Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెతడి-1

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

ఇంటి ముందు రిక్షా ఆగింది. శ్యామల రావు, ప్రసూనాంబ దిగారు.

“అమ్మా, జాగ్రత్తగా దిగు” అంటూ తల్లి చేయి పట్టుకుని దింపాడు కొడుకు. దాన్ని చూసిన అమ్మాయి తండ్రి జగన్నాథరావు, పక్కనున్న భార్య విశాలాక్షితో, “అబ్బాయి సంస్కారవంతుడిలానే ఉన్నాడు. చూడు వాళ్లమ్మను ఎంత ఇదిగా చూసుకుంటున్నాడో!” అన్నాడు.

ఇద్దరూ ఎదురు వెళ్లి వాళ్లను సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. తీసుకుని వెళ్లి ముందు రూములో ఉన్న కుర్చీలతో కూర్చోబెట్టారు.

రామారావుపేటలో, మూడో లైనది. పొడుగ్గా నాలుగు గదులున్నాయి. ముందు రూము మరీ చిన్నది. తర్వాతది హలు అనుకోవచ్చు. దాని వెనక వంటిల్లు. భోజనాలు కూడ అక్కడే. చివర పెంకులతో వసారా దింపారు. ఒక వైపు గిన్నెలు, బట్టలు ఉతుక్కునే గట్టు, మరో వైపు బాత్రూం, లెట్రిన్ ఉన్నాయి.

“రండి, యిల్లు చూద్దురు గాని” అన్నాడు పిల్ల తండ్రి.

శ్యామల రావు లేవబోతూంటే, “కనబడుతూంది లెండి” అన్నది తల్లి లేచి చూడడానికి బద్ధకిస్తూ. కొడుకు మళ్లీ కూర్చున్నాడు.

“నర్సీపట్నం చాలా పెద్ద ఊరేనండీ! నేనింకా పల్లెటూరేమో అనుకున్నాను” అన్నాడు ఆయనతో.

“అయ్యో, నాయనా, ఇది రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టరు. ‘ఏజన్సీ ముఖ ద్వారం’ అంటారు దీన్ని చుట్టుపక్కల ముఫై నలబై ఊళ్లకు ఇది సెంటరు” అన్నాడు జగన్నాథరావు.

“మీరు విశాఖపట్నంలో ఎక్కడ ఉండేది?” అనడిగాడు.

“మేం మహరాణిపేటలో ఉంటామండి” అన్నాడు శ్యామలరావు.

“మీరు సర్వీసులో చేరి ఎంత కాలమైంది?”

“రెండేళ్లు దాటుతూందండి. మా నాన్నగారు వి.యస్. కృష్ణ గవర్నమెంట్ కాలేజీలో యుడిసిగా చేసేవారు. ఆయన పోయాక కంపాషనేట్ గ్రవుండ్స్ క్రింద నాకు ఉద్యోగమిచ్చారు యల్.డి.సిగా. ఈ మధ్య పేర్లు మార్చి జూనియర్ అసిస్టెంట్ అంటున్నారు మమ్మల్ని. నాకు పూసపాటిరేగ కాలేజీలో పోస్టింగ్ యిచ్చారు. రోజూ క్యారేజీ తీసుకొని బస్సులో వెళ్లి వస్తాను.”

పిల్లవాని వినయం ముచ్చట గొలిపింది జగన్నాథరావుకు.

“అమ్మాయిని తీసుకురండి. మళ్లీ దుర్ముహూర్తం ఉంది” అన్నది ప్రసూనాంబ.

లోపల ఎవరో ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు. విశాలాక్షమ్మ లేచి లోపలికి వెళ్ళింది. ఆమె, ఇంకోకామె, చెరి ఒకవైపు రెక్కపట్టుకుని అమ్మాయిని నడిపించుకుని వచ్చారు. కుర్చీలకెదురుగ్గా వేసి ఉన్న చిన్న జంపఖానా మీద కూర్చోబెట్టారు.

శ్యామలరావు అమ్మాయి ముఖం చూద్దామంటే, తల బాగా క్రిందికి వంచి కూర్చోని ఉంది.

