Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెతడి-9

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[తాను నగలు చేయించుకోవాలంటే, తనతో పాటు అత్తగారు కూడా చేయించుకోవాలని పట్టుబడుతుంది శర్వాణి. వద్దంటుంది ప్రసూనాంబ. చివరికి ఒప్పుకుని, నగలవీ వద్దు కానీ, తన పాత వెండి పగడాల దండకు బంగారు తీగ చుట్టించమంటుంది. దాని లక్ష్మీదేవి లాకెట్ చేయించి తగిలిద్దామని అంటుంది శర్వాణి. మధ్యాహ్నం భోజనం చేసి, విశ్రాంతి తీసుకున్నాకా, సాయంత్రం కె.టి. పేట రోడ్డులో ఉన్న ‘మోదకొండమ్మ తల్లి జ్యూయలర్స్’ షాప్‌కి వెళ్తారు. ఆ కొట్టు అబ్బాయి వీరేశం, జగన్నాథరావుగారి శిష్యుడే. అందరినీ ఆదరంగా పలకరించి, ఏం కావాలో కనుక్కుంటాడు. ప్రస్తుతం బంగారం రేటు చెప్పి, ఎవరికి ఎంత పడుతుందో లెక్కలేసి, మొత్తం కలిపి పధ్నాలుగు కాసుల ఆరు గ్రాములవుతాయని చెప్తాడు. శ్యామల రావుని ఒక ఉంగరం చేయించుకోమని ఒత్తిడి చేస్తుంది శర్వాణి. తన దగ్గర ఉన్న నరసింహ స్వామి ఉంగరం నమూనా చూపిస్తాడు వీరేశం. బావుందని చెప్పి, అదే తరహాలో చేయమని చెప్తాడు. కూతురు సాహితికి వెండి పట్టీలు చేయించమని చెప్తాడు. పదిహేను వేలు అడ్వాన్స్ ఇచ్చి,అ ందరూ ఇంటికి తిరిగొస్తారు. తర్వాతి ఆదివారం మురళి భార్యనూ, కొడుకుని తీసుకుని వస్తాడు. ఆదివారం టిఫిన్ తిని వెళ్ళి తమ ప్లాట్లు చూసుకుంటారు. అక్కడ డెవెలప్‌మెంట్ బాగా జరుగుతూంటుంది. వీళ్ళ ప్లాటుకి సమీపంలో ఒకాయన ఇల్లు కట్టించుకోడం చూసి, ఆయన్ను పలకరించి వివరాలు తెలుసుకుంటారు. ఆపై  ఆఫీసుకు వెళ్ళి సూర్యారావుని కలుస్తారు. తమ ప్లాటులో ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నామని చెప్పి వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చే ఉద్దేశం ఉందని చెప్తాడు. మరునాడు తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే, సూర్యారావు చెప్పిన లెక్కలన్నీ సరైనవేనని తెలుస్తుంది. పెద్దలందరి సలహాలు తీసుకుని సింహగిరి కన్‌స్ట్రక్షన్స్ వారితో కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. వారి ఇంజనీరు చక్కని ప్లాన్ గీసి చూపిస్తాడు. ఏడెనిమిది నెలల్లో కన్‌స్ట్రక్షన్ పూర్తి చేసి ఇల్లు హాండోవర్ చేస్తామని డెవలపర్స్ మాటిస్తారు. – ఇక చదవండి.]

ఇంటి నిర్మాణం ప్రారంభమయింది. ప్రతి ఆదివారం శ్యామల రావు వెళ్ళి చూసి వస్తున్నాడు. నర్సీపట్నంలో జగన్నాథరావు గారి శిష్యుడు అనుకున్న విధంగా నగలన్ని తయారుచేసి తెచ్చిచ్చాడు. ఒకరోజు శ్యామల రావు వెళ్లి మిగతా డబ్బు కట్టేసి నగలు తెచ్చేశాడు. పెళ్లి రోజు మరో వారం రోజులే ఉంది. మామయ్యా వాళ్లను, మురళి వాళ్లను కూడా వైజాగ్‌కు రమ్మని పిలిచారు.

