ్లు భుజానికి ఎత్తుకుని వూరేగడం వలన ఆయనకు ఎంతో మేలు చేసినవాళ్లు అయ్యారు. ఆయనపై ఈగను వాలనీయలేదు, చీమను పాకనీయలేదు. మార్క్స్‌ను కన్న తల్లిదండ్రులు కూడా మార్క్స్‌ను కనింది మేమ్ అని గర్వంగా చెప్పుకుని ఉండరు.
పీడితుడు, పీడకుడు, వర్గపోరు, దోపిడీలు, పోయే సంకెళ్లు, వచ్చే మంచికాలాలు, మిగులు విలువ, వగైరాలు మార్క్స్ పేటెంటెడ్ అనుకుంటే చాసో కథలలో ఆ లక్షణాలకై వెదకాలి. అజ్ఞాతంగా కొన్నిటిలో ఉండకపోవు. కొన్నింటిలో అజ్ఞాతంగా కూడా ఉండవు. పేదరికం, ఈతిబాధలు, దోపిడీ వ్యక్తమయిన ప్రతి కథ మార్క్స్ ప్రసాదం కాదు.
II
రెండో విషయానికి విషయానికి వస్తే –
‘కన్యాశుల్కము’ను ఆంగ్లంలోకి ‘Sale of Girls’ గా 2007లో అనువదించారు ఆచార్య వెల్చేరు నారాయణ రావు గారు. ఆచార్య వెల్చేరు నారాయణ రావు, ఆచార్య డేవిడ్ షుల్మన్ గురజాడ వారసుడు చాగంటి సోమయాజులు కొన్ని కథలను “Dolls’ Wedding and Other Stories” అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువదించి 2012లో Penguin Books India ద్వారా ప్రచురించారు “For Chaganti Tulasi, who loves stories.”
ఉపోద్ఘాతంలో విశాఖపట్నం సముద్రపు ఒడ్డున అందరి విగ్రహాలు ఉండి గురజాడ వారసుడు చాసో విగ్రహం లేకపోవడాన్ని ఎత్తి చూపారు. వెల్చేరు వారు లేవనెత్తిన అంశం ఆలోచించవలసినదే. ‘ప్రజాగాయకుడు’ వంగపండు ప్రసాదరావు గారి విగ్రహమంత కళాత్మకంగా తయారు చేయించగలిగితే మంచిదే. అప్పటి అధికార పక్షంలో వున్న ఆయన కూతురు విశాఖ బీచిలో నిలబెట్టుకోగలిగింది ‘ఏం పిల్లో’ అన్న పాట పాడుతూ నృత్యం చేస్తున్న భంగిమలో. నిలబెట్టి తండ్రి ఋణం తీర్చుకుంది. అందరి వారసులకు అది సాధ్యం కాదు. విశాఖ సముద్రతీరం పొడవుగా ఉంటుంది కనుక వెయ్యి విగ్రహాలయిన పెట్టుకోవచ్చు డబ్బు, పరపతి, ప్రేమ, కులబలం ఉంటే.
అనువాదకులు, పుబ్లిషర్లు అన్న ఈ క్రింది విషయాలు గమనించదగినవి.
- The first thing that strikes you when reading Chaso is the utter absence of sentimentality, a staple of so many other modern South Indian writers.
- [With the same breath, the translators say:] Some of the stories –’Why would I Lose it, Dad?” and ‘Violin’, for example – can bring tears to your eyes.
- The publishers say: “The stories in Dolls’ Wedding.. are nuanced, hard-hitting and marked by the total absence of sentimentality.
- Translators: A realist devoid of ideologies.
తెలుగులో ఇలా అనుకోవచ్చు – 1. చాసో కథలలో సెంటిమెంటాలిటీ [భావోద్వేగం] ఏ మాత్రం ఉండదు. ఎందరో దక్షిణ భారత రచయితలకు సెంటిమెంటాలిటీ ప్రధాన రచనా సరుకు. 2. కొన్ని కథలు, ఉదాహరణకు ‘ఎందుకు పారేస్తాను నాన్నా’, ‘వాయులీనం’ మీ కళ్ళకు నీరు తెప్పిస్తాయి. 3. కథలు సూక్ష్మంగా, లోతుగా, చదివినపుడు గూబ గుయ్యుమనేలా ఉంటూ ఏ మాత్రం సెంటిమెంటాలిటీ లేకుండా ఉండును. 4. చాసో వాదాలు లేని వాస్తవవాది.
