Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెతడి-12

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[శ్యామల రావు కొత్తగా ఇల్లు కట్టుకున్న కాలనీలో దొంగల భయం ఎక్కువవుతుంది. అసలే శ్యామల రావు ఊర్లో లేకపోవడంతో శర్వాణి మరింత భయపడుతుంది. ఓ రోజు రాత్రి పిల్లల్ని పడుకోబెట్టి,  హాల్లో టీవీ చూస్తుండగా, కిటికీ గ్రిల్స్ విప్పదీసి ఇద్దరు దొంగలు లోపలికి దూరుతారు. ఆమెకి కత్తి చూపించి డబ్బు బంగారం చూపించమంటారు. పిల్లల్ని గదిలో పెట్టి తలుపు గడియ వేస్తుంది శర్వాణి. వాళ్ళు డబ్బు, నగలు దోచుకుంటారు. వెళ్ళబోతూండగా, యవ్వనంలో ఉన్న శర్వాణి అందాలపై వారి దృష్టి పడుతుంది. ఆమెపై అఘాయిత్యం చేయబోతే, బల్ల మీద ఉన్న చాకుతో తనని తాను పొడుచుకుని చనిపోతుంది. దొంగలు పారిపోతారు. పొద్దున్నే పనిమనిషి దాలమ్మ వచ్చి బెల్ కొడుతుంది. ఎన్ని సార్లు పిలిచినా శర్వాణి తలుపులు తీయకపోతే ఆమెకి అనుమానం వస్తుంది. గట్టిగట్టిగా పిలుస్తుంది. ఆమె కేకలకి పిల్లలకి మెలకువ వస్తుంది. దాలమ్మా దాలమ్మా అంటూ సాహితి అరుస్తుంది. పెరటి వైపు నుంచి దాలమ్మ పిల్లల గది కిటికీ వైపు వెళ్తే సాహితీ ఏడిస్తూ జరిగింది చెబుతుంది. దాలమ్మ ఏడుస్తూ వెళ్ళి కాలనీలోని ఇరుగుపొరుగును పిలుచుకొస్తుంది. పోలీసులకి కబురువెళ్తుంది. వాళ్ళొచ్చి తాళాలు తీయించి, పిల్లల్ని గదిలోంచి బయటకి తెస్తారు. ఒక ఇన్‌స్పెక్టర్ అక్కడున్న డైరీలో నుంచి మీవాళ్ళ పేరు చెప్పమ్మా అని సాహితిని అడిగి, మురళీ నెంబరు, జగన్నాథరావుగారి నెంబరు నోట్ చేసుకుంటాడు. ఓ కానిస్టేబుల్‍ని పిలిచి, ఆ రెండు నంబర్లకు ఫోన్ చేసి కబురు చెప్పమనీ చనిపోయినట్లు చెప్పకుండా, ఈ అమ్మాయికి సీరియస్‍గా ఉందని చెప్పి వెంటనే బయలుదేరి రావాలని చెప్పమంటాడు. పిల్లల్ని పొరుగింటికి పంపి, కాలనీలో విచారణ జరుపుతారు. శవాన్ని కెజిహెచ్‌కి తరలిస్తారు. విజయవాడలో శ్యామల రావు ఉంటున్న లాడ్జ్ గదికి వెళ్ళి విశాఖపట్నం పోలీసులు చెప్పమన్నట్టుగా శర్వాణి ఆరోగ్యం బాలేదని, అర్జెంటుగా బయల్దేరమన్నారని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటికే ఆ వార్త టివీలో వచ్చేస్తుంది. కొలీగ్స్‌కి చెప్పి వెళ్దామని వాళ్ళ దగ్గరకి వెళ్తాడు. వాళ్ళు విషయం చెప్పకుండా, ఓ టాక్సీ మాట్లాడిపెట్టి, శ్యామల రావుని బయల్దేరదీస్తారు. – ఇక చదవండి.]

కారులో వెళుతూన్న శ్యామల రావుకు మెదడు స్తంభించినట్లనిపిస్తుంది. శర్వాణికి ఉన్నట్లుంది ఎందుకంత సీరియస్ అయింది? తనకు కబురు చెప్పటానికి పోలీసులు లాడ్జ్ రూముకు రావడం చాలా విచిత్రంగా ఉంది. తను అదే లాడ్జిలో ఉన్నట్లు పోలీసులకెలా తెలుసు? పైడితల్లి, రాంబాబు, అదే సమయానికి తన దగ్గరకెలా వచ్చారు? అంతా అగమ్యగోచరంగా ఉంది.

