Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుదిబండలు

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన బివిడి ప్రసాదరావు గారి ‘గుదిబండలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రాజేష్ రావు ఓ మ్యాట్రీమోనీ వెబ్సైట్ లో తన వివరాలు నమోద చేసుకున్న ఆరో రోజున..

వస్తున ఫోన్ కాల్ కి అటెండయ్యాడు. “హలో.” అన్నాడు.

“రాజేష్ రావు గారా..” ఫోన్ చేసిన పుష్యమి ప్రశ్నించింది.

“అవును.” పలికాడు రాజేష్ రావు.

“గుడ్. దిస్ ఈజ్ పుష్యమి. కెన్ యు స్పీక్ నౌ..” మెల్లిగా మాట్లాడింది పుష్యమి.

ఇటు చెవి వైపు ఫోన్ ని.. అటు చెవి వైపుకు మార్చుకుంటూ.. “తప్పక..” అనేసాడు రాజేష్ రావు.

“ఐ సా యువర్ డిటైల్స్ ఇన్ మ్యాట్రీమోనీ..”

చెప్పుతున్న పుష్యమికి అడ్డై.. “మీరు తెలుగువారు కాదా. మీది ఏ ప్రాంతం.”  అడిగాడు రాజేష్ రావు.

అటు పుష్యమి సర్దుకుంది. క్లుప్తంగా చెప్పింది.

“మరి.. మనం తెలుగులో మాట్లాడుకుందాం.” చెప్పాడు రాజేష్ రావు.

ఆ వెంబడే..

“నాకు ఇంగ్లీష్.. హిందీ భాషలు వచ్చు. కానీ.. మనం తెలుగు వాళ్లం. మనమే మన భాషలో సంభాషించుకోకపోతే బాగోదు.” చెప్పాడు.

పుష్యమి తల విదిలించుకుంది. “షూర్.. ఆఁ. తప్పక.” తడబడుతోంది. తర్వాత.. ఏదో చెప్పబోతోంది.

“మనం మాట్లాడుకోవలసింది పెళ్లి సంగతే కదా.”  అడిగాడు రాజేష్ రావు అంతలోనే.

ఆ వెంబడే..

“ఇటు పెళ్లికై అబ్బాయిని నేను. మరి అటు మీరు..” అంటూ ఆగాడు.

పుష్యమి బొమలు ఎగరేస్తూ.. “మి టూ. ఆఁ.. ఆఁ. సారీ.. కాదు.. లేదు.. ఊఁ.. మన్నించండి. ఇటు నేను కూడా.. పెళ్లికై అమ్మాయిని.” పుష్యమి తంటా పడుతోంది.

చిన్నగా నవ్వుకున్నాడు రాజేష్ రావు.

“నా వివరాలు మీరు తెలుసుకోగలిగారు. మరి.. మీ వైపు వివరాలు నాకు తెలియవు. కనుక.. మీ వివరాలు తొలుత పంపండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. అదే సబబు కూడా.” చక్కగా చెప్పాడు.

“నా గురించిన వివరాలు.. ఫోటోలు.. మీ ఇ-మెయిల్ కి నిన్న ఉదయంనే పంపానుగా.” చెప్పింది పుష్యమి కాస్తా విస్మయంగానే.

“అవునా. నేను ఇంకా చూడలేదు. కనుక.. ఈ ఫోన్ కాల్ కట్ చేస్తాను. నేను మీ వివరాలు చూసేక.. నేనే కాల్ చేస్తాను.” చెప్పాడు రాజేష్ రావు కాస్తా ఇరకాటంగానే.

“సరే.” అనేసింది పుష్యమి.

రాజేష్ రావు ఆ కాల్ కట్ చేసాడు.

అటు.. పుష్యమి.. ‘ఉఫ్..’ మని నోటితో గాలిని దీర్ఘంగా వదిలి.. పిమ్మట తన తండ్రికి ఫోన్ చేస్తోంది.. ‘ఆదివారం కదా.. నాన్న లేచి ఉంటారా..’ అనుకుంటూనే.

