[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[ఓ రోజు అలమారలో ఉన్న ఎమ్.ఎ. ఇంగ్లీషు స్టడీమెటీరియల్, కరస్పాండెన్ కోర్స్ వారి లెసన్స్ చూసి అవన్నీ ఏమిటని శ్యామల రావుని అడుగుతుంది శర్వాణి. తాను ప్రైవేటుగా ఎం.ఎ. ఇంగ్లీషుకు కట్టాననీ, అవి దాని తాలూకు మెటీరియల్ అని చెప్తాడు. మరి వాటిని చదువుతున్నట్టు కనబడలేదే అని శర్వాణి అంటే, ఏదో సాకులు చెప్తాడు. కుదరదు పరీక్షలు రాయాల్సిందేనని అంటుంది శర్వాణీ. పైగా పరీక్ష పాసయితే జీతం పెరిగే అవకాశం ఉండడంతో మరింత గట్టిగా పట్టుపడుతుంది. పరీక్ష రాయాల్సిందే అని ఒత్తిడి చేయడమే కాకుండా, తగిన ప్రణాళిక రూపొందించి భర్తతో అమలు చేయిస్తుంది. తనకి వీలైన సాయం చేస్తూ నోట్స్ రాసి ఇస్తుంది. అత్తగారితో సన్నిహితంగా మెసులుతూ ఆమె అభిమానాన్ని చూరగొంటుంది శర్వాణి. భార్య సలహా మేరకు పరీక్ష ఇరవై రోజుల్లో ఉందనగా ఆఫీసుకు సెలవు పెట్టి మరీ చదువుతాడు శ్యామల రావు. పరీక్షల్లో వచ్చే ప్రశ్నల గురించి పాత్రో గారు కొన్ని సూచనలు చేస్తారు. వాటిని జాగ్రత్తగా పాటిస్తాడు శ్యామల రావు. పరీక్షలకి సెంటర్ బుల్లయ్య కాలేజ్ వేస్తారు అన్ని పరీక్షలు బాగా రాస్తాడు. పరీక్షలు పూర్తయ్యాకా, మరుసటి రోజు ఆదివారం శ్యామల రావు, శర్వాణి, ప్రసూనాంబ నర్సీపట్నం వెళ్తారు. గరివిడి నుంచి మురళి కూడా వస్తాడు. ఆ మర్నాడు అందరూ అన్నవరం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వస్తారు. శర్వాణిని కొన్ని రోజులు ఉంచుకుని పంపిస్తామంటారు ఆమె తల్లిదండ్రులు. అత్తగారిని కూడా కొన్ని రోజులు ఉండమంటుంది. ప్రసూనాంబ సరేనంటుంది. సోమవారం ఉదయం బయల్దేరి శ్యామలరావు, మురళి బస్సులో విశాఖపట్టణం చేరుతారు. మురళి రైల్వేస్టేషన్‌కి వెళ్ళీ అక్కడ్ని హౌరా ఎక్స్‌ప్రెస్ ఎక్కి గరివిడి వెళ్తాడు. మురళి తన లగేజిని క్లాకు రూములో ఉంచి, బస్సెక్కి పూసపాటిరేగకు చేరుకుంటాడు. పరీక్షలు బాగా రాశానని ప్రిన్సిపాల్ గారికి, తోటి స్టాఫ్‌కి చెప్తాడు. ఇంగ్లీషు లెక్చరర్ సూర్యనారాయణ మాత్రం కాస్త అసూయగా స్పందిస్తాడు. సాయంత్రం విజయనగరం వెళ్ళి పాత్రో గారిని కలిసి తను పరీక్షలెలా రాసినది వివరిస్తాడు. మాటల సందర్భంగా ఆయన తన గురువుగారు రోణంకి అప్పలస్వామి గురించి చెప్తారు. తను చదువుకున్న రోజుల గురించి, తన ఉద్యోగం గురించి, పిల్లల గురించి చెప్తారు. ఆ రాత్రి మెస్‌లో భోం చేసి ఇంటికి బయలుదేరుతాడు శ్యామల రావు. – ఇక చదవండి.]
రిక్షా మాట్లాడుకుని ఇల్లు చేరి తాళం తీసి లోపలికి వెళితే అంతా నిశ్శబ్దంగా శూన్యంగా అనిపించింది. స్నానం చేసి లుంగీ కట్టుకుని మంచం మీద వాలగానే అలసట వల్ల మంచి నిద్ర పట్టేసింది!
మర్నాడు నిద్ర లేచేసరికి ఏడు దాటింది. అతనికి వంట అలవాటు లేదు. కాఫీ పెట్టుకుందామంటే ఫిల్టరుతో డికాక్షన్ వేయడం రాదు. అమ్మా, శర్వాణీ వచ్చేంతవరకు బయటే తిందామని నిర్ణయించుకున్నాడు.
శర్వాణి పుట్టింట్లో వారం రోజుల కంటే ఉండలేకపొయింది. “పాపం ఆయన తిండీ తిప్పలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో అత్తయ్యా, ఇక బయలుదేరదాం” అన్నది ప్రసూనాంబతో.
