[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[వంట అలవాటు లేకపోవడంతో అమ్మా, శర్వాణి వచ్చేదాకా హోటల్లోనే తింటాడు శ్యామల రావు. రెండు మూడు రోజులు కాస్త ప్రయత్నించి ఇంట్లోనే వండుకు తింటాడు. ఓ వారం తర్వాత శర్వాణి, ప్రసూనాంబ వస్తారు. ప్రీవియస్ పరీక్షలు వ్రాసి నెల రోజులయినా శ్యామల రావు ఫైనలియర్ గురించి ఏమి మాట్లాడడం చూసి శర్వాణి భర్తని హెచ్చరిస్తుంది. పుస్తకాలు కొనుక్కురమ్మంటుంది. అత్తగారు అడిగిన మీదట, భర్త ఎం.ఎ. పాసయ్యంతే వరకు తాను పిల్లలు పుట్టకుండా మాత్రలు వాడుతున్నట్టు చెబుతుంది శర్వాణి. విషయం అర్థం చేసుకున్న ప్రసూనాంబ కోడలికి మద్దతు తెలుపుతుంది. భార్యాభర్తలిద్దరూ వెళ్ళి ఫైనలియర్ పుస్తకాలు కొనుక్కుని తెచ్చుకుంటారు. ఐదు రోజుల పాటు శ్రమించి, నూట అరవై ఆర్.సి.లు ఒక నోట్స్‌లో రాసి ఇస్తుంది శర్వాణి. ఆమె అవగాహనని మెచ్చుకోకుండా ఉండలేకపోతాడు శ్యామల రావు. భర్తకు మోరల్ సపోర్టే గాక అకడమిక్ సపోర్టు కూడా ఇస్తోంది శర్వాణి. దసరా పండగకు వైజాగ్‌కి రమ్మని బావమరిదికీ, అత్తామామలకూ ఉత్తరాలు పిలిపిస్తాడు శ్యామల రావు. పండగని అందరూ కలిసి వేడుకగా జరుపుకుంటారు. తమ ఊరు ఎస్.రాయవరంలో ఉన్న పాత యిల్లు శిధిలమైపోతే, దాన్ని అమ్మేస్తాడు శర్వాణి తండ్రి. వచ్చిన డబ్బుని బిడ్డలిద్దరికీ చెరో సగం ఇస్తాడు. శర్వాణి వాటా తొమ్మిదివేల రూపాయలు. దాంతో శ్యామల రావుని స్కూటర్ కొనుక్కోమంటాడు. శర్వాణి మాత్రం ఎక్కడైనా స్థలం కొందామంటుంది. మధురవాడ దాటాకా, కొమ్మాది దగ్గర తమ ఫ్రెండు వేసిన వెంచర్ ఉందని, అక్కడ స్థలాలున్నాయనీ, వాయిదా పద్ధతిలో కూడా డబ్బు కట్టచ్చని మురళి చెప్తాడు. వచ్చే ఆదివారం వెళ్ళి చూడాలనుకుంటారు. ఆ రోజుకి మురళిని మళ్ళీ రమ్మంటాడు శ్యామల రావు. సరేనంటాడు మురళి. రెండ్రోజులు ఉండి శర్వాణి అమ్మా నాన్నా వెళ్లిపోతారు. శనివారం రాత్రి మురళి వస్తాడు. – ఇక చదవండి.]
ఆదివారం ఉదయం టిఫిన్ చేసి ముగ్గురూ కాంప్లెక్సుకు పోయి తగరపువలస వెళ్లే సిటీ బస్సెక్కి కొమ్మాది జంక్షన్‌లో దిగారు. అక్కడ రియల్ ఎస్టేట్ ఏజంటు వీళ్ల కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక ఆటోలో తనే మాట్లాడాడు. అతనికి బజాజ్ చేతక్ స్కూటరుంది. అతని పేరు సూర్యారావట. అతను ముందు వెళుతుండగా ఆటోలో అతన్ని అనుసరించారు. హైవేలో తగరపువలస వైపు రెండు కిలోమిటర్లు వెళ్లి కుడిపక్క కంకర రోడ్డులో ప్రవేశించి ఒక కిలోమీటరు ప్రయాణించాక సైట్ వచ్చింది. రోడ్డుని ఆనుకునే ఉంది. ఐదెకరాల భూమిని కొని ప్లాట్లు వేస్తున్నారు. ఒక బుల్‌డోజరు నేలను చదును చేస్తూంది. నలుగురు కూలీలు తుప్పలు నరికి శుభ్రం చేస్తున్నారు.
ఆ చుట్టుపక్కల కూడా ఇలాంటి వెంచర్లే ఉన్నాయి.
