Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గోరంత దీపాలు

హైదరాబాద్ టూ చెన్నై… ఫ్లైట్ రన్ వే మీది నుండి పైకెగిరే ముందు అంత వరకు ఫోన్‌లో మాట్లాడుతున్న విశాలి ప్రక్క సీట్లో ఉన్నతడితో ‘ప్లీజ్ మీ సీటు మా ఫ్రెండుకిచ్చి తన సీట్లోకి మీరు మారుతారా? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌మి… ప్రక్క ప్రక్క సీట్లయితే ఇద్దరం కబుర్లు చెప్పకోవచ్చ’ని అడిగింది చక్కని ఇంగ్లీష్‌లో.

“ఎక్కడుంది మీ ఫ్రెండు?” తల వెనక్కి త్రిప్పి మూడు వరుసల వెనుక కూర్చున్న అమ్మయిని చూపింది విశాలి. పోత పోసిన విగ్రహంలా బాగా నలుపు. సినిమాల్లో బఫూన్‌కి సరిపోయే లావు!

అతడు తల త్రిప్పుకొని ఏమనకుండా కూర్చున్నాడు.

“ప్లీజ్!  వెనక్కివెళ్ళరా?” మరింత అర్థింపుగా అడిగింది.

“ఫ్లైట్ జర్నీలో సాధారణంగా నాకు విండో సీటు రావడం అరుదు! అయినా అడిగింది మీ కోసమైతే  ఇచ్చేవాడిని… అందమైన అమ్మాయి అటు ప్రక్కనున్నా, ఇటు ప్రక్కనున్నా సుమవనంలో ఉన్నట్టు హాయిగా ఉంటుంది కాబట్టి. ఆ అమ్మాయి…. ఉహు ఖచ్చితంగా అనీజినెస్ ఫీలవుతాను. ఏమనుకోకండి! నాక్కొంచం ఫ్రాంక్‌గా మాట్లాడడం అలవాటు” నిర్మొహమాటంగా చెప్పి బాగ్‌లోంచి జర్నలేదో తీసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు.

ఎవరికైనా అడిగి లేదనిపించుకోవడం అవమానం కదా? “సారీ, పల్లవీ! సీటు మారడానికి అతడొప్పుకోలేదు. ఒఠ్ఠి జిడ్డుగాడున్నట్లున్నాడు!”

ఫోన్‌లో ఎంత చిన్నగా అన్నా అతడి చెవిలో పడింది. “హలో… మిస్! నా సీటు నా ఇష్టం! ఇష్టమైతే ఇస్తాను లేకుంటే లేదు. దానికి నన్ను తిడతారా? మీరెవరు నన్ను తిట్టడానికి?” కొంచెం సీరియస్‌గా అన్నాడు.

విశాలి ఆశ్చర్యంగా ముఖం పెట్టి  “మిమ్మల్ని తిట్టానా నేను?” అనడిగింది.

“జిడ్డుగాడు అన్నారు కదా. తిట్టు కాదా అది?”

“సారీ! మీ పేరు తెలియక…. పేరు తెలియకపోతే సాధారణంగా ఎక్స్ అంటుంటాం కదా! లెక్కల్లో ఉపయోగిస్తాం ఎక్స్ అన్న పదం. ఎక్స్ బదులు ఆ పదం ఉపయోగించాను కాస్త కొత్తదనంగా ఉంటుందని. మీ పేరు తెలిస్తే అదే చెప్పేదాన్ని. దానికేం భాగ్యం  తెలిస్తే చెప్పడానికి!” గడుసుగా అంది విశాలి.

“తెలియకపోతే తెలుసుకోవాలి! నా పేరు అనురాగ్! మీ పేరు? మీ పేరు తెలియకపోతే నేను జిడ్డుమొహంది అనాల్సి వస్తుంది!”

“విశాలి!”

“స్వీట్!  మీ రూపమే కాదు పేరు కూడా అందంగా ఉంది. ఏమీ అనుకోకండి. నాక్కొంచెం మనసులో ఉన్నది మాట్లాడం అలవాటు.”

“అలవాటుందని ముక్కు మొహం తెలియని అమ్మాయిని ముఖం పట్టుకుని పొగిడేస్తారా? అందంగా ఉన్నావు… అదీ ఇదీ అని!” ముందే అతడు సీటివ్వలేదని కోపంగా ఉంది విశాలికి.

“మిమ్మల్ని చూడగానే నా మనసులో కలిగిన భావం అది! అందంగా ఉన్నారనిపించింది. అందంగా వున్నావని పొగిడితే ఆడపిల్లలు సంతోషపడతారని ఎక్కడో విన్నాను. మీకు నచ్చలేదు కాబట్టి నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. మీరు అందంగా లేరు. మీ పేరు కూడా అందంగా లేదు. సరేనా?” సంభాషణ అంతటితో కట్ చేస్తున్నట్లుగా ముఖం తిప్పుకొని విండోలోంచి బయటికి చూడసాగాడు. పెద్ద పెద్ద దూది ఉండల్ని పరిచినట్టుగా వున్న తెల్లని మేఘాలను ఎంత సేపని చూస్తాడు! విసుగొచ్చి బాగ్‌లోంచి లాప్‌టాప్  తీసుకుని ముందు పెట్టుకున్నాడు.

ఉన్నట్టుండి ఏదో అనీజినెస్, గగుర్పొడిచిన ఫీలింగ్. బాగా బలిసిన జంతువేదో బలంగా, బరువుగా ఆనుకున్నట్టుగా… ప్రక్కకి తిరిగి చూసి, కేక పెట్టబోయి నిగ్రహించుకున్నాడు. సభ్యత ఆపింది “నువ్విక్కడ?” విభ్రాంతిగా అడిగాడు.

“విశాలి నా సీట్లోకి వెళ్ళింది. అక్కడింకా ముగ్గురున్నారు మా ఫ్రెండ్స్… కబుర్లు చెప్పుకోవచ్చని!” ఆమె పెదవుల మీద కొంటె నవ్వు మెదిలినట్టనిపించింది, కుదిరిందా తిక్క? అన్నట్టుగా.

అనురాగ్ వెనుదిరిగి  చూశాడు. విశాలి, విశాలితో కూర్చున్న వాళ్లు తన వైపే చూస్తూ నవ్వుతున్నారు. తన మీదే ఏదో జోక్ వేసి నవ్వుతున్నారనిపించింది.

విశాలి కచ్చ తీర్చుకున్నట్టుగా అనిపించింది…. ఆమెని తన సీట్లోకి పంపి.

ఆమె తగలకుండా ప్రక్కకి ఒదిగి ఒదిగి కుర్చూన్నా సీటున్నర శరీరాన్ని తప్పించుకోవడం కష్టమనిపించింది.

అతడి అవస్థ చూసి హఠాత్తుగా అందా పిల్ల “ఎందుకని అంత వికారంగా ముఖం పెట్టారు? నల్లటి వాళ్లు మనుషులు కారా? దేవుడిచ్చిన రూపం ఇది. నా చేతిలోది కాదు కదా? చేతిలోనిదే అయితే రంభా, ఊర్వసులకంటే, విశాలకంటే అందంగా పుట్టేదాన్ని. మిమ్మల్ని…. మీ బోటి వాళ్ళని వెంట త్రిప్పుకునేదాన్ని. మీరు లేచి నిలబడి మీ సీటు ఆఫరిచ్చేవారు. అవునా కాదా  నాకూ మీలాగే మనసుకు తోచింది మాట్లాడడం అలవాటు.”

