Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెతడి-15

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[దాలమ్మ ఎక్కువ సేపు శ్యామల రావు ఇంట్లోనే ఉండడం చూసిన సత్యారావు గారి పనిమనిషి మరిడమ్మ – వెళ్ళి దాలమ్మ మొగుడు పైడిరాజుకి పితురీలు చెప్తుంది. భార్య మీద అనుమానంతో, మద్యం మత్తులో ఉన్న పైడిరాజు శ్యామల రావు ఇంటికొచ్చి గట్టిగట్టిగా అరుస్తాడు. రంకు అంటగడతాడు. శ్యామల రావు ఎంతో నచ్చజెప్తాడు. కాలనీలో ఇరుగుపొరుగు వచ్చి పైడిరాజుని మందలిస్తారు. మర్నాడు మత్తు దిగిన తరువాత పైడిరాజు వచ్చి శ్యామల రావుని క్షమాపణ అడుగుతాడు. దాలమ్మ తన సోదరిలాంటిదని చెప్తాడు శ్యామల రావు.  రధసప్తమి రోజున ఓహెచ్ పెట్టుకుని, అరసవిల్లి సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకుని వస్తాడు శ్యామల రావు. సాహితి పెద్దమనిషి అవుతుంది. ఐదేళ్ళు గడిచిపోతాయి. విశాలాక్షి గారు కాలం చేశారు. తండ్రిని తన దగ్గరకి తీసుకెళ్తాడు మురళి. సాహితి ఇంటర్ సెకండ్ ఇయర్‍లోనూ, సాత్విక్ సెవెంత్ క్లాస్ చదువుతుంటారు. శ్యామల రావును మళ్లీ పెళ్ళి చేసుకొమ్మని చాలామంది హితులు, స్నేహితులు, సన్నిహితులు బలవంతం చేసినా, అతడు ఒప్పుకోడు. శ్యామల రావుకి కొత్తవలస బదిలీ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపాల్ రిటైరవడంతో, ఆయన స్థానంలో కుతూహలమ్మ గారు ప్రిన్సిపాల్‌గా వస్తారు. అడ్మినిస్ట్రేషన్‌లో ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటాడు శ్యామల రావు. – ఇక చదవండి.]

రో ఐదు సంవత్సరాలు గడిచాయి. జగన్నాథరావు గారు కూడా స్వర్గస్తులయ్యారు. మురళి గరివిడి ఫెర్రో అల్లాయ్స్‌లో ఉద్యోగం మానేసి తుని వద్ద తాండవ షుగర్ ఫ్యాక్టరీలో చేరాడు. అతనికి ఉన్న అనుభవం వల్ల అతన్ని ఇంజనీరుగా నియమించుకున్నారు. మురళి ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఉంది. అతని స్వంత యిల్లు బొడ్డేపల్లి సెంటర్లో కట్టించుకున్నాడు. పిత్రార్జితం ఇల్లు రామారావుపేటలో ఉండనే ఉంది. అది బాగా పాతబడిపోయింది. దాని పక్కిల్లు కూడ అదే స్థితిలో ఉంది. రెండూ కలిసి ఏడున్నర సెంట్లు. అంటే దాదాపు మూడువందల గజాలు వస్తాయి. రెండు యిళ్లనూ డిమాలిష్ చేసి, ముందు నాలుగు షాపులు, వెనక రెండు పోర్షన్లు, పైన రెండు పోర్షన్లు ఇద్దరు యజమానులూ కలిసి వేయాలని, చెరో రెండు షాపులు, రెండు పోర్షన్స్ వస్తాయని నిర్ణయించుకున్నారు. విడివిడిగా అయితే అంత విశాలంగా, ప్లాన్డ్‌గా రావు.

మురళి శ్యామలరావుతో చెప్పాడు “బావా, ఆ యింట్లో శర్వాణికి కూడా భాగం ఉంది. నాన్నగారు చనిపోయేముందు కూడా ఆ విషయం నాతో చాలా సార్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో నీవు కూడా ఇన్‌వెస్ట్ చేస్తే సాహితికి ఒక షాపు, ఒక పోర్షన్ ఇవ్వాలని ఉంది. చేయకపోయినా ఇస్తాననుకో..”

“ఒరెయ్ బావా, దేవుడు ఆర్ధికంగా నాకే లోటూ చేయలేదు. ఇంకా ఎందుకు రా ఇవన్నీ..”