ఇటు.. రాజేష్ రావు.. ఎడమ చేతి వేళ్లతో నుదురును రుద్దుకుంటూ.. కుడి చేతితో టీపాయ్ మీది లాప్టాప్ ని తీసుకుంటున్నాడు.. ‘నిన్న శనివారం కదా.. జాబ్ వత్తిడి వదిలి.. లాప్టాప్ ని ఇంత వరకు ముట్టక.. తేలికై ఉన్నా..’ అనుకుంటూనే.

తండ్రి.. నీలకంఠం కాల్ కు కనెక్టయ్యేక..  “నాన్నా.. నిన్న మీరు చెప్పినట్టే.. ఇప్పుడే ఆ రాజేష్ రావుగారికి  ఫోన్ చేసాను. అతడు ఇంకా నా ఇ-మెయిల్ చూడనే లేదట.” చెప్పింది పుష్యమి.

నొచ్చుకుంటాడు నీలకంఠం.

ఆ వెంబడే..

“హౌ ఈజ్ హిజ్ మెన్నర్ ఆఫ్ స్పీచ్ టిల్ నౌ.” అడిగాడు.

“నాన్నా.. మనం తెలుగులో మాట్లాడుకుందామా.” వెంటనే అంది పుష్యమి కాస్తా నొక్కినట్టే.

“వాట్ హెప్పెన్డ్.” నీలకంఠం విస్మయమవుతాడు.

ఆ వెంబడే..

“ఐ వాంట్ టు ఆస్క్ మైసెల్ఫ్. వుయ్ మోస్ట్లీ కమ్మ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. వాట్ ఈజ్ దిస్ ఛేంజ్.” అడిగాడు చిత్రంగా.

“మరే.. సదరు రాజేష్ రావుగారు నాకు పెట్టిన ఆంక్ష.. లేదు.. లేదు.. నాకు ఇచ్చిన సూచన..” చెప్పింది పుష్యమి కాస్తా స్తిమితంగానే.

ఆ వెంబడే..

“అతడు.. ‘మనం తెలుగు వాళ్లం కనుక.. మనం తెలుగులోనే మాట్లాడాలి’ అన్నాడు.” చెప్పింది నిర్మలంగా.

నీలకంఠం ఏమీ వ్యాఖ్యానించక.. కూతురుతో తెలుగులోనే మాట్లాడడం మొదలెట్టాడు.

నీలకంఠం.. విశాఖపట్నంలో ఓ ప్రయివేట్ కంపెనీలో మానేజర్ హోదాలో పని చేస్తున్నాడు. భార్యతో ఉంటున్నాడు. వీళ్ల ఏకైక సంతానం పుష్యమి.

పుష్యమి ఓ ఐటి సంస్థలో జాబ్ చేస్తూ.. హైదరాబాద్ లో ఉంటోంది. తల్లిదండ్రుల సతాయించుడు తాళలేక ఎట్టకేలకు తన పెళ్లికి సమ్మతి తెలిపింది. దాంతో వివిధ మ్యాట్రిమోనీ సైట్లు సెర్చ్ చేపట్టాడు నీలకంఠం. కొందరి వివరాలు రాసుకున్నాడు. భార్యతో చర్చించాడు. నలుగురును ఎంపిక చేసుకున్నాడు. వాళ్ల వివరాలను పుష్యమికి పంపాడు. తొలి ఎంపికగా పుష్యమి.. రాజేష్ రావు ని ఛూజ్ చేసింది. అప్పుడు.. అతడికి ఇ-మెయిల్ ద్వారా తన వివరాలు పంపమని పుష్యమికి చెప్పాడు నీలకంఠం. అలాగే అతడి నుండి ఎట్టి స్పందన లేకపోయినా.. నేరుగా రాజేష్ రావుకు ఫోన్ చేసి పుష్యమినే తేల్చుకోమన్నాడు.

అదే పని చేసి ఉంది పుష్యమి.

తండ్రితో ఫోన్ సంభాషణ ముగిసేక.. ఆ కాల్ కట్ చేసేసి.. రాజేష్ రావు స్పందనకై ఆగి ఉంది.