బాబోయ్! చిచ్చరపిడుగనిపించింది. ఆ కంఠం అంత మధురంగా ఉందేమిటి రూపంతో సంబంధం లేకుండా. కోకిలనాలా? నల్ల కలువనాలా? దేవుడు ఆమెకు నలుపురంగిచ్చి ఆ లోటుకు భర్తీగా శ్రావ్యమైన గళం ఇచ్చాడనిపించింది. పద్ధతి అయిన మాట ఆమె సంస్కారాన్ని తెలుపుతోంది.

“ఎందుకలా అంటున్నారు? మీరన్నట్లు ఏం ఫీల్ కాలేదు నేను!”

“చిన్నప్పటి నుండి ఇలాంటి చూపులు చూసీ చూసీ వాటి అంతరార్థం నాకు తెలియదా? బొంత పురుగు చూసినట్టుగా ఆ చూపులు సదరు శాల్తీని గాయపరుస్తాయని తెలియకపోతే ఎలా? ఆ చూపులు ఆమెను గాయపరుస్తాయని, దుఃఖం, బాధ ఉంటాయని తెలియకపోతే ఎలా? మనిషి కాదా మీరు?”

“ఛ! మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు.”

“నాకు మీలాగే మనసులో తోచింది పైకి అనడం అలవాటు. మాటకు మాట చెల్లు. సరేనా? గంట సేపు ప్రయాణానికి కోపతాపాలెందుకు? తరువాత మీరెవరో? మేమెవరమో? మళ్ళీ కలిసే ఛాన్స్ కూడా లేదు. స్నేహితుల్లా విడిపోదాం! ఓకేనా?” చిన్నగా నవ్వింది. ఆ నవ్వు ఎంతో బాగుంది. చక్కని పలువరస చూడగా చూడగా కాళ రాత్రిలోనూ వెలుగు కనిపిస్తుందట.

“మైగాడ్! తనకీ ఆమెకీ మధ్య స్నేహమా? తనో గొప్ప సౌందర్యారాధకుడన్న ఫీలింగ్ ఏం కావాలి?”

***

చెన్నైలో ఉన్న అనురాగ్ మిత్రులు ఊటీ ప్రోగ్రాం పెట్టి చాలా రోజుల నుండి పిలుస్తున్నారు అనురాగ్‌ను. అందరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. ఈ ఫ్లైట్ ప్రయాణం అందుకే. వాళ్ళలో ఒకడు ప్రదీప్. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మాగ్నెట్. ఊటీలో టీ తోటలూ, అక్కడ గెస్ట్‌హౌసులూ ఉన్నాయి. అందరూ ప్రదీప్ వాళ్ళింట్లోనే కలుసుకుని, అక్కడే భోజనాలు ముగించి ఊటీ బయల్దేరారు. రాత్రి వరకు కోటగిరిలో ఉన్న ప్రదీప్ వాళ్ళ గెస్ట్‌హౌస్‌కి చేరుకుని రెస్ట్ తీసుకున్నారు.

ఊపిరాడని జీవితం నుండి బయటపడి గాలిలో తేలిపోతున్న పక్షుల్లా ఉన్నారు. ఎడతెగని కబుర్లు నవ్వులు.

మరుసటి ఉదయం తలా ఓ బైనాక్యులర్ మెడలో వేసుకుని కొండల మీదికి బయల్దేరారు. కొద్దిగా మంచు పడుతూ పొగమంచుకమ్మిన కొండల రూపం నుండి మేలి ముసుగులో ఉన్న సుందరీమణుల్లా ఉన్నాయి.

టీ తోటలు చూచుకోడానికి వున్న పని వాళ్ళ షెడ్లు ఒకటి రెండు తప్ప అక్కడ జనసంచారం కూడా లేదు. పక్షుల రకరకాల ధ్వనులు తప్ప అంతటా పరుచుకున్న నీరవ నిశ్శబ్దం. రోజూ ఇల్లు, ఆఫీసు పనులతో ఉక్కిరి బిక్కరిగా గడిపే వాళ్ళకి ఒక స్వర్గానికి వచ్చినట్టుగా ఉంది. తిరిగి తిరిగి గెస్ట్‌హౌస్‌కి వచ్చి స్నానాలు చేశారు. గెస్ట్‌హౌస్‌లో కిచెన్ సౌకర్యం కూడా ఉంది. బ్రేక్‌ఫాస్ట్‌కి ఎవరికి కావలసినవి వాళ్ళు చెప్పి చేయించుకుని సుష్టుగా తిని సైట్ సీయింగ్‌కి బయల్దేరారు. సెల్ ఫోన్‌లో అక్కడి ప్రకృతి దృశ్యాలే కాదు తమ ఫోటోలూ తీసుకున్నారు.

రెండు రోజులు చూడాల్సినవన్నీ చూసి మూడో రోజు ఊటీలో బొటానికల్ గార్డెన్‌కి వెళ్ళారు.

పుష్ప సౌందర్యమంతా అక్కడే ప్రోగుపడట్టుగా ఉంది. రకరకాల పూలునూ, చల్లని గాలినీ ఆస్వాదిస్తూ నడుస్తున్న వాళ్ళకి వీనుల విందుగా ఒక కమ్మని స్వరం వినిపించింది.  “నిదురించే తోటలోకి పాట  ఒకట వచ్చిందీ…” అని మైమరుపుతో దిక్కులు చూశారు మిత్రబృందం.

అనురాగ్‌కి మాత్రం ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపించింది.

సమీపంలోనే చెట్టు క్రింద  పచ్చికలో సీతాకోక చిలుకలు వాలినట్టుగా అమ్మాయిల గుంపు కనిపించింది.

అక్కడి నుండే ఆ పాట వస్తుందని కనిపెట్టేశారు. వీళ్ళలో చేతన్ అనే యువకుడు పాటల పిచ్చోడు… మంచి గాయకుడు కూడా. “వాఁ ఏం కంఠంరా! చాలా బాగా పాడుతోంది. తేనెలు జాలు వారుతున్నట్టుగా ఉంది. వెళ్ళి పరిచయం చేసుకుందామా?”

“ఛ! ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరి ఎలా వెడతాం?” సుధీర్ అన్న యువకుడు అన్నాడు.

ఇంతలో ఆ గుంపులో  పాడుతున్న శాల్తీ దిగ్గున లేచి “ఓ! అనురాగ్!” అంటూ సంబరంగా ఇటు రావడం చూసి స్నేహితులు బనాయించడం మొదలు పెట్టారు. “మన అనూకి గర్ల్ ఫ్రెండు లెదన్న వెలితి ఇన్నాళ్ళకి తీరిపోయిందన్న మాట!” అన్నాడొక మిత్రుడు, “చెప్ప లేదేం రా మాకు?”