“మా చెల్లెలి పిల్లలకు బావా, నీ కోసం కాదు. కాదనకు.”

మొత్తం డిమాలిషన్, కన్‌స్ట్రక్షన్ కాస్టు ఇరవై ఎనిమిది లక్షలవుతుంది. మురళి భాగం పధ్నాలుగు. శ్యామల రావు ఐదు లక్షలు సమకూర్చాడు. నాలుగేళ్ల కిందట ఆనందపురం వద్ద నూటయాభై గజాల ప్లాటు తీసుకొని ఉన్నాడు. దాన్ని అమ్మి, ఆ డబ్బు బావమరిదికిచ్చాడు. రామారావుపేట నర్సీపట్నంలో చాలా ప్రైమ్ ఏరియా అయ్యింది. ఆర్‌టిసి కాంప్లెక్స్‌కు చాలా దగ్గర. వూడా వారి పెట్రోలు బంకు, బజాజ్ మోటార్ బైక్స్ రూము వచ్చాయి. ఇద్దరు ముగ్గురు డాక్టర్లు నర్సింగ్ హోములు తెరిచారు. డిమాండ్ వల్ల పాత ఇళ్లు కూల్చేసి, కమర్షియల్ షాపులు, లేటెస్ట్ ఫెసిలిటీస్‌తో ఇల్లు కడుతున్నారు.

సాహితి వైజాగ్ ఉమెన్స్ కాలేజీలో బి.కాం పూర్తి చేసింది. అది జైలు రోడ్డులో ఉంది. ప్రస్తుతం బ్యాంకింగ్ సర్వీస్ కమీషన్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోంది. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్’ (NSB) అనే సంస్థ డాబా గార్డెన్స్‌లో ఉంది. ప్రతి ప్రధాన నగరంలో దాని శాఖలున్నాయి. అందులో చేరింది సాహితి. ఆ పరీక్షల్లో ఇంగ్లీష్ లాంగ్వేజీ విన్నింగ్ ఫాక్టర్. శ్యామల రావు కూతురికి రోజూ NSB వారిచ్చిన స్టడీ మెటీరియల్ నుంచి కాంప్రెహెన్షన్ ప్యాసేజెస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, సిననిమ్స్, యంటానిమ్స్, ఇడియమ్స్, వన్డే వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, క్లోజ్ టెస్ట్, ఇలా అన్నీ రాత్రి పూట ఒక గంట ప్రాక్టీసు చేయిస్తున్నాడు. హరిమోహన్ ప్రసాద్ వ్రాసిన ‘ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్’ అనీ పుస్తకాన్ని, ‘థాంప్సన్ అండ్ మార్టినెట్’ వ్రాసిన ‘ప్రాక్ట్రికల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఎక్సర్‌సైజెస్’ అన్న పుస్తకాలను ‘హిమాంశు బుక్ సెంటర్’లో కొనుక్కుని తెచ్చిచ్చాడు.

సాహితికి ఇప్పడు ఇరవై ఒకటి. కుందనపు బొమ్మలా ఉంటుంది. శ్యామల రావుకు ఆ అమ్మాయిని చూస్తూంటే తమ పెళ్లయిన కొత్తలో అచ్చం శర్వాణి లాగే కనిపిస్తుంది. దాలమ్మ వీళ్లింట్లో ఇంకా పని చేస్తుంది. సాహితిని ‘శర్వాణమ్మా’ అని పిలుస్తుంది.

సాత్విక్ అంతా నాన్న పోలిక. శ్యామల రావు ఇంటర్మీడియట్‌లో తీయించుకున్న ఫోటోలు చూస్తే అంతా జిరాక్స్ కాపీయే. వాడికి పదహారేళ్లు. ‘నూనూగు మీసాల నూత్నయవ్వనమున’ అని శ్రీనాథుడన్నట్లు, వాడు మంచి హైటు, వెయిటుతో చూడచక్కగా ఉంటాడు. మద్దిలపాలెం లోని శ్రీగాయత్రి జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎం.పి.సి గ్రూపు తీసుకున్నాడు. ఎమ్‌సెట్ కోచింగ్ కూడా ఇస్తారు. బైక్ కొనివ్వమని తండ్రిని వేధిస్తూంటాడు. పద్దెనిమిదేండ్లు నిండేంతవరకు ఆ ఊసు ఎత్తద్దంటాడు శ్యామలరావు. “టెంత్ క్లాసు పిల్లలే నడిపేస్తుంటే నీవేంటి నాన్నా!” అని గారాలు పోతాడు వాడు. మామయ్య మురళితో రికమెండ్ చేయించినా లాభం లేకపోయింది.