సూర్యారావు చెప్పాడు “ఇప్పుడిలాగుంది గానీ, మొత్తం చదును చేసి, రోడ్లు తీర్చి సరిహద్దు రాళ్ల పాతితే గొప్ప లుక్కెళ్లిపోస్తాదండి బాబు. ఆర్నెల్ల తర్వాత పదేనువేలకు గూడ దొరుకుతాదేటి? అయివే కదండి. ఇటు ఇజానగరం, అటు శ్రీకాకోళం నుండి ఎలిపొచ్చి చూసిపోతున్నారండి.”
“కానీ కనుచూపు మేరలో ఒక్క ఇల్లయినా లేదే?” అన్నది శర్వాణి.
“ఇల్లులు లెగిస్తే మనలాంటోలు కొనగలరేటండి. నచ్చదాటినా ఆచ్చర్యం నేదు” అన్నాడతడు.
శ్యామల రావన్నాడు “అది నిజమే. నాన్నగారు పదేళ్ల కిందట మధురవాడ ఏదైనా ఇంటిస్థలం కొందామని చూశారు. తాహతు లేక వదిలేశారు.”
“ఉప్పుడు మదురాడలో దొరుకుతాయేటండి. రోడ్డునానుకొని గజం రెండు వేలు పలుకుతాంది.”
“సరే సూర్యారావుగారూ, సాయంత్రం మీ ఆఫీసుకొచ్చి ఏ విషయం చెబుతాము” అన్నాడు మురళి.
అందరూ మధ్యాహ్నానికి ఇంటికి వచ్చారు. భోజనాలు చేసి సైటు విషయం చర్చించుకున్నారు. ప్రసూనాంబ కూడా “ఇంటిస్థలం అంటూ ఒకటి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు సొంత ఇల్లు కట్టుకోవచ్చును. ఈ మహానగరంలో ఇంటద్దెలకీ సరిపోతుంది” అన్నది.
“అయితే ఆరువేలు కట్టేద్దాము. అప్పడు రిజిస్ట్రేషన్ కూడ చేసిచ్చే అవకాశం ఉంది. మిగతా ఆరువేలు నెలకు మూడు వందల చొప్పన కడదాము, ఇరవై నెలలలో ప్లాటు మనదవుతుంది” అన్నాడు శ్యామల రావు.
“మన దగ్గర తొమ్మిది వేలుండగా ఆరువేలు కట్టడమేమిటి? ఆ మిగతా డబ్బు ఏం చేస్తారు?” అనడిగింది శర్వాణి.
“చాలా రోజులుగా నీ చెవులకు దుద్దులు చేయించాలని అనుకుంటున్నాను. నా జీతంతో కుదరదు. మీ నాన్నగారిచ్చిన డబ్బుతోనైనా..”
‘అవును, చెవులకు ఆ రోల్డ్ గోల్డు కమ్మలు పెట్టుకుంటుంది పాపం!” అన్నది ప్రసూనాంబ.
“మీకేమయినా పిచ్చా?” అని అరిచింది శర్వాణి మగని మీద. “మీరు కూడా అలా అంటారేమిటి అత్తయ్యా! ఇప్పడు నా దుద్దులకేం తొందరొచ్చింది? ఆ మూడువేలు కూడా కట్టేస్తే సరి. మిగతా మూడూ పదినెలల్లో తీరిపోతాయి.”
శ్యామల రావు నిస్సహాయంగా తల్లి వైపు చూశాడు. ఆమె కోడలి వైపు చూసింది. మురళి అన్నాడు “బావా, చెల్లి చెప్పిందే సబబుగా ఉంది. అలాగే చేద్దాము.”
“నేను చేయించ లేకపోయినా, కనీసం నీ డబ్బుతోనయినా..”
“నీ డబ్బు నా డబ్బు అంటారేమిటి శ్రీవారు! రేపు మీరు లెక్చరర్ అయింతర్వాత దుద్దులేం ఖర్మ! నెక్లెస్ చేయించుకుంటాను ఏకంగా! ప్లీజ్! నా మాట వినరూ?”
అలా శర్యాణి మోరల్, అకడమిక్ సపోర్టుతో బాటు ఫైనాన్షియల్ సపోర్టు కూడా యిచ్చింది.
బావా, మరిదీ సాయంత్రం సీతమ్మధారలోని వాళ్ల ఆఫీసుకు వెళ్లారు. ‘సింహగిరి డెవలపర్స్, ఇండ్ల స్థలములు అమ్మబడునుకొనబడును’ అని బోర్డు ఉంది. లోపల కుర్చీలు వేసి ఉన్నాయి. ఒకాయన బల్ల వెనక కూర్చొని ఉన్నాడు. ‘శాసనాం కూర్మారావు, మేనేజింగ్ పార్టనర్’ అన్న నేమ్ ప్లేటు అతని వెనక గోడకు బిగించి ఉంది. దానిమీద సింహాచల నరసింహుని నిజరూప దర్శనం ఫొటోఫ్రేమ్ పెద్దది గోడకు బిగించి ఉంది. దానికి కృత్రిమ పూలదండ వేసి ఉంది. అప్రయత్నంగా స్వామికి నమస్కరించాడు శ్యామల రావు.
