[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[కాలక్రమంలో, తల్లిని కోల్పోయిన దుఃఖం నుంచి శ్యామల రావు తేరుకుంటాడు. సాహితి ఆరో తరగతికి, సాత్విక్ రెండో తరగతికి వస్తారు. సాహితికి నానమ్మ చనిపోయిందన్న విషయం అర్థమవుతుంది గానీ, సాత్విక్‌కి అర్థం కాదు. మాటికి మాటికి ఆమె గదికి వెళ్ళి చూసి వచ్చేవాడు. మూడు నెలల తర్వాత ఇంటి నిర్మాణం మీద దృష్టి పెడతాడు శ్యామల రావు. మరో నాలుగు నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని, గృహప్రవేశానికి మంచి ముహూర్తం చూసుకోమని కూర్మారావు చెప్తాడు. కాలేజీ స్టాప్ అందరూ ధైర్యం చెప్పినప్పటికీ కుతూహలమ్మగారి స్పందన శ్యామల రావుకి ఓదార్పునిస్తుంది. ప్రసూనాంబ చనిపోయి ఎనిమిది నెలలు దాటుతాయి. ఒక ఆదివారం శర్వాణిని తీసుకుని, కొమ్మాదికి వెళ్ళి ఇంటిని చూసుకుని వస్తాడు. మరో మూడు నెలల్లో ఇంటికి పెయింటింగ్ వేసేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. జగన్నాథరావు దంపతులు వీళ్లను చూసిపోవడానికి రాగా, గృహప్రవేశం సంగతి ప్రస్తావిస్తాడు శ్యామల రావు. తాను ఊరెళ్ళాకా చిట్టిపంతులుని అడిగి చెప్తానని జగన్నాథం గారంటారు. చిట్టి పంతులు గారి సూచనల మేరకు నాలుగు నెలల తరువాత మురళీ, అతని భార్యతో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయిస్తారు. ప్రసూనాంబ సాంవత్సరీకాలు శాస్త్రోక్తంగా జరిపిస్తాడు శ్యామల రావు. తరువాత అనుకున్నట్టే మురళీ దంపతులు గృహప్రవేశం కార్యక్రమం జరిపిస్తారు. ఓ ఆదివారం నాడు అద్దె ఇల్లు ఖాళీ చేసి సొంతైంటికి మారిపోతారు. ఓ ఏడాది గడుస్తుంది.శ్యామల రావుకు పేపర్ వ్యాల్యూయేషన్ డ్యూటీ పడుతుంది. అది పూర్తయ్యే రోజున క్యాంప్ ఆఫీసర్ వచ్చి, విజయ్వవాడలో, రాజమండ్రి సెంటర్లలో ఇంగ్లీషు వాల్యూయేషన్ ఇంకా పూర్తి కాలేదని, వైజాగ్ నుంచి, ఒంగోలు నుంచి అసిస్టెంట్ ఎగ్జామినర్‍లను పంపమని బోర్డు ఆదేశించందని, ఆర్థికంగా అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్తారు. శ్యామల రావు అంగీకరించగా, విజయవాడకి పంపుతారు. తనకి డ్యూటీ పడిన కాలేజీకి దగ్గరలోనే ఒక లాడ్జిలో రూమ్ తీసుకుంటాడు శ్యామల రావు. కొమ్మాదిలో ఇంట్లో పిల్లలను పడుకోబెట్టి, హాల్లో కూర్చుని టీవీ చూస్తుంటుంది శర్వాణి. వార్తలు చూస్తుంటే, ఒరిస్సా నుంచి దొంగల గ్యాంగ్ వైజాగ్‍లో దిగిందనీ, సిటీ అవుట్‌స్కర్ట్స్‌లో, ఐసోలేటెడ్‌గా ఉన్న ఇళ్ళను, ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారనీ, కాబట్టి ఊర్లకు వెళ్ళేవారు తమకు దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్లో వివరాలు ఇచ్చిపోవాలనీ విశాఖ పోలీసు కమీషనర్ గారు ప్రకటించారు. ఆమెకి భయమేసి, ఛానెల్ మారుస్తుంది. తర్వాత కాసేపు పాటల కార్యక్రమాలు చూసి విసిగెత్తి, వెళ్ళి పడుకుంటుంది. మర్నాడు ఉదయం పనిమనిషి దాలమ్మ వచ్చి తన పక్క కాలనీలో దొంగలుపడి ఓ పెద్దాయనని తల మీద కొట్టి ఇల్లు దోచుకుపోయారని చెప్తుంది. పిల్లల్ని స్కూలుకి పంపించాకా, ఆలోచనలో పడుతుంది శర్వాణి. పోనీ పుట్టింటికి లేదా అన్న దగ్గరకి గరివిడి వెళ్ళిపోదామా అని అనుకుంటుంది. కానీ దొంగలు తాళం వేసి ఉన్న యిళ్లనే టార్గెట్ చేస్తున్నారన్నది గుర్తొచ్చి, ఆ ఆలోచన విరమించుకుంటుంది. – ఇక చదవండి.]
