Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెతడి-13

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[శర్వాణికి ఉన్నట్టుండి అంత అనారోగ్యం ఎందుకొచ్చిందో అర్థం కాదు శ్యామల రావుకి. అయినా తనుంటున్న లాడ్జ్‌కి ఓ కానిస్టేబుల్ వచ్చి కబురందించడం అసలు అర్థం కాదతనికి. డ్రైవర్ కోరికపై దారిలో ఓ చోట కారు ఆపి టిఫిన్ తింటారు. ఈలోపు మురళీ దంపతులు, జగన్నాథరావు, విశాలాక్షి కె.జి.హెచ్. చేరుకుంటారు. మధురవాడ ఎస్సై వాళ్ళకి జరిగినది చెప్పి ఓదారుస్తాడు. సాయంత్రానికి శ్యామల రావు ఆసుపత్రికి చేరుకుంటాడు. శర్వాణి ఇక లేదన్న విషయాన్ని మురళి చెప్తాడు. గుండెలు బాదులుంటూ ఏడుస్తాడు శ్యామల రావు. అతనికి స్పృహ తప్పుతుంది. అక్కడే ఉన్న ఓ డాక్టర్ సెడెటివ్ ఇంజక్షన్ మైల్డ్ డోస్ ఇస్తాడు. శర్వాణి మరణ వార్త పేపర్ల లోనూ, టీవీ ఛానెళ్ళ లోనూ సంచలనం సృష్టిస్తుంది. రకరకాల వార్తలు వస్తాయి. పోస్ట్ మార్టమ్ పూర్తయ్యాకా, శర్వాణి భౌతికకాయాన్ని ఇంటికి తీసుకుని వస్తారు. పిల్లలిద్దరూ తల్లి శవం దగ్గర హృదయవిదారకంగా విలపిస్తారు. ప్రిన్సిపాల్, ఇతర స్టాఫ్ మెంబర్స్ వచ్చి శ్యామల రావును పరామర్శిస్తారు. మర్నాడు ఉదయం శర్వాణి అంత్యక్రియలు పూర్తవుతాయి. శ్యామల రావు జీవచ్ఛవంలా తయారవుతాడు. అత్తగారు మామగారు అతనికి ధైర్యం చెబుతారు. పిల్లల్ని చూసైనా మారమంటారు. కానీ శ్యామల రావు మానసికంగా మరీ దుర్బలుడైపోతాడు. బావని ఇలా చూసిన మురళి ఆందోళన చెంది, అతన్ని పినాకపాణి అనే మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పిస్తాడు. ఆయిన చెప్పిన సలహాలకు, ఉదాహరణలతో కొంత తేరుకుంటాడు శ్యామల రావు. – ఇక చదవండి.]

వీళ్లు వెళ్లిపోయిన తర్వాత లోపల్నించి ఒక పెద్దావిడ వచ్చింది. లేత గోధుమరంగు చుడీదార్ వేసుకొని ఉంది. ఆమెకు అరవై ఐదేళ్లుండవచ్చు. పండిన తమలపాకులా ఉంది. ఆమె ముఖాన ఎర్రని కుంకుమ బొట్టు మెరుస్తుంది. చుడీదార్ వేసుకున్న కనకమహాలక్ష్మి తల్లిలా ఉంది.

“డాట్టరుబావూ! రేత్తిరి బోయినం లోకి ఏటి సెయ్యమంతారు? దిబ్బరొట్టి ఎయ్యమంటారేటి?” అని అడిగింది నవ్వుతూ.

డాక్టరు గారు కూడ ఆమె వైపు నవ్వుతూ చూశారు. “అయితే అంతా విన్నావేమిటి దేవసేనా?” అనడిగారు

“మీ గొంతేమి సామాన్యమైనదా! వినకపడకపోవడానికి. నేను ఇరవై ఏళ్ళ కిందటే చచ్చిపోయాను కదూ! కాదు మీరే అప్పుడప్పుడు నన్ను చంపేస్తుంటారు. సరేలే ఎలాగూ చచ్చిపోయాను కదా అని వంటమనిషి పాత్ర పోషిస్తుంటాను.”

డాక్టరు బిగ్గరగా నవ్వాడు. “అయాం సారీ డియర్! తప్పదు!”

ఇంతటి బల్ల మీదున్న లాండ్‌లైన్ మోగింది. రిసీవర్ తీసి, “హలో! కన్నా, ఎలా వున్నారు? మేం బాగానే ఉన్నాం రా. ఇప్పడే చివరి పేషంట్ వెళ్లిపోయాడు. ఇక టిఫిన్ చేయాలి.” అన్నారు డాక్టరుగారు.

