[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[శ్యామల రావు, మురళి వెళ్ళాకా, డా. పినాకపాణి గారి భార్య లోపలికి వస్తుంది. ట్రీట్‌మెంట్‌లో భాగంగా తననీ, కొడుకుని చంపెయడం ఎన్నోసారని అడుగుతుంది. వాళ్ళు టిఫిన్ తింటూంటే అమెరికా నుంచి కొడుకు ఫోన్ చేస్తాడు. తల్లిదండ్రులిద్దరూ కొడుకుతో సంతోషంగా మాట్లాకుంటారు. మీరు అబద్ధాలు చెప్పారని, మీ పేషంట్లకి తెలిస్తే ఎలా అని భార్య అడిగితే, మన దేశంలో సైకియాట్రిస్ట్ దగ్గరకి తరచూ రారని, ఒకవేల నయమయ్యాకా తెలిసినా స్పోర్టివ్‍గా తీసుకుంటారని చెప్తారు. డాక్టరుగారు చెప్పినవన్నీ తల్లిదండ్రులకు చెప్తాడు మురళి. మర్నాడు భార్యని కొడుకుని తీసుకుని గరివిడి వెళ్ళిపోతాడు. శ్యామల రావు డ్యూటీలో జాయినవుతాడు. అత్తయ్యను మామయ్యను నర్సీపట్నం పంపించేస్తాడు. అన్ని పనులు తాను చేస్తూ, పిల్లలకు నేర్పుతూ కాలం గడుపుతాడు. ఓ సాయంత్రం బాబా గారికి గుడికి తీసుకువెళ్తాడు పిల్లల్ని. తనకు వచ్చిన విధంగా వంట చేసి పెడుతుంటాడు. పిల్లలు ఫిర్యాదు చెయ్యకుండా సర్దుకుపోతుంటారు. శర్వాణి సంవత్సరీకాలు పూర్తయ్యాక, శ్యామల రావుని మరో పెళ్ళి చేసుకోమని జగన్నాథరావు కోరితే, కాదంటాడు. శర్వాణియే తన ప్రాణమని అంటాడు. పనిమనిషి దాలమ్మ వీళ్ళ ఇంట్లోనే ఎక్కువ సేపు గడుపుతూ పిల్లలకి సాయం చేస్తూ ఉంటుంది. సాత్విక్‍కి జ్వరం వస్తే సపర్యలు చేస్తుంది దాలమ్మ. – ఇక చదవండి.]
సత్యారావుగారి పనిమనిషి మరిడమ్మ తలుపు దగ్గ రకొచ్చి వీళ్లిద్దర్నీ చూసింది. ఆమె కళ్లు విచ్చుకున్నాయి, భగ్గుమన్నాయి. “ఏటే, సాల్మన్ రాజు గారింటికి ఎల్లనేదంట! ఈడనే కూకుండి పోనావేటి?” అని పలకరించింది. వాళ్లిద్దర్నీ ఆసక్తిగా గమనించింది.
“సిన్నబావుకు జొరమే మరిడీ! అందుకే ఉండిపోనాను. మాట్టారు బావు ఒక్కడూ ఇబ్బంది పడతన్నాడని” అన్నది దాలమ్మ.
బాబుకు బట్టలు విప్పి, తడిగుడ్డతో ఒళ్లంతా తుడిచింది. డ్రస్ వేరేది, మొత్తటి కాటన్‍ది వేసింది. “నీవు వెళ్ళు దాలమ్మా! నేను చూసుకుంటాను లే” అన్నాడు.
దాలమ్మ ఇంటికి పోయేసరికి మరిడమ్మ తన యింట్లోచి రావడం కనబడింది. ఇద్దరివీ పక్కపక్క గుడిసెలే. వెంచర్లలోని ఖాళీ ప్లాట్లలో గుడిసెలు వేసుకొని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి, ఇళ్లతో పాచి పనులు చేసుకోడానికి, కన్‌స్ట్రక్షన్ పనులకు బీదాబిక్కీ జనాలు వచ్చిఉంటారు.
దాలమ్మ లోపలికి వెళ్లింది. పైడిరాజు చుట్ట కాలుస్తూ కూర్చుని ఉన్నాడు. “ఏటీ ఇంత నేటు? మాట్టారు నిన్నగ్గనేకపోయినాడా, నీవు మాస్టారి నొగ్గలేక పోయినావా?” అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ.
“ఏటి మావా ఆ మాట్లు. సిన్నబాబుకు జొరంగా ఉంటే సూసుకొని వత్తన్నాను.”
“మీ యవ్వారం తెలిసిపోనాదిలే, గుడిసేటి నంజ! మీ యికయికలు, యికటాలూ, ఒకరి మీద ఒకరు పడిపోవడం, నాకు తెల్దనుకున్నావేటి?”
