Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గోవిందుని ఆశ్రయిద్దాం!

రచన హైదరాబాద్ నుంచి మా తిరుమల తిరుపతికి జరిపిన భక్తి పర్యటన గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024వ సంవత్సరంలో ప్రభుత్వం మారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా భక్తుల దర్శన వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రచన ద్వారా మేము ఎట్లా శ్రీనివాసుని దర్శనం చేసుకున్నామో తెలుపడమే గాక ఇప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇతర దర్శనా విధానాలను, సౌకర్యాలను కూడా తెలుపుతాను.

తెలుగు రాష్ట్రాల్లో అన్ని దేవాలయాలలోకెల్ల తిరుమల శ్రీనివాసుని దర్శనం కొంచం కష్టతరమైనదిగా భక్తులు ఈ రోజుల్లో చెప్పుకుంటున్నారు. ధర్మ దర్శనానికి కనీసం ఆరు గంటల సమయం, శీఘ్ర దర్శనానికి కనీసం రెండు గంటల సమయం పైగా మూడు నెలల ముందు దర్శనం టికెట్లను టీటీడీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవాలి. ఇవి ప్రతీ నెల 22వ లేదా 23వ లేదా 24వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. ఒక లాగిన్ ఐడితో ఆరు మందికి శీఘ్ర దర్శన టిక్కెట్లు దక్కించుకోవచ్చు. తరువాత అకామెడేషన్ కూడా ఆన్‌లైన్ లోనే ఇచ్చిన గడువు లోపలే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ టిటిడి అకామొడేషన్ దొరకకపోతే వివిధ మఠాలను సంప్రదించి ముందే బుక్ చేసుకోవచ్చు.

మా తిరుమల తిరుపతి యాత్ర:

“ఎండ కానీ వాన కానీ ఏమైనా కానీ, కొండల రాయుడే మా కులదైవం” అని అన్నమాచార్యుల వారు ఒకానొక సంకీర్తనలో తెలిపినట్టు మా ఇలవేల్పు కూడా వెంకటరమణుడే. పైగా మా శ్రీవారు డా. ఎస్. పార్థసారథి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన దివ్యదేశం. హైదరాబాద్‌లో ఉద్యోగ పరమైన ఒత్తిడి అధికమై ఎటైనా ఓ మూడు రోజులు వెళ్ళొద్దామని అనుకునే సందర్భాలలో ముందుగా వారి మస్తిష్కంలో మెదిలే ప్రదేశం తిరుమల తిరుపతి. “కొండపైకి వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించి, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో నిత్యం ప్రసాదం స్వీకరిస్తూ ప్రశాంతంగా కాలం గడిపేయొచ్చు” అని అంటారు. ఇక అలిపిరి నుంచి కొండెక్కుతూ రావడమే మావారికి ఇష్టం. మే 2025లో టిటిడి యాప్ ద్వారా శీఘ్ర దర్శన టిక్కెట్లు ప్రయత్నించినా దొరకలేదు. మళ్ళీ జూన్ నెలలో విడుదల అయినప్పుడు ప్రయత్నిస్తే అదృష్టం కొద్దీ, సెప్టెంబర్ 11వ తేదిన రాత్రి 8 గంటల స్లాట్‌లో ఆరు టిక్కెట్లు (మా అత్తమామలు, అమ్మనాన్నలు, నేను, మావారు, మా ఇరవై నెలల బుజ్జాయి) దొరికినాయి. దర్శనం తేదీకి తగ్గట్టుగా అక్కడ సందర్శించవలసిన ఇతర ప్రదేశాలు ముందుగా అనుకుని, మమ్మల్ని తిప్పడానికి ఒక కారు, డ్రైవర్, తిరుపతి మరియు తిరుమలలో ఉండటానికి వసతులను మూడు నెలల ముందే మాట్లాడుకున్నాము, రాకపోకలకూ ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరి అదే రోజున మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి విమానాశ్రయంలో దిగిన తరువాత అక్కడున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద ఫోటోలు తీసుకున్నాము. అప్పటికి మేము ఇదివరకే మాట్లాడుకున్న కారు మమ్మల్ని పిక్ అప్ చేసుకోటానికి వచ్చేసింది. అటు నుంచి నేరుగా అడయార్ ఆనంద భవన్ అనే వెజిటేరియన్ రెస్టారెంట్ లో కమ్మటి సాపాట్లు చేసి, అక్కడి నుంచి తిరుచానూరు ఒకే కిలోమీటర్ కనుక నేరుగా పద్మావతి అమ్మవారి కోవెల కు చేరుకున్నాము.

