[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[అనుకున్నట్టుగానే కొమ్మాది ప్లాటులో ఇంటి నిర్మాణం ప్రారంభమవుతుంది. ప్రతి ఆదివారం శ్యామల రావు వెళ్ళి చూసి వస్తాడు. నర్సీపట్నంలో నగలు తయారయ్యాయని తెలుసుకుని, వెళ్ళి మిగతా డబ్బులు కట్టేసి నగలు తెచ్చేస్తాడు. పెళ్ళి రోజుకు వారం రోజుల ముందే అత్తామామల్ని, మురళీవాళ్ళని రమ్మంటాడు. అందరూ ఒక రోజు ముందే వస్తారు. శ్యామల రావు వాళ్ళ పెళ్ళి రోజున అందరూ ఉదయం కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్తారు. ఇంటికి వస్తూ దారిలో ఓ హోటల్‍లో టిఫిన్ తిని వస్తారు. ఇంటికి వచ్చాయ, ప్రసూనాంబ తనకి కళ్ళు తిరుగుతున్నాయని చెబుతుంది. ఆమెను విశ్రాంతి తీసుకోమని చెప్పి మాత్రలేసి పడుకోబెడుతుంది శర్వాణి. శర్వాణీ, మురళీ భార్య కలిసి వంట పూర్తి చేస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకి అందరూ భోంచేస్తారు. ప్రసూనాంబకు కొంచెం నిమ్మళించగా, కొద్దిగా అన్నం తిని మళ్ళీ పడుకుంటుంది. ఆ సాయంత్రం శ్యామల రావు, శర్వాణి, మురళి, అతని భార్యా, పిల్లలు సినిమా చూసి వస్తారు. ఆ రాత్రి తనకి ఆయాసం వస్తోందని చెప్తుంది ప్రసూనాంబ. పదకొండున్నరకి ఆయాసం బాగా ఎక్కువైతే, ఆటోలో ఓ ప్రైవేటు హాస్పటల్‍కి తీసుకువెళ్తారు. అక్కడి డాక్టర్ పరీక్ష చేసి, అప్పటికే చనిపోయిందని, మాసివ్ హార్ట్ ఎటాక్ అని చెప్తాడు. శ్యామల రావు భోరుమని ఏడుస్తాడు. మురళి ఇంటికి వెళ్ళి అందర్నీ తీసుకువస్తాడు. కాసేపటికి ఆసుపత్రి ఆంబులెన్స్‌లో ప్రసూనాంబ శవాన్ని ఇంటికి తెస్తారు. శర్వాణీ, శ్యామల రావులకు దుఃఖం ఆగదు. మర్నాడు తల్లి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. జగన్నాథం గారు అపరకర్మలకు ఏర్పాటు చేస్తారు. తన మిత్రుడు నందకుమార శర్మతో అన్ని కార్యక్రమాలు చేయిస్తారు. చివరి రోజున ఆయన శ్యామల రావు ఇచ్చిన డబ్బు తీసుకుని, లెక్క కూడా పెట్టుకోకుండా జేబులో పెట్టుకుని, శ్యామల రావుకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. – ఇక చదవండి.]
కాలం అత్యంత శక్తివంతమైనది. ‘టైం ఈజ్ గ్రేట్ హీలర్’ అన్నారు. ఎంతటి దుఃఖమైనా కాలగతిలో మానక తప్పదనేది ఆ సృష్టికర్తే ఏర్పాటు చేసి ఉంచాడు. ఎవరు ఉన్నా లేకపోయినా కాల మహా ప్రవాహం ఆగదు. అలా కాకపోతే, ఇంకేమయినా ఉందా?
అమ్మపోయిన దుఃఖం నుండి మెల్లగా తేరుకున్నాడు శ్యామల రావు. సాహితి సిక్స్త్‌కి వచ్చింది. సాత్విక్ రెండో తరగతి. సాహితికి నాన్నమ్మ చనిపోయిందనే విషయం అర్థమయింది గాని, వాడికి తెలుసుకునే వయసు లేదు. కొన్ని రోజుల పాటు, మాటిమాటికీ, నానమ్మ పడుకునే గదిలోకి వెళ్లి చూసి వచ్చేవాడు.
“అమ్మా, నానమ్మ ఇక రాదా?” అని అడిగేవాడు బేలగా.
“నానమ్మ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది నాన్నా” అన్న రొటీన్ డైలాగు వాడికి సాంత్వన కలిగించేది కాదు.
