Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గ్రహణం వీడిన మనసు

ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ ఇది. రచన కూర చిదంబరం.

దే పనిగా మోగుతున్న సెల్‌ఫోను శబ్ధంతో ఈ లోకంలోకి వచ్చి ఫోను వేపు దృష్టి సారించింది స్వాతి. భర్త కామేశ్వరరావు నుండి ఆ ఫోను. అబ్బాయి ప్రసాద్ అమెరికా ప్లయిట్ క్షేమంగా దిగాడనీ, ఎయిర్‌పోర్టు నుండి ఇప్పుడే బయలుదేరాననీ, గంటలో ఇల్లు చేరుకోవచ్చునని, ఆ ఫోను కాల్ సారాంశం.

ఫోను విన్న మరుక్షణం నుండి స్వాతి ఉద్విగ్నత మరింత ఎక్కువయింది.

అబ్బాయికని కేటాయించబడిన బెడ్ రూంలోకి మరోసారి వెళ్ళింది. పరిచి ఉన్న బెడ్ షీటును అరోసారి సర్దింది. ఎ.సి మిషన్ సరిగా పని చేస్తున్నదో లేదో చూడటానికి నాలుగోసారి స్విచ్చు వేసి చూసింది. డ్రాయింగ్ రూం సోఫాలో అలా కూర్చుందో లేదో ఏదో జ్ఞాప్తికి వచ్చి లేచి ఫ్రిజ్ తలుపు తెరిచింది. రేక్‌లో అమర్చిన మంచి నీళ్ళ బాటిళ్ళు తాకి చూసి, చల్లగానే ఉన్నాయని నిర్ధారించుకుంది. సోఫాకి ఎదురుగా ఉన్న గోడ గడియారం వేపు చూసింది. ఇంకా ఏభయి నిమిషాలు అనుకుంది.

ప్రసాద్ తల్లి స్వాతికే కాదు; ఆమె రెండో అబ్బాయి రఘువీర్‌కు, కూతురు రమాసుందరికి, అవుట్‌హౌస్‌లో పని మనిషి లక్ష్మికి కూడా అలాగే ఉంది.

అబ్బాయి ప్రసాద్ అమెరికా నుండి వస్తున్నాడన్న వార్త పదిరోజుల క్రితం విన్నప్పటి నుండి స్వాతికి కాలూ, చేయి ఆడటం లేదు.

భర్తకు, పిల్లలకూ, లక్ష్మికి ఏదో పురమాయింపులు, మరుక్షణం ఏవో మార్పులు, తీరా చేసాక మళ్ళీ ఏవో మార్పులు సూచించటం ఇంట్లో వాళ్ళందరూ స్వాతి చేస్తోన్న హడావిడీ ఆమె పడుతున్న హైరానా వెనక ఉన్న తల్లి ప్రేమను అర్థం చేసుకున్నారు. ఆమె చెప్పినట్లే నడుస్తున్నారు.

కామేశ్వరరావు స్వాతిల మొదటి సంతానం రాఘవేంద్ర ప్రసాదు. చాన్నాళ్ళ నిరీక్షణ తర్వాత మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కృపవల్ల కలిగాడు. కనుక దంపతులు ఆ పేరు పెట్టుకున్నారు, అందరూ ప్రసాద్ అనే పిలుస్తారు. ప్రసాదంటే స్వాతికి ఎనలేని ప్రేమ. కొడుకు అమెరికా వెళ్ళిన చాన్నాళ్ళకు గాని ఆమె మామూలు మనిషి కాలేకపోయింది. ఇంజనీరింగ్ పూర్తయ్యాక అయిదేళ్ళ క్రితం ఎం.ఎస్ చదువుకై అమెరికా వెళ్ళాడు. చదువు పూర్తి చేసుకుని రెండేళ్ళుగా అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నాడు.

ప్రసాద్ ఉద్యోగంలో చేరినప్పటి నుండీ, ఓసారి ఇండియాకు వచ్చి వెళ్ళమనీ, చూడాలని ఉందనీ స్వాతి పొరుతూనే ఉంది.