మురళి కొడుకు విశాల్ సాత్విక్ కంటి సంవత్సరం పెద్దవాడు. వాడు తునిలో ప్రకాష్ కాలేజీలో బి.యస్.సి కంప్యూటర్స్ చేస్తున్నాడు. నర్సీపట్నం నుంచి తిరగలేడని వాడిని కాలేజి హాస్టల్లోనే ఉంచారు. మురళి మాత్రం ‘హీరోహోండా స్ప్లెండర్’ బైక్ కొనుక్కుని రోజా దాని మీదే తాండవ షుగర్ ఫ్యాక్టరీకి వెళతాడు. తుని నర్సీపట్నం మధ్య అన్నీ అర్డినరీ బస్సులే తిరుగుతుంటాయి. ప్రతి పదినిమిషాలకు ఒక బస్సున్నా, రద్దీగానే ఉంటాయి. కేవలం నలభై కిలోమీటర్లే ఐనా, చాలా పల్లెటూర్లు తగులుతాయి మధ్యలో. దాదాపు గంటన్నర పైనే పడుతుంది. అందుకే బైక్ కొన్నాడు మురళి. నర్సీపట్నం స్టేట్ బ్యాంకులో వెహికల్ లోన్ తీసుకున్నాడు.

శ్యామల రావు రెండు మూడు నెలలకోసారి వీకెండులో పిల్లలను తీసుకొని నర్సీపట్నం వెడుతూంటాడు. అప్పుడు అతనికి తెలియకుండా మామ బైక్ మీద తిరుగుతుంటాడు సాత్విక్. బైక్ నడపడం నేర్పింది కూడా మురళే.

రామారావుపేటలో షాపులు, పోర్షన్లు కట్టడం పూర్తయింది. తనకొచ్చిన వాటిల్లో ఒక షావును, ఒక పోర్షన్‌ను మేనకోడలి పేర ‘గిఫ్ట్ డీడ్’ రాసి యిచ్చాడు మురళి.

“మీ చెల్లెలిలా ఉంటుందని అన్నీదానికేనా మామయ్యా! నాకేం లేదా?” అని అడిగాడు సాత్విక్ నవ్వుతూ.

“ఒరేయ్ నాకో కూతురుంటే ఉంటే కథ వేరేగా ఉండేది. ఛాన్సు మిస్సయ్యావురా. నీకు బైక్ కొనిపెడతాలే అల్లుడూ” అన్నాడు మురళి.

“ఓన్లీ ఆఫ్టర్ ఎయిటీన్, మై డియర్ బ్రదరిన్లా!” అన్నాడు శ్యామలరావు.

సాత్విక్ నాన్న వైపు గుర్రుగా చూసేసరికి అంతా నవ్వుకున్నారు.

***

కాలం పరుగులు పెడుతూనే ఉంది. క్యాలెండర్‍లో కాగితాలు మారిపోతూ ఉన్నాయి. బి.యస్.ఆర్.బి. ప్రకటన వచ్చింది, జాతీయ బ్యాంకుల్లో కర్క్ కమ్ క్యాషియర్ పోస్టులు పద్దెనిమింది వందల అరవై నింపుతున్నట్లు. అర్హత ఎనీ డిగ్రీ, పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అని అన్ని న్యూస్ పేపర్లతో యాడ్ యిచ్చారు. యన్.యస్.బి వాళ్ళే అప్లికేషను తెప్పించి, తమ విద్యార్థులతో నింపించి, షోటోలు, డిమాండ్ డ్రాఫ్ట్ పరీక్ష ఫీజు కోసం, అన్నీ పంపించారు.

