Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెతడి-3

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[మగపెళ్ళివారు సంబంధానికి సరేనన్నారన్న వార్త నర్సీపట్నం చేరుతుంది. శర్వాణి అభిప్రాయం తెలుసుకుంటారు. ఆమె అంగీకరిస్తుంది. జగన్నాథ రావు దంపతులు వైజాగు వెళ్లి ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకుంటారు. లగ్నపత్రిక వ్రాయించుకుంటారు. శ్యామల రావు, శర్వాణిల పెళ్ళి సింహాచలంలో,  ఏ అడ్డంకులు లేకుండా జరిగిపోతుంది. తొలిరాత్రి నాడు అత్తగారి గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది శర్వాణి. ఆమెతో అరమరికలు లేకుండా నడుచుకోవడం ఎందుకు ముఖ్యమో చెబుతుంది. మర్నాడు ఉదయం ‘బలిఘట్టం’ వెళ్లి శివునికి అభిషేకం చేయించుకుని వస్తారు. మధ్యాహ్నం సినిమాకి వెడతారు. మూడు రోజులు గడిచాకా, విశాఖపట్నం వస్తారందరూ. సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. ఆ కార్యక్రమం అయ్యాకా భోంచేసి శర్వాణి తల్లిదండ్రులు నర్సీపట్నానికి, అన్నయ్య మురళి గరివిడికి వెళ్ళిపోతారు. – ఇక చదవండి.]

కరోజు అల్మైరాలో ఎమ్.ఎ. ఇంగ్లీషు స్టడీమెటీరియల్, కరస్పాండెన్ కోర్స్ వారి లెసన్స్ చూసి, భర్తనడిగింది శర్వాణి – “ఇవన్నీ ఏమిటంది? చాలా ఉన్నాయి?”

“అవా, నేను ప్రయివేటుగా ఎమ్.ఎ. ఇంగ్లీషుకు కట్టానులే. దాని తాలూకు మెటీరియల్ అది.”

“చాలా గ్రేట్ అండీ మీరు. నేను వచ్చి నెల దాటుతుంది. మీరొక సారయినా వీటిని చదువుతున్నట్లు నాకు కనిపించలేదు?”

“ఏమో, ఈసారి ప్రీవియస్ రాయదల్చుకోలేదు శర్వాణి! పరీక్షలు గట్టిగా మూడు నెలలు కూడా లేవు.”

గలగల నవ్వింది శర్వాణి. “నా కర్థమయింది లెండి. ‘వివాహో విద్యానాశాయ, సర్వనాశాయ శోభనం’ అని మన పెద్దలు చెప్పింది మీరు నిజం చేస్తున్నారన్న మాట. అదేం కుదరదు. మీరు పరీక్షలు రాయాల్సిందే” అన్నది.

నిస్సహాయంగా చూశాడు కొత్తబిచ్చగాడు!

“ఎమ్.ఎ. చేస్తే మనకు జీతం పెరుగుతుందా?”

“ఆ. ఒక ఇంక్రిమెంటు కలుస్తుంది. అదీ కాకుండా మాకు నాన్-టీచింగ్ వాళ్ల కోటాలో, జూనియర్ లెక్చరర్‌గా ప్రమోషన్ వస్తుంది.”

“మీకూ లెక్చరర్లకు జీతాల్లో చాలా తేడా ఉంటుందనుకుంటా?”

“అబ్బ, సంబంధమే లేదు. వేలల్లో తేడా.”

“చూసారా, ఇంత మంచి పని మొదలుబెట్టి, పెళ్లి సాకుతో దాన్ని వాయిదా వెయ్యాలని చూస్తున్నారు. ఇదేమయినా బాగుందా చెప్పండి?”

“రోజంతా అప్ అండ్ డౌన్ తిరగడం, కాలేజీలో ఆఫీసు పని, ఇంటికి వచ్చింతర్వాత..”

“ఆఁ. ఇంటికి వచ్చింతర్వాత?”

“..”

“పెళ్లాం కొంగు పట్టుకుని తిరగడం. అంతే కద! పొద్దున్న ఏడుగ్గానీ లేవరు!”

“రాత్రి పడుకునే సరికి పొద్దుపోతోంది.”