రాజేష్ రావు ఓ బ్యాంక్ లో జాబ్ చేస్తూ.. విజయవాడలో ఉంటున్నాడు.

రాజేష్ రావు తండ్రి కాంతారావు.. విజయనగరంలో ఓ డిగ్రీ కాలేజీలో.. సీనియర్ లెక్చరర్ గా జాబ్ చేస్తున్నాడు. భార్యతో కలిసి ఉంటున్నాడు. వీళ్ల ఏకైక సంతానం రాజేష్ రావు.

తన పెళ్లి ప్రయత్నాలు.. తనకు తానుగానే.. రాజేష్ రావు చేపట్టాడు.

ఇటు.. రాజేష్ రావు.. పుష్యమి వివరాలు.. ఫోటోలు పరిశీలించేక.. పుష్యమికి ఫోన్ చేసాడు.

అటు.. పుష్యమి.. “హలో.” అంది.

“మీ ఇ-మెయిల్ చూసాను.” ఆగాడు రాజేష్ రావు.

పుష్యమి చిన్నగా కదులుతోంది. తన ఎడమ చెవి వైపు ఫోన్ ని కుడి చెవి వైపుకు మార్చుకుంది.

“మనం ఇలా ఫోన్ లో కాక.. కలిసి.. మాట్లాడుకోగలమా.” అడుగుతున్నాడు రాజేష్ రావు.

పుష్యమి ఏమీ అనక జల్దుకుంటోంది.

“హలో.” అన్నాడు రాజేష్ రావు.

“చెప్పండి.” పుష్యమి అడగ్గలిగింది.

“మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు. నేను ఉండేది విజయవాడే కనుక.. మనం ఓ చోట కలవగలం.” చెప్పాడు రాజేష్ రావు.

ఆ వెంబడే..

“హైదరాబాద్ నేను రాగలను.” చెప్పాడు.

పుష్యమి తడబడుతోంది.

పుష్యమి తన తండ్రితో మొదట మాట్లాడాలనుకుంటోంది.

అందుకే.. “నేను.. నా పేరెంట్స్ తో..” తడబడుతూ చెప్పుతోంది.

అడ్డై.. “ఆలోచించుకొని ఫోన్ చేయగలరు.” రాజేష్ రావు తేల్చేసాడు.

పుష్యమి తేలికయ్యింది.

“సరే.” అనేసింది.

“మీకు సమ్మతమైతే.. ప్లేస్ మరియు డేట్ మీరే చెప్పగలరు.” చెప్పాడు రాజేష్ రావు.

ఆ వెంబడే..

“ఒకరికి ఒకరం మనం మాట్లాడుకునేక.. మనకు కుదిరితేనే.. నా వైపు నుండి నా పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తాను.” చెప్పాడు. పిమ్మట ఆ కాల్ ని తనే కట్ చేసేసాడు.

అటు.. పుష్యమి.. ఆ వెంబడే.. తండ్రికి ఫోన్ చేస్తోంది.

***

హైదరాబాద్ లో.. ఓ హోటల్ లో.. ఓ ఏసీ కేబిన్ లో..

ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు.. పుష్యమి.. రాజేష్ రావు.

నీలకంఠం సూచనల ప్రకారం ఆ కేబిన్ ని బుక్ చేసింది పుష్యమి.

పుష్యమి సూచనల ప్రకారం అక్కడికి రాజేష్ రావు చేరాడు.

ఇద్దరూ అక్కడికి వచ్చి.. ఐదు నిముషాలు కావస్తోంది.

వాళ్ల పరిచయాలు ఇప్పుడే ముగిసాయి.

“తొలుత ఏమైనా తాగుదాం.” అన్నాడు రాజేష్ రావు. అతడు కారులో విజయవాడ నుండి  డార్క్ గ్రీన్ సూట్ లో వచ్చాడు.

పుష్యమి కాల్బెల్ ఉపయోగించింది. ఆమె స్కూటీ మీద తన హాస్టల్ నుండి లైట్ గోల్డ్ కలర్ చుడీదార్ డ్రస్ లో అక్కడికి వచ్చింది.

