స్వర్గీయ శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి ప్రసిద్ధులైన సాహితీవేత్త. కథా రచయితగా, వ్యాసకర్తగా, నవలా రచయితగా, రేడియో ఆర్టిస్ట్‌గా, నాటక రచయితగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు. దాదాపు 25 ఏళ్ళు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 300కి పైగా కథలు రాశారాయన. వాటిల్లోంచి ఎంచుకున్న కథలతో 6 పుస్తకాలు వెలువరించారు. ‘గుడిలో పువ్వు’ ఆయన ఏడవ కథా సంపుటి. ఇది 2013 ఫిబ్రవరిలో ప్రచురితమైంది. ఇందులోని 10 కథలు 2000-2009 మధ్య రాసినవి కాగా, మరో నాలుగు కథలు 1980-90 ప్రాంతాల్లో రాసినవి.
మధ్యతరగతి జీవితాలలోని పోరాటాలను, ఆరాటాలను, ఆశనిరాశలను, వేదనలనీ, సంతోషాలనీ ఈ కథలు ప్రతిబింబిస్తాయి.
***
భద్రాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. రాత్రయ్యే సరికి హడావిడి సర్దుమణుగుతుంది. పూజాదికాలతో అలసిన శ్రీరామచంద్రుడు సీతాసమేతుడై గోదావరి తీరంలో నడక సాగిస్తున్నాడు (ఎంత మనోజ్ఞమైన కల్పన!). సీతారాముల రాకకి సంతసించిన గోదావరి నది వారి పాదాలను కడుగుతుంది, చంద్రుడు మరింత వెన్నెల కురిపిస్తాడు. వాయువు మంద్రంగా వీస్తాడు. అప్పుడు రాముడు సీతమ్మకి ఓ అరుదైన కానుకని ఇస్తానని చెప్పి, ఓ సాధారణ, వడలిపోయి, వాసననీ, వర్ణాన్నీ కోల్పోయిన బంతిపువ్వుని ఇస్తాడు. విస్తుపోయిన సీతమ్మ అది అరుదైన కానుక ఎందుకైందో అడిగి తెలుసుకుంటుంది. ‘గుడిలో పువ్వు’ కథ చదివితే పాఠకులకూ అర్థమవుతుంది. మనసును తాకే కథ ఇది.
తండ్రికి ఓ కొడుకు రాసిన ఉత్తరం పాఠకుల కళ్లను చెమరింపజేస్తుంది. నాన్నతో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలనన్నీ ఆ లేఖలో మరోసారి గుర్తు చేసుకున్న కొడుకు తండ్రికి ఆసరాగా ఉండలేకపోయినందుకు బాధపడతాడు. తనకు కలగబోయే సంతానంలో తండ్రిని చూసుకోవాలనుకుంటాడు. ‘నాన్నకు ఉత్తరం’ కథ తండ్రీ కొడుకుల అనుబంధానికి అద్దం పడుతుంది. మధ్యతరగతి జీవితాల లోని మమతానురాగాలను అక్షరాలలో ప్రదర్శిస్తుంది.
అమలాపురంలోని తమ ఇంటిని అమ్మడానికి బయల్దేరుతాడు ‘బంధాలు-అనుబంధాలు’ కథలోని కథకుడు. తన వాళ్ళంటూ ఎవరూ లేని తన సొంతూరు – మర్నాడు నుంచి తన ఊరు కాకుండా పోతుందని బాధపడతాడు. అమలాపురంలో గడిపిన తన బాల్యాన్నంతటినీ గుర్తు చేసుకుంటాడు. తనకు పాఠాలు చెప్పిన మాస్టార్లనీ, తన చిన్ననాటి నేస్తాలు – కేశవ, విశ్శూ, భువనని తలచుకుంటాడు. హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ రావడం వీలవుతుందో లేదో, గుడికొచ్చి స్వామివారి దర్శనం చేసుకోమంటాడు ఆ గుడిలో పూజారిగా ఉంటున్న కేశవ. గుడికి ఆదాయం లేకపోవడం వల్ల గత వైభవం క్షీణించిందని గ్రహించి, ప్రతీ ఏడూ తన తల్లి పేర కృష్ణాష్టమి నాడు బీదసాదలకు అన్నదానం చేసేలా ఒక నిధి ఏర్పాటు చేస్తాడు. ఇంతలో గుడికి వచ్చిన ఓ యువతిని చూపించి, తను భువన అని చెప్తాడు కేశవ. భువనకి తానేవరో చెప్పగానే, గుర్తుపట్టి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. పక్షవాతంతో మంచం పట్టిన గోవిందం మాస్టారుని చూసి విచలితుడవుతాడు. విశ్శూ మరణించాడని తెలుస్తుంది. చివరగా భువన పెళ్ళికి కావల్సిన డబ్బుని అమర్చి, ఆ ఊరు నుంచి బయటపడతాడు.