ప్రసూనాంబది లైఫ్ సైజ్ ఫోటో ప్రేము కట్టించి గోడకు బిగించారు. “అమ్మ పగడాల దండను నీవు వేసుకో శర్వా” అని శ్యామల రావు చెప్పినా, శర్వాణి వినలేదు. “అత్తయ్య కోరి చేయించుకున్నారండీ. అది ఆమె పటానికే వేస్తాను” అని పటానికి పైన చివర్లకున్న సన్నని మేకుల ఆధారంగా పగడాల సరాన్ని వేలాడదీసింది. ప్రశాంతమైన ఆమె వదనానికి అది చక్కగా అమరింది.
మూడు నెలల తర్వాత ఇంటి నిర్మాణం మీద దృష్టిపెట్టాడు శ్యామల రావు. శ్లాబ్ వేశారు. మరో మూడు నాలుగు నెలల్లో పూర్తవుతుందనీ, గృహప్రవేశానికి మంచి రోజు చూసుకోమని కూర్మారావు చెప్పాడు.
కాలేజీలో అందరూ శ్యామల రావు పట్ల సానుభూతి చూపారు. అన్నిటికంటే విశేషం, కుతూహలమ్మ గారు స్పందించిన తీరు. “అబ్బాయ్! ఎంతమందున్నా అమ్మకు సమానం కాదు. నాదీ నీ కథే. మా డాడీగారు నా చిన్నతనంలోనే చనిపోతే.. మా మమ్మీయే నన్ను పెంచి, పెద్ద చేసి, చదివించి యింతదాన్ని చేసింది. రెండేళ్ల క్రిందట ఆమెకు లివర్ పాడయ్యి, ప్రభువు దగ్గరకి వెళ్ళిపోయింది. నేను ఒంటరిదాన్నని ఎప్పుడూ నా దగ్గరే ఉండేది. మా అన్నయ్య తన దగ్గరకు అద్దంకి రమ్మని పిలిచినా, వెళ్ళి వారం రోజులకే తిరిగి వచ్చేది. నాకు ఆమ్లెట్ అంటే ఇష్టమని, ప్రతి రోజూ భోజనంలోకి చేసిపెట్టేది. ‘గాడ్ క్రియేటెడ్ మామ్స్ టు లుక్ ఆఫ్టర్ దిస్ వరల్డ్ యాజ్ హిజ్ రెప్లికాస్’ అని మా ఫాదర్ మత్తయ్య జోసెఫ్ గారు అంటుండేవారు లేయ్య! మీ అమ్మ పోయినప్పటినుంచి, నీ ముఖంతో కళాకాంతులే కరువైనాయి. గెట్ కన్‍సోల్డ్ అండ్ బి బ్లెస్డ్, మై బాయ్!” అన్నది. శ్యామల రావు భుజం మీద చెయ్యివేసి దగ్గరగా తీసుకుని, తల నిమిరింది.
‘ఎబ్బెట్టుగా అనిపించే ఆమె ఆహార్యం వెనుక యింత గుండెతడి ఉందా?’ అనుకున్నాడతడు. ఆమె కళ్ల నిండా నీళ్లు! బుగ్గల మీదుగా కారుతూ ఆమె ముఖానికి వేసుకున్న మేకప్ మీద చారికలు కట్టాయి. లిప్‍స్టిక్ వేసిన ఆమె పెదవులు దుఃఖంతో అదురుతున్నాయి.
“వెన్ వి మిస్ అవర్ మామ్, వి మిస్ ఎవ్వెరిథింగ్, అయ్యా” అన్నది కుతూహలమ్మగారు. కళ్లద్దాలు తీసి, కర్చీఫ్‌తో ముఖం తుడుచుకున్నది. స్టాఫ్ రూమ్‍లో ఒక మూల నున్న వాష్ బేసిన్ వద్దకు వెళ్లి అద్దంలో తన ముఖం చూసుకుంది
“మై గాడ్! వాట్ ఎ హరిబుల్ ఫేస్!” అని అరచి, ముఖం కడుక్కుని, బ్యాగ్ లోంచి చిన్న న్యాప్‍కిన్ తీసి, ముఖం శుభ్రంగా తుడుచుకుని, స్నో, పౌడర్ అద్దుకుంది. లిప్‍స్టిక్ కూడా దిద్దుకొని, జుట్టు సవరించుకుని, కళ్లద్దాలు పెట్టుకుంది. మళ్లీ మామూలుగా అయిపోయింది.