శ్యామల రావుకు రెండ్రోజులు హోటళ్లలో తింటే బాగానే అనిపించింది కాని మూడో రోజు నుంచి మొహం మొత్తడం ప్రారంభించింది. ఆ రోజు ఆదివారం, కాలేజీ లేదు. ఉప్మా చేసుకుందామని ఆలోచించాడు. ముందు రెండు గ్లాసులు నీళ్లు మరిగించి, అందులో గ్లాసు బొంబాయి రవ్వ వేసి కలిపాడు. చక్కగా పొడిపొడిగా ఉంది కాని అమ్మ చేసినట్లుగా దాంట్లో కరివేపాకు, ఆవాలు, శనగపప్పు, ఉల్లి, అల్లం ముక్కలు లేవే?
సరే, ఇప్పుడేమయిందిలే అని చిన్న మూకుడులో నాలుగు స్పూన్ల నూనె పోసి, అందులో పోపు సామాన్లు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేశాడు. గుప్పెడు వేరుశనగగింజలు కూడ. బాగా వేగినాక దాన్ని ఉప్మామీద వేసి, తగినంత ఉప్పువేసి, కలిపాడు.
తింటూంటే అద్భుతమనిపించింది – పరవాలేదు, తాను వంట చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. మధ్యాహ్నం కుక్కర్లో అన్నం, కందిపప్పు, బంగాళా దుంపలు పెట్టి మూత పెట్టాడు. ఐదు నిమిషాలు దాటినా అది నిశ్శబ్దంగానే ఉంది. మూత లోపల చుట్టూ నల్లగా ఉంటుంది.. దాని పేరేమిటో గుర్తుకు రాలేదు. అది ఎక్కడుందా అని చూస్తే గోడకు ఒక మేకుకు తగిలించి ఉంది. మూత తీసి, ఆ నల్లని రబ్బరు బ్యాండు అమర్చి మళ్లీ పెట్టాడు. పావుగంటలో కుక్కరు విజిల్ వేసింది. మూడు విజిల్స్ రావాలన్నట్లు గుర్తు. మూడు వస్తూనే స్టవ్ ఆర్పాడు. పది నిమిషాల తర్వాత తీసి, అన్నం గిన్నె పక్కనపెట్టి, ఒక స్టీలుగిన్నెలో కందిపప్పు వేసి గరిటితో బాగా మెదిపాడు. రెండుగ్గాసుల నీళ్లు పోసి అందులో దుంపలనీ తొక్క తీసి వేశాడు. ఇంట్లో కూరగాయలు లేవు. చింతపండు నిమ్మకాయంత ఉండ తీసి, విడదీసి వేశాడు. ఉప్పు కలిపాడు. ఇంట్లో సాంబారు పొడి ఎక్కడుందో తెలియదు. కాసేపు అలోచించి, ఒక స్పూను కారంపొడి వేశాడు. ఒక సీసాలో ధనియాలు కనబడ్డాయి. ఒక పిడికెడు తీసి మిక్సీలు వేసి తిప్పాడు. ఆ పొడిని కూడా వేశాడు. స్టవ్ వెలిగించి దానిమీద మూత పెట్టాడు. ఏడెనిమిది నిమిషాల్లో సాంబారు తెర్లడం ప్రారంభించింది. ఒక చోట ఇంగువ డబ్బా కనబడింది. చిటికెడు ఇంగువ వేశాడు. సాంబారు తయారయింది. కానీ అమ్మ చేసినట్లుగా ఘుమఘుమ వాసన రాలేదు.
బయటకు వెళ్లి పెరుగు తెచ్చుకున్నాడు. అన్నంలో సాంబారు కలుపుకుని తింటుంటే బాగానే ఉంది. ‘నాట్ బ్యాడ్!’ అనుకున్నాడు. పెరుగన్నంలో ఉప్పు వేసుకుని తినేశాడు, ఊరగాయ జాడీలు దించి, తీసుకోలేక.
అలా సొంతంగా వంట చేసుకోగలిగాడు. శర్వాణి పక్కింటివాళ్ల లాండ్‌లైన్‌కి ఫోన్ చేసి, రేపు బయలుదేరి వస్తున్నామనీ, మీరు కాలేజీకి వెళ్లాలి కాబట్టి ఇంటి తాళాలు పక్కింట్లో ఇచ్చి వెళ్లమనీ చెప్పింది.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కిష్కింధ రాజ్యంలా ఉన్న యిల్లు రామరాజ్యంలా మారిపోయింది. శర్వాణి నవ్వుతూ ఎదురొచ్చింది. ఎనిమిది రోజుల ఎడబాటు వాళ్లిద్దరిలో మరింత అనురాగాన్ని పెంచింది.
“ఈ వారానికే చిక్కిపోయావేమిరా శ్యామూ” అన్నది ప్రసూనాంబ. అది తల్లుల రొటీన్ డైలాగు. శర్వాణి నవ్వింది. “నాకేమీ అనిపించడం లేదు అత్తయ్యా! బాగానే ఉన్నారాయన!” అంది.
“అదే తల్లికీ పెళ్లానికి తేడా!” అన్నాడు సీరియస్‌గా. తల్లి శర్వాణి మాటలకు కోపం తెచ్చుకుంటే తానూ రెండు సమిధలు వేసి ఆ కోపాగ్నిని మరింత రగిలింప చేయాలనుకున్నాడు.