“నీ పేరేంటమ్మా” అని అడిగింది ప్రసూనాంబ.

“శర్వాణి అండీ!” అన్నదా పిల్ల తలెత్తి ప్రసూనాంబను చూస్తూ. అప్పుడే శ్యామల రావును కూడా చూసింది. కొన్ని సెకన్లపాటు ఇద్దరి కళ్లూ కలుసుకున్నాయి.

‘అంత రంగేమీ కాదు. కానీ ముఖంలో మంచి కళ ఉంది’ అనుకున్నాడు. ముఖ్యంగా ఆ కళ్ళు చాలా పెద్దవి. టెన్షన్ వల్లనో ఏమో, ఆమె కణతల నుంచి చెమట ధార! చాలా ఒత్తయిన జుట్టు.

లేత నీలం రంగు వాయిల్ చీర, దానికి గులాబీరంగు బార్డరు. ఎరుపుగళ్ల జాకెట్టు వేసుకుంది. మెడలో సన్న బంగారు గొలుసు తప్ప ఒంటి మీద నగలేవీ లేవు.

“నీవేమయినా అడగదల్చుకుంటే అడగరా!” అన్నది కొడుకుతో తల్లి.

“మీకు సొంతంగా నడవడం రాదా?” అన్నాడు నవ్వుతూ

శర్వాణి తలెత్తి అతన్ని చూసి నవ్వింది. ఆ నవ్వు చాలా బాగుంది. “అదేం లేదండి. అలా తీసుకురావాలేమో మరి.”

“ఎంతవరకు చదువుకున్నారు?”

“ఇక్కడే జూనియర్ కాలేజీలో ఇంటరు చదివాను.”

“ఏ గ్రూపు?”

“హెచ్.యి.సి”

“మరి డిగ్రీలో చేరలేదా?”

తండ్రి వైపు చూసింది శర్వాణి.

“ఈ ఊర్లో డిగ్రీ కాలేజి ఉంది కాని నాయనా, ఊరికి చాలా దూరం. చింతపల్లి రోడ్డులో దాదాపు నాలుగు కిలోమీటర్లుంటుంది. ఆడపిల్ల అంత దూరం వెళ్లిరావడం క్షేమం కాదని..”

డిగ్రీలో చేరలేదా అని అన్నాడు కాని శ్యామల రావుకు భార్య పెద్ద చదువు చదవడం, ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇంటిపట్టున ఉంటూ, తన తల్లితో సఖ్యంగా మెలుగుతూ, పిల్లలను చక్కగా చూసుకునే భార్య కావాలి అతనికి.

ఎవరో ఒక అమ్మాయి స్టీలు ప్లేట్లల్లో పప్పుచెక్కలు, రవ్వలడ్డు, ఒక ట్రేలో పెట్టుకుని వచ్చి అందరికీ ఇచ్చింది.

“అమ్మాయికి వంటావార్పూ..” అన్నది ప్రసూనాంబ.

“చేస్తుందండి. సంగీతం కూడా చెప్పించాము.”

“ఏదీ ఒక పాట పాడమ్మా.”

శర్వాణి జంకలేదు. తల్లివైపొకసారి చూసి, గొంతు సవరించుకొని, “హిమగిరి తనయే, హేమలతీ, అంబా ఈశ్వరి శ్రీలలితే, మామవా,” అంటూ ఎక్కడా తడబడకుండా, శృతి తప్పకుండా ఆ కీర్తన పాడింది. ఆ అమ్మాయి గొంతు బాగుంది. శ్యామల రావు చప్పట్లు కొట్టబోయి తల్లిముఖం చూసి ఆగిపోయాడు. “ఇంత శాస్త్రీయ సంగీతం కాకుండా, మంచి సినిమా పాట ఏదైనా..” అన్నాడు.

వెంటనే ఆ పిల్ల “తోటలోకి రాకురా, తుంటరి తుమ్మెదా, గడసరి తుమ్మెదా” అంటూ ఎత్తుకుంది. చక్కగా పాడింది. శ్యామల రావుకు ముందు పాడిన దాని కంటే ఈ పాట నచ్చింది. అదే ఆ అమ్మాయితో అంటే మనోహరంగా నవ్వింది. ‘నవ్వితే మటుకు గుండె పులకరించేలా నవ్వుతుంది’ అనుకున్నాడు.