“దేని దారి దానిదే మహాశయా! రేపటి నుంచి ఐదున్నరకు లేపుతాను. ఒక రెండు గంటలు చదువుకోండి. బ్యాగులో కొంత మెటీరియల్ పెట్టుకోండి. రేగకు బస్సు ప్రయాణం గంట పట్టదూ? బస్సులో చదువుకోండి. బజారు పనులన్నీ నేను చేస్తాను. సాయంత్రం మీరొచ్చేసరికి అరవుతుంది. స్నానం చేసి రిలాక్స్ అయి ఏడు నుంచి తొమ్మిది వరకు చదవండి. తర్వాత..”

“తర్వాత..?”

“నేను చెప్పను బాబూ, మీ యిష్టం!” అని అందంగా సిగ్గుపడింది శర్వాణి.

“ఆదివారాలు, శలవు రోజులు మాత్రం ఎక్కువగా కష్టపడాలి. ఈ మూడు నెల్లూ సినిమాలూ, బీచ్‌లూ బంద్! అలా కాకుండా చదువును నిర్లక్ష్యం చేస్తే, మీ దోస్తీ కటీఫ్!”

అలా మోటివేట్ చేసింది భర్తను. ‘కరణేషు మంత్రీ’నా మజాకా? ఉట్టి ‘శయనేషు రంభా’ అయినంత మాత్రాన చాలదు భార్య. నాల్రోజులు కష్టమనిపించినా ‘ప్లాన్డ్ స్టడీ’ లోని రుచి తెలిసింది శ్యామల రావుకు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం వరకు నాలుగు గంటలు చదివి, విజయనగరం వెళ్లి, పాత్రో మాస్టారి క్లాసులకు హాజరయ్యేవాడు.

ఒకరోజు భార్యతో అన్నాడు – “ఎస్సే కొశ్చన్లు పరవాలేదు గాని, రెఫరెన్స్ టు ది కాంటెక్స్ట్‌లు మాత్రం కొరుకుడు పడటం లేదు. మాస్టారు టెక్స్ట్ బుక్స్‌లో మార్క్ చేసి యిచ్చారు.”

“అంటే సందర్భ సహిత వ్యాఖ్యలంటారు తెలుగులో, అవేనా?”

“ఆఁ. అవే”

“ఇంటరులో ఇంగ్లీషులో మాక్కూడా ఉండేవి!”

“అవును. అవి చాలా తక్కువ పాఠాలు. కానీ ప్రీవియస్‌లో దాదాపు ఐదు పేపర్లతో కలిసి ఇరవై డిటెయిల్డు టెక్ట్లు ఉన్నాయి. మార్క్ చేసుకోన్నవీ, స్టడీ మెటీరియల్ మధ్యలో వచ్చే కొటేషన్లు అన్నీ ఒకచోట ఉంటే మాటిమాటికి చదువుకోవడానికి ఎంత బాగుంటుంది?”

శర్వాణి కాసేపు అలోచించింది. ఇలా అంది “పోనీ ఒక పని చేస్తే? నాకొక వైట్ పేజీల లాంగ్ సైజ్ నోట్ బుక్, మంచి పెన్నొకటి కొనివ్వండి. మార్క్ చేసినవన్నీ టెక్స్ట్ వారీగా, దాంట్లో నేను వ్రాస్తాను.”

“వండర్‌ఫుల్!” అని అరిచాడు శ్యామలరావు. “శర్వాణీ, నా రాణీ, యు ఆర్ ఎ జీనియస్” అని ఆమెను ఎత్తుకొని గిరగిర తిప్పాడు.

“చాలు దింపండి! అత్తయ్య చూస్తే ఏమనుకుంటారు? పుస్తకాల్లో ఉన్నవి చూసి ఎత్తి రాయడానికి అంత జీనియస్ కావాలా?”

అలా తనకు చేతనైనంత, అతనికి సాయం చేసేది శర్వాణి,

ఉదయం ఐదున్నరకు తేచి మగడిని లేపేది. ఆయనకూ అత్తయ్యకూ ఫిల్టర్ కాఫీ ఇచ్చేది. అంట్లు గిన్నెలన్నీ రాత్రి తోమి పెట్టేది. వంట మాత్రం ప్రసూనాంబే చేసేది. కానీ కూరగాయలు తరిగివ్వడం, ఇడ్లీ దోసెల పిండి మిక్సీలో రుబ్బడం, ఇల్లు తుడవడం, గిన్నెలు ఇలా పైపనులన్నీ శర్వాణి చేసేది. ప్రతిదానికీ “అత్తయ్యా! ఇదెలా, అదెలా?” అని ఆమెను అడిగేది.