“చీ నోర్ముయ్ ముదనష్టపోడా! నీ జిమ్మడ! దేవుడిలాంటి మాట్టారు బావుకీ, నాకూ రంకు కడతన్నావేటిరా దొంగ సచ్చినోడ!” అంటూ మగని మీది కెళ్లింది దాలమ్మ.
“ఆడి పెల్లాం గోరమైన సావు సచ్చింది! వయసులో ఉన్నాడు. పిటపిటనాడుతూ నివ్వు రడీగ అగపడినావు. ఆడు ఎర్రగ బుర్రగ అగుపడేతలికి కోకిప్పుకోని అడి పక్కన తొంగుంతన్నావు!”
రెండు చెవులూ మూసుకుంది ఆ యిల్లాలు. “నీది నాలుకా, తాటిపట్టా, నీ నోరు పడిపోను! నీ దూము తగల!”
పైడిరాజు గభాలున లేచి, దాలమ్మ కొప్పు దొరకబుచ్చుకుని వీపు మీద దభీ దభీమని పిడిగుద్దులు గుద్దాడు. “రేపటాల నుంచి ఆడింటికి పని కెళ్లావో, నా సేతిలో సచ్చినావే రంకు నంజ!” అన్నాడు వగరుస్తూ.
దాలమ్మ మగని పట్టు విడిపించుకొని, మరిడమ్మ గుడిసెకు పరిగెత్తింది.
“మరిడి లంజ! రావే బయటికి! నా మొగునితో ఏం సెప్పినావే పితూరీల ముండ! ఇయాల నా సేతిలో నీ బుర్ర పగిలిపోకపోతే అడుగు, నా సయితి” అని అరవసాగింది.
మరిడమ్మ బయటకు వచ్చి “నానీట సేసినానే మాయదారి గుంట! నీ యవ్వారం బయట పడిందని నా ఇంటి మీదికెలిపొచ్చినావేటి? ఏదన్నా ఉంటే మీరూ మీరూ చూసుకోండే” అని కేకలు వేసింది.
“నంగనాచి ముండ! నీ ఛాయాదేవి ఏసాలు నా కాడ పనికి రావు” అంటూ మరిడమ్మ జుట్టు పట్టుకుంది. ఇద్దరూ పైట కొంగలు బొడ్లో దోపి కొట్టుకోసాగారు. చోద్యం చూడడానికి చుట్టు పక్కల గుడిసెల వాళ్లు గుమిగుడారు. పైడిరాజు బయటికి వచ్చి, “మూడు నెలలు జీతమియ్యకపోయినా ఆడిల్లు ఇడిసిపెట్టలేదు దొంగనంజ! అప్పుడైనా అనుమానం రాలేదు నాకు” అన్నాడు.
మొగుడు తిడితే ముష్టోడు తిట్టాడని, సాక్షాత్తూ దాలమ్మ మొగుడే భార్యకు రంకు కడుతూంటే అందరికీ అలుసయింది దాలమ్మ.
ఆ రోజు రాత్రి బాగా తాగి శ్యామల రావు ఇంటి మీదకు వెళ్లాడు పైడిరాజు.
“నీవు మొగోని వైతే రా బైటికి! ఇయ్యాల నీవో నేనో తేలిపోవాల” అని అరుస్తున్నాడు. కేకలకు శ్యామల రావు బయటకు వచ్చాడు. తాగి అరుస్తున్న వ్యక్తి ఎవరో కూడ అతనికి తెలియదు
“ఎవరయ్యా నీవు? ఎందుకలా కేకలేస్తున్నావు?” అని అడిగాడు.
“నాను దాలమ్మ పెనిమిటిని. దాంతో కులకతన్నావంట! మరేదగా ఉండదు సెబుతున్నా”
శ్యామల రావుకు విషయం అర్థమయింది. ‘వచ్చినవాడు తాగి ఉన్నాడు. వాడికెలాగూ మెదడు పని చేయదు. తానూ విచక్షణ కోల్పోతే ఎలా’ అనుకుని వాడి దగ్గరకు వెళ్లాడు.
“బాబూ, చాలా పొరపాటు పడుతున్నావు. దాలమ్మ నాకు చెల్లెలి లాంటిది. నా భార్య చనిపోయినప్పటినుంచి నా పిల్లలను కంటికి రెప్పలా కాచుకుంటుంది. ఎవరో చెప్పిన మాటలు విని ఆ ఉత్తమ యిల్లాలి మీద అభాండాలు వెయ్యకు. నా పిల్లల మీద ఒట్టు; నీకు చేతులెత్తి మొక్కుతాను. గొడవ చెయ్యకుండా వెళ్లిపో” అన్నాడు.
ఈ లోపు సత్యారావు, సాల్మన్ రాజు వచ్చారు. “ఏమిట్రా పైడిరాజూ, మాస్టారి యింటి మీదికొచ్చి కేకలు! ఆయన సంగతి మాకందరికీ తెలుసు. నీవు తాగొచ్చి వాగితే నిజమనుకోరు ఎవ్వరూ! ప్రపంచంలో ఎవరికీ రాని కష్టం వచ్చిందాయనకు. అలాంటి మనిషిని పట్టుకుని నిందలు వేస్తావా? బుద్ధి లేదూ ఇడియట్!” అని వాడిని తిట్టారు సాల్మన్ రాజుగారు.