ప్రసూనాంబ పకపకా నవ్వి “నీ మొహమేం కాదూ!” అన్నది. అత్తా కోడలూ కలిసి నవ్వుకుంటుంటే, ‘లాభం లేదు! వీళ్లను విడదీయడం ఎవరివల్లా కాదు. అత్తాకోడళ్ల బేసిక్ కాన్సెప్ట్ వీళ్లకు వర్తించడంలేదు’ అనుకున్నాడు.
టాపిక్ డైవర్టు చేయడానికి – “ఆదివారం ఉప్మా, భోజనం లోకి సాంబారు చేసుకున్నాను తెలుసా” అన్నాడు. ఇద్దరూ అతని వైపు జాలిగా చూశారు. అది పట్టించుకోకుండా “ఉప్మాలో పోపు వేశాను గానీ, సాంబారులో మరిపోయాను. అయినా, బాగానే కుదిరాయి” అన్నాడు.
శర్వాణి పడీపడీ నవ్వింది! “చరిత్రలో, ఉప్మాకు పోపు వేసిన మొదటి వ్యక్తి బహుశా మీరేనేమో!” అంది. ప్రసూనాంబ కొడుకును దగ్గరకు తీసు కోని “పిచ్చి వెధవా!” అని తల నిమిరింది. శర్వాణి ప్రేమనంతా కళ్లలో నింపుకుని భర్త వైపు చూసింది.
కూరగాయలు శర్వాణి వీధి చివర కొట్టులో తెచ్చినట్లుంది. టమేటో రసం, బెండకాయ వేపుడు చేసి చింతకాయ తొక్కులో దోసకాయ ముక్కలు వేసి దంచి పోపుపెట్టింది ప్రసూనాంబ. శ్యామల రావు తృప్తిగా తిన్నాడు. తొమ్మిది రోజుల విరహాన్ని భార్యాభర్తలిద్దరూ ఆ రాత్రి తీర్చుకుని అలసి సొలసి నిద్రించారు.
పరీక్షలు వ్రాసి నెల రోజులయినా శ్యామల రావు ఫైనలియర్ గురించి ఏమి మాట్లాడడం లేదు. చూసి చూసి శర్వాణి మగణి హెచ్చరించింది. “ఇప్పట్నించి ప్రిపరేషను మొదలు పెడితే ప్రాణానికి హాయిగా ఉంటుందండీ! మొన్నటి లాగ టెన్షన్ ఉండదు. ఈ రోజు సాయంత్రం విజయనగరం వెళ్లి పాత్రో మాస్టారి వద్ద స్టడీ మెటీరియల్ తెచ్చుకోండి. టైముంది కాబట్టి ఈ సారి రెఫరెన్సెస్ టు ది కాంటెక్స్ట్ కోసం టెక్ట్లు కొనుక్కుని మీరే స్టడీ చేసి, మంచి మంచి కొటేషన్లను సెలెక్ట్ చేయండి. మీరే కదా అన్నారు ఎడంవైపు పేజీలో టెక్ట్స్, కుడివైపు పేజీలో దాని వివరణ (Paraphrase) ఉండే పుస్తకాలు దొరుకుతాయని!”
చదువు మీద భార్యకున్న వ్యగ్రతకు, అవగాహనకు శ్యామలరావుకు ఆశ్చర్యం వేసింది. “యు ఆర్ గ్రేట్, వాణి!” అన్నాడు ఆరాధనగా ఆమెవైపు చూస్తూ.
“చాలు, చాలు! అలా చూడకండి. ముందు నేను చెప్పినట్లు చేయండి” అన్నది.
పెళ్లయి ఏడెనిమిది నెలలవుతూంది. ఒక రోజు ప్రసూనాంబ కోడల్ని అడిగింది. “ఏమ్మా, ఏవయినా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? నాకు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే మనవడినో మనవరాలినో ఆడించాలని వుంది. త్వరగా తెమల్చండి మరి.”
శర్వాణి అత్తయ్య దగ్గరకు వచ్చి కూర్చుని, ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకొని చెప్పింది మృదువుగా!
“అవునత్తయ్యా, మీ అనుమానం నిజమే… నేనే మాత్రలు వాడుతున్నాను. ఆయనకు కూడా తెలియదు. మీరూ చెప్పకండి!”
ప్రసూనాంబ నిర్ఘాంతపోయింది. “ఇదేమి చోద్యమే తల్లీ! అసలు ఎందుకు…” అని ఏదో అడగబోతూంటే చెప్పింది శర్వాణి –
“అత్తయ్యా, నన్ను క్షమించండి. ఈయన ఎమ్మే పూర్తయ్యేంతవరకు పిల్లలను కనగూడదని నిర్ణయించుకున్నాను. నేను గర్భవతినై, ఏ ఐదో నెలలోనో మా యింటికి వెళితే ఈయన చదువు మీద ఏకాగ్రత పెట్టరు. ఈ పి.జి. డిగ్రీ చేతికొస్తే కొన్నేళ్లలో ఆయనకు లెక్చరరుగా ప్రమోషన్ వస్తుంది. అప్పుడొచ్చే జీతంలో తేడా వేలల్లో ఉంటుందని ఆయనే చెప్పారు. రేపు పిల్లలను మంచి చదువులు చదివించాలన్నా, సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నా, ఈ జీతంతో కుదరదు. నేను కూడా కొంతవరకు ఆయన చదువులో సాయం చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి” అంటూ ప్రాధేయపడుతూన్న కోడలిని చూసి ప్రసూనాంబ మనసు ద్రవించింది. ఆ అమ్మాయిని అక్కు న చేర్చుకుని తల నిమురుతూ, “బంగారు తల్లి! ఎంత ముందు చూపే నీకు! నీవన్నది అక్షరసత్యం. అలాగే కానీ” అని అంది. శర్వాణి అత్తయ్య ఒళ్లో తల పెట్టుకొని నిశ్చింతగా పడుకుంది కాసేపు. పాత తరానికి చెందిన ఆమె ఒప్పుకుంటుందో లేదో, ఎంత రాద్ధాంతం చేస్తుందో అని భయపడిన ఆమెకు ఎంతో ఊరట లభించింది. ప్రీవియస్ పరీక్షల్లో యాభైఒక్క శాతం వచ్చింది శ్యామల రావుకు.