కర్టెన్ ని మృదువుగా నెట్టి.. వెయిటర్ వచ్చాడు.

రాజేష్ రావును చూస్తోంది పుష్యమి.

“నాకు కాఫీ ఆర్డర్ చేయవచ్చు.” పుష్యమికి చెప్పాడు రాజేష్ రావు.

“టు.. రెండు.. కాఫీలు.” వెయిటర్ కి చెప్పింది పుష్యమి. చిన్నగా నాలుక కర్చుకుంది.. రాజేష్ రావుని చూస్తూ.

అప్పటికి రాజేష్ రావు వెయిటర్ ని చూస్తున్నాడు.

కర్టెన్ ని సరిగ్గా మూసి.. వెయిటర్ వెళ్లిపోయాడు.

“నేను కోరుకున్నట్టు ఆదివారమైతే బాగుండేది. కానీ ఈ రోజని మీరు చెప్పగా.. జాబ్ కు సెలవు పెట్ట వలసి వచ్చింది.” అంటాడు రాజేష్ రావు.

చిన్నగా కదిలి.. “నేను కూడా సెలవు పెట్టాను. ఈ రోజని మా పేరెంట్స్ సూచించారు.” పొడి పొడిగానే చెప్పింది పుష్యమి.

వెయిటర్ పెద్ద మినరల్ వాటర్ బాటిల్ తో అక్కడికి వచ్చాడు. టేబుల్ మీద బోర్లించి పెట్టబడి ఉన్న ట్రే లోని రెండు గ్లాస్ లను ఆ ఇద్దరి ముందు సరి చేసి పెట్టి.. వాటిలో వాటర్ నింపి.. వెళ్లిపోయాడు.

అప్పటి వరకు వెయిటర్ నే చూస్తూ ఉన్న రాజేష్ రావు. “సర్వీసింగ్ లేట్ కానీ.. ప్లేస్ బాగుంది.” అన్నాడు.

“నాన్న సూచించగా నేను ఇక్కడ బుక్ చేసాను.” చెప్పింది పుష్యమి.

రాజేష్ రావు చిన్నగా నవ్వేసాడు. పుష్యమినే చూస్తున్నాడు. ‘పేరెంట్స్ కూచీ’ అనుకున్నాడు.

పుష్యమి తన చూపు మార్చుతోంది.

నిముషం పాటు వాళ్ల మధ్య మాటలు లేవు.

వెయిటర్ వచ్చాడు. కాఫీ కప్పులు వాళ్ల ముందు సర్ది.. వెళ్లిపోయాడు.

తన ముందున్న కాఫీ కప్పుని తీసుకొని.. కాఫీ చప్పరిస్తూ.. “ఫిజికల్ గా మీరు బాగున్నారు.” అన్నాడు.. పుష్యమిని గమనిస్తూ.

పుష్యమి అతనిని చూసేక చూపు తిప్పింది.

“మరి మీకు నేను.” అడిగాడు రాజేష్ రావు.

పుష్యమి చిన్నగా కదులుతోంది.

“చెప్పాలి.” రెట్టించాడు రాజేష్ రావు.

చిన్నగా తలాడించి.. “సైట్ లో పెట్టిన మీ ఫోటోలోలానే ఉన్నారు.” మెల్లిగా చెప్పింది పుష్యమి.

“అంటే..” ఆగాడు రాజేష్ రావు.

“మీ ఫోటో.. మీ వివరాలు నచ్చేకనే.. మీకు నా వివరాలు పంపేను.” క్లుప్తంగానే మాట్లాడుతోంది పుష్యమి.

“మంచిది.” అనేసాడు రాజేష్ రావు.

రాజేష్ రావు కాఫీ తాగుతూనే.. “కాఫీ చల్లరిపోతోందిగా.” చెప్పాడు.

తన కాఫీ కప్పు తీసుకుంది పుష్యమి.

ఇద్దరి మధ్య కాఫీలు తాగే వరకు మాటలు లేవు.

