Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెతడి-6

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఆ ఆదివారం నాడు శ్యామల రావు, శర్వాణి, మురళి ముగ్గురు కొమ్మాది వెళ్తారు. అక్కడ తమ కోసం ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ ఏజంట్ సూర్యారావుని కలిసి, నలుగురు సైట్‌కి వెళ్తారు. స్థలాన్ని చూసుకున్నాకా, సాయంత్రం ఆఫీసుకు వచ్చి మాట్లాడతామని చెప్పి ఇంటికి వచ్చేస్తారు. శ్యామల రావు స్థలానికి ఆరువేలు కట్టి, మిగతా మూడువేలతో భార్యకి దుద్దులు చేయిద్దామనుకుంటాడు. కాని శర్వాణి వద్దని చెప్పి, మొత్తం డబ్బులు స్థలానికే కట్టేయమంటుంది. సాయంత్రం శ్యామల రావు, మురళి వెళ్ళి సింహగిరి డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్‌ కూర్మారావుని కలుస్తారు. పరిచయాలయ్యాకా, ముప్పాతిక భాగం డబ్బు కట్టేస్తామనీ, మరికాస్త తగ్గించాలని అంటాడు మురళీ. మరో పార్ట్‌నర్ బుల్లబ్బాయి గారి కొడుకు నూకరాజు తనకి క్లాస్‌మేట్ అనీ చెప్తాడు. మొత్తం మీద మరి కాస్త తగ్గింపు పొంది, స్థలాన్ని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటాడు శ్యామల రావు. ఫైనల్ పరీక్షలొస్తాయి. శర్వాణి, ప్రిన్స్‌పాల్ గారు, ఇతర నాన్-టీచింగ్ స్టాఫ్ అందరూ సహకరిస్తారు. పరీక్షలన్నీ బాగా రాస్తాడు శ్యామల రావు. ఓ మంచి సంబంధం కుదిరి మురళికి పెళ్ళవుతుంది. ఆడపడుచు కట్నం క్రింద వచ్చిన డబ్బులో మూడువేలు స్థలానికి కట్టేసి డాక్యుమెంట్లు తెచ్చేసుకుంటారు. మురళి తన భార్య వసంతతో గరివిడి క్వార్టర్సులో కాపురం పెడతాడు. ఫైనల్ ఫలితాలొస్తాయి. శ్యామల రావుకు 53% మార్కులొస్తాయి. అందరూ అభినందిస్తారు. శర్వాణి గర్భం దాలుస్తుంది. నెలలు నెండాకా ఆడపిల్లను ప్రసవిస్తుంది. సాహితి అని పేరు పెడతారు పాపకి. రేగ కాలేజీ ఐదేళ్ళు పూర్తయ్యాకా, డి.వి.ఇ.ఓ. ఆఫీసు వేస్తారు శ్యామల రావుని. కొంతకాలానికి ఆ దంపతులకు సాత్విక్ పుడతాడు. మూడేళ్ళూ హెడ్ ఆఫీసులో చేశాకా, శ్యామల రావును ‘పాయకరావుపేట’ కాలేజీకి వేస్తారు. తోటి టీచర్లతో పాటు శ్యామల రావు కూడా సీజన్ టికెట్ తీసుకుని రోజూ రైల్లో అప్ అండ్ డౌన్ చేసేవాడు. ఆర్.జె.డి. ఆఫీసు రాజమండ్రి నుంచి, నాన్ టీచింగ్ వారి పి.జి. క్వాలిఫికేషను ఉన్నవారి వివరాలు పంపమని లెటరు వస్తుంది. వెంటనే ప్రిన్సిపాల్ గారు శ్యామల రావు వివరాలన్నీ తయారు చేసి పంపుతారు. మూడు నెలలు గడిచాకా, ఓ రోజు రైల్లో ఉండగా, నాన్-టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముత్యాల రాజు ద్వారా – తనకి ఇంగ్లీష్ లెక్చరర్‌గా ప్రమోషన్ రాబోతోందన్న వార్త శ్యామల రావుకు తెలుస్తుంది. అందరూ అభినందిస్తారు. మర్నాడు రాజమండ్రి వెళ్ళి ఆర్.జె.డి గారిని కలిసి భీమిలి పోస్టింగ్ కోసం రిక్వెస్ట్ చేయమని చెప్తాడు. అలాగే ఆర్.జె.డి. గారికి ఓ మాట చెప్పమని ప్రిన్సిపాల్‌ని అడుగుతాడు ముత్యాలరాజు. చెప్పి చూస్తానని అంటారాయన. – ఇక చదవండి.]

ర్నాడు తెల్లవారు జామునే లేచాడు శ్యామల రావు. శర్వాణి దేవుడి దగ్గర దీపారాధన చేసి హారతి ఇచ్చి, స్వామి కొంకుమ భర్త నుదుటన పెట్టింది. ఆటోలో స్టేషను చేరుకున్నాడు. ‘ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్ ఆరో నంబరు ప్లాటుఫారము మీద ఉన్నది’ అని అనౌన్స్‌మెంటు చేస్తున్నాడు. టికెట్ తీసుకుని పరుగుపరుగున ఓవర్ బ్రిడ్జి ఎక్కి ప్లాటుఫారం చేరుకున్నాడు.