తిరుపతి విమానాశ్రయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద రచయిత దంపతులు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం:

పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రధాన ద్వారమును పడి అంటారు. పడి ఎదురుగా టీ, కొబ్బరిబోండాలు, గోలిసోడా, ఇతర శీతల పానీయాల విక్రయదారులు కనబడతారు. ఈ ద్వారం నుంచి లోపలికి వెళితే మొబైల్ ఫోన్లు భద్రపరుచుకోవటానికి, దర్శనం టికెట్లను కొనుగోలు చేసుకోవడానికి కౌంటర్లు ఉంటాయి. పువ్వులు, తులసి అమ్మేవారు ఉంటారు. ఇక్కడ ఒకరికి అతి శీఘ్ర దర్శనానికి 200 రూపాయలు, శీఘ్ర దర్శనానికి 50రూపాయల టికెట్ కొనుగోలు చేసుకోవాలి. ధర్మ దర్శనం ఉచితమే. అతి శీఘ్ర దర్శనమైతే ఒక గంట సమయంలో అయిపోతుందని మా డ్రైవరు చెప్పినా, ఎక్కువ రద్దీ లేదనుకుని 50 రూపాయల టిక్కెట్లు తీసుకుని క్యూ లో నిలబడ్డాము. లౌడ్ స్పీకర్లో వేదమంత్రాలు వినబడుతుండగా ముందుకు సాగిపోతూ గర్భగుడి లోకి ప్రవేశించినాము. సింహద్వారమున గజలక్ష్మి అమ్మవారు ఆశీర్వదిస్తూ కనబడుతుంది, లోనికి చూస్తే “కూడున్నది పతి చూడికుడుత నాంచారి” అన్నట్టు జగజ్జనని, వెంకటరమణుని పట్టపురాణి అలమేలు మంగ తాయారమ్మ ముగ్ధ మనోహరమైన స్నిగ్ధ హాసము తో పద్మము పై కూర్చుని యుండి లలాట ఫలకాన వైష్ణవ సంప్రదాయపు శ్రీచూర్ణం తిరుమణితో, పట్టు వస్త్రాలు ఆభరణాలతో సర్వాలంకారియై అభయహస్త ముద్రతో భక్తుల పై కరుణారస కనకవృష్టి కురిపించే కల్పవల్లి గా దర్శనమిస్తారు. మేము దర్శించుకున్నప్పుడు పెద్ద బంగారు జరీ అంచు కలిగియున్న ముదురు పసుపు పచ్చ రంగు పట్టు చీరలో గంభీరంగా ఉన్నది పద్మావతి తాయారమ్మ. అమ్మను దర్శించుకుని గర్భగుడి వెలుపలికి రాగానే అర్చకస్వాములు తీర్థం శఠగోపం ప్రసాదాలు ఇస్తారు. ఆలయ ప్రాంగణం లోనే వాటిని సేవించి అక్కడే ఉన్న కుళాయిలో చేతులు శుభ్రం చేసుకుని, త్రాగునీరు సదుపాయాన్ని భక్తులు వినియోగించుకోవచ్చు. ఈ ఆలయంలో శ్రీ కృష్ణ సన్నిధి కూడా ఉన్నది. ఈ సన్నిధి మేము దర్శించుకున్నప్పుడు మూల మూర్తికి పట్టు వస్త్రముతో చీర వలె కుచ్చులు ధార పోసి కృష్ణునికి అలంకరించి ఉన్నది, అంటే అమ్మవారికి చీర కట్టిన రీతిలో ఉన్నది. దీన్ని చూసి ఇది ఈ ఆలయంలో మరొక మహాలక్ష్మి సన్నిధా అని అనిపించి, మూర్తి యొక్క వదనం స్పష్టంగా చూడటానికి ప్రయత్నించినాను. అచ్చంగా శ్రీవైష్ణవ వడగళై ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని శంఖు చక్రాలను ధరించి ఉన్నాడు కృష్ణుడు. అప్పుడు అర్థమైంది ఇది మహాలక్ష్మి మూర్తి కాదని. మరి వస్త్రాలంకరణ అమ్మవారి లాగా ఉందేమిటి అనే సందేహం మనసులో మెదులుతూనే ఉన్నది. అక్కడున్న అర్చక స్వామి ఈ నా సందేహాన్ని క్షణంలో తీర్చేసినారు. “ఇది అమ్మవారి కోవెల కనుక మాకు పట్టు చీరలే అధికంగా వస్తాయి కాబట్టి వాటినే ఇక్కడ కృష్ణునికి అలంకరిస్తాం. ఎట్లా అయితేనేమి పట్టు వస్త్రమే కదా!” అని “మీది ఏ ఊరు?” అని తిరిగి ప్రశ్నించారు అర్చకస్వామి. వెంటనే హైదరాబాద్ అని చెప్పేసి గర్భగుడి వెలుపలికి వచ్చిన తరువాత ఊరెందుకు అడిగినారు, బహుశా వస్త్రాలంకరణ గురించి ఎవరూ అడిగుండకపోవచ్చు అని అనుకున్నాను. ఆలయం నుండి బయటకు వచ్చే దారిలో లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేసినారు. 200 రూపాయల టికెట్ ఉంటే దానితో ఒక లడ్డు ఉచితంగా పొందవచ్చు. లేదా ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని కొనుగోలు చేసుకోవచ్చు. లడ్డూ కౌంటర్లకు వెళ్లే దారిలో సహస్ర దీపాలంకరణ సేవ చేసే పెద్ద పందిరి వేసియున్నది. ఆ పందిరి పక్కన సాయంత్రం మావటి వాళ్ళ తోపాటు అమ్మవారిని సేవించుకోవడానికి ఏనుగు కూడా ఉంటుంది. భక్తులు ఇచ్చే అరటి పండ్లు, రొట్టెలను ఆనందంగా స్వీకరిస్తుంది. పద్మావతి అమ్మవారిని పల్లకిలో మోసుకుని వచ్చి ఆ పందిరిలో వేంచేపు చేస్తారు. ఆ పందిరి పక్కనుంచి వేరే ద్వారం గుండా బయటకు వెళ్ళే దారి కనబడుతుంది. ఆ దారిలో పసుపు కుంకుమలు, అమ్మవారి ఫోటోలు, పూసల గొలుసులు వంటి సామగ్రి విక్రయించే కొన్ని కోట్లు, టాయిలెట్స్ ఉంటాయి. వెలుపలికి వచ్చిన తరువాత రోడ్డుకు ఇంకో వైపు ‘పద్మావతి నందనవనం’ అనే పూలతోట ఉన్నది, ఇందులో వివిధ రకాల పూల మొక్కలను మనం చూడవచ్చు. కొంచం ముందుకొస్తే పద్మ సరోవరం , ఇది స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి హస్తాలతో వెలసిన విశేషమైన కొలను. ఇందులోకి ఒక చిన్న గేట్ నుండి దిగి ఆ పవిత్ర నీటిని తల పై చల్లుకుని మన దగ్గర ఉన్న సీసాలలో నింపుకుని ఇంటికి తెచ్చుకోవచ్చు. మేము మళ్ళీ మా వాహనాలలో కూర్చుని గోవిందరాజ స్వామి కోవెలకు బయలుదేరినాము.