శ్యామల రావు టిఫిన్ తిని, క్యారేజీ పట్టుకొని ఎనిమిదిన్నర కల్లా కాంప్లెక్సుకు వెళ్లిపోయేవాడు. వైజాగ్ – శ్రీకాకుళం నాన్‌స్టాప్ బస్సులు రేగలో ఆగవు. ఎక్స్‌ప్రెస్‌లు ఆగుతాయి గాని ఛార్జీ ఎక్కువ. అందుకని ఆర్డినరీ బస్సుల్లోనే ప్రయాణించేవాడు మంత్లీ పాస్ తీసుకుని.

టిఫిన్ శ్యామలరావుకు ఒక్కనికే. అత్తాకోడళ్లిద్దరూ పదకొండున్నరకు భోంచేసేవారు. ప్రసూనాంబ రాగి జావ చేసుకున్నపుడు కోడలికీ చిన్నగ్లాసుతో కొంచెం ఇచ్చేది. భోజనం తర్వాత ఆమె రెండు వరకు పడుకునేది. శర్వాణి మాత్రం ఎమ్.ఎ. టెక్స్ట్ దగ్గర బెట్టుకొని అందులో మార్క్ చేసిన రెఫరెన్స్ వాక్యాలను నోటుబుక్కులో రాసేది. ఆ అమ్మాయి చేతిరాత కూడా చాలా బాగుండేది.

మధ్యాహ్నం రెండు తర్వాత మొత్తం పని టేకోవర్ చేసేది. సాయంత్రం శ్యామల రావు వచ్చింతర్వాత అందరూ తినడానికి మురీల మిక్చరో, జంతికలో, పప్పుచెక్కలో చేసేది. శుక్రవారం రిక్షా మాట్లాడుకొని ఇద్దరూ కోట బురుజు లోని కనకమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని వచ్చేవారు. ఇద్దరూ ఎంత సఖ్యతగా ఉండే వారంటే, తెలియనివాళ్లు తల్లీ కూతుళ్లేమో అనుకునేవారు.

ఒక్కోసారి శ్యామల రావుకు వీళ్ల సఖ్యత చూచి ఆటపట్టించాలనిపించేది. ఒకరోజు ప్రసూనాంబ బీరకాయ తొక్కతో పచ్చడి చేసింది. అ కాన్సెప్టే నచ్చదు శ్యామల రావుకు. దాన్ని చూసి మొదట ఏ చుక్కకూర పచ్చడో అనుకున్నాడు. తెలిసింతర్వాత “ఏమిటమ్మా, మనింట్లో ఎప్పుడూ చేసుకోం కదా” అంటే,

ఆమె, “కోడలికిష్టమటరా! అందుకే చేశాను” అన్నది.

అవకాశం దొరికిందనుకున్నాడు కొడుకు. “నీవు కోడల్ని మరీ నెత్తికెక్కించుకుంటున్నావని అనిపిస్తుందమ్మా” అన్నాడు, ఒక వైపు క్రీగంట భార్యను చూస్తూ. “ఆమె కిష్టమైతే చేసెయ్యడమేనా, నన్నడగక్కర్లేదా? ‘ముందొచ్చిన చెవులకంటే..’ అన్న సామెత నిజం చేస్తున్నావు” అన్నాడు ధుమ ధుమలాడుతూ.. అంటే అలా నటిస్తూ.

అత్తాకోడళ్లిద్దరూ నవ్వుతున్నారు!

“ఎందుకురా మనసులో లేనిదాన్ని మాటల్లో చెబుతావు? ఆ అమ్మాయి ప్రతి చిన్న విషయం నా యిష్టానికనుగుణంగా నడుచుకుంటుంటే, ఇష్టమైన పచ్చడి చేసిపెట్టకపోతే ఎలా?” అన్నది అత్తయ్యగారు

“నీ జిలిబిలి నటనలు చాలును లే.. నా మది లోన దాగిన ఓ జాబిలి!” అంటూ పాడింది కోడలు.

“ఇద్దరూ ఒకటయ్యారు! ఇక నేనేం చేసిది?” అంటూ, లోలోన మహదానంద పడుతూ భోజనం ముగించాడు పుత్రరత్నం.