కొందరు మెరిట్ స్టూడెంట్స్‌ను ఎన్నిక చేసి వారికి ఇంటెన్సివ్ కోచింగ్ యివ్వసాగారు. దానికి అదనపు ఫీజు ఏమీ లేదు. వీళ్లు కొంతమంది సెలెక్ట్ అయినా, వాళ్ల సంస్థకు పేరు వస్తుంది కదా! ఆ మెరిట్ స్టూడెంట్స్‌లో సాహితి కూడా ఉంది

ఎగ్జామినేషన్ సెంటర్ వైజాగ్‍లో లంకపల్లి బుల్లయ్య కాలేజీకి, ఎ.వి.ఎన్ కాలేజీకి యిచ్చారు. అంతా ఆబ్జెక్టివ్ టైపు లోనే ఉంటుంది. ఒక ఓ.ఎమ్.ఆర్ షీటు ఇస్తారు. అందులో ప్రశ్నల నంబర్లు, వాటి ఎదుట ఐదు చిన్న వృత్తాలు ఉంటాయి. వాటికి ఎ, బి, సి, డి, ఇ అన్న గుర్తులుంటాయి. క్వశ్చన్ బుక్‌లెట్‍ను చదివి ఆ సంబంధిత ప్రశ్న ఎదురుగా ఉన్న వృత్తాల్లో, ఏది సరైన జవాబో, ఆ అక్షరం పైనున్న వృత్తాన్ని హెచ్.బి. పెన్సిల్‍తో డార్కెన్ (నలుపు) చెయ్యాలి అంతే! జవాబు మార్చుకుంటే ఎరీజర్‌తో నల్లరంగు తుడిపేసి, వేరే దాన్ని చేయవచ్చు. యన్.యస్.బి వాళ్ళు మాడల్ టెస్ట్స్ నిర్వహించారు చాలా. కాబట్టి సాహితికి కొత్తగా ఏమి అనిపించలేదు. తల్లిని, వరాహ నరసింహస్వామిని తలుచుకొని, ఆన్సర్ చేయడం మొదలుపెట్టింది. ముందు బాగా తెలిసినవన్నీ చేసేసి, తర్వాత మిగతావి పూర్తిచేసింది.

రెండు నెలల తర్వాత రిజల్టు వచ్చింది. సాహితి రిటన్ ఎగ్జామ్‌లో సెలెక్టయింది! దానికి ఎనభై శాతం వెయిటేజ్ ఉంటుంది నెలరోజుల తర్వాత ఇంటర్వ్యూకు కాల్ లెటరు వచ్చింది. ఇంటర్వూ హైదరాబాద్‍లో.

శ్యామలరావు కూతుర్ని తీసుకొని గోదావరి ఎక్స్‌ప్రెస్‍లో బయలుదేరాడు. ఉదయం సికింద్రాబాద్ స్టేషనులో దిగి, ఎదురుగ్గా ఉన్న ‘పద్మజ’ లాడ్జిలో రూం తీసుకున్నారు. స్నానాలు చేసి, పక్కనే ఉన్న రాఘవేంద్ర భవన్‌లో టిఫిన్ చేశారు. ఇంటర్వ్యూ పదకొండుకు.

“తల్లీ, ఇక్కడ ఆల్ఫాహొటల్లో ఇరానీ చాయ్ చాలా ప్రసిద్ధి. తాగుదాం పద” అని అక్కడకు తీసుకొనివెళ్లాడు. టోకెన్ తీసుకొని, టీ తెచ్చుకోవడానికే పావుగంట పట్టింది. చాలా రష్‌గా ఉంది.

“టీ అద్భుతంగా ఉంది నాన్నా!” అన్నది కూతురు.

“ఈ హోటలు రౌండ్ ది క్లాక్ పని చేస్తుందమ్మా. వినడమేగాని, నేనూ ఇదే మొదటిసారి యిక్కడ టీ తాగడం. మన వైజాగ్‌లో ఇలాంటి టీ దొరకదు.”

ఆటో మాట్లాడుకుని బ్యాంక్ స్ట్రీట్‌కి వెళ్లారు. అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి రీజనల్ ఆఫీసులో ఇంటర్వూలు జరుగుతున్నాయి. వెళ్లి అక్కడ వేసి ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. సాహితికి అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి.

“ఎందుకో నెర్వస్ ఉంది నాన్నా” అంది. కూతురి చేయి తన చేతిలోకి తీసుకుని నొక్కుతూ “ఏం టెన్షన్ పడకు తల్లీ! దీనికి ఇరవైశాతమే వెయిటేజ్. ధైర్యంగా జవాబు చెప్పు. తెలియకపోతే తెలియదని చెప్పు. దట్సాల్! మీ అమ్మ నిన్ను కాపాడుతూ ఉంటుంది. మన వరాహస్వామిని తలుచుకో” అని చెప్పాడు.