అదుగో… ఇదుగో అంటూ అడిగిన ప్రతిసారి దాటవేస్తూ, రెండు వారాల సెలవు మీద ఇంటికి వస్తున్నానని చెప్పినప్పటి నుండి స్వాతి ఉత్సాహానికి పట్టపగ్గాలుండటం లేదు. ఆమెకు నేల మీద కాలానడం లేదు. అడిగిన వారికి అడగని వారికీ అబ్బాయి ఇండియా వస్తొన్న విషయం ప్రస్తావిస్తూ ఊహలోకాల్లో తేలిపోతూన్నది.

స్కైపులు, వాట్సప్‌ల పుణ్యమా అని ఒకర్నొకరు స్మార్టఫోనుల్లో చూసుకోగలుగుతున్నా, వారాంతాల్లో గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నా, దగ్గరకు పొదముకుని, కొడుకును తనివితీరా చూసుకంటే కలిగే ఆనందం ఆమెకు ఏ స్కైపులు, వాట్సప్‌లు ఇవ్వలేవు.

ఎలాగూ అబ్బయి ఉద్యోగంలో స్థిరపడ్డాడు కనుక వాడినో ఇంటి వాడిని చేసి ఆ ముచ్చటా తీర్చుకొవాలని ఆమె అభిలాష. ప్రసాద్ వస్తున్నాడని తెలియగానే నాలుగైదు సంబంధాలు చూసి ఉంచింది.

అమ్మగారి హడావిడి గమనిస్తోన్న పనిమనిషి లక్ష్మికి కూడా ఉత్సుకతగానే ఉంది. ప్రసాద్‌కు ఏడాది నిండకమునుపే ఆమె ఆ యింటికి స్వాతికి తోడుగా వచ్చింది. కన్న మమకారం స్వాతిదయితే, పెంచిన మమకారం లక్ష్మిది. ఒక్కొసారి స్వాతి సెల్ ఫోనులో ప్రసాద్‌తో మాట్లాడుతూ ఇదుగో అబ్బాయి అని చూపుతోంటే లక్ష్మికి కూడా ఎంతో సంతోషం కలుగుతోంది.

పెదబాబుకు అమెరికాలో ఉద్యోగం. నెలకు ఆయిదు లక్షలు వస్తాయట. ఎంత పెద్ద ఉద్యోగమో. మన దేశపు ప్రెసిడెంటు కంటే ఎక్కువ సంపాదిచే ఉద్యోగమట. అలా ఉద్యోగంలో చేరాడో లేదో… పడవంత కారుకొని వాళ్ళ అమ్మకు ఫోటో కూడా పెట్టాడు. ఎక్కడకు వెళ్ళాలన్నా కారులోనే వెడతాడట. ఇన్నేళ్ళుగా పని చేస్తున్న పెద్దయ్యకు కూడా కారు లేదు. త్వరలోనే ఇల్లు కొనుక్కుంటున్నాని, ఇంటి ఫోటో కూడా పెట్టాడు పెదబాబు. రాజమహాల్‌లా ఆ ఇల్లు ఎంత బావుందో… ఇలా సాగిపోతుంటాయి ఆమె ఆలోచనలు.

***

బయట టేక్సీ ఆగిన చప్పుడయింది. అటు వెంటే ‘అన్నయ్యొచ్చాడు, అన్నయ్యొచ్చాడు” అన్న రఘు, రమల అరుపులకు ఈ లోకంలోకి వచ్చింది స్వాతి.

వస్తూనే షూ అయినా విప్పకుండా ’అమ్మా’ అంటూ సోఫాలో తన పక్కన వాలిన ప్రసాద్‌ను ఆప్యాయంగా పొదువుకుంది స్వాతి.