కారు హనుమాన్ జంక్షను చేరుకుంది. డ్రైవరు “మీరు టిఫిన్ చేశారా మాస్టారూ?” అనడిగాడు. చేయలేదని చెబితే, తాను చేయలేదనీ, అర్జంటనీ, పేషంటు సీరియస్ అనీ వాళ్ల ఓనరు వెంటనే బయలుదేర తీశాడనీ, ఐదు నిమిషాలు ఆగి ఏదైనా తిని వెళదామనీ అన్నాడు.

‘పాపం అతన్ని టిఫిన్ చేయకుండా తోలమని చెప్పడం భావ్యం కాదు’ అనుకొని సరే అన్నాడు శ్యామల రావు. రోడ్డు పక్కనే ఉన్న టిఫిన్ బండి వద్ద ఇద్దరూ టిఫిన్ చేశారు. శ్యామలరావుకు సయించలేదు. ఒక ఇడ్లీ తిని, టీ తాగాడు.

మధ్యాహ్నానికి రాజమండ్రి దాటారు.

***

ఫోనులో కబురందుకున్న మురళీ దంపతులు, జగన్నాథరావు, విశాలాక్షి ముందుగా కె.జి.హెచ్. చేరుకున్నారు. అక్కడ మధురవాడ యస్.ఐ. వీళ్ల కోసం వేచి ఉన్నాడు. వాళ్ల ముఖాల్లో అతి తీవ్రమయిన టెన్షన్.

మురళి ఆయన్ను అడిగాడు. “శర్వాణి మా సిస్టరండి. ఆమెకు సీరియస్‌గా ఉందని కానిస్టేబిల్ ఒకతను ఫోన్ చేశారు. అసలేమయింది తనకు? మా చెల్లిని మేము వెంటనే చూడాలి.”

యస్.ఐ. గారు వీళ్లను నలుగుర్నీ ఒక చెట్టు క్రిందికి తీసుకొని వెళ్లాడు. వాళ్ల కళ్లల్లోకి సూటిగా చూడలేకపోయాడాయన. “మురళీగారు, గుండె దిటవు చేసుకోండి. మాస్టారూ, మీరు పెద్దవారు ఈ సమయంలోనే మీరు ధైర్యంగా ఉండాలి” అని ఉపోద్ఘాతం చెబుతుంటే, విశాలాక్షి అన్నది. “నాయనా, అసలేం జరిగింది? మా అమ్మాయికి ప్రాణాపాయం లేదు కదా? అది చెప్పండి ముందు!”

“సారీ. అమ్మా! వచ్చేలోపే మీరు ఆందోళన పడతారని, హార్ట్ పేషంట్లయితే కొలాప్స్ అవుతారని, మా సి.ఐ. గారు అసలు విషయం చెప్పొద్దన్నారు. నిన్న రాత్రి సింహగిరి కాలనీలోని మీ అమ్మాయి గారింట్లో దోపిడి దొంగలు పడ్డారు. మీ అమ్మాయిని చంపేసి, నగలు, డబ్బు ఎత్తుకెళ్లారు. పిల్లల లిద్దరినీ బెడ్ రూంలో పెట్టి తలుపేశారు. ఉదయం పనిమనిషి వచ్చి బెల్ కొట్టి ఎంతకూ తలుపులు తీయకపోయేసరికి, చుట్టు పక్కల వాళ్లకు తెలిపింది. మీ అల్లుడు శ్యామల రావు గారికి కబురు పెట్టాము. ఆయనకూ సీరియస్ అనే చెప్పాము. బహుశా సాయంత్రానికి ఆయన రావొచ్చును. మీ కుటుంబానికి ఇంత దారుణమైన ఆపద రావడం, పోలీసులం మమ్మల్నే కలచివేసింది. ఆమె ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చుగాక!” అన్నాడు ఎస్.ఐ.గారు.

విశాలాక్షి ఉన్నచోటనే కుప్పకూలిపోయింది. జగన్నాథరావు గారు “తల్లీ, ఎంత ఘోరం జరిగిందమ్మా!” అని ఆక్రోశించారు. మురళి చేతులతో నెత్తి మీద బాదుకుంటూ రోదించసాగాడు.