శ్యామల రావు సౌమ్యత, రాజుగారి మందలింపు వాడిమీద పనిచేశాయి. తల వంచుకొని ఏదో గొణుగుతూ వెళ్ళిపోయాడు.
మర్నాడు దాలమ్మ యథాప్రకారం పనికి వచ్చింది. ఆమె వెళుతూంటే మొగుడు చూస్తూ ఉన్నాడు. వద్దని అనలేదు. దాలమ్మను చూసి. శ్యామల రావు “అమ్మా, ఈ రోజు నుంచి మా యింట్లో పనికి రావొద్దు. నా వల్ల నీ కాపురంలో కలతలు రాకూడదు. ఏమనుకోకు దాలమ్మా” అన్నాడు.
దాలమ్మ నవ్వింది. “బావూ, ఈ నోకముందే, శానా శెడ్డది బావు. మావోడు మంచోడే. ఆ మరిడి ముండ ఆడి సెవుల్లో ఇసం పోసేసినాది. దేవుడు బావు తవురు. నేను పనిమానేస్తే ఆ పితూర్లదాయన్నది నిజమేనేటే, ముకం సెల్లక పని మానేసినాదనుకుంటారు” అన్నది.
శ్యామల రావు ఏం చేయాలో తోచక ఆలోచిస్తూంటే, పెళ్లాం వెనకాలే వచ్చి అంతా వింటున్న పైడిరాజు లోపలికి వచ్చి శ్యామల రావు కాళ్ల మీద పడిపోయి, “నన్ను సెమించు బావు! తవుర్ని అనరాని మాటలన్నాను. దాలమ్మను పని మానిపించీకండి మాట్టారు బావు, సెప్పుడు మాట యిన్నందుకు నా సెప్పుతో నానే కొట్టుకుంతాను బావు” అన్నాడు
దాలమ్మ మగనివైపు ఆశ్చర్యంగా చూసింది.
“కూర్చో పైడిరాజూ!” అని ముగ్గురికీ టీ పెట్టి వచ్చాడు శ్యామలరావు. అతని భుజం మీద చేయి వేసి, “నా విషయం వదిలెయ్యి! ఇన్నేళ్లు కాపురం చేసిన యిల్లాలి మీద నమ్మకం లేకపోతే ఎలా? తప్పు కదూ!” అన్నాడు అనునయంగా. “నా జీవితాన్ని పండించిపోయిన నా భార్యకే ఈ జీవితం అంకితం. ఇంకో స్త్రీకి స్థానమే లేదు. దాలమ్మ నా తోబుట్టువు లాంటిది. ఆమె లేకపోతే, మా పిల్లలు ఏమయి పోయేవారో!” అన్నాడు. అతని గొంతు గద్గదమయింది. కళ్లల్లో నీళ్లు!
పైడిరాజు కదిలిపోయాడు, పశ్చాత్తాపంతో అతని ముఖం తేటపడింది. “బుద్ది గడ్డి తిన్నాది మాట్టరు బావు! సెమించండి!” అన్నాడు. టీ తాగి వెళుతూ., “దాలి, పానంపోయినా, బావిల్లు ఒగ్గకు” అని చెప్పాడు భార్యతో.
***
ఆ రోజు రథసప్తమి. ఆప్షనల్ హాలిడే శ్యామల రావుకు. ఉద్యోగులకు సి.యల్స్, గాక ఓ.హెచ్.లు అయిదు ఉంటాయి సంవత్సరానికి. ఓ.హెచ్.ల లిస్టు పెద్దదే ఉంటుంది గాని, ప్రతీ ఉద్యోగీ అందులో ఐదు మాత్రమే ఉపయోగించుకోవాలి. మొత్తం స్టాఫ్‌లో ముప్ఫై శాతానికి మించకుండా ఓ.హెచ్. పెట్టుకోవచ్చు. వరలక్ష్మీవ్రతం లాంటి పండగలకు జనరల్ హాలిడే ఉండదు. హిందువులందరూ ఆ రోజు ఆప్షనల్ సెలవు కావాలని అడుగుతారు.