సాహితి పేరు పిలిచారు. కళ్ళతోనే కూతురికి మరో సారి ధైర్యం చెప్పాడు. ఇరవై నిమిషాల తర్వాత సాహితి బయటకొచ్చింది. ఆత్మవిశ్వాసంతో ఆ అమ్మాయి ముఖం వెలిగిపోతూఉంది. తండ్రికి ‘థమ్స్ అప్’ సింబల్ చూపింది. తనంత ఎత్తున్న కూతుర్ని అక్కున చేర్చుకొన్నాడు శ్యామల రావు.

“ఏమేం అడిగారురా?” అన్నాడు బయటకు వస్తూ.

“అన్నీ ఇన్‍ఫార్మల్ క్వశ్చన్సే నాన్నా! ఎడ్యుకేషన్ గురించి, అభిరుచుల గురించి.. సర్టిఫికెట్స్ చూశారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని అడిగారు. లేదు, నేర్చుకుంటాను అని చెప్పాను. ‘నీ జీవితంలో నీవు అత్యధికంగా అభిమానించే వ్యక్తి ఎవరు?’ అని అడిగారు” అని తండ్రి వైపు ఆర్తిగా చూసింది.

“మీ అమ్మే అని చెప్పి ఉంటావు. అవునా?”

“కాదు. మా నాన్న అని చెప్పాను. ఎందుకంటే మాకు అమ్మా నాన్నా నీవే కదా నాన్నా!” ఆ అమ్మాయి గొంతు గద్గదమైంది.

“సరిపోయింది! ఇంకా ఏ మదర్ తెరీసానో, అబ్దుల్ కలామో అని చెబుతావనుకున్నా” అని నవ్వాడు శ్యామల రావు.

అబిడ్స్ లోని తాజ్‍మహల్ హోటల్లో భోజనం చేశారు. భోజనం చాలా బాగుంది. నాలుగు చిన్న చిన్న పూరీలు ఇచ్చాడు. ఒక కప్పులో ఒక గులాబ్ జాం. ఐస్‍క్రీం కూడా.

“నాన్నా, గులాబ్ జాం ఐస్‌క్రీంతో కలిపి తింటే చాలా బాగుంటుంది. మా ఫ్రెండు చెప్పింది. ఒకసారి జగదాంబ సెంటర్లోని శివరాం స్వీట్సుతో దాని బర్త్‌డే రోజు తినిపించింది.”

కూతురు చెప్పినట్లు విని, తిని, అంతగా నచ్చకపోయినా, “చాలా బాగుంది రా తల్లీ” అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ!

రూముకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఎనిమిదిన్నరకు ‘గరీబ్‍రథ్’కు వీళ్లకు రిజర్వేషన్ ఉంది. సాయంత్రం బిర్లామందిర్, ట్యాంక్‌బండ్ మీద మహనీయుల విగ్రహలు చూశారు. బుద్ధుని విగ్రహం కూడా. ఏడు గంటలకు హోటల్ సన్మాన్‍లో ఇడ్లీ, రవ్వదోసె తిన్నారు. రూం ఖాళీ చేసి రైలెక్కారు. ఉదయం ఏడున్నరకు విశాఖ చేరారు.

శ్యామల రావు ఆ రోజు గంట లేట్ పర్మిషన్ ముందుగానే పెట్టి ఉన్నాడు. కాలేజీకి వెళుతూనే కుతూహలమ్మ గారు నవ్వుతూ అతనికి షేక్‌హ్యాండ్ యిచ్చారు. మిగతా స్టాఫ్ కూడా అభినందనలు తెల్పుతున్నారు. ఎందుకో అతనికి అర్థం కాలేదు.

“కాబోయే ప్రిన్సిపాల్ గారికి స్వాగతం!” అన్నారు ప్రిన్సిపాల్‍గారు. నెలరోజుల క్రితమే డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ (D.P.C) భేటీ అయింది. ప్రిన్సిపాల్స్ ప్రమోషన్ల సీనియారిటీ లిస్టులో మూడవ పేరే శ్యామల రావుది. ఫస్ట్ జోన్లో ఏడు పోస్టులు నింపారు. విశాఖ జిల్లాలో మూడు, విజయనగరం జిల్లాలో ఒకటి, శ్రీకాకుళం జిల్లాలో మూడు. ఈరోజు ఉదయాన్నే ఆర్డర్స్ వచ్చాయి. ప్రిన్సిపల్ ప్రమోషన్ వస్తే జిల్లా మారుస్తారు. శ్యామల రావుని రణస్థలం కాలేజీకి వేశారు.

