Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెపోటు

[శరీరావయవాలకు మాటలు వస్తే, అవి ఒకదానితో ఒకటి తమ బాధలు చెప్పుకుంటూ, మనుషులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నట్లు ఈ రచనలో వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

నాలుగు గదులున్న చిన్న ఇంటిలో గుండె కాపురం ఉంటున్నది. పైన రెండు గదులు, కింది భాగాన రెండు గదులు ఉన్నాయి. గుండె మెత్తని మాంసం ముద్దలా ఉంటుంది. ఎర్రని ఎరుపు వర్ణంలో ఉంటుంది. గుండెలోని పై భాగాన ఉన్న రెండు గదులను కర్ణికలు అనీ, కింది భాగాన ఉన్న గదులను ‘జఠరికల’నీ అంటారు. ఈ గదుల మధ్య భాగాన నాలుగు తలుపులు ఉంటాయి. ఈ తలుపులకు అంటే కవాటాలకు పేర్లున్నాయి. ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మొనరీ వాల్వ్, మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్.

గుండె రోజూ ఏమి పనిచేస్తుందో తెలుసు కదా! మంచి రక్తాన్ని దేహంలోని అన్ని అవయవాలకూ అందిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నపుడు గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. దీనినే హార్ట్ బీట్ అంటారు. గుండె ‘లబ్ డబ్’ అని కొట్టుకుంటూ రక్తాన్ని శరీర అవయవాలకు అందజేస్తుంది. ఈ రక్తంలో ఆక్సిజన్ పోషకాలు ఉంటాయి. ధమనుల ద్వారా ఈ రక్తాన్ని పంపిస్తుంది. తిరిగి చెడురక్తం సిరల ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ సిరల ద్వారా వెళ్ళే చెడు రక్తంలో కార్బన్ డయాఆక్సైడ్, విసర్జకాలు ఉంటాయి. ఊపిరి తిత్తులు ఈ రక్తాన్ని బాగుచేసి శుభ్రపరుస్తాయి.

ఈ విధంగా జీవనం సాగిస్తున్న గుండెకు ఒక రోజు ఆయాసం వచ్చింది. తన పనులు తాను చేయలేకపోయింది. ప్రతి రోజూ నియమబద్ధంగా చేయాల్సిన పనులన్నీ నిదానంగా చేయసాగింది. గుండెకు నీరసం వచ్చి నిదానంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది.

“ఏమైంది నీకు? ఆలా నీరసంగా ఉన్నావు? పనులు కూడా నిదానంగా చేస్తున్నావు?” బుజ్జగింపుగా అడిగింది మెదడు. “ఏమో బాస్ ఈ మధ్యన నాకు అలాగే ఆయాసం వస్తున్నది. అంతలోనే నీరసంగా పడిపోతున్నాను. నేను చెయ్యలేక చెయ్యలేక పని చేస్తున్నాను” అన్నది గుండె మెల్ల మెల్లగా మాట్లాడుతూ!

“నువ్వు మెల్లగా పని చేశావనుకో! అన్ని అంగాలకు చేరవలసిన రక్తం మెల్లగా చేరుతుంది. ఫలితంగా అంగాలు తమ పనిని తాము చేయలేక పోవడంతో మనిషికి నీరసం వస్తుంది. చివరకు అతడు చనిపోయే అవకాశం కూడా ఉండవచ్చు”. ఆలోచిస్తూ మెదడు అన్ని విషయాలనూ గుండెకు చెప్పింది.

గుండె అన్ని విషయాలనూ శ్రద్ధగా విన్నది. “కానీ నేను ఏమి చేయను. ఈ మనుషులంతా శారీరక శ్రమను మర్చిపోతున్నారు. కూర్చున్న చోట నుంచి కదలటం లేదు. ఇంటి పనులు అసలే చేయడం లేదు, గారాబంగా పెంచుతున్నామనుకుని తల్లిదండ్రులు పిల్లల్ని ప్రమాదం లోనికి నెడుతున్నారు” నిట్టూరుస్తూ అన్నది గుండె.