డెబ్బై ఐదు శాతం స్టాఫ్ ఓ.హెచ్.కు దరఖాస్తు చేసుకుంటే, ఆ రోజు సెలవు డిక్లేర్ చేసే డిస్క్రీషనరీ పవర్స్ ప్రిన్సిపాల్‌కు ఉంటాయి. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కొందరు ప్రిన్సిపాల్స్ ఏ సెకండ్ సాటర్ డే నో పని చేయిస్తారు. వీళ్లు మంచి ప్రిన్సిపాల్స్ కాదని స్టాఫ్ అభిప్రాయం. కొందరు ఉదార హృదయులు వదిలేస్తారు. సెకండ్ సాటర్ డే రోజు తాలూకు సంతకాలు సోమవారం పెట్టేయమంటారు. పిల్లలకు ఆ రోజు అటెండెన్స్ నోట్ చేస్తారు. ఒక సర్కులర్ కూడ శుక్రవారం రాసి పెట్టుకుంటారు. అలాంటి ప్రిన్సిపాల్స్ బంగారు కొండలు! ఇదంతా జిల్లా అధికారులకు కూడా తెలిసిన బహిరంగ రహస్యం!.
భారతదేశపు సెక్యులర్ స్ఫూర్తి యొక్క గొప్పదనమేమంటే ముస్లిముల పండుగలకు ఓ.హెచ్. ఉంటే ఇతర మతాల వారు కూడా పెట్టుకోవచ్చు. ‘మీ పండుగ కాదు కదా’ అని ఎవ్వరూ అడగరు.
డిసెంబరులో క్రిస్మస్‍కు నేషనల్ హాలిడే ఉంటుంది 25 న. 24 న క్రిస్మస్ ఈవ్, 26న బాక్సింగ్ డే రెండూ ఓ.హెచ్.లు ఉంటాయి. ఇక చూడండి. అందరూ ఆ రెండింటికీ అప్లయి చేస్తారు. మొత్తం మూడు రోజులు సెలవులు కలిసి వస్తాయి. అదృష్టం బాగుండి (?) పక్కనో, ముందు గానో సండే కలిస్తే సరే ఇంకా మంచిది. ఒక బ్రీఫ్ వెకేషన్ అవుతుంది. అందరూ ఊర్లకు వెళ్లి వస్తారు. డిసెంబరు చివరి కల్లా ఉన్న సెలవులన్నీ వాడుకోకపోతే మురిగిపోతాయి!
శ్యామల రావు రథ సప్తమికి సెలవు పెట్టాడు. పిల్లలకు సెలవు లేదు. ఉదయాన్నే లేచి స్నానం చేసి, అరసవిల్లి సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకుని వద్దామని బయలుదేరాడు. కొమ్మాది సెంటర్ నుంచి శ్రీకాకుళం 70 కిలోమీటర్ల లోపే ఉంటుంది. వైజాగు నుంచి వంద కి.మీ. ప్రతి ఇరవై నిమిషాలకూ ఒక నాన్-స్టాప్ ఉంటుంది. నాన్-స్టాప్ బస్సులు చాలా రద్దీగా ఉంటాయి. రథ సప్తమి రోజు మరీను. స్కూటరు మీద బయలుదేరాడు. గంటన్నరలో శ్రీకాకుళం చేరాడు. అరసవిల్లి దేవస్థానం శ్రీకాకుళం టౌన్‌లో ఇంచుమించు అంతర్భాగంగానే ఉంటుంది.
ఒక చేతిసంచిలో పట్టుపంచె ఉత్తరీయం తెచ్చుకున్నాడు.
ఏడున్నరకు క్యూలో నిలబడితే దర్శనం అయేటప్పటికి గంటపైనే పట్టింది. ఉదయం నుంచి ఆకాశం మబ్బువేసి ఉంది. భక్తులందరూ నిరాశగా ఉన్నారు. ఎందుకంటే సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించి, గర్భగుడిలోని మూలవిరాట్టు పాదాలు స్పృశిస్తాయి. ‘అద్భుతమైన, అరుదైన ఆ దృశ్యాన్ని మిస్ అవుతామేమో’ అని భక్తుల దిగులు.
సరిగ్గా పది గంటల ఇరవై నిమిషాలకు మబ్బులు తొలగిపోయి ప్రత్యక్ష నారాయణుడు దర్శనమిచ్చాడు. భక్తుల్లో కోలాహలం. సూర్యకిరణాలు టార్చిలైటు వేసినట్లుగా దేవాలయంలో విస్తరిస్తూ స్వామివారి దివ్య పాదాలను తాకాయి. విగ్రహం శిరోభాగం నుంచి కిందికి దిగి పాదాల దగ్గర ఆగిపోయాయి.
“సూర్యనారాయణా! తండ్రీ! కాపాడు!” అంటూ భక్తితో నినదించారు భక్తావళి. స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని రథసప్తమి పర్వదినాన కనులారా కాంచి ధన్యుడయ్యాడు శ్యామల రావు. ఎప్పడో ఊహ తెలియని వయసులో తల్లి తండ్రులతో బాటు వచ్చాడు. అలా అని అమ్మ చెబితేనే తెలిసింది.
“తండ్రీ! మా యిద్దరు పిల్లలను చల్లగా చూడు! పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేయి” అని స్వామిని ప్రార్థించాడు. ‘ఆరోగ్యమ్ భాస్కరాదిచ్ఛేత్’ అని కదా ఆర్యోక్తి!