ఎమ్.ఎ. పరీక్షలు సరిగ్గా ఇరవై రోజులున్నాయి. శర్వాణి అన్నది. “ఈ ఇరవై రోజులూ సెలవు పెట్టి రోజంతా చదువుకోకూడదూ! ఒకటికి నాలుగు సార్లు రివిజన్ చేసుకుంటే బాగుంటుంది.”

“కరెక్టే శర్వాణీ! ఈరోజే మా ప్రిన్సిపాల్ గారిని అడుగుతానుండు” అన్నాడు.

ప్రిన్సిపాల్ దాలినాయుడు గారినడిగితే కాస్త ఆలోచించి ఇలా అన్నారు. “శ్యామల రావ్, నీకు ఈ మధ్య ప్రొబేషన్ డిక్లేరయింది. హాఫ్ పే కమ్యూటెడ్ లీవు అంత ఉండదు. సి.యల్స్ పెట్టుకుందామా అంటే ఇదింకా ఆగస్టు నెలే కదా! లీవయినా పది రోజులకు మించకూడదు. ఉండు చూద్దాం!” అని రికార్డు అసిస్టెంటు లోవరాజును పిలిచి సి.ఎల్స్. రిజిస్టరు తెమ్మన్నాడు. అందులో కేవలం ఏడు సి.ఎల్స్ మాత్రమే ఉన్నాయి.

“అబ్బాయ్, ఉన్న సి.ఎల్స్ వాడుకుంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కష్టం. ఎరన్డ్ లీవు కూడా తక్కువే వుంది. అయినా అది డబ్బే కదా! ఒక పని చేద్దాం. సెలవు గిలవు ఏమక్కరలేదు. ఉదయానే వచ్చి, రెండు పూటల సంతకాలు చేసి ఒక గంట ఉండి వెళ్లిపో రోజూ. పదకొండున్నరకు ఇల్లు చేరినా, చదువుకోడానికి బోలెడంత సమయం దొరుకుతుంది. సరేనా?”

వంగి ఆయన కాళ్లకు నమస్కరించబోతే, వారించాడాయన. “పి.జి చేయమని సలహా యిచ్చింది నేను కదా! ఆ మాత్రం సాయం చేయలేనా?” అన్నాడు. ఇంకో రికార్డు అసిస్టెంటున్నాడు. అతని పేరు గంగయ్య. ఇద్దరినీ పిలిచి, “మన శ్యామలరావు పి.జి. పరీక్షలు రాయబోతున్నాడు. అతని వర్క్ మీరిద్దరూ షేర్ చేసుకోంది. సీనియర్ అసిస్టెంట్ పట్నాయక్ గారికి కూడ చెబుతాను” అన్నాడు. వాళ్లిద్దరూ మనసులో ఏమున్నా, ప్రిన్సిపాల్ గారు చెప్పారు కాబట్టి సరే అనక తప్పలేదు.

“అబ్బాయ్, రోజూ పర్మిషన్ లెటరు, ఒక సి.ఎల్ అప్లికేషను నా టీబుల్ మీద పెట్టి వెళ్లాలి. మరచిపోకూడదు. ఒకవేళ ఏ డి.ఇ.ఓ.నో, ఆర్.జె.డి.నో సర్ప్రైజ్ విజిట్ అని ఊడిపడితే దె విల్ కమ్ టు అవర్ రెస్క్యూ. ఇలా సాయం చేస్తున్నానని నేను చెపితే వాళ్లేవీ అనరనుకో..” అన్నాడు.

అలా, చదువుకోవడానికి మంచి టైము దొరికింది. పాత్రో గారి దగ్గరకు వెళ్లి ప్రతి పేపరు నుండి పది వెరీ యింపార్టెంట్ ప్రశ్నలు సెలెక్ట్ చేయించుకున్నాడు. పాత్రో గారు చెప్పారు. “అబ్బాయ్! కొన్ని సబ్జెక్ట్స్ యూనివర్సల్‌గా ఉంటాయి. వాటి మీదే ప్రశ్నలు ప్రతి సంవత్సరం రిపీట్ అవుతుంటాయి. ఉదాహరణకు హెన్రీఫోర్ నాటకం తీసుకుంటే, ‘ఫాల్ స్టాప్స్ రిజెక్షన్: రియాలిటి ఆర్ ఎ మిత్?’ అనే టాపిక్ తప్పక అడుగుతారు. ‘గలీవర్స్ ట్రావెల్స్’ నుండి అది ‘అల్లిగరీ’నా కాదా చర్చించమంటారు. రాబర్ట్ బ్రౌనింగ్‌ను తీసుకుంటే ఆయన అబ్‌స్స్క్యూరిటీ మీదే ప్రశ్న ఉంటుంది. ‘ప్యారడైజ్ లాస్ట్’ నుండి ‘సాతాన్ యాజ్ ది హీరో ఆఫ్ ది ఎపిక్’ అనేదాన్ని వివరించమంటారు.