ఆ దుఃఖపు వెల్లువను కాసేపు ప్రవహించనిచ్చాడు యస్.ఐగారు. పదినిమిషాల తర్వాత జరిగిన దుర్ఘటన తాలూకు రియాలిటీ వారి మెదళ్లు రిసీవ్ చేసుకున్నాయి. మురళిని దగ్గరకు తీసుకున్నాడా పోలీసు అధికారి. ఆయన్ను కరుచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు మురళి.

“లోపల పోస్ట్ మార్టమ్ జరుగుతుంది. సాయంత్రానికి ‘బాడీ’ మీకు హ్యాండోవర్ చేస్తాము. ఆమె పడి ఉన్న పరిస్థితిని బట్టి ఆమె మీద అత్యాచారం కూడా జరిగినట్లు మాకు అనుమానంగా ఉంది. పోస్టు మార్టంలో అన్నీ తేలతాయి. పదండి! అక్కడ బెంచీ మీద కూర్చుందురుగాని” అంటూ వాళ్లను తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అత్యాచారం అన్న మాట విని విశాలాక్షి దెబ్బతిన్న గోమాతలాగా ఆక్రందించింది.

“తండ్రీ! నరసింహ! ఎందుకు మా బంగారు తల్లికి యింత శిక్ష వేశావు? అన్నెంపున్నెం ఎరుగని అమాయకురాలే!” అంటూ రోదించింది.

యస్.ఐ.గారు ఆ ముసలి తల్లిదండ్రుల ఘోషను చూడలేకున్నారు. కరకు గుండెగల ఆయనకీ కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. విశాలాక్షిని పట్టుకోని, “అమ్మా, మీ కొడుకు లాంటి వాడిని. ఓదార్పు పొందండి. మీకొచ్చిన కష్టం చాలా పెద్దది” అన్నాడు.

ఆమె యస్.ఐ.ని పట్టుకొని భోరున విలపించింది. ఆయన యూనిఫాం తడిసిపోయింది. దొంగలకు, కేడీలకు సింహస్వప్నమైన ఆ అధికారి నిస్సహాయంగా ఆ వృద్దురాలితో పాటు రోదించాడు. ఆయనా మనిషే కదా!

సాయంత్రం నాలుగున్నరకు ఫియట్ కారు కె.జి.హెచ్ ముందాగింది. శ్యామల రావు అతనికి డబ్బు చెల్లించి, “నీవు వెళ్లిపో బాబూ” అని చెప్పాడు. ఆ అబ్బాయి “పదండి మాస్టారూ, మేడం గారికెలా ఉందో కనుక్కుందాము!” అని అతనితో బాటు లోపలికొచ్చాడు. శ్యామల రావును చూసి మురళి పెద్దపెట్టున ఏడుస్తూ, తల బాదుకుంటూ వచ్చి, “బావా! అంతా అయిపోయింది బావా! మన శర్వాణిని దొంగలు పొట్టన పెట్టుకున్నారు బావా!” అంటూ ఆక్రోశించాడు.

జగన్నాథరావు ఏడుస్తూ, “నాయనా, అమ్మాయితో రుణం తీరిపోయింది మనకు. ఇంత దారుణం మన కుటుంబంలో జరుగుతుందనుకోలేదు” అన్నాడు. విశాలాక్షి ఏడ్చి ఏడ్చి, ఆమె కన్నీళ్లింకిపోయాయి. అభావంగా అల్లుడిని చూడసాగింది.

“అయ్యో! శర్వాణీ!” అంటూ పెద్దగా కేక పెట్టి నేల మీదకు ఒరిగాడు శ్యామల రావు. క్రింద దుమ్ములోనే పడి హృదయవిదారకంగా విలపించసాగాడు. అతన్ని కంట్రోలు చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. చివరికి అతనికి స్పృహ తప్పింది. ఒక బెంచీ మీద, ఎత్తి పడుకోబెట్టారు.

ఒక డాక్టరు వచ్చి పరీక్షించి, “విపరీతమైన దుఃఖోద్వేగం వల్ల స్పృహ తప్పింది, అదీ మంచిదే, లేకపోతే పిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంది” అని చెప్పి, సెడెటివ్ ఇంజక్షన్, మైల్డ్ డోస్, ఒకటి యిచ్చి వెళ్ళాడు.