ముందు రాజే అందరూ విశాఖ చేరుకున్నారు. ఉదయం స్నానాలు చేసి కనకమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని అర్చన చేయించుకొని వచ్చారు. దారిలో ‘సాయిరాం పార్లర్’లో టిఫిన్ చేశారు. డైమండ్ పార్కు దగ్గరున్న ఆ హోటలు చాలా ప్రసిద్ధి చెందింది వైజాగ్‌లో. పెద్దవాళ్లు కూడా ఈ మధ్య, పిల్లల కనుగుణంగా మారుతున్నారు. తప్పదు మరి! పొంగల్ వడ, సెట్ దోశ తెప్పించాడు శ్యామల రావు. చివర్లో చల్లని బాదంపాలు తాగారు అందరూ.

ఇంటికొచ్చేసరికి పదయ్యింది. ప్రసూనాంబ తనకు తలనొప్పిగా ఉందని, ఎందుకో కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుందని అంటే గదిలో విశ్రాంతి తీసుకోమని చెప్పాడు కొడుకు. పారాసిటమల్ టాబ్లెట్, మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇచ్చింది శర్వాణి.

విశాలాక్షి, శర్వాణి, మురళి భార్య కలిసి పెళ్లి రోజు విందు భోజనం తయారుచేశారు. పెరుగువడలు, క్యాప్సికం బాత్, క్యాబేజీ కొబ్బరికోరు కలిపిన కూర, పుదీనా పచ్చడి, మెంతికూర పప్పు, సగ్గుబియ్యం పాయసం.

అందరూ ఒంటిగంటన్నరకు భోజనానికి కూర్చున్నారు. ప్రసూనాంబకు కొంచెం నిమ్మళించి, లైట్‌గా భోంచేసి మళ్లీ పడుకుంది. పెద్దావిడ అనారోగ్యం, పెళ్లిరోజు ఆనందాన్ని కాస్త తగ్గించింది.

సాయంత్రం అందరూ సినిమా ప్రోగ్రాం వేశారు. పెద్ద వాళ్లు, “మాకు ఓపిక లేదు, మీరు వెళ్లి రండి” అని చెప్పారు. వీళ్లంతా పిల్లలను తీసుకుని సంగం, శరత్ థియేటర్ కాంప్లెక్స్‌కు వెళ్లారు. చిరంజీవి సినిమా ‘స్నేహం కోసం’ శరత్‍లో ఆడుతూంది.

సినిమా చాలా బాగుంది. ద్విపాత్రిభినయం చేసి తన నటనా పటిమను చాటుకున్నాడా సెల్ఫ్ మేడ్ ఆర్టిస్. అందులో చిరంజీవి స్నేహితుడిగా నటించిన తమిళ నటుడు విజయకుమార్ నటన కూడా చాలా సహజంగా ఉంది.

“ఆయన ఎవరో కాదు, మన మంజుల భర్తే” అని చెప్పింది మురళి భార్య.

“మన మంజుల.. అంటున్నావు. కొంపదీసి మీ బంధువులా ఏమిటి?” అని హాస్యమాడాడు మురళి. అందరూ నవ్వుకున్నారు.

సినిమా పూర్తయింతర్వాత ఇల్లు చేరుకొని ఉదయం తినగా మిగిలినవి తిన్నారు. ప్రసూనాంబ తానేమీ తినలేనని, గ్లాసుడు మజ్జిగ తాగి పడుకుంటానన్నది. మజ్జిగ తాగిం తర్వాత కాసేపటికి శ్యామల రావును పిలిచి “ఎందుకో ఆయాసం వస్తూందిరా!” అని చెప్పింది. “తగ్గుతుందులే, ప్రశాంతంగా పడుకోమ్మా!” అని మంచం మీదే కూర్చున్నాడు. శర్వాణి అత్తయ్య గుండెల మీద మృదువుగా రాస్తూ వుంది.