రెండ్రోజుల తర్వాత శ్యామల రావు నుంచి ఉత్తరం వచ్చింది. లాడ్జి అడ్రసు ఇచ్చాడు. మరో ఐదారు రోజుల్లో రిలీవ్ అవుతాననీ, జాగ్రత్తగా ఉండమనీ, నీవూ, పిల్లలూ కళ్లలో మెదులుతున్నారనీ, రాశాడు. తన ఉత్తరం ఇంకా చేరలేదని గ్రహించింది శర్వాణి. వెంటనే లాడ్జ్ అడ్రసుకు మరో ఉత్తరం రాసింది. కంగారుపెట్టడం ఎందుకని దొంగల గురించి వ్రాయలేదు.
మరో రెండ్రోజులు గడిచాయి. మళ్లీ ఎలాంటి దోపిడీల వార్తలూ వినబడలేదు. మరో మూడు రోజుల్లో తాను వస్తున్నట్లు శ్యామలరావు నుంచి ఉత్తరం వచ్చింది. అంటే ఎల్లుండే. శర్వాణికి భయం పోయి నిశ్చింతగా అనిపించింది.
ఆ రోజు రాత్రి ఆమెకు బాగా నిద్ర పట్టింది. సడన్‌గా మెలకువ వచ్చింది. పెరటి వాకిలి పక్కన్న ఉన్న కిటికీ వద్ద ఏదో శబ్దాలు! లేచి కూర్చుంది. పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. లేచి వెళ్లి చూద్దామా అనుకుంది. మళ్లీ భయపడి మానుకుంది. అదే ఆమె చేసిన తప్పు. వెంటనే వెళ్లి పెరటి వైపున్న హలు తలుపు వేసి గడియ పెట్టుకోని ఉంటే సరిపోయేది.
పెరట్లో ఇద్దరు దోపిడీ దొంగలు బలమైన స్క్రూడ్రైవర్లతో కిటికీ గ్రిల్స్ కున్న స్క్రూలను తొలగించి లోపలికి ప్రవేశించారు. కళ్లు మాత్రం కనబడేలా నల్లని ముసుగులు ముఖానికి వేసుకున్నారు. శర్వాణి మంచం మీద నుంచి లేచి గదిలోంచి బయటకు వచ్చింది. అది ఆమె చేసిన రెండో తప్పు. వెంటనే బెడ్ రూం తలుపు వేసి గడియ పెట్టుకుని ఉండాల్సింది.
వారిలో ఒకడు కత్తి చూపిస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు. హల్లో ప్రసూనాంబ ఫోటో పైన వేసిన బల్బ్ వల్ల హాలంతా స్పష్టంగా కనపడుతుంది. ఇంకొకడు వెనుక నించి వచ్చి ఆమె నోరు మూశాడు. “అరవకు! అరిస్తే పొడిచేస్తా!” అని వాళ్లు అంటున్నట్లు ఆమెకు లీలగా అర్థమయింది. ఆమె నోరు తడారిపోయింది. గుండె వేగం పదింతలు పెరిగింది. “బీరువా తాళాలు ఇచ్చెయ్! మర్యాదగా” అన్నాడొకడు ఒరియాలో. ఆమెకు అర్థం కావాలని అభినయం చేసి తాళం తెరుస్తున్న విధంగా చూపించాడు.
అ అలికిడికి సాహితికి మెలకువ వచ్చింది. ఆ అమ్మాయి బయటకు వచ్చి “అమ్మా!” అని అరిచింది! “ఏయ్! ఎవరు మీరు? వదలండి మా అమ్మను!” అని దగ్గరకు రాబోయింది. సాత్విక్‍కు అసలు మెలకువే రాలేదు.
“సాహితీ! దగ్గరకు రాకు తల్లీ! రూంకి వెళ్లి తలుపేసుకో!” అనరిచింది శర్యాణి. సాహితి ఏం చేయాలో తోచక తటపటాయించసాగింది. ‘పిల్లలనేం చేయొద్దం’టూ వాళ్లకు చేతులెత్తి దండం పెట్టింది.