పాత్రో మాస్టారి దగ్గర స్టడీ మెటీరియల్ తెచ్చకున్నాడు శ్యామల రావు. యూనివర్సిటీ ఫీజు కట్టడానికి ఇంకా నాలుగైదు నెలల టైముంది. మాస్టారు సిలబస్ కూడా యిచ్చారు. దాన్ని తీసుకుని భార్యాభర్తలిద్దరూ ద్వారకానగర్ లోని ‘గుప్తా బ్రదర్స్ బుక్స్’ అనే షాపుకు వెళ్లారు. అది చాలా పెద్ద షాపు. సిలబస్ ప్రకారం డిటెయిల్డ్ టెక్స్ట్ బుక్కులు తీసుకున్నారు. వెయ్యి రూపాయలయింది. “ఈ నెలలోనే ఇంత ఖర్చంటే కష్టం శర్వాణీ!” అన్నాడు.
“ఏం ఫరవాలేదు. మొన్న వచ్చేటప్పుడు మా నాన్నగారు నా చేతిలో ఐదొందలు పెట్టారు ‘దసరాకు చీర కొనుక్కోమ్మా’ అని, అది తెచ్చాను” అంటూ చిన్న పర్సు లోంచి ఐదొందల రూపాయలు తీసి మగనికిచ్చింది.
“వాణీ, నీవు పండక్కు చీర కొనుక్కోకుండా…”
“మీరు ఎమ్మే పాసయింతర్వాత ప్రతి పండక్కి కొనిద్దురు గాని. మాటిమాటికీ ఎమోషనల్ అవకండి.”
సేల్స్‌మన్ పెద్దాయన. “అమ్మా, ఎంతమంచి మనసు తల్లీ నీది. ‘నీ ఇబ్బందులు నాకనవసరం. నాకు పండక్కు చీర కొనివ్వకపోతే ఊరుకోను’ అనే భార్యలున్న ఈ రోజుల్లో, పుట్టింటి వారిచ్చిన డబ్బుతో భర్తకు పుస్తకాలు కొనిస్తున్నావు చూడు, అదీ ప్రేమంటే. అబ్బాయ్! నీవు చాలా అదృష్టవంతుడివి. మీ ఒద్దిక చూసి నా మనసులోది చెప్పకుండా ఉండలేకపోయాను. ఏమనుకోకండి” అన్నాడు.
ఆ మాటలకు ఇద్దరూ కదిలిపోయారు. “బాబాయ్! మీ ఆశీస్సులుంటే చాలు! ఏమయినా ఎందుకనుకుంటాము. మావారి చదువు పూర్తయితే మా జీవితం మరింత మెరుగవుతుందని…”
“తప్పకుండా ఆ సింహాద్రి అప్పన్న మీరనుకున్నది నెరవేరుస్తాడు తల్లీ” అన్నాడాయన. “మీరెక్కడ పనిచేస్తారు?” అని అడిగాడు శ్యామల రావును.
“పూసపాటిరేగ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనండి”
“అయితే ఒక పని చేయండి. బిల్లు మీ ప్రిన్సిపాల్ గారి పేరు మీద అడగండి. మీ కాలేజీ లైబ్రరీకని చెప్పండి క్యాష్ కౌంటర్లో. మామూలుగా టెన్ పర్సెంట్ డిస్కౌంటు యిస్తాము. ఇలా అయితే ట్వంటీ పర్సెంటు వస్తుంది.”
కృతజ్ఞతగా చూశారతనివైపు. ఎనిమిది వందలకే పుస్తకాలు వచ్చాయి.