వైజాగ్ లోకల్ పత్రిక ఒకటి ఈవెనింగ్ ఎడిషన్‌లో ఈ వార్త వచ్చింది. దోపిడీ దొంగలు భీభత్యం సృష్టించి, శర్వాణి అనే గృహిణిని కత్తితో పొడిచి చంపేశారనీ, భర్త ఊర్లో లేడనీ, ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరమనీ, ఇది పోలీసుల వైఫల్యమనీ వ్రాసింది.

టి.వి ఛానెల్లు రెండడుగులు ముందుకేసి, శర్వాణి మీద అత్యాచారం జరిగిందనీ, శవం మీద బట్టలు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ఈ అనుమానం కలుగుతుందనీ, శివారు కాలనీలకు రక్షణ కల్పించడంలో పోలీసు యంత్రాంగం ఘోరంగా విఫలమయిందనే చెప్పాయి. సింహగిరి కాలనీని, శ్యామల రావు ఇంటిని, వెనక కిటికీ గ్రిల్ తొలగించిన దృశ్యాన్ని, శర్వాణి శవాన్ని అంబులెన్స్ ఎక్కిస్తున్న దృశ్యాన్ని ప్రసారం చేశాయి..

పోస్టు మార్టం పూర్తయింది. పత్రికా, టీవీ విలేఖరులంతా కె.జి.హెచ్ సూపరింటెండెంట్ ఛాంబరు ముందు గుమిగూడారు. ఆయన డాక్టర్ వ్యాఘేశ్వరరావు గారు. విలేఖరులతో ఇలా చెప్పారు –

“పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఆమె గొంతులో దిగబడ్డ కత్తి పిడి మీద ఆమె వేలిముద్రలే ఉన్నాయి. తర్వాత మీరంతా అత్యుత్సాహంతో ఆమెను దొంగలు మానభంగం చేశారని రాతలు రాశారు, ప్రసారాలు చేస్తున్నారు. అది అసలు నిజం కాదు. ఆమె మీద ఏ అత్యాచారమూ జరుగలేదు. హర్ చేస్టిటీ ఈజ్ నాట్ అట్ ఆల్ హార్మ్‌డ్. నగలు, డబ్బు దోచుకుంటుంటే ఆమె అడ్డు చెప్పిఉండదు. కాని యవ్వనవతి అందగత్తె కాబట్టి, ఆమెను బలవంతం చేసి తమ కామవాంఛను తీర్చుకోవాలని చూసి ఉంటారు డెకాయిట్స్. ప్ర్రాణం కన్న శీలమే ప్రధానమనుకున్న ఆమె వంటింటి కత్తితో తన గొంతులో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంది. మీరు దయచేసి, చిలవలు పలువలు సృష్టించి, న్యూస్‍ను సెనేషనలైజ్ చేసి, ఇప్పటికే అతి దారుణమైన దుఃఖాన్ని అనుభవిస్తున్న ఆ కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేయకండి. ప్లీజ్! తన శీలం కాపాడుకోడం కోసం ప్రాణాన్ని బలి యిచ్చిన సాహస వనిత ఆమె. ఆ విషయాన్నే, అసలు విషయాన్నే మీరు మీ కథనాల్లో వెల్లడిస్తే ఆమె ఆత్మకు నిజమైన శాంతి లభిస్తుంది. నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్” అని చెప్పి ఆయన వెళ్లిపోయారు.

మిగతా ఫార్మాలిటీస్ పూర్తిచేసి, శ్యామల రావుతో అవసరమైన చోట్ల సంతకాలు పెట్టించుకుని, శర్వాణి శరీరాన్నిఅప్పగించారు కె.జి.హెచ్ సిబ్బంది. హాస్పిటల్ దగ్గరకు పెద్ద సంఖ్యలో జనం వచ్చి శర్వాణికి నివాళులర్పించారు.

ఆమె శరీరాన్ని తెల్లటి గుడ్డలో చుట్టారు. ముఖం వికృతంగా మారలేదు. ప్రశాంతంగా ఉంది. అంబులెన్స్‌లో ఆమెను ఇంటికి తీసుకొని వచ్చారు. ఒక కానిస్టేబుల్ వచ్చి, సంతకాలు తీసుకొని, తలుపుకు వేసిన సీలు తొలగించి వెళ్లాడు.