“అబ్బ! ఏం సెలెక్షన్‌రా! నల్ల కలువ అందామా? కాళీస్వరూపం అందామా?” ఇంకొకరు.

“నోర్మూయండిరా! తను నాకు గర్ల్ ఫ్రెండేమిటి?” ఫ్లైట్‌లో జరిగిన సంఘటన చెప్పాడు అనురాగ్.

పల్లవి దగ్గరికి వచ్చేసింది. “కొత్త చోట తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఆ ఆనందమే వేరు. రండి అందరం కలిసి మాట్లాడుకుందాం. విశాలి కూడా ఇటే చూస్తోంది” అనురాగ్ చెయ్యి పట్టుకుంది పోదాం అన్నట్లుగా.

ఇదెక్కడి జిడ్డురా అని అనురాగ్ జుట్టు పీక్కుంటుంటే మిత్రులు మిటకరించి చూస్తున్నారు వీళ్ళ పరిచయం ఎలాంటిదా అని.

“నన్ను పరిచయం చేయరా మీ స్నేహితులకి?”

“ఆ కార్యక్రమం పూర్తి అయింది.”

“చాలా సినిమాల్లో కయ్యంతో మొదలై వియ్యంతో ముగుస్తాయి ప్రేమ కథలన్నీ. మన పరిచయం కయ్యంతో మొదలైందన్నమాట, వియ్యంతో ముగియడం మిగిలివుంది.”

అంటే తను ఆమె ప్రేమలో పడిపోయినట్టు… పెళ్ళి మిగిలి ఉందని చెబుతున్నట్టు అనురాగ్‌లో కోపం బుస్సుమన్నట్టుగా అయింది.

“అనురాగ్‌కి ఆ కోపం అలాగే ఉన్నట్టుంది. అందుకే నన్ను పరిచయం చెయ్యడం లేదు. నా పేరు పల్లవి. సాఫ్ట్‌వేర్. విశాలి నేను క్లాస్‌మేట్స్‌మి. మా నాన్న రంగూ రూపం వస్తే మా అమ్మ సంగీతం వచ్చాయి  నాకు. ప్లస్సూ మైనస్సు అన్నట్లుగా. రండి మా వాళ్ళందరికి పరిచయం చేస్తాను. మీరు మెచ్చిన విశాలి ఇటే చూస్తోంది. ఈ గార్డెన్‌లో ఎవరికి వాళ్ళం  తిరగడం కంటే కలిసి తిరిగితే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు.”

అనురాగ్‌కి తప్ప అందరికీ సరదాగానే ఉందీ ప్రపోజల్! అందరూ పెళ్ళికాని బ్రహ్మచారులే! ఉరకలేత్తే వయసుగత్తెలతో కలిసి తిరగడంలో ఆ మజానే వేరు కదా!

పరిచయం ప్రహసనం పూర్తయింది. కావలసిన దాని కంటే ఎక్కువే ఎంజాయ్ చేశారు. పాటలు, అంత్యాక్షరి… నవ్వులు, తుళ్ళింతలు. ఉరకలెత్తే ఉత్సాహంతో గార్డెన్ మెత్తం చూట్టేశారు. ఎన్నాళ్ళ స్నేహమో అన్నట్లు దగ్గరైపోయారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. వీడ్కోలు తీసుకుంటూ “ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మా గెస్ట్ హౌస్‌లోనే తిన్న తరువాత అందరం కలిసి బయల్దేరుదాం!” ఆహ్వానించాడు ప్రదీప్.

చేతన్ తనకి ఇష్టమైన పాటలు చెప్పి రేపు పాడాలని పల్లవితో ఒప్పందం చేసుకుని గాని వదల్లేదు. ఆమె పాటకు ఫిదా అయిపోయాడు పూర్తిగా. పల్లవి టాలెండ్ ముందు ఆమె నలుపు లావు ఎవరికీ కనిపించటం లేదు. అందరిలో ఒక ఆరాధన. మరునాడు, బ్రేక్‌ఫాస్ట్ తరువాత దొడ చెట్టలో టీ ఫ్యాక్టరీ చూడ్డం, చాక్‌లెట్లు, ఊలు దుస్తులు కొనుకోవడం రకరకాల షాపింగ్‌తో పాటు ఊటీ సరస్సుల్లో పడవ విహారాలు…. ఊటీ అందాలు అందరూ కలిసే చూడ్డంతో… అనురాగ్ విశాలి మధ్యన ప్రేమ ఎప్పుడు పట్టాలెక్కిందీ వాళ్ళకే తెలియదు.

***

ఆరు నెలల తరువాత ఒక నాటి సాయంత్రం…

“నా వైపు లైన్ క్లీయరైపోయింది. నీ సంగతి చెప్పు! తెలిసిన వాళ్ళెవరైనా చూస్తారని భయపడతూ ఇలా ఎక్కడో ఓ చోట కలుసుకోవటం ఇలా ఎన్నాళ్ళు? ఎవరినో ప్రేమించానన్నావు! ఇంటికి తీసుకువచ్చి మాకు పరిచయం చెయ్యవా అంటూ అమ్మ పోరు మొదలైంది నీ సంగతి ఇంట్లో చెప్పినప్పటినుండి. ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కదా ఈడొచ్చిన కొడుకు ఓ ఇంటివాడు కావాలని!”

“మా ఇంట్లో పరిస్థితి మీ ఇంటికి చాలా భిన్నం, అనూ! వాళ్ళు ఒప్పుకొంటారన్నీ ఆశ చిగురంత ఉన్నా ఆ ధైర్యం ఎప్పుడో చేసేదాన్ని లేదు గనుకే నా అడుగు ముందుకు పడడం లేదు.”

“మన ప్రేమకు ముగింపు ఏమిటో అదైనా చెప్పు!”

“నాకు తెలిస్తే కదా చెప్పేది?”

“ఈ అయోమయంలో ఎన్నాళ్ళో నువ్వే చెప్పు. క్రింద అగాధమైన లోయ. చెట్టు కొమ్మ పట్టుకొని వేళ్ళాడినట్టుగా ఉంది. కొండైనా ఎక్కాలి. కొమ్మనైనా వదిలేయాలి. క్రింద పులి ఉంటుందీ, మృత్యువే ఉంటుందో తరువాత సంగతి.”

ఏం మాట్లాడాలో తోచనట్టుగా దిగాలుగా తలొంచుకుంది విశాలి.

“మన దారులు వేరుకాక తప్పదంటే చెప్పు నేను సిద్ధమే. ఇలా కొమ్మ పట్టుకు వ్రేళ్ళడం ఇక నావల్ల కాదు!”

“మన ముందున్న దారి ఒక్కటే లేచిపోయి పెళ్ళి చేసుకోవడం!”

“వద్దు. పెద్దలను ఒప్పించి చేసుకుంటే ఆ కాపురం వాళ్ళ ఆశీర్వాదంతో ఆనందమయంగా సాగుతుందని నా నమ్మకం. మనల్ని గుండెల్లో పెట్టుకొని పెంచుకున్న అమ్మా నాన్నలను అదే గుండెల మీద తన్ని మన త్రోవ మనం చూసుకోవడం ఎంత దారుణం. వాళ్ళని నరకంలోకి త్రోసి మనం సుఖంగా, సంతోషంగా ఉండగలమా?”