“సూర్యారావుగారు లేరాండి?” అనడిగాడు మురళి.
“మీరు.. మురళిగారేనా, గరివిడిలో పనిచేసేది..?”
“అవును నేనే నండి.”
“రండి మాస్టారు. కూర్చోండి. సూర్యారావు అంతా చెప్పాడు లెండి. ఈ సారు..”
“ఈయన మా బావగారండి. శ్యామల రావు గారు. పూసపాటిరేగ గవర్నమెంటు కాలేజీలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ఈయనే ప్లాటు తీసుకొనేది.”
కూర్మారావు ముఖం విప్పారింది. “శ్యామల రావు గారూ, గొప్ప చెబుతున్నానని అనుకోకండి. ఇదే ప్లాటు ఐదు సంవత్సరాల తర్వాత పదింతలు పెరిగినా ఆశ్చర్యం లేదు. గాజువాక, అనకాపల్లి వైపు మనం తేరిపార చూడలేము. అందుకే అందరూ ఇటు వైపు పడినారు. మీరు నమ్ముతారో నమ్మరో పదేండ్ల కిందట మద్దిలపాలెమంతా అడవి లాగుండేది. ఎం.వి.పి కాలనీ ఇంకా ఏర్పడలేదు పూర్తిగా. మీరింకా చిన్నవయసులో ఉన్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్” అన్నాడు.
“మేము ముప్పాతిక భాగం డబ్బు కట్టేస్తాము. మాకు ధర తగ్గించాలి. మీ ఇంకో పార్టనర్ బుల్లబ్బాయి గారున్నారు కదా! వాళ్ళబ్బాయి నూకరాజు నేను నర్సీపట్నంలో క్లాసుమేట్స్, పాలిటెక్నిక్ కాలేజీలో!”
“ఇకనేం, ఉండండి” అని బల్ల మీద ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. కాసేపు మాట్లాడి పెట్టేశాడు.
“బుల్లెబ్బాయితో కూడా ఒక మాట చెప్పానండి. మొత్తం కట్టేస్తే వెయ్యి రూపాయలు తగ్గిద్దామన్నారండి. లేకపోతే మీరన్నట్లు తొమ్మిది వేలు కడితే పెద్దగా తగ్గించలేమంటున్నారు.”
“ఇక మూడు వేలే కదా బాలెన్సు? ఆ వెయ్యి తగ్గించండి. మా ద్వారా ఇంకా నలుగురు రావాలా వద్దా?” అన్నాడు మురళి. “కావాలంటే మా నూకరాజుతో చెప్పించమంటారా? వాడు నా క్లోజ్ ఫ్రెండ్. స్టీలు ప్లాంటులో జాబ్ కొట్టేశాడు.”
మళ్లీ బుల్లబ్బాయితో సంభాషించాడు కూర్మారావు. “ఒప్పుకున్నాడండి. ఈ పార్టనర్‌షిప్‌లున్నాయి చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే మాటొస్తుంది” అని ఇద్దరికీ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. కుర్రాడు టీ లు తెచ్చి ముగ్గురికీ యిచ్చాడు.
శ్యామల రావు జిప్ బ్యాగు అనుంచి తొమ్మిది వేలు తీసి అతనికిచ్చాడు. అతడు లెక్కపెట్టుకుని, పక్కనే ఉన్న ఐరన్ సేఫ్‌లో పెట్టాడు. రసీదు రాసి, స్టాంపు వేసి యిచ్చాడు.
“మీరు మంచి రోజు చూసుకొని రెండు రోజులు ముందు చెబితే రిజిస్ట్రేషనెట్టు కుందాము. మీరు ఇన్‌స్టాల్‌మెంట్లన్నీ కట్టేసిన తర్వాతనే డాక్యుమెంట్లు మీకిస్తాము. మరేం అనుకోకండి సార్. కంపెనీ రూల్సు.”
“దాందేముంది లెంది. వెళ్లొస్తాము” అని ఇద్దరూ బయటకొచ్చారు
“ఈ శుభ సందర్భంగా బావగారికి పునుగులు బజ్జీలు తినిపించాలని నిర్ణయించడమైనది” అన్నాడు మురళి.
దగ్గర్లో ఉన్న బజ్జీల బండి దగ్గర అరటికాయ బజ్జీలు తిన్నారు. దాంట్లో ఉల్లితురుము, కొత్తిమీర మిశ్రమం కూరి నిమ్మకాయ పిండి ఇచ్చాడు. చాలా బాగున్నాయి. తర్వాత చెరో అర ప్లేటు పునుగులు తిన్నారు. దానికిచ్చిన టమేటా చట్నీ కూడ చాలా బాగుంది.
“మీ చెల్లితో అనకోయ్ బావా! బయట తిన్నామని తెలుస్తే తిడుతుంది.”