ఒకటి, మూడు పాయింట్లు రెండోది పరస్పర విరుద్ధాలు.
చాసో గారే తన సాహిత్యవాదం మార్క్సిజం అని గర్వంగా చెప్పుకుని అభ్యుదయ రచయితల సంఘ స్థాపకులలో ఒకరవడం Pro. వేల్చేరుకు కూడా తెలుసు.
ఇంట్రోలో ఇలా రాశారు: Chaso died in January 1994, with the feeling that his stories were not fully understood or properly appreciated. Perhaps he was right. తన కథలను పూర్తిగా అవగాహన చేసుకోలేదన్న సరిగా మెచ్చుకోలేదన్న అసంతృప్తి జనవరి 1994 లో మరణించిన్నపుడు చాసోలో ఉండేది అని అనువాదకులు అన్నారు. తన రచనలపై సరైన విమర్శ రాలేదు ఎందుకని అని చాసో గారే ఆశ్చర్యపోవడమో, బాధపడటమో జరిగిందన్నారు, మరొక చోట అనువాదకులు ఇలా అన్నారు: He was a perfectionist and would say that he didn’t like any of his stories–he was always aspiring to write something better. చాసో తాను చేసే పనిలో పరిపూర్ణతను కొరుకునే వ్యక్తి. తన ఒక్క కథ కూడా తనకు నచ్చలేదు అనేవారు. సతతం మరింత మెరుగైన రచన చేయాలని తపనపడే వ్యక్తి.
ఒక చెంప తన కథలు తనకే నచ్చవంటూ తన కథలను సరిగా అర్థంచేసుకోలేదనీ మెచ్చుకోలేదని చాసో బాధపడటంలో పరస్పర విరుద్ధత కనిపిస్తుంది. Man is a bundle of contradictions.
రెండు కథలలోని సెంటిమెంటాలిటీ గురించీ ప్రస్తావించదలచాను. వారు మన మధ్య లేరు గాని తన కథలపై విమర్శ రాలేదని బాధపడ్డ చాసోకు ఇప్పుడు నేను రాయబోయేది అణునుమాత్రమైనా సంతోషం కలిగించే విషయం. తన సారా కథలను ఉద్దేశించేమో రా.వి.శాస్త్రిగారు ‘అయ్యయ్యో కథలు’ అన్నారు. ప్రస్తుత రెండూ ఆ కోవలోవే.
1. ఎందుకు పారేస్తాను నాన్నా?
కథ రెండవ పేరాలో ఈ వాక్యం వాడారు రచయిత: “కృష్ణుడు వీధిముఖం చూడకుండా మొగుడుచచ్చిన విధవలాగా ఇంట్లో దూరి కూచుంటున్నాడు.”
అగ్గినిప్పులా ‘మొగుడు చచ్చిన విధవ’ ఏమిటీ ఆ మాటలనడంలోని హృదయరాహిత్యాన్ని పక్కనుంచినా?
మొదటి పేరాలో “వాళ్ళ నాన్న పిలిచి చుట్టలు తెమ్మని డబ్బులిచ్చేడు” అన్నారు కనుక దాని క్రింది పేరాలో “నాన్న చుట్టలు తెమ్మని పురమాయించేడు” అన్న పునరుక్తి అవసరమా?