“మీ పెళ్లి రోజే ఇలా అవ్వాలా, పాపిష్టిదాన్ని” అని కళ్లనీళ్లు పెట్టుకుంది ప్రసూనాంబ. “ఛ ఛ! అవేం మాటలత్తయ్యా! మీకంటే మాకు పెళ్లి రోజు ఎక్కువా ఏంటి?” అన్నది కోడలు.

పదకొండున్నరకు ప్రసూనాంబకు ఆయాసం ఎక్కువయింది. ఊపిరి పీల్చలేకపోతూ ఉంది. వెంటనే ఆటో తీసుకొచ్చి, దొండపర్తి లోని ‘సాగరమాత నర్సింగ్ హోమ్’కు తీసుకొని వెళ్లారు శ్యామల రావు, మురళి.

ప్రయివేటు హాస్పిటల్ కాబట్టి వెంటనే అటెండ్ అయ్యారు. స్ట్రెచర్‍లో లోపలికి తీసుకువెళ్లారు. అప్పటికే అమె స్పృహలో లేదు.

కాసేపటి తర్వాత డాక్టరు గారు బయటకు వచ్చి. “సారీ అండీ. షి ఈ మోర్. మ్యాసివ్ హార్ట్ అటాక్. ఆటో లోనే ప్రాణం పోయి ఉంటుంది” అని చెప్పాడు.

శ్యామల రావుకు డాక్టరు గారు చెప్పిన విషయం మెదడు లోకి ఇంకడానికి రెండు సెకన్లు పట్టింది.

“అమ్మా!” అని ఆక్రోశించాడు. మురళి భుజం మీద తల వాల్చి వెక్కివెక్కి ఏడ్చాడు. మురళికి అతన్ని ఓదార్చడానికి శక్తి చాలలేదు. శ్యామల రావును ఒక నర్సుకు అప్పచెప్పి ఇంటికి వెళ్లి అందర్ని తీసుకువచ్చాడు. శర్వాణి దుఃఖం కట్టలు తెంచుకుంది. హాస్పిటల్ కాబట్టి కరువుతీరా ఏడవడానికి కూడా లేదు.

ఆస్పత్రి అంబులెన్స్ లోనే ప్రసూనాంబ పార్థివ శరీరాన్ని యింటికి తీసుకొచ్చారు. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది ఆమె వదనం. ఆ రోజే వేసుకున్న పగడాల దండ, బంగారు చుట్టించడంతో ఆమె మెడ మెరుస్తూంది.

మర్నాడు మధ్యాహ్నానికి ఆమె తరపు దగ్గరి బంధువులు వచ్చేశారు. శ్యామల రావు తండ్రి వైపు బంధువులు ఎవరూ రాలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రసూనాంబ శరీరాన్ని అగ్నిదేవుడు చితిలో దహించి ఇహలోక బంధనాలు పూర్తిగా నశింపచేశాడు. మధ్యలో ‘చావులమదుం’ దగ్గర ఒకసారి పాడెను దించి, చెవిలో ‘అమ్మా’ అని మూడుసార్లు పిలవమన్నారు శ్యామల రావును. ‘దింపుడు కల్లం’ ఆశ అంటే అదే! ప్రసూనాంబే కాదు. చనిపోయిన వారెవరూ ఇంతవరకు బదులు పలకలేదు!