సత్యారావు ఇంట్లో అంతవరకు ఉన్న సాహితి, సాత్విక్ లని ఇంటికి తీసుకువచ్చారు. అమ్మ అలా నిర్జీవంగా పడుకొని ఉండడం ఆ చిన్నారి హృదయాలు స్వీకరించలేకపోయాయి. “అమ్మా, అమ్మా, మాట్లాడమ్మా” అని ఆ పిల్లలు తల్లి శవం మీద పడి హృదయవిదారకంగా విలపిస్తూంటే, చూస్తున్న వాళ్లకు కూడా దుఃఖం ఆగలేదు.

శోకం మూర్తీభవిస్తే ఎలా ఉంటుందో శ్యామల రావును చూస్తే తెలుస్తుంది. అమ్మానాన్నలు ఏడ్చి ఏడ్చి నిస్త్రాణగా ఉండిపోయారు. మురళీ దంపతులే ముందుగా తేరుకుని, పరామర్శకు వచ్చిన వారికి సమాధానం చెప్పసాగారు.

ప్రిన్సిపాల్ గారు, స్టాఫ్ మెంబర్సు వచ్చి శ్యామల రావును ఓదార్చారు. అతని హృదయం దుఃఖంతో బండబారిపోయింది. ఓదార్పులను స్వీకరించే స్థితిలో అతని మెదడు లేదు. అభావంగా అందర్ని చూస్తున్నాడు. ఉండి ఉండి నిశ్శబ్దంగా రోదిస్తున్నాడు.

మర్నాడు పదిగంటలకు కొమ్మాదికి మధురవాడకు మధ్యన ఉన్న స్మశానవాటికలో శర్వాణి అంత్యక్రియలు ముగిశాయి. నిప్పులాంటి ఆ శీలవతిని అగ్నిదేవుడు తనలో లీనం చేసుకున్నాడు. శవయాత్రలో, వీళ్ల కుటుంబంతో సంబంధంతోని ఎంతో మంది స్టూడెంట్స్, హౌస్ వైవ్స్ పాల్గొన్నారు.

శ్యామల రావు యిల్లు కళావిహీనమైంది. శోక సముద్రమైంది. శూన్యమైంది. ఇంటి దీపం ఆరిపోతే, ఆ యిల్లు అలా కాక మరెలా ఉంటుంది?

మర్నాడు ఈ సంఘటన మీద ఒక టివి ఛానెల్‌లో చర్చాకార్యక్రమం నిర్వహించారు. దాక్షాయణీ ధీమహీ అన్న కవయిత్రి, కాత్యా అన్న ఒక స్త్రీవాద నాయకురాలు, పిచ్చేశ్వరావు అనే ఒక సామాజిక విశ్లేషకుడు అందులో పాల్గొన్నారు.

చర్చ మొదట శివారు కాలనీలకు భద్రత లేకపోవడం, పోలీసులు అటువంటి చోట్ల గస్తీ పెంచాల్సిన అవసరం, ఇలాంటి విషయాల మీద కొనసాగినా, తర్వాత శర్వాణి తన శీలం కోసం ప్రాణాన్నే అర్పించిన అంశం మీద కేంద్రీకృతమయింది.

దాక్షాయణీ ధీమహీ ఇలా అన్నారు “శర్వాణిని చూసి నేను గర్వపడుతున్నాను. భారత స్త్రీ తన శీలానికి ఎంత విలువ ఇస్తుందో నిరూపించిందా అమ్మాయి. ఎంత సాహసం కావాలి, ఆ క్రైసిస్‍లో ఆ నిర్ణయం తీసుకోడానికి. బీరువా తాళాలు ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించని ఆమె వాళ్లు తన మీద లైంగికదాడికి పాల్పడేసరికి, ఆత్మార్పణం చేసుకొని, అమరురాలైంది. హాట్సాఫ్ టు శర్వాణి!”