శ్యామలరావు దగ్గరికి వచ్చి, మళ్లీ ఇలా చెప్పింది:
“నీ సంగతి వేరులే అబ్బాయ్! నా కైతే ఎవరూ లేరు. నీకు భార్య, పిల్లలు ఉన్నారు. సో, యు నీడ్ నాట్ మిస్ ఎనీ థింగ్! పూల్ అప్ యువర్ స్పిరిట్స్ అండ్ డు జస్టిస్ టు యువర్ ఫ్యామిలీ!”
‘నిజమే’ అనుకున్నాడు శ్యామల రావు. శర్వాణిని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లకు అన్నీ తానే యిప్పుడు.
ప్రసూనాంబ చనిపోయి ఎనిమిది నెలలు దాటింది. ఒక ఆదివారం శర్వాణిని తీసుకుని, కొమ్మాదికి వెళ్ళాడు. ఇల్లు దాదాపు పూర్తయింది. ఇంటి చుట్టూ బయటపక్క కోర్టుయార్డు టైల్స్ పరుస్తున్నారు. పైన డాబా మీద ప్యారాపెట్ వాల్ కట్టడం జరుగుతూ ఉంది.
డైనింగ్ ప్లేస్ స్థానంలో 5×8 కొలతలతో దేవుని గది రూపుదిద్దుకుంది. పైన ఒక ఆర్చ్‌లాగా వచ్చి, లోపల దేవుని పటాలు, విగ్రహలు పెట్టుకునేటందుకు ఒకటిన్నర అడుగుల ఎత్తున అరుగు కట్టారు. గది గోడలకు తెల్లని టైల్స్ అతికించారు. ప్రతి టైల్ మీద వెలుగుతున్న దీపపు సెమ్మెలు ఎరుపు రంగులో మెరుస్తున్నాయి ఎదురుగ్గా గోడ మధ్యలో వినాయకుని బొమ్మ ఉన్న టైల్ వేశారు. అరుగును కూడ పూర్తిగా టైల్స్‌తో కప్పారు.
ఆ పూజ గదిని చూడగానే భార్యాభర్తల కళ్లలో నీళ్లూరాయి. “అత్తయ్య వుండి ఉంటే ఎంత సంతోషించేవారో!” అన్నది శర్వాణి. ఆమె గొంతు గద్గదమయింది. భార్య చేతిని గట్టిగా నొక్కిచెప్పాడు “ఆమే ఇప్పుడు వసు రూపంలో ఉంది. దేవుడి పటాలతో పాటు అమ్మ ఫొటోఫ్రేమ్ ఒకదాన్ని దేవుడి గదిలో పెట్టుకుందాము. నిత్యపూజలందుకుంటుంది”. శర్వాణి కళ్లలో వెలుగు! “ఎంత మంచి ఆలోచన వచ్చిందండీ” అన్నది.
మరో నెలరోజుల్లో పెయింటింగ్ చేశారు యింటికి. చిన్నదయినా ముచ్చటగా ఉంది. “మీరు గృహప్రవేశం ఎప్పుడైనా చేసుకోవచ్చును సార్” అని చెప్పాడు కూర్మారావు.
జగన్నాథరావు దంపతులు వీళ్లను చూసిపోవడానికి వచ్చారు. ఇల్లు పూర్తయిందనీ, గృహప్రవేశం చేసుకోమంటున్నాడనీ మామగారికి చెప్పాడు శ్యామలరావు.
“కర్మలు చేశావు కాబట్టి సంవత్సరం వరకు వారు శుభకార్యాలేవీ చేయకూడదు అల్లుడూ! ఎలాగూ అమ్మగారి సాంవత్సరీకాలు మరో నాలుగా నెలల్లో రాబోతున్నాయి. వాటి తర్వాత చేసుకోవచ్చు. కానీ ఇంకో చిక్కు ఉంది. రెండో సంవత్సరంలో కూడా నిషిద్ధమే. బేసి సంఖ్యలో అంటే మూడవ సంవత్సరంలోనే చేయాలంటారు.”
“అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరం ఆగాలి. అన్ని రోజులు అలా వదిలేస్తే..”
“నేను ఊరికి వెళ్లిన తర్వాత మా చిట్టి పంతుల్ని అడుగుతాను. శాస్త్రంలో ఏవైనా మినహాయింపులున్నాయేమో?”
పదిరోజుల తర్వాత ఆయన అల్లుడికి ఉత్తరం వ్రాశారు.