“ఊరికే అన్నాను. పారిపోయి పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన నాకూ లేదు. ఉంటే మన పెళ్ళి ఎప్పుడో జరగిపోయేది. ఈ రోజు జతగాడు దొరికాడని పక్షుల్లా చెప్పకుండా ఎగిరిపోతే భగవంతుడు కూడా క్షమించడు.”

“మా నాన్నకి కొంచెం కులాభిమానం ఉండడమే కాదు సాంప్రదాయం, పరువూ ప్రతిష్ఠా అనే మనిషి. మనం దూరం కాకతప్పదేమో అనూ!” అంటుంటే విశాలి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.

అనురాగ్ ఆగలేనట్టుగా గబుక్కున ఆమెను లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు.

“రేపు సండే, ఇంట్లోనే  ఉంటాను కదా ఎలాగైనా ధైర్యం చేసి చెబుతాను. రిజల్ట్ అనుకూలంగా లేకపోతే తట్టుకోడానికి సిద్ధంగా ఉండు అనూ.”

“నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను విశూ!”

మరునాడు అనురాగ్ ఆఫీసులో ఉండగానే విశాలి నుండి ఫోనొచ్చింది. అతడి గుండె దడదడ లాడసాగింది. ఏం వార్త వినిపిస్తుందా అని ఒప్పుకున్నారా ఉద్విగ్నంగా అడిగాడు.

“నేనింకా అడగలేదు. మరొక సంతోషకరమైన వార్త. ఆఫీసు నుండి నన్ను అమెరికా పంపించే ప్రపోజలుందని చెప్పాను కదా! ఎన్నాళ్ళుగానో కలలుకంటున్న అమెరికా ఛాన్స్ ఇప్పడొచ్చింది. వారం రోజులే ఉంది వెళ్ళిడానికి. నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా?”

ఈ అమెరికా కల గురించి ఎన్నో సార్లు చెప్పింది విశాలి. నిజంగా సంతోషకరమైన విషయం. విశాలికి సంతోషమైనది తనకీ సంతోషమే కదా! “నువ్వు వెళ్ళేలోగా మన పెళ్ళి విషయం తేలిపోతే బాగుండేది. వాళ్ళు ఒప్పుకొంటే ఆ సంతోషంతో నువ్వు లేని ఈ సంవత్సరం హాయిగా గడిపేస్తాను.”

“నాకు అమెరికా ఛాన్స్ వచ్చినందుకు అమ్మానాన్న కూడా హ్యాపీగా ఉన్నారు. అమ్మాయితే నా అమెరికా కాపురానికి కావలసినవి సర్దడం మొదలు పెట్టింది. నాన్నయితే గర్వంగా అమ్మాయి ఆమెరికా వెడుతోందని ఎవరెవరికో ఫోన్లు చేసి చెబుతున్నాడు. ఇంత సంతోషకరమైన వాతావరణంలో బాంబు పేల్చనా? మన ప్రేమ సంగతి తెలిస్తే అదే జరగుతుంది అనూ!”

విశాలి చెప్పేది నిజమే. తను అమెరికా వెడుతున్నందుకు సంతోషపడాలో, పెళ్ళి విషయం తేల్చకుండా సంవత్సరం పాటు సస్పెన్స్‌లో ఉంచుతున్నందుకు బాధపడాలో తెలియడం లేదు. సస్పెన్స్ కాదు నరకమే.

ఈ వారం రోజులు కావలసినవి సర్దుకోవడంలో బిజీగా గడిచిపోయింది విశాలకి. ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా తీరడం లేదు. వెళ్ళే రోజు ఎయిర్‌పోర్టుకు రమ్మని చెప్పింది. సెండాఫ్ ఇవ్వడానికి ఆమె అమ్మానాన్నలతో పాటు. అక్కా బావ, ఆఫీసు ఫ్రెండ్స్ వచ్చారు. గుంపులో గోవిందలా ఆఫీసు ఫ్రెండ్‌గానే పరిచయం చేసింది. మాట్లాడుకోడానికి ఏకాంతం దొరకలేదు. చివరి వీడ్కోలుగా ఒక ముద్దు తీసుకోవాలన్న కోరిక! చిన్న చిన్న సైగలతో విశాలకి చెప్పాడు.

“సిగ్గు లేదా? ఇంత మందిలో ముద్దు ఎలా కుదురుతుంది?” వాట్సాపులో మందలించింది. “ఒక ముద్దిస్తే నువ్వు లేని సంవత్సర కాలాన్ని సంతోషంగా గడిపేస్తాను.”

“సారీ అనూ!” మళ్ళీ వాట్సాప్‌లో అందరితో సెలవు తీసుకుని వెళ్ళిపోయింది విశాలి.

అమెరికా వెడుతున్న సంతోషం, ఉద్విగ్నతతో ఉన్న విశాలి అతడి వియోగబాధను గుర్తించే స్థితిలో లేదు. చివరి క్షణాలలో  వీడ్కోలు చెప్పినప్పుడు మాత్రం ఆమె కళ్ళలో నీటి చెమ్మ కనిపించి, ఆమె మనసును విప్పి చెప్పినట్టుయింది. ఆ తరువాత ఎన్ని సార్లు వీడియో కాల్స్‌లో మాట్లాడుకున్నా తమిద్దరి మధ్య దూరం వేల వేల మైళ్ళన్న స్పృహ అతడిని బాధిస్తూనే ఉంది.

అతి భారంగా రోజులు, వారాలు, నెలలు గడిచిపోగా విశాలి తిరిగి రావడానికి వారం రోజులు మిగిలింది.

“నువ్వు వచ్చే వరకు మన పెళ్ళికి లైన్ క్లియర్ అయితే బాగుంటుంది విశూ! మీ వాళ్ళకి చెప్పెయ్యి. ఇకాలస్యం చేయకు!” ఓ రోజు చెప్పాడు అనురాగ్.

“నాన్నతో అయితే మాట్లాడలేను. నాన్న ఎంత ప్రేమగా ఉంటాడో తనకి ఇష్టం లేనిది విన్నప్పుడు అంతే కఠినంగా కొరడా ఝుళిపిస్తాడు. మాటలు కాదు తూటాలే వస్తాయి. ఆయన నోటి నుండి అమ్మకే చెబుతాను మన విషయం!”

విశాలి చెప్పే వార్త కోసం అనురాగ్ ఉద్విగ్నంగా ఎదురు చూస్తుండగా చేతన్ నుండి ఫోనొచ్చింది.

“సారీ రా బ్యాడ్ న్యూస్. ఏక్సిడెంటులో విశాలి పోయిందని పల్లవి ఫోన్ చేసింది!”

అనురాగ్ కుప్పకూలిపోయాడు.

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చేసినట్టుగా తమ పెళ్ళిసమస్యను విధి తీర్చేసిందా?

“బాడీ ఇండియా రావడానికి రెండు రోజులు పడుతుందట!”