స్మశానం లోనే స్నానాలు చేసి ఇంటికి వచ్చేశారు. “అత్తయ్యను సాగనంపి వచ్చేశారా? అయ్యో, అత్తయ్యా, నన్ను కన్నతల్లిలా చూసుకున్నారే, ఒక్కసారన్నా నన్ను పల్లెత్తు మాట అనేవారు కాదే! తండ్రీ, వరాహనరసింహ, తల్లి కనకమాలక్ష్మి ఎందుకు యిలా చేశారు? కొత్త యింట్లో దేవుడికి ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేయమని అడిగారే, మాకెవరు ఇక పెద్దదిక్కు?” అంటూ భర్త మీద వాలి శర్వాణి హృదయవిదారకంగా రోదించింది.

శ్యామల రావు భార్య వీపు నిమురుతూ ఉండిపోయాడు. అతని కళ్ల వెంట కన్నీటి ధారలు! తండ్రి చనిపోయినప్పటి నుండి అన్నీ అమ్మే తనకు. తను లెక్చరర్‌గా ప్రమోషన్ పొందినా, ఏదైనా విషయంలో ఆమె మీద కోపగించుకుంటే, “పిచ్చివెధవా!” అని మాత్రం అనేది. తన పిల్లలను కూడ ఆమె కంటికి రెప్పలా కాపాడేది. ఎప్పుడూ, శర్వాణికి ఏది యిష్టమో, అది చేసిపెట్టాలని తపించేది. అలాంటి అమ్మ, అకస్మాత్తుగా తమను విడిచిపోయింది. ఒక్కసారిగా మళ్లీ బరస్ట్ అయ్యాడు. “అమ్మా! అమ్మా!” అని విలపించాడు.

జగన్నాథరావు గారు అల్లుడిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

“నాయనా, నీవూ అమ్మాయీ అంతలా ఏడుస్తూంటే, పిల్లలు చూడు ఎలా బిక్కుబిక్కుమంటున్నారో! ఆంగ్ల సాహిత్యం చదువుకున్నావు. ఏ సాహిత్యమైనా విశ్వజనీన సత్యాలను ఒకే విధంగా వివరిస్తుందని నేను అనుకుంటున్నాను.

‘జాతస్యహి ధృవమ్ మృత్యుః’ అన్నాడు భగవానుడు. ఆ మహానుభావురాలికి కాలం తీరింది, వెళ్ళిపోయింది. ఒక్కరోజు కూడా రోగాలతో, మంచాన పడలేదు. భర్త పోయిన దుఃఖాన్ని దిగమింగుకుని, నీలో ఆయన్ను చూసుకుంటూ, నీకు ఆలంబనగా నిలిచింది. ఏనాడు ఆమెలో దైన్యాన్ని, నిస్సహాయతను నేను గమనించలేదు. ‘అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితమ్’ అని మన పెద్దలు చెప్పారు. ఆ రెండూ అమ్మకు కలిగాయి. పుణ్యాత్మురాలు! లే! లేచి, ధైర్యం తెచ్చుకుని, ఆమెకు అపరకర్మలన్నీ సక్రమంగా జరిపించి, మాతృఋణం తీర్చుకో.”

ఆయన మాటలు శ్యామల రావుకు కొంత ఉపశమనాన్నియిచ్చాయి. విశాలాక్షి కూతురితో అన్నది – “మీ నాన్నగారిలాగా నాకు శాస్త్రాలు తెలియవే తల్లీ! నా కంటే బాగా చూసుకునేది మీ అత్తయ్య నిన్ను. సరే, పోయిన వారితో పాటు మనమూ పోలేము. ఇప్పుడు నీ బాధ్యత మరింత పెరిగింది. ఇంతవరకూ అత్త చాటు కోడలివి. ఇప్పుడు అల్లునికి తల్లివై, అతన్ని జాగ్రత్తగా చూచుకోవాలి. నీకిప్పుడు ముగ్గురు పిల్లలనుకో!”