జనరల్ పెట్టెలు క్రిక్కిరిసి ఉన్నాయి. హౌరా నుంచి వస్తుందా రైలు. హైదరాబాదుకు వెళుతుంది. టి.టి.ఇ. ఒకాయన చార్టు పట్టుకుని నిలబడి ఉంటే వెళ్ళి నమస్కారం పెట్టి “రాజమండ్రికి అర్జంటుగా వెళ్ళాలి సార్. సాయం చెయ్యండి” అని అడిగాడు. అతని గొంతులోని అర్నెస్ట్‌నెస్ (నిజాయితీ) టిటియిని కదిలించింది. చార్టు చూసి, “ఎస్-5లో 9 లో కూర్చొండి. దాంట్లో రాజమండ్రిలో జాయినవుతారు. మరి స్లీపర్ క్లాస్ సర్‌ఛార్టి కట్టాలి” అన్నాడు.

“కడతాను సార్” అంటుండగానే రైలు కదిలింది. ఎదురుగ్గా ఎస్-2 ఉంది. ముందుకు పరిగెత్తబోతుంటే “అవసరం లేదు. దీంట్లో ఎక్కండి. వెస్టిబ్యూల్ (పెట్టల నుధ్య దారి) ఉంటుంది కదా! మీరు వెళ్లేసరికి స్పీడ్ పికప్ చేస్తాడు” అన్నాడాయన.

ఎస్.టు లో ఎక్కి రెండు పెట్టెలు దాటి ఎస్.ఫైవ్‌లో ప్రవేశించాడు. తొమ్మిదో నంబరు బెర్తు లోయరు. అక్కడంతా ఖాళీగా ఉంది. వెళ్లి కూర్చుని ఊపిరి పీల్చుకున్నాడు. రైలు చాలా వేగంగా వెళ్లసాగింది. అనకాపల్లి వరకు ఆగలేదు. టి.టి.ఇ ఇంకా రాలేదు, ఈ లోపు ఎవరయినా చెకింగ్‌కు వస్తే? టెన్షన్ మొదలయింది శ్యామల రావులో. తర్వాత తుని వరకు ఆగలేదు బండి. గంటన్నరలో తునికి వచ్చేశాడు.

అదే మన సింహాద్రి ఐతే రెండుగంటల పైనే పడుతుంది. దాన్ని కొందరు ‘హింసాద్రి’ అని కూడ అనడం గుర్తొచ్చి నవ్వుకున్నాడు. రైలు అన్నవరంలో ఆగింది. కిటికీలోంచి సత్యనారాయణస్వామి వారి దేవాలయ శిఖరం కనపడింది. స్వామికి నమస్కరించుకున్నాడు. సామర్లకోట దాటింతర్వాత వచ్చాడు టి.టి.యి. వచ్చి ఎదురుగ్గా విశ్రాంతిగా కూర్చున్నాడు.

శ్యామల రావును చూసి నవ్వాడు. “మరి అరగంటలో రాజమండ్రిలో దిగిపోతారుగా, సర్‌చార్జ్ రశీదు రాస్తే 39 రూపాయలు అవుతుంది. ట్వంటీ యివ్వండి చాలు” అన్నాడు. శ్యామల రావు రెండు పది రూపాయల నోట్లు తీసి ఆయనికిచ్చాడు. “ధాంక్సండీ టిటియిగారు!” అన్నాడు.

తొమ్మిదింబావుకు ఈస్ట్‌కోస్ట్ రాజమండ్రి చేరింది. ప్లాట్‍ఫాం నంబరు వన్‌కే ఇచ్చాడు. స్టేషను చాలా రద్దీగా ఉంది. బయటకు వెళ్లి ‘ఉడిపి బృందావన్’ హోటల్లో టిఫిన్ చేశాడు. సింగిల్ ఇడ్లీవడ సాంబార్ ఆర్దరిచ్చాడు. ఒక గిన్నెలో ఇడ్లీ వడ వేసి, దాన్నిండా సాంబారు పోసి, పైన కొంచెం కొబ్బరి చట్నీ వేసి గిన్నెను మళ్లీ ఒక ప్లేటులో పెట్టి ఇచ్చాడు. సాంబారు పొగలు కక్కుతుంది. ఊదుకుంటూ స్పూన్‌తో తిన్నాడు. సర్వరు వచ్చి “తర్వాత ఏం చెప్పమంటారు మాస్టారూ” అని అడిగితే ‘మసాలా దోసె’ అనబోయి, హెవీ అవుతుందని, ప్లెయిన్ రవ్వదోసె చెప్పాడు. అది కూడ చాలా బాగుంది. మూడు రకాల చట్నీలిచ్చాడు.

