పోరాటం మనకు కొత్త కాదు
రక్తంలో పొగరు తక్కువేమీ కాదు
అంతరంగంలో ఆవేశం కూడా ఎక్కువే!
రెండు శతాబ్దాల బానిసత్వంపై
ఆత్మవిశ్వాసంతో
అకుంఠిత దీక్షతో
ఎదిరించి పోరాడి
విజయపతాకను ఎగరేసిన
వీరోచిత చరిత్ర మనది!
సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు
నీతి నియమాలు నైతిక విలువలు
వేదాలు… పురాణాలు… ఇతిహాసాలు
మన జాతి మనకు ప్రసాదించిన
మహోన్నత ఆధ్యాత్మిక సంపద!
సకల మానవాళిని ప్రేమించే…
సర్వమానవ సౌభ్రాతృత్వం గొడుగు నీడలో
విశ్వమానవ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా
ఓ దరిని చేర్చి…
శాంతి సౌభాగ్యాల ఊయలపై
ఓలలాడించడమే
మన జాతి నైజం!
కానీ…
వాడు వంచకుడు!
విశ్వంతో వర్తకం చేసేవాడు!!
స్వార్థం… సంకుచితత్వం
కుట్రలు… మోసాలు
వాడి సహజ లక్షణాలు!
విశ్వం యవనికపై
ప్రథమ స్థానం కోసమే
వాడి ఆరాటమంతా!
ఆ ఆరాటం నుండే…
నీచమైన ఆలోచనలు మొలిచాయి!
ఊహాన్ నడిబొడ్డు నుండి విషం చిందించి
ప్రపంచాన్ని మృత్యుగహ్వరంలోనికి నెట్టి
ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ
తమాషా చూస్తున్న…
పయోముఖ విషకుంభం వాడు!
వాడి నీచ సంస్కృతిని
ప్రపంచం పసిగట్టింది!
ఆ మేక వన్నె పులిని
ఆ గుంట నక్క కిలాడిని
విశ్వ మానవ జాతి
చీదరించుకుంటోన్న వేళ….
మానవ మస్తిష్కాన్ని పక్కదారి పట్టించే
వ్యూహ రచనకు శ్రీకారం చుట్టి
శాంతి మాత భారతమ్మపై
సమరభేరికి సమాయాత్తమై
నీచ బుద్ధిని ప్రపంచానికి చాటాడు!
నమో…!
వీరుడా… సమరశంఖం పూరించు!
దాయాది శత్రువులైన
ముచ్చుల్ని… ముమ్ముచుల్ని
మన సరిహద్దు కావల నిర్జించు!
వాని ఉనికిని నిర్మూలించు!!
మనుష్య జాతికి శత్రువుగా
నాగరిక ప్రపంచం గుర్తించిన
కుహానా మేధావి వాడు!
మర ఫిరంగులతో మట్టు బెట్టు…
విశ్వశాంతికి నాందీవాచకం పలుకు…
యావత్ భరతజాతి నీ వెంటే!
విశ్వమానవ జాతి నీ అడుగు జాడలలోనే!!
నమో…!
వీరుడా….
విజయం మనదే!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.