కాత్యాగారు చెప్పారు “మనువాద, బూర్జువా సిద్ధాంతాలు నరనరానా జీర్ణించుకున్న సంస్కృతి మనది. మార్క్సిస్టు దృక్పథం మీద ఏ మాత్రం అవగాహన లేని శర్వాణి అత్మహత్యకు పాల్పడి, తన భర్తకు, పిల్లలకు అన్యాయం చేసిందంటాను. శీలం అనేది కేవలం శారీరిక పవిత్రతకు సంబంధించినదే అనుకోవడం అజ్ఞానం. తన భర్త, తాను శీలం కోల్పోతే, స్వీకరిస్తాడో లేదో, అన్న అంతర్లీనమైన భయం కూడా ఆమె ఆత్మహత్యకు కొంత కారణం అయి ఉండవచ్చను. ఆఫ్ట్రారాల్, ఇటీజ్ ఎ బయలాజికల్ ఆక్సిడెంట్ అని ఆమె అనుకుని ఉంటే ఆమె కుటుంబానికి ఇంత దుఃఖాన్ని మిగిల్చేది కాదు.”

పిచ్చేశ్వరావు గారికి ఒళ్ళు మండింది ఆ మాటలకు. “వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ కాత్యా మేడమ్? తన ముడ్డి కాకపోతే కాశీ వరకు డేకమన్నాట్ట మీలాంటి వాడొకడు. ఏ ఆడదయినా తన శీలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తుంది. ఆమె శరీరం మీద భర్తకు తప్ప ఇంకెవరికీ హక్కు లేదనుకుంటుంది. ఆమె భర్త స్వీకరించడం స్వీకరించకపోవడం అటుంచి, దుండగుల చేతుల్లో అత్యాచారానికి గురయిన యువతిని ఈ సమాజం కాకుల్లా పొడుస్తుందని మీకు తెలియదా? ‘వెన్ రేప్ ఈజ్ ఇనెవిటబుల్, ఎంజాయ్ ఇట్’ అన్న పాశ్చాత్య నీచ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నారా మీరు? లైంగిక దాడి జరుగుతుంటే ప్రతిఘటించలేని నిస్సహాయస్థితిలో, శరీరాన్ని దుండగుల కప్పచెప్పమని మీ మార్క్స్ చెప్పాడో ఏమిటి కొంపదీసి? ఇంత దిగజారి మాట్లాడటం అదీ ఆడవాళ్లై ఉండి, మీకు సమంజసంగా ఉందా?” అన్నారు.

కాత్యాగారు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. “అఫ్‌కోర్సు అది నా అభిప్రాయం. దాన్ని కాదనడానికి మీరెవరు? మేల్ ఛావినిస్ట్ పిగ్స్‌కి అంతకంటే ఆలోచించడం ఎలా సాధ్యమవుతుంది?”

“అయితే మీ యింట్లో దొంగలు పడి, మీ మీద అఘాయిత్యం చేయబోయినా, మీ పిల్లలకు తల్లి ఉండదని, వాళ్లకు లొంగిపోతారా, మీలాంటి ఫెమినిస్టు బిచ్చెస్?” అన్నారు తీవ్ర స్వరంతో.

“హొల్డ్ యువర్ టంగ్! యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్!” అనరిచింది కాత్యా.

యాంకర్ జీడిపాకం జితీంద్రప్రసాద్ కల్పించుకుని, “నో పర్సనల్ కామెంట్స్ ప్లీజ్. డ్వెల్ అపాన్ ది ఇష్యూ ఆబ్జెక్టివ్‍లీ!” అన్నాడు. కాని అతనికి లోపల సంతోషంగా ఉంది. చర్చ ఇలాంటి మలుపు తిరగాలనే అతను కోరుకున్నాడు. కాత్యాని చర్చకి ఆహ్వానించింది అందుకే.

దాక్షాయణీ ధీమహీ అన్నారు. “నేను పిచ్చేశ్వరరావు గారితో ఏకభవిస్తున్నాను. ఒక వేళ భర్త పెద్ద మనసుతో స్వీకరించినా, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఏ ఆడదైనా. గిల్టీ ఫీలింగ్ ఆమెను క్షణక్షణమూ చిత్రహింసకు గురి చేస్తుంది. పిల్లలు కొంచెం పెద్దయిం తర్వాత వారి ఆటిట్యూడ్ ఎలా వుంటుందో! శర్వాణి చేసింది కరెక్ట్. అయామ్ ప్రౌడ్ ఆఫ్ హర్.”