నర్సీపట్నం నుంచీ పురోహితున్ని పిలిపించారు మామయ్యగారు. ఆయన అపరకర్మల స్పెషలిస్టు. ఆయన్నందరూ గీర పంతులుగారంటారు. ఆయన పేరు నందకుమారశర్మ. చాలా పొగరుగా మాట్లాడతాడనీ, ఎవ్వరినీ లెక్కచేయడనీ పేరు. పురోహితుల్లో అపర కర్మలు చేయించేవారు తక్కువమంది ఉంటారు. పొగరు, గీర అనేది పక్కన బెడితే, కార్యక్రమం చేయించడంలో దిట్ట అనీ, ఎక్కడా రాజీ పడడనీ పేరు. విశేషమేమంటే ఇతర పురోహితులు కొందరిలాగా సంభావన ఏదో డిమాండ్ చేయడనీ, ఇచ్చిన దానితో సంతృప్తిపడతాడనీ కూడా ఆయనకు మంచి పేరుంది. ఏమంటే, ఆద్యంతమూ ఆయన కోపాన్ని భరించగలగాలి. జగన్నాథరావు గారికి ఆయన మంచి మిత్రుడు.

వచ్చీ రాగానే, “ఏమిటోయ్ జగన్నాథం! మీ వియ్యపురాలు పోయారటగా! మీ అల్లుడు చాలా మంచివాడని ఇదివరకొకసారి చెప్పావు! ఇతనేనా?” అన్నాడు. మాట ఖంగుమంటోంది.

శ్యామల రావు ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన, “ఏమిటోయ్! అలా అయిపోయావు? మీ అమ్మగారికి సద్గతులు కలిగేలా కర్మలన్నీ సక్రమంగా చేయించు నాయనా! దుఃఖం సహజమేగాని, బాధ్యతా నిర్వహణలో అది అడ్డు రాకూడదు! నిజమా కాదా?

దశాహస్సు, సపిండీకరణము, వైకుంఠ సమారాధన మొత్తం నాలుగు రోజుల వ్యవహారం ఎక్కడ చేద్దామనుకుంటున్నారు?” అన్నాడు.

“రాజమండ్రిలో గోదావరి ఒడ్డున అయితే..” అన్నారు జగన్నాథరావు గారు.

“ఏడ్చినట్లుంది నీ తెలివి! అక్కడ అంతా వ్యాపారంగా మార్చేశారు. మనల్ని మాట్లాడనివ్వరు. అనకూడదు గాని జగన్నాథం, మన బ్రాహ్మల్లో కొందరున్నారు. అంత కక్కుర్తి ఎందుకో! అక్కడ ఘాట్‌లతో యూనియన్లట. రైలు దిగగానే రిక్షావాళ్లు పిలిచినట్లు పిలుస్తుంటారట. అలాంటి చోట చేస్తే, పోయినవాళ్లకు సద్గతులేమోగాని, చేయించాలనుకునే వీళ్లకు దుర్గతులు తప్పవు. నిజమా, కాదా?”

“సహజంగా అందరూ అక్కడే జరిపిస్తారు కదాని..”

“ ‘శతాంథాః కూపం ప్రవిశన్తి’ అన్నట్లు, ఒకరితో నీకెందుకోయ్? మళ్లీ అన్నీ తెలుసు నాకు అని అఘోరిస్తుంటావు. చంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతికిందట నీబోటిదే ఒకావిడ, సుబ్బరంగా మన బలిఘట్టంలో చేద్దాము. ఉత్తరవాహిని ఉంది లక్షణంగా, అందరూ ఉండడానికి మీ యిల్లు ఉండనే ఉండెను. రోజూ పొద్దున్నే పోయి, అపరాహ్నం వరకు కార్యక్రమాలు చేసుకొని వస్తాము. రావడానికి పోవడానికి రెండు ఆటోలు మాట్లాడుకుంటే సరి! ప్రతి రంగంలో మా జగన్నాథానికి శిష్యులుండి అఘోరిస్తారుగా. అనకూడదు కాని, ఖర్చు కూడ నాలుగోవంతులో తేలిపోతుంది. నిజమా, కాదా?”