అవతల్నించి డాక్టరు గారి కొడుకు ఏం టిఫినని అడిగినట్లున్నాడు.

“దిబ్బరొట్టెరా నాన్నా, కోడలికివ్వు ఒకసారి!”

“ఆమె గ్రోసరీస్ కని వెళ్లింది నాన్నా!”

“మనుమరాలు బాగా చదువుతుందా?”

“ఆఁ. బయోటెక్నాలజీలో పి.జి.లో చేరింది కదా! చదువుతున్నాననే అంటుంది మరి.”

“తాతయ్యా, బాగా చదువుతున్నాలే. నాన్నమ్మ ఉందా?”

డాక్టరు గారు రిసీవరు భార్యకిచ్చారు. మనవరాలితో మాట్లాడుతున్నంత సేపూ ఆవిడ ముఖం వెలిగిపోయింది.

కొడుకు మాట్లాడుతున్నట్లున్నాడు “కన్నలూ, ఏమిటి దిబ్బరొట్టి కావాలా? రిసీవర్‌లో చిన్న ముక్కలు చేసి వెయ్యాలా? సిగ్గు లేకపోతే సరి! ఒకసారి రావొచ్చుగా అందరూ! కావల్సినవన్నీ చేసిపెడతాను” ఆమె పడీపడీ నవ్వసాగింది!

“ఈ రోజు మీ నాన్నగారు మిమ్మల్నందర్నీ విమాన ప్రమాదంలో చంపేశారు రోయ్! ఏమిటి ఫర్వాలేదా? పేషంటు కోసం చెప్పొచ్చా? నీ మొహంలే! సరిపోయారు తండ్రి కొడుకు లిద్దరూ! ఒక్కోసారి నీకు లేని చెల్లెల్ని బావని యాక్సిడెంట్‍లో చంపేస్తుంటారు మీ నాన్న! అబ్బ! నేను నవ్వలేను రా బాబూ! నా వల్ల కాదు!” అంటూ రిసీవర్ భర్త కిచ్చిందామె.

“ఐ యామ్ ప్రవుడ్ ఆఫ్ యు డాడ్!” అంటున్నాడా అబ్బాయి అటువైపు నుంచి.

“మానసిక రోగాలకు ఇలాంటి ట్రీట్‌మెంట్ తప్పదు కన్నా” అన్నాడాయన. “వచ్చే సమ్మర్‌లో వస్తారా? అందరం తిరుపతి వెళదామా? వెరీ గుడ్! వెరీ గుడ్! ఎంత మంచి మాట చెప్పావు నాన్నా. సరే సరే. అమ్మకు చెబుతానులే. తనకు చెప్పకుండా నాకు చెప్పావని నా వైపు గుర్రుగా చూస్తూంది అప్పుడే. ఉంటాను కన్నా. బై!” అని పెట్టేశాడు డాక్టర్ పినాకపాణి.

“పిల్లలు సమ్మర్‌కి వస్తున్నారట.”

“అర్థమయింది లెంది. నాతో ఒక్కమాట అయినా అన్నాడా దొంగవెధవ!” అన్నదా మాతృమూర్తి. ఆ తిట్టులో ఆమెకు కొడుకు మీదున్న ప్రేమంతా ప్రతిఫలించింది.

“కాదు డాక్టర్, మీ చంపే నాటకాలు తర్వాత పేషంట్లకు తెలిస్తే?”

“ఈ మహానగరంలో మళ్ళీ ఎవరు కలుసుకొంటారు. ఫారిన్ కంట్రీస్‌లో అయితే, సైక్రియాటిస్ట్ దగ్గరికి ఫ్రీక్వెంట్‌గా వెళతారు. ఇండియాలో ది మోస్ట్ రేర్‍లీ ఫ్రీక్వెంటెడ్ డాక్టర్ ఈజ్ ది సైకియాట్రిస్ట్. రెండు మూడుసార్లు అదీ అయింది లే! అప్పటికి వాళ్లు కోలుకుని ఉన్నారు కాబట్టి తెలిసినా స్పోర్టివ్‌గా తీసుకున్నారు!” అని నవ్వాడాయన!

“మన కంటే ఎక్కువ దుఃఖంతో ఉన్నవాళ్లను చూస్తే మన దుఃఖం పారలైజ్ అవుతుంది!”

“మిస్చివస్ గై” అని ప్రేమగా ఆయన వైపు చూసిందామె.