శ్యామల రావు సంతోషించాడు. శర్వాణి ఉంటే ఎంత హంగామా చేసేదో! అనుకున్నాడు. తనను బలవంతంగా పి.జి ఇంగ్లీషు కట్టించి, దగ్గరుండి చదివించి, తన పరిధిలో సాయంచేసి తనను జె.యల్‍ను చేసిందే శర్వాణి. ఆమెను తల్చుకుని కళ్లు చెమర్చుకున్నాడు.

కుతూహలమ్మగారు లేచి వచ్చి అతన్ని అక్కున చేర్చుకున్నారు. “ఐ నో యు రికలెక్ట్ యువర్ వైప్ హు మోటివేటెడ్ యు. కంపోజ్ యువర్ సెల్ఫ్” అన్నారు.

అతనికీ శర్వాణి ఉన్న అనుబంధాన్ని స్టాఫ్‌కు వివరించారామె. “షి లివ్స్ ఇన్ యువర్ మెమరీస్ ఫర్ ఎవర్, శ్యామూ” అన్నది.

ఆ రోజు ఎఫ్.ఎన్. రిలీవైనాడు శ్యామల రావు. అందరికీ స్వీటు, హాటు కూల్ డ్రింక్స్ తెప్పించాడు. అందమైన లక్ష్మీనరసింహస్వామి వారి ఫోటో ప్రేమును, ఒక వెండి గణేశుని విగ్రహాన్ని అతనికి బహూకరించి, శాలువా కప్పారు.

సీనియర్ అసిస్టెంట్ గోపాత్రుడు గారన్నారు. “మా నాన్-టీచింగ్ క్యాడరు నుంచి ఇంగ్లీషులో పి.జి. చేసి, జెయల్‌గా ప్రమోషన్ పొందడమే కాదు, ప్రిన్సిపాల్‍గా ఈరోజు పదవిని పొందిన మన ఇంగ్లీషు మాస్టారు శ్యామల రావును చూసి మా క్యాడరంతా గర్వపడుతున్నాం.”

లెక్కల మాస్టారు బాలకృష్ణగారు హాస్యచతురుడు. “మనోడు నక్క తోక తొక్కినట్లున్నాడు. ఈ ఏడింట్లో రెండు మహా భయంకరమైన ప్లేసులు – ఒకటి మన డుంబ్రిగుడ, రెండు శ్రీకాకుళం జిల్లా భామిని. రెండూ ఏజన్సీలే. రెండూ నక్సలైట్ ఏరియాలే. వాటిల్లో దేనికి వేసినా దూల తీరిపోయేది మనోనికి.” అందరూ నవ్వారు.

“రణస్థలం ఏముంది. హైవే మీదే ఉంది. కొమ్మాది నుంచి గట్టిగా నలభైఐదు కిలోమీటర్లు. నాన్-స్టాప్‌లు ఆపరు గాని ఎక్స్‌ప్రెస్‌లన్నీ ఆపుతారు. అసలు మనోడు బండి మీదే ఎలిపోవచ్చు. నాలాంటోడు అయితే, కోపమొస్తే, నడిచెల్లిపోగలడు” మళ్లీ నవ్వులు.

చివర్లో శ్యామల రావు కృతజ్ఞతలు చెబుతూ, “మా నాన్నగారు సింహాద్రి రావు గారు ఆ కాలేజీలో సీనియర్ అసిస్టెంట్‌గా చేశారు. అప్పుడు నేను ఆ ఊరి హైస్కూల్లోనే సెవెంత్, ఎయిత్, నైన్త్ చదివాను. ఇప్పుడు అదే కాలేజీకి ప్రిన్సిపాల్‍గా వెళుతున్నాను. అంతా భగవంతుని దయ, మీలాంటి పెద్దల ఆశీర్వాదం. అన్నిటినీ మించి స్వర్గస్థురాలైన నా భార్య శర్వాణి ప్రోత్సాహం, సహకారం” అన్నాడు.

కుతూహలమ్మగారు, “శ్యామూ, రేపు జాయినింగ్‌కి నేనూ నీ వెంట వస్తాను. పాత్రుడుగారూ, మీరూ రండి. నా కారులో వెళదాం” అన్నారు. ఆవిడ మధురవాడలో ఉంటారు. “మీ ఇద్దరూ ఉదయం పావు తక్కువ తొమ్మిదికి మా యింటికి వచ్చేయండి. టిఫిన్లు మా యింట్లోనే. తొమ్మిదికి బయలుదేరినా పదికల్లా రణస్థలంలో ఉంటాము” అన్నారు.

జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి ఎదిగి నలభై ఎనిమిదేళ్లకే ప్రిన్సిపాల్ కావడం అరుదని అందరూ చెప్పుకున్నారు.

మర్నాడు కతూహలమ్మ గారి కారులోనే రణస్థలం వెళ్లారు. వంట మనిషితో మసాలా దోసెలు చేయించిందామె. ఉదయం పది నలభైకి జాయినింగ్ రిపోర్టు రాసి, డి.వి.ఇ.ఓ గారికి, ఆర్‌జెడి గారికి పంపమని సీనియర్ అసిస్టెంట్‌కు చెప్పాడు. ఆయన పేరు ముఖలింగేశ్వరావు.

“నేను రికార్డు అసిస్టెంటుగా హీర మండలంలో చేసేటప్పుడు మీ నాన్నగారి గురించి అనుకునే వారండీ మాస్టారు!” అన్నాడాయన.

ప్రిన్సిపాల్‍ని కూడా సార్ అనకుండా మాస్టారూ అనే అంటారు స్టాఫ్ చాలామంది. జోన్ వన్‍లో ప్రతి ప్రిన్సిపాల్ ఒకప్పటి మాస్టారే కదా.

“ఇంకా పదేళ్ళు సర్వీసుంది కాబట్టి మా శ్యామూ డి.వి.ఇ.ఓ. ఐనా ఆశ్చర్యం లేదు. అప్పటివరకు నేనుంటానో లేదో మరి” అన్నారు కుతూహలమ్మగారు.

“మొదట అన్నారు చూడండి అది బాగుంది. రెండోమాట అస్సలు బాగులేదంది మేడంగారు” అన్నాడు గోపాత్రుడు.

“అతని సంగతి సరేగాని మీరు డి.వి.ఇ.ఓ లిస్టులో ఉన్నారు కదండి” అన్నాడు ముఖలింగేశ్వరరావు.

“ఇక రెండేళ్ళు కూడా లేదు నా సర్వీసు. వస్తే మంచిది. రాకపోతే మరీ మంచిది” అన్నారామె నవ్వుతూ.

మర్నాటి నుండి ఎక్స్‌ప్రెస్ బస్సులో వెళ్లి వచ్చేవాడు కాలేజీకి. నాన్-టీచింగ్ బ్యాక్‌గ్రౌండ్, కుతుహలమ్మగారికి అసిస్టెన్స్ అతని ప్రిన్సిపాల్ ఉద్యోగాన్ని సులభతరం చేశాయి. రోజూ దాదాపు వంద కి.మీ. స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి బస్సే ప్రిఫర్ చేశాడు. ఒక్కోసారి కొమ్మాదిలో సీటు దొరికేది కాదు.

సాత్విక్ ఇంటర్లో తొంబై ఒక్కశాతం తెచ్చుకుని ఎమ్‌సెట్ పరీక్ష వ్రాశాడు. అందులో మంచి ర్యాంకే వచ్చింది కాని, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రాలేదు ‘రఘు’లో కాని’ గీతం’ లో కాని వస్తుంది. ‘గీతం’లో క్యాంపస్ సెలెక్షన్స్ బాగుంటాయని అందులో చేరాడు. అది భీమిలీకి వెళ్లే బీచ్ రోడ్‍లో ఉంటుంది. చాలా పెద్ద క్యాంపస్. కంప్యూటర్ సైన్సు తీసుకొన్నాడు.

మాటిచ్చినట్లే మురళి మేనల్లునికి బైక్ కొనిపెట్టాడు. ‘హోండా ప్యాషన్’. డెబ్బై వేలయింది. శ్యామల రావు ఆ డబ్బు ఇవ్వబోతే మురళికి కోపం వచ్చింది. తీసుకోలేదు. శ్యామల రావు మాత్రం తన పాత ‘ప్రియ’నే వాడుతున్నాడు. విశాల్ బి.ఎస్సీ, వచ్చే సంవత్సరం పూర్తవుతుంది. తర్వాత పి.జి. చేస్తాడట.

