Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గులాబీ మృదుపాదాలు

[కన్నడంలో వైదేహి గారు రచించిన ‘గులాబీ మృదుపాదగళు’ అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ రంగనాథ రామచంద్రరావు.]

దారి ఆమెకు కొత్తదికాదు. అక్కడున్న ఇండ్లూ, అందులో ఉన్నవారు మాత్రం ఆమెకు గుర్తులేరు.

ఒక రోజు, ప్రతి రోజులా, ఆ దారిగుండా వస్తున్నప్పుడు ఒక రిక్షా ఆమె పక్కనుంచే దాటింది. ఒక ఇంటి ముందు నిలుచుంది. రిక్షా నుంచి పసిబిడ్డను గుండెలకు హత్తుకుని ఆడమనిషి దిగింది. వెనుకే, బహుశా పసిబిడ్డ తల్లి దిగింది. సరిత నడక వేగాన్ని తగ్గిస్తూ అటు వైపే చూస్తూ నడిచింది. చుట్టిన బట్టలోంచి బిడ్డ గులబీ పాదాలు బయటికి తొంగిచూసి సంతోషాన్ని కలిగించాయి. వాళ్ళు ఇంట్లోకి మరుగయ్యారు.

ఆ రోజు నుంచి ఆ ఇల్లు దాటేటప్పుడు ఆమె దృష్టి అటు వైపు మరలేది. వెతికేది. అక్కడ ఇంటి ముంగిట్లో వరుసగా తీగలు. తీగల మీద చిన్నచిన్న చొక్కాలు. న్యాప్కిన్లు, పక్కబట్టలు, దుప్పట్లు, బిడ్డ గురించి మాట్లాడాయి. బిడ్డ కనిపించలేదు. ఇంటి ముంగిట్లోని ఈ తీగలో ఈ బట్టలూ ఎంత మెరుస్తుంటాయి. గాలి వీచి తీగలు బట్టలను మోసుకుని ఊగుతున్నప్పుడు బిడ్డకు జోలపాట పాడుతున్నాయేమోనని అనిపించేది. ఒకసారి లోపలికి పోయి చూడాలనుకున్నా సంకోచం ఆమెను వెళ్ళనివ్వలేదు. ఏమని చెప్పాలి? బిడ్డను చూడటానికి వచ్చానని చెప్పాలా? ‘ఇప్పటివరకూ పిల్లలను చూడలేదా?’- అంటే? ఆ ఇంటివారు ఎలాంటి నమ్మకాలు ఉన్నవారో. ‘ఎవరో తెలియనవాళ్ళు వచ్చి చూసి బిడ్డకు దిష్టి తగిలింది’ అని అన్నా అనవచ్చు. ఇలా ఆలోచిస్తూ ఇంటిని దాటి వెళ్ళేది.

ఒక్కొక్క రోజు పసిబిడ్డ ఏడుపు వినిపించేది. ఆమె కొద్దిసేపు అక్కడే నిలబడేది. గొంతు కలిపితే తన మనస్సు స్వరమూ అలాగే వెలువడిందని అనిపించేది. పేగుల వరకు కత్తిని తిప్పినటువంటి బాధతో నలిగిపోయేది. గులాబీ మృదుపాదాల కోసం వెతికేది.

అలాగని ఎక్కువసేపు నిలబడటం సాధ్యమా? ఎవవైనా చూస్తే ఎవరు, ఎందుకు మొదలైన వివరాలు అడగటం మొదలుపెడతారు. తాను లోపలికైనా వెళ్ళాలి. లేదా నేరుగా ముందుకుసాగాలి. ఆమె ముందుకు వెళ్ళేది. ‘ప్రపంచంలో చాలాసేపు మనకోసం మనం ఏమీ చేయలేం. దొంగతనంగా దొరికిన కొన్ని నిముషాలు మాత్రం మనవి. మిగిలినవన్నీ ఇరుగుపొరుగు వారివి. సమాజానివి, బంధుబలగానిది’ ఇలా ఆలోచనలు దారి దాటించేవి.

ఒకసారి బిడ్డ ‘ఉంగా’ రాగం, కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమనే నాదం విని కాళ్ళకు మేకు దిగగొట్టినట్టు అక్కడే నిలబడిపోయింది. మృదువైన పాదాలు వెండి గజ్జెలను ఘల్లుమనిపిస్తూ ప్రపంచం లోలోపలికి వస్తూ వున్నాయి. పాదాలు కనిపించటం లేదు. స్మృతిలోంచి గజ్జెల నాదం మాత్రం మాసిపోదు. ఆమె గొంతు నరాలు బిగుసుకునేవి. దిగమింగుకున్నంతగా బిగింపు పెరుగుతుండేది.

కిటికి నుంచి ఒక ఆడమనిషి ‘ఎవరది?’ అని బెదిరిన ధ్వనిలో పిల్లల దొంగలేమో అన్నట్టు ప్రశ్నించినపుడు ఆమె స్పృహలోకి వచ్చేది. బుగ్గల మీద జారుతున్న కన్నీటి వేడి అర్థమయ్యేది. ఆమె కకావికలై చూస్తుండగానే కన్నీరు తుడుచుకుంటూ ఆమె కదిలేది. చెవుల్లో గజ్జెల ఘల్లుఘల్లుమనే నాదం పదే పదే ప్రతిధ్వనించేది. కాలు దువ్వి జ్ఞాపకాన్ని తవ్వి తీసేది.