“చిట్టి పంతులేమంటాడంటే, సాంవత్సరీకాల తర్వాత గృహప్రవేశం చేసుకోవచ్చును. సరి, బేసి, సంవత్సరాల సమస్య అనుకుంటే, ఇంటి యజమాని దంపతులకు బదులు, వారి రక్తసంబంధీకులెవరినైనా పీటల మీద కూర్చోబెట్టి చేయించవచ్చును. అని! కాబట్టి ఈ నాలుగు నెలలూ గడిచిన తర్వాత మురళినీ, వాడి భార్యనూ పీటల మీద కూర్చోమంటే సరి.”
ఈ పరిష్కారం బాగుందనుకున్నారు. ప్రసూనాంబ సాంవత్సరీకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. కలెక్టరాఫీసు డవున్‌లో ‘విప్రసేవాసమితి’ అన్న సంస్థ ఉంది. అక్కడ ఇలాంటి కార్యాలు చేసుకోడానికి వసతి సౌకర్యాలు ఉన్నాయి. వారి బ్రాహ్మడే తతంగం నిర్వహిస్తాడు. కావలసిన సంబారాలు, భోజనాలు అన్నవాళ్లే చూసుకుంటారు. మొత్తం మూడు రోజుల కార్యక్రమానికి పన్నెండు వేలయింది.
చిట్టి పంతులుగారే గృహపవేశానికి ముహూర్తం పెట్టారు. కాలేజి స్టాఫ్, దగ్గరి బంధువులు, స్నేహితులు అంతా కలిసి వందమంది తేలారు. వంటవాళ్లను సీనియర్ అసిస్టెంట్ సాంబమూర్తిగారు కుదిర్చారు. కొత్తవలస వాళ్లది. టిఫిన్లు, భోజనాలు వాళ్లే తయారు చేశారు. పెరట్లో పెద్దవి గ్యాస్ స్టవ్‍లు పెట్టుకుని పనిచేశారు.
డాబా మీద షామియానా వేయించి, సప్లయర్స్‌తో డైనింగ్ బల్లలు, కుర్చీలు తెప్పించాడు మురళి. దేవుడి గదిలో దేవతలందరూ కొలువు తీరారు; ప్రసూనాంబతో సహా!
మురళి దంపతులు పీటల మీద కూర్చుని సత్యనారాయణవ్రతం, వాస్తు శాంతి, నవగ్రహ హోమం చేయించారు. చిట్టి పంతులుగారే పురోహితులు. పిలిచిన వాళ్లందరూ వచ్చి శ్యామల రావు దంపతులను ఆశీర్వదించి, కానుకలు చదివించారు. పూజలు ముగిసిం తర్వాత డాబా మీద భోజనాలు ప్రారంభమయ్యాయి. ఏ ఫంక్షన్లకూ రాని కుతూహలమ్మగారు ఇక్కడికి వచ్చి, దంపతులను ఆశీర్వదించి, లక్ష్మీదేవిది ఒక వెండి ప్రతిమను బహూకరించారు. కొన్ని పూర్ణంబూరెలు అడిగి ప్యాక్ చేయించుకున్నారు.
కాలేజి స్టాఫ్ అందరూ కలిసి పదిహేను వందలు పెట్టి ఒక రెగ్జిన్ క్లాత్ సోఫా సెట్టును, ఒక టీపాయిని గిఫ్ట్‌గా యిచ్చారు. మురళి బావగారికి ఆరు గ్రాముల బంగారు ఉంగరం, చెల్లెలికి ధర్మవరం పట్టుచీర పెట్టాడు. జగన్నాథరావు గారు కూతురి చేతిలో రెండు వేల రూపాయలు పెట్టారు. శ్యామల రావు దంపతులు అత్తామామలకు, మురళి దంపతులకు పట్టుబట్టలు పెట్టారు. దగ్గరి బంధువులకు కూడా బట్టలు పెట్టారు. వాళ్లు కూడా వీళ్లకు పెట్టారు. ఇదికాక వచ్చిన వారందరికి చిన్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన రాధాకృష్ణుల బొమ్మను ఇచ్చారు.
నాల్రోజుల తర్వాత, ఒక ఆదివారం నాడు, ఒక డి.సి.ఎం. టయోటా వ్యానును మాట్లాడుకుని, సామాన్లన్నీ కొత్త యింటికి తరలించారు. ఇల్లు ఖాళీ చేశారు.
పిల్లలను కొమ్మాదికీ, మధురవాడకూ మధ్యన ఉన్న విద్యాభారతి స్కూలుకు మార్చారు. వీళ్ల కాలనీలోనే ఆ స్కూల్లో చదివే పిల్లలు కొందరున్నారు. ఒక ఆటోవాడు పిల్లలను స్కూలుకు తీసుకొని వెళ్లి, సాయంత్రం తీసుకొని వస్తాడు.