గుడి బయట ఒక మంటపంలో కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకంలోని ‘ఆదిత్యహృదయం’ పారాయణ చేశాడు. రావణవధకు బయలుదేరిన శ్రీరామచంద్రునికి అగస్త్యమహర్షి ఉపదేశించిన స్తోత్ర రాజమది. సర్వరోగహరిణి. ఆరోగ్యప్రదాయిని.
పారాయణం పూర్తి చేసి తల ఎత్తి చూసేసరికి ఇద్దరు విదేశీయులు, బహశా భార్యా భర్తలేమో, వచ్చి అదే మంటపంలో కూర్చున్నారు. తెల్లగా పాలిపోయిన చర్మపు రంగు, జుట్టు కూడ జేగురు రంగులో ఉంది. చిరునవ్వులు నవ్వుతూ శ్యామల రావును పలకరించారు. సంభాషణ అంతా ఇంగ్లీష్ లోనే సాగింది. నిదానంగా, జాగ్రత్తగా వింటే గాని వారి యాక్సెంట్‌ను ఇంటొనేషన్‌ను క్యాచ్ చేయలేకపోతున్నాడు. వాళ్లు న్యూజిలాండ్ నుంచి వచ్చారట. వైజాగ్ చూసి, భువనేశ్వర్, పూరీ, కోణార్క్‌లను చూడాలని వెళుతూ ‘సన్ టెంపుల్’ ఇక్కడ ఉందని తెలిసి ఇక్కడికొచ్చారట.
“వాటే మిరాక్యులస్ ధింగ్ హాపెన్డ్! ది సన్ రేస్ టచ్డ్ ది హోలీ ఫీట్ ఆఫ్ ది ప్రిసైడింగ్ డెయిటీ” అన్నదామె. ఆమె పేరు సెలీనా అట.
“ఇటీజ్ యాన్ ఆర్కిటెక్చువల్ వండర్” అన్నాడు శ్యామల రావు. “ఇట్ హపెన్స్ ఓన్లీ ఆన్ దిస్ ఆస్పిసియస్ డే! అట్ ది సేమ్ టైమ్. ఇటీజ్ ఎ డివైన్ ఈవెంట్.”
“వాటీజ్ దట్ బుక్ యు ఆర్ రీడింగ్?” అని అడిగాడాయన. ఆయన పేరు జాన్ కొర్నేలియాస్ అట.
“దిస్ ఈజ్ ది ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్. రిటన్ ఇన్ సాన్‌స్క్రిట్ లాంగ్వేజ్” అని చెప్పాడు. “ఇఫ్ వుయ్ రిసైట్ ఇట్ డెయిలీ, వుయ్ ఆర్ బ్లెసిడ్ విత్ గుడ్ హెల్త్, బై ది గ్రేస్ ఆఫ్ ది సన్ గాడ్!”
వాళ్లు ఆశ్చర్యపోయారు.
“వుయ్ ఇండియన్స్ వర్షిప్ ది ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. వుయ్ విజువలైజ్ ది ఆల్మైటీ ఇన్ ట్రీస్, రివర్స్ అండ్ ఈవెన్ ఇన్ యానిమల్స్.”
“దట్స్ ది అల్టిమేట్ వర్షిప్. రబీంద్రనాథ్ టాగోర్ ప్రొఫెసెడ్ ది సేమ్ ఇన్ హిజ్ గీతాంజలి!” అన్నాడు జాన్ కొర్నేలియస్.
“ఐ థింక్ హీ గాట్ ది నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ బై థాట్ ఆఫ్ దట్ నోబుల్ డాక్ట్రిన్” అన్నది సెలీనా.
“యు ఆర్ రైట్” అని వాళ్లను ప్రశంసించాడు శ్యామల రావు. బ్యాగు లోంచి రవీంద్రుని గీతాంజలి ఇంగ్లీషు వర్షన్‍ని అతనికి చూపించాడు జాన్. సెలవు తీసుకొని వెళ్లిపోయారా దంపతులు.
శ్యామల రావుకు కడుపులో ఆకలి కరకరలాడ సాగింది. ఉదయం కాఫీ తాగాడంతే. దర్శనమయ్యేంత వరకు ఏమి తినగూడదనుకున్నాడు; ఉన్నాడు! పొద్దున్నే పిల్లలకు వరినూక ఉప్మా చేసి బాక్సుల్లో పెట్టి యిచ్చాడు. శాండ్‌విచ్ బ్రెడ్ తిని వెళ్లారు పాపం. వచ్చేటప్పటికి వంట చేయాలి.