విశాలి బాడీ ఇండియా వచ్చేరోజు అనురాగ్ చేతన్‌తో కిలిసి వెళ్ళాడు. బాడీ ఉన్న పెట్టెను ఎప్పుడు ఫ్లైట్ నుండి దించారో. ఎప్పుడు అంబులెన్స్‌లోకి చేర్చారో ఆమె కోసం వచ్చిన గుంపులో కనిపించలేదు.

మరునాడుదయం చివరి చూపుకు చేతన్‌తో కలిసి వెళ్ళాడు ఇంటికి. అప్పటికే బంధుమిత్రులు తెచ్చిన పూలదండలతో, బొకేలతో శవపేటిక నిండిపోయింది. ముఖం దగ్గర మాత్రం కనిపిస్తున్న ఖాళీలోంచి చూశాడు. చెక్కు చెదరని ఆదే సౌందర్యం! గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉంది. ఇంకెప్పుడూ కళ్ళు తెరవని నిద్ర! దీర్ఘనిద్ర!

“నీ కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనే దానివి ఎప్పుడూ. వచ్చాను విశూ! కళ్ళు తెరిచి చూడు” అతడి మనసు మూగగా రోదించసాగింది.

అతడినే జాగ్రత్తగా గమనిస్తున్న చేతన్, ఇంకొతసేపుంటే గుండె బద్దలైనట్టుగా పెద్దగా ఏడ్చేస్తాడోమో అనిపించి అతడి భుజం మీద చెయ్యేశాడు. దుఃఖం ఎలాగో చిక్కబట్టుకుని వచ్చి కారులో కూర్చోగానే చేతన్ భుజం మీద తలొంచి ఏడవడం మొదలు పెట్టాడు అనురాగ్ “పెళ్ళిదండలకు బదులు  చావుదండలు వేసుకుందిరా నా విశాలి!”

“ఏడవొద్దని చెప్పను, ఏడవరా! గుండెలవిసిపోయేలా ఏడవరా! ఏడిస్తేనే తేలికపడుతుంది మనసు!” చేతన్‌కి కూడా ఏడుపు వచ్చేసింది.

***

విశాలి మరణం ఏక్సిడెంటు వల్లకాదు ఆత్మహత్య అని విశాలి కాలిబూడిదైన రెండు రోజుల తరువాత తెలిసింది అనురాగ్‌కు‌ విశాలి రాసిన లెటరు వల్ల.

“అనూ ముగిసింది మన ప్రేమ కథ, ఇంకేం మిగల్లేదు. నేను ఇండియా రాగానే నా మెడలో మూడు ముళ్ళు వేయించి తిరిగి అతడి వెనుక అమెరికా పంపించే ఏర్పాట్లు జరిగిపోయాయి. నేను ధైర్యం చేసి మన విషయం చెబుదామనుకునేంతలో ‘నీకొక హ్యాపీ న్యూస్‌రా’ అంటూ మొదలు పెట్టాడు నాన్న. ‘నేనే ఫోన్ చేద్దామనుకున్నాను కానీ పెళ్ళి ఖాయం చేశాను. వసుధత్త కొడుకు శ్రీకాంత్‌తో. నీకు బాగా తెలిసిన వాడే. మీరిద్దరు చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళే. ఆమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేసుకుని క్రిందటి వారం ఇండియా వచ్చాడు. వచ్చే నెల మొదటి వారంలో తిరిగి అమెరికా వెళ్ళిపోతాడట. అతడు వెళ్ళిపోయేలోగా పెళ్ళి చేసి పంపాలని వసుధత్త తాపత్రయం. నా కొడుక్కు నీ బిడ్డ నీయరా అని ఇంటికొచ్చి అడిగిన ఆడపడుచు కోరికను ఎలా కాదనగలను? కాదనడానికి మాత్రం ఏముంది అన్ని విధాలా మనకు అనుకూలమైన సంబంధం. కావలసిన సంబంధం నాకెప్పటి నుండో డాక్టర్ని అల్లుడిగా తెచ్చుకోవాలని కోరిక. నీకు చెప్పకుండా నీ పెళ్ళి నిర్ణయం నీ మంచి చెడ్డలు తెలిసిన తండ్రిగా తీసుకునే హక్కు అధికారం నాకున్నాయనే అనుకుంటున్నాను. ముఖ్యంగా  పెళ్ళి చూపులకు టైం లేదు. చిన్నప్పటి నుండి ఎరిగున్న వాళ్ళే కాబట్టి పెళ్ళి చూపులు అవసరం లేదనే అనుకుంటున్నాను. ఒక విధంగా నీకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ అనుకో. ఆడపిల్లలు కలలు గనే ఆరడుగుల అందగాడు మొగుడౌతున్నందుకు హ్యాపీనే కదా.’ చాలా సంతోషంగా చెప్పుకుపోతున్న నాన్నకు ఏం జవాబివ్వాలో తోచలేదు. మెదడు మొద్దు బారిపోయినట్టయింది. ఇప్పుడు మన సంగతి చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పే అవకాశముండదని ధైర్యం కూడ దీసుకుని చెప్పేశాను. షాక్ తిన్నట్టుగా నాన్న చాలా సేపు మాట్లాడలేదు. చివరికి రాజశాసనంలా కఠినాతి కఠినంగా చెప్పాడు. ఆ ప్రేమ కథను సమాధి చేసి గతంలో కలిపెయ్యి. ఇంకెప్పుడూ ఆ విషయం నా ముందుకు తీసుకురావద్దు. నీ పెళ్ళి శ్రీకాంత్‌తోనే జరుగుతుంది. కాదు కూడదు అతణ్ణే పెళ్ళి చేసుకుంటానంటే మీ అమ్మకింత విషమిచ్చి నేను తింటాను. కూతురు కులం కాని వాణ్ణి చేసుకున్నాదంటే ఎంత అవమానం? ఇంటి పరువు పోయాక బ్రతుకెందుకు చావే నయం!”

“చావే నయం నాన్నా నాకు అనురాగ్‌తో పెళ్ళి జరక్కపోతే అనుకున్నాను. నాకు ఏడుపుపొచ్చింది. ఫోన్ కట్ చేశాడు నాన్న. నాన్న మాటంటే రాజశాసనమే. తిరుగుండదు. తిరుగు బావుటా ఉండదు. ఇంతకు ముందే చెప్పాను కదా ఆయన ఎంత ప్రేమను పంచుతాడో అంత కఠినంగా ఉండగలడని! నాకు ఉన్న చావే కదా. నువ్వు బాధపడతావని తెలుసు. కాని నా ముందున్నది చావే కదా? నిన్ను నాకు పరాయివాడిని  చేసుకొనేకంటే నీ విశాలిగా వెళ్ళిపోవడమే నా మనసుకు శాంతీ, సంతోషం. నేను మరొకరి భార్యనై నీకు పరాయిదాన్నైతే ఇంకా భాదపడతావు కదా! బ్రతికుంటే నా బ్రతుకు నిప్పుల కుంపటి. నిత్య నరకం! మనసులో నువ్వు, కాపురం మరొకరితో! ఆ కాపురం కణకణలాడే అగ్ని గుండమే కదా. అది తప్పించుకోడానికే ఈ  పలాయనం. ఆత్మహత్య చేసుకొన్న వాళ్ళు ఆత్మగా తిరుగుతారని విన్నాను. అదే నిజమైతే నేను నీ వెంటే ఉంటాను. నీ నీడగా తిరుగుతాను. అదృశ్యంగా ఉంటాను కాబట్టి ఎవరో చూస్తారన్న భయం లేదు. బై అనూ నాకు నిద్రొచ్చేస్తుంది. ఈలోగా ఈ లెటరు నీకు పోస్టు చేసి రావాలి. అమ్మ నాన్నకి బై చెబుతూ మెసేజ్ పెట్టాలి. ఎన్నటికీ నిను వీడని…

నీ విశూ.”