“అంతే కాదు! పంటల్ని కూడా రసాయనాలతో పెంచుతున్నారు. అందుకే ఆ కూరగాయల్ని తిన్నా కూడా పోషకాలు అందటం మాట అటుంచి కొవ్వులు చేరుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనుషుల పిల్లల్ని చూశావా! ఎంత లావుగా ఉంటున్నారో! అంత లావుగా ఉన్న పిల్లలకు నువ్వు పనెక్కువ చేయవలసి ఉంటుంది” అంటూ మెదడు మాట్లాడింది గుండెతో!

“అవును బాస్ అందుకే కదా నాకీ అవస్థ. ఇంకా కొంతమంది పిల్లలు సిగరెట్లు కూడా తాగుతున్నారు. పాపం ఊపిరితిత్తులు కూడా చాలా బాధ పడతున్నాయి. నిన్నవే నాతో చెప్పి చాలా బాధపడ్డాయి. ఏటా ఈ మనుషుల ప్రవర్తన నాకర్థం కావడం లేదు. వారి ఆహార అలవాట్లు, రోజూవారీ దినచర్య వలన మనందర్నీ ఇబ్బంది పెడుతున్నారు. మనం కష్టపడితే వాళ్ళకే నష్టం కదా! ఆ మాత్రం తెలివి ఉండక్కర లేదా?” నిరాశగా నిదానంగా మాట్లాడుతున్నది గుండె.

“అవునవును మొన్న మూత్రపిండం కూడా బాధపడింది. మంచి నీళ్ళు తాగక మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడుతున్నాయట, చెప్పి ఏడ్చింది మూత్రపిండం. నేనేదో ఓదార్చాను గానీ ఏం చేయాలో నాకూ అర్థం కాదటం లేదు ఆలోచిస్తూనే ఉన్నాను”. అన్నది మెదడు సాలోచనగా చూస్తూ!

“నీకు పుణ్యముంటుంది బాస్, అసలీ మనుషులు నడవటమే మానేశారు. నడక లేకపోతే నేనెంత ఇబ్బంది పడతానో తెలుసు కదా! ఏదైనా మంచి ఉపాయం ఆలోచించవా” ప్రాధేయపడుతూ అడిగింది గుండె.

గుండె పరిస్థితి చూస్తే మెదడుకు జాలేసింది. దేహం మొత్తంలో ప్రధానమైన అవయవం పాపం ఇంతగా బాధపడుతోందే అని మెదడు ఆలోచిస్తూనే ఉన్నది. కొద్ది సేపటి తరావత “పోనీ ఓ పని చెద్దామా?” అని గుండెను చూసి అడిగింది.

గుండె వెంటనే ఉత్సాహంగా ముందుకు వంగి “ఏమిటి చెప్పండి బాస్! మీరు చెప్పినట్లే వింటాను. నేను చాలా నీరస పడిపోతున్నాను. ప్లీజ్ చెప్పుండి!” బదిమిలాడుతున్న ధోరణిలో అడిగింది.

“నువ్వు గుండెపోటు వచ్చినట్లుగా నటించు. నొప్పితో అల్లాడి పోతున్నట్లుగా మెలికలు తిరుగుతూ యాక్షన్ చెయ్యి. ఈ దెబ్బకు మనిషి భయపడతాడు. అప్పుడు ఆహార అలవాట్లు మార్చుకుంటాడు. వ్యాయామం చెయ్యడం కూడా మొదలు పెడతాడు” అంటూ మెదడు సలహా ఇచ్చింది.

గుండె ఈ మాటలు విని “ఇలా చేస్తే బాగుంటుందా బాస్ ఏదైనా మంచి జరుగుతుందంటే ఎంత కష్టమైనా చేస్తాన్ బాస్! రేపే మొదలు పెడతాను, చూస్తుండండి. ఎలా మెలికలు తిరుగుతూ నొప్పి వచ్చినట్లు నటిస్తాను” అంటూ హామీ ఇచ్చింది.

“రేపే మొదలు పెట్టు. తప్పకుండా గుండెపోటు వచ్చినట్లుగా నటించు. ఫలితాలు చూద్దాం. నొప్పి, బాధను నేను కాస్త ఎక్కువగా చేస్తాను. వచ్చిన నొప్పి కన్నా ఎక్కువ నొప్పిని చేరవేస్తాను. ఈ దెబ్బతో ఖచ్చితంగా మనిషి మారి తీరతాడు అనే అనుకుంటున్నాను”. అన్నది మెదడు భరోసా నిస్తున్నట్లుగా పోజు పెడుతూ.