నా సజెషన్ ఏమిటంటే, ఐదు పేపర్లకు యాభై ప్రశ్నలు సెలెక్ట్ చేశాము కదా! వాటిని బాగా సాధన చెయ్యాలి. అలాగని మిగతావి నిర్లక్ష్యం చేయకూడదు. రోజూ రెండు మూడు ప్రశ్నలు థరోగా ప్రిపేరై, కాగితం మీద చూడకుండా రాయి, సబ్ హెడింగ్స్, కొటేషన్లతో సహా. ఒక్కటి గుర్తుంచుకో. యాభై శాతం అగ్రిగేట్, రెండు సంవత్సరాల మీద రాకపోతే, మనకా పి.జి. సర్టిఫికెట్ నాలుక గీచుకోవడానికి కూడా పనికి రాదు. ఆల్ ద బెస్ట్! గాడ్ బ్లెస్ యు!” అని దీవించి పంపాడా గురువర్యుడు.

రోజూ మూడు ఎస్సేలు ప్రిపేరై, వాటిని చూడకుండా వ్రాసేవాడు. వాటిని శర్వాణి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేసేది. దానివల్ల అతనికి కొంత సమయం మిగిలేది.

సెప్టెంబరు మొదటి వారంలో పరీక్షలు జరిగాయి. సెంటరు బుల్లయ్య కాలేజీకిచ్చారు. రోజూ ఒకటి చొప్పున సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు పరీక్షలు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు వరకు. ఉదయం పన్నెండు లోపు భోజనం చేసి ఒంటిగంట వరకు చదువుకొని, సైకిలు మీద సెంటరుకు వెళ్లేవాడు. శర్వాణి భర్తకిచ్చిన మోరల్ సపోర్టు చాలా గొప్పది.

తొలి పరీక్ష చాలా బాగా వ్రాశాడు శ్యామల రావు. అన్నీ పాత్రోగారు చెప్పిన ప్రశ్నలే వచ్చాయి. రెఫరెన్సెస్ టు ది కాంటెక్స్ కూడా ‘ఎ ఆర్ బి’ అని ఇంటర్నల్ ఛాయిస్ ఉండడం వల్ల అవి కూడా చాలా మటుకు కవర్ చేశాడు. మొదటి పరీక్ష అయింతర్వాత అతనిమీద అతనికే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత శని ఆదివారాలు సెలవులు వచ్చాయి. ముగ్గురూ కలిసి నర్సీపట్నం వెళ్లారు. మురళి శుక్రవారం రాత్రికే వైజాగ్ నుంచి వచ్చాడు.

ఆదివారం ఉదయం అందరూ బస్సులో బయలుదేరి అన్నవరానికి వెళ్లారు. నర్సీపట్నం నుంచి కాకినాడకు కొత్తగా ఎక్స్‌ప్రెస్ బస్సు వేశారు. అది డైరెక్ట్‌గా అన్నవరం వెళుతుంది. సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని వ్రతం చేసుకున్నారు. మధ్యాహ్నం స్వామివారి అన్నదాన సత్రంలో భోజనం చేసి, సాయంత్రం తుని చేరుకొని, లోవతల్లి దర్శనం చేసుకున్నారు. రాత్రికి నర్సీపట్నం చేరుకున్నారు. హోటల్లో టిఫిన్ చేద్దామంటే పెద్దవాళ్లు వద్దన్నారు. రాత్రి తొమ్మిదికి ఇల్లు చేరారు. విశాలాక్షి అందరికీ ఉప్పుడు పిండి చేసింది మాగాయ, మజ్జిగతో తిని పడుకున్నారు

శర్వాణిని కొన్ని రోజులుంచుకొని పంపిస్తామన్నారు జగన్నాథరావు దంపతులు. “మీరు కూడా ఉండండి అత్తయ్యా” అంటూ బ్రతిమిలాడింది శర్వాణి. ప్రసూనాంబ కూడా ఉంటానన్నది. వాళ్లిద్దరి సఖ్యత చూసి మురళి ఒకటే నవ్వడం.