సెవెన్ రోడ్స్ జంక్షనుకు వచ్చి ‘స్వప్న’ హోటల్లో భోజనం చేశాడు. ఎదురుగ్గా ఉన్న పార్కులో కాసేపు రిలాక్స్ అయింతర్వాత స్కూటరు మీద కొమ్మాదికి బయలుదేరాడు. అతడు ఇల్లు చేరేసరికి మూడు కావస్తుంది. మరో ముప్పావు గంట ఆ పిల్లలు వచ్చేస్తారు. చేమదుంపలు వేపి, చారు కాద్దామనుకుంటుంటే హాల్లో ఫోన్ మోగింది. పి అండ్ టి ఫోను లేటవుతుందని ఈ మధ్య టాటా సెల్యులార్ లాండ్‍ఫోన్ పెట్టించాడు. అప్పుడే సెల్‍ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. టారిఫ్ చాలా ఎక్కువగా ఉందని విన్నాడు. ఔట్‍గోయింగ్ కాల్స్‌కే కాక ఇన్‌కమింగ్ కాల్స్‌కు కూడా ఛార్జి చేస్తారట.
వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేశాడు. “హాలో! ఎవరు?” అని అడిగితే, “నేను విద్యాభారతి స్కూలు నుంచి మాట్లాడుతున్నానండి! మీ అమ్మాయి సాహితి క్లాస్ టీచర్‍ని. నా పేరు వైదేహి. మీ అమ్మాయి పెద్దమనిషైంది. అఫ్ కోర్సు, మేము జాగ్రత్తగా చూసుకున్నాము లెండి. మీరు మీ మిసెస్‌ను తీసుకొని వస్తే, అమ్మాయిని తీసుకొని పోవచ్చు.”
“చాలా థాంక్సండీ! వస్తున్నాను” అన్నాడు. ఉద్వేగంతో మనసు ఉక్కిరిబిక్కిరి అయింది. ‘నా బంగారు తల్లి పెద్దమనిషైందా! వాళ్లమ్మ ఉంటే ఎంత హడావుడి చేసేదో!’ అనుకున్నాడు.
తయారై, సత్యారావు వాళ్ళింటికి వెళ్లాడు. బెల్ కొడితే ఆమె తలుపు తీసింది. “అమ్మా, వల్లీ! మా సాహితి పెద్దమనిషి అయిందట. స్కూలు వాళ్ళు ఫోన్ చేశారు. ఆడవాళ్లు అయితే బాగుంటుందని…”
“అయ్యో! అన్నయ్యగారు! దాందేముందండి. పదండి వెళదాం. ఉండండి ఇప్పుడే వస్తాను” అంటూ లోపలికి వెళ్లి గుప్పెడు పంచదార తెచ్చి అతని నోట్లో పోసింది. “రెండు నిమిషాల్లో తయారవుతాను” అంటూ వెళ్లింది.
“రోడ్డు వరకు వెళ్లి, ఆటోలో…” అంటూంటే ఆమె “మీ బండి మీద వెళదాం. వచ్చేటపుడు కావలిస్తే పిల్లలను ఆటో తీసుకొద్దాం. మీరేం సంకోచించకండి. యు ఆర్ మై బ్రదర్” అన్నదా యిల్లాలు.
ఇద్దరూ పది నిమిషాల్లో స్కూలు చేరుకున్నారు. ఒక రూంలో సాహితిని ఉంచారు. శానిటరీ న్యాప్‍కిన్స్ తెప్పించారు. పిల్ల బెంబేలు పడకుండా ధైర్యం చెప్పారు.
వాళ్లకు థ్యాంక్స్ చెప్పాడు శ్యామల రావు. వల్లిని తన సిస్టర్‍గా పరిచయం చేశాడు. సాహితి తలెత్తి నాన్న కళ్లకి చూడలేకపోతోంది. “ఏం ఫరవాలేదు తల్లీ. ఇటీజ్ వెరీ నాచురల్, బయలాజికల్ అండ్ వెల్‍కమింగ్ ఛేంజ్ ఇన్ ఎ గర్ల్స్ బాడీ! కంపోజ్ యువర్ సెల్ఫ్!” అన్నాడు.
ఆటో మాట్లాడుకొని వాళ్ల ముగ్గుర్ని ఎక్కించి, వెనక తాను స్కూటరు మీద ఫాలో అయ్యాడు. దాలమ్మకు కబురుపెట్టాడు. ఇల్లు చేరిన వెంటనే, నర్సీపట్నానికి, గరివిడికి ఫోన్లు చేశాడు. అందరిళ్లలో లాండ్ ఫోన్లు పెట్టించుకున్నారు.