వాళ్లలో ఒకడు సాహితిని పట్టుకుని బెడ్రూంలోకి తోసి, బయట గడియపెట్టాడు. “పద! బీరువా చూపించు!” అన్నాడు. ఇంకొకడు కత్తిమొన ఆమె గొంతుకి ఆనించాడు.
రెండో బెడ్రూంలో ఉంది బీరువా. దాని తాళాలు పక్క షెల్ఫులో ఉన్నాయి. వణుకుతున్న చేతులతో తాళాలు తీసి వాడికిచ్చింది. వాడు బీరువా తెరుస్తుండగా ఇంకొకడు కత్తి పట్టుకొని అమె దగ్గరగా నిలబడ్డాడు.
లోపల శర్వాణి నగలన్నీ ఒక బాక్సులో ఉన్నాయి. దాదాపు పన్నెండు కాసుల బంగారం. ఒక చిన్న నల్లపర్సులో దాదాపు ఐదువేల రూపాయల ఉంది. మూడు పట్టు చీరలు కూడా తీసుకొని వారి దగ్గరున్న సంచిలో వేసుకున్నారు.
మళ్లీ కత్తితో బెదిరిస్తూ హల్లోకి తీసుకొచ్చారు. ఒకడి కన్ను ప్రసూనాంబ ఫోటోకు వేసిన పగడాల దండపై పడింది. వెళ్లి దాన్ని తీస్తుంటే శర్వాణి “వద్దు! అది మాత్రం వద్దు” అని అరచింది. రెండోవాడు ఆమె చెంప మీద బలంగా కొట్టాడు! “నోర్ముయ్!” అని ఒరియాలో గద్దించాడు.
ఆమెను కూడా బెడరూంలోకి తోసి, బయట గడియపెట్టి పారిపోదామనుకున్నారు. కానీ ఆమె దురదృష్టం. ముపై రెండేళ్ల ఆమె ప్రౌఢ యవ్వనపు అందాల మీద వారి కళ్లు పడ్డాయి.
ఒకడు ఆమె జాకెట్ మీద చెయ్యి వేసి నొక్కుతుండగా ఇంకొకడు నోరు మూసి ఆమె చీర కుచ్చిళ్లు లాగాలని చూశాడు. ఇద్దరూ కలిసి ఆమెను రెండో బెడ్ రూంలోకి లాక్కుపోవాలని ప్రయత్నించసాగారు. వాళ్లు తన శీలాన్ని కూడా దోచుకోబోతున్నారని ఆమెకు అర్థమయింది. ఒకడు పచ్చని ఆమె మెడను తడమసాగాడు. ఇంకోడు ఆమె జఘన భాగాన్ని నొక్కసాగాడు.
హలులో బెడ్రూంకు ఇవతల డైనింగ్ టేబుల్ ఉంది. రాత్రి ఆమె బర్‍బాటీలు రేపటి కూర కోసం సన్నగా తరుక్కొని, వాటిని ఫ్రిజ్‍లో పెట్టింది. కాని ఆ కత్తిని టేబుల్ మీదే మరచిపోయింది. ఆమె శక్తి సన్నగిల్లసాగింది. మోకాలు బలహీనపడి, కూలిపోతానేమో అనిపిస్తుంది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రాణాలు పోయినా పరవాలేదుగాని ఈ నీచుల చేతిలో తన మానం పోకూడదు!
అట్లే శాయశక్తులా పెనుగులాడుతూ వాళ్లతోబాటు డైనింగ్ టేబుల్ వద్దకు చేరుకుంది. ఇద్దరూ ఆమెను టేబుల్ మీదకు వంచి ఆమెను వివస్త్రను చేయసాగారు. ఆమె జాకెట్టుని చించేశారు. టేబుల్ మీద ఉన్న కత్తిని వాళ్ళు గమనించలేదు. ఆమె చేతికి ఆ కత్తి అందింది!
ఈ మధ్యనే ‘అంజలి కిచెన్‍వేర్’ వాళ్ల నైఫ్ సెట్ ‘కరాచీవాలా’ స్టోరులో తెచ్చారు. ఆ సెట్‌లో అన్నిటి కంటే పెద్దది అది. దాని స్టెయిన్ స్టీలు బ్లేడు చాలా పదునుగా ఉంది.
ఒక్క ఉదుటున లేచింది శర్వాణి! “మర్యాదగా వెళ్లిపొండి! లేదా దీంతో పొడుచుకొని చచ్చిపోతాను!” అని అరిచింది. వాళ్లు ఏ మాత్రం భయపడలేదు. ఎలాగైనా ఆమె అందాలను నలిపి నాశనంచేసి వెళ్లాలని వాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఇద్దరూ ఆమె మీద పడి ఆమె చేతిలోని కత్తిని లాక్కోవాలని రెండడుగులు ముందుకు వేశారు.