కొత్త సంవత్సరం వస్తుందంటే ఏవేవో తీర్మానాలు చేసుకోవడం, వాటిని కన్వీనియంట్‌గా మర్చిపోవడం.. మనలో చాలామందికి అనుభవమే. కొత్త సంవత్సరం నుంచి సిగరెట్లు మానేద్దామనుకుంటాడు బ్రహ్మం. అదే విషయం గర్వంగా చెప్తాడు భార్య వెంకటలక్ష్మికి. భర్త సిగరెట్లు మానేస్తే ఆదా అయ్యే డబ్బుతో బంగారం కొనుక్కోవాలనుకుంటుంది. కానీ ఆమె ఆశల మీద నీళ్ళు జల్లుతాడు బ్రహ్మం. ఇలాంటిదే మరో ఘటన మరో కుటుంబంలో జరుగుతుంది. కొత్త సంవత్సరానికీ, డైరీలకి ముడిపెడ్తూ, అన్ని విషయాలూ డైరీలకెక్కించకూడదని అనుకుంటాడు మరో భర్త. భార్యలని ఏమార్చాలని చేసే కొందరి ప్రయత్నాలను చెబుతుంది ‘న్యూ ఇయర్ తీర్మానాలు’ కథ.
ఎన్నాళ్ళ తరువాతో కలిసిన బాల్యమిత్రుడు రమణ – భాస్కరం మీద, అతని కుటుంబం మీదా ఆప్యాయతలు కనబరుస్తాడు. భాస్కరం కూతురు తులసి అంటే అభిమానం పెంచుకుంటాడు. మీకు పిల్లలెందుకు పుట్టలేదని భాస్కరం అడిగితే, విషాదకరమైన నిజాన్ని చెబుతాడు రమణ. ‘అతడు భయాన్ని జయించాడు’ కథ మరణం తప్పదని తెలిసినా, సంతోషంగా బ్రతికేస్తున్న ఓ జంటని పరిచయం చేస్తుంది.
చదువబ్బని చంద్రరావుదీ, లోకాన్ని చదువుకున్నానని చెప్పే సదాశివానిదీ ఒకే తీరు. జీవితాన్ని ఎలా ఫలవంతం చేసుకోవాలో తెలియక అప్రయోజకులవుతారు ‘ఇద్దరూ ఇద్దరే’ కథలో. బందరు నుంచి హైదరాబాదుకి ఒకరు; హైదరాబాదు నుంచి బందరుకి మరొకరు ప్రయాణం చేస్తూ సూర్యాపేటలో టీ కోసం ఆగినప్పుడు పొరపాటున ఒకరి బస్ మరొకరు ఎక్కి ఒకరు ఉద్యోగాన్ని, మరొకరు సన్మానాన్ని పోగొట్టుకుంటారు. ఈ కాలంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం అరుదు కావచ్చు, కానీ ఇలాంటి ఘటనలు అసలు జరగవని మాత్రం అనలేం.
మధ్యతరగతి జీవితాల్లోని లేమిని, అవసరాలని తీర్చలేని ఆదాయాన్ని, చిన్న చిన్న కోరికలని సైతం తీర్చుకోలేని నిస్సహాయతలని ‘ఏటిలోని కెరటం’ కథలో చదవవచ్చు. కొడుకుతో పాటుగా వెళ్ళి తన భర్త అస్థికలని కాశీలో గంగానదిలో కలపాలన్న కోరిక ఉన్న రాజేశ్వరమ్మ – కొడుకు ఆర్థిక ఇబ్బందులని గ్రహించి – కోరికను వాయిదా వేస్తూ వస్తుంది. చివరికి ఆ కోరిక మరో విధంగా తీరుస్తాడా కొడుకు.