“నాకు తెలియదా బావా, నర్సీపట్నంలో రోజూ చింతపల్లి రోడ్‌లో మాకు ఇదే పని. ఇంట్లో తెలియనిస్తామా ఏంటి?”
తోడుదొంగ లిద్దరూ ముసిముసిగా నవ్వుకుని ఇంటిదారిపట్టారు. నాలుగు రోజుల తర్వాత త్రయోదశి, గురువారం ప్లాటు రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఫీజు నాలుగు వందలు. పట్నాయక్ గారి వద్ద అప్పు చేశాడు శ్యామల రావు.
అలా పాతికేండ్లు నిండకముందే ఒక ఇంటివాడు.. కాదు కాదు, ఓ ఇంటి స్థలం వాడయ్యడు! శర్వాణీదేవికీ జై!
***
శ్యామల రావు చదువు చురుగ్గా సాగుతుంది. ఆర్.సి.ల పనంతా శర్వాణి చేసి పెడుతుందడంతో అతనికి హాయిగా ఉంది. ఇంచుమించు ప్రతి ఆదివారం పాత్రో మాస్టారి దగ్గరికి వెళ్లి వస్తున్నాడు. ఎలాగైనా సరే యాభైశాతం మార్కులు సాధించాలని కృషి చేస్తున్నాడు.
ఈసారి సెంటరు వి.వి.యన్ కాలేజ్‍లో పడింది. ప్రిన్సిపాల్ దాలినాయుడు గారు దాదాపు ఇరవై రోజులు మళ్లీ ‘అనధికారిక’ సెలవు ఇచ్చారు. ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా సహకరించారు. పరీక్ష లన్నీ బాగా వ్రాశాడు శ్యామల రావు.
మురళికి సంబంధాలు చూస్తున్నారు. పలాస నుంచి ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి కాశీబుగ్గలో డిగ్రీ చేసింది. తండ్రి పేరు త్రినాధరావు. ఆయనకు తాళభద్ర అని వాళ్ల సొంతూరులో రెండెకరాల జీడిమామిడితోట, పిత్రార్జితం ఉంది. ఆయన పలాసలో తాళాసు వైకుంఠరావు గారి జంట థియేటర్లు, హరిశంకర్, రవిశంకర్ లకు మేనేజరుగా పనిచేస్తున్నాడు.
అమ్మాయి బాగుంది. పేరు వసంతలక్ష్మి. మురళికే కాదు అందరికీ నచ్చింది. ఒక మంచి ముహూర్తాన, పలాస రైల్వే కల్యాణ మండపంలో వారి వివాహం జరిగింది. అందరూ తరలి వెళ్లారు. శర్వాణికి ఆడబడుచు లాంఛనాల క్రింద ఐదువేలు ఇచ్చారు. వెంటనే దాంట్లోంచి మూడు వేలు వెంటనే కొమ్మాది ప్లాటుకు కట్టించింది. డాక్యుమెంట్స్ తెచ్చేసుకున్నారు. మురళి, వసంత గరివిడి క్యార్టర్సులో కొత్త కాపురం ప్రారంభించారు.
కాలం పరుగులు పెడుతుంది. శ్యామల రావు పైనలియర్ రిజల్టు వచ్చింది. యాభైమూడు శాతం వచ్చింది. అగ్రిగేట్ యాభై రెండు శాతం అయింది. దాలినాయుడు గారు శ్యామల రావును కౌగిలించుకున్నారు.
“నా సలహాను సీరియస్‍గా తీసుకొని మొత్తానికి జె.యల్. పోస్టుకు అర్హత సాధించావోయ్!” అన్నాడు. అందరికీ స్వీటు హాటు, టీ తెప్పించాడు శ్యామల రావు. స్టాఫ్ అతనికి ఒక లెదరు బ్యాగు బహుకరించారు.
“నా ఈ అచీవ్‍మెంట్‌కు నీవే కారణం వాణి!” అన్నాడు భార్యతో.
శర్వాణి నవ్వింది! “నేను చేసింది రవ్వంత, మీ కృషి కొండంత” అన్నది.
***
ఒకరోజు రాత్రి సిగ్గుపడుతూ భర్తతో చెప్పింది శర్వాణి. “శ్రీవారూ! మీరు నాన్నగారు కాబోతున్నారు!”
శ్యామల రావు ఆమెను వాటేసుకొని ఆమె బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు. దాంపత్యానికి పరమార్థం సంతానమే నంటాడు మహాకవి కాళిదాసు, తన రఘువంశ కావ్యంలో. శ్యాము, శర్వాణిల దాంపత్యం పండింది.
“మీరు కోప్పడనంటే ఇంతవరకు మీ నుండి దాచిన ఒక విషయం చెబుతాను” అన్నది తల వాల్చుకుని.
“చెప్పు వాణీ!”
“మీ పి.జి. అయ్యేంత వరకు మీకు చదువుకు ఆటంకం కాకుండా ఉండేందుకు ప్రెగ్నెన్సీ రాకుండా ఇంత కాలం పిల్స్ మింగాను.”