అంతే! రెప్పపాటు! రెప్పపాటులో శర్వాణి తన రెండు చేతులతో కత్తి పిడిని పట్టుకుని, మొనను తనవైపు తిప్పుకొని, బలంగా తన గొంతులో పొడుచుకుంది! ఆమె గొంతులోంచి రక్తం చిమ్మింది! అలాగే నేల మీద కూలిపోయింది.
దొంగలు దీన్ని ఊహించలేదు! ఒక్క క్షణం చేష్టలుడిగి నిలబడిపోయారు. తర్వాత ఆమె మెడలోని గొలుసూ, తాళి బొట్టు చెయిన్‍ను, నల్లపూసల గొలుసును తీసుకున్నారు. చెవి దుద్దులు కూడా లాక్కున్నారు. ఒకడు పోతూ పోతూ కసిగా ఆమె నడుం మీద తన్నాడు.
రెండు నిమిషాల తర్వాత ఆమెకు కొంచెం చైతన్యం వచ్చింది. డేక్కుంటూ వెళ్లి పిల్లల బెడ్రూం తలుపు తెరిచి పిల్లలను బైటికి తీసుకొద్దామనుకుంది. కాని ఈ స్థితిలో తనను చూస్తే పిల్లలు భయపడతారు. కాసేపటికి శర్వాణి ప్రాణాలు వదిలింది. ఆమె కళ్లు తెరుచుకునే ఉన్నాయి! ఆ కళ్లలో మరణవేదన కన్నా, తన శీలాన్ని కాపాడుకోగలగానన్న సంతృప్తే ప్రతిఫలించింది.
లోపల పిల్లలు బిక్కచచ్చి ఉన్నారు. సాత్విక్ కూడా లేచాడు. అక్కను కరుచుకుని కూరున్నాడు. బయటినుంచి ఏ శబ్దాలూ వినబడపోయేసరికి, సాహితికి అనుమానమొచ్చి తలుపులు బడింది. “అమ్మా! అమ్మా!” అంటూ ఇద్దరు పిల్లలూ ఆక్రందనలు చేయసాగారు. అరిచీ అరిచీ సొమ్మసిల్లి పడిపోయారు.
ఉదయం ఆరుగంటలకు యథాప్రకారం దాలమ్మ వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది. లోపల్ బెల్ తాలూకు సంగీతం అలగా వినబడుతుంది. అమ్మగోరు ఒకవేళ బాత్రూంలో ఏమయినా ఉన్నారేమోనని ఐదు నిమిషాలు వేచిచూసింది. తర్వాత మళ్లీ బెల్ మోగించింది దాలమ్మ. కానీ లోపల్నుంచి ఏ స్పందనా రాలేదు. ఆమెకు అనుమానం వచ్చింది. ఒకవేళ ఊరికేమయినా వెళ్లారా? అలాగైతే రేపట్నుంచి పనిలోకి రావద్దని చెబుతారే తనతో! ఇంటి గేటు లోపల తీగతో కట్టిన వైరుబుట్టలో రెండు విశాఖ డెయిరీ వాళ్ల పాలపాకెట్లు ఉన్నాయి. అవి చల్లగా ఉన్నాయి. ఐదున్నరకే వాటిని వేసిపోతాడు. న్యూస్ పేపరుకూడ గుమ్మం ముందు పడిఉంది. అంటే ఊరికి వెళ్లలేదన్నమాట!!
ఆమె అనుమానం విశ్వరూపం దాల్చి పెనుభూతమై కూర్చుంది. మరొక్కసారి బెల్ మోగించింది. ఈసారి సాహితికి మెలకువ వచ్చింది. పనిమనిషి ఈ టైములో వస్తుందని తెలుసు. బెడ్రూం కిటికీ తెరిచి, “దాలమ్మా, దాలమ్మా!” అంటూ అరవసాగింది. సాత్విక్ కూడా గట్టిగా అరవసాగాడు. బెడ్ రూం కిటికీ అటువైపు, పెరట్లోకి వెళ్లే ప్యాసేజ్ వైపు ఉంటుంది.
దాలమ్మకు పిల్లల అరుపులు వినబడ్డాయి. ఆమె పరుగున ప్యాసేజ్ లోకి వెళ్లి చూసింది. ఆమెని చూసి పిల్లలిద్దరూ గోలు గోలుమని ఏడవసాగారు. దాలమ్మ కిటికీ దగ్గరకు వెళ్లి “పాపా, బాబూ, ఏమయిందమ్మా? ఎంత బెల్ కొట్టినా అమ్మ తలుపులు తీయడం లేదెందుకు?” అనడిగింది. సాహితి వెక్కుతూ, ఒక్కొక్క మాట కూడదీసుకుని “దొంగలు దాలమ్మా, దొంగలొచ్చారు రాత్రి. మమ్మల్ని రూములో పెట్టి బయట తలుపేశారు. అమ్మను.. అమ్మను.. కత్తి చూపించి..” అని ఇక చెప్పలేక మళ్లీ ఏడవసాగింది.
దాలమ్మ నెత్తి కొట్టుకుంటూ, “ఓలమ్మో, దొంగసచ్చినోల్లు, శర్వాణమ్మను ఏం జేసి పోయినారో? ఈళ్ల జిమ్మడ! ఈళ్ళకు దూము తగల!” అని ఏడుస్తూ, శాపనార్థాలు పెట్టుకుంటూ ఎదురుగ్గా ఉన్న వరుసలో నాలుగు ప్లాట్ల అవతల ఉండే సత్యారావు గారింటికి పరుగెత్తింది. వాళ్ల పనిమనిషి మరిడమ్మ ఇంటి ముందు కళ్ళాపి చల్లుతూంది. దాలమ్మను చూసి,”ఏటే, ఏటయినాదే, పిచ్చిదాయి నాగ ఆ కేకలేటే?” అని అడిగింది కంగారుపడుతూ.
దాలమ్మ బదులివ్వకుండా లోపలికి పరిగెత్తి, హాల్లో సోఫాలో కూర్చుని పేపరు చదువుతూన్న సత్యారావు దగ్గరకెళ్లి గుండెలు బాదుకుంటూ, “బాపూ గోరం జరిగిపోనాది. శ్యామల రావు బావింట్లో దొంగలు పడినారు. లోపల గడి పెట్టున్నది. ఆ యమ్మ తలుపు తీటం లేదు. పిల్లలిద్దర్నీ బెడ్ రూం లోనేసి బైట గడిపెట్టినారు దొంగనంజ కొడుకులు. తవరు బేగి ఎలిపోచ్చేయండి బాబూ! శానా మంచి దాయి శర్వాణమ్మ!” అంటూ గగ్గోలు పెట్టింది.
సత్యారావు కంగారుపడుతూ లేచాడు. షర్టు వేసుకున్నాడు. “వల్లీ, శ్యామల రావింట్లో దొంగలు పడ్డారుట! నే వెళుతున్నా!” అని చెప్పులు కూడా వేసుకోకుండా బయటకు పరిగెత్తాడు. ఎదురింట్లో ఉన్న సుధాంశు రెడ్డినీ, నాలుగు ప్లాట్ల అవతల ఉన్న సాల్‍మన్ రాజును పిలిచాడు.
అందరూం శ్యామల రావు ఇంటి ఎదుట గుమిగూడారు. “తలుపులు విరగ్గొడితే గాని ఏమయిందీ తెలియదు!” అన్నాడు సాల్‍మన్ రాజు. ఈ వార్త దావానలంలా కాలనీ అంతా వ్యాపించింది. చాలా మంది వచ్చేశారు. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. అందరి మొహల్లో వేదన! రేపు మన గతీ ఇంతేనేమో అన్న టెన్షన్.
ఒకాయన అన్నాడు.”మనం తలుపులు విరగ్గొడితే పోలీసులతో లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకైనా మంచిది, మధురవాడ పోలీస్ స్టేషనుకు ఫోన్ చేయండి. వాళ్ళే చూసుకుంటారు!”
పోలీసులు, కాంప్లికేషన్స్ అనగానే సగం మంది దూరంగా పోయి నిలబడ్డారు. సత్యారావు “నే వెళ్లి మా ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేస్తా” అని వెళ్లాడు.
ఇరవై నిమిషాల్లో పోలీసు వ్యాన్ వచ్చింది సైరన్ మోగిస్తూ. ఒక సి.ఐ. నలుగురు కానిస్టేబుళ్లు వచ్చారు. ఇద్దరు లారీలతో జనాన్ని దూరంగా పంపించసాగారు.
“ముందుగా ఎవరు చూసింది?” అని అడిగారు సి.ఐ. గారు.