‘ఏమయినా టిఫిన్లు, భోజనాలకు గోదావరి జిల్లాలే!’ అనుకున్నాడు. బయట ‘మలబార్ టీ సెంటర్’లో టీ తాగాడు. అది కూడ బాగుంది.

ఆర్.జె.డి. ఆఫీసు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఉంది. చాలా దూరమని తెలుసు. ఆటో వాడినడిగితే పదిహేను రూపాయలు ఇమ్మన్నాడు. సరే చాలా టైముంది గదా అని సిటీ బస్సెక్కి శ్యామలా టాకీసు సెంటరులో దిగాడు. నలభైపైసలతో పోయింది. అక్కడినించి ఇంకో బస్సెక్కి ‘వై’ జంక్షనుకు ముందే దిగాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి ఆఫీసు చేరుకున్నాడు. పదిన్నర దాటింది.

వెళ్లి ఎ.ఓ. సారంగ రావుగారి గది వద్ద నిలబడ్డాడు. అటెండరు “ఏం కావాలి మాస్టారు” అని అడిగితే ఎ.ఓ గారిని కలవాలని చెప్పాడు. ఎ.ఓ. గారు పెద్దాయన. ఇంకా రెండు మూడేళ్లలో రిటైరవుతాడు. తలుపు వద్ద నిలబడి “మే ఐ కమిన్ సర్” అని అడిగాడు. ఆయన తలెత్తి చూసి, “రండి” అన్నాడు. కూర్చోమని అనలేదు. చెప్పమన్నట్లు చూశాడు.

“సార్ నేను పాయకరావుపేట కాలేజీలో జూనియర్ అసిస్టెంటుని. నా పేరు శ్యామల రావు. నాకు జే.యల్. ప్రమోషన్ ఇస్తున్నారని..”

“మీ నాయకులు ముందే లీక్ చేశారు. మీరు తగుదునమ్మా అని వచ్చేశారు. అంతేనా” అన్నాడాయిన ధుమధుమలాడుతూ. “ప్రొసీజరు ఫాలో అవుతాం ఇక్కడ. మీరిలా పర్సనల్‍గా రాకూడదు. వెళ్లండి!”

“క్షమించండి సార్. ఏదో ఉడతాభక్తిగా..” అంటూ జేబులంచి ఐదువందలు తీసి టేబిలు మీద పెట్టాడు. “దయ చూడండి. భీమిలిలో పోస్టు వేకెంట్ అని చెప్పారు..”

డబ్బును చూడగానే ఎ.ఓ. గారి ముఖం విప్పారింది. డబ్బు తీసి జేబులో పెట్టుకొని, “సరే సరే, వెళ్లండి. ఒకసారి జె.డి. గారిని మర్యాదపూర్వకంగా కలవండి. మీ పేరు, సబ్జెక్ట్ చెప్పండి. భీమిలికి కదూ అన్నారు. నేను పుటప్ చేస్తాన్లెండి” అన్నాడు.

జెడిగారు యింకా రాలేదు. పదకొండున్నరకు వచ్చారు. సఫారీ సూటుతో ఉన్నారు. విశాలమైన నుదురు. కళ్లు దయను వర్షిస్తున్నాయి. బయట బెంచీల మీద జెడి గారిని కలవడానికి వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కృష్ణావరకు ఆరు జిల్లాలకు రీజనల్ ఆఫీసుకు అది. ప్రిన్సిపాళ్లు, డివిఇఓలు కూడా వస్తారు.

ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తున్నాడు అటెండరు. శ్యామల రావు వంతు వచ్చేసరికి ఒంటిగంటయింది. అతన్ని లోపలికి వెళ్లమన్నాడు. వెళ్లి నమస్కారం చేశాడు.

“నా పేరు శ్యామలరావు సార్. జె.ఎల్.గా ప్రమోషన్.. నాన్ టీచింగ్..” అంటూ తడబడ్డాడు, అంత పెద్ద అధికారి ముందు నిలబడి చెప్పాలంటే.

ఆయన చిరునవ్వు నవ్వాడు.

“ఎందుకబ్బాయ్ టెన్షను పడుతున్నావు? మీ ప్రిన్సిపాల్ నరసింహ మూర్తిగారు నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఐ విల్ హెల్ప్ యు సర్టెన్లీ. ఐ కంగ్రాట్యులేట్ యు ఆన్ యువర్ అచీవ్మెంట్! ఒక జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తూ ఎమ్.ఎ. ఇంగ్లీషు చేశావంటే అది చిన్న విషయం కాదు. ఏ పాలిటిక్సో, హిస్టరయో అయితే సులభంగాని.. సరే నువ్వెళ్ళు. ఎ.ఓ గారిని ఒకసారి కలు. గాడ్ బ్లెస్ యు మై బాయ్!” అన్నాడు.