“వీళ్లున్నయ్య ఏం చేస్తున్నాడన్నారు?”

“ఇక్కడే పాలిటెక్నిక్ చదివి, గరివిడి ఫెర్రో అల్లాయ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడండి. వాడి పేరు మురళి. పదిహేనురోజులకొక సారి వచ్చిపోతుంటాడు”

“మాకు వీడొక్కడే నండీ” అన్నది ప్రసూనాంబ.

వెళ్లొస్తామని చెప్పి బయలుదేరారు అమ్మా కొడుకూ. ఆర్.టి.సి. కాంప్లెక్స్‌కు పోయి వైజాగ్‍కు పోయే ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కారు. తాళ్లపాలెం వరకు సింగిల్ రోడ్డే. తర్వాత హైవే. వైజాగ్‌కు వెళ్లే లోపు మూడు రైల్వే లెవెల్ క్రాసింగులు. మొత్తం వందకి కిలోమీటర్ల లోపే అయినా మూడు గంటల ప్రయాణం. వాళ్ళు ఇల్లు చేరేసరికి ఎనిమిదయింది. స్నానాలు చేశారు. వైజాగ్‌లో కనీసం రోజుకు మూడుసార్లైనా స్నానం చేయకపోతే కుదరదు. చిరచిరగా ఉంటుంది.

వరినూకతో ఉప్మా చేసింది ప్రసూనాంబ. కందిపొడి, నెయ్యి వేసుకుని తిన్నారు.

శ్యామల రావు వాండ్లది కూడా మూడు గదుల ఇల్లే. రెండు గదుల తర్వాత కొంచెం ఓపెన్ ప్లేసు, తర్వాత వంటిల్లు విడిగా ఉంటుంది. ఇల్లు ఎత్తుగా ఉండి వీధిలో నుంచి ఇంట్లోకి ఏడెనిమిది మెట్లెక్కి వెళ్లాల్సి ఉంటుంది.

మర్నాడు ఆదివారం. శ్యామల రావుకు కాలేజీ లేదు. పొద్దున్ననిదానంగా లేచి, కాఫీ తాగుతున్నాడు.

“కూరలేమి లేవురా, వెళ్లి తెచ్చేయకూడదూ!” అన్నది తల్లి.

“వెళ్తానే, నాకు డాబాగార్డెన్సులో పని ఉంది. మా ప్రిన్సిపాల్ గారు కొన్ని హోమియో మందులు తెమ్మని చెప్పారు. అక్కడ్నుంచి పూర్ణా మార్కెట్టుకు వెళ్లి కూరగాయలు తెస్తాలే.”

“అయితేను, పండు మిరపకాయలు రెండు కేజీలు, కొత్తచింతపండు కేజీ తెచ్చేయి నాన్నా, నిలవ పచ్చడి పెడతాను. డజను నిమ్మకాయలు కూడా”

“నేను బయట టిఫిన్ చేస్తా. నా కోసం టిఫినేమీ చేయకే అమ్మా”

“సరీలే. నేను రాగిజావ తాగేస్తా. పెందలకడనే భోంచేద్దాము”

స్నానం చేసి సైకిలెక్కి డాబాగార్డెన్స్‌కి వెళ్లాడు శ్యామల రావు. దారిలో డైమండ్ పార్కు దగ్గర ఒక టిఫిన్ బండి కనబడితే, ఆగి రెండిడ్లీ, సింగిల్ పూరీ తిన్నాడు. సైకిలు తొక్కుతూంటే శర్వాణి రూపమే మాటిమాటికి కళ్లముందు కదలాడసాగింది.

‘అమ్మకు ఆ అమ్మాయి నచ్చిందో లేదో! ఇంతవరకు ఆ ప్రసక్తి తేలేదు’ అనుకున్నాడు.