గోవిందరాజస్వామి కోవెల సందర్శనం:

ఈ కోవెల ప్రాంగణం విస్తీర్ణంలో బహు విశాలమైనది. ఇంచుమించు చాలా దూరం వరకు ఈ కోవెల ప్రాంగణంలో తటాకము చుట్టూ పూటకూళ్ళ ఇళ్ళు, కిరాణా దుకాణాలు మరియు ఇతర వాణిజ్య కార్యాలయాలు వెలిసినాయి. మేము చూసినప్పుడు తటాకములో నీళ్ళు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కోవెల ప్రాంగణం చుట్టూ మా నాన్నగారి చిన్నప్పుడు అగ్రహారం ఉండేదట. వారు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఆ శ్రీవైష్ణవ ఆగ్రహం లోని కన్నమ్మ గారి ఇంట్లోనే సాపాట్లు, బస. మా కారు ఆ వీధిలోకి రాగానే మా నాన్నగారు గుర్తుచేసుకున్న విషయమిది. ఇప్పుడు అగ్రహారం నుంచి చాలా వరకు అయ్యగార్ల కుటుంబాలు మద్రాసుకు వలస వెళ్లినట్టు సమాచారం, పైగా ఈ అగ్రహారం వీధి అంతా వాహనాల రణగొణ ధ్వనులతో, ఒకపక్క బజ్జీ కొట్లు, టీ కొట్లలో వచ్చీపోయే జనాలతో కిక్కిరిసిపోయింది. లోనికి వెళ్లగానే ఎడమ వైపున ఒక చిన్న రంగనాథస్వామి సన్నిధి ఉన్నది, ఇక్కడ దర్శనం చేసుకుని కోవెల ఎత్తైన రాజగోపుర మహాద్వారం ద్వారా గర్భగుడి వైపు నడవ సాగినాము. గర్భగుడిలో గోవిందరాజస్వామి విశాల నేత్రాలతో, నల్లగా నిగనిగలాడుతూ, పుష్పాలంకృతుడై, ఉభయ నాంచారుల సమేతుడై, కమలనాభముయందు చతుర్ముఖ బ్రహ్మతో దర్శనమిస్తాడు. పక్కనే పార్థసారథి స్వామి సన్నిధిలో పెద్ద పెద్ద ఊర్ధ్వపుండ్రాలతో గాంభీర్య వదనుడై తొడపై ఆండాళ్ అమ్మవారిని కూర్చోబెట్టుకుని హుందాగా దర్శనమిస్తాడు. ఈ రెండు సన్నిధుల నుంచి బయటకు వెళ్ళేదారిలో శ్రీభాష్యకారుల సన్నిధి (రామానుజులు), ఆళ్వార్ల పూర్వాచార్యుల సన్నిధులు, గోవిందరాజ స్వామి భార్య పుండరీకవల్లి తయారు సన్నిధులు ఉంటాయి. మేము శ్రీభాష్యకారుల సన్నిధిలో ఉన్నప్పుడు సుందరవిగ్రహుడైన రామానుజులు కొంత సేపు దర్శించుకుని, అర్చకస్వామి అర్చన చేస్తున్న సమయంలో సరిగ్గా కరెంట్ పోయింది. అది చీకటి పడుతున్న వేళ కనుక రామానుజుల సన్నిధిలో వెలుగుతున్న దీపాల కాంతి తప్ప వేరేమీ కనపడలేదు. అదే తరుణంలో ఉభయ జీయర్ స్వాములు గోవిందరాజస్వామి గర్భగుడి వైపు వెళుతూ ఇక్కడికి చేరుకున్నారు. వారికి జగదాచార్యులైన రామానుజుని దర్శనమైతే మాకు ఇటు రామానుజులు అటు జీయర్ స్వాముల దర్శన భాగ్యమూ కలిగింది. మదిలో ఒక్కసారి ఆచార్య తిరువడిగళే శరణం అనుకుని, ఆహా! ఈ రోజు ఏమి మా భాగ్యము అనుకున్నాను. గోవిందరాజ స్వామిని చేసినదానికంటే రామానుజులు సేవిస్తున్నప్పుడు తిరుమల జీయర్ స్వాములను చూచుటలో నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇతర సన్నిధులు దర్శనార్థం బయటకు వచ్చినప్పుడు గోవిందరాజస్వామి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా తీసుకొచ్చినారు. ఈ సందర్భంగా అక్కడున్న పురుష భక్తులకు స్వామివారి పల్లకిని మోసే అవకాశం ఇచ్చినారు. అనుకోకుండా ఆ భాగ్యం మా వారికి, మా నాన్నగారికీ దక్కింది. ఇక అటునుంచి ఆళ్వార్ల సన్నిధి, మనవాళ మామునుల సన్నిధి, పుండరీకవల్లి తయారు సన్నిధి దర్శించుకుని లోపలికి వచ్చిన దారిలోనే వెలుపలికి వచ్చినాము.