ప్రతిదానికీ చివర్లో ‘నిజమా, కాదా’ అని అడగడం ఆయన మ్యానరిజం. ఆయన మాటలు కొట్టినట్లున్నా, అందులో నిజముందని గ్రహించాడు శ్యామల రావు.

“మామయ్యగారు, పంతులుగారు చెప్పినట్లే చేద్దామండి” అన్నాడు.

“అలాగే లేరా నందూ!” అన్నారు జగన్నాథరావు.

“అస్థి సంచయనం చేసి, మనిద్దరం వెళ్లి, కావాలంటే గోదావరిలో కలిపి వద్దాము అమ్మగారి అస్థికలను. అనకూడదు గాని, రాజమండ్రి దగ్గర గోదావరి కాలుష్య కాసారంలా ఉంటుంది. నన్నడిగితే ఇటు వంశధారలో అయితే మంచిది. అన్ని నదులూ పవిత్రమైనవే! ఏమోయ్, నిజమా కాదా?”

“కాదంటే నీవొప్పుకుంటావా మహాశయా? నిన్నందరూ..”

“ఊఁ. చెప్పు! గీర పంతులంటారు, ఎందుకో నాకర్థమయింది.. అనబోతున్నావు. పదహారేళ్ల నుంచి అపరకర్మలు చేయించి, చేయించి బండబారి పోయానోయ్! ఇప్పుడు డెబ్భైకి చేరువయ్యాను. ఆ మాత్రం గీర లేని దెవ్వడికి? అది వదిలేస్తే వైరాగ్యమే కాదూ? మన జన్మలకు వైరాగ్యం కూడానా? నా వృత్తిలో అది ఒక ఆభరణంగా అమరిపోయింది. ఏం నీకు లేదు గీర?”

“సరే, సరేరా నందూ! గీర కాదులే, దాన్ని ‘ధిషణాహంకారం’ అందాం లే.”

“ఉద్ధరించావులే!” అన్నాడాయన కోపంగా.

మర్నాడు శ్రీకాకుళం ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి నరసన్నపేటకు ముందొచ్చే ‘మడపాం’ బ్రిడ్జ్ దగ్గర దిగారు. వారితో పాటు మురళి కూడా వచ్చాడు.

గట్టు దిగి నీళ్ల దగ్గరకు వెళ్లారు. చాలా ప్రశాంతంగా ఉంది వంశధార. నీళ్లు స్వచ్ఛంగా పారుతున్నాయి. స్నానం చేసి, తడిబట్టలతోనే, శాస్త్రోక్తంగా తల్లి అస్థికలను నదిలో నిమజ్జనం చేశాడు శ్యామల రావు. చితాభస్మం, చిన్న చిన్న అస్థులు వంశధారలో కలిసి సుదూర తీరాలకు తరలిపోయాయి. మళ్లీ స్నానం చేసి, ఒడ్డెక్కుతుంటే అతనికి దుఃఖం ఆగలేదు.

మంత్రాలలో ‘ప్రసూనాంబ దాయ్యాః ఇయం ప్రేతాయాః’ అని మాటిమాటికీ వస్తూండడం అతనికి బాధ కలిగించింది. అదే నందకుమారశర్మగారితో అంటే “ప్రేతాన్ని ప్రేతమనక ఏమంటారు? ఆ పదం నువ్వనుకున్నంత అమంగళకరమైందేవి, కాదు. అపర కర్మలు పూర్తయ్యేంత వరకు, జీవి ప్రేత రూపంలోనే మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చివర తద్దినం తర్వాత వైకుంఠ సమారాధనతో వసురూపాన్ని పొందుతుంది – ‘వసు’ అంటే దేవత అని అర్థం!” అన్నాడయన.