కాల్బెల్ నొక్కాడు రాజేష్ రావు.

పొందికగా వచ్చిన వెయిటర్ తో ఖాళీ కప్పులను తీసుకు వెళ్లమన్నాడు రాజేష్ రావు.

వెయిటర్ అలానే చేసాడు.

రాజేష్ రావు సర్దుకుంటూ.. “మన ఉద్యోగల రీత్యా.. ఓకే. మరి మీ శాలరీ..” అడిగాడు రాజేష్ రావు.

వెంటనే పుష్యమి చెప్పలేదు.

“మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంటారా.” చిత్రంగా అడిగాడు రాజేష్ రావు.

పుష్యమి ఆకస్మికంగా జంకింది. చిన్నగా తలాడించేసింది. సకాలంగా సర్దుకుంది.

“మాది పేకేజీ శాలరీ. 8.75 లాక్స్ పెర్ ఇయర్.” చెప్పింది.

“ఓ. సుమారుగా నెలకి 73 వేలు.. అనుకోవచ్చు.” అన్నాడు రాజేష్ రావు.

రాజేష్ రావుని చూస్తూ.. పుష్యమి నెమ్మదిగా.. ‘లెక్కల మనిషా.’ అనుకుంది.

అప్పుడే.. తన శాలరీ అంకె చెప్పి.. “పెర్ మంత్.” చెప్పాడు రాజేష్ రావు.

ఆ వెంబడే.. “మన వేతనాలు రీత్యా కూడా ఓకే.” అన్నాడు.

పుష్యమి ఏమీ అనలేదు. అలానే అతణ్ణి చూడనూ లేదు.

“సరే.. ఇక ఆలోచనలు.. తెలుసుకుందాం.” అన్నాడు రాజేష్ రావ్.. పుష్యమినే చూస్తూ.

పుష్యమి అప్పుడే అతడిని చూసింది.

“ముందుగా నావి చెప్తాను. మన నెలవారీ శాలరీలను కలిపేసి.. రెండు భాగాలు చేద్దాం. ఒక భాగంలోని మొత్తం.. మన.. ఇళ్లు.. ఒళ్లు.. తిళ్లు.. ల్లాంటి వాటికి.. ప్లస్.. మనకు పుట్టే బిడ్డకై నెల నెల పొదుపుకై.. వినియోగించుకుందాం.. ఇక్కడ అసలు సంగతి.. మనం ఒకే సంతానంతో సరిపెట్టుకోవాలి..” చెప్పుతున్నాడు రాజేష్ రావు.

పుష్యమి సతమతమవుతోంది.

“ఇక.. రెండో భాగంలోని మొత్తం.. సొంతింటికై పొదుపు.. ఫ్యూచర్ కై పొదుపు.. తలవనితలంపు ఖర్చులకై పొదుపు.. పక్కాగా చేసి తీరుదాం.. ఇక్కడ మరో షరతు.. మనం అప్పులు జోలికి పోకూడదు.” ఆగాడు రాజేష్ రావు.

పుష్యమి ఇంకా తేరుకోలేదు.

“నా ఆలోచనలు మేలైనవి.” గొప్పలో అన్నాడు  రాజేష్ రావు.

మెల్లిగా తెములుకొని.. “ఇంతేనా మీ ఆలోచనలు.. ఇంకేమైనా మిగిలాయా.” అడగ్గలిగింది పుష్యమి.

“మీ పెళ్లి పేరున మాకు మీ వాళ్లు ఇవ్వబోయే మొత్తం.. వగైరాలు.. పూర్తిగా నావే.” చెప్పాడు రాజేష్ రావు.

పుష్యమి గమ్మున చలించిపోయింది. రాజేష్ రావును సూటిగా చూస్తోంది.

“నా పేరెంట్స్ నా చదువులకై అప్పులు చేసి మరీ సర్దారు. వాటిని నేను మీ ద్వారా వచ్చే వాటితో పూడ్చేయాలి..” చెప్పుతున్నాడు రాజేష్ రావు.

పుష్యమి కంగారుపడుతోంది.