డబ్బులు లేక ఆ కుర్రాడిని చదువు మానిపించదలచాడు తండ్రి. ఆయనకు చుట్టలు తిండితో సమానమేమో! చదువును భార్యగానో భర్తగానో అతి ప్రియంగా భావించిన కృష్ణుడు చదువు మానడమంటే వైధవ్యంతో సమానం అని పాఠకుడు భావించవచ్చు. చదువు మానడం కుర్రవాడికి ఆత్మగౌరవ సమస్య కూడా, సాటి పిల్లలంతా ఆ అందలం ఎక్కి గర్వపడుతుండగా. చదువు ఒక వైభవం. ఈ ఆర్థిక పరిస్థితికి ఇంటి యజమానిగా తండ్రి అసమర్థత కారణం. చదువు చెప్పించలేని తండ్రిని చూసి జాలిపడాలా నిందించాలా? ఆడామగా బిడ్డలను కనే కార్యక్రమంలో కామం తీర్చుకోడం ప్రధానమైనది! ఆర్థికపరిస్థితి ఏమిటి, పుట్టే పిల్లలను ఎలా పెంచి పెద్దచెయ్యాలి, పెళ్లిళ్లు ఎలా చెయ్యాలన్న ఆలోచనలకు వీలుండదు కామాతురతలో! ఆ బడిలో చదువుతున్న వేలాది పిల్లల తండ్రులు సమర్థులయినపుడు, వాళ్ళు చుట్టలు మానేయనక్కరలేనప్పుడు – కృష్ణుడి తండ్రి, వసుదేవుడు, ఒక్కడే అసమర్థుడుగా మిగులుతాడు. గాడిద కాళ్ళు పట్టుకునైనా [అది పట్టుకొనిస్తే, ఆ పని ఉపయోగపడితే] పిల్లవాడికి చదువు చెప్పించాలి. పులి మీద పుట్రలా, గాయానికి అవమానం జోడించినట్టు అంత తెలివైన ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము లాంటి చిన్ని కృష్ణుడిని, విచారగ్రస్తుడిని, తన విలాస వస్తువు చుట్టలు తేవడానికి వినియోగించాడు వాడి సున్నితమనస్తత్వానికి చెందిన విషయాలను కేర్-ఏ-జోట్ అంటూ. ఒక శిక్షగా, పరీక్షగా వాడు తన బడి మీదుగా వెళ్ళాలి చుట్టల అంగడికి. నామోషీ తప్పనిసరి. అక్కడ తనతో పాటే చదువుకునే పిల్లలుంటారు తన, తన తండ్రి అసమర్థతలకు సాక్షులుగా. పెద్దవాళ్లలాగే పిల్లలు వాళ్ళ రీతిలో వాళ్ళ ఈడు పిల్లలను ఏడిపించగలరు. ఏడిపించడం మానవ నైజం, వినోదం. వాళ్లకు తన చదువు విషయంలో సంజాయిషీ ఇచ్చుకోడమో, అబద్ధాలు ఫెవికాలతో అతికినట్టు చెప్పడమో కృష్ణుడు చెయ్యవలసిన అవసరం ఏర్పడింది. చదువులో వాడు సాధించిన ఆధిక్యత వాడు ధరించే కుళ్ళు బట్టల అవమానం నుంచీ వాడిని కాపాడుతోంది. భర్తను భార్య కొడుకు చదువు విషయమై శతపోరుతోంది. లెక్కలు చెప్పేడు భర్త: “ఫోర్త్ ఫారంకి ఫీజు ఎక్కువ, నెలనెలా ఎంతకట్టాలో తెలుసా? తూగగలనా? ప్రవేశపెట్టటానికి, పుస్తకాలకే ఔతుంది యాభై రూపాయలు. దస్తా కాగితాలు రూపాయి, అర్ధణా పెనిసలు ఆరణాలు.” చదువు చెప్పించలేక పోవడానికి అసలు కారణం తండ్రి ఉద్దేశంలో ‘ప్రారబ్ధం’ తండ్రిది, కొడుకుది. అంటే కర్మ సిద్ధాంతం మీద నమ్మకముందన్నమాట. కథలో ఎక్కడా రోజువారీ చుట్టల ఖరీదెంతో చెప్పలేదు రచయిత. చుట్ట ఖరీదు తక్కువేగాని రోజుకు ముప్పై తగలబడుతుండొచ్చు. నామర్థతో “కుళ్లిపోతున్నాడు” కుర్రవాడు. సుకుమారమైన వర్ణన! ఈర్ష్య, చదువులేకుండా పోతుందేమోనన్న దుఃఖం “లేడిక పాములై అతని చావును కరకరలాడిస్తున్నాయి.” పదకొండేళ్ల బాలుడి గురించి చెప్పిన ఆ పదజాలం వినడానికి, చదవడానికి సొంపుగా ఉందా? ఆ బడిలో వేలాది పిల్లకు లేని సమస్య తండ్రి అసమర్థత వల్ల వచ్చి కూర్చున్నట్టుంది – ఈ కథ గురించీ. బడి దగ్గిర నిలుచుండిపోయాడు. ఇంటికెళ్లను, భోజనానికి వెళ్ళను అని సత్యాగ్రహానికి దిగాడు గాంధీ గారి ప్రభావం లేకపోయినా. కొడుకు గురించీ చూసిచూసి తండ్రి వచ్చాడు. చుట్ట టైముకు తగలడాలి కదా! “ఓరి వెధవా! [మరొక సారి వెధవ] చుట్టలు తెమ్మంటే ఇక్కడ దిగామారేవేం?” అన్నాడు. స్కూలును చూడు అన్నాడు కొడుకు అర్థవంతంగా, ఎత్తిపొడుపుగా, చాసో గారిలాగే పదాలు వృథా చెయ్యడం ఇష్టంలేనట్టు. “ఏమిటిరా నీ శ్రాద్ధం” [బ్రాహ్మణ తిట్టు]. కుర్రాడు చస్తే అది చూడలేక ఏ తండ్రయినా చస్తాడు తండ్రి చస్తాడు హిరణ్యకశిపుడు తప్ప. శ్రాద్ధం గురించీ ప్రస్తావించాడు గనుక కృష్ణుడి తండ్రి సద్బ్రాహ్మణుడయ్యుండాలి రచయితలాకాక. కానీ కుఱ్ఱవయసువాళ్ళకు శ్రాద్దాలు పెట్టరు. కొడుకు బాధ అర్థమయింది లేటుగానైనా. ట్యూబులైటు మనసయ్యుంటుంది. అప్పుడే అది వెలిగినట్టు కొడుకు బాధతో తండ్రి బాధ మమేకమయ్యింది. ఇంటికి పోదాం అన్నాడు. కొడుకు రానన్నాడు. “ఏం చేస్తావు రా?” “గోడకేసి బుర్ర బాదుకుంటా,” అన్నాడు కొడుకు బుర్ర తప్పు చేసినట్టో, గోడ తప్పు చేసినట్టో. అసమర్థుడే అయినా, బ్రాహ్మడే అయినా ఆ తండ్రి మనిషే. [అది గురజాడ మెచ్చే వాక్యం.] కొడుకును కౌగలించుకున్నాడు పుత్ర గాత్ర పరిష్వంగ సుఖం అనుభవిస్తూ, తండ్రే కొడుకు, కొడుకే తండ్రి. ఆ అవకాశాన్ని పోనీకుండా “ఒక్క ఇంగిలీషు పుస్తకమైనా కొను.” “కొందాం. ఏడవకు నాయనా, నేను చచ్చిపోయాను ఏడవకు!” అన్నాడు తనంటే తనకు జాలి కలిగినట్టు, తనంటే తనకు కోపం వచ్చినట్టు, శివనామస్మరణ కాకపోయినా చావు నామస్మరణ ఇష్టమన్నట్టు. ఒక నిర్ణయానికి తండ్రి వచ్చాడు. గతంలో చుట్టలు మానేద్దామనుకున్నాడు కానీ మానలేకపోతున్నాడు. వ్యసనాన్ని జయించడం కష్టం. ఆ విషయం చుట్ట కాల్చేవాడికి తెలుస్తుంది. “ఇందాక చుట్టలకిచ్చాను. డబ్బులున్నాయా, పారేశావా?”
“ఎందుకు పారేస్తాను నాన్నా?”
పాఠకుడు మేరీ మాగ్దలీన్ [Mary Magdalene] లా ఏడుస్తాడు.