శ్రీనివాస మంగాపురం:

గోవిందరాజస్వామి కోవెల నుండి నేరుగా శ్రీనివాసమంగాపురం చేరుకున్నాము. ఇక్కడ కళ్యాణ వేంకటేశుడు పట్టు పీతాంబరాలు ధరించి, ఆభరణాలు పూమాలలతో ముగ్ధమనోహరంగా మెరిసిపోతూ కొలువైయున్నాడు. బయటకు రాగానే విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఒక వైపు అర్చకులు ప్రసాదాలు పంచుతున్నారు. వేడి వేడి కట్టె పొంగలితో ఆ పూట మా కడుపు నిండిపోయింది. ప్రదక్షిణ మార్గంలో కోవెల రామానుజకూటం (పెరుమాళ్ళకు నివేదించే ఆహారము వండే వంటశాల) ఉన్నది. మేము ప్రదక్షిణ చేస్తుంటే ఒక అయ్యగారు మమ్మల్ని పిలిచి రండి ప్రసాదం ఇస్తాను అని అంటే మేము తీసుకున్నామని చెప్పినాము. పర్వాలేదు, మీకు అదనంగా ఇస్తాను, స్వీకరించనున్నారు. మమ్మల్ని ఒక్క నిమిషం అక్కడే ఉండమని లోనికి వెళ్ళి ఒక సంచిలో రెండు పెద్ద దొప్పల నిండ కట్టె పొంగలి తీసుకొచ్చి మా చేతిలో పెట్టినాడు. ఆహా! అనుకోకుండా దొరికిన మహాప్రసాదం నిజంగా భగవంతుడి అనుగ్రహమే. ఇక ప్రదక్షిణ మార్గంలో దూరంగా చంద్రగిరి కోటను చూడొచ్చు కానీ అప్పటికే చీకటి పడిపోవడంతో అసలు కనబడలేదు. ఆలయ వెనుక భాగంలో తులసి మరియు రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. ముందు వైపున ఒక ఆవు చెట్టుకు కట్టేసి ఉన్నది. దాని పక్కనే ఇస్కాన్ వారు చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుని వారి పుస్తకాలను విక్రయిస్తున్నారు. ఇక కోవెల మూసివేసే సమయం, మేమంతా అలసిపోయి ఉన్నాము కాబట్టి ఇక నేరుగా ఎల్.ఐ.సి కాలనీ లోని మా వసతి గృహానికి బయల్దేరి అక్కడ బస చేసినాము. అత్యంత సౌకర్యంగా మాకు తిరుపతిలో వసతిని కల్పించిన డా. చీమలమర్రి చంద్రశేఖర్ గారికి, మేము అక్కడికి చేరుకోగానే యే మాత్రం కష్టం కలుగకుండా చూసుకున్న రవి గారికి శతానేక కృతజ్ఞతలు తెలిపినా తక్కువే.

తిరుపతి నుండి తిరుమల ప్రయాణం:

మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 11వ తేదీన రాత్రి 8 గంటలకు దర్శనం స్లాట్ దొరికింది. మా వారికి ఏడుకొండలు ఎక్కి తిరుమల చేరుకోవాలని మొక్కు ఉండటంతో ఆ రోజు ఉదయం 6.30 కి అలిపిరి నుంచి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో మా నాన్న కూడా కొండెక్కడానికి సిద్ధమైనారు. వసతి గృహం నుంచి నిరాహారంగా కార్లో అలిపిరి వరకు బయల్దేరినారు. మిగిలిన వారిమంతా మా వసతిగృహం లోనే అల్పాహారాలు తిని ఉదయం 9 గంటలకు బయల్దేరినాము. ప్రకృతి జంతు ప్రేమికులైన మామా అల్లుళ్ళు కాలినడకన నెమ్మదిగా ఎక్కుతూ వుంటే మేము మోటారు వాహనంలో లగేజ్ లను పైకి ఎక్కించి రహదారి మార్గంలో బయలుదేరినాము. ఏడుకొండలు ఎక్కే ముందు బందోబస్తుగా సెక్యూరిటీ చెకింగ్‌ను పూర్తి చేసుకున్నాము. సప్తగిరులు ఎక్కుతూ గోవింద నామస్మరణలో, శేషాచల అడవుల ప్రకృతి రమణీయతను, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ముందుకుసాగినాము. ఉదయం 11.30 గంటల వరకు తిరుమల చేరుకోగానే మా బస అహోబిల మఠంకు చేరుకున్నాము. మా విశ్రాంతి గదులలో సామాను పెట్టుకుని వెంటనే తదీయారాధనకు కూర్చుని సాపాట్లను పూర్తిచేసుకున్నాము. ఈలోగా మా నాన్న మావారు కూడా దారిలో ఆంజనేయస్వామి గుడి మరియు ఇతర ప్రదేశాలను దర్శిస్తూ కొండముచ్చులు, జింకలతో గడుపుతూ వాటికి పల్లీలు తినిపిస్తూ ఫొటో దిగుతూ ఒంటిగంటకి అహోబిల మఠానికి చేరుకున్నారు. రాగానే తదీయారాధనను సేవించి గదులలో కాసేపు విశ్రమించినారు. అహోబిల మఠంలో బ్రాహ్మణులకు ఉదయం 10 నుంచి 1 వరకు మరియు రాత్రి 7 నుంచి 8 గంటలవరకు తదీయారాధనకు అనుమతిస్తారు. మాది 8 గంటల దర్శనం కనుక సాయంత్రం భువరాహ స్వామిని దర్శించుకుని 6 గంటల వరకు ATC సర్కిల్ కి చేరుకున్నాము.