బిడ్డ బోర్లాపడి వుండాలి. తల్లి సంతోషపు నవ్వు వినిపిస్తోంది. సరిత దాటుతున్నప్పుడే ఆమె తల్లిని పిలిచి బిడ్డ బోర్లపడిందని అరవటం ఒట్టి కాకతాళీయం. ‘బోర్లాపడిందా? అలాగైతే శాస్త్రప్రకారం దోసె చేయాలి’ అని పెద్దావిడ అన్నప్పుడు ఒక మగగొంతు తమాషా బిగ్గరగా నవ్వింది. ‘బిడ్డకు తండ్రి వచ్చాడని ఎలా తెలిసిందోనని..’ మొదలైనవి అంటూ మాటల్లోనే మునిగింది. కొమ్మలో కోయిల కూసింది.

సరిత ఇప్పుడు అక్కడి నుంచి కచ్చితంగా ముందుకు కదల్లేకపోయింది..

ఆకాశంలో లేత వెలుతురు వెచ్చదనం ప్రసరిస్తున్నట్టి నవ్వు ముఖం మరీ దగ్గరికొచ్చింది. తాను పరవశత్వంతో వణికే పెదవులతో కళ్ళు మూసుకుంది. నవ్వు తాగించిన మత్తువల్ల, ఒరిగితే తాననే పుట్టుకనే అణచగల దట్టమైన జుట్టు పొదల ఎద నుంచి మెలకువ వచ్చి ముఖమెత్తి చుట్టూ చూస్తే ఏముంది? బయలే బయలు. చుట్టి కడలిలోకి విసిరేసే బలం కలిగిన బయలు. ఘుమఘుమలాడే భావాల మృదు అడుగులనంతా ధూళి ఎగరేసి, మూసి అంతరంగం లోతుకు తోసి దాక్కున్న బయలు. పాడుతున్న కోకిల ఎక్కడికి ఎగిరిపోయింది? వెతుకుతోంది తాను గాలిలో, చిగురులో, బయల్లో, స్వరంలో, పాటలో.

రక్తమయమైంది. కళ్ళకు కట్టిన నీటి పల్చని పరదా జరిపి నిలుచున్న చోటనే మునివేళ్ళపై కాంపౌండ్ ఆవలనున్న కిటికీలోపలికి తొంగి చూసింది సరిత. ఎన్నడూ మరొకరి ఇంట్లోకి తొంగి చూడకుడదని తెలిసినప్పటికీ. తీవ్రమైన ఇచ్ఛను తప్పొప్పులు అధిగమించి తీవ్రంగా అనుభవించినపుడే తృప్తి ఎక్కువని అనుకుంటూ. అయితే తండ్రి కూడా కనిపించలేదు. బిడ్డ కూడా. ఎదురింటి ఆడమనిషి తొంగి చూసి, ‘ఎవరు మీరు? ఎవరు కావాలి? లోపలికి వెళ్ళి అడగండి. ఇబ్బంది లేదు’ – అనటం వినిపించి మౌనంగా తలూపి వెళ్ళిపోయింది.

ఎవరు కావాలి? రోడ్డు అనే ధ్యాస కూడా లేకుండా వెక్కుతూ సాగింది. మనస్సుకు విపరీతమైన అలసట అనిపిస్తోంది. అయితే ఎక్కడా కాస్సేపు కూర్చోవాలనిపించలేదు. ఒక్క క్షణం కూడా నిలబడాలని అనిపించలేదు.

నెలలు గడిచిన తరువాత ఒక రోజు ఇంట్లో చాలామంది ఉన్నట్టున్నారు. పెద్దవాళ్ళ హడావుడిలో పసిబిడ్డ స్వరమే మునిగిపోయినట్టుంది. ఒకట్రెండు కార్లూ నిలిచివున్నాయి. నామకరణం వేడుకనా? అన్నట్టు ఆ బిడ్డ మగబిడ్డనా, ఆడపిల్లనా?

బట్ట మీద చూపులు సారించింది సరిత. అర్థం కాలేదు. అక్కడున్నవి కేవలం జుబ్బాలవంటివి. అవి మగబిడ్డలైనా వేసుకోవచ్చు. ఆడపల్లకైనా వేయవచ్చు. ఏం పేరు పెట్టొచ్చు..? ఏదో పేరు పదే పదే మెదడును తొలుస్తూ సాగి భస్మమై కనిపించకుండా పోయింది. మరీ మెల్లగా అడుగులు వేస్తూ నడిచి ఆమె ముందుకు వెళ్ళింది.