“వెరీ కైండ్ ఆఫ్ యు సార్!” అన్నాడు శ్యామల రావు వినయంగా. జె.డి. గారి టేబులు చాలా పెద్దది. తిరిగి ఆయన దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుందామని ఉంది. తటపటాయిస్తూంటే,

“వాట్ ఈజ్ ట్రబ్లింగ్ యు?” అన్నాడాయన.

తెగించి పక్కనుంచి వెళ్లి “ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ సార్” అన్నాడు. అరచేతులకు చెమటపట్టింది.

“గుడ్.” అని ఆయన రివాల్వింగ్ చెయిర్‌లో ఇతని వైపు తిరిగాడు. శ్యామల రావు వంగి ఆయన పాదాలు తాకాడు.

ఆయన తల మీద చేయిపెట్టి “ఆల్ ది బెస్ట్ అబ్బాయ్! డు జస్టిస్ యువర్ న్యూ పొజిషన్. యు ఆర్ గోయింగు టు మౌల్డ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ కెరీర్” అన్నాడు.

“సెలవు తీసుకుంటాను సార్” అని చెప్పి బయటకు వచ్చేశాడు. బయట అటెండరు నవ్వుతూ చెయ్యి చాపితే అతనికి పది రూపాయలు ఇచ్చాడు. శ్యామల రావు మనసిప్పుడు దూదిపింజెలా మారింది. ‘ఎ.ఓ.కు జెడిగారికి ఎంత తేడా?’ అని ఆశ్చర్యపోయాడు. సంతోషంతో ముఖం వెలిగిపోతుంది. ఆకలి దంచేస్తూంది. భోజనం చేసి వెళితే సింహాద్రి అందదు. దాంట్లో అయితే తన వాళ్లందరూ కలుస్తారు తునిలో. కానీ ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి.

రిక్షా మాట్లాడుకొని వై జంక్షన్ కువెళ్లాడు. అక్కడ ‘వసంతవిహార్ – శాకాహార భోజనం’ అని కనబడింది. వెళ్లి వాష్ బేసిన్ దగ్గర చేతులు ముఖం కడుక్కొని శుభ్రంగా చేతిరుమాలులో తుడుచుకున్నాడు. ‘స్పెషల్ మీల్స్ ఎనిమిది రూపాయలు’ అని చూశాడు. సరే ఈ రోజు తినేద్దామనుకున్నాడు. సర్వర్ వస్తే ‘ఒక స్పెషల్ మీల్స్’ అని చెప్పాడు. ఆ కుర్రాడు ఎదురుగ్గా ఉన్న కాబిన్‌ల వైపు చూపించాడు.

వెళ్లి కూర్చున్నాడు. లోపల కుర్చీలు టేబుళ్ళు కూడా పోష్‍గా ఉన్నాయి. కూలర్ ఉంది. ప్రాణానికి హాయనిపించింది.

సర్వరు వచ్చి పెద్ద స్టీలు ప్లేటు పెట్టబోతుంటే, “అరిటాకు లేదా?” అని అడిగాడు. “ఎందుకు లేదు సార్” అని తెచ్చిపరిచాడు. భోజనం చాలా బాగుంది. ఒక నల్లని చిక్కని పదార్థం వడ్డించారు. “ఏమిటది?” అని అడిగితే, “ఉలవ చారు, సార్, బాగుంటుంది తినండి” అని చెప్పారు. రూపం బాగోలేదు గాని రుచి మాత్రం అద్భుతం. శ్యామల రావుకు షేక్‌స్పియర్ మహాశయుని ‘అప్పియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్’ అన్న మాట గుర్తుకువచ్చి నవ్వుకున్నాడు. అతనికి అర్థంకాని మరో ఐటం ‘పునుగుల కూర’. మిరప కాయబజ్జీలో కూడ మసాలా బంగాళా దుంప కూరి వేశారు. చాలా లావుగా ఉందది.

చివర్లో అరటిపండు, కిళ్లీ ఇచ్చారు. పెరుగు కప్పు ఖాళీయింతర్వాత దాంట్లో మజ్జిగ పోసి వెళ్లాడొకతను. దాంట్లో కొత్తమీర, పచ్చిమిర్చి అల్లం సన్నగా తరిగి వేసి పోపుపెట్టారు. చాలా బాగుంది.

కనుచూపు మేర లోనే హైవే వెళుతూంది. చాలాఎక్స్‌ప్రెస్ బస్సులు వెళుతున్నాయి. అక్కడ బస్టాప్ కూడా ఉంది. బస్సులో వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే స్టేషన్ చాలా దూరం. సింహాద్రి తర్వాత మళ్లీ ఈస్ట్‌కోస్ట్ ఐదు గంటలకు. వైజాగ్ చేరేసరికి ఎనిమిదిన్నర. సీటు ఖచ్చితంగా దొరకదు. బస్ అయితే కొంత ఛార్జీ ఎక్కువైనా, ఇప్పటింకా రెండు దాటింది కాబట్టి ఆరున్నర ఏడు లోపే కాంప్లెక్స్‌లో దిగొచ్చు. ఎప్పుడెప్పుడు ఇల్లు చేరి అమ్మతో శర్వాణితో ఈ సంతోషాన్ని పంచుకుందామా అని ఉంది శ్యామల రావుకు.