“నా పేరెంట్స్.. నాన్నకు అందే తన రీసోర్సెస్ తో తమంతట తాము ఉంటారు. వాళ్లను నేను చూడక్కర లేదు. సో.. మనిద్దరి.. రాబడులు.. పొదుపులు.. ఖర్చులు.. మాత్రం మనవే.” అన్నాడు రాజేష్ రావు.

పుష్యమి తికమకలో కూరుకుపోయి ఉంది.

“పెళ్లితో.. మీ పేరెంట్స్ కి మీ అవసరం మరి ఉండదు. ఇక మన పేరెంట్స్ తదనాంతరమా.. మీరు.. నాలానే.. ఏకైక సంతానం. కనుక.. అటువి.. ఇటువి.. మనవేగా.” తేలిగ్గా అనేసాడు రాజేష్ రావు.

పుష్యమి మరింత కుదించుకుపోతోంది.

“మరో కాఫీ కావాలి.” సడన్ గా అన్నాడు రాజేష్ రావు.

పుష్యమి పట్టించుకొనే స్థితిలో లేదు.

రాజేష్ రావే కాల్బెల్ నొక్కాడు.

వెయిటర్ వచ్చాడు.

“మీకు కాఫీ కావాలా.” పుష్యమిని అడుగుతాడు రాజేష్ రావు.

అడ్డదిడ్డంగా తలాడించేసింది పుష్యమి.

“ఒన్ కాఫీ.” చెప్పాడు రాజేష్ రావు.

వెయిటర్ వెళ్లిపోయాడు.

“నా ఆలోచనలు చెప్పేసాను. మీకు ఉంటే చెప్పొచ్చు.” అన్నాడు పుష్యమినే చూస్తూ రాజేష్ రావు.

ఆ వెంబడే..

“నా ఆలోచనలు ఏ లోటు లేనివి.. ఎట్టి చేటు కానివి.” మళ్లీ గొప్పగా చెప్పాడు.

పుష్యమి ఇంకా ఏమీ మాట్లాడడం లేదు.

రాజేష్ రావు చేతి వాచీని చూస్తూ.. “లంచ్ టైం దాటేస్తోంది. త్వరగా మీ ఆలోచనలు చెప్పేస్తే.. లంచ్ కానిచ్చేద్దాం.. నేను రాత్రి రాక ముందే తిరిగి వెళ్లిపోవాలి.” చెప్పాడు.

అప్పుడే వెయిటర్ వచ్చాడు. రాజేష్ రావు ముందు కాఫీ కప్పు సర్దాడు.

తిరిగి పోతున్న వెయిటర్ తో.. “ఫైనల్ బిల్ తీసుకురా.” చెప్పింది పుష్యమి.

రాజేష్ రావు ఏమీ అనకపోయినా.. పుష్యమిని ఎగాదిగా చూసాడు.

వెయిటర్ వెళ్లేక.. “మీరు కాఫీ తాగిస్తే.. మనం బయలుదేరుదాం.” చెప్పగలిగింది పుష్యమి.

“మరి.. మీ ఆలోచనలు..” నసిగాడు రాజేష్ రావు. కాఫీ తాగుతున్నాడు.

“నా ఆలోచనలకేం కానీ.. మీ ఆలోచనలు నన్ను బెంబేలు పర్చాయి. భాష పట్ల ఉన్న మీ సరళి.. మీ భావాల పట్ల కానరాలేదు. షరతుల్లా దొర్లాయి మీ ఆలోచనలన్నీ. మీ ఆలోచనలు సరైనవి కావు.” చెప్పింది పుష్యమి.

కాఫీ తాగడం ఆపి.. పుష్యమినే చూస్తున్నాడు రాజేష్ రావు.