ఉబికి వస్తున్న కన్నీరు నాపుకుంటూ, వళ్ళంతా తడిమింది. చెదిరిన క్రాపు సరి చేసి బుగ్గల్ని పుణుకుతూ ఉండిపోయింది. మంచి ప్రాయపు రంగుతో మిసమిసలాడుతూ వళ్ళు చేసి నిండుగా కనిపిస్తోన్న కొడుకుని చూసుకున్నాక ఆమెకు ఒకింత గర్వం కలిగింది. తండ్రి కంటే రెండించీలు పొడుగు అనుకుంది,

పైకి మాత్రం, “ఏరా! ఏమైనా తింటున్నావా? లేదా?? ఎంత చిక్కిపోయావో? ఎప్పుడేనా నిన్ను నీవు చూసుకున్నావా?” అని అడిగింది.

తల్లి కనపరుస్తోన్న ఆర్తి ప్రసాదుకు కొత్తేమీ కాదు.

“రోజూ బ్రెడ్ బటర్ జాంలు తింటాము. అన్నం వండుకునేంత సమయం ఉండదు. వీకెండుల్లో 3,4 రోజులకు సరిపడా అన్నం, కూరలు, సాంబారు తయారు చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత వెచ్చచేసుకుని తింటుంటాం. అయినా అమ్మా! నీ చేతి వంటకు సాటి ఏదీ రాదునకో…” అంటూంటే.. తల్లి ప్రాణం విలవిల లాడిపోయింది.

“ఏమోరా… ఏం ఉద్యోగాలో ఏమో… ఎంత సంపాదించినా కడుపుకు నాలుగు మెతుకులు తృప్తిగా తినలేకపోతే ఎట్లా…”

తల్లి ఇంతట్లో తెమలదనీ, “బావున్నావా లక్ష్మీ! లక్ష్మయ్య ఎలా ఉన్నాడు?” అంటూ సంభాషణ మరలించే ప్రయత్నం చేస్తూ, తల్లి కౌగిట ఉంటూనే, రఘు, రమలను దగ్గరకు రమ్మని సైగ చేసాడు. పిల్లిద్దరూ అన్నయ్యను వాటేసుకుని ఒదిగిపోయారు.

ఈ దృశ్యాన్ని చూస్తోన్న లక్ష్మికి కూడా కళ్ళు చెమర్చాయి. అంతలోనే ఆమెకు తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది. పెదబాబుకు కాఫీ కలపటానికి కిచెన్ వేపు నడిచింది.

‘అన్నయ్య అచ్చు వాట్సప్‌లో కనిపించినట్లే ఉన్నాడు’ అనుకుంది రమ. స్కూల్లో సహధ్యాయులు రకరకలా టీషర్టులు వాచీలు గట్రా వేసుకుని క్లాసుకు వచ్చి ఇది మా అన్నయ్య అమెరికా నుండి పంపాడు, ఇది మా బాబాయ్ పంపాడు అంటూ గర్వంగా చూపుతోంటే ఏదో న్యూన్యతా భావానికి లోనయ్యేది. అమెరికా నుండి ఏం తేవాలని ప్రసాద్ అడిగినప్పుడు రాసిపెట్టుకున్నలిస్టును గడగడా చదివింది.

ఆ యేడే బి.టెక్.లోకి ప్రవేశించిన రఘు కోరికలు వేరు. అన్నయ్యలా ఆమెరికా వెళ్ళి ఎం.ఎస్ చేసి అక్కడే ఓ పెద్ద ఉద్యోగంలో చేరాలన్న కల రఘుకి ఉంది.

ఇక కామేశ్వరరావుగారి ఆలోచనలు మరోలా ఉన్నాయి. మరో మూడేళ్ళకు రఘు కూడా అమెరికా వెళ్తానంటాడు. పెద్దడిని ఆమెరికా పంపటానికి తీసిన లోను ఇంకా తీరలేదు. పాత అప్పు తీరిస్తేగానీ క్రొత్త అప్పు దొరకదు. ఉద్యోగంలో చేరాక కూడా ప్రసాద్ ‘లోను’ మాట ఎత్తటం లేదు. ప్రసాదుకు పెళ్ళి సంబంధాలు అంటూ స్వాతి పోరుతోంది. ఈ విజిట్‌లో వాడి పెళ్ళి నిశ్చయమైతై… మరో పెధ్ద ఖర్చు. రమ చదువూ పెళ్ళి బాధ్యతలు రిటైరవ్వక ముందే తీర్చుకోవాలి. ప్రసాదుకు ఓ మారు కదిపి చూస్తే… వాడి సంగతేమో… కాని స్వాతి ఒంటి కాలున లేవటం ఖాయం.

ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగానే, పొగలు గ్రక్కుతున్న కాఫీ కప్పుల్ని టీపాయి మీద ఉంచి వెళ్ళింది లక్ష్మి.

‘జెట్‌లాగ్’ అంటూ ఓ చేత కాఫీ కప్పు, మరో చేత తల పట్టుకుని తనకు కేటాయించిన గదివేపు నడిచాడు ప్రసాదు.

రెండురోజులు వరుసగా నిద్ర పోతేగాని ప్రసాదుకు ‘జెట్‌లాగ్’ వదల్లేదు.

మూడోరోజు భోషాణం లాంటి తన సూట్ కేస్సులోని సామానంతా రెండు బ్యాగుల్లో సర్దాడు ప్రసాద్. ఖాళీ సూట్ కేసును లక్ష్మీ సాయంతో ఎండలో వేయించాడు.

ఆ నాటి సాయంత్రం బీరుమగ్ లాంటి కప్పులో ‘బ్లాక్ కాఫీ’ త్రాగుతూ, ఒక బ్యాగులో సర్ది ఉంచిన వస్తువుల్ని బయట పరిచాడు. ‘ఐ లవ్ అమెరికా’ అని ప్రింట్ చేసి ఉన్న కాలర్ లేని ముదురు రంగుల టీషర్టులు రెండు “నాన్నా ఇవి మీకు” అంటూ ఇచ్చాడు.

ఎప్పుడూ వేసుకోని ముదురు రంగుల టీషర్టులు కామేశ్వరరావుకు నచ్చకున్నా, పైకి మాత్రం “బావున్నాయిరా” అన్నాడు.

అర చేయి అంత వెడల్పున్న ‘ఐ ఫోను’ రఘుకు ఇచ్చాడు.

చిన్న సైజు, రాసుకునే పలకలా ఉన్న ట్యాబు, లిప్ స్టిక్ సెట్టు చెల్లెలికి బహుకరించాడు.

“లక్ష్మక్కా ఇవి నీకు” అంటూ రెండు షాంపూ బాటిళ్ళు, రెండు మాయిశ్చరైజర్ బాటిళ్ళు, “ఇవి లక్ష్మయ్యకు” అంటూ ‘ఆప్టర్ షేవ్ లోషన్ బాటిల్’ ఒకటి లక్ష్మికి ఇచ్చాడు.

“అమ్మా ఇది నీకు” అంటూ తళ తళ మెరుస్తున్న ముదురు రంగు అట్ట పెట్టెలోంచి ఒక ఉంగరాన్ని బయటకు తీసి తల్లి వేలికి తొడిగాడు. అది ఆవిడ మధ్య వేలికి సరిగ్గా సరిపోయింది.

తన కుడి చేతి వేళ్ళను చాచి చూసుకుంది ఆమె.

వెండి ఉంగరం. మధ్యలో పెసర బద్దంత తెల్లరాయి. క్రొత్తదవటం వల్లో మరెందువల్లో, ఉంగరం, దానికి పొదిగిన తెల్ల రాయి రెండూ ట్యూబులైటు కాంతిలో ధగధగ మెరిసిపోతున్నాయి. అయినా స్వాతి మనసు చివుక్కుమంది.