“కుటుంబం, బంధాలు, విలువలు, సున్నితమైన మానవ సంబంధాలు, వీటి మీద కనీస అవగాహన ఉన్న ఎవరైనా శర్వాణి చర్యను సమర్థిస్తారు. ఆమె శవయాత్రలో పాల్గొన్న వందలాది గృహిణులు, కాలేజీ స్టూడెంట్సే ఇందుకు నిదర్శనం. ఐ పిటీ ది సోకాల్డ్..” అని పిచ్చేశ్వరావు ఏదో అనబోతుంటే, తనక్కావలసిన ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి జీడిపాకం జితేంద్రప్రసాద్ చర్చను ముగిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

***

శ్యామలరావు జీవచ్ఛవంలా తయారయ్యాడు. గడ్డం పెరిగి, కళ్లు లోతుకుపోయాయి. ఒంటరిగా గదిలో పడుకొని “వాణీ వాణీ” అని కుమిలి పోతూంటాడు. జగన్నాథరావు దంపతులు అల్లుడికి తోడుగా ఉండిపోయారు. మురళి శర్వాణి కర్మల అనంతరం, భార్యను పిల్లవాడిని కొమ్మాది లోనే వదిలేసి డ్యూటీలో చేరడానికని వెళ్లిపోయాడు.

మూడు నెలలు గడిచాయి. మెల్లగా మనుషుల్లో పడుతున్నాడు శ్యామల రావు.

“పిల్లలున్నారు నాయనా! పిల్లల ముఖం చూసయినా నీవు తేరుకోవాలి! తప్పదు! అమ్మాయి వెళ్లిపోయింది. ఆమెతో పాటు మనమూ పోలేము కదా!” అంటూ విశాలాక్షి రోజూ అల్లునికి చెప్పేది.

కాలానికి ఎంతటి దుఃఖాన్నయినా మాన్పే శక్తి ఉంది. శారీరికంగా కాస్త కోలుకున్నాడు గాని, మానసికంగా బాగా దుర్బలుడైపోయాడు. ఒకసారి మురళి వచ్చి బావను చూసి ఆందోళన చెందాడు. ఇలాగే ఉంటే డిప్రెషన్ లోకి వెళతాడేమో అని భయమేసింది. రానంటున్నా వినకుండా బావను ఎమ్.వి.పి. కాలనీ లోని డాక్టర్ పినాకపాణి గారి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. ఆయన నగరంలో ప్రసిద్ధి చెందిన సైకియాట్రిస్ట్. సైకియాట్రీలో ఎమ్.డి. కె.జి.హెచ్ ప్రొఫెసర్‌గా చేసి రిటైరై, ప్రస్తుతం ఇంటి దగ్గర ప్రాక్టీసు చేస్తున్నాడు.

మురళి ఆయనకు శ్యామల రావు పరిస్థితి గురించి వివరించాడు. బలవంతపెడితే గాని ఆహారం తీసుకోడనీ, ఎప్పుడూ గదితో పడుకుని ఉంటాడనీ, రాత్రి నిద్రపట్టక బాధపడుతుంటాడనీ ఒకవిధమైన విరక్తి అతనిలో ఏర్పడిందనీ చెప్పాడు.

“ఈ దారుణమైన దుర్ఘటన గురించి నేనూ పేపర్లలో చదివాను, టీవీల్లో చూశాను. రియల్లీ వెరీ అన్‌ఫార్చునేట్. కాని మనం మానవమాత్రులం. ‘యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్’ అన్న సిద్ధాంతాన్ని అనుసరింపక తప్పదు. జరిగిన దాన్ని సరిదిద్దలేనపుడు దానికి రికన్‍సైల్ కావడం తప్ప మనం చేయగలిగింది లేదు” అన్నాడాయన. దాదాపు డెభై సంవత్సరాలుంటాయి. సాక్షాత్తు ధన్వంతరి అవతారంలా ఉన్నాడు.

“దాదాపు ఇరవై సంవత్సరాల క్రిందట మా ఒక్కగానొక్క అబ్బాయి, కోడలు, మనుమరాలు బ్రిటన్ వెళుతుండగా విమానం కూలి మరణించారు. ఇద్దరూ లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ప్రొఫెసర్లు. కొడుకు జెనెటిక్స్. కోడలు న్యూరాలజీ.