బస్టాప్‍లో పది నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత రాజమండ్రి – విశాఖ సింగిల్ స్టాప్ బస్సు వచ్చింది. అన్నవరంలో మాత్రం ఆగుతుందట. బోలెడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎక్కి కిటికీ పక్కసీటులో కూర్చున్నాడు. కండక్టరు వచ్చి టికెట్ కొట్టి డబ్బు తీసుకొని వెళ్లాడు. బస్సు రాజమండ్రి దాటి వేగంగా వెళ్లసాగింది. కిటికీలోంచి విసురుగా వేస్తున్న గాలి, భుక్తాయాసం కలిసి శ్యామల రావును నిద్రపుచ్చాయి.

మెలకువ వచ్చేసరికి కత్తిపూడి దాటింది బస్సు. అన్నవరంలో పది నిమిషాలు ఆగుతుందన్నాడు కండక్టరు. చేతిరుమాలు సీటుపై ఉంచి, దిగాడు. అక్కడ బస్ నిండింది. బాత్ రూంకు వెళ్లొచ్చి క్యాంటీన్‌లో ముఖం కడుక్కొని ‘టీ’ తాగాడు. బస్ ఎక్కి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆరు నలభైకి వైజాగ్ కాంప్లెక్స్‌లో దిగాడు. రిక్షాలో ఇల్లు చేరుకున్నాడు. ఆర్.జె.డి. గారు ఎంతో మంచివారనీ, ఆదరంగా మాట్లాడారనీ, ఎ.ఓ కొంచెం చిరాకు ప్రదర్శించినా ఐదువందలు సమర్పించుకున్నాక శాంతించాడనీ చెప్పాడు. పిల్లలకు తాను తెచ్చిన బ్రిటానియా బిస్కెట్ పాకెట్, న్యూటన్ చాక్‌లెట్లు ఇచ్చాడు. ప్రసూనాంబ కొడుక్కు దిష్టి తీసింది. శర్వాణి భర్త వైపు గర్వంగా మురిపెంగా చూసింది. ఆమె చెక్కిన శిల్పమే కదా అతడు!

మూడో రోజున ఆర్డర్స్ వచ్చాయి, శ్యామల రావును జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్‌గా ప్రమోట్ చేసి భీమునిపట్నం ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వేస్తున్నట్లూ, లోయర్ క్యాడర్‌లో అతనికి పే ప్రొటెక్షన్ ఇస్తూ, అతనికి జె.ఎల్‍గా వర్తించే కొత్త స్కేలు, ఎక్కడ ఫిక్సేషన్ చేయాలో భీమునిపట్నం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (అంటే ప్రిన్సిపాల్)కు ఆదేశాలిస్తూ.

డిస్‌ప్యాచ్ ఇన్‍వర్డ్ పని చూసే భూలోకరావు కవరు చూస్తూనే “ప్రిన్సిపాల్ సార్, మన శ్యామల రావుకు ఆర్డర్స్ వచ్చేశాయండీ!” అని అరిచాడు ఆనందంగా. రిజిస్టరులో ఎంట్రీ వేసి కవరు నరసింహ మూర్తిగారికిచ్చాడు. ఆయన దాన్ని జాగ్రత్తగా చదివి, గ్రీన్ ఇంక్‌తో  ఇనిషియల్స్, డేట్ వేసి “రిలీవ్ ది ఇన్‌క్యుంబెంట్ ఇన్ డ్యూ కోర్స్” అని ఎండార్స్ చేశారు.

ఆఫీసులో పండగ వాతావరణం ఏర్పడింది. తమతోపాటు ఇంత వరకు పని చేసిన ఒక క్లర్కు, గెజిటెడ్ ర్యాంకుకు లెక్చరర్‌గా ఎదగడం వాళ్లకు ఎంతో సంతోషాన్నిచ్చింది. మూర్తి గారు, సీనియర్ అసిస్టెంట్ సన్యాసిరావు గారు శ్యామల రావుకు షేక్‌హ్యాండిచ్చి అభినందించారు. వాళ్లిద్దరికి వంగి కాళ్లకు దండం పెట్టాడు శ్యామలరావు.

సన్యాసిరావుగారన్నారు – “జాయిన్ అవడానికి వారం రోజులు టైమిచ్చారు. కానీ రేపే రిలీవ్ చేస్తాము. వెళ్లి భీమిలిలో జాయినవ్వు. అక్కడ సీనియర్ అసిస్టెంట్ సాంబమూర్తి కొంచెం తింగరోడు. కొత్త క్యాడర్‌లో పే ఫిక్సేషన్‌లో మతలబులు కొన్ని పెడతాడు.”