ఇల్లంతా సర్దుకుని స్తిమితపడటానికి వారం రోజులు పట్టింది. వాతావరణం అక్కడ చాలా బాగుంది. చల్లగా గాలి వీస్తుంది. ఒక పదిహేను ప్లాస్టిక్ కుండీలు కొని వాటిలో మట్టి నింపి, పూల మొక్కలు, కొత్తిమీర, పుదీనా, పాలకూర విత్తనాలు వేసింది శర్వాణి.
శ్యామల రావుకు కాలేజీ బాగా దగ్గరయింది. నడిచి జంక్షన్ వరకు వెళ్లి భీమిలి బస్ ఎక్కడం అనవసరమనిపించి, స్కూటర్ మీదే వెళుతున్నాడు. శర్వాణికి పొద్దున వంట హడావిడి తగ్గింది.
చాలా ఇళ్లు లేచాయిగాని, ఇంకా ఖాళీ ప్లాట్లు, నిర్మాణంలో ఉన్నవి చాలానే ఉన్నాయి. ఊరికి చాలా దూరం. ఏది కావాలన్నా కొమ్మాది జంక్షన్ వరకు వెళ్లాల్సిందే.
మరో సంవత్సరం గడిచింది. ఇంకో పి.ఆర్.సి. రాబోతూంది. శ్యామల రావుకు ఈ క్యాడర్‌లో మరింత ఆర్థిక లాభం చేకూరనుంది.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు శ్యామలరావును విశాఖ వుమెన్స్ కాలేజికి డిపార్టుమెంటు ఆఫీసరుగా వేశారు. రోజూ ఉదయం ఏడుగంటల కల్లా పోలీసు స్టేషనుకెళ్లి, క్వశన్ పేపర్ల బండిల్ తీసుకొని, చీఫ్ సూపరింటెండెంట్‌తో కలిసి ఏడున్నరకల్లా సెంటరు చేరుకోవాలి. ఏడు నలభై అయిదుకు బండిల్స్ ఓపన్ చేసి, ఎనిమిదికి రూములకందించాలి ప్రశ్నా పత్రాలను.
పరీక్షలు ముగిశాయి. డ్యూటీ చేసిన రెమ్యూనరేషన్ వెయ్యి రూపాయలు వచ్చింది. తర్వాత స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమయింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో కలిసి వైజాగే సెంటరు. రెండు కాలేజీల్లో ‘స్పాట్’ జరగసాగింది. ఒకటి ద్వారకా నగర్ లోని బి.వి.కె. కాలేజి, రెండోది రామా టాకీసు జంక్షన్‌కు దగ్గరలో ఉండే లంకపల్లి బుల్లయ్య కాలేజీ. రెండూ ఎయిడెడ్ కాలేజీలే. వాటిల్లో ఐతే ఫర్నిచర్, ఫ్యాన్లు, టాయిలెట్లు అన్నీ ఉంటాయని బోర్డు ఎయిడెడ్ కాలేజీల్లోనే స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తుంది.
శ్యామల రావుకు అసిస్టెంట్ ఎగ్జామినర్‌గా ఆర్డర్సు వచ్చాయి. బి.వి.కె.లో అతని డ్యూటీ. సిటీ బస్సులో వెళ్లి, కాంప్లెక్స్ దిగి సెంటరుకు నడుచుకుంటూ వెళ్లేవాడు. దారిలో ద్వారకా టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చేసేవాడు. లంచ్ బాక్స్ మాత్రం ఏ పులిహారో, కొబ్బరన్నమో చేసిచ్చేది శర్వాణి.
శ్యామల రావుకు చీఫ్ ఎగ్జామినర్ వైకుంఠ రావు గారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల కాలేజీ ఇంగ్లీషు లెక్చరర్. స్పాట్ వాల్యుయేషన్ ఇరవై రోజులు జరిగింది. ఎల్లుండి పూర్తవుతుందని రిలీవింగ్ ఫామ్, టి.ఎ. డి.ఎ, ఔట్ స్టేషన్ అలవెన్స్ ఫారాలిచ్చేశారు. అందరికీ, ఎన్ని పేపర్లు వస్తాయో కూడా చెప్పేశారు ‘వర్క్స్ డన్’ స్టేట్‌మెంట్ నింపడానికి.