పదిహేను రోజుల తర్వాత సాహితికి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ వచ్చాయి. ఆంధ్రా బ్యాంకుకు కేటాయించారా అమ్మాయిని. రాజమండ్రి లోని ఇన్నీసుపేట బ్రాంచికి వేశారు. చేరడానికి వారం రోజులు టైం ఇచ్చారు.

యన్.యస్.బి వారి డాబాగార్డెన్స్ బ్రాంచి నుంచి ఎనిమిది మంది సెలెక్టయ్యారు. వారికి ఒక ఫెలిసిటీషన్ ఏర్పాటు చేసింది యాజమాన్యం. పేరెంట్స్‌ని కూడా అహ్వనించారు. శ్యామల రావు సాత్విక్ వెళ్లారు. అపాయింట్‌మెంట్ ఆర్డరు అమ్మ ఫోటో ముందు పెట్టి కళ్ల మూసుకొని ప్రార్థించింది. దీపారాధన చేశాడు నాన్న. పేపర్లలో కూడా సెలెక్టయిన వారి ఫోటోలను, పేర్లను ప్రకటనగా యిచ్చింది యన్.యస్.బి.

ఫెలిసిటీషన్ ముందు పి.ఆర్.వో. గారు శ్యామల రావును పక్కకు పిలిచి, “అమ్మాయిని, మా కోచింగ్ వల్లే జాబ్ సాధించానని చెప్పమనండి, ఎవరైనా విలేఖరులడిగినా కూడా” అని అభ్యర్థించాడు

“నిజం కూడా అదే కదండీ!” అన్నాడు శ్యామల రావు మనస్ఫూర్తిగా.

“థాంక్యూ సార్! అది మీ సంస్కారం! గత సంవత్సరం ఒకాయన అలా చెప్పమంటే తన కెంతిస్తారని అడిగాడు.”

శ్యామల రావు “అది ఆయన సంస్కారం!” అని నవ్వాడు. సాహితి కూడా అలానే చెప్పింది. కాని “లింగ్విస్టిక్ స్కిల్స్‌లో మా నాన్నగారు నాకు ఇచ్చిన గైడెన్స్ కూడా నా విజయానికి మరింత దోహదం చేసింది” అని చెప్పింది. అది కూడా నిజమే కదా!

మంచిరోజు చూసుకొని, మురళి, శ్యామల రావు సాహితిని జాయిన్ చేసి వచ్చారు. పెద్ద బ్రాంచే. మేనేజరు నార్త్ ఇండియన్. ఆయన పేరు హృషీకేశ్ గౌతమ్. యాభై ఏళ్లు దాటి ఉంటాయి. ఆ రోజు స్టేషన్ దగ్గర లాడ్జిలో ఉన్నారు. మర్నాడు దానవాయిపేట లోని ఒక వర్కింగ్ వుమెన్స్ హాస్టల్‍లో సాహితిని చేర్పించారు. ఇద్దరు కలిసి ఒక రూం షేర్ చేసుకోవాలట. మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ కూడా ఇస్తారట. రెండు సింగిల్ బెడ్స్, అటాచ్డ్ బాత్ రూం, ఫ్యాను ఒక టేబులు, రెండు కుర్చీలు ఉన్నాయి రూములో. కిటికీ ఉంది. ముఖ్యంగా బ్యాంక్‌కు అంత దూరం కాదు.

ఎన్నో జాగ్రత్తలు చెప్పి వచ్చేశాడు శ్యామల రావు, మురళితో. వస్తూంటే దుఃఖం వచ్చింది. ఎన్నడూ సాహితిని విడిచి ఉండలేదు. ఆ అమ్మాయికి కూడా నాన్న వెళ్లిపోతుంటే కన్నీళ్లు వచ్చాయి. బ్యాంకు శనివారం మధ్యాహ్నం వరకే కాబట్టి, సాయంత్రం నాలుగు గంటలకు ‘జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌’లో వచ్చేయమనీ, మళ్లీ సోమవారం జన్మభూమికి వస్తే బ్యాంకు టైము లోపే రాజమండ్రి చేరుకోవచ్చనీ చెప్పాడు మురళి. సెకండ్ సాటర్ డే మాత్రం ఉదయం తిరుమలకు వచ్చేయొచ్చు అని చెప్పాడు.

ఇద్దరూ ఈస్ట్‌కోస్ట్‌లో తిరుగు ప్రయాణమయ్యారు.

(ఇంకా ఉంది)

Exit mobile version