ప్రిన్సిపాల్ గారు చెప్పిన మందులు తీసుకుని పూర్ణా మార్కెట్ చేరుకున్నాడు. సైకిలు పార్కింగులో పెట్టి. కర్రల బ్యాగు తీసుకుని లోపలికి వెళ్లాడు. ఆదివారం. మార్కెట్టు కిటకిటలాడుతూంది. లేత వంకాయలు, బర్‌బాటి, బెండకాయలు అరకేజీ చొప్పున కొన్నాడు. కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర, చుక్కకూర తలా నాలుగు కట్టలు తీసుకున్నాడు.

తర్వాత పండుమిర్చి అమ్మే చోటికి వెళ్లాడు. ఎర్రగా నిగనిగలాడుతూంది పండుమిర్చి. పక్కనే చింతపండు. రెండూ తీసుకొని, డజను నిమ్మకాయలు కూడా తీసుకున్నాడు.

వచ్చేస్తూంటే గేటు బయట ఒకామె అరటి దవ్వ అమ్ముతుంది. రెండ్రూపాయ లిచ్చి మూరెడు దవ్వ కొని సంచిలో వేసుకున్నాడు. ఇంటికి చేరేసరికి పదిన్నరయింది. తల్లీకొడుకు లిద్దరూ రెండోసారి కాఫీ తాగారు.

కూరగాయలన్నీ బుట్టలో సర్దాడు శ్యామల రావు.”అమ్మా, అరటి దవ్వ పెరుగు పచ్చడి చెయ్యవే” అన్నాడు గారాబంగా.

“చేస్తాగాని, మరి అన్నం లోకి పెరుగు మిగలదు” అన్నది తల్లి నవ్వుతూ.

“లేకపోతేమానె. దవ్వ చెడిపోతుంది.”

“పప్పు లోకి ఏం తెచ్చావురా?”

“మెంతి, చుక్కకూరలు. చుక్కకూర పప్పు చేసి, గుమ్మడి వడియాలు వేయించు.”

‘పాపం ఆదివారమే వీడు తృప్తిగా తినేది. రోజూ ఎనిమిదికల్లా క్యారేజి కట్టిస్తే వాడు తినేటప్పటికి చల్లగా ఐపోతుంది’ అనుకుంది తల్లి.

“దవ్వ నేను సన్నగా తరిగిస్తాలే”

“తరుగు మరి. చేతులకు నూనె రాసుకో ముందు. లేకపోతే దాని కనరు వదలదు” అని, ఒక వెడల్పు గిన్నెలో నీళ్లు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఇచ్చింది.

శ్యామల రావు దవ్వకు చెక్కు తీసి, తెల్లని భాగాన్ని చక్రాలుగా తరగసాగాడు. ప్రతి బిళ్లకూ పీచు వస్తూంది. దాన్ని వేళ్లకు చుట్టుకుని తీసేస్తూ, చిన్నచిన్నముక్కలుగా తరిగి నీళ్లలో వేశాడు. చుక్కకూర, పచ్చిమిర్చి సన్నగా తరిగాడు పప్పు కోసం.

ప్రసూనాంబ వచ్చిచూసింది. “మీ నాన్నగారు అచ్చు ఇలాగే తరిగిచ్చేవారు. ఆయన కెంతిష్టమో ఇది. నాకు సరిగ్గా తరగడం రాదని, నన్ను తరగనిచ్చేవారు కాదు” అని నవ్వింది. భర్త జ్ఞాపకాలతో ఆమె ముఖం కొంచెం వాడింది.

“అరటిమొగ్గను కూడ చాలా నేర్పుగా కత్తిపీట మీద కొట్టేవాడమ్మా నాన్న!” అన్నాడు శ్యామల రావు.

పన్నెండు కల్లా భోంచేశారు. తల్లి ఆ ప్రసక్తి తెస్తుందేమోనని చూస్తున్నాడు. ఉండబట్టలేక అడిగేశాడు.

“నర్సీపట్నం వీళ్లకు ఏం చెబుదామే అమ్మా?”

దొంగ దొరికాడన్నట్లు కొడుకు వెంపు చూసి నవ్వింది అమ్మ. “అమ్మాయి నాకు నచ్చింది నాన్నా, సంసారపక్షంగా ఉంది. మన లాగే మధ్యతరగతివాళ్లు. నీవేం మాట్లాడకపోతే, నీకు నచ్చలేదేమో అనుకున్నా.”