“బావా, అత్తయ్యను కాకా పట్టి బుట్టలో వేసుకుంది మా చెల్లెలు. జాగ్రత్తగా ఉండండి” అంటూ ఆటపట్టించాడు.

సోమవారం పొద్దున ఫస్టు బస్సుకే వైజాగ్ బయలుదేరారు బావా, బావమరిది. ఏడు ముప్పావుకు వైజాగ్‌లో దిగి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న టిఫిన్ బండి దగ్గర ఇడ్లీ, వడ తిన్నారు. తనకు రైలైతే మేలని గరివిడి స్టేషన్‍లో దిగి ఫ్యాక్టరీకి వెళ్లొచ్చని, తొమ్మిదిన్నరకు తిరుపతి – హౌరా ఎక్స్‌ప్రెస్ ఎక్కితే గంటలో గరివిదిలో దిగుతానని చెప్పి మురళి సిటీ బస్సెక్కి స్టేషనుకు వెళ్లిపోయాడు. కాంప్లెక్స్ నుంచి సింహచలం వెళ్ళే 6A నంబరు బస్సులన్నీ స్టేషన్ మీదుగానే వెళతాయి.

శ్యామల రావు తన బ్యాగును క్లాక్ రూములో ఉంచి, బస్సెక్కి పూసపాటిరేగకు చేరుకున్నాడు. పరీక్షలెలా వ్రాశావని ప్రిన్సిపాల్ గారు, ఇతర స్టాఫ్ అడిగారు. “అతని మొహం చూస్తే తెలియడంలా? వెలిగిపోతుంటేనూ” అన్నాడు సీనియర్ అసిస్టెంట్ పట్నాయక్ గారు. ఇంగ్లీషు లెక్చరర్ సూర్యనారాయణ మాత్రం సీరియస్‍గా మొహం పెట్టి “మీరనుకుంటున్నంత ఈజీ కాదు ఎమ్మే ఇంగ్లీషంటే. ప్రయివేట్ క్యాండిడేట్స్‌కు నలభై ఎనిమిది పర్సెంటిచ్చి తొక్కేస్తారు. అదే రెగ్యులర్ వాండ్లకు వేరియస్ కన్సిడరేషన్స్ ఉంటాయి” అన్నాడు. అందరూ ఆయన మనస్తత్వాన్ని అసహ్యించుకున్నారు.

తనతోపాటు క్వశ్చన్ పేపర్లు తెచ్చుకున్నాడు శ్యామల రావు. సాయంత్రం ఒక గంట పర్మిషన్ అడిగి విజయనగరం వెళ్లి పాత్రో మాస్టార్ని కలిశాడు. ఆయనకు అది వరకే ఇతర శిష్యులు పేపర్లు చూపించి ఉన్నారు. తానెలా వ్రాసింది ఆయనకు చెప్పాడు. రెఫరెన్సెస్ టు  ది కాంటెక్స్ట్ ప్రశ్నలలో ఐదూ రాశాడు కాని అందులో రెండు తప్పుగా రాశాడని పాత్రో గారన్నారు. సూర్యనారాయణగారన్నమాటలు ఆయనతో చెబితే ఆయన నవ్వి అన్నారు – “అలాంటిదేం లేదురా అబ్బాయ్! నా స్టూడెంట్సందరూ మరి ప్రయివేటు వాళ్లే.. ఇప్పడీ కరస్పాండెన్సు కోర్సు వచ్చింది గాని, అప్పుడంతా ఫీజు కట్టి పుస్తకాలు కొనుక్కొని రాసుకోవడమే. నా మటుకు నాకు ఏ కోచింగూ లేదు.”

చేతులు జోడించి శ్యామల రావన్నాడు “మీకు కోచింగెందుకు మాస్టారూ?”