ప్రిన్సిపాల్ గారన్నారు -”శుభస్య శీఘ్రమ్.. అని, ఆలస్యమెందుకు. తర్వాత ప్రిన్సిపాల్ ప్రమోషన్లలో ఒక్కరోజు తేడాతో సీనియారిటీ జాబితాలో వెనుకబడిపోవచ్చు. భీమిలి ప్రిన్సిపాల్ నీకు తెలుసు కదా! విలాసరావు! చాలా మంచివాడు. నా కంటే జూనియర్.”

“తెలుసు మాస్టారు! నేను డి.వి.ఇ.ఓ ఆఫీసులో పని చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చేవారాయన. ఏదైనా బిగ్గరగా అరచి మాట్లాడతారు. మన మాట వినిపించుకోరు.”

“మాట కరుకే గాని మనసు వెన్నవాడిది. మేమిద్దరం సాలూరులో కలిసి పనిచేశాం. వాడు డైరెక్ట్ రిక్రూటీ. నేను ప్రమోటీ. ‘పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము, మనమ్మునవ్యనవనీత సమానము’ అని అన్నట్లు, మా విలాస రావుకేం?” అన్నాడు తెలుగు మాస్టారు భీమారావు గారు.

సన్యాసిరావు గారు ఒక కాగితం మీద లెక్కలు వేసి “ప్రస్తుతం మనవాడు 745-3900 స్కేలులో ఉన్నాడు. ఇప్పుడు 9285-18000 స్కేలుకి వెళతాడు. భీమిలి మున్సిపాలిటీ, అదీ బ్రిటిష్ కాలం నుంచీ, అంటారు. అక్కడ హెచ్.ఆర్.ఎ. కూడ ఇక్కడి కంటే ఎక్కువ. మొత్తం ఎమాల్యుమెంట్స్ ఇరవై రెండువేల వరకు రావచ్చును.” అన్నాడు.

వరాహ నరసింహునికి మనసులోనే ప్రణమిల్లాడు శ్యామలరావు. సాయంత్రం అందరికీ స్వీటు, సమోసా, టీలు తెప్పించి చిన్న విందు ఇచ్చాడు. ఇది చాలదనీ, ‘లంచ్’ అరేంజు చేయాల్సిందేననీ భూలోకరావు డిమాండ్ చేశాడు.

వైజాగి నుంచి భీమిలికి బోలెడు బస్సులనీ, తగరపువలస దగ్గర హైవే నుంచి కుడి వైపుకు వెళుతుందని, అది దగ్గరనీ, అప్పుఘర్, కైలాసగిరి, బుషికొండ, సాగర్ నగర్ మీదుగా సముద్రం వెంట ఇంకో రూటు కూడా ఉన్నదనీ, సిటీ బస్సులు మాత్రమే తిరుగుతాయనీ, గంటన్నర పైన పడుతుందనీ చెప్పారు. సింహాద్రిలో అంతా ఇదే చర్చ.

ముందుగా అమ్మచేతిలో అర్థర్సుపెట్టి ఆమె కాళ్లకు మొక్కాడు కొడుకు. ఆమె కళ్లు చెరువులైనాయి. కొడుకును దగ్గరకు తీసుకుని కాసేపు మౌనంగా ఉండిపోయింది. సంతోషాన్ని మౌనం కూడా చక్కగా వ్యక్తం చేయగలదు. శర్వాణి డబ్బాలోని చక్కెర తెచ్చి మగని నోట్లో పోసింది. భార్య నోటినీ తీపిచేశాడు శ్యామల రావు. సాహితికి అర్థమైంది నాన్నకు ప్రమోషన్ వచ్చిందని. సాత్విక్‌కు ఇంకా అంత అవగాహన లేదు. తాను తెచ్చిన ‘హర్యానా జిలేబీ’ని అందరికీ ఇచ్చాడు.

“స్వామి మన కోరిక తీర్చాడండీ!” అన్నది శర్వాణి మెరుస్తున్న కళ్లతో. “ఇప్పుడు సింహచలం వెళ్లలేముగాని, పదండి మాస్టారూ, అమ్మవారి గుడికి వెళ్లొద్దాం.”

“ఇదేమిటి కొత్త పిలుపు?”

“మరంతే కదా! ఎల్లుండి నుంచి పాఠాలు చెప్పే మాస్టారు అవుతున్నారు కదా”

“నాకిద్దరు గురువులు. ఒకరు పాత్రో మాస్టారు. మరొకరు..”

“మరొకరు..?”

“శర్యాణి మాస్టారు! కాదు కాదు శర్వాణి మేడమ్!”

శర్వాణి వారించిందతన్ని. “నేను నిమిత్తమాత్రురాలినండీ, నన్ను పట్టుకుని..” ఆమె గొంతు జీరబోయింది.

“వాడన్న దాంట్లో తప్పేముందమ్మా, మొదటినుంచి నీవే కదా వాడికి ప్రేరణ” అన్నది ప్రసూనాంబ.