రాత్రి కలలో బిడ్డ వచ్చింది. గర్భంలో రెండే రెండు నెలలు గడిపినట్టుంది. కాళ్ళుచేతులు ముఖం ఒక్కటీ స్పష్టంగా లేవు. అయితే బోర్లపడి చుట్టూ తిరుగుతోంది. కేకలు పెడుతోంది. చేయి చాపింది. పొట్టతో ప్రాకుతూ, కాళ్ళు కొడుతూ, ముందుకు సాగింది. అనుసరించింది. మాయమైంది. అంతే. కేవలం అంతే.

కేవలం అంతేనా?

భ్రమ అన్నది సత్యపు వేషాన్ని ధరించి మనిషిని ఎంత సొగసుగా మాయ చేస్తుంది. అంతేకాకుండా ఎంతటి భయంకరమైన గురుతును ఏర్పరచి తాను కాదన్నట్టు నడిచిపోతుంది.

మబ్బులు కమ్ముకున్నా వర్షం కురవనటువంటి అవస్థలోనే ఆఫీసుకు బయలుదేరింది. ఇంటిముందు కొందరు కారు ఎక్కుతుండటం దూరం నుంచే కనిపించి ఆందోళన కలిగింది. గబగబా నడిచింది. ఎవరి చేతిలోనో బిడ్డ ఉంది. దగ్గరగా వెళ్ళి స్పష్టంగా చూసేలోపు కారు వెళ్ళిపోయింది. ఇంటి ముందరి ముంగిలి ఖాళీ ఖాళీగా ఉంది. తీగలలో ఉల్లాసం కనిపించలేదు. తోరణాలు లేని పందిరిలా ఇల్లు నిలుచోని ఉంది. ఆ పెద్దావిడ గేటు దగ్గరే ఖిన్నురాలై నిలుచోని ఉంది. ఎదురింటి మహిళ కిటికీ నుంచి తొంగి చూసింది. ‘ఇకపై మీకు చాలా బాధగా ఉంటుందికదా?’ అంటూ వారి దుఃఖాన్ని మరింత పెంచింది. ఆమెను చూడగానే ‘పాప వెళ్ళిపోయిందికదా? రోజూ వచ్చి నిలబడేవారు, ఎందుకు? పాపను చూడటానికేనని నేను గ్రహించాను. లోపలికి వచ్చి ఒకసారి చూడవచ్చుకదా. అవునా?.. అన్నట్టు మీకు ఎంతమంది పిల్లలు? మెడలో నల్లపూసల గొలుసు వేసుకోకపోవటం ఈ కాలంలో ఒక పాడు ప్యాషన్. లేదా పెళ్ళే కాలేదా?’ కిటికీలోంచి అవసరం లేనంత కుతూహలమే ఒంట్లో ఉన్న తన స్వరాన్ని దూర్చింది. సరిత మాట్లాడకుండా పెద్దావిడను చూసింది. “చాలా బాధగా ఉంది, లోపలికి రండి. కాస్సేపు విశ్రాంతిగా కూర్చొని మాట్లాడుకుందాం” అని చాలా కాలం నుంచి పరిచయస్థులన్నట్టు పిలిచింది. అప్పడు కిటికీలోంచి చూస్తున్న మహిళ ‘అలాగైతే నేనూ వస్తాను. ఒక్క నిముషం’ అంటూ ఉత్సాహాన్ని గుమ్మరించింది

శతాబ్దాలుగా కదలకుండా నిలబడ్డ బండలకైనా, అవి పీల్చనీ వదలనీ, ఒకసారి లోపలిదాన్ని చెప్పివేసి ఖాళీ చేసుకోవాలన్నంత భారముండేది. అయితే ఆ భారం కూడా తగ్గిపోయి తాను పూర్తిగా తేలికైపోతే అనే ఊహమాత్రంగా కంపించింది. బయటికి చిమ్మడానికి వచ్చిన వెనుకటి జ్ఞాపకాల తడిమాటలన్నీ జాగ్రత్తగా దాచిపెడుతూ ‘లేదు, ఆఫీసుకు వేళయింది. నేను వెళతాను’ అని చెప్పిన ఆమె, ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు. ‘ఎక్కడో కాలుజారి అంతా ముగిసివుండాలి. పాపం, ఆమె కళ్ళల్లో నీళ్ళున్నాయి, కదా?” కిటికీ ఆమె గుగుసలాడింది తరుముకొచ్చినట్టు వచ్చింది. సరిత పరుగెత్తలేదు. ఉల్లాసపు తోరణమే లేకుండా, క్రుంగకుండా, ధైర్యంగా మాటలు లేకుండా నిలబడ్డ ఇల్లు కంటి ముందుంది. వరుసగా చెట్లు లేకుండా, పొడుగ్గా నాలుకలా చాపుకుని నిలుచున్న, చివరికి కనిపించని నల్లటి రోడ్డుమీద చనిపోయిన వారినంతా, రాత్రి సమయంలో నక్షత్రాలుగా మెరిపిస్తూ, పగటిపూట నీలివన్నె దుప్పటిలో దాచిపెట్టే ఆకాశం కింద నడకను కొనసాగించింది, ఒక్కతే. అర్థంకాని అర్థంలా.

కన్నడ మూలం: వైదేహి

అనువాదం: రంగనాథ రామచంద్రరావు

Exit mobile version