ఆయన నవ్వి “కోచింగ్ ఎవ్వరికైనా అవసరమే. పరిస్థితులను బట్టి కొందరికి దొరుకుతుంది, కొందరికి దొరకదు. నేను మా విజయనగరం మహారాజావారి కాలేజీలో బి.ఎ. స్పెషల్ ఇంగ్లీషు తీసుకున్నాను. మా గురువుగారు మహానుభావుడు రోణంకి అప్పలస్వామి గారు. షేక్‌స్పియర్ నాటకాలను ఆయన అద్భుతంగా బోధించేవారు. మాకు సెకండియర్‌లో ‘హామ్లెట్’ ఉండేది.

ఆయనకు టెక్ట్స్ బుక్ అవసరం ఉండేది కాదు రా అబ్బాయ్! నాటకంలోని ప్రతిపాత్రనూ ఆయన డ్రమటైజ్ చేసి చూపేవారు. ఆయన ఇంగ్లీష్ ప్రొనన్సియేషన్ అచ్చం బ్రిటిష్ వారి దాని లాగే ఉండేది. అయిన క్లాసులో పాఠం చెబుతుంటే, పక్క కాసుల వాళ్లు కిటికీల దగ్గర చేరి వినేవాళ్ళు. ఆ గురుదేవుని దయ వల్లే అంతో ఇంతో ఇంగ్లీషు వచ్చింది నాకు” అని కనబడని ఆ గురుదేవునికి చేతులెత్తి నమస్కరించారు మాస్టారు.

“రిటైరైన తర్వాత ఆయన తన స్వగ్రామం టెక్కలికి వెళ్లిపోయారు. ఈ కోచింగు లివ్వడం లాంటివి ఆయనకు నచ్చవు. ఆయనే గనుక వైజాగ్‍లో కోచింగ్ ఇస్తే, వేలకు వేలు సంపాదించేవారు. అటువంటి మహనీయులకు డబ్బు మీద ధ్యాస ఉండదు సుమా! ఇంగ్లీషు కాక మరో పధ్నాలుగు భాషల్లో నిష్ణాతుడాయన.”

కళ్లు తడిగా అయ్యాయి. తమాయించుకొని మళ్లీ ఇలా చెప్పారు. గురువుగారి జ్ఞాపకాలతో పాత్రో మాస్టారి గుండె బరువెక్కింది.

“డిగ్రీ తర్వాత బి.ఇడి చేశాను. గవర్నమెంట్ హైసూల్లో ఉద్యోగం వచ్చింది. తర్వాత ప్రయివేటుగా ఎమ్మే చేశాను. వైజాన్ గుప్తా బ్రదర్స్ బుక్స్ అన్నీ తెచ్చుకొని, స్వయంగా నోట్సు తయారు చేసుకునేవాడిని. అయితే మొదటి అటెంప్ట్ నలభై ఆరు శాతం వచ్చింది. మళ్లీ ఇంప్రూవ్‌మెంట్ రాశాను. అప్పుడు 56 శాతం తెచ్చుకున్నాను.

ఆరేండ్లలో జె.యల్. ప్రమోషన్ వచ్చింది. టీచరుగా రణస్థలంలో పనిచేసేవాడిని. అదే జిల్లా పరిషత్ టీచర్లకు ప్రమోషన్ ఛానల్ లేదు. ప్రమోషనిచ్చి చోడవరానికి వేశారు. పన్నెండేళ్ల జె.యల్.గా పని చేశాను. తర్వాత డిగ్రీ కాలేజీకి ప్రమోషన్ వచ్చింది. ఇంకా మూడేండ్ల సర్వీసుంది. ప్రిన్సిపాల్ ప్రమోషన్ వస్తుందంటున్నారు, కాని నాకు ఇష్టంలేదు. నేను పడిన బాధలు వేరే వాళ్లు పడకూడదని ఈ కోచింగ్, స్టడీ మెటీరియల్ తయారు చేసి యివ్వడం ప్రారంభించాను. ఆ పైడితల్లి అమ్మవారి దయవల్ల నాశిష్యులు దాదాపు పద్దెనిమిది మంది లెక్చరర్లుగా ప్రమోట్ అయినారు ఈ పదేళ్లలో. ఆరు మంది డైరెక్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్టయినారు” అని ముగించారు పాత్రో మాస్టారు. ‘జర్దాపాన్ వేసుకొని అతి సామాన్యంగా ఉండే మాస్టారికి ఇంత కథ ఉందా’ అని ఆశ్చర్యపోయాడు శ్యామలరావు.