“నానే బాబూ, నానే సూసినాను ముందల” అని ఏడుస్తూ జరిగింది చెప్పింది దాలమ్మ. ఆయన వెళ్లి బెడ్ రూం కిటికీ లోంచి పిల్లలకు తాము వచ్చేశామనీ, భయపడవద్దనీ, మీ మమ్మీకి ఏమి అయి ఉండదనీ, భయంతో తెలివి తప్పిపోయి ఉండవచ్చననీ ధైర్యం చెప్పారు. తిరిగివచ్చి, పిల్లలకు మంచినీల్లు, పాలు, ఇవ్వమని అక్కడున్న వారికి చెప్పారు.
కానిస్టేబుళ్లు ఎవరింట్లోనో మొక్కలకు గొప్పులు తవ్వే గునపం తెచ్చి తలుపు గడియ మీద బాదసాగారు, టేకు తలుపు అది. అసలు కదల్లేదు. ఆయన వాకీటాకీతో స్టేషనుకు ఫోన్ చేసి, ఎవరయినా లాక్‍స్మిత్‌ను పంపమనీ, అర్జంటనీ చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో డెకాయిటీ కేసులో తలుపులు బలవంతంగా తెరుస్తున్నట్లు, దానికి సాక్షులుగా ఇరుగుపొరుగు వారి సంతకాలు తీసుకున్నారు. సంతకాలు పెట్టొద్దని కొందరిని వారి భార్యలు వారించారు!
ఒక అరగంటలో, మోటారు బైకు మీద ఒక లాక్‌స్మిత్‍ని ఎక్కించుకుని ఒక యస్.ఐ. వచ్చాడు. అతడు ఐదు నిమిషాల్లో తన దగ్గర ఉన్న పనిముట్లతో, ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ఉన్న ఆ తలుపును తెరిచాడు.
సి.ఐ. గారు, యస్.ఐ గారు, పోలీసులు లోపలికి వెళ్లారు. తలుపు వద్ద పెద్ద సంఖ్యలో మూగిన కాలనీవాసులను పోలీసులు కొట్టినంత పనిచేసి వెనక్కు తోసేశారు.
ఎలా తెలిసిందో ఏమో, ఇద్దరు ముగ్గురు పత్రికా విలేఖరులు, రెండు టీవీ ఛానళ్ల వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వాళ్లను కూడా ఇంటి దగ్గరకు రానివ్వలేదు.
లోపల ఉన్న దృశ్యం హృదయవిదారకంగా ఉంది. శర్వాణి గొంతు చుట్టూ రక్తం గడ్డ కట్టి నల్లగా మారి ఉంది. ఆమె జాకెట్టు చిరిగిపోయి, రక్తంతో తడిసిపోయి ఉంది. ఆమె చీర కుచ్చెళ్లు ఊడిపోయి ఉన్నాయి.
పోలీసులు టోపీలు తీసి చేత్తోపట్టుకున్నారు. ఒక కానిస్టేబులు ఆమె కళ్లను మూశాడు. ఒక దుప్పటి తెచ్చి మెడ వరకు కప్పారు. ఫోరెన్సిక్ టీం, పోలీసు డాక్టరు, ఇతర అధికారులు అక్కడికి చేరుకున్నారు కత్తి మీద వేలిముద్రలు చెరిగిపోకుండా, జాగ్రత్తగా దానిని బయటకు లాగి భద్రపరచారు. శర్వాణి శరీరాన్ని ఒక గుడ్డలో చుట్టి బయటకు తీసుకువచ్చారు. అప్పుడు గాని బెడ్రూం తలుపులు తీసి పిల్లలను బయటకు రప్పించడానికి ఒప్పుకోలేదు సి.ఐ గారు.
పిల్లలు వస్తూనే దాలమ్మను వాటేసుకొని ఏడవసాగారు. యస్.ఐ. వాళ్లను నెమ్మదిగా సముదాయించి, “మీ నాన్నగారు ఎక్కడున్నారమ్మా?” అని అడిగారు సాహితిని.
“ఇంటర్ పేపర్లు దిద్దడానికి విజయవాడ వెళ్లారండి” అన్నది.
“మీ బంధువుల ఫోన్ నంబర్లు, ఎక్కడైనా రాసిపెడతారా?”
సాత్విక్ పరుగున వెళ్లి రెండో బెడ్ రూం షెల్పులో నుంచి ఒక పాత డైరీ తెచ్చి ఆయనకిచ్చాడు. ఆయన పేజీలు తిరగేసి, కొన్ని పేర్లు దాని ఎదుట లాండ్‌లైన్ నంబర్లు రాసి ఉండటం గమనించాడు. అప్పటికింకా సెల్ ఫోన్లు రాలేదు!.
“దీంట్లో మీ వాళ్ల పేర్లు చెప్పమ్మా!” అని అడిగాడు సాహితిని.