శ్రీవారి దర్శనానికి మెట్లదారిలో రచయిత భర్త తండ్రి గార్లు

మెట్ల మార్గంలో తారసపడ్డ జింకలు, కొండముచ్చులు

ATC సర్కిల్‌కి చేరుకోగానే మా అత్తమామలు వారి దర్శనం టికెట్లను ఇంట్లోనే మరిచిపోయి వచ్చినారు. అప్పటికప్పుడు మా డ్రైవర్ కొంతే దూరంలో ప్రింట్ ఔట్లు తీసుకునే దుకాణం ఉన్నది, అక్కడికి వెళ్ళమంటే మా అత్త మా వారు వెళ్ళి తీసుకుని వచ్చేసరికి అరగంట ఆలస్యం అయింది. మొత్తానికి 7 గంటలకు క్యూ లైన్ లోకి వెళ్ళినాము. ఇక్కడ వాలంటీర్లు మన ఆధార్ కార్డులు, టిక్కెట్లు పరిశీలించి లోపలికి పంపుతారు. ఇక నడుచుకుంటూ వెళ్ళే దారిలో మొత్తం మూడు సార్లు ఈ పరిశీలన జరుగుతుంది. మన దగ్గర సెల్ ఫోన్లు ఉంటే అవి భద్రపరుచుకోవడానికి క్యూలైన్ లోనే ఒక కాంటర్ ఏర్పాటు చేసినారు. మరి కొంత దూరం నడిచినాక మమ్ములను ఒక గంట సేపు ఆపివేసినారు. అక్కడ అరుగులపై కూర్చుని మా పాపతో ఆటవిడుపు. క్యూలైన్ కదలడం మొదలైన తరువాత మెల్లిగా వైకుంఠం క్యూ కాంప్లేక్స్ 18 లో మమ్మల్ని ఒక గంట పాటు కూర్చోబెట్టినారు. అక్కడ టిటిడి శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చూపుతున్న టీవీ, బయట టాయిలెట్స్, బాలింతలకు పాలిచ్చే గది, అత్యవసర పరిస్థితులలో టిటిడి కంట్రోల్ రూమ్, ఫైర్ స్టేషన్, మెడికల్ రిక్వైర్మెంట్ ల ఫోన్ నంబర్ల పట్టిక ఉన్నది. వీటిని వినియోగించుకోవడానికి ఒక ల్యాండ్లైన్ ఫోను ఏర్పాటు చేసినారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్నప్పుడే మాకు వేడిగా ఉప్మాను దొప్పల్లో అందించారు. అప్పటికి సుమారు రాత్రి 9 గంటలు అయ్యింది. ఈ ఉప్మానే మాకు రాత్రి సాపాటు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గేటు తెరిచిన తరువాత మెటల్ డిటెక్టర్ తోపాటు ఆధార్ కార్డులు టిక్కెట్లు పరిశీలించినారు. ఇదే చివరి పరిశీలన. గోవిందా అంటూ అందరూ ముందుకు కదిలినారు. ఈ తరుణంలో పక్కన గ్రిల్ గేటు నుండి బయటకు చూస్తే అందమైన గోపాలకృష్ణుని విగ్రహం, వేణువు చేతబట్టి చుట్టూరా ఆలమందల ఉండి, రంగురంగుల కాంతులతో జలధార (fountain) కనువిందు చేసింది. అటుపై చల్లని చిరుగాలి వీచింది. ఆనందానిలయానికి దెగ్గరగా వెళుతున్నాం అనే సంతోషం తో అందరం ముందుకు సాగినాము. కొంత దూరం నడిచినాక శీఘ్ర దర్శనం వారినీ, ధర్మ దర్శనం వారినీ ఆ చోట కలుపుతున్నారని అర్థమైంది. ఏమైతేనేమి చివరకు సంపంగి ప్రాకారం కనిపించింది. సంపంగి ప్రాకారం నుండి వెండివాకిలికి కదిలినాము, అక్కడ అనంతాళ్వార్ల గడ్డపారను చూసినాము. అటు నుంచి బంగారు వాకిలిలో ధ్వజస్తంభము, రాతి గోడలపై హాథీ రామ్ బాబాతో శ్రీనివాసుడు పాచికలాడే దృశ్యం తదితర దృశ్యాలు చూసుకుంటూ ముందుకు కదిలినాము. గోవింద నామస్మరణ తప్ప ఏమీ వినబడలేదు. గర్భగుడిలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు చిద్విలాసంతో తిరుమేని శిరసాది పాదాల వరకు పూల మాలలతో (పూలంగి సేవ) ఇతర ఆభరణాలు లేకుండా సన్నటి తిరునామముతో శోభాయమానంగా కొలువైయున్నాడు. ఆ రోజు గురువారం కనుక పెరుమాళ్ళు నిజరూపంతో భక్తులకు దర్శనం ఇస్తాడు. దర్శనం అయ్యి బయటకు వచ్చిన తరువాత వైకుంఠ ద్వారం వద్ద సాష్టాంగ నమస్కారం చేసుకుని, బంగారు బావి పక్కన ఉన్న మెట్లెక్కి పైకి వెళ్ళి తీర్థం తీసుకుని అక్కడ ఒక స్తంభమును ఆనుకుని కూర్చున్నాము. లేచి బంగారు గోపురంపై విశేషమైన విమాన వేంకటేశ్వరుని దర్శనం కోసం దారిలో ఉన్న సబేరాను ముందు నుంచి వేరే పక్కకు నడుస్తూ ఉన్నాము. ఇక్కడ రద్దీ విపరీతంగా పెరిగింది. అటు నుంచి శ్రీభాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి సన్నిధులు ఉన్నాయి. అప్పటికే రాత్రి 11 గంటలు కావస్తుండడంతో కొన్ని సన్నిధులు మూసివేసినారు. యోగ నరసింహస్వామి సన్నిధి గుండా మెట్లు దిగితే అన్నమయ్య భాండాగారం కనిపిస్తుంది. ఇక్కడ చాలా సేపు మమ్మల్ని ఆపి వేసినారు. ఇక ఈ రద్దీలో అందరం శ్రీవారి హుండీ దెగ్గరకు వెళ్ళలేక మా అమ్మ మా వారు మాత్రం వెళ్ళి స్వామివారికి ముట్టచెప్పవలసిన కొంత సొమ్ముని అందులో వేసి వచ్చినారు. మేము బయటకు వచ్చిన తరువాత అరుగుపైనున్న చిన్న గడ్డపై విశ్రమించినాము. తరువాత మెల్లిగా PAC IV కౌంటర్ వద్దకు భద్రపరిచిన సెల్ఫోను తీసుకోడానికి నడవ సాగినాము, దారిలో ఒక్కొక్కరికి ఒక్కొక చిన్న లడ్డు ప్రసాదాన్ని ఇచ్చినారు. ఇక్కడ దారిలో బేడీ ఆంజనేయస్వామి వారి దర్శనం అనూహ్యం జరిగింది. అటు నుంచి మాడవీధి గేటు నుండి బయటి వచ్చి మా డ్రైవర్‌కి ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని అహోబిల మఠంలో దింపినాడు. ఇప్పుడు సమయం 12.30 am. అప్పటికే అలసిపోయి ఉన్న మా అందరికీ మంచి నిద్ర పట్టింది. సాధారణంగా కొండపైన తెల్లవారు ఝామున 3 – 3:30 a.m. సమయంలో శ్రీనివాసుని మేల్కొలుపు కు అర్చక స్వాములు పాడే వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తుంది.

అనంతాళ్వార్ తోట మరియు ఇతర ప్రదేశాలను సందర్శించుట:

నిన్నటి రోజు లడ్డూ కౌంటర్లకు పోయి లడ్డూలు తీసుకోవడం కుదరకపోవడంతో ఈ రోజు అంటే సెప్టెంబర్ 12వ తేదీన పొద్దున్న కౌంటర్ వద్దకు వెళ్ళి మా టికెట్స్ పైన ఇచ్చే ఉచిత లడ్డూలు తీసుకున్నాము. అదనంగా ఎన్ని కావాలంటే అన్ని ఒక్కదానికి 50 రూపాయల చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చు. దర్శనం సమయం నుండి 24 గంటల వ్యవధిలో ఈ ఉచిత లడ్డూలు తీసుకోవచ్చు. లడ్డూలు తీసుకుని అందరం అనంతాళ్వార్ల తోట (పురిశై వారి తోట)ను సందర్శించినాము. నిత్యం తమ స్వహస్తాలతో వేంకటేశునికి పుష్పాలంకరణ చేసి, చుబుకానికి చందన పచ్చకర్పూర మిశ్రమాన్ని అద్దే అనంతాళ్వార్ల 26వ తరం శ్రీమాన్ తిరుమలై అనందాన్పిళ్ళై పురిశై రంగాచార్యుల వారి ఆశీర్వాదం తీసుకొని, వారి తిరుమాళిగలో (అనంతాళ్వార్ తోట – southwest మాడవీధి) కాసేపు గడిపి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, ఆ తోటలో వేంకటేశుని కైంకర్యానికి పెంచే పూల మొక్కలను, తులసి బృందావనం, అనంతాళ్వార్లు కట్టించిన పుష్ప మండపం, రామానుజ పుష్కరిణినీ దర్శించుకున్నాము. అనంతాళ్వార్లు మండపం లో కూర్చుని పెరుమాళ్ళకు ఎక్కడైతే పూలమాలలు అల్లేవాడో అక్కడే నేనూ కూర్చుని అన్నమయ్య కీర్తనను ఆలపించినాను. అక్కడ అనంతాళ్వార్ల బృందావనం పక్కన అనంతాళ్వార్ల జీవిత విశేషాలను చక్కటి చిత్ర ప్రదర్శనా నిర్మాణాన్ని ఏర్పాటు చేసినారు.

అనంతాళ్వార్ 26వ తరం తిరుమలై అనందాన్పిళ్ళై పురిశై రంగాచార్యుల వారి దంపతులతో రచయిత మరియు కుటుంబీకులు

అనంతాళ్వార్ల పుష్ప మండపంలో అన్నమయ్య కీర్తనాలాపన

దాని తరువాత శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి కారులో బయల్దేరినాము. ఇక్కడికి చేరుకోగానే ఎత్తైన రహదారిలో పళ్ళ కొట్లు, బట్టల కొట్లు, పిల్లల ఆటసామాగ్రి కోట్లు ఉన్నాయి. అక్కడ కారు నిలుపుకుని కొంత దూరం నడవగానే ఒక పావుగంట మెట్లెక్కి శ్రీవారి పాదాలను దర్శించుకున్నాము. మెట్ల మార్గంలో తులసి దళాలను కొనుక్కుని అద్దంతో కప్పబడి ఉన్న శ్రీవారి పాదాలపై పెట్టే అవకాశం ఉంటుంది. ఎత్తైన ఈ ప్రదేశం నుండి కిందకు దిగుతుండగా ఒక చెట్టు పై బిస్కెట్ తినుకుంటూ ది గ్రేట్ ఇండియన్ జైంట్ స్క్విరెల్ (పెద్ద అడవి ఉడత) తారసపడింది. దాని ఆకారం , పొడవాటి తోక చూపరులను ఆకట్టుకుంది. వెంటనే జంతుశాస్త్రం తెలిసిన జంతు ప్రేమికుడైన మా నాన్న దాని దెగ్గరకు వెళ్ళి దాని వీపుపై నిమిరి అరటిపండును తినిపించినాడు. అది ఇష్టంగా తింటుంటే చాలా ముచ్చటపడ్డాము.

శ్రీవారి పాదాల వద్ద తారసపడ్డ ది గ్రేట్ ఇండియన్ జైంట్ స్క్విరెల్

శ్రీవారి పాదాల దర్శనానంతరం శిలాతోరణానికి బయల్దేరినాము. ఒకప్పటి కంటే ఇప్పుడు శిలాతోరణం, చుట్టుపక్కల పరిసరాలను ప్రాకృతిక సౌందర్యాలు ఉట్టిపడేలా బహు రమణీయంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దినారు. సహజంగా ఏర్పడ్డ శిలా రూపం ఒకెత్తయితే ఎదురుగా వీక్షకులకు మనోహరంగా కనబడే రంగురంగుల దశావతారాల, నాట్య గణపతుల రాతి శిల్పాలు ఇంకోయెత్తు. భూగర్భ శాస్త్రం ప్రకారం సహజంగా సంభవించే కొన్ని రకాల శిలలను ప్రదర్శనలో ఉంచినారు. మరికొంత ముందుకు నడిస్తే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ సేదతీరడానికి అందమైన ఉద్యానవనం, అక్కడి రంగురంగుల పూల చెట్లు మనోల్లాస పరుస్తాయి. పెద్ద పెద్ద పంజరాల్ని నిర్మించి కోళ్ళు, నెమళ్ళు, చిలుకలు, పావురాలు, పిట్టలు వంటి బహుళ జాతి పక్షులను సంరక్షిస్తూ సందర్శన లో భాగం చేయడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

శిలాతోరణం వద్ద రచయిత మరియు కుటుంబీకుల సందర్శన

ఈ ప్రదేశాలను సందర్శించి సాపాట్లు చేసి మా వసతి గృహానికి బయల్దేరి వెళ్ళేసరికి 3.30 pm కావస్తుండడంతో, అదే రోజు 7:15 pm కి మాకు రిటర్న్ ఫ్లైట్ బుక్ అవ్వడంతో, 4 pm గంటలకు గట్టు రహదారి మార్గంలో ఏడుకొండలు దిగి 6 pm వరకు తిరుపతి విమానాశ్రయంలో ఉన్నాము. శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో పదిలపరచుకొని ఎన్నెన్నో విలువైన జ్ఞాపకాలు మూటగట్టుకుని హైదరాబాదుకు మా తిరుగు ప్రయాణం.