నా భార్య దిగులుతో మంచం పట్టి, ఆ దుర్ఘటన జరిగిన సంవత్సరం లోపే మరణించింది. మావాళ్ల శవాలు కూడా దొరకలేదు. నేనూ చాలాకాలం శోకిస్తూ కూర్చున్నాను. తర్వాత డ్యూటీలో జాయినై, రిటైరై, ఇదిగో.. ఇలా.. వంటమనిషి వచ్చి రెండుపూటలా ఇంత చేసి పెడుతుంది. వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ కాలం గడుపుతున్నాను. అఫ్ కోర్సు, లైఫ్ మస్ట్ గో ఆన్” అని నిట్టూర్చాడు.

శ్యామల రావుకు ఆయన కథ విని ఆశ్చర్యం వేసింది. ‘పాపం చెట్టంత కొడుకును పోగొట్టుకుని, కోడల్ని కోల్పోయి, మనవరాలు, పాపం ముక్కు పచ్చలారని పసిదాన్ని విమాన ప్రమాదం బలి తీసుకుంటే, ధైర్యం కూడదీసుకుని, పదిమందికి సేవ చేస్తున్నాడు. రియల్లీ హీ ఈజ్ గ్రేట్!’ అనుకున్నాడు.

డాక్టరు గారు శ్యామల రావును పరీక్షించారు. “ఫిజికల్లీ ఎవ్వెరిథింగ్ ఈజ్ నార్మల్. బట్ ది ప్రాబ్లమ్ ఆల్వేస్ ఈజ్ విత్ మైండ్. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు?” అడిగారు.

“మా పేరెంట్స్, నా మిసెస్, మా అబ్బాయి ఉంటారండి. ఎవ్వరూ తోడు లేకపోతే సైకలాజికల్‌గా మరింత డిటీరియరేట్ అవుతాడని..” చెప్పాడు మురళి.

“దేర్ యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్! అదే మీరు చేస్తున్న తప్పు. మీరంతా ఉండడం వల్ల ఆయనకు దిగులుతో క్రుంగిపోవడానికి కావల్సినంత టైం దొరుకుతూంది. ఆ టైం మనం అతనికి ఇవ్వకూడదు. ‘గ్రీఫ్ ఈజ్ బ్రీఫ్’ అంటారుగాని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో అనుబంధాలు బలంగా ఉంటాయి. మరి ఇలాంటి కేసుల్లో ‘కమింగ్ అవుటాఫ్ గ్రీఫ్’ అంత సులభం కాదు.

శ్యామల రావు గారూ, మీరు వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వండి. టీచింగ్ ఈజ్ ఎ వండ్రఫుల్ ప్రొఫెషన్. మీరు మీ అత్తమామలను, వీరి మిసెస్‌ను అందర్నీ వాళ్ల ఊర్లకు పంపేయండి. పిల్లలిద్దర్నీ జాగ్రత్తగా చూసుకోండి. పనిమనిషిని తప్ప, వంటమనిషిని పెట్టుకోకండి. మీ బాడీ అండ్ మైండ్ ప్రీ ఆక్యుపైడ్ అయితే తప్ప మీరు ఈ స్థితి నుంచి బయటపడలేరు. సెడెటివ్స్ ఇస్తే అవి మనిషిని మరింత మత్తులోకి దింపుతాయి. వర్క్‌ను మించిన సెడెటివ్ లేదు తెలుసాండి? దానికి అడిక్ట్ అవండి మీరు. హెక్టిక్! హెక్టిక్ మెంటల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ! అదే నేనిచ్చే ట్రీట్‍మెంట్!”

శ్యామల రావుకు జ్ఞానోదయమయింది. ఇద్దరూ డాక్టరుగారి ఫీజు చెల్లించి బయటకొచ్చేశారు.

“బావా! మరి పునుగులు తిందామా!” అని అడిగాడు మురళి.

“తిందాం పద! డాక్టరు గారు చెప్పారు కద! ‘అఫ్ కోర్స్, లైఫ్ మస్ట్ గో ఆన్’ అని” అన్నాడు శ్యామల రావు. భార్య చనిపోయిన తర్వాత మొదటిసారి అతను చిరునవ్వు నవ్వడం.

(ఇంకా ఉంది)

Exit mobile version