అందరూ తమకు ఎంతొస్తుందోనని లెక్కలు వేసుకోసాగారు. శ్యామల రావుకు రెండువేల అయిదువందలకు పైగా వస్తుందని తేలింది. ఆ రోజు రాత్రి ఆ మాట శర్వాణితో చెబితే, పరీక్షలు, స్పాట్ డ్యూటీల ద్వారా వచ్చే డబ్బును ప్రతి సంవత్సరం సాహితికి ఎంతో కొంత బంగారం తీసుకుందామనీ; పిల్ల పెళ్లికి, చూసుకోనక్కర లేకుండా ఉంటుందనీ చెప్పింది. స్పాట్ తర్వాత దాదాపు నెలన్నరకు పైగా వేసవి సెలవులుంటాయి. సెలవుల్లో పూరి, భువనేశ్వర్, కోణార్క్ టూర్ వేద్దామని మురళి ప్రపోజ్ చేశాడు.
రిలీవయ్యే రోజు, అందరూ ఫామ్స్ నింపి ఇచ్చేసి, పేమెంట్ కోసం ఎదురుచూస్తుండగా, క్యాంప్ ఆఫీసరు పైడినాయుడుగారు వచ్చి ఇలా చెప్పారు:
“ఇంగ్లీషు మాస్టార్లు! నేను చెప్పేది జాగుత్తగా వినండి! రాజమండ్రి, విజయవాడ సెంటర్లలో ఇంగ్లీషు వాల్యూయేషన్ ఇంకా పూర్తవలేదట. రిజల్ట్ లేటవకూడదు కాబట్టి మన వైజాగ్ నుంచి, అటు ఒంగోలు నుంచి అసిస్టెంట్ ఎగ్జామినర్లను పంపించమని బోర్డు నుంచి మౌఖిక ఆదేశాలు!
నిన్న సాయంత్రం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో గౌరవ కార్యదర్శిగారు చెప్పారు. టి.ఎ. ఒకటిన్నర రెట్లు ఇస్తామనీ, ఔట్ స్టేషన్ అలవెన్సు రెండింతలు చేస్తామనీ. ‘విల్లింగ్’ ఉన్నవాళ్లను డైరెక్ట్‌గా ఆ సెంటర్లకు రిపోర్టు చేయమనీ చెప్పారు.
ఇందులో బలవంతమేమి లేదు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‍లో పార్ట్ అండ్ పార్సెల్ ఐన మనం బోర్డుకు కో-ఆపరేట్ చేయాలి కదా! పైగా బోలెడంత డబ్బొస్తుంది. కనీసం వారం రోజులు పడుతుందట, రిపోర్టు చేసిన ఎ.ఇ.లను బట్టి!
మిమ్మల్ని మోటివేట్ చేసే బాధ్యతను, సెక్రెటరీ గారు నా మీదే పెట్టారు. మన సెంటరు నుంచి కనీసం యాభైమందన్నా పోకపోతే నా పరువు దక్కదు! రాజమండ్రికి, విజయవాడకు విడివిడిగా ‘విల్లింగ్’ రిటన్‍గా వ్రాసివ్వండి. మీకు వేరే అపాయింట్‌మెంట్ ఆర్డర్సు ఉండవు. మీ విల్లింగ్‌నెస్‌ను యాక్సెప్ట్ చేసినట్లుగా దాని మీదే నేను ఎండార్స్ చేసి, రిలీవింగ్ ఆర్డరు ఇస్తాను. దట్ విల్ సఫైస్!” అని సి.ఓ.గారు వెళ్లిపోయారు.
ఇంగ్లీషు మాస్టర్లందరూ చర్చించుకున్నారు. “సెలవులే గదా అంత కంటే చేసేముంది? పదండి పోదాం” అన్నారు కొందరు. “విజయవాడ ఎండలకు తట్టుకోలేం, రాజమండ్రి అయితే మేలు” అన్నారు మరికొందరు. “విజయవాడలో టి.ఎ. ఎక్కువ వస్తుందేమో కనుక్కోండి” అన్నారు కొందరు దీర్ఘదర్శులు.
రిటైర్మెంటుకు దగ్గర్లో ఉన్నవారు, ఆరోగ్యం సరిగా లేనివారు కొందరు తప్ప, అందరూ ‘విల్లింగ్’ రాసిచ్చారు. శ్యామల రావును విజయవాడకు పంపుతున్నామని చెప్పారు.
మర్నాడు మధ్యాహ్నానికి రిపోర్టు చేయాలి! శ్యామల రావు ఇంటికి వెళ్లి భార్యతో విషయం చెప్పాడు. వారం రోజులకీ పదిహేను వందల దాకా రావొచ్చునన్నాడు.