“మీరు పని చేసేది ఎం.ఆర్. కాలేజీలో కాదా మాస్టారు?” అనడిగాడు.

“అది ఎయిడెడ్ కాలేజీ రా అబ్బాయ్! నాది గవర్నమెంటు సర్వీసు. నేను ప్రస్తుతం గజపతినగరం కాలేజీలో పని చేస్తున్నాను. అక్కడే రిటైరవుతాను.”

“రోజూ మరి కాలేజీకి..”

“బోలెడు బస్సులు! సాలూరు, రామభద్రపురం పోయే ఎక్స్‌ప్రెస్ లన్నీ గజపతి నగరం మీదుగానే కద పోయేది? గట్టిగా అరగంట కూడా పట్టదు.”

“మీ పిల్లలు మాస్టారూ?”

“ఒక్కత్తే అమ్మాయి. పెళ్లి చేశాము. అల్లుడు భిలాయి స్టీల్ ప్లాంట్ ఇంజనీరు. వాళ్లకు ఇద్దరు పిల్లలు.”

“చాలా సంతోషమండి మాస్టారు! వస్తానండి! సెలవిప్పించండి” అంటూ తాను తీసుకొచ్చిన పావు కేజీ జాంగ్రీల పాకెట్టునీ ఆయన చేతిలో పెట్టి ఆయన పాదాలకు నమస్కరించాడు శ్యామల రావు.

“త్వరగా ఎమ్మే పూర్తి చేసి జె.యల్.వి కావాలని ఆశీర్వదిస్తున్నా” అన్నాడాయన శిష్యుని తల మీద చేయి పెట్టి.

శ్యామల రావు కాంప్లెక్స్‌లో బ్యాగు తీసుకొని, రిక్షా మాట్లాడుకొని డాబాగార్డెన్స్ లోని నెల్లూరి వారి మెస్‌కు వెళ్లాడు. అక్కడ భోజనం చాలా బాగుంటుంది అని చాలా మంది చెప్పగా విన్నాడు.

చాలా రష్‌గా ఉంది మెస్. ఇతనికి సీటు దొరకడానికే ఇరవై నిమిషాలు పట్టింది. పెద్ద అరిటాకు పరచి, నీళ్ల చల్లి తుడుచుకోమన్నాడొకాయన. ఇంకొకాయన ‘సెట్’ తెచ్చి దొండకాయ పచ్చడి, పాలకూర పప్పు, క్యాబేజీ వేపుడు, బంగాళాదుంపల కుర్మా వేసిపోయాడు. ఇంకొకాయన బేసిన్‍లో పొగలు కక్కే తెల్లని సన్న బియ్యం అన్నం తెచ్చి వడ్డించాడు. తర్వాత ఇంకో ‘సెట్’ వచ్చింది. ఒకాయన దాంట్లోంచి కందిపొడి రెండు స్పూన్లు అన్నం మీద వేసి, దాని మీద, పక్కన ధారాళంగా నెయ్యి పోశాడు. నేయి కమ్మని వాసన వస్తూంది. మామిడికాయ ఊరగాయ, గోంగూర నిలవ పచ్చడి కూడా వేశాడు.

కందిపాడి అన్నం తిని, పప్పు కలుపుకుంటూ ఉండగా మజ్జిగపులుసు వచ్చింది. తర్వాత సాంబారు, రసం చిన్న కప్పులతో ఇచ్చారు. చివర్న పెరుగు కప్పు. గట్టిగా పేరుకొని ఉంది. పెరుగన్నంలో ఊరగాయ కలిపి తింటూండగానే పక్కన తడిమీద తన టికెట్టు ఉంచి సీటు రిజర్వు చేసుకున్నాడొక యువకుడు. అరటిపండు, కిళ్లీ కూడా ఇచ్చారు.

పరీక్షలు బాగా రాసిన ఆనందాన్ని ఆ విధంగా నెల్లూరి వారి మెస్‌లో ‘సెలబ్రేట్’ చేసుకున్నాడు శ్యామల రావు, ఒంటరిగా. ఎందుకంటే వాళ్లమ్మ హోటళ్లకు రాదు. ఆమె రాదు కాబట్టి కోడలు రాదు. ‘యథా అత్తా, తథా కోడలూ’ అనుకొని నవ్వుకున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version