***

డాక్టరుగారు చెప్పినదంతా తల్లిదండ్రులకు వివరించాడు మురళి. మర్నాడు భార్యను కొడుకును తీసుకొని గరివిడి వెళ్లిపోయాడు. మరునాడే శ్యామల రావు వెళ్లి డ్యూటీలో జాయినయ్యాడు. మూడు నెలల కాలానికి మెడికల్ లీవ్, హాఫ్ కమ్యూటెడ్ ఇన్‍టు ఫుల్ పే విధానంలో అప్లయి చేయించారు ప్రిన్సిపాల్ గారు. ప్రభాత్వోద్యోగికి సి.యల్స్, ఇయల్స్ గాక ప్రతి సంవత్సరం ఇరవై రోజులు మెడికల్ లీవ్ ఉంటుంది. అది వాడకపోయినా అక్యుములేట్ అవుతూ ఉంటుంది.

శ్యామల రావుకు రెండు క్యాడర్లలో కలిసి పన్నెండేళ్లు సర్వీసు పుటప్ అయింది. అంటే రెండు వందల నలభై రోజులు క్రెడిట్‌తో ఉంది. తల్లి చనిపోయినప్పుడు – పదిహేను రోజులు వాడాడు, నెలరోజులు కమ్యూట్ చేసి. అలా ఐనా రెండువందల ముప్ఫై రోజులు ఉంది. ఈ మూడున్నర నెలలకు రెండువందల పదిరోజులు డెబిట్ చేస్తే, అతనికి ఫుల్ శాలరీ వస్తుంది. అతనేమీ ట్రీట్‌మెంట్ తీసుకోలేదు. కాని సాంబమూర్తి గారు భీమిలి గవర్నమెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ చేత ఎమ్.సి. ఇప్పిస్తానన్నారు. మామూలుగా అయితే ఆయన నెలకు వంద రూపాయలు తీసుకుంటారట. శ్యామల రావు దయనీయ గాథ తెలుసు కాబట్టి ఫ్రీ గా ఇస్తాడట.

ప్రిన్సిపాల్ గారే శాంక్షనింగ్ అథారిటీ కాబట్టి, పదిరోజుల్లో ప్రాసెస్ పూర్తయి ట్రెజరీ నుంచి బిల్ పాసై, మూడున్నర నెలల జీతం ఒకేసారి వచ్చింది. అతనికి కూడా డబ్బు అవసరం. దాదాపు యాభైవేల రూపాయల విలువ గల నగలు, ఐదువేల రూపాయల క్యాష్ దోచుకుపోయారు. హౌసింగ్ లోన్‌తో పాటు ఇతర ఇ.యం.ఐలు కూడా మూడు నెలల నుండి పేరుకుపోయాయి. పిల్లల ఫీజు రెండు టర్మ్స్ కట్టాలి. ఈ మూడు నెలలూ ఇంటి ఖర్చులన్నీ మామగారే పెట్టారు. ఆయనకివ్వాలి. అవసరాలు ఆగవు కదా! దుఃఖం దుఃఖమే, జీవితం జీవితమే! అదీ హార్డ్ రియాలిటీ! అఫ్‍కోర్స్, లైఫ్ మస్ట్ గో ఆన్!

***

అత్తయ్యను మామయ్యను నర్సీపట్నం వెళ్లిపొమ్మన్నాడు శ్యామల రావు. వాళ్లు కూడా, డాక్టరు చెప్పాడు కాబట్టి సరే అన్నారు. ఇద్దర్నీ నాన్ స్టాప్ ఎక్కిస్తూంటే అతనికి దుఃఖం వచ్చింది. కూతురు దుర్మరణం పొంది, పుట్టెడు దుఃఖంలో ఉన్నా, తననూ పిల్లలనూ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నారు ఇద్దరూ. ముఖ్యంగా అత్తయ్య తనకిచ్చిన నిబ్బరం గొప్పది. ఆమెకూ పెద్ద వయసు. మురళి వాళ్లను తన దగ్గరికి వచ్చేయమంటాడు. కానీ, చూద్దాం అంటారు వాళ్ళు!

ఇంటికి వచ్చేశాడు. ఉదయాన్నే సాంబారు, కందిపచ్చడి చేసిపెట్టే వెళ్లింది అత్తయ్య. ఆ రోజు ఆదివారం కాబట్టి కాలేజీకి వెళ్ళే హడావిడి లేదు. వస్తూ వస్తూ కొమ్మాది జంక్షన్‌లో ఉన్న టిఫిన్ బండి వాడి వద్ద ముగ్గురికీ ఇడ్లీ, వడ కట్టించుకుని వచ్చాడు.

సాహితి, సాత్విక్ లను నాల్గు రోజుల్నుండి స్కూలుకు పంపిస్తున్నాడు. అక్క ఆరో క్లాసు. ఆ అమ్మాయికి పదకొండేళ్లు. తమ్ముడు రెండు. వాడికి ఆరు నిండాయి.