ఒక రోజు కాలేజీ నుంచి యింటికొచ్చేసరికి, మెత్తటి చేగోడీలు చేసింది ప్రసూనాంబ, కోడలు చుట్టి ఇస్తూంటే. అవి తిని కాఫీ తాగిం తర్వాత శర్వాణి భర్తతో ఇలా అంది “ఏమండీ, నేనీ రోజు ఒక అధికప్రసంగం చేశాను. ఒకసారి చూడండి. తప్పయితే ఎలాగో క్షమించండి” అంటూ ఒక నాటకం, విలియం వెబ్‌స్టర్ వ్రాసిన ‘డచ్చెస్ ఆఫ్ మర్ఫీ’ తీసుకొచ్చి చూపింది. దాదాపు రెండు వందల పేజీల నాటకమది. డాక్టర్ లక్ష్మీ నారాయణ్ అగర్వాల్ అనే ఉత్తరాది ప్రొఫెసరు గారు దానికి పారాఫ్రేజ్ వ్రాశారు, నోట్సుతో బాటు. ఎడమవైపు ఒరిజినల్ టెక్స్ట్ ఉంటుంది కుడివైపు పేజీలలో మామూలుగా అందరికీ అర్థమయ్యే ఇంగ్లీషులో దాని అనుసరణ ఉంటుంది. రెండింటిలో, ప్రతి పేజీల్లో ఒకటి రెండు చొప్పున రెఫరెన్సెస్ టు ది కాంటెక్ట్స్ పనికి వచ్చే, కవితాత్మకమైన, హృదయానికి హత్తుకునే సంభాషణలను రెడ్ యింక్‌తో మార్క్ చేసింది శర్వాణి. కుడిపక్క కూడ వాటి అనుసరణను మార్క్ చేసింది.
పుస్తకమంతా పేజీలు తిరగేసి చూశాడు శ్యామల రావు. దాదాపు నూట అరవై ఆర్.సి.లు వచ్చాయి. అతని చూస్తూండగానే వెళ్లి నోట్ బుక్ తెచ్చియిచ్చింది. దాంట్లో నీట్‌గా పేజీ నంబరు, యాక్ట్ నంబరు, సీన్ నంబరు, ఆ మాటలు ఎవరన్నారు, ఎవరితో అన్నారు, ఎప్పుడు ఎందుకన్నారో ప్రతి ఆర్.సి.కి వ్రాసి పెట్టింది.
అప్రతిభుడై పోయాడు శ్యామలరావు. “ఇదంతా పూర్తిచేయడానికి నీకెన్ని రోజులు పట్టింది?” అనడిగాడు. అతని ముఖం సీరియస్‌గా ఉంది.
“రోజూ ఇరవై పీజీల చొప్పున ఐదారు రోజులు పట్టిందండి.”
“ఒక్కసారి అమ్మ ఎక్కడుందో చూడు!”
“ముందుగదిలో ఏదో పుస్తకం చదువుకుంటున్నారు.”
“ఒకసారి ఆ తలుపు చాటుకు పద” అన్నాడు లేస్తూ. శర్వాణికి అర్థం కాలేదు.
“ఎందుకండీ” అంటూ తలుపు చాటుకు వెళ్ళింది. వెనకాలే వచ్చి గట్టిగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడు.
“నీవు ఎంత పని చేశావో తెలుసా! నాకు సగం పని తగ్గించావు” అన్నాడు సంతోషంతో తలమునకలవుతూ
అతన్నుంచి విడిపించుకొని, “పట్టపగలు అత్తయ్య అక్కడ ఉండగానే ఏమిటీ అల్లరి?” అని అతన్ని గదిమింది. కానీ అతని చర్య తాలూకు పారవశ్యం ఎర్రబడిన ఆమె చెక్కిళ్లలో, కంపిస్తున్న అధరాలలో ప్రతిఫలిస్తూనే ఉంది. మాట కోపం ఉంది కాని, అది నిజం కాదని తెలుస్తూనే ఉంది.
“మరి నా కృతజ్ఞతలు తెలుపుకోవాలంటే ఇదొక్కటే మార్గమనిపించింది” అన్నాడు ‘రామా ఈజ్ ఎ గుడ్ బాయ్’ లాగా.
శర్వాణి నవ్వింది. ఆ నవ్వులో విచ్చిన చేమంతులున్నాయి!
ఇద్దరూ గదిమధ్య కొచ్చి కూర్చున్నారు.
“కాదూ, వెబ్‌స్టర్ భాషలో ఓల్డ్ యింగ్లీషు పదాలు, ఆర్కాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఉంటాయి. చివర్లో చూద్దామని నేనే దాన్ని పక్కన పెట్టాను. నీవెలా…?”
“నా మొహం! నేను ఒరిజినల్ జోలికి పోలేదసలు, పారాఫ్రేజ్ చదువుకుంటూ వెళ్లాను. నాకు చాలా బాగున్నాయి అనిపించిన చోట్ల మార్క్ చేశాను. కొంచెం నిదానంగా చదివితే నాలాంటి వాళ్లకు కూడ బాగా అర్థమయ్యేలా అనుసరణ రాశాడా మహానుభావుడు! అదే వాక్యం ఒరిజనల్లో వెతకడం పెద్ద కష్టమేం కాలేదు. ఎందుకంటే రెండూ ఇంచుమించు సమాంతరంగానే ఉన్నాయి. పరవాలేదా, బాగానే మార్క్ చేశానా? మీరు ఓకె అంటే మిగతా టెక్స్ట్ కూడ చేస్తాను.”
“చెబుతాను. ఒక్కసారి తలుపు చాటుకు. ఇంకా గోడ మూలకు పోదాంపద!”
“అదే వద్దనేది! చదువు గురించి మాట్లాడుకుంటుంటే మధ్యలో సరసమొకటి!”
“మరి నా కృతజ్ఞతను…”
ప్రసూనాంబ సడన్‌గా లోపలికి వచ్చింది. ఇద్దరూ బిడియంగా తలలు వాల్చుకుని కూర్చున్నారు.