సాహితిని ఒక రూంలో ఉంచారు. వల్లీ ఆ అమ్మాయికి కావలసినవన్నీ దాలమ్మకు చెప్పి తెప్పించింది. రాత్రికీ అమ్మమ్మ, తాత, మామయ్య, అత్తయ్య, వాళ్లబ్బాయి కొమ్మాది చేరుకున్నారు. ఆ కాలనీలో ఈ మధ్య క్యాటరింగ్ వారు చేరారు. వాళ్లు బ్రాహ్మిన్సే కాబట్టి జగన్నాథరావు దంపతులకు సమస్య లేదు. మురళికి, శ్యామల రావుకు ఆ పట్టింపు లేదు. క్యాటరింగ్ వారికి చెప్పి రాత్రి భోజనాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు కొబ్బరి పచ్చడి, ముల్లంగి సాంబారు, వడియాలు, పెరుగు పంపించారు, అన్నంతోబాటు. సాహితికి మాత్రం మురళి భార్య వసంతలక్ష్మి అన్నం పెసర పప్పు కలిపి పులగం చేసి పెట్టింది. విశాలాక్షి మనమరాలికి నర్సీపట్నం మంగలాల్ స్వీట్స్ నుంచి మైసూరుపాకు, బూందీ లడ్డు, రసగుల్లాలు తెప్పించింది.
మూడురోజులూ కారం లేని వంటలు తినాల్సివచ్చింది సాహితికి. దాలమ్మకు ఆ ఇంట్లో ఉన్న చనువు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సంతోషించారు కూడా. ఆ మూడు రోజులూ పిల్ల పక్కనే ఉండి చూసుకుంది దాలమ్మ.
నాలుగోరోజు స్నానమైన తర్వాత నర్సీపట్నం తీసుకువెళ్లి ‘ప్రథమ రజస్వల వేడుక’ ఘనంగా చేద్దామంది విశాలాక్షి. శ్యామలరావు వద్దన్నాడు. వేడుక ఘనంగా జరుపుకోవాల్సినంత ముఖ్యమైన ‘ఈవెంట్’ కాదన్నాడు. “ఒక ఆడపిల్ల శరీరంలో వయసుకు అనుగుణంగా వచ్చే మార్పు ఇది. అతి సహజమైంది. దాన్ని సెలిబ్రేట్ చేసుకోడం ఎందుకు?” అన్నాడు. వసంత, అన్నయ్య వైపు ప్రశంసగా చూచింది.
నాలుగో రోజు స్నానం అయింది. సాహితికి కొత్త పట్టులంగా, ఓణీ, జాకెట్టు కుట్టించాడు నాన్న. వసంత ఆ అమ్మాయికి ఒక జడ వేసి, పొడుగూతా గులాబీలు కుట్టింది. ముఖానికి పసుపు రాసుకుని బుజ్జి కనకమాలక్ష్మిలా ఉది సాహితి. ఇంటివాళ్లు, సత్యారావు వాళ్లు, సాల్మన్ రాజు వాళ్లు, దాలమ్మ వీళ్లే! ఎవర్నీ పిలువలేదు. ఆ రోజు జగన్నాథరావు గారు లలితాసహస్రనామార్చన చేశారు. హల్వా, బంగాళా దుంప బజ్జీలు, పులిహోర, టమోటా పప్పు, వంకాయ స్టఫ్ కూర, వసంత వండింది. అందరూ భోజనాలు చేశారు.
నాల్రోజులుగా పక్కన కూర్చున్న సాహితి, స్నానం అయి తయారయిన వెంటనే తండ్రిని వాటేసుకుంది. విశాలాక్షి మందలించింది. “ఒసేవ్! అలాంటి పనులు చెయ్యకూడదు. ఇక నుంచి నెలనెలా మూడు రోజులు పక్కన కూర్చోవాలి. ఎవ్వరూ నిన్ను ముట్టుకోకూడదు.”
సాహితి తండ్రి వైపు నిస్సహాయంగా చూచింది.
“అత్తయ్యా, కాలం మారుతోంది. శర్వాణి కూడా అవన్నీ పాటించేది. ఎందుకంటే మా అమ్మ కూడా మీ భావజాలాన్ని అనుసరించేది. కాని చదువుకొనే పిల్లలకు అవన్నీ ఎలా కుదుర్తాయి చెప్పండి” అన్నాడు.
“ఏమిటో నాయనా! మీ యిష్టం! అనాచారం అని చెప్పాను. మా కోడలు కూడా పాటిస్తుంది.”
వసంత తేలు కుట్టిన దొంగలాగా మురళి వైపు చూచింది. ఎందుకంటే వాళ్లు నర్సీపట్నం వెళ్లినపుడే అవన్నీ. గరివిడిలో కలిపేసుకుంటారు.
మురళీ వాళ్ళు మర్నాడు వెళ్లిపోయారు. నాల్గు రోజులుండి జగన్నాథరావు దంపతులు కూడ నర్సీపట్నం వెళ్లిపోయారు.
***
కాలగమనంలో ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. విశాలాక్షిగారు కాలం చేశారు. జగన్నాథరావు మాస్టారిని మురళి తన దగ్గరికి తీసుకుపోయాడు. నర్సీపట్నంలోని ఇల్లు అద్దెకిచ్చేశారు. ఆయన మూడు నాలుగు నెలలకోసారి కొమ్మాది వచ్చి వారం రోజులు పిల్లలతో గడిపి పోతున్నారు. ఆయనకు డెభై దాటాయి. కాని పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు. వృద్ధాప్య సహజమైన బాధలు మాత్రమే.