2. వాయులీనం
వెంకటప్పయ్యగారి భార్య రాజ్యం ఫిడేలు విద్వాంసురాలు; ఆమెకు ఫిడేలు ఉండక తప్పదు. అమ్ముకోడానికి తాళిబొట్టయినా ఉండుండదు అని కథాఖర్లో అనిపిస్తుంది.. భర్తకూ సంగీత పరిజ్ఞానం కలదు. టైఫాయిడ్ పాలయింది. కథారంభంలో స్పృహలో లేదు. “వొసే రాజ్యం!” [ఒసే అంటే స్త్రీవాదులకు అభ్యంతరము లేదా?] అని పిలిచినా సమాధానం లేదు. “మనోహరమైన తోడిరాగాన్ని తోడుపుచ్చుకుని అంబరవీధుల్లో విహరిస్తున్న” దని రచయిత అంటారు. అది జాలిలేని భావుకత. ప్రాణాలుపోయేట్టున్న మనిషి మానసికస్థితి మనోహరం అని రాయడంలో ఔచిత్యం ఎంతుందో రచయితకు తెలియాలి ఆయనకు సంగీత పరిజ్ఞానం ఎంతున్నా. ఇంటిపక్కనే గోల చేస్తున్న పిల్లలమీద వెంకటప్పయ్య విరుచుకుపడంగానే రాజ్యానికి స్పృహ వచ్చింది; విరుచుకుపడటం ఔషధంలా. ఆమె మొహం బీభత్సంగా వుంది: పైకి వచ్చిన గుడ్లగూబ కళ్ళు, ముందుకు పొడుచుకు వచ్చిన ముందుపళ్ళు. భార్య ప్రాణాపాయంలో ఉండగా ఎంత వికృతంగా కనిపిస్తోందో వర్ణించడం అంత అవసరం లేదేమో! కొత్త ఇల్లు అద్దె ఎక్కువ అసలే ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉండగా. ఆమె ప్రాణంకన్నా డబ్బు ముఖ్యం కాదు అది అందుబాటులో ఉండాలేగాని అన్నది భర్త సహేతుకమైన అభిప్రాయం. రెండు నెలల జీతం కాక రెండు వందల పైనే ఆమె అనారోగ్యం మీద ఖర్చయ్యింది. ప్రాణానికే క్షేమంలేని తరవాత ‘వెధవ’ అద్దెకు చూసుకుంటామా? “కట్టుకున్న మొగుడు, కన్న పిల్లలు ‘అదృష్టవంతులు’ కావడాన్ని బతికి మనుషుల్లో పడ్డది.” అనవసరంగా మందులపై ఖర్చుపెట్టినట్టు లెక్క. ఎవరో పాడుతున్న కామవర్ధని రాగాన్ని రాజ్యం వింటోంది. వినేటప్పటి ఆమె రూపును రచయిత ఎలా వర్ణించారో చూద్దాము: “నోరు సాగదీసి మెడను ఆడిస్తోంది.” భర్త విరగబడి నవ్వాట్ట – పులిమీద పుట్ర. హాస్యప్రియుడిలా వున్నాడు సందర్భోచితమా కాదా అన్నదానికి తిలోదకాలిచ్చి. ఆమె ఫిడేలు మూలకు, కామాను విరిగి పెంటకుప్పకు చేరాయట. ఆ ఘాతుకమైన విషయం కాస్త సున్నితంగా చెబితే బావుండు; నాయకుడు వెంకటప్పయ్య గాని పెంటకుప్పయ్య కాదు. పాట ప్రాణం కావడం వలన పీనుగులాంటి రాజ్యానికి ఏనుగంత బలమొచ్చింది ఎవరో పాడే పాట వింటుంటే. ఇదే అదనుగా ఒక ఘనకార్యం చెయ్యడానికి బయటికి వెళ్లి వచ్చాడు వెంకటప్పయ్య. భార్యకు నాలుగు వేళ్ళ వెడల్పు చుట్టూ జరీ అంచు చీర, పట్టు రవికలగుడ్డా తెచ్చాడు. డబ్బెక్కడిది అని సహజంగానే అడిగింది, చావుకబురు లాంటి జవాబుకు ఎదురు చూస్తూ. ఏమీ అననని చేతిలో చెయ్యేస్తే