“మురళి, మా మామయ్యండి. గరివిడిలో ఉంటారు. జగన్నాథరావు, మా తాతయ్య. నర్సీపట్నంలో ఉంటారు.” చెప్పింది.
కానిస్టేబుల్‌ను పిలిచి ఈ రెండు నంబర్లకు ఫోన్ చేసి కబురు చెప్పమనీ చనిపోయినట్లు చెప్పకుండా, ఈ అమ్మాయికి సీరియస్‍గా ఉందని చెప్పి వెంటనే బయలుదేరి రావాలని చెప్పమన్నారు, ఎవరైనా హార్ట్ పేషంట్లు ఉంటే కష్టమని.
ఒక కానిస్టేబులు టివి దగ్గరున్న రెండు ఇన్‍లాండ్ లెటర్స్ తెచ్చి సి.ఐ. గారికిచ్చాడు.
పిల్లలను సత్యారావు భార్య శ్రీవల్లి తమ యింటికి తీసుకుని వెళ్లింది.
సాత్విక్ ఆమెని అడిగాడు “మా అమ్మకేమయిందాంటీ? ఎందుకు మమ్మల్ని అమ్మ దగ్గరకు పోనివ్వడం లేదు?”
శ్రీవల్లి హృదయం ద్రవించింది. వాడిని దగ్గరకు తీసుకుని “అమ్మకు ఒంట్లో బాగోలేదు బాబూ! అందుకే హాస్పిటల్‍కు తీసుకొనివెళుతున్నారు” అన్నది. కానీ సాహితికి మాత్రం అమ్మ చచ్చిపోయిందని అర్థమయింది. మానాన్ని రక్షించుకోడానికి ఆత్మహత్య చేసుకుందని తెలియదు పాపం. దొంగలే అమ్మను చంపేసినారనుకుంటున్నది.
సి.ఐ.గారు లెటర్సు చదివారు. ఒక దాంట్లో ‘దుర్గా లాడ్జి ఏలూరు రోడ్డు, రూం నంబరు 109’ అని తన అడ్రసుకు జాబు రాయమని శ్యామల రావు, భార్యకు రాసింది చూశాడు. ఒక కానిస్టేబుల్‍ని పిలిచి “ఇంకా ఎనిమిది కాలేదు, రూంలోనే ఉంటాడు. వైర్‍లెస్‍లో మన స్టేషను నుంచి విజయవాడ టు టౌన్ స్టేషనుకు ఫోన్ చేసి, ఈ అడ్రస్‍లో ఉండే శ్యామల రావు అనే అతన్ని ఉన్నవాడిని ఉన్నట్లుగా రమ్మని, అతని భార్యకు చాలా సీరియస్‍గా ఉండి హాస్పిటల్ చేర్చామనీ, ఎవరినయినా కానిస్టేబులును పంపి, కబురు చెప్పమనండి. త్వరగా వెళ్లు మన యస్.ఐ. గారి బైక్ తీసుకువెళ్ళు” అని చెప్పారు. దాలమ్మనూ, మరిడమ్మనూ పిలిచి, రక్తపుమడుగునంతా శుభ్రం చేయించారు సి.ఐ గారు. దాలమ్మ దగ్గర స్టేట్‌మెంట్ తీసుకున్నారు. శర్వాణి పార్థివ శరీరాన్ని పోస్టుమార్టంకు తరలించారు. వెనక వైపు స్క్రూలు తీసేసి, తెరిచిన కిటికీని, క్రిందపడిన స్క్రూలను ఫోటోలు తీసుకున్నారు.
పోలీసు వ్యాను, అంబులెన్స్, వెళ్లిపోయిన తర్వాత ఇంటికి సీల్ వేశారు పోలీసులు.
***
ఎనిమిది నలభైకి స్నానం చేసి, తయారై, క్రిందికి పోయి టిఫిన్ చేద్దామని అనుకుంటున్నాడు శ్యామల రావు. తలుపు కొట్టిన శబ్దమైది. “ఎవరు?” అని అంటూ తలుపు తీశాడు. బయట ఒక పోలీసు కానిస్టేబుల్ నిలబడి ఉన్నాడు.
“శ్యామల రావుగారు మీరేనా?” అని అడిగాడు
“అవునండి. నాతో ఏం పని?” అనడిగాడు శ్యామల రావు ఆశ్చర్యంగా.