మరుసటి రోజు గుండె బాధతో మెలికలు తిరిగిపోతున్నది. మొదడు దీనిని చూసి సంతోషపడింది. గుండెకు ఆయాసం ఎక్కువయింది. కొద్దిగా కూడా నిలబడలేక పోతున్నది. బంగలు చుట్టుకు పోతున్నది. గుండె చాలా బాగా నటిస్తుందని మెదడు మురిసిపోయింది.

కానీ ఎంత సేపటికీ గుండె మామూలు కాలేక పోయింది. మెదడు వచ్చి చూస్తే గుండెతో “ఇక చాల్లే చాలా భయపడి ఉంటాడు మనిషి. ఇక గుండె డాక్టర్ చెప్పిన సూత్రాలన్ని పాటిస్తాడులే” అని నవ్వుతూ అన్నది.

గుండె మాత్రం అలాగే నొప్పిలో విలపిల్లాడతున్నది. గుండెకు నిజంగానే గుండెపోటు వచ్చింది బాధతో, భయంతో గుండెకు ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. కాసేపటికి డాక్టరు ఇచ్చిన ఇంజక్షన్‌తో గుండె కుదుట పడింది. నీరసంగా పడుకున్నది. ఆయాసంలో టకటకా కొట్టుకున్న గుండె కాస్త మూమూలు స్థాయికి వచ్చింది.

మెదడు ఆశ్చర్యంగా దగ్గరకు వచ్చి చూసింది బాధగా అడిగింది – “ఎలా ఉంది మిత్రమా! నీకు నిజంగానే గుండెపోటు వచ్చిందా? నేనలా అనుకోలేదు. నిన్న మనం అనుకున్నట్లుగా నటిస్తున్నావని అనుకున్నాను. క్షమించు మిత్రమా! కాస్త నిదానించావా? కొద్దిగా రెస్ట్ తీసుకో” అని మెదడు బాధాతప్త స్వరంతో చెప్పింది.

“ఇందులో నీ తప్పేమీ లేదు బాస్! నిన్న అనుకున్నాం కాబట్టి అలాగే జరుగుతుందని అనుకున్నావు. కానీ నాకు నిజంగానే వచ్చింది ఏం చేద్దాం. నేను రెస్ట్ తీసుకుంటే మనిషి ఎలా బ్రతికి ఉంటాడు. నేను ఎంత బాధలో ఉన్నా పని చేయక తప్పదు. అయినా కొంతవరకు నయం. నన్ను కోసి ఆపరేషన్ చెయ్యాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడైనా ఈ మనిషి జాగ్రత్తలు పాటిస్తే నాకు ‘స్టంట్లు’ వేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. అంతా ఈ మనిషి చేతిలోనే ఉన్నది” అన్నది గుండె రొప్పుతూ!

“నిజమే మిత్రమా! మనమి౦త నిస్వార్థంగా సేవ చేసినా మనుషులకు బుద్దిలేదు. అదిగో మనిషి దగ్గరకు డాక్టరు వస్తున్నాడు ఏం చెప్తాడో విందాం” అని మెదడు చెవులు రిక్కించి వినసాగింది.

డాక్టరు పేషంటు గదిలోకి వచ్చాడు. రోగితో ఇలా చెపుతున్నాడు “చూడండి గుండెపోటు చాలా మైల్డ్‌గా వచ్చింది కాబట్టి బతికిపోయారు. మరోసారి ఇలా రాకుండా చూసుకోండి. రోజూ వ్యాయామం చెయ్యాలి. జంక్ ఫుడ్ జోలికి పోకూడదు. నూనె వస్తువులు తినడం చాలా వరకు తగ్గించండి. అది కూడా మంచి నూనెలు వాడండి. ఇంట్లో పని మనుషులను తీసేసి మీ పని మీరు చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, శుభ్రానికి శుభ్రం. డబ్బు కూడా ఆదా అవుతుంది. మనిషి జీవితం కన్న డబ్బు ముఖ్యం కాదు కదా! ఇది గుర్తుపెట్టుకోంది. ఇంతకన్నా చెప్పేదేమి లేదు” అంటూ డాక్టర్ ప్రసాద్ మరో పేషెంట్ రూము వద్దకు వెళ్ళాడు.

Exit mobile version