చెబుతానన్నాడు. ఆరోగ్యంగావున్న అతని వణికే చేతిలో, జబ్బుతో వున్నా వణకని తన చెయ్యి వేసింది. దొంగతనం చెయ్యలేదు కదా అని ఆమె అడిగితే, “అంతకన్నా హీనమైనదే” అన్నాడు. ఫిడేలును రెండు వందల యాభైకి అమ్మించాడు. “వెళ్లిపోయిందా?” అని దీర్ఘంగా నిట్టూర్చింది. అంతకన్నా చేయగలిగింది లేదు. “తల్లి వెళ్ళిపోతూ నాకు చీరా రవికల గుడ్డ పెట్టింది,” అంటూ గుడ్లనిండా నీళ్లు నింపుకుంది. తల్లిపెట్టిన చీర తన ఎదురుగావున్నా ఆమె దాన్ని పట్టించుకోలేదు. ఫిడేలుకు చీర ప్రత్యామ్నాయమా; చీరకు ఫిడేలు ప్రత్యామ్నాయమా? చీరను విప్పి ఆమె భుజాన్ని కప్పాడు. ప్రేతకళతో వున్నా మనిషికి నాలుగువెళ్ల వెడల్పు పట్టు అంచు చీర అవసరం. ఇంతకూ అతను అమ్ముతానని ముందుగా చెప్పుంటే దానికన్నా నా ప్రాణం విలువైనది, అమ్మేయకండి అనేదా? కథ ఆ విషయం చెప్పదు. ఆమె అమ్మనీయదు అని భర్త అనుకోబట్టి ఆమెకు చెప్పకుండా ఆ పని చేసాడని సరిపెట్టుకుందాము. అమ్మడానికి [బహుశా పుట్టింటివారు కొనిచ్చిన] వాయులీనం తప్ప రాజ్యం గారి తాళిబొట్లు, గాజులు, ముక్కుపుడక, చెవి కమ్మలు, కాలి మెట్టెలు, గంగాళాలు లాంటివేవీ కూడా మిగలలేదు అని పాఠకుడు భావించుకోవాలి. అలాంటిదాన్ని కటిక దరిద్రం అంటారనుకుంటాను. అలాంటి దరిద్రంలో ఆమెకు వెక్కిరిస్తున్నట్టు పట్టుచీర వచ్చింది. ఆమె ప్రస్తుతం వున్నా ఆరోగ్య, శారీరక స్థితిలో దిష్టిబొమ్మను పట్టుచీరెతో తయారుచేసినట్టుంటుందని వెంకటప్పయ్యగారికి లేక చాగంటి సోమయాజులు గారికి అనిపించి ఉండదేమో. రచయితలూ దొర్లించే అక్షరాలవల్ల కొన్ని లేక చాలా విషయాలు పాఠకుడు అర్థం చేసుకో వీలుంటుంది కానీ పాత్రల, రచయితల మనసులలోకి దూరి తెలుసుకోడం అసాధ్యం. పాఠకుడు కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకేలాంటి ప్రయత్నం చేస్తే ఏ రచనా బతికి బట్టకట్టలేదు – ఎంతోకొంత సత్యం.
వాయులీనం వాయులీనం అయింది.
కథానిండా కావలసినన్ని ముక్కులు, మూలుగులూ వున్నాయి. ఐదు ‘వెధవ’లున్నాయి.
ఇంతకూ ఏమిటీ మౌడ్లిన్ సెంటిమెంటాలిటీ? మేరీ మాగ్డలీన్ అనే పాపి తన కన్నీళ్లతో యేసు క్రీస్తు పాదాలు కడిగింది భావోద్రేకం ఆపుకోలేక. “మాగ్డలీన్” నుంచి మౌడ్లిన్ పుట్టింది. ఆంగ్లార్థం సింపుల్‌గా చెప్పుకోవాలంటే ‘ఎమోషనల్లీ సిల్లీ’ [emotionally silly]. అధిక భావోద్రేకం అని తెలుగులో సరిపెడదాము.
అది ఆ రెండు కథలలో లేదా?
R.S. సుదర్శనం గారు “చాసో కథలు తెలుగు సాహిత్యానికి గొప్పకానుక” అన్నారు [భారతి, అక్టోబరు 1980].