మెట్టెలు, కాళ్ళ పట్టాలు లాంటివి వెండితో చేస్తారు. కాని వెండితో చేసిన ఉంగరాలు తమ బంధువులెవరూ ధరించగా చూడలేదు. మధ్య తరగతి ముస్లింలు కొందరు పెద్ద పెద్ద వెండి ఉంగరాలు. అందులో పాలీషు చేయిని రాళ్లు పొదిగినవి ధరించగా చూసిందామె.

‘నేనేం సాయెబులమ్మననుకున్నాడా ఏంటి, ఇట్లాంటి వెండివి ధరించటానికి’ అనుకుంది.

వేలి నుంచి ఆ ఉంగరాన్ని తీసి అదే పెట్టెలో ఉంచి, టీపాయి మీద ఉంచింది. ఎవరూ గమనించలేదు కాని, అది ఉంచటం కాదు నిర్లక్ష్యంగా గిరాటు వేయటం.

“ఏరా నేను నీకు ఇంత కాని దానినయ్యానా? పనికి మాలిన బహుమతి తెచ్చావు” అని నిలదీయాలనిపించింది.

కాని మరుక్షణం ఆమెలోని తల్లి ప్రేమ ఆమెను జయించింది. ఉన్న నాలుగు రోజులు, వాడి మనసు కూడా ఎందుకు కెలకటం అనుకుని మౌనం వహించింది.

తిరుపతి, శిరిడీ సందర్శనతో ప్రసాదుకు మరో నాలుగు రోజులు గడిచిపోయాయి. చుట్టాలిళ్ళ సందర్శనాలు, పెళ్ళి చూపులతో మరో నాలుగు రోజులు దొర్లిపోయాయి. తిరిగి అమెరికా వెళ్ళే రోజు దగ్గర పడింది. కొడుక్కు కావల్సిన పచ్చళ్ళు, పొడులు, తినుబండారాలు ప్యాకింగ్ అవుతున్నాయి. వీటన్నింటితో స్వాతికి క్షణం తీరిక ఉండటం లేదు.

అయినా, ఏ పని చేస్తున్నా, ఏ ధ్యాసలో ఉన్నా స్వాతి మనసంతా కొడుకు బహకరించిన వెండి ఉంగరం చుట్టు తిరుగుతున్నది. ఉంగరం పెట్టె టీపాయి మీద అలాగే పడి ఉంటోంది. భద్రంగా మిగతా నగలతో బాటు బీరువాలో దాచుకోవటానికి ఆమెకు మనసు ఒప్పటం లేదు.

తాను ధరించటం మాట దేముడెరుగు, పనిమనిషి లక్ష్మికి ఇచ్చినా “దీన్ని నేనేం చేసుకోనమ్మా!” అంటూ వెనక్కి ఇస్తుందేమోనన్న వెరుపు కలుగుతోంది.

ఎవరితోనైనా తన ఆలోచనల్ని పంచుకోవాలనిపిస్తోంది స్వాతికి. కాని మనస్కరించటం లేదు. చివరకు భర్తతో చెప్పుకోవాలనుకున్నా, అభిమానం అడ్డువచ్చింది. కారణం – ఆదంపతులు సంభాషణల్లో ఎప్పుడూ ప్రసాదు ప్రసక్తి వచ్చినా భర్త ప్రసాదును ఆక్షేపించినా ఆమె వెనకేసుకు వచ్చేది. ‘వాడికి నా దగ్గరి కంటే నీ దగ్గరే చనువు ఎక్కువ’ అని భర్త అంటోంటో స్వాతికి గర్వంగా ఉండేది.

ఇప్పుడు ఒక రకమైన నిర్లిప్తత, నిర్వేదం స్వాతిలో చోటు చేసుకున్నాయి. ‘అడ్డాల నాడు మన బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు’ అనుకుంది. ‘వీడు నాకు ఏ బహుమతి తేకున్నా ఇంతకంటే ఎక్కువ సంతోషించేదాన్ని’ అనుకుంది.