“మీ మిసెస్‌కు చాలా సీరియస్‌గా ఉంది, కె.జి.హెచ్‍లో చేర్చారని మాకు వైజాగ్ నుంచి వైర్‍లెస్ మెసేజ్ వచ్చింది సార్! మీరు వెంటనే బయలుదేరి వైజాగ్ వెళ్లండి సార్! ఇక్కడొక సంతకం పెట్టండి. మేం మీకు ఇన్ఫాం చేసినట్లు” అని సైన్ చేయించుకుని వెళ్లిపోయాడు.
శ్యామల రావుకు కళ్లు బైర్లు కమ్మినట్లయింది. శర్వాణికి ఏమయింది. కాళ్లూచేతులూ ఆడలేదు. గబగబా బ్యాగ్‌లో బట్టలు కుక్కుకుని, కిందికి వచ్చి కౌంటర్లో డబ్బు కట్టి, రూం ఖాళీ చేస్తున్నానని చెప్పాడు
ఒక్కసారి స్పాట్ సెంటరుకు వెళ్లి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలనుకున్నాడు.
ఈలోగా కొన్ని టీవీ ఛానళ్లలో స్క్రోలింగ్ రాసాగింది. “విశాఖ శివారు లోని కొమ్మాది సింహగిరి కాలనీలో దోపిడీ దొంగల భీభత్సం! ఒక గృహిణి హత్య! హతురాలు శర్వాణి. ఆమె భర్త..” అంటూ.
శ్యామల రావు టీవీ చూడలేదు. ఇంతలో వైజాగ్ నుంచి వచ్చిన ఇంగ్లీషు లెక్చరర్లు ఇద్దరు లాడ్జ్ దగ్గరకొచ్చారు. శ్యామల రావు వాళ్లను చూసి, “పైడితల్లీ, రాంబాబూ, వచ్చారా, మా మిసెస్‌కు సీరియస్‍గా ఉండి కె.జి.హెచ్.లో చేర్చారట. నేను అర్జంటుగా వెళ్లాలి. పర్మిషన్..” అంటూంటే వాళ్లు ముఖాముఖాలు చూసుకున్నారు.
“మేం సి.యి. గారితో చెబుతాములే. నీవు వెళ్లడానికి ఇప్పుడు రైళ్లేవి లేవు. సింహాద్రి ఉంది గాని అది వైజాగ్ చేరేసరికి ఆరు దాటుతుంది. ఏదైనా కారు మాట్లాడుకుని వెళితే మంచిది” అని కౌంటర్‍లో ఉన్నతనితో “వైజాగ్‍కు ఏదైనా కారు అరేంజ్ చేయగలరా? మావాడు అర్జంటుగా వెళ్లాలి. వాళ్లావిడికు చాలా సీరియస్‍గా ఉందట!” అనడిగారు
“అయ్యో! అలాగా! ఉండండి మాస్టారు!” అని టీబుల్ మీద ఉన్న ల్యాండ్‌లైన్ నుంచి ఎక్కడికో ఫోన్ చేశాడు. “హలో! ప్రియాంకా టావెల్సా! మాకు అర్జంటుగా వైజాగ్‌కు ఒక కారు కావాలి. మంచి కండిషన్‌లో ఉన్నది పంపండి. కి.మీ.కు మూడు రూపాయలా! బోత్ సైడ్స్‌కి ఇవ్వాలా? డ్రైవరు బత్తా ఎక్‌స్ట్రానా? ఒక్క నిమిషం!” అని వాళ్లతో చెప్పాడు. శ్యామల రావును అడగకుండానే వాళ్లు “సరే! వెంటనే రమ్మని చెప్పండి” అన్నారు.
అరగంటలోపే ఫియట్ కారొకటి వచ్చి లాడ్జి ముందాగింది. ఇద్దరూ చెరో వెయ్యి రూపాయలు శ్యామల రావు జేబులో పెట్టారు.
“బి బ్రేవ్!” అని ధైర్యం చెప్పారు. ఫియట్ శ్యామల రావును ఎక్కించు కొని శరవేగంగా వైజాగ్ వైపు పరుగు తీసింది.
“పాపం మనవాడికి విషయం తెలియదురా! వెళ్లి చూసిం తర్వాత ఏమైపోతాడో” అన్నాడు రాంబాబు.
“తెలియక పోవడమే మంచిది. అంత దుఃఖంతో ప్రయాణం కూడా చెయ్యలేడు. స్పాట్‌కు రాకపోవడమే మేలయింది. మనవాళ్లు ఎవరయినా నోరు జారితే రిస్కు.”
“మనలో ఎవరమయినా తోడుగా వెళితే బాగుండునేమో?”
“నిజమే పైడీ! తోచలేదు. ఈ పాటికి విజయవాడ దాటేసి ఉంటాడు.”
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.