“నిన్ను నేనే చంపుకున్నాను విశూ. హంతుకుడిని నేనే. మీ వాళ్ళని మన పెళ్ళికి ఒప్పించమని నేనే బలవంత పెట్టాను. దాని ఫలితమే ఇది….” గోడ కేసి తలబాదుకొంటున్న అనురాగ్‌ను తల్లి వచ్చి పట్టుకుని ఆపి అదుముకుంది గట్టిగా.

***

రోజులు గడిచిపోతున్నాయి… యాంత్రికంగా.

రాత్రి భోంచేసి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటే ఉదయం ఎనిమిది గంటలకి స్నానం చేసి ఆఫీసుకి తయారై బయటికి వస్తున్నాడు. ‘వెడుతున్నానమ్మా’ అని ఒక్కమాట చెప్పి వెళిపోతున్నాడు. ఆ చెప్పడంలో కూడా యాంత్రికతే. ఆఫీసు కాంటిన్‌లోనే టిఫిన్, మధ్యాహ్నం భోజనం. రాత్రికి భోజనం టైంకి వస్తాడు ఇంటికి. తిని తన గదిలోకి వెళ్ళిపోతాడు. తిరిగి ఆ తలుపులు తెరుచుకోవడం ఉదయం ఎనిమిది గంటలకే. ఓ మాటా మంతీ లేదు. అచ్చటా ముచ్చటా లేదు. జీవచ్ఛవమైపోయాడు అనురాగ్. అతడిని చూస్తుంటే తల్లి కడుపులో దేవినట్టవుతోంది. ఏదైనా అడిగితే పొడిపొడి మాటలు తప్ప వేరే మాటలుంటవు.

తల్లి విమలమ్మకి ఒకే చింతయిపోయింది. వీడిని మామూలు మనిషిని ఎలా చెయ్యడమని.

“ఎలాగో ఒకలా ఒప్పించి పెళ్ళి చేయండి. మనుషుల్లో పడతాడు” తెలిసినవాళ్ళ సలహా.

మెల్లిగా పెళ్ళి పోరు మొదలై అది పరాకాష్టకు చేరుకుంది. నీ పెళ్ళి కళ్ళ జూడకపోతే నేను చస్తాను అనేంతవరకు, కోడలు రావాలి, గునగున నడిచే పిల్లలు కావాలి… ఇవీ ఆమె కలలు…. రోజూ ఇదే పోరు కొడుకు వింటున్నాడా లేదా అని కూడా చూడకుండా సణుగుతూనే ఉంటుంది.

ఒకసారి చెప్పాడు విసిగి “అమ్మా! మీకు తెలియదు కాని విశాలి ఎప్పుడూ నాతోనే ఉంటుంది. విశాలి నాతో ఉందన్న ఉహతోనే ఈ జీవితం గడుపుతున్నాను. విశాలి తప్ప ఈ జీవితంలో ఇంకెవరూ ఉండకూడదు. ఉండరు. ఇంకెప్పుడూ పెళ్ళి పెళ్ళి అని నన్ను వేధించకు, నువ్విలాగే సతాయిస్తే పారిపోతాను. మళ్ళీ కనిపించను.”

“ఆ పని మేమే చేస్తే సరిపోతుంది కదా నిన్ను వేధించే వాళ్ళుండరు. ఎలాగూ మీ నాన్న తీర్థయాత్రలకు పోదామంటున్నారు.”

***

ఆ రోజు ఆదివారం. ఉదయం టిఫిన్ చేసి బయటపడిన అనురాగ్ కాస్సేపటికి తల్లికి ఫోన్ చేశాడు. “పిల్లలో పిల్లలూ అని కలవరించావు కదా ఒక్కరు కాదు ఇద్దరొస్తున్నారు, మనుమడు మనుమరాలు, గృహప్రవేశానికి ముందు దిష్టి తీయడం లాంటి ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి కదా, వాటితో రెడీగా ఉండు.”

హఠాత్తుగా ఈ మనుమడూ మనుమరాలు ఎక్కడి నుండి ఊడిపడ్డారు అని అడిగే లోపల ఫోన్ కట్ చేశాడు.

“నా పోరు పడలేక ఏ అనాథ శరణాలయం నుండో పిల్లల్ని తెచ్చి నా ముఖాన పడేస్తున్నట్టున్నాడు. ఏ అనాథ పిల్లల్నో పెంచాల్సిన ఖర్మ నాకేమిటి? తల్లి లేకుండా ఒకరు కాదు ఇద్దరిని పెంచగల వయసా తనది? రానీ చెబుతాను” భర్తతో చెప్పింది. “ఎలా తెచ్చాడో అలా వదిలేసి రమ్మని చెబుతాను.”

గంటలో వస్తానన్న అనురాగ్ రావడానికి కొంచెం ఆలస్యమే అయింది.

ఇంటి ముందు అనురాగ్ కారొచ్చి ఆగింది. దాని వెనుక చిన్న ట్రక్ కూడా వచ్చి ఆగింది.

కారులోంచి ముందు అనురాగ్ దిగి వెనుక డోర్ తెరిచాడు. ఒక నర్సు, ఒక ఆయా టర్కీటవల్స్‌లో చుట్టిన పిల్లల్ని గుండెలకు అదుముకొని దిగారు. అనురాగ్ దారి చూపగా గుమ్మం దగ్గరకి వచ్చి నిలబడ్డారు.

వాళ్ళని గుమ్మం బయటే నిలబెట్టి  ఎర్రనీళ్ళు మూడు సార్లు త్రిప్పి బయట చెట్లలో పారబోసి వచ్చింది పని మనిషి. విమలమ్మ కొబ్బరికాయకొట్టి గుమ్మానికి అటో చిప్ప ఇటో చిప్ప వేసింది. పిల్లలు గృహప్రవేశం చేశారు.

హాలు ప్రక్క గదిలోనే పిల్లలుండడానికి చక చకా ఏర్పాట్లు జరిగాయి. ట్రక్‌లో తెచ్చిన ఊయలలు, పిల్లలను త్రిప్పటానికి వీల్ చెయిర్లు, పిల్లలు ఆట వస్తువులు అన్నీ చక్కగా సర్దేసి వెళ్ళిపోయారు ట్రక్‌లో వచ్చిన మనుషులు.