“బయటి రూపం కాదు.. లోపలి గుణం ముఖ్యం. మీరు తప్పు. వైవాహిక బంధంన ఇరువురిలో భిన్న ఆలోచనలు ఉండొచ్చు.. ఉంటాయి.. కానీ చివరికి దంపతులిద్దరూ ఒకే రకమైన అవగాహన.. దృష్టికోణం కలిగి ఉండాలి.. కలిసి రావాలి. ఆ కోణంలో మీ వంతు.. శూన్యంలా గోచరిస్తోంది. కని పెంచిన వారి పట్ల కాఠిన్యం కాదు.. కృతజ్ఞతే ఉండాలి. ఆర్థిక పుష్టికై వెంపర్లాడినా.. మానవత్వ విలువలను విస్మరించ రాదు.” చెప్పింది పుష్యమి.

రాజేష్ రావు అదిరాడు.

అప్పుడే వెయిటర్ బిల్లు తెచ్చాడు.

ఆ బిల్లు మొత్తం చెల్లించింది పుష్యమి.

ఆ మొత్తంతో పాటు.. టిప్ కూడా పుచ్చుకొని.. వెయిటర్ వెళ్లిపోయాడు.

ఆ తర్వాత..

“థాంక్ యు ఫర్ కమింగ్ ఎట్ మై ఇన్విటేషన్. నౌ. పేమంట్ మేడ్. సో ఇట్ షుడ్ లీవ్.” చెప్పింది పుష్యమి. తను వెలితి.. చిరాకుల నడుమ నలుగుతోంది.

అలానే లేచి.. బయటికి వచ్చేసింది.

తర్వాత.. రాజేష్ రావు తప్పక లేచి.. భారంగా కదిలి.. బయటికి వచ్చాడు.

అప్పటికే పుష్యమి స్కూటీ మీద వెళ్లిపోతోంది..

***

కూతురు చెప్పిందంతా విన్నాక.. “గుడ్ మేన్నర్ మై చైల్డ్.. వాక్ ఫార్వర్డ్ లైక్ దిస్.” చెప్పాడు అటు ఫోన్ నుండి నీలకంఠం.

“నాన్నా.. తెలుగు..” చెప్పింది ఇటు ఫోన్ నుండి పుష్యమి.

చిన్నగా నవ్వేసి.. “ఇంకా అతడి ఇన్ఫ్లూయన్సా..” అన్నాడు నీలకంఠం.

“మంచిని తీసుకోవడం మంచిదేగా.” చెప్పింది పుష్యమి.

“య.. అవును.” ఒప్పుకున్నాడు నీలకంఠం.

అప్పుడే తన ఫోన్ కు మరో కాల్ వస్తున్నట్టు తోచింది పుష్యమికి. ఫోన్ స్క్రీన్ని చూస్తోంది.

“నాన్నా.. అతడు.. ఆ రాజేష్ రావు గారు నుండి కాల్ వస్తోంది.” చెప్పింది నీలకంఠంకి.

“అవునా. ఏమిటంటా.” అటు నీలకంఠం విడ్డూరమవుతున్నాడు.

ఇటు పుష్యమి.. “కాల్ కట్ చేస్తున్నాను. తెలుసుకుంటాను.” చెప్పింది. ఆ కాల్ కట్ చేసేసింది.

రాజేష్ రావు కాల్ కి కలిసింది.

“నేను రాజేష్ రావు.” అటు రాజేష్ రావు మాట్లాడేడు.

“చెప్పండి.” పొడిగా అంది పుష్యమి.

“దయచేసి నేను చెప్పింది పూర్తిగా వినాలి.” కోరాడు అటు రాజేష్ రావు.

పుష్యమి ఆగింది.

“దయచేసి ఆలకించండి.” మళ్లీ కోరాడు రాజేష్ రావు.

‘ఉఁ.’ కొట్టింది పుష్యమి. ‘తను ఏమంటాడా’ అనుకుంటోంది.

“నేను విజయవాడ బయలుదేరేసానే కానీ.. ముందుకు వెళ్లలేకపోతున్నాను. దార్లో ఆగిపోయాను. మన సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. కారణం నేనే. ఆలోచించాను. మీరు చెప్పింది నెమరు వేసుకున్నాను.. తర్కించుకున్నాను. నిజమే.. నాది తప్పు. నా ఆలోచనలు తప్పు. గ్రహించాను.” చెప్పడం ఆపాడు రాజేష్ రావు.