“ఒరేయ్ శ్యామూ, నీ కృతజ్ఞతను తెలుపుకోవాలంటే ఆ అమ్మాయికి దసరాకు మంచి చీర కొనివ్వు. నా ఫామిలీ పెన్షనుకు అదనంగా ఈ సారి డి.ఆర్. అరియర్స్ ఆరు వందల దాకా వస్తాయన్నావుగా? నీ అరియర్స్ జి.పి.ఎఫ్.లో జమవుతాయి. పెన్షనర్లకు ఆ బాధలేదు. నీ తరపున నేను నా కోడలికిచ్చే గిఫ్ట్ ఇది” అంది.
“ఇప్పుడవన్నీ…” అని మొదలుపెట్టింది శర్వాణి.
“నీవేం మాట్లాడకమ్మాయ్! పండగ ఇంకా పదిరోజులే ఉంది. చీరైతే కొనగలంగాని ఆ సత్యవతి జాకెట్ కుట్టివ్వద్దూ! పదండి, తయారవండి. జగదాంబ సెంటర్లో చందనా బ్రదర్సులో తెచ్చుకుందాము.”
“అయితే నాదొక షరతు”
“ఏమిటీ అది?”
“మీరూ చీర తీసుకోవాలి. మీ అబ్బాయి కూడ ప్యాంటు షర్టు తీసుకోవాలి”
“సరే, సరే.”
ముగ్గురూ జగదాంబ సెంటరుకు వెళ్లారు. పండగల సీజనేమో చందన బ్రదర్స్ షోరూము జనంతో కిటకిటలాడుతుంది. ముందుగా చీరల విభాగంలోకి వెళ్లారు. కస్టమర్లకు ఇబ్బంది లేకుండా ధరల రేంజ్ రాసిన ప్లాస్టిక్ బోర్డులు తగిలించి ఉన్నాయి. 300-500 అని రాసి ఉన్నచోటికి వెళ్లారు. అరగంట సేపు రకరకాల చీరలు చూశాక ఒకటి తీశారు. లేత పసుపురంగు పాలిస్టర్ చీర. ముట్టుకుంటే మెత్తగా ఉంది. చీరంతా ఎర్రని చిన్నచిన్న పువ్వులు. బార్డరు కూడా ఎరుపే. దాని మీద అడుగు ఎడంతో వీణలు. పైటంచు కూడా ఎరుపే. దాని మీద చిన్నగళ్ళు. శర్వాణికి నచ్చింది. ప్రసూనాంబ కూడా బాగుందన్నది. డిస్కౌంటు పోను మూడు వందల తొంభై. దాంట్లోనే జాకెట్ పీస్ ఉంది. అది కూడా ఎరుపురంగులో ఉంది, చిన్న పువ్వులద్ది ఉన్నాయి.
తర్వాత ప్రసూనాంబకు ఒక నేత చీర తీశారు. వెంకటగిరి చీర. మబ్బు రంగులో ఉంది. దానికి జాకెట్టు వేరే తీయాల్సి వచ్చింది. అక్కడి నుంచి థర్డ్ ఫ్లోర్లో ఉన్న మెన్స్ విభాగానికి వెళ్లారు. ‘సియారామ్స్’ వారి బ్లాక్ కలర్ పాంటు, ‘మఫత్ లాల్’ వారి లేత గోధుమరంగు చెక్స్ షర్టు తీశారు. అన్నీ కలిసి వెయ్యి రూపాయల లోపే బిల్లయింది.
బ్యాగులు పట్టుకుని బయటకువచ్చారు. చెరుకురసం తాగారు. అప్పుడే సిటీలో ఆటోలు తిరుగుతున్నాయి. వాటిలో ఛార్జీ ఎక్కువని దిగువ మధ్యతరగతి వారు వాటిల్లో వెళ్లడానికి జంకేవారు.
ధైర్యంచేసి మహరాణిపేటకు ఆటో మాట్లాడాడు శ్యామల రావు. అంతవరకూ రిక్షా కుదుపులకు అలవాటు పడిన వాళ్లకు ఆ ప్రయాణం చాలా కంఫర్టబుల్‌గా ఉంది. శ్యామల రావు మీటరునే తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. మినిమం 2 రూ. ఉన్నది ఒక కిలోమీటరు వరకు కదలలేదు. తర్వాత విష్ణు చక్రంలా తిరుగుతూ, వీళ్ళు యిల్లు చేరేసరికి ఎనిమిది రూపాయల అరవై పైసలయింది. శ్యామల రావు పది రూపాయల నోటిస్తే నమస్కారం చేసి “థాంక్యూ సార్!” అని చెప్పి తుర్రుమన్నాడు ఆటోవాడు.
శ్యామల రావు డల్ అయిపోయాడు. “రిక్షాకు మూడు రూపాయలిచ్చినా, ఆర్రూపాయలకు రెండు రిక్షాల్లో హాయిగా వచ్చేవాళ్లం!” అని గొణుక్కుంటుంటే శర్వాణి నవ్వి అన్నది –
“పోనీలెండి! రోజూ ఎక్కుతామా ఏమిటి? సిటీ బస్సయితే డెబ్భై ఐదు పైసలతో పోయేది అలాగంటే! నా ఋణం ఇలా తీర్చారనుకోండి.”