తల్లి లేని పిల్లలకు ఎక్కడలేని పెద్దరికం వస్తుందో ఏమో? సాహితి చిన్నపుడు చాలా అల్లరి పిల్ల. సాత్విక్ నెమ్మది. ఇప్పడిప్పడే తల్లి జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా మరుగున పడుతున్నాయి

పనిమనిషి దాలమ్మ వాళ్లకు అత్యంత ఆత్మీయురాలైంది. మూడు నెలలుగా ఆమెకు జీతం ఇవ్వలేదు. అయినా అడగలేదామె. మొగుడు ఆ మాట అంటే “శర్వాణమ్మ చానా మంచిదాయి. ఆ అమ్మనే సచ్చిపాయ. సారు మొన్నటివరకు మన నోకంలోనే లేడు. ఇత్తారు లే, తొందరేటి?” అన్నది.

పిల్లలు ఆమెకు బాగా చేరువైనారు. ఉదయం పనంతా చేసింతర్వాత సాహితికి తల దువ్వి జడలు వేస్తుంది. సాత్విక్‍కు స్నానం చేయిస్తుంది. ఒక్కరోజు ఆమె రాకపోతే తోచదు వారికి.

పదకొండు గంటలు దాటింది. శ్యామల రావు వంటింట్లోకి వెళ్లాడు. దాలమ్మ కడిగిన గిన్నెలను నీట్‍గా సర్దిపెట్టింది సాహితి. సాంబారు, పచ్చడి ఉన్నాయి. వేడిగా కుక్కర్‌లో అన్నం పెట్టుకోవడమే.

మూడు గ్యాసులు బియ్యం కడిగి, కుక్కర్‍లో అత్తెసరు పెట్టి, గ్యాస్‍కట్ అమర్చి మూతపెట్టాడు. కొంచెం పొగలు రాగానే వెయిట్ పెట్టాడు. పావుగంటలో విజిల్స్ వచ్చాయి. మూడవ విజిల్ రాంగానే ఎక్కడున్నాడో సాత్విక్ పరిగెత్తివచ్చి కుక్కర్ కింద స్విచ్ ఆపేశాడు. శ్యామల రావు వచ్చేసరికి వాడు ఆఫ్ చేసి వస్తున్నాడు.

ఆ తండ్రి హృదయం ద్రవించింది. వాళ్లమ్మ ఉండగా ప్రతిదానికీ పేచీ పెట్టేవాడు, అది తినను ఇది తినను అంటూ, ఇప్పుడు..

కొడుకును ఎత్తుకుని ముద్దుపెట్టుకొన్నాడు. “కరెక్ట్‌గా ఆపేశాడే మా బుజ్జికన్న!” అన్నాడు.

“రూంలోకి వినబడుతుందిగా నాన్నా, లెక్కపెట్టుకుంటున్నా. సరిగ్గా మూడో విజిల్ వచ్చాక, వచ్చి స్విచ్ ఆపేశా” అన్నాడు వాడు.

ఒంటగంటకు సాహితి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు, గ్లాసులు పెట్టింది. పెరుగుగిన్నె తెచ్చిపెట్టింది. తమ్ముడు మంచినీళ్లు తెచ్చిపెట్టాడు. శ్యామల రావు వచ్చేసరికి అంతా రెడీ! ముగ్గురూ భోజనాలు చేశారు. ఎంగిలి కంచాలు తీసి సింక్‍లో వేశారు పిల్లలు. మిగిలిన సాంబారు, అన్నం చిన్న గిన్నెల్లో వేసి మూతలు పెట్టారు. పాతగుడ్డతో డైనింగ్ టేబులు శభ్రంగా తుడిచింది సాహితి. శ్యామల రావును ఏ పనీ చేయనివ్వటం లేదు. గారాబంగా పెరగవలసిన ఆ పసిపిల్లలు ఇంటి పనులు చేస్తూంటే ఆ తండ్రి మనసు బాధపడింది.

ముగ్గురూ బెడ్ రూంలో పడుకున్నారు. సాత్విక్ నాన్న బొజ్జ మీద, సాహితి ఆయన గుండెల మీద. ఇద్దర్నీ రెండు చేతులతో నిమరుతూ అన్నాడు –

“ఈ పనులన్నీ చేయమని మీకెవరు చెప్పారురా?”

“అమ్మమ్మ చెప్పింది నాన్నా” అన్నది కూతురు.

“దాలమ్మ కూడా చెప్పింది” అన్నాడు కొడుకు. “నాన్నను సతాయించకండి, ‘ఆయన ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండేలాగా చూడండి’ అని చెప్పాడు తాతయ్య.”

“అదేమిటి?”