ఇంటి ముందు నుండే వెనక్కి పంపిచేద్దామనుకున్న విమలమ్మ అందరి ముందు కొడుకును అవమానించి నట్టవుతుందేమోనని అప్పటికి గమ్మునుంది. పిల్లల్ని కన్నెత్తి కూడా చూడలేదు. గదిలో సర్దుబాటంతా అయ్యాక అనురాగ్ తల్లి దగ్గరికి వచ్చాడు. “ఇల్లు కలకలలాడించేందుకు పిల్లలు కావాలన్నావు కదా! తీరా వాళ్ళొస్తే కన్నెత్తి చూడవేమి?”

“ఏ కులమో మతమో ఎవరో కనిపారేసిన పిల్లల్ని, తీసుకు వచ్చి నా మొహాన పారేస్తే  నోరు మూసుకుంటాననుకున్నావా? నీకు పుట్టే పిల్లలతో ఆడుకోవాలనుకున్నాను గాని ఇలా అనాథ పిల్లలకు నాయనమ్మను కావాలనుకోలేదు.”

“వాళ్ళు అనాథ పిల్లలని ఎవరు చెప్పారు? వాళ్ళు నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే. సరోగసి పేరు వినే ఉంటావు. నీ పోరు పడలేక మన ఫామిలీ డాక్టర్ వనజాక్షి మేడమ్‌ని కలిశాను. ఆవిడే సలహ ఇచ్చింది. సరోగసి ద్వారా నేను తండ్రిని కావచ్చని. పెళ్ళి కాకుండానే తండ్రులు కావడానికి చాలా మంది మగవాళ్ళు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సినిమా తారలు, బాగా డబ్బున్నవాళ్ళు. తమ రక్తం పంచుకుని సరోగసి ద్వారా పుట్టిన పిల్లలని చంకనేసుకుని ఫోటోలకి ఫోజులివ్వడం మనం మాగజైన్స్‌లో అక్కడా ఇక్కడా చూస్తుంటాం. నువ్వు ఓకే అంటే మన సంతాన సాఫల్య కేంద్రంలోనే చేద్దాం.”

“అద్దెకు గర్భం ఇచ్చే ఆడమనిషి కావాలి కదా?”

“మా హాస్పిటల్ వాళ్ళే చూసి పెడుతారు. ఆ పనికి సిద్ధపడే పేద మహిళలు చాలా మందే ఉంటారు. పోతే డబ్బు ఖర్చు చాలా అవుతుంది” అని చెప్పింది. అలా వనజాక్షి మేడమ్ సంతాన సాఫల్య కేంద్రంలోనే  నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు వీళ్ళు. నాలుగు రోజులు అబ్జర్వేషన్‌లో పెట్టుకుని, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి ఈ రోజు పిలిచి అప్పగించింది. నర్సునూ, ఆయాను కూడా ఆవిడే ఏర్పాటు చేసింది. పిల్లలకు కావలసినవి నర్సు లిస్టు రాసిస్తే పనిలో పనిగా తెచ్చేశాను. నేను చెప్పేదంతా అవునోకాదో వనజాక్షి మేడమ్‌కి ఫోన్ చేసి కనుక్కో?”

“తల్లి ఎవరు? ఏ కులం?”

“ఆ వివరాలు మనకు చెప్పరు. మనకి అవసరం లేదు కూడా, పిల్లల్ని కనివ్వడం వరకే. తరువాత పిల్లలతో ఆమెకి సంబంధమేమీ ఉండదు. తన పిల్లల్ని ఎవరు పెంచుకోడానికి తీసుకున్నారో ఆమెకి తెలియదు. అంతా సీక్రెట్‌గా నిర్వహిస్తారు హాస్పిటల్ వాళ్ళు.”

అప్పుడు కాని తృప్తిపడలేదు విమలమ్మ. ప్రక్క గదిలో చెరో ఉయ్యాలలో పడుకున్న పిల్లల్ని కంటి నిండా చూచుకుంది. ముసుకున్న గుప్పెట్లని విడదీసి ముద్దు పెట్టుకుంది. పిల్ల ఎవరి పోలికో తెలియదు కాని పిల్లాడు తన కొడుకు పోలికలు కనిపించాయి. పిల్ల తెలుపు, పిల్లాడు ఛాయనలుపు. ఇద్దరు పిల్లలు ఒత్తైన నల్లని జుట్టుతో ముద్దు ముద్దుగా ఉన్నారు. ఆమెతో ప్రేమ వెలువెత్తినట్లుగా అయి ఊయ్యాల్లోకి ఒంగి పిల్లలు బుగ్గ మీద ముద్దు పెట్టుకంది.

పిల్లలకి ఆరో నెల వచ్చే సరికి రంగు తేరి బొద్దుగా తయారయ్యారు. పిల్లలే లోకంగా మారిపోయారు. విమలమ్మ పిల్లల పెంపకానికి సంబంధించి పుస్తకాలు తెప్పించి చదువుతోంది. టీవీలో పిల్లల పెంపకానికి సంబంధించి ఏ ప్రోగ్రాం వచ్చినా శ్రద్ధగా చూస్తోంది. ఎప్పుడూ మంచం మీద నీరసంగా పడుకుని ఉండే అనురాగ్ తండ్రి గిలకలతో, ఆటబొమ్మలతో అత్యుత్సాహంగా ఆడిస్తుంటాడు. “గోరంత దీపం కొండంత వెలుగంటారు. ఈ పిల్లలొచ్చాక మనిల్లు ఎలా కలకలలాడిపోతుందో చూడు” అంటుంటాడు.

“అంతే కదా? పిల్లలున్న ఇల్లు కళే వేరు! అందుకే కదా వాణ్ణి పోరింది. పిల్లలయితే వచ్చారు వాడి మనసు మారి పెళ్ళి కూడ చేసుకుంటే ఇక ఏ చింతా లేకపోవును” అంది విమలమ్మ.,

ఆ కోరిక మాత్రం తీరేది కాదని ఆమెకి తెలియదు. విశాలిని ఇప్పటికీ గుండెల్లో ఎలా పెట్టుకున్నాడో, ఆమెను మరచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకోవడం ఎంత అసంభవం ఆమెకి తెలియదు. మరొకటి కూడా తెలియదు – కొడుకు సగం నిజం సగం అబద్ధం చెప్పాడని. సరోగసి ద్వారా తండ్రివి కావచ్చని డాక్టరు చెప్పినప్పుడు అసలొప్పుకోలేదు అనురాగ్. “నేను తండ్రినయ్యే అదృష్టాన్ని విశాలి తనతోనే తీసుకుపోయింది డాక్టర్! నాకు పిల్లలే కావాలంటే నా రక్తం పంచుకునే పుట్టాల్సిన అవసరం లేదు. ఏ అనాథ పిల్లనో, పిల్లాడినో తీసుకుని తండ్రిని కావచ్చు. మీ హాస్పిటల్‌కి ఎందరో కాన్పులకి వస్తుంటారు కదా. పెంచలేని బీద వాళ్ళేవరైనా ఉంటే చూడండి. ఆడైనా మగైనా నేను దత్తత తీసుకుంటాను. నేను తండ్రిని కావడం కంటే మా అమ్మ నానయన్మ కావడం ముఖ్యం.”

ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండానే వనజాక్షి నుండి ఫోనొచ్చింది. ట్విన్స్ పుట్టారు. కడుబీదరాలు దత్తత ఇవ్వడానికి ఆమె సంతోషంగా ఒప్పుకుంది.