“డబ్బుదేముంది గానీ, ప్రభుత్వానికి, బోర్డుకు, రిజల్టు లేట్ కాకుండా సహకరించాల్సిన నైతిక బాధ్యత గురించి క్యాంప్ ఆఫీసర్ గారు చెప్పినపుడు, వెళ్లాలనిపించింది వాణీ!” అన్నాడు.
“వెళ్లి రండి! నేనే ఒంటరిగా ఉండాలికదా, పిల్లలతో అని ఆలోచిస్తున్నాను. కానీ తప్పదు కదా! వెళ్లకపోతే గిల్టీనెస్ మనసును బాధిస్తుంది” అన్నది శర్వాణి.
కావలసిన బ్యాగ్ సర్దుకొని, రాత్రి విశాఖ-విజయవాడ ప్యాసెంజరులో బయలుదేరాడు శ్యామలరావు.
ఉదయం రైలు విజయవాడ చేరుకుంది. స్పాట్ వాల్యుయేషన్ ‘సిద్ధార్థ’ కాలేజిలో. అది ఏలూరు రోడ్డులో ఉంది. అక్కడికి దగ్గరలోనే ఉన్న ‘దుర్గా లాడ్జి’లో ఒక సింగిల్ రూం తీసుకున్నాడు శ్యామల రావు. అద్దె రోజుకు ముఫ్ఫై రూపాయలు. స్నానం చేసి కాసేపు రిలాక్స్ అయ్యాడు. తొమ్మిదింటికి లేచి, తయారై ఎదురుగ్గా ఉన్న శ్రావణి టిఫిన్ సెంటర్లో పెసరట్టు ఉప్మా తిని, కాలేజీకి వెళ్లి రిపోర్టు చేశాడు. సాయంత్రానికి తెలిసిందేమిటంటే చాలా మంది రాలేదనీ, పదిరోజులు పట్టవచ్చనీ. సాయంత్రం రూముకు తిరిగివచ్చిన తర్వాత ఎందుకో చాలా అనీజీగా అనిపించింది. శర్వాణి, పిల్లలు గుర్తుకు వస్తున్నారు. కానీ, విధి నిర్వహణ! హరిశ్చంద్రుడు చెప్పినట్లు “దేవీ! కర్తవ్యనిర్వహణలో మనము మరొక విధంబుగా చరించుట కూడదు కదా!”
***
రాత్రి పిల్లలకు అన్నాలు పెట్టింది శర్వాణి, కాసేపు చదువుకొని వాళ్లు పడుకున్నారు. ఆమెకు నిద్ర వస్తున్నట్లు అనిపించలేదు. కాసేపు టి.వి. అయినా చూద్దామని హల్లోకి వచ్చింది. ముందు తలుపు, పెరటి తలుపు జాగ్రత్తగా లాక్ చేసుకుంది. “రాత్రి తొమ్మిది తర్వాత ఎవరొచ్చి తలుపు కొట్టినా తీయకు. పెరట్లోకి తలుపు తీసుకొని వెళ్ళకు” ఇలా సవాలక్ష జాగ్రత్తలు చెప్పి వెళ్లాడు శ్యామల రావు.
సోఫాలో కూర్చుని టి.వి. పెట్టింది. ఈ మధ్యే బ్లాక్ అండ్ వైట్ టి.వి అమ్మేసి ఇరవై ఎనిమిది యించుల కలర్ టివి తీసుకున్నారు, బి.పి.ఎల్ కంపెనీది. ఈటీవీలో వార్తలు వస్తున్నాయి. టీవీ చూస్తూ కూర్చుంది. చివర్లో, ఒరిస్సా నుంచి దొంగల గ్యాంగ్ వైజాగ్‍లో దిగిందనీ, సిటీ అవుట్‌స్కర్ట్స్‌లో, ఐసోలేటెడ్‌గా ఉన్న ఇళ్ళను, ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారనీ, కాబట్టి ఊర్లకు వెళ్ళేవారు తమకు దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్లో వివరాలు ఇచ్చిపోవాలనీ విశాఖ పోలీసు కమీషనర్ గారు ఒక పత్రికా సమావేశంలో చెబుతున్నారు.
శర్వాణికి భయమేసింది. ఛానెల్ మార్చింది. పాటల పోటీల పోగ్రాం వస్తూంటే కాసేపు చూసింది. పిల్లలు బాగానే పాడుతున్నారు కాని, జడ్జీలు ప్రతి పాటనూ విశ్లేషించి సుత్తి కొడుతున్నారు. పదిగంటలకు మళ్లీ తలుపులన్నీ చెక్ చేసుకుని పిల్లల దగ్గర మేను వాల్చింది. శ్యామల రావే గుర్తుకు వస్తున్నాడు. పెళ్లయిందగ్గర్నించి ఇలా దూరంగా ఎప్పుడూ ఉండలేదు.