ఓ రోజు ప్రసాదు తల్లి దగ్గరకు వచ్చాడు. “అమ్మా మా ఆఫీసులో మా బాసు, నా కోలిగు ఇద్దరూ ఆడవారే. బాసు అమెరికా పౌరురాలు. అయినా మన దేశపు నగలు చీరలు అంటే మక్కువ. కొలీగు పంజాబీ. సౌత్ ఇండియా ఆభరణాలు ఆమెకూ ఇష్టమే! వీరిద్దరికీ బహుమతిగా ఏవైనా ఆభరణాలు తీసుకువెళ్దామనుకుంటున్నాను. నువ్వు నాతో జ్యూయెలరీ షాపుకు వచ్చి వాళ్ళకు తీసుకోవాల్సిన వస్తువుల్ని సెలెక్టు చేయాలి” అన్నాడు.

స్వాతికి వెళ్ళాలనిపించలేదు. ఆభరణాలు అనగానే కొడుకు తన కిచ్చిన బహుమతి ముల్లులా గుచ్చుకుంది.

“ఇవ్వాళ రేపటి ఫేషన్లు నాకేం తెలుస్తాయిరా? వెండివో బంగారంవో అక్కడి సాంప్రదాయాలకు సరిపడేవి పట్టుకెళ్ళు” అంది ‘వెండి’ అన్న పదం మరింత నొక్కి చెబుతూ.

ప్రసాదు వినలేదు. ‘రావాల్సిందే’ అంటూ పట్టుపట్టాడు.

తప్పని సరియై కొడుకు వెంట బయలుదేరింది.

ఆ జ్యూయెలరీ షాపు యజమానికి స్వాతి బాగా పరిచయం. ఎంత చిన్న అవసరమైనా ఆమె అక్కడికే వెళ్తుంది. దానికి తోడు షాపు యజమాని స్వాతిని గుర్తు పట్టి పలకరిస్తాడు. స్వాతికి కొంత అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తాడు.

ఓ గంట సేపు అవీ, ఇవీ చూసి రెండు రాళ్లు పొదిగన ఇయర్ టాప్స్ సెలెక్టు చేసాడు ప్రసాదు. ఒక్కొక్కటి పదిహేను వేలు.

“మీ ఆఫీసు కొలీగ్స్ పాటి కూడా నేను కాలేకపోయాను” స్వాతి మనసు బాధ పడింది. పైకి ఏమీ అనలేదు.

వచ్చినంత హడావిడిగా తిరిగి వెళ్ళిపోయాడు ప్రసాద్. పెళ్ళి సంబంధాలేవో చూసారు. కాని ఆమెరికాలోనే ప్రస్తుతం పని చేస్తున్న వారైతేనే బావుంటుదన్నాడు ప్రసాద్. స్వాతి కామేశ్వరరావులు మాటాడలేదు. ప్రసాద్ సూచించిందే సబబు అనుకున్నారు ఇద్దరు.

వెళ్తూ, వెళ్తూ ప్రసాద్ తల్లిని దగ్గరకు తీసుకుని ఆమె చెక్కిలిపై ఓ ముద్దు ఉంచి “ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ ఎలాట్” అని వెళ్ళిపోయాడు.

“ఈ సంబడాల ప్రదర్శనకేమీ తక్కువ లేదు” అనుకుంది స్వాతి.

అబ్బాయి తెచ్చిన ఉంగరం పెట్టె టీపాయి మీద మూడు వారాల నుండి అలాగే పడి ఉంది. ఆ పెట్టెను చూసినపుడెల్లా స్వాతికి ఒక రకమైన విరక్తి కలుగుతోంది. అంతలోనే ఏదో అపరాధ భావం. బీరువాలో భద్రంగా దాచుకునేంత విలువైన వస్తువుగా ఆమెకు అనిపించటం లేదు. పైగా ఆ పెట్టెను చూసిన ప్రతీసారీ, కొడుకు తన యెడ కనబర్చిన తేలిక భావం ముల్లులా గ్రుచ్చుకుంటోంది. ఏదో సందిగ్ధం, అంతలోనే ఇదీ అని చెప్పలేని తల్లి మనసు.