“అయితే సరే” అని తాను కూడా నవ్వాడు శ్యామల రావు. మధ్యతరగతి మందహాసం!
రవ్వతో మైదాపిండి, పెరుగు కలిపి, దోసెలు పోసుకుని తిన్నారా రాత్రి. పొద్దుపోయేవరకు భార్య రుణం తీర్చుకుంటూనే ఉన్నాడు శ్యామల రావు. మోరల్ సపోర్టే గాక – అకడమిక్ సపోర్టు కూడా శర్వాణి అప్పటి నుండి భర్తకు ఇవ్వసాగింది.
దసరా పండగకు వైజాగ్‌కి రమ్మని బావమరిదికీ, అత్తామామలకూ లెటర్లు రాశాడు శ్యామల రావు. చిన్న ఇల్లయినా మనసులు ఇరుకు కాదు కాబట్టి అందరూ ఆనందంగా సర్దుకుని పండగ జరుపుకున్నారు.
వియ్యపురాళ్లిద్దరూ కలిసి ముందురోజే వాము పూసి, మైసూరుపాక్ చేశారు. పండగనాడు ఉదయాన్నే పూర్ణామార్కెట్‌కి వెళ్లి బావా, మరుదు లిద్దరూ తరిగిన పనసపొట్టు, అరిటాకులు, మామిడాకులు తెచ్చారు.
పూర్ణంబూరెలు, అరటికాయ బజ్జీలు, కొబ్బరి రైస్, రైతా ఉల్లిపాయలు కాకుండా టమేటాలతో, దోసకాయ పప్పు, పెసరపచ్చడితో పండుగ భోజనం సుసంపన్నమయింది. అరిటాకుల వల్ల అది మరింత శోభిల్లింది. అందరూ క్రిందే కూర్చున్నారు. ప్రసూనాంబగారు, శర్వాణి వడ్డించగా మిగతా నలుగురూ కూర్చున్నారు. అప్పుడు జగన్నాథరావు గారు చెప్పారు.
“ఈ పచ్చని, లేత అరిటాకులను చూస్తూంటే నాకు శ్రీనాథుని ‘భీమఖండము’ లోని ఒక ఘట్టం గుర్తొస్తూంది. చెప్పమంటారా?”
“తప్పకుండా మామయ్యా” అన్నాడు అల్లుడు.
“వ్యాసమహర్షి తన శిష్యులతో కాశీనగరానికి వెళతాడు. అక్కడ ఆయన బృందానికి భోజనము దొరకదు. విపరీతమైన కోపం వస్తుందాయనకు. కాశీ నగరాన్ని నాశనం కమ్మని శాపం పెట్టడానికి పూనుకుంటాడు.
అప్పుడు అన్నపూర్ణమ్మ తల్లి పెద్దముత్తయిదువ రూపంలో వచ్చి ఆయనను అనునయిస్తుంది. ‘ఆకలి బాధకే అంత ఆగ్రహమా నాయనా’ అంటుంది. ‘వెళ్లి గంగలో స్నానాలు చేసి రండి, ఈలోపు నేను భోజనం సిద్ధం చేస్తాను’ అంటుంది.
సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అనుగ్రహిస్తే భోజనం తయారవడం ఎంత సేపు? నవకాయ పిండివంటలన్నీ కేవలం సంకల్పమాత్రం చేత సమకూరినాయి.”
“మరి అరిటాకుల గురించి చెప్పు త్వరగా!” అన్నాడు కొడుకు. “ఆకలేస్తుంది.”
“అక్కడికే వస్తున్నా.. అమ్మవారి పరిచారికలు ముందుగా అందరి ముందు అరిటాకులు పరిచారుట. అవి ఎట్లున్నాయంటే…
‘మొగి విరిసి కఱకుగూడక,
పగులక వెడలుపును నిడుపుఁ బసిమియుఁ గల లేఁ
జిగురరఁటాకులు పెట్టిరి,
దిగదిగ నద్దేవియాజ్ఞ దివ్యపురంధ్రుల్.’
అరిటాకులు చక్కగా విచ్చుకున్నాయట. కరక దేలలేదు… అంటే ముదర లేదు. మధ్యలో చీలిపోలేదు. పొడవు, వెడల్పు చక్కగా సరిపోయాయి. దిగదిగ.. మెరుస్తున్నాయి. అటువంటి అరిటాకులను అమ్మవారి ఆజ్ఞతో దివ్యస్త్రీలు అతిథుల ముందు పెట్టినారని అంటాడు శ్రీనాథ కవిసార్వభౌముడు. మహానుభావుడు. ఇక వారికి వడ్డించిన వంటకాలను ఒక సీస పద్యంలో వర్ణిస్తూంటే మనకు నోరూరుతుంది. ఈ అరిటాకులు సరిగ్గా అలానే ఉన్నాయి నాయనా మీ వైజాగులో! మా నర్సీపట్నంలో దొరికి చావవు.”
“ఆ సీస పద్యం కూడ చెబుతావా ఇప్పుడు?” అన్నాడు కొడుకు నవ్వుతూ.
“లేదు లేరా, వడ్డన కానివ్వండమ్మా!” అన్నాడాయన.