శ్యామల రావు నిశ్చేష్టుడయ్యాడు! తేరుకొని భార్యను దగ్గరకు తీసుకుని ఆమె కళ్లను చుంబించాడు.
“తల ఎత్తుకుని చెప్పాల్సిన మాట! నీవు నా భార్యవు కావడం నా అదృష్టం!” అన్నాడు. “అమ్మకు తెలియనివ్వకు” అన్నాడు గుసగుసగా.
శర్వాణి నవ్వింది! “అతయ్యకు తెలుసు! ఆమె సంతోషంగా ఒప్పుకుంది!” శ్యామల రావుకు మరో షాక్!
“అత్తాకోడళ్లిద్దరూ కలిసి ప్లాన్ చేశారన్నమాట” అన్నాడు అయోమయంతో కూడిన ఆనందంతో!
ఏడో నెలలో కాన్పుకని పుట్టింటికి వెళ్లింది శర్వాణి. అక్కడ డాక్టర్ దేవి అని గైనకాలజిస్టు ఉంది. ఆమె పర్వవేక్షణలో, నెలలు నిండిన తర్వాత, ఆడపిల్లను ప్రసవించింది. నార్మల్ డెలివరీ.
పదహారో రోజు బారసాల జరిగింది. పాపకు ‘సాహితి’ అని పేరు పెట్టారు. జన్మనక్షత్రం ప్రకారం ‘స’ తో పేరు మొదలవ్వాలని సిద్ధాంతి చిట్టి పంతులు గారు చెప్పారు. జగన్నాథరావుగారు మనుమరాలికి చిన్న గొలుసు చేయించారు, అరకాసు బంగారంతో. మురటి మేనకోడలికి ఐదువందలిచ్చాడు.
మూడో నెలలో వైజాగ్‌కు వచ్చేసింది శర్వాణి పాపనెత్తుకొని. ప్రసూనాంబకు ఆ చంటిపిల్లే సర్వస్వమయింది.
మొదటి పుట్టిన రోజు ఉన్నంతలో ఘనంగానే జరిపారు. ప్రభుత్వం వారు ప్రకటించిన పే రివిజన్ వల్ల, శ్యామల రావుకు ఆరువందల రూపాయలు జీతం పెరిగింది. ఎమ్మే వల్ల ఒక ఇంక్రిమెంట్ అదనంగా కలిసింది. ఐదేండ్లు పూర్తయింది రేగ కాలేజీలో. శ్యామల రావు సిన్సియారిటీ గురించి దాలినాయుడు గారు డి.వి.ఇ.ఓ నరసింహమూర్తి గారికి చెపుతూ ఉండేవారు. దాని ఫలితంగా అతన్ని జిల్లా ఆఫీసుకు డెప్యుటేషన్ మీద వేశారు.
డి.వి.ఇ.ఓ. ఆఫీసు మద్దిలపాలెం ఏరియాలోని పిఠాపురం కాలనీలో ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ ప్రవేశద్వారానికి కూతవేటు దూరమే. అక్కడ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్ గారు. ఆయన్నందరూ ‘ఉమాగారు’ అంటారు.
శ్యామల రావు ఎమ్.ఎ. పిజిహోల్డరని అందరూ గౌరవంగా చూసేవారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలన్నీ డి.వి.ఇ.ఓ పర్యవేక్షణలోనే ఉంటాయి. అతనికి ప్రిన్సిపాళ్ల సర్వీస్ మ్యాటర్స్ అంటే పీరియాడికల్ ఇన్‌క్రిమెంట్లు, యస్.ఆర్ (సర్వీసు రిజిస్టర్) లలో ఎంట్రీలు, లీవ్ అకౌంట్లు చూసే సీటు కేటాయించారు. అతడు ఫైలుతో నోటు పుటప్ చేస్తే చక్కగా ఉండేది. మంచి డ్రాఫ్టింగ్.
“అంతా మా పాత్రో మాస్టారుగారి దయ” అనేవాడు వినయంగా. ప్రతినెలా ప్రిన్సిపాళ్లతో రెవ్యూ మీటింగ్ జరిగేది. శ్యామల రావు అందరికి జి.ఓ. కాపీలు, డి.వి.ఇ.ఓ గారి ప్రొసీడింగ్స్, సర్వ్ చేసి సంతకాలు తీసుకునేవాడు. మీటింగ్ తాలూకు ‘మినిట్స్’ అతనితోనే రాయించేవారు ఉమా గారు.
డి.వి.ఇ.ఓ. గారు కాలేజీలకు ఇన్‌స్పెక్షన్లకు వెళితే, కూడా శ్యామల రావునే తీసుకు వెళ్లేవారు, కారులో. అక్కడ ఫైళ్లను, రిజిస్టర్లను అతడే చెక్ చేసి, ఓ.కే, అంటేనే మూర్తిగారు ఇన్‌స్పెక్షన్ రిపోర్టులో సంతకం చేసేవారు. అతడు సింహాద్రి రావుగారి కొడుకని కూడా అందరికీ తెలుసు.