“డాక్టరుగారు చెప్పారట కదా! అలా అయితే నీవు బాగుంటావని!”

పిల్లలకు ఉన్న అవగాహనకు ఆశ్చర్యపోయాడు శ్యామల రావు.

కాసేపు నిద్రపోయాడు. నాలుగు గంటలకు టీ పెట్టుకున్నాడు. సాహితి వచ్చి శ్రద్ధగా గమనిస్తూంటే “ఏంటమ్మా” అని అడిగాడు.

“నేర్చుకుందామని నాన్నా” అన్నది. “నీకు నేను టీ పెట్టిస్తా. అందుకే నీవు చేస్తుంటే చూస్తున్నా.”

కూతుర్ని దగ్గరికి తీసుకొని తల నిమిరాడు. హల్లో కూర్చుని టీ తాగుతుంటే, సాత్విక్ అన్నాడు “నాన్నా పకోడీలు గాని, బజ్జీలు గాని చేసుకుందామా” అని; వెంటనే, “వద్దులే!” అన్నాడు.

“అమ్మయితే ఆదివారం సాయంత్రం ఏదో ఒకటి చేస్తుంది. చేద్దాం పద నాన్నా” అన్నది సాహితి. పని లేకపోతే నాన్న ఆలోచనల్లోకి జారిపోవడం ఆ అమ్మాయి గమనిస్తూ ఉంది.

ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి యిచ్చింది. శ్యామల రావు పకోడీలు చేయడం ఇదే మొదటసారి. శనగపిండిలో కొంచెం బియ్యంపిండి కలపాలని గుర్తు, కొంచెం వంటసోడా కూడా కలిపి బజ్జీలు లాగా వేశాడు. కొద్దిగా ఉప్పు ఎక్కువయినా బాగానే వచ్చాయి. పిల్లలు బజ్జీ లోంచి పచ్చి మిర్చి ముక్కలు ఏరి తీసేస్తూంటే, అవి నూనెలో వేగి ఉంటాయి, కారం ఉండవు తినమని చెప్పాడు .

మళ్లీ సోఫాలో కూర్చుని మూడీగా అయిపోతే, కొడుకు “నాన్నా, ఎక్కడికైనా వెళదామా?” అన్నాడు. తనను నిరంతరం ఎంగేజ్డ్‌గా ఉంచాలన్న వాళ్ల కన్సర్న్‌తో కదిలిపోయిందా పితృహృదయం. “పదండి. తయారవండి మరి!” అన్నాడు.

ముగ్గురూ స్కూటర్ మీద మధురవాడలోని పార్కుకి వెళ్లారు. అక్కడ పిల్లలు ఆడుకుంటుంటే చూస్తూ కూర్చున్నాడు శ్యామల రావు. వాళ్లకు ఐస్‌క్రీం కొనిపెట్టాడు. వచ్చే దారి లోనే షిర్డీ సాయిబాబా గుడి ఉంది. దాన్ని ఈమధ్యే కట్టారు. ముగ్గురూ బాబా దర్శనం చేసుకున్నారు. తెల్లని పాలరాతితో చెక్కిన బాబా విగ్రహం, ఒక కాలు మోకాలి మీద వేసి కూర్చున్న భంగిమలో ఉంది. ఆ యోగి మహరాజ్ వదనం ప్రశాంతంగా ఉంది. వైరాగ్యం మూర్తీభవించినట్లుంచి ఆయన చిరునవ్వు. “తండ్రీ! తల్లి లేని ఈ పిల్లలను సక్రమంగా, ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేసే మానసిక స్థైర్యాన్ని, శారీరిక శక్తిని ప్రసాదించు” అని మొక్కుకున్నాడు బాబాను.

పిల్లలిద్దరూ చేతులు జోడించి కళ్లు మూసుకోని బాబాను ప్రార్థించారు.

విభూతి పెట్టుకొని, చిన్న దొన్నెల్లో ఇచ్చిన పులిహోర ప్రసాదం తిని, బయట ఒక తిన్నెమీద కూర్చున్నారు.

“బాబాను ఏమని మొక్కుకున్నావమ్మా?” అని అడిగాడు కూతుర్ని.

“నాకు త్వరగా వంట చేయడం రావాలి స్వామి, ఇడ్లీ పెట్టడం, దోశలు పోయడం, చపాతీలు చేయడం అన్నీ త్వరగా రావాలని మొక్కుకున్నా” అన్నది.

“మరి నీవు?” అని అడిగాడు కొడుకును.

“నేను తొందరగా పెద్దయ్యి, మా నాన్నను బాగా చూసుకోవాలని..”