“అయితే సరేనండీ!” అన్నాడు శ్యామలరావు. ఆయన వైజాగ్ కాంప్లెక్స్ నుంచి నర్సీపట్నం వెళ్లిపోయారు.

“ఈయన నర్సీపట్నంలో ఉడిపి హోటల్ పక్క సందు లోనే ఉంటారు. ఆ వీధిని వెంకునాయుడుపేట అంటారు. వీళ్లమ్మాయి గాయత్రి, ఎయిత్ వరకూ నా క్లాస్‌మేట్. చదువు మానిపించి చిన్న వయసు లోనే పెళ్లి చేశారు. అల్లుడు పిఠాపురం లోని పాదగయలో అర్చకుడని విన్నాను” అన్నాడు మురళి.

“ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్‍గా ఉన్నాడో చూడు. నదురూ బెదురూ లేదు. ఏదైనా ముఖం మీద కొట్టినట్లే! మామయ్యగారితో చూడు ఎలా మాట్లాడుతారో?”

“ఇద్దరూ బాల్య స్నేహితులు! అందుకే అంత స్వతంత్రం!” అన్నాడు మురళి నవ్వుతూ.

ఎనిమిదోరోజునే.. అందరూ బయలుదేరి నర్సపట్నం వెళ్లారు. సాయంత్రం మురళి బలిఘట్టానికి పోయి కార్యక్రమాలు జరపడానికి అనుమతి తీసుకున్నాడు. కర్మలకు సంబంధించిన సామగ్రి పెట్టుకోడానికి కొండ దిగువన ఉన్న ఒక ఆశ్రమంలో గదిని అడిగితే వాళ్లు ఇస్తామన్నారు. ఆ ఆశ్రమాన్ని ఒక స్వామిజీ నెలకొల్పారు. ఆయన పేరు జడల స్వామి. అక్కడ అమ్మ వారి గుడి, స్వామిజీ బృందం వారి కుటీరాలు ఉన్నాయి. వంటశాల, స్టోరు రూము, రెండు మంటపాలు ఉన్నాయి. శివాలయంలో కర్మలు అనుమతించరు. నదికి ఆశ్రమమే దగ్గర.

గీర పంతులుగారు అన్నట్లే జగన్నాథరావు గారి శిష్యుడు తాతబ్బాయి, వాడి స్నేహితుడు కృష్ణబాబు, రెండు ఆటోలు తెచ్చారు. యథావిధిగా, దాన ధర్మాలతోసహా, కార్యక్రమాలన్నీ చక్కగా జరిగాయి. ‘వైకుంఠసమారాధన’తో పూర్తయి; ప్రసూనాంబ వసు రూపాన్ని పొందింది. పంతులుగారికి మూడు వేల నూట పదహార్లు తాంబాలంలో పెట్టి ఇచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు శ్యామల రావు దంపతులు. ఆయన కనీసం లెక్క పెట్టుకోకుండా నోట్లను పంచకి ఉన్న జేబులో దోపుకున్నాడు.

“మీరు శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు చేయించారు. నేను ఇచ్చిన సంభావన సరిపోతుందో లేదో..” అని శ్యామల రావు నసుగుతుంటే, “అబ్బాయ్! ఆత్మీయులు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే, సంభావన కోసం బేరాలు చేసేంత దుర్మార్గుణ్ని కాదు! సరిపోతుందిలే. నా స్వభావం కొద్దీ, నిన్ను ఏమయినా దురుసుగా అని ఉంటే ఏమనుకోకురా! పెద్దవాణ్ని.”

ఆ మాటలతో కదిలిపోయాడు శ్యామలరావు.

“నా తండ్రిలాంటి వారు! మీరేమయినా అనవచ్చు” అని ఆయన హృదయవైశాల్యానికి జోహార్లు అర్పించాడు మనసులోనే.

‘అప్పియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్’ అన్న షేక్‌స్పియర్ మహాశయుని మాటలు అక్షరాలా నిజమనుకున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version