అందరూ ఆటోలో వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చారు. రాత్రి బొబ్బర్లు, వంకాయలు వేసి కూటు చేసింది ప్రసూనాంబ. శర్వాణి పూరీలు వత్తి యిస్తే, వేయించింది.

పిల్లలు పడుకున్నాక భార్యను దగ్గరగా పొదువుకొని అన్నాడు

“ఇదంతా ఒక కలలాగా ఉంది వాణీ!”

“ఇంకా కల ఏమిటంటే, నిజమైపోతేను.”

“వచ్చే నెల నుంచి నాకు జీతం ఇరవై రెండు వేలు వస్తుందట. మా సన్యాసిరావు గారు క్యాల్కులేట్ చేసి చెప్పారు” అన్నాడు ఆనందంగా.

“ఈ రోజు కోసమే నేను ఎదురుచూసింది” అన్నది మగని క్రాపు సవరిస్తూ.

“ఎన్ని త్యాగాలు చేశావు వాణీ?”

“ఊరుకోండి” అంటూ మెత్తని తన అరచేత్తో అతని నోటిని మూసింది.

“నేనేమంత పెద్ద పెద్ద త్యాగాలు ఏమీ చెయ్యలేదు లెండి.”

“సరే మరి. నీ రుణం తీర్చుకునే..”

గలగల నవ్వుతూ మగని కౌగిలిలో బందీ ఐపోయిందా ఇల్లాలు.

***

మర్నాడు ఫస్టవర్ లోనే రిలీవ్ అయ్యాడు. యల్.పి.సి (లాస్ట్ పే సర్టిఫికెట్), సర్వీసు రిజిస్టరు, సి.యల్ అకౌంటు తర్వాత పోస్టులో పంపుతామన్నారు. స్టేషన్‌కు ఫోన్ చేస్తే బొకారో ఎక్స్‌ప్రెస్ మరో అరగంటలో వస్తుందని చెప్పారు.

తునిలో శ్యామల రావును రైలెక్కించడానికి భూలోకరావు కూడా వచ్చాడు. ఒక రోజు జర్నీ టైం అవైల్ చేసుకోమన్నారు ప్రిన్సిపాల్‍గారు. ఆ రోజు క్యారీజీ తెచ్చుకోలేదు. ఒంటి గంటకు వైజాగ్‌లో దిగి ఇంటికి వెళ్లాడు. అత్తాకోడలు ఇద్దరూ కలిసి ఆలూబాత్, అరటికాయ బజ్జీలు, పొట్లకాయ పెరుగుపచ్చడి, రసం చేశారు. అన్నీ చూసి సాత్విక్ అన్నాడు “నానమ్మా, పప్పు చేయలేదేం?”

“ఏది లేదో అదే కావాలంటాడు వెధవ!” అని కొడుకును మురిపెంగా విసుక్కుంది శర్వాణి.

మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం సింహాచలం వెళ్లారు. స్వామిని దర్శించుకొని వచ్చారు.

మర్నాడు ఉదయం టిఫిన్ చేసి, క్యారేజి తీసుకొని, కాంప్లెక్స్‌కు వెళ్లాడు. భీమిలి వయా తగరపువలస అని బోర్డు ఉన్న బస్ ఎక్కాడు. ఈ ఐదారేళ్లుగా అటువైపు రాలేదు. మధురవాడ పూర్తిగా మారిపోయింది. రకరకాల నిర్మాణాలు కనిపించాయి. కొమ్మాది జంక్షన్, తర్వాత, అడవిలా ఉన్న ప్రాంతం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. తమ ప్లాటు ఉన్న ప్రాంతాన్ని గుర్తుపట్టాడు. హైవే నుంచి లోపలికి పక్కా రోడ్డు వేశారు అంతా లే ఔట్లే! అక్కడ కూడా చాలా యిళ్లు లేచాయి. కొన్నినిర్మాణంలో ఉన్నాయి.

‘మురళికి చెప్పాలి’ అనుకున్నాడు. ‘వాళ్ళు రాక చాలా కాలమయింది. వీళ్లను మామయ్యా వాళ్లనూ రమ్మని రాయాలి. ఈ ఆనందాన్ని వాళ్లతో పంచుకోవాలి.’

తొమ్మిదిన్నరకు భీమిలి దిగాడు. జూనియర్ కాలేజి అర కిలోమీటరు దూరంలో ఉంది. పాత బ్లాకులో క్లాసులు. కొత్తగా రెండంతుస్తుల బ్లాక్ కట్టారు. క్రింద ప్రిన్సిపాల్ రూము, పక్కన ఆఫీసు, దాని పక్కన స్టాఫ్ రూము, తర్వాత లైబ్రరీ. పైనంతా సైన్స్ ల్యాబ్‍లు.