రేగ పయాణం తప్పింది. మధ్యాహ్నం సైకిలు మీద ఇంటి కొచ్చి భోంచేసి, అరగంట సేపు కూతురితో ఆడుకొని వెళ్ళేవాడు. సాహితికి మూడో ఏడు నడుస్తుంది. సైకిలు బార్‌కు ఒక సీటు చేయించి బిగింపజేశాడు. దానిమీద కూర్చుని రెండు చేతులతో హ్యాండిల్ బార్ పట్టుకుని తండ్రితోపాటు వెళ్లేది బుజ్జి తల్లి. నాన్నమ్మను క్షణం కూడ వదిలేది కాదు.
సాహితికి ఐదేళ్ళు నిండాక, ‘సాత్విక్’ పుట్టాడు. సాహితి బాగా అల్లరిచేసేది. సాత్విక్ నెమ్మది. అసలు ఏడ్చేవాడు కాదు. సాహితిని పక్కవీధిలోనే చిన్న కాన్వెంటులో యు.కె.జి.లో చేర్చారు. నాయనమ్మో, అమ్మో, స్కూల్లో విడిచిపెట్టి వస్తారు. మధ్యాహ్నం వచ్చేస్తుంది. తమ్ముడంటే చాలా ఇష్టం. “తమ్ముడూ” అనిపిస్తుంది. వాడు జుట్టు పీకినా ఏమనదు.
మూడేండ్లు హెడ్డాఫీసులో పని చేసింతర్వాత శ్యామల రావును ‘పాయకరావుపేట’ కాలేజీకి వేశారు. ఆ వూరు వైజాగ్‌కు వంద కిలోమీటర్లుంటుంది. కాని రైల్వే రూట్లో ఉంది. ‘తుని’ స్టేషనులో దిగితే రెండు కిలోమీటర్లు. తుని, పాయకరావుపేట లను విడదీస్తూ ‘తాండవ’ నది వంతెన ఉంటుంది.
పాయకరావుపేటను పి.ఆర్.పేట అని అంటారు. అదే ఫస్ట్ జోన్ లోని చివరి కాలేజీ. విశాఖ జిల్లా ఇక్కడితో ఎండ్ అవుతుంది. బ్రిడ్జ్ దాటితే తుని టవున్. అది ఈస్ట్ గోదావరి జిల్లా. రెండు జిల్లాలకు మధ్య కేవలం బ్రిడ్జి మాత్రమే అడ్డు.
పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, కాలేజీలలో పని చేసేవారంతా వైజాగ్ నుంచి తిరుగుతారు. ఉదయం వైజాగు నుండి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‍లో వెళ్లి సాయంత్రం సింహాద్రికి వచ్చేస్తారు. M.S.T. (మంత్లీ సీజన్ టికెట్) తీసుకుంటారు. ఛార్జీ చాలా తక్కువ పడుతుంది అలా అయితే.
శ్యామల రావు కూడ పాయకరావుపేటలో జాయినయింతర్వాత అదే పని చేయసాగాడు. పిన్సిపాల్ నరసింహమూర్తి గారితో సహా స్టాఫ్‌లో అరవైశాతం ‘అప్ అండ్ డౌన్’ చేసేవారే. సింహాద్రి ఉదయం ఎనిమిదింబావుకే తునికి వచ్చేసేది. నాన్ టీచింగ్ వాళ్లు తలుపులు తెరుచుకుని పనిచేసుకునే వారు. సాయంత్రం మళ్లీ నాలుగు గంటలకు వచ్చేది. కాలేజీ నాలుగు నలభై వరకూ ఉన్నా, సింహాద్రి బ్యాచ్ అంతా వెళ్లిపోయేవారు.
ప్రసూనాంబకు ఈమధ్య ఒంట్లో బాగుండటం లేదు. ఆమెకు అరవైనాలుగు. తెల్లవారుజామునే లేచి భర్తకు టిఫిను, భోజనం రెండు క్యారేజీలు తయారు చేసి ఇచ్చేది. శర్వాణి. కాలేజీకి చేరుకుంటూనే టిఫిన్ చేసేవాడు. మధ్యాహ్నం లంచ్.
ఎప్పుడైనా వీలు కాకపోతే క్యారేజీలు వద్దులే అనేవాడు. తుని స్టేషన్ ఎదురుగ్గా మంచి ఉడిపి హోటలుండేది. దాంట్లో టిఫిన్ తినేసి కాలేజీకి వెళ్లేవాడు. మధ్యాహ్నం కాలేజీకి దగ్గర్లోనే ఒక మెస్ ఉండేది. అక్కడ భోం చేసేవాడు. ఆ మెస్ యజమానిది కోటనందూరట. ఆయనకు మామిడి తోట ఉందట. అందుకేనేమో, శ్యామల రావు ఎప్పుడు భోంచేసినా, మామిడికాయ పప్పే ఉండేది.