జరిగింది అది అయితే తన రక్తం పంచుకు పుట్టారు అదీ ఇదీ అని అబద్దమాడాల్సి వచ్చింది. రక్తసంబంధముంటే తప్ప పిల్లల్ని ఆమె అక్కున చేర్చుకోదని.

అవసరం కొద్ది అబద్ధం ఆడనైతే అడాడుగాని తల్లిని మోసగించానన్న బాధ అతడిని పీడిస్తూనే ఉంది.

పిల్లలకి నాలుగో నెల వచ్చాక నర్సుని పంపించేసి ఆయా సాయంతో పిల్లల  పనులన్నీ ఇష్టంగా తానే చేసుకొంటోంది విమలమ్మ. పిల్లలే లోకం పిల్లలే ప్రాణమన్నట్టుగా అయింది ఆమె.

అనురాగ్‌కి ఆఫీసుకి వెళ్ళే ముందు పిల్లలతో కాస్సేపు ఆడుకోవడం అలవాటైంది. ఎత్తుకోడానికి భయమేసి ప్రక్కన కూర్చుని వాళ్ళ చిట్టి చిట్టి చేతులు పట్టుకొని ఆడిస్తూ చెంపలు నిమురుతూంటాడు. కొంచెం ఒళ్ళు చేసి మెడలు నిలెట్టాక ఎత్తుకోడానికి ధైర్యమొచ్చింది. వాళ్ళతో అనుబంధం అతడిని పెనవేసుకుపోతోంది. వీళ్ళే కదా నా శూన్య జీవితానికి ఆధారం అనుకొంటాడు.

పిల్లలకి ఆరో నెలరాగానే నామకరణ మహోత్సవం గ్రాండ్‌గా చేయాలని ఏర్పాట్లుకు కొడుకును పురమాయించింది విమలమ్మ. బంధు మిత్రులనందరినీ పిలిచి ఫంక్షన్ ఘనంగా చేశారు. పిల్లకి అమృత అని, పిల్లాడికి అమర్ అని విమలమ్మ సెలక్ట్ చేసిన పేర్లు పెట్టారు. పిల్లలు బాగున్నారని మెచ్చుకుంటూనే పెళ్ళి కాకుండానే తండ్రి అయినందుకు అనురాగ్‌ను అభినందనలతో ముంచెత్తారు.

ఫంక్షన్‌కి డాక్టర్ వనజాక్షి కూడా వచ్చింది. పిల్లకి చక్కని గిఫ్ట్‌లు తీసుకొని. భోజనాల తరువాత ఆమె వీడ్కోలు తోసుకుని వెళ్ళిపోతుంటే వెంట కారు వరకూ వచ్చాడు అనురాగ్. “తాత్కాలికంగా గండం గడవడం కోసం అమ్మతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎప్పటికీ ఆమెను ఆ అబద్ధంలోనే ఉంచాలనుకోవడం లేదు. వాళ్ళను మోసం చేస్తున్నానన్న బాధ నన్ను వెన్నాడుతుంది. సమయం చూసి వాళ్ళకు నిజం చెప్పాలనుకుంటున్నాను మేడమ్.”

“ఆ పిల్లల చుట్టూ మమకారపు వల అల్లుకుని వాళ్ళే లోకంగా బ్రతుకుతున్న వాళ్ళు, ఆ పిల్లలు నీ పిల్లలు కాదని తెలిస్తే గుండె బద్దలు కాదూ? వాళ్ళతో తమకి రక్త సంబంధమేమీ లేదని తెలిస్తే తట్టుకోగలదా?” అంది వనజాక్షి.

“ఈ లోకంలో పెంచిన ప్రేమ గొప్పదా? రక్త సంబంధం గొప్పదా చూద్దాం” అన్నాడు అనురాగ్.

“అయితే ఆ ముసలి వాళ్ళ ప్రేమకు పరీక్ష పెడతావన్న మాట.”

“నేనాడిన  అబద్ధం నా గుండెల మీద బరువుగా ఉంటోంది డాక్టర్. నేనది ముందుగా దింపుకోవాలి. ఏమైనా జరగనీ ఎదుర్కొనడానికి నేను సిద్ధమే.”

“సరే అనూ, రహస్యం రహస్యంగా ఉంటుందని నేను కూడా హామీ ఇవ్వలేను. నిజం తెలిసిన వాళ్ళు నేను కాక ఇద్దరున్నారు. మీ ఇంటికి పంపిన నర్సు కాక ఇంకొకరు. ఎప్పుడో ఎవరి వల్లో తెలిసే బదులు నువ్వు చెప్పడమే బాగుంటుంది.” కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది వనజాక్షి.

ఇంకాలస్యం చేయలేదు అనురాగ్. అమ్మ పిల్లలతో ఆడుకుంటూ మంచి మూడ్‌లో ఉన్నది చూసి చెప్పేశాడు.

బ్రహ్మండం బద్దలవుతుందేమో అనుకున్నాడు. ఆమె షాక్‌కి గురవుతుందేమో అనుకున్నాడు. కాని, ఏదీ జరగలేదు. ఏమీ మాట్లాడకుండా కొడుకు ముఖంలోకి దీర్ఘంగా చూసింది.

అనురాగ్ గుండెలు పీచుపీచుమంటున్నాయి. “ఎవరి పిల్లల్నో పెంచడం నీకు ఇష్టం లేకపోతే వాళ్ళని తీసుకుపోయి అనాథ శరణాలయంలో వదిలి వస్తానమ్మా! ఈ పని నేను పిల్లల్ని ఇంటికి తెచ్చిన రోజు నువ్వు అయిష్టం వ్యక్తపరిచినప్పుడే చేయాల్సిన మాట తప్పు చేశానమ్మా!”

ఆమె కొడుకు చెంప ఛళ్ళుమనిపించడంతో పాటు ఆమె కళ్ళలో కన్నీళ్ళు నిండి జలజలా రాలసాగాయి.

“క్షమించమ్మా!”

“అబద్ధం చెప్పినందుకు కాదు ఈ చెంప దెబ్బ! నా మనుమణ్ణి మనుమరాలిని అనాథ శరణాలయంలో వదిలి పెడతానన్నావే అందుకు. నాకు దొరికిన రెండు రత్నాలివి. వాళ్ళ చుట్టూ నేనూ మీ నాన్న ఎంత మమతలల్లుకున్నామో నీకు తెలుసు కదా! తెలిసే అంత మాటెలా అనగలిగావు? ఎప్పుడూ మంచాన్ని అంటి పెట్టుకుని ఉండే మీ నాన్న వాళ్ళని ఆడిస్తూ, వీల్ చెయిర్‌లో తోటంతా త్రిప్పుతూ తన అనారోగ్యాన్ని మరచిపోయేలా చేసిన ఆ పసివాళ్ళని మేం దూరం చేసుకుంటామని ఎందుకనిపించింది? జాతి మతం కులం అన్నీ కూలగొట్టారురా వీళ్ళు. పసివాళ్ళు పరమాత్మ స్వరూపమని చెప్పారురా వాళ్ళ