“పండగపూట చక్కని పద్యం వినిపించారండీ, అన్నయ్యగారు!” అన్నది ప్రసూనాంబ. “ఈ మధ్య యిటువంటి మంచి విషయాలు వినిపించేవారే లేరు.”
“వినేవారుంటే కద తల్లీ!” అన్నాడాయన నవ్వుతూ.
సాయంత్రం అందరూ సిటీ బస్సులో రామకృష్ణ బీచ్‌కు వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. బీచ్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి వేడిగా అన్నం వండుకొని, ఉదయం మిగిలినవాటితో తిన్నారు.
శ్యామల రావుకు మర్నాడు కూడా సెలవే. కానీ మురళికి లేదు. అతడు పొద్దున్నే ఖుర్దా రోడ్ ప్యాసింజరుకు వెళ్లిపోవాలి. జగన్నాథరావు దంపతులను రెండు రోజులుండి వెళ్లమని అభ్యర్థించాడు శ్యామల రావు. వాళ్ల సరే అన్నారు.
అందరూ మధ్యగదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా, జగన్నాథరావు ఒక న్యూస్ పేపర్ చుట్టిన ప్యాకెటను అల్లునికిచ్చాడు. “నాయనా, మా ఊరు ఎస్.రాయవరంలో ఉన్న మా పాత యిల్లు శిధిలమైపోతుంటే అమ్మేశాను, పద్ధెనిమిది వేలకు. నాలుగేండ్ల నుంచి అద్దె కూడ రావడం లేదు. పొలం ఎకరన్నర ఉంది. అంతో ఇంతో కౌలు వస్తుంది. సరే అని ఇల్లు అమ్మేశాను. ఆ ఊర్లో పెద్ద ధరలు లేవు. రెండు సెంట్లు అంతే. అదీ వైజాగులో అయితే లక్షరూపాయలకు తక్కువ రాదు.
ఏదయినా మా మురళికీ శర్వాణికీ చెరి సగం ఇవ్వాలని అనుకున్నాము. మురళి కూడా అంగీకరించాడు. మీ వంతు తొమ్మిది వేల రూపాయలు ఆ పొట్లంలో ఉంది. పెళ్లప్పుడు కూడా మీకు స్కూటరు కొనిపెట్టలేకపోయాను. ఈ డబ్బుతో కొనుక్కోండి.”
“ఇప్పడివన్నీ ఎందుకు మామయ్య! విలువ కట్టలేని లక్ష్మీదేవి లాంటి మీ కూతుర్నిచ్చారు. అది చాలు” అన్నాడు అల్లుడు.
“మా శర్వాణి నన్ను కన్నతల్లిలా చూసుకుంటుందండి” అన్నది ప్రసూనాంబ. వియ్యంకుల కళ్లళ్లో నీల్లు తిరిగాయి.
“అంతా మీ మంచితనం వదినా” అన్నది విశాలాక్షి.
“అయితే మా బావ స్కూటరు కొంటాడన్నమాట!” అన్నాడు మురళి నవ్వుతూ. “అవునోయ్! చాలా కాలం నుంచి దాని మీద మోజు ఉండిపోయింది. మామయ్య గారు దాన్నిప్పుడు తీరుస్తున్నారు”
“మా వాడి పేరిట పెద్ద బొడ్డేపల్లి సెంటరులో, నర్సీపట్నం నుంచి కోటవురట్ల పోయే రోడ్డులో నూట యాభై గజాలు సైటు తీసుకోవాలనుకుంటున్నాము ఈ డబ్బుతో. ఒక నాలుగు వేలు చేతినించి పడేలా ఉంది” అన్నాడు మామగారు.
“మీక్కూడా ఇప్పుడు స్కూటరుకేం తొందర? వైజాగ్ చుట్టుపక్కల ఒక వంద గజాల స్థలం వస్తే తీసి పెట్టడం మంచిది” అన్నది శర్వాణి.
“తొమ్మిది వేలకు వైజాగ్‌లో ఏమొస్తుంది?” అన్నాడు శ్యామల రావు.
“వైజాగ్ అంటే ఏ జగదాంబ సెంటర్లోనో, ఆశీలుమెట్టలోనో, గాజువాకలోనే కొంటామా ఏమిటి? మధురవాడ దాటి ఏడు కిలోమీటర్ల దూరంలో కొమ్మాది దగ్గర మా ఫ్రెండుకు తెలిసిన వాళ్ళే ప్లాట్లు వేశారట. హైవేకు కిలోమిటరు దూరం ఉంటుందంట. నూట ఇరవై గజాల ప్లాటు పన్నెండు వేలట. ముందు వెయ్యి రూపాయలు కట్టి రిజర్వేషన్ చేసుకోవాలట. వాయిదాల పద్ధతిలో కూడా కట్టుకోవచ్చునట” అన్నాడు మురళి.
“అయితే అది మంచిదే. భూముల రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి మురళీ, వచ్చే ఆదివారం నీవు వచ్చేయి. వెళ్లి చూసి అడ్వాన్సు ఇచ్చివద్దాము” అన్నాడు శ్యామల రావు.
“అలాగే బావా” అన్నాడు మురళి.
రెండ్రోజులు ఉండి శర్వాణి అమ్మా నాన్నా వెళ్లిపోయారు. శనివారం రాత్రి మురళి వచ్చాడు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.