సాయంత్రం తిరుగుప్రయాణంలో చక్కగా కబుర్లు చెప్పుకునేవారు. ఉదయం మాత్రం కబుర్లుండేవి కాదు. కూర్చునే కునుకు తీసేవారు. రైల్లోనే తాజా కూరగాయలు తెచ్చి అమ్మేవారు. అరకేజీ చొప్పున కవర్లలో వేసి తెచేవారు. వీళ్లకు టైముండదు కాబట్టి వాటినే కొనుక్కుని వెళ్లేవారు.
ఒకరోజు బండి ‘నర్సీపట్నం రోడ్’ స్టేషన్ దాటింది. బాటనీ మాస్టారు షణ్ముఖరావు గారన్నారు “ఈ అప్ అండ్ డవున్‌తో ఒళ్లు మానం అయిపోతూ ఉందండి బాబూ” అని.
“ఇంకా నయం. మనది రైలు ప్రయాణం. అసలు బస్‌లో ఐతే చచ్చేవాళ్లం” అన్నాడు టైపిస్టు భూలోకరావు.
“ఈ అప్ అండ్ డౌన్ అనే మాటను ఎవరు కనిపెట్టారో?” అని అడిగాడు తెలుగు మాస్టారు భీమారావు.
శ్యామల రావు నవ్వి అన్నాడు “ఇది రైల్వే భాషండీ. ఇటు వైపు వెళ్లే రైళ్లను అప్ ట్రెయిన్స్ అనీ, అటువైపుని డవున్ ట్రెయిన్స్ అనీ అంటారు. యాక్చువాల్‌గా ఇంగ్లీషులో ఆ మాటకు ‘తలకిందులు చేయడమ’ని అర్థం. వైజాగ్ – తునికి అప్ అండ్ డౌన్ చేస్తున్నాము అంటే ఆ అర్థమే వస్తుంది మరి.” అందరూ నవ్వారు. “మరి కరెక్టుగా ఏమనాలో చెప్పు” అన్నాడు మూర్తి గారు. ఆయన సబ్జెక్టు సివిక్సు.
“కమ్యూట్ చేస్తున్నాము అని గానీ ఫ్లై (ply) between అని గాని అనాలి. ‘ప్లెయింగ్ బిట్వీన్ వైజాగ్ అండ్ తుని’ అనాలి!”
“ఫ్లయింగ్ అంటే ఎగరడం కదా” అన్నాడు భూలోకరావు.
“ఫ్లై కాదురా బాబూ, ప్లై’, ఒత్తు లేదు” అన్నారు ప్రిన్సిపాల్ గారు.
“ఎందుకొచ్చిన గొడవ మాస్టారు! అప్ అండ్ డౌన్ అనడమే బాగుంది” అన్నాడు తెలుగు మాస్తారు. “ఆ మాత్రం దానికి అంత చర్చ ఎందుకు?” అన్నారు ప్రిన్సిపాల్ గారు. మళ్లీ అందరూ నవ్వారు!
పాయకరావుపేట కాలేజీలో మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. సాహితి మూడో క్లాసు లోకి వచ్చింది. సాత్విక్‌కు నాలుగో ఏడు నడుస్తూంది. మహారాణీపేటలో ఉన్న యిల్లు మారి స్టేషన్‌కు దగ్గరగా న్యూకాలనీలో ఇల్లు తీసుకుని అందులోకి మారారు. దాంట్లో పడకగది సపరేట్‌గా ఉంది. హాలు పెద్దది. ముందు గ్రిల్స్ ఉన్న వరండా, వెనక కొద్దిగా పెరడు ఉన్నాయి. అద్దె నాలుగో వందల యాభై. జీతం దాదాపు నాలుగు వేలు దాటింది.
ఒకరోజు ఆర్.జె.డి. ఆఫీసు రాజమండ్రి నుంచి, నాన్ టీచింగ్ వారి పి.జి. క్వాలిఫికేషను ఉన్నవారి వివరాలు పంపమని లెటరు వచ్చింది, ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాతో సహా. ఆ కాలేజీలో శ్యామల రావు ఒక్కడే ఉన్నాడు. ప్రిన్సిపాల్ గారు వెంటనే వివరాలు, శ్యామల రావు సర్టిఫికెట్లు, కాండక్ట్ సర్టిఫికెట్, అన్ని తయారు చేసి పంపారు. పర్సనల్ మెసెంజరు ద్వారా పంపమని ఆ లెటరులో ఉన్నందున రికార్డు అసిస్టెంటు భూలోకరావు కిచ్చి రాజమండ్రికి పంపారు.