పుష్యమి కుదురు పడగలుగుతోంది. ఆమెలో ఆసక్తి నిలుస్తోంది.

“ఆర్థిక పుష్టికై తప్పుడు ఆలోచనలు చేపెట్టుకున్నాను. మీ వివరణ నచ్చింది.  నాది భారీ తప్పిదమే. నేను మారతాను.. లేదు.. మారాను.. మారిపోయాను.” చెప్పాడు రాజేష్ రావు.

అతడి గొంతు బరువు పుష్యమికి తెలుస్తోంది.

“ఐతే ఏమంటారు.” అంది.

“మీరేమిటో తెలిసింది. మనం మళ్లీ కలుద్దాం.” కోరాడు రాజేష్ రావు.

పుష్యమి మాట్లాడ లేదు.

“దయచేసి నన్ను నమ్మండి.” అటు రాజేష్ రావు తపన పడుతున్నాడు.

“ఏం నమ్మేది.. ఎలా నమ్మేది..” ఇటు పుష్యమి చకచకా అడిగింది.

ఆ వెంబడే..

“మీవి పక్కా హర్స్నెస్ ఆలోచనలు. అట్టివి మాఫీ కాగలవా.” పుష్యమి తంటాపడుతోంది.

“నేను వాటి నుండి బయటకి వచ్చేసాను. మళ్లీ అవి రిపీట్ కానీయను.” చెప్పాడు రాజేష్ రావు.

అర నిముషం లోపునే.. “మీ పేరెంట్స్ సమక్షంలో.. మా పేరెంట్స్ ని కలుపుకొని.. ఇవి మరియు ఇట్టివి.. నా వైపు నుండి రిపీట్ కావని.. నేను పక్కా ‘ఒప్పంద పత్రం’ రాసిస్తాను మీకు.” ఖండితంగా చెప్పాడు రాజేష్ రావు.

పుష్యమి కదిలింది.

“ఇంత పట్టు ఎందుకో.” అడిగింది.

“నన్ను మెరుగుపరిచే వారి సాంగత్యంలో ఉండాలనుకుంటున్నాను. నా మార్పుకు కారణం మీరు.. మీతో సహవాసం నాకు మేలు సమకూరుస్తోంది. ఆ నమ్మకం నాకు కలిగింది. ప్రస్తుతం.. ఇకపై.. తప్పును దిద్దుకోవడమే నా ఏకైక ఆలోచన. అందుకు మీ చేయూత కోరుకుంటున్నాను.” చెప్పాడు రాజేష్ రావు నిండుగా.

పుష్యమి తగ్గగలుగుతోంది.

“మనం త్వరలో మన పేరెంట్స్ సమక్షంలో కలుద్దామా.” అడుగుతోంది.

రాజేష్ రావు సంతోషించాడు.

“తప్పక. ధన్యవాదాలు. నేను మా పేరెంట్స్ తో.. మీ పేరెంట్స్ దరిన.. మిమ్మల్ని కలుస్తాను.. త్వరలో.. తప్పక.” చెప్పాడు.

“స్వాగతం. జాగ్రత్తగా ఇప్పటికి వెళ్లండి. పిమ్మట చక్కగా రండి.” చెప్పింది పుష్యమి సరళంగా.

***

ఇరు కుటుంబ పెద్దలు.. బంధువులు.. హితులు.. సన్నిహితులు.. స్నేహితులు.. సమక్షంన.. పుష్యమి.. రాజేష్ రావుల పెళ్లి ఘనంగా నిర్వహింపబడుతోంది..

అన్నట్టు.. రాజేష్ రావు తన ‘ఒప్పంద పత్రం’ సంగతి.. తమ తొలి సమావేశంలోనే.. అతడి మరియు తన పేరెంట్స్ సమక్షంన కదపగా.. ఆ ప్రతిపాదనను తిరష్కరించింది.. ‘ఆంక్షలు.. సంసారానికి గుదిబండలు’ అని తలచిన పుష్యమి.

Exit mobile version