ఇద్దర్నీ గుండెలకు హత్తుకున్నాడు. “మీరిద్దరూ బాగా చదువుకోవాలి. వంట నేను చేస్తాను. ఇప్పటికే మీ చదువు బాగా కుంటుపడింది. ఓకేనా?” అన్నాడు.

చీకటి పడింది. దారిలో ఒక పంజాబీ ధాబా దగ్గర అగి, ఆరు పుల్కాలు, ఆలూమటర్ కర్రీ పార్సల్ చేయించుకున్నారు. మిగిలిన అన్నం సాంబారుతో తిన్నారు.

మర్నాడు దాలమ్మ వచ్చి బెల్ కొడుతూనే లేచాడు. ఆమెకు పెరట్లో గిన్నెలు వేశాడు. బాత్ రూంలోని విడిచిన బట్టలు ఆమెకు ఉతకడానికి వేశాడు. నిన్న రాత్రి ఫిల్టర్ వేయలేదు. పెరుగు తోడు పెట్టులేదు. పొద్దున కాఫీ, సాయంత్రం టీ అలవాటు. సరే అనుకొని టీ పెట్టాడు. కొంచెం దాలమ్మకు కూడ యిస్తే నొచ్చుకుంది.

“బావూ! తవురే సెయ్యి కాల్చుకుంతన్నారు. నా కియ్యకపోతే ఏటి?” అన్నది.

“ఫరవాలేదమ్మా, నేనెలాగూ తాగాలి కదా!” అన్నాడు

పిల్లలిద్దరూ లేచివచ్చారు. వాళ్లమ్మ ఉన్నపుడు ఏడు దాటింతర్వాతగాని లేవరు. ఏమని అడిగితే ‘నీకు పనిలో సాయపడాల’ని అన్నారు. అది విన్న దాలమ్మ

“మా యమ్మే, మా బాబే, ఎంత బంగారు కొండలమ్మా! ఇంత గ్రయింపు ఏ పిల్లలకయినా ఉంతాదేటి?” అని మెచ్చుకుంది వాళ్లను.

స్నానం చేసి, దేవుడి దగ్గర దీపం వెలిగించాడు. పూజగదిలో తల్లి పటం పక్కన భార్య పటం చేరింది. నవ్వుతున్న ఆమె ముఖం ఎంతో అందంగా ఉంది. వరాహనరసింహుడు నందివర్ధనం పువ్వు ధరించి ప్రకాశిస్తున్నాడు. “ఎందుకిలా చేశావు?” అని ఆయన్ను అడిగాడు, కళ్ల నిండా నీళ్లతో. అంతలోనే తనను తాను సంబాళించుకున్నాడు. ‘అఫ్‌కోర్సు, లైఫ్ మస్ట్ గో ఆన్’ అనుకుని వంటింట్లోకి నడిచాడు.

పిల్లలు కూడా స్నానాలు చేశారు. మొదట సేమ్యా ఉప్మా చేశాడు. నీరు ఎక్కువయిందీమో, అది పొడి పొడిగా రాకుండా ముద్దకట్టింది. “చాలా బాగుంది నాన్నా” అని పిల్లలు తింటుంటే కళ్లు చెమ్మగిల్లాయి అతనికి.

కుక్కర్లో బియ్యం, కందిపప్పు, పొన్నగంటాకు, ఉల్లిపాయ వేరువేరుగా పెట్టి మూతపెట్టాడు. విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి, కందిపప్పు దించి నీరంతా ఒక చిన్నగిన్నెలోకి వంపి గట్టుమీద ఒక వైపుగా ఉంచి మూతపెట్టాడు, రాత్రి చారుకు. పప్పును బాగా గరిటెతో మిదిపి, ఉడికిన ఆకుకూర, ఉల్లిపాయలు, చిటికెడు పసుపు ఒకటిన్నర స్పూను కారంపొడి, స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా నీరు కలిపి పొయ్యి మీద పెట్టాడు. ఉసిరిక్కాయంత చింతపండు ముద్ద కూడ విడదీసి వేశాడు. పప్పు అవుతూండగానే చిన్న మూకుడులో రెండు స్పూన్ల నూనె వేసి, పోపుగింజలు, చిటికెడు ఇంగువ వేసి, చిటపట శబ్దాలు రాగానే పట్టకారుతో మూకుడిని పట్టుకొని పప్పులో పోపునంతా వేశాడు. గరిటెతో అంతా కలిపాడు.

పిల్లలకు బాక్సుల్లో అన్నం పప్పు సర్ది యివ్వబోతూంటే, “నేను పెడతాను నాన్నా. నాకూ నేర్పండి” అని సాహితి తండ్రి గైడెన్స్‌లో బాక్సులు సర్దింది. ఎనిమిది నలభైకి ఆటో వచ్చింది. పిల్లలిద్దరూ యూనిఫాం, బూట్లు వేసుకొని స్కూలుకు వెళ్లిపోయారు.