పెద్దగా చదువుకోని పైడిరాజు, ఉన్నత విద్యావంతుడైన ఓ డాక్టరులో కలిగించిన పరివర్తనని ‘అమ్మ లేని ఇల్లు’ కథ చెబుతుంది. చాలాసార్లు మన అభిప్రాయాలు, మన నిర్ణయాలు సరైనవే అనుకుంటాం. కన్వీనియెన్స్ పేరుతో అంతరాత్మ గొంతు నొక్కేసి బిజీగా తిరిగేస్తాం. కానీ ఎవరో ఒకరి ద్వారా మన అంతరంగంలో చిన్న కదలిక వస్తుంది. అప్పుడు అంతరాత్మ మాట వింటాం. ఈ కథలో అదే జరిగింది.
తాగుడు వ్యసనంపై వ్యంగ్యంగా అల్లిన కథ ‘కొ.సా.స.’. ఓ రిటైర్డ్ ఆఫీసర్‌కి వచ్చిన ఆలోచనతో ‘ఇంటి వద్దకే మందు’ పథకాన్ని ప్రవేశపెడతాడు. అది విజయవంతం కావడంతో.. మరికొందరు అతనికి పోటీ వస్తారు. ఉచిత స్కీములు పెడతారు. చివర్లో కథని మలుపు తిప్పి, అమ్మయ్య అనిపిస్తారు రచయిత.
తమ జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రం సందర్శించాలని అనుకునేవారు చాలామందే ఉంటారు. కొందరు వీలైతే జీవితపు మలిదశలో అక్కడే స్థిరపడిపోవాలని అనుకుంటారు. రెండు సార్లు కాశీ వెళ్ళొచ్చాకా, ఇంక అక్కడికి వెళ్ళకూడదని తలుస్తాడు చలపతి. ఎందుకో కారణం తెలియాలంటే, ‘కాశీపట్నం చూడకు బాబూ!’ కథ చదవాలి.
క్షణంలో కాటేసే మృత్యువుని మనిషి గ్రహించలేడని ‘కళ్ళు’ కథ చెబుతుంది. బాల్యంలో ఒకసారి ఒక అంధుడిని మోసం చేసిన సంగతి సీతాపతిని వెంటాడుతుంది. ఓ రోజు ఆఫీసుకు వెళ్తూ, వర్షంలో చిక్కుకుంటాడు. అక్కడో గుడ్డి యాచకుడు కూడా చెట్టు కింద వానలో చిక్కుకుపోతాడు. ఎవరైనా వచ్చి తనను కాస్త టీ దొరికే చోటుకి తీసుకువెళ్ళమని అడుగుతూంటాడు. కానీ సీతాపతి పట్టించుకోడు. తాను మాత్రం వెళ్ళి టీ తాగుతాడు. ఈలోగా పిడుగులు పడి ఆ గుడ్డి బిచ్చగాడు మరణిస్తాడు. అతని చావుకి తను కూడా ఒక కారణమే అని అంతర్మథనానికి లోనవుతాడు సీతాపతి.