టక్కున లేచి వెళ్లి అమ్మ అక్కున చేరాడు కొడుకు. “అమ్మాయి బాగుంది కదే!” అన్నాడు.

“తా వలచింది రంభ!” అన్నది తల్లి నవ్వి.. “వంక పెట్టడానికేముంది ఆ పిల్లకు పాపం! నీకూ పాటలంటే చాలా యిష్టం. ఆ అమ్మాయి బాగా పాడుతుంది. నీవు కూడా బాగా పాడతావు. ఇద్దరూ ఎంచక్కా ఘంటసాల, సుశీలలా డ్యూయెట్లు పాడుకోవచ్చు.”

తల్లి తనను ఆటపట్టిస్తూందని అర్థమయింది శ్యామల రావుకు. ఆనందంగా నవ్వుతూ, “అయితే సాయంత్రం దొండపర్తికి పోయి ఈ సంబంధం చెప్పిన వరాహ నరసింహమూర్తి గారికి, మనం అనుకూలంగా ఉన్నామని వాళ్లకు కబురు చేయమంటాను” అన్నాడు.

“శుభస్య శీఘ్రమ్” అన్నది ప్రసూనాంబ కొడుకు తల నిమురుతూ.

“అమ్మా, సరస్వతీ మహల్‌లో ‘కొండవీటి సింహం’ ఆడుతూందే! మా వాళ్లందరూ చూసేశారు. నీవు రాకూడదూ, మ్యాట్నీకి వెళదాము” అన్నాడు.

“నాకంత ఓపిక లేదు లేరా, నీవు వెళ్లిరా. సాయంత్రం పంతులు గారికి చెప్పేయి మరి.”

***

శ్యామలరావు తండ్రి సింహాద్రి రావు జూనియర్ కాలేజీలో జూనియర్ అసిస్టెంటుగా చేరి, ప్రమోషన్ మీద సీనియర్ అసిస్టెంటు అయినాడు. ప్రతీ ఐదేండ్లకు ట్రాన్స్‌ఫర్‌లుండేవి. పెందుర్తి, యలమంచిలి, యస్. కోట, పాడేరు కాలేజీల్లో పనిచేశాడు. ఒక్కడే కొడుకు. వాడిని బాగా చదివించి మంచి ఉద్యోగము చేయించాలని ఆయన ఆశ. కొడుకుని డిగ్రీ చదివించాడు. కనీసం గ్రూప్ టు పరీక్ష నైనా కొట్టాలని శ్యామల రావు కోరిక . బ్యాంకు, రైల్వే సర్వీసు కమిషన్ పరీక్షలు రాశాడు కాని ఏవీ రాలేదు. బి.యి.డి చేద్దామనుకుంటూండగా, తండ్రి సడన్‌గా గుండెజబ్బుతో చనిపోయాడు. ‘జీవత్ తాతపాదుండు’ అని తెనాలి రామకృష్ణకవి అన్నట్లుగా తండ్రి బతికున్నంత వరకు శ్యామల రావుకు నిశ్చింతగా ఉండేది. ఆయనకింకా ఆరేళ్ల సర్వీసుండగానే భగవంతుడు ఆయనను పిలిపించుకొన్నాడు.

అప్పుడాయన వి.యస్. కృష్ణ కాలేజీలో పనిచేసేవారు. దాని ప్రిన్సిపాల్ జార్జిరెడ్డిగారికి ఆయనంటే అభిమానం. స్టాఫ్ సర్వీసు మ్యాటర్లన్నీ పైసా ఆశించకుండా చేసి పెట్టేవాడాయన. శ్యామల రావును తీసుకొని రాజమండ్రి ఆర్.జె.డి. చయనులు గారి దగ్గరికి వెళ్లాడు. కంపాషనేట్ అపాయింటుమెంట్సుకు కాంపిటెంట్ అధారిటీ ఆయనే. జార్జిరెడ్డిగారు, చయనులు గారు నెల్లిమర్ల కాలేజీలో కొలీగ్స్.