పొద్దున్న ఆరుగంటలకు పనిమనిషి దాలమ్మ వచ్చి కాలింగ్ బెల్ కొడితే గాని మెలకువ రాలేదు శర్వాణికి తేచి తలుపు తీసింది.
“అమ్మగోరూ! రేత్రి మన పక్క గౌతమీ హోమ్స్‌లో దొంగలు పడినారట. పెద్దాయన ఒక్కడే ఉన్నాడట. కొడుకూ కోడలూ, పిల్లలను తీసుకొని ఏదో టూరు పోయినారటమ్మా. ఆ ఏరియాలో గూడ మన కాలనీ నాగే దూర దూరం గుంటాయి యిల్లులు. ముసలాయన అపరాత్రి పెరటి తలుపు తీసుకోని బాత్ రూముకు పోయినాడట.
ఇద్దరు దొంగలటమ్మా. ముకాలకు ముసుగు తీసుకున్నారంట. ముందే గోడదూకి పెరట్లో నక్కి ఉన్నారట. ఆయనను కత్తులు సూపించి బెదిరించి తనకు తీసుకెళ్లి, బీరువా తాళాలు ఇమ్మన్నారట. ఆయన ఇయ్యనంటే తలమీద కత్తిపిడితో మోదారట. పది కాసుల బంగారం, రెండువేల నగదు తీసుకొని, ఆయన అరవకుండా నోట్లో గుడ్డ కుక్కి, పారిపోయారట. వాళ్లింట్లో మా తోటికోడలే పనిచేస్తాది. పొద్దున ఆ దాయి పోయి తలుపు కొడితే, తలంతా రక్తం, బనియను తడిసిపోయి, నోట్ల గుడ్డలతో, కనిపించాడట. నాలుగయిదు ప్లాట్లవతల గాని ఇంకో యిల్లు లేదట. వాళ్లను లేపి విషయం చెబితే, వాళ్లు పెద్దాయనను ఆనందపురంలోని ఏదో హాస్పిటల్‌కు తీసుకొనిపోయినారంట.”
శర్వాణికి ఒళ్ళు జలదరించింది! “అయ్యో పాపం! ఆయన ప్రతిఘటించకుండా ఉండాల్సింది దాలమ్మా” అంది.
“మీరు కూడ జాగర్తగ ఉండాలమ్మా, అసలే అయ్యగారు కూడ లేరు. పగటి పూట తిరిగి ఎవరిల్లు తాళమేసి ఉంది, ఎవరింట్లో ముసలోల్లు, ఆడోళ్లు మాత్రమే ఉన్నారని ఇశారిచ్చికుంటారంట అమ్మగోరూ” అన్నది దాలమ్మ.
పిల్లలు ఆటో స్కూలుకు వెళ్లిపోయారు. శర్వాణి మనసు వికలమైంది. మహారాణిపేట, న్యూ కాలనీలో ఎంతో సెక్యూర్డ్‌గా ఉండేది. సొంతయిల్లని యిక్కటి కొచ్చిపడ్డారు. ఫుల్ ప్లెడ్జెడ్‍గా కాలనీ ఫాం అయ్యేంత వరకు రిస్క్ తప్పదు. టిఫిన్ కూడా చెయ్యబుద్ధి కాలేదు. పిల్లలకు క్యారేజీలో కట్టిచ్చిన నిమ్మకాయ పులిహోర, పెరుగన్నం, పదకొండు గంటలకు తినేసి, భర్తకు ఉత్తరం రాసింది. అడ్రసు ‘అసిస్టెంట్ ఎగ్జామినర్ ఇన్ ఇంగ్లీష్, స్పాట్ వాల్యుయేషన్ సెంటర్, సిద్ధార్థ కాలేజి, ఏలూరు రోడ్డు, విజయవాడ’ అని రాసింది. రాత్రి నిద్ర పట్టలేదు. చీమ చిటుక్కుమన్నా దొంగలేమో అని భయం. ఇల్లు తాళం వేసి అమ్మావాళ్ల దగ్గరికి నర్సీపట్నంగాని, అన్నయ్య వాళ్ల దగ్గరికి గరివిడి గాని వెళ్లిపోదామా అనుకుంది. తాళం వేసి ఉన్న యిళ్లు టార్గెట్ చేస్తున్నారన్నది గుర్తొచ్చి, ఆ ఆలోచన విరమించుకుంది.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.