సాహితి వి.యస్. కృష్ణా కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతూంది. తనకు మాథ్స్, సైన్స్ వద్దని కామర్సు గ్రూపు తీసుకుంది. సాత్విక్ సెవెంత్ స్టాండర్డ్‌కు వచ్చాడు. అదే స్కూల్లోనే! వాడికి ఒక సైకిలు కొనిచ్చాడు శ్యామలరావు. దాని మీదే వాడు స్కూలుకు వెళతాడు. సాహితి సిటీ బస్సులో వెళ్లి వస్తుంది.
రెండేళ్ల కిందట శ్యామల రావుకు కొత్తవలస కాలేజీకి ట్రాన్స్‌ఫరయింది. మరో పే రివిజన్ జరిగి జీతం దాదాపు యాభైవేలయింది. లక్షన్నర ఖర్చుచేసి ఇంట్లో వుడ్ వర్క్ చేయించాడు. షెల్ఫ్‌లు, వార్డ్‌రోబ్ అమిరాయి. కిచెన్ స్వరూపమే మారిపోయింది. శ్యామల రావును మళ్లీ పెళ్ళి చేసుకొమ్మని చాలామంది హితులు, స్నేహితులు, సన్నిహితులు బలవంతం చేసినా, అతడు లొంగలేదు. అతని గుండెల్లో శర్వాణి చిత్రం ఇంకా సజీవంగానే ఉంది. పిల్లలకు తమ నాన్న చేసిన త్యాగం అర్థమయింది. అమ్మ మీద ఆయనకున్న అపురూపమైన ప్రేమను తలచుకుని వారు గర్వపడుతుంటారు.
ఒకసారి కాలేజీలో ఒక కొలీగ్ అడిగాడు శ్యామలరావును – “ఇంగ్లీషు మాస్టారూ! ఎందుకిలా మీ జీవితాన్ని మోడు చేసుకున్నారు? మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చినావిడ మీ పిల్లలని సరిగ్గా చూడదని భయమా?”
ఇంగ్లీషు మాస్టారు నవ్వాడు. “మాస్టారూ, అసలు చేసుకునే ఉద్దేశం ఉంటే కదండి, ఈ భయాలు అనుమానాలు వచ్చేది. ఒక గ్రేట్ ఉమన్‍కు భర్త గానే ఉండిపోతాను తప్ప, కాంప్రమైజ్ అవను. జీవితం మోడు… అని అన్నారు మీరు. మన సంతోషం మనలోనే, మనల్ని బట్టే ఉంటుంది మాస్టారు. మా మిసెస్ నా హృదయంలో ఉన్నంతవరకు నా జీవితం మోడెందుకవుతుంది? నా చివరి శ్వాస వరకు మా శర్వాణి నాతోనే ఉంటుంది. భౌతికంగా కాకపోయినా, మానసికంగా! స్టిల్ ఐ కెన్ కమ్యూనికేట్ మై ఇన్నర్‌మోస్ట్ ఫీలింగ్స్ విత్ హర్. ఆమె నాకిచ్చిన చక్కని పిల్లలు నా ఎదుట పెరుగుతున్నారు. సో, నో రిగ్రెట్స్!”
“సారీ మాస్టారు! ఇంత ఉన్నతంగా భార్యను, ఆమె జ్ఞాపకాలను ఆరాధించే మనిషి మాతో కలిసి పని చేయడం మా అదృష్టం.”
ఇంకో విశేషమేమిటంటే కొత్తవలస కాలేజీ ప్రిన్సిపాల్ ఆకెళ్ల శివనారాయణ మూర్తి గారు రిటైరైం తర్వాత తీసిన ప్రమోషన్లలో కుతూహలమ్మగారు ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ వచ్చారు. ప్రతి జిల్లా కేంద్రంలో స్పాట్ వాల్యుయేషన్ పెట్టారు. శ్యామల రావు విజయనగరంలో ప్రతి సంవత్సరం పేపర్లు దిద్దుతున్నాడు.
కుతూహలమ్మగారు కొంచెం వడలిపోయారు. ఆమెకు ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉందిట. జాయిన్ అయిన రోజు శ్యామల రావును దగ్గరగా తీసుకొని అందరికీ చెప్పారు “శ్యాము నా తమ్ముడు. భీమిలిలో నన్ను ఎంతో ఆదరించాడు. హి ఈజ్ ఎ వెరీ నైస్ గై. హిఈజ్ యాన్ ఐడియల్ హజ్బెండ్ అండ్ లవింగ్ డాడ్ టూ.”
వినమ్రంగా ఆమె పాదాలకు నమస్కరించాడు శ్యామల రావు. అడ్మినిస్ట్రేషన్‌లో కూడా ఆమెకు చేదోడు వాదోడుగా ఉండసాగాడు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