ఇంటికొచ్చి తల్లితో భార్యతో శుభవార్త చెప్పాడు. ప్రమోషన్ రావడానికి ఎన్నిరోజులు పట్టవచ్చునని అడిగింది శర్వాణి.
ఆమె వదనం విరిసిన కమలంలా ఉంది.
వ్యక్తిగత దూత ద్వారా పంపమన్నారు కాబట్టి త్వరలోనే తెలుస్తుందని చెప్పాడు. ఆర్ట్, కామర్సు సబ్జెక్టులో కాంపిటీషన్ ఉంటుందనీ, చాలామంది పి.జిలు చేసి ఉంటారనీ, అప్పుడు ప్రెజెంట్ క్యాడర్‌లో సీనియారిటీ, పి.జి పర్సెంటేజ్ పరిగణన లోకి తీసుకొని ప్రమోహన్లు ఇస్తారనీ, ఇంగ్లీషు సబ్జెక్ట్ చేసిన వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారనీ, తనకు తప్పక వస్తుందని తమ ప్రిన్సిపాల్ గారు చెప్పారనీ చెప్పాడు శ్యామల రావు.
మర్నాడు ఆదివారం. పొద్దున్నే బయలుదేరి బస్సులో సింహాచలం కొండ మీదకి చేరుకున్నారు. స్వామి వారికి అర్చన చేయించి ప్రసాదాలు తీసుకున్నారు. శర్వాణి భర్తకు తప్పక ప్రమోషన్ రావాలని వరాహ నరసింహస్వామి వారికి మొక్కుకుంది.
మూడు నెలలు గడిచాయి. నాన్-టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముత్యాల రాజు యలమంచిలిలో పనిచేస్తాడు. ఆయన సీనియర్ అసిస్టెంటు. ఒకరోజు సింహాద్రిలో వీళ్లున్న కంపార్టుమెంటు లోనే ఎక్కాడు. మూర్తిగారికి విష్ చేసి, శ్యామల రావును చూసి “అమ్మయ్య, ఉన్నావా?” అంటూ దగ్గరకొచ్చి కూర్చున్నాడు. “రేపు ప్రమోటీస్ జాబితా తయారు చేస్తారు. మన జోనల్ ప్రెసిడెంటు నిన్న నాకు ఫోన్ చేసి మన జోన్లో సెలెక్టయినవారి పేర్లు చెప్పాడు” అన్నాడు.
శ్యామల రావు గుండె వేగం హెచ్చింది!
“మన జిల్లాలో ముగ్గురికిచ్చారు. నీకు, అరకు కాలేజి సీనియర్ అసిస్టెంటు ధిల్లేశ్వర రావుకు, సబ్బవరం టైపిస్టు మోదకొండమ్మకు.”
పాయకరావుపేట స్టాఫంతా చప్పట్లు కొట్టారు. శ్యామల రావుకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు.
శ్యామల రావు లేచి తమ ప్రిన్సిపాల్ మూర్తిగారికి, ముత్యాలరాజుకు, బాటనీ మాస్టారు షణ్ముఖ రావుకు వంగి కాళ్లకి దండం పెట్టాడు. తెలుగు మాస్టారు భీమారావు గారన్నారు “ఇతని వినయమే ఇతనికి రక్ష. ‘విద్యాదదాతి వినయమ్’ అన్న ఆర్యోక్తిని రుజువు చేస్తున్నాడు!”
ముత్యాలరాజు కొనసాగించాడు. “రేపు సెలవు పెట్టి, పొద్దున్నే ఈస్ట్‌కోస్టులో రాజమండ్రి వెళ్లిపో శ్యామల రావ్. ఇంగ్లీషు పోస్టులు మన జోన్‌లో రెండు తీశారు. ఒకటి భీమిలి, రెండోది శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారం కాలేజీల్లో ఉన్నాయి. నీవు ఆర్.జె.డి గారిని కలిసి భీమిలి ఇవ్వమని రిక్వెస్టు చేసుకో. మన జోనల్ ప్రెసిడెంటు తిరుపతి రెడ్డి కూడ అక్కడ ఉంటాడు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సారంగ రావును కూడ కలిసి ఒక ఐదొందలు చదివించుకో” అన్నాడు.
మూర్తి గారితో, “మాస్టారూ! మన ఆర్.జె.డి ప్రభుశీలం గారు మీకు తెలుసు కదా! ఒకసారి మన శ్యామల రావు విషయం ఫోన్ చేసి చెబుదురూ! అడక్కపోతే అమ్మయినా పెట్టదని, మనవాడిని ప్రియాగ్రహారం వేశారంటే దొరికిపోతాడు పాపం! అక్కడ మంచినీళ్లు కూడా పుట్టవు. ముందే అమాయకుడు పాపం!” అన్నాడు.
“శీలంగారూ నేనూ పరవాడ కాలేజీలో కొలీగ్స్‌మి. నాకంటే చాలా సీనియర్. చెప్పి చూస్తాను.” అన్నాడు మూర్తిగారు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.