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇతర దర్శనా విధానాలు:

శీఘ్ర దర్శనమే కాక శ్రీవాణి దర్శనం, ఆర్జిత సేవల (ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ) ద్వారా శ్రీవారి దర్శనం పొందవచ్చు. దివ్యాంగులకు మరియు సీనియర్ సిటిజన్స్ (65 ఏళ్ళు వయసు దాటిన వారికి) ప్రత్యేక దర్శన సౌకర్యం చేస్తున్నారు. అలాగే ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలు గల తల్లిదండ్రులకు సుపథం ద్వారా ప్రత్యేక దర్శనం కలుస్తున్నారు. వీరు చంటిబిడ్డకి సంబంధించి బర్త్ సర్టిఫికెట్‌ను నిర్ధారణ కొరుకు చూపించవలసి ఉంటుంది. ఇవే గాక, అంగప్రదక్షిణ సేవను వినియోగించుకుని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఐతే శ్రీవాణి దర్శనం అతి శీఘ్రంగా సౌకర్యంగా ఉంటుంది కానీ కనీసం ఒకరికి 10,500/- చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు శ్రీవాణి దర్శన టిక్కెట్లు ఉదయం తిరుపతి విమానాశ్రయంలో కొనుగోలు చేసుకోవాలి తప్ప మిగతా సేవలన్నీ టీటీడీ యాప్‌లో అకామెడేషన్‌తో సహా బుక్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడానికి కళ్యాణ కట్ట వద్ద సౌకర్యాలు కల్పించినారు, అట్లాగే చెవులు కుట్టడానికి పురోహిత సంఘం అనే పెద్ద హాలులో ఔసలివాళ్ళ సహాయం తీసుకోవచ్చు (కమ్మలు ఎవరికి వారే తెచ్చుకోవాలి). శీఘ్ర దర్శనానికి పన్నెండేళ్ళ లోపు పిల్లలకు ఉచిత దర్శనం ఉంటుంది కానీ పిల్లల ఒరిజినల్ ఆధార్ కార్డులు చూపించవలసి ఉంటుంది. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో నిత్యం అన్నప్రసాదం లభ్యమవుతుంది. డైరీలు కాలెండర్లు మరియునితర టిటిడి పబ్లికేషన్స్ పుస్తకాలను, పంచగవ్య సామగ్రిని టిటిడి స్టాల్ లో విక్రయిస్తారు. అసలైన ముత్యాలు, పగడాలు, కెంపులు వంటి రాళ్ళు, లేపాక్షి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, నిర్మల్ బొమ్మలు లేపాక్షి స్టోర్ లో కొనుక్కోవచ్చు. అత్యంత విలువైన వస్తువులను ప్రదర్శనలో పెట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం మాత్రం ఇప్పుడు ఇంకా పునరుద్ధరణలో ఉంది కాబట్టి దర్శింకోలేము. ఇది తప్ప ఆకాశ గంగా, పాప నాశనం , జపాలి ఆంజనేయస్వామి గుడి వంటి ప్రదేశాలు సందర్శించవచ్చు. భక్తుల సౌకర్యార్థం వెంకటాద్రి నిలయం అనే కొత్త వసతి గృహాన్ని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం హర్షణీయాంశం. ఎప్పటికప్పుడు మారుతున్న పద్ధతులకు సంబంధించి సమాచారాన్ని టిటిడి ఆప్ లో లేదా టీటీడీ వెబ్సైట్ లో పొందుపరుస్తున్నారు.

పూర్వాచార్యులైన శ్రీ వేదాంత దేశికుల వారు తిరుమల కొండ గురించి విరచించిన తమిళ పాశురానికి నా తెలుగు అనువాదం.,

శ్రీకృష్ణు పాదపద్మముల చూపునీ కొండ
కాంచ జీవుల కర్మ ప్రక్షాళించు కొండ
సాక్షాత్తు తిరువైకుంఠము గద ఈ కొండ
సహజ శ్రేష్ఠ తీర్థమ్ముల కేంద్రమైన కొండ
దుర్గుణులను సద్గుణులుగ మార్గమ్ముల మార్చు కొండ
స్వప్రకాశము మెరయు మంచి బంగరు కొండ
దేవతలు మానవులు ఇష్టపడునీ కొండ
వేదముల కొనియాడబడిన వేంకడి కొండ

~

ఇటువంటి కొండ మన తెలుగు దేశములో ఉండుట తెలుగువారి సుకృతం. కనుక మనందరం ‘గోవిందుని ఆశ్రయిద్దాం..!’

ఏడుకొండల వాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవింద!!!

స్వస్తి!

Exit mobile version