కొన్ని వస్తువులతో అనుబంధం పెంచుకున్న మనుషులు తమ తర్వాతి తరం వారు వాటిని అమ్మేస్తే విలవిలలాడిపోతారు. తన చిన్నప్పుడు తన తండ్రికి ఎవరో చేయించి ఇచ్చిన పందిరిమంచమంటే కథకుడికి బాగా ఇష్టం. అతనికి పెళ్ళయ్యాకా, ఆ పందిరిమంచాన్ని అతనికే ఇచ్చేస్తారు వాళ్ళ నాన్న. కాలక్రమంలో ముగ్గురు పిల్లల తండ్రి అవుతాడు కథకుడు. ఆ మంచాన్ని తన కొడుకు శంకరం దగ్గరకి హైదరాబాద్ పంపిస్తాడు. కానీ తండ్రికి తెలియకుండా ఆ మంచాన్ని శంకరం అమ్మేస్తాడు. శంకరం కొత్తిల్లు కొనుక్కున్నాడని తెలిసి తల్లీ తండ్రీ వస్తారు. మర్నాడు సరదాగా ఊరు చూద్దామని బయటికి వచ్చిన కథకుడికి కోఠీ దగ్గర ఓ బజారులో తన పందిరిమంచాన్ని వేలం వేస్తుండడం కనిపిస్తుంది. మనస్సు చివుక్కుమంటుది. ‘పందిరిమంచం’ కథ తరాల మధ్య పెరుగుతున్న అంతారాలను తెలుపుతుంది. ఓ వస్తువు వెనుక ఉండే అభిమానాలు, ఆప్యాయతలు, మమకారాలను గుర్తు చేస్తుంది.
డబ్బే ప్రధానమై, వస్తు వ్యామోహం ముఖ్యమైన శేఖరానికి ఊర్లో ఉండే తల్లిదండ్రుల అవసరాలు పట్టవు.. వాళ్ళని ఎప్పుడూ హైదరాబాద్ రమ్మని పిలవడు. తల్లి పార్వతమ్మకి ఓసారి గుండెపోటు వస్తే, మూడో రోజున వచ్చి చూసి, డాక్టర్ ప్రాణాపాయం లేదని చెప్తే, అటునుంచి అటే వెళ్లిపోతాడు. తల్లిని డిశ్చార్చ్ చేసేవరకైనా ఉండు అని తండ్రి అంటే సెలవు లేదని వెళ్లిపోతాడు. ఓసారి తాను కారు కొనుక్కున్నానని ఉత్తరం రాస్తాడు. కొడుకుని, మనవడిని చూడాలని కోరికతో హైదరాబాద్ వెళ్తుంది. తల్లి నోరు తెరిచి అడిగినా కొత్త కారులో ఆమెని ఎక్కించడు. ఉన్నట్టుండి పార్వతమ్మకి మళ్ళీ గుండెపోటు వస్తుంది. కారులో ఆసుపత్రికి తీసుకువెళ్దాం అని కోడలు అంటే, కొడుకున్న మాటలకు ఆ తల్లి గుండె బద్దలవుతుంది. ఆంబులెన్స్‌లో హాస్పిటల్‌కి వెళ్తు భర్త కోసమైనా తాను బ్రతకాలి అని కోరుకుంటుంది. మనసును బరువెక్కించే కథ ‘గుండెపోటు’
ఏళ్ళకు ఏళ్ళు ‘సాగే’ టివి సీరియల్స్‌పై గొప్ప సెటైర్ ‘సీరియల్ పుణ్యమా.. అని!’. ఈ కథ చదువుతున్నంత సేపూ పాఠకుల పెదాలపై నవ్వూ విరబూస్తూనే ఉంటుంది. గంభీరమైన కథల అనంతరం ఆఖరి కథగా ఈ హాస్య కథని అందించి పాఠకులు నవ్వుకుంటూ పుస్తకం మూసేలా చేశారు రచయిత.
గుడిలో పువ్వు (కథా సంపుటి) రచన: జీడిగుంట రామచంద్రమూర్తి ప్రచురణ: సన్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్ పేజీలు: 122 వెల: ₹ 60/- ప్రతులకు: Sons Publications, 206-A, Second Floor, ANH Apartments, Red Hills, Hyderabad 50004 Ph: 040-23376826 ~ నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ 500027. ఫోన్: 090004 13413
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
విషాద యశోద-10
సంచిక పద ప్రహేళిక జనవరి 2021
ఎవరి కెరుక?
కాలం
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-17
కొరియానం – A Journey Through Korean Cinema-20
‘నాది దుఃఖం వీడని దేశం’ కవితాసంకలనం ఆవిష్కరణ సభ – ప్రకటన
జీవన రమణీయం-121
నెచ్చెలి వెచ్చని కౌగిలిలో..
తెలంగాణ మలితరం కథకులు – కథనరీతులు-5: చెరబండరాజు కథలు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®