సత్యారావు భార్య ఒక కప్పులో దొండకాయ వేపుడు, మరో చిన్న డిష్‌లో గోంగూర పచ్చడి తెచ్చింది. “అయ్యో! అన్నయ్యగారూ! పిల్లలు అప్పుడే వెళ్లిపోయారా?” అన్నది. టేబుల్ మీద గిన్నె మూత తీసి చూసి, “ఆకుకూర పప్పు చేశారా? ఇంకేం అయితే!” అని మెచ్చుకుంది.

“ఈ కర్రీస్ రాత్రి తింటాం లేమ్మా! మీకు శ్రమ యిస్తున్నాం.”

“అయ్యో, మాస్టారూ! మీకొచ్చిన కష్టం ముందు ఇదేపాటి? మీకేదైనా సాయం అవసరమైతే మొహమాటపడకుండా అడగండి. ఆ గిన్నెలు రేపు దాలమ్మతో పంపండి” అని చెప్పి వెళ్లిపోయింది.

తాను క్యారేజి కట్టుకొని, తొమ్మిదికి స్కూటరు మీద కాలేజికి బయలుదేరాడు. పిల్లలు మూడున్నరకే వచ్చేస్తారు. సాహితి దగ్గర ఒక కీ ఉంటుంది.

నెలరోజుల్లో పనులు అలవాటయిపోయాయి. పిల్లలు కూడా బాగా సాయం చేస్తున్నారు. చుట్టుపక్కల గృహిణులు కూరలో, పచ్చళ్ళో ఇచ్చి వెళుతున్నారు. అలా ఒక సంవత్సరం గడిచింది. శర్వాణి సాంవత్సరీకాలు కూడా గీరపంతులు గారి ఆధ్వర్యంలో నర్సీపట్నం బలిఘట్టం ఆశ్రమంలో సింపుల్‍గా జరిపించాడు.

మర్నాడు వైజాగ్‌కు వెళ్లాలి. ఆ రోజు రాత్రి అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. జగన్నాథరావు గారిలా అన్నారు అల్లునితో. “నాయనా, శ్యామల రావు! అమ్మాయి సాంవత్సరీకాలు అయింతర్వాతే ఈ ప్రసక్తి తెద్దామని ఆగాను, మరోలా అనుకోవద్దు. నాకు మురళి అయినా నీవయినా ఒకటే. నీకు ముఫై ఆరేళ్ళే. ఇంకా ముందు బోలెడు జీవితం ఉంది. పిల్లలతో ఎన్నాళ్లని అవస్థ పడతావు? ఇంట్లో ఆడదిక్కులేని సంసారం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ అత్తయ్య నేను ఆలోచించాం. మీ అత్తయ్య పెద్దమ్మ కూతురు వాళ్లు చోడవరంలో ఉంటారు. కందర్పవారని, మంచి కటుంబం. మీ అత్తయ్యకు ఆమె చెల్లెలవుతుంది. వాళ్ల అమ్మాయి చోడవరం లోనే ఇంటర్ వరకు చదివింది. వాళ్ల నాన్నగారు అడ్వొకేట్‌గా పాక్టీసు చేసేవారు. ఐదేండ్ల క్రిందట చనిపోయారు. ఆయన ఉన్నపుడే పెద్ద కూతురికి పెళ్లిచేశారు. ఈ అమ్మాయి రెండో సంతానం. వయసు ఇరవై ఆరేండ్లట. నీ కిష్టమయితే..”

“ఆపండి మామయ్యా!” అని అరిచాడు శ్యామల రావు. “అన్నీ తెలిసిన వారు మీరు యిటువంటి ప్రతిపాదన చేస్తారనుకోలేదు! శర్వాణిని మరచిపోయి ఇంకో అమ్మాయిని ఎలా చేసుకుంటాననుకున్నారు? అత్తయ్యా! మీరు కూడా నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. తన శీలం కాపాడుకోడానికి ప్రాణాలు తీసుకున్న సాహసి మీ అమ్మాయి. అమెకు భర్తనయినందుకు గర్వపడుతున్నాను. మళ్లీ పెళ్లి చేసుకొని ఆమెకు ద్రోహం చేయలేను. ఇక ఆడదిక్కు, పిల్లల పోషణ ఇవన్నీ నా దృష్టిలో చిన్న విషయాలు! నేను చేసుకోగలను. నా పిల్లలు బంగారు కొండలు. ఎంతో అవగాహనతో నాకు తోడ్పాటునందిస్తున్నారు. ఇంకోసారి ఈ ప్రసక్తి తెచ్చారంటే, నేనిక నర్సీపట్నానికే రాను!” అని ఖండితంగా చెప్పాడు.