ఆరునెలల్లోనే పోస్టింగు ఇచ్చారు ఆర్.జె.డి గారు. వైజాగ్ సిటీలో ఖాళీలు లేవని, దగ్గరగా ఉన్న పూసపాటిరేగకు వేశారు. అది విజయనగరం జిల్లాలో ఉన్నా వైజాగుకు బాగా దగ్గర.

రేగ ప్రిన్సిపాల్ దాలినాయుడు గారు కూడా మంచివారే. చేరిన రోజే చెప్పారాయన. “అబ్బాయ్, మీ నాన్న గురించి మన జోన్ అందరికీ తెలుసు. ఆయన పేరు నిలబెట్టాలి నీవు. నీకింకా ఇరవైరెండే. కష్టపడితే చాలామంచి ఫ్యూచరుంది. ఇలాగే ఉంటే మహా అయితే సీనియర్ అసిస్టెంటు అవుతావు. నా మాట విని ప్రయివేటుగా పి.జి. చేయి. డిగ్రీలో నీది ఏ గ్రూపు?”

“బి.యస్సీ. సార్” అన్నాడు వినయంగా.

“మ్యాథ్స్ చేయచ్చు కాని కష్టం. సైన్సెస్ కుదరవు. ఇంగ్లీషు ఎమ్.ఎ. చేయి. విజయనగరంలో నా ఫ్రెండ్ పాత్రో అని ఉన్నాడు. డిగ్రీ కాలేజి ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన స్టడీ మెటీరియల్ ఇస్తారు. వారానికొకసారి గైడెన్స్ కూడా. మనకైతే ఫీజు తగ్గిస్తాడు. నీవు బాగా కష్టపడి చదివి ఎమ్.ఎ. ఇంగ్లీషు చేస్తే, మీ నాన్-టీచింగ్ వారికి జె.యల్. ప్రమోషన్లలో కోటా ఉంది. ఐదారేండ్లల్లో నీవు జూనియర్ లెక్చరర్ కావచ్చు.”

ఆయన అభిమానానికి శ్యామల రావు కళ్లు చెమర్చాయి. “తప్పకుండా చేస్తాను సార్. మీ ఆశీర్వాదముంటే” అన్నాడు.

“అంతా ‘ఆయన’ సంకల్పం!” అన్నాడు జార్జిరెడ్డిగారు పైకి చూపుతూ.

ఆ సంవత్సరం టైం అయిపోయింది. ఆంధ్ర యూనివర్సిటీ లోనే కరస్పాండెన్స్ కోర్సు ఉంది. కానీ వాళ్లిచ్చే లెసన్స్ కొరుకుడు పడవు. పాత్రో గారు సింపుల్ లాంగ్వేజిలో, టెక్స్‌ట్యుయల్ కొటేషన్లతో కొశన్ అంటే ఆన్సర్ పద్ధతిలో ప్రీవియస్ అండ్ ఫైనల్ స్టడీమెటీరియల్ తయారు చేశారు. ప్రతి ఆదివారం పర్సనల్ క్లాసులు తీసుకుంటారు. కానీ ఒక్కో సంవత్సరానికి రెండువేల రూపాయలు ఫీజు.

జార్జిరెడ్డి గారి రిక్వెస్టుతో వెయ్యి రూపాయలు తగ్గిస్తానన్నారు పాత్రో గారు. అంటే మూడువేల రూపాయలు, నెలకు మూడు వందల ప్రకారము కట్టుకునే లాగా అనుకున్నారు. రేగ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ సూర్యనారాయణ ఉన్నాడు గాని, ఆయనది ఎవరికీ సాయం చేసే మనస్తత్యం కాదు. ప్రతి ఆదివారం కాకపోయినా, నెలకు ఒకటి రెండుసార్లు విజయనగరం వెళ్లి. పాత్రోగారి కాసులకు అటెండ్ అవుతున్నాడు శ్యామల రావు. అగ్రిగేట్ యాభై శాతం వస్తే గాని జె.యల్. పోస్టుకు అర్హత రాదు.

(ఇంకా ఉంది)

Exit mobile version