ఒకనాటి మధ్యాహ్నం ఆ పెట్టెతో సహా, ఎప్పుడూ తాను వెళ్ళే జ్యూయెలరీ షాపుకు వెళ్ళింది.

కస్టమర్స్‌తో షాపు కిటకిటలాడుతున్నది. ఎప్పటిలా షాపు యజమాని స్వాతిని పలకరించి కూర్చోబెట్టాడు. అందరి ముందు పెట్టె విప్పి ఆ వెండి ఉంగరాన్ని చూపాలంటే ఆమెకు ఏదో బెరుకు కలుగుతోంది. కస్టమర్‌ల రద్దీ కాస్త తగ్గాక ఉంగరం పెట్టెను తన హేండుబ్యాగులోంచి బయటకు తీసింది స్వాతి.

“దీంతో మా రమకు రెండు మూడు గ్రాముల ఇయర్ టాప్స్ లాంటి చిన్న వస్తువేమయినా వస్తుందా?” అని అడిగింది లోగొంతుతో.

షాపు యజమాని ఆ పెట్టెను చూసాడు. దాని మీద వెండిరంగులో మెరిసిపోతున్న “బ్లూనైల్” (Blue Nile) అన్న అక్షరాలను చూసాడు. పెట్టె తెరిచి ఉంగరాన్ని, పొదిగి ఉన్న రాయిని చూసాడు. పెట్టె మీద బ్లూ నైల్ అక్షరాలను తడిమి చూసాడు. మరొక్కసారి ఉంగరాన్ని పొదిగి ఉన్న రాయిని గమనించి భూతద్దంతో చూసి ఆ రాయి డైమండేనని నిర్ధారించుకున్నాడు.

“పాపకు ఇయర్ టాప్స్ కాదమ్మా, మీకు ఏకంగా లాంగ్ చెయిన్ వస్తుంది. ఇది వెండి కాదు. ప్లాటినం అనే లోహం. బంగారం కంటే అరు, ఏడు రెట్లు ఎక్కువ విలువ ఉంటుంది. ఉంగరంలో పొదగబడ్డ రాయి అసలు సిసలైన వజ్రం. సుమారు ఒక కేరటు బరువు ఉంటుంది. కేరటు ఒక్కంటికి ధర ఏభయివేల పైచిలుకు. మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్లాటినం ఆభరణాలు వాడుకలోకి వస్తున్నాయి. ఆమెరికా లాంటి సంపన్నదేశాలలో నిశ్చితార్థానికి ఈ ఉంగరాలు పరస్పరం మార్చుకుంటారు. ఇంకా వాడినట్లు కూడా అవుపించటం లేదమ్మా. ఇప్పుడే మీరు మార్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు?” జారిపోతున్న కళ్లద్దాల్లోంచి స్వాతిని కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు.

క్షణం పాటు స్వాతి తన చెవుల్ని తానే నమ్మలేక పోయింది. ‘అంటే ఇది వెండి ఆభరణం కాదన్న మాట’ అనుకుంది. ‘ప్రసాద్ తనకిచ్చిన బహుమతి బంగారం కంటే విలువయినదా. అయినా నా పిచ్చిగాని వాడి ప్రేమను బహుమతి వస్తువులతో కొలవటం ఏమిటి?’ అనుకుంది.

“అమ్మటానికి కాదు. కానీ…” అంటూ ఆ ఉంగరాన్ని ఆప్యాయంగా చేతిలోకి తీసుకుంది. జాగ్రత్తగా తిరిగి పెట్టెలో ఉంచి చంకన వేలాడతున్న బ్యాగులో పెట్టుకుంది.

ఇంటికి వచ్చాక ఆ బ్లూ నైల్ అక్షరాలున్న అట్టపెట్టెను తన నగల బీరువాలో దాచుకుంది.

ఇప్పుడు ఆమె మనసు గ్రహణం వీడిన చంద్రుడిలా, పుటం పెట్టిన బంగారంలా స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది.

Exit mobile version