అతడు ఒప్పుకోడని జగన్నాథరావు దంపతులకు ముందే తెలుసు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం అలాంటిది. పైగా శర్వాణి అంటే అతనికి ఉన్న ప్రేమానురాగాలు అసామాన్యమైనవి. కానీ ఎందుకైనా మంచిదని ఒక మాట అని చూశారు.

“సరేలే అల్లుడూ! నీ మనసుకు బాధ కలిగించి ఉంటే మమ్మల్ని..”

“అంత మాట వద్దు. మీరు నాకు తల్లిదండ్రులతో సమానం. శర్వాణి కేవలం నాకు భార్య మాత్రమే కాదు. ఫ్రెండ్, గైడ్, మోటివేటర్, అన్నీ. పెద్దలు మీ మీద కోపగించుకున్నాను. క్షమించండి!” అన్నాడు శ్యామల రావు.

పిల్లలను తీసుకొని వైజాగ్ వచ్చేశాడు. కుతూహలమ్మ గారు ట్రాన్స్‌ఫరై సబ్బవరం కాలేజికి వెళ్ళిపోయారు. ఒక మంచి శ్రేయోభిలాషిని కోల్పోయినట్లనిపించింది. ప్రిన్సిపాల్ సన్యాసిరావుగారికి కూడ శ్రీకాకుళం గర్ల్స్ కాలేజికి ట్రాన్స్‌ఫర్ అయింది. ఇంకా ముగ్గురు జెయల్స్ కూడా వెళ్లిపోయారు. ఇంటర్ విద్యాశాఖలో ప్రతి ఐదేండ్లకూ బదిలీలు తప్పనిసరి. శ్యామల రావు వచ్చి మూడేళ్లే అవుతుంది.

ఒకరోజు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేసరికి సాత్విక్ డల్‍గా పడుకుని ఉన్నాడు. మధ్యాహ్నం బాక్స్‌లో కట్టిచ్చిన మామిడికాయ పప్పు, అన్నం సగం కూడా తినలేదు. నుదుటి మీద చెయ్యి వేస్తే వేడిగా ఉంది. బండి మీద కొమ్మాది జంక్షన్‌కు వెళ్లి మందుల షాపులో క్రోసిన్ కొని తెచ్చివేశాడు, వేడి పాలతో. రాత్రంతా మూలుగుతూనే ఉన్నాడు సాత్విక్.

ఉదయాన్నే దాలమ్మ వచ్చి బాబుకు జ్వరం వచ్చిందని కంగారుపడింది. “ఓలమ్మో! ఇదేటి ఒక్క పూటకే తోటకూర కాడ నాగ వాలిపోనాడు బంగారు కొండ! నా బాబే! తగ్గుతాది లే! కల్లు మూసుకోని తొంగో!” అని వాడి పక్కనే కూర్చుని సపర్యలు చేయసాగింది.

శ్యామల రావు సత్యారావింటి నుంచి కాలేజీకి ఫోన్ చేసి సెలవు కావాలని అడిగాడు. బాబుకు జ్వరంగా ఉందని చెప్పాడు. సెంటర్‌లోకి వెళ్లి అందరికీ ఇడ్లీలు పార్సెల్ కట్టించుకుని వచ్చాడు. సాత్విక్ రెండిడ్లీలు తిని మళ్లీ మాత్ర వేసుకుని పడుకొన్నాడు. సాహితి స్కూలుకు వెళ్లిపోయింది. అన్నం మాత్రం చేసి, నిమ్మకాయ పులిహోర కలిపి బాక్స్ పెట్టి ఇచ్చాడు. మధ్యాహ్నం పిల్లవాడు తినడానికి కూడ నోటికి హితవుగా ఉంటుందని.

దాలమ్మ వేరే వాళ్ల ఇండ్లకు పనులకు వెళ్లకుండా బాబు దగ్గరే ఉండిపోయింది. ఆమెకూ నాలుగిడ్లీలు తెచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర శ్యామల రావు టిఫిన్ చేస్తూ ఉంటే అతని చెయిర్ దగ్గరే కింద కూర్చుని తాను తింటుంది. మొదట మూడు ఇడ్లీలు వేయించుకుంది. అతడు నాలుగో ఇడ్లీ వేస్తూంటే “వద్దు బావు! ఎక్కువైపోనాది!” అంటూ చేతులడ్డం పెడుతూంది. “ఏం పరవాలేదు తిను దాలమ్మా!” అంటున్నాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు.

(ఇంకా ఉంది)

Exit mobile version