కాలేజి బయట చిన్న టీ కొట్టు ఉంది. అందులో టీ తాగి, ఆఫీసు లోకి వెళ్లాడు. ‘కె. సాంబమూర్తి, బి.కాం. సీనియర్ అసిస్టెంట్’ అని బల్ల మీద ఉన్న వుడెన్ నేమ్ ప్లేటును చూసి అక్కడకు వెళ్లాడు. ఆయనింకా రాలేదు. అక్కడే కుర్చీలో కూర్చుని వెయిట్ చేయసాగాడు.

కాసేపటికి ఆయన వచ్చి, “వచ్చేశారా? ఈ రోజు జాయిన్ అవుతారని అనుకున్నాం లెండి. కంగ్రాచ్యులేషన్స్! మన క్యాడర్ నుండి ఇంగ్లీషు లెక్చరర్ అయిన వాళ్లు బహు తక్కువ” అంటూ షేక్‍హ్యాండ్ యిచ్చారు. అటెండర్ శిమ్మన్నను పిలిచి, గురువుగారు వచ్చారో లేదో చూసి రమ్మన్నాడు. గురువు గారంటే ప్రిన్సిపాల్ గారు.

“వచ్చేసినారండి. రమ్మ౦తాన్రు” అన్నాడు శిమ్మన్న.

ఇద్దరూ వెళ్లి ఆయనకు విష్ చేశారు. పెద్దాయన. ఇంకా మూడేండ్లో నాలుగేండ్లో సర్వసుంటుంది. బట్టతల. ఎర్రని శరీరం. భారీ మనిషి. ఫుల్ షర్టును మోచేతుల మీదికి మాటిమాటికి లాక్కోవడం ఆయన మ్యానరిజమని గ్రహించాడు శ్యామలరావు.

“కూర్చోండి” అన్నాడు. “మీరు డి.వి.ఇ.ఓ. ఆఫీసులో ఉండగా తరచు మీ దగ్గరికి వచ్చేవాళ్లం. ఆ సీటు అలాంటిది” అని పెళ్లున నవ్వాడు. “చాలా సంతోషం” అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సీనియర్ అసిస్టెంట్ ఆయనకు, వాళ్లకొచ్చిన ప్రొసీడింగ్స్ ఇచ్చాడు. శ్యామల రావు తన ఆర్డరు, రిలీవింగ్ సర్టిఫికెట్ ఆయనకిచ్చాడు. ఆయన దానిమీద గ్రీన్ ఇంక్‌తో, “ప్లీజ్ అడ్మిట్” అని రాసి, రిలీవింగ్ సర్టిఫికెట్ మీద కూడా ఇనిషియల్ వేసాడు. జూనియర్ అసిస్టెంటును పిలిచి, అటెండెన్స్ రిజిస్టరులో ఇంగ్లీషు మాస్టారి పేరు రాయమన్నాడు. అతని పేరు శివరాం.

రిజిస్టరు తెస్తూనే, “తూర్పుముఖంగా కూర్చుని సైన్ చేయండి” అన్నాడు ప్రిన్సిపాల్ గారు. సైన్ చేసిన వెంటనే “ఫ్రం దిస్ మొమెంట్ యు ఆర్ ఎ గజిటెడ్ ఆఫీసర్” అన్నాడు.

“థాంక్యూ సార్” అన్నాడు శ్యామల రావు.

“పెద్ద కాలేజీ కాబట్టి ఇంగ్లీషు రెండు పోస్టులు మాస్టారు. మేడంగారు కుతూహలమ్మ గారని రెండో పోస్టు! చాలా సీనియర్ మన జోన్‍లో. ప్రిన్సిపాల్ ప్రమోషన్ వద్దనుకొని ఉండిపోయారు” అని చెప్పి, గొంతు తగ్గించి “స్టిల్ అన్ మ్యారీడ్!” అన్నాడు ప్రిన్సిపాల్ గారు.

“పదండి స్టాఫ్ రూంకు వెళదాం” అంటూ దారి తీశారు. ప్రిన్సిపాల్ గారిని చూసి అందరూ లేచి నిలబడి విష్ చేశారు. “కూచోండీ మాస్టార్లు! ఐ యామ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ దిస్ యంగ్ మ్యాన్ శ్యామల రావ్, ది న్యూ ఇంగ్లీష్ జె.యల్, టు యు ఆల్.”

ఇంచుమించు చాలామందికి అతడు పరిచయమే, డి.వి.ఇ.ఓ ఆఫీసులో చేయడం వల్ల. అందర్ని పరిచయం చేశాడు విలాసరావు గారు.

“ఓ.కె. క్యారీ అన్” అని వెళ్లిపోయాడు. వెళ్లేముందు “మేడమ్ ప్లీజ్ గైడ్ హిమ్” అని ఇంగ్లీషు మేడమ్‌తో చెప్పాడు.

అలా ముఫ్ఫై రెండేళ్లకే లెక్చరర్ అయ్యాడు శ్యామలరావు!

(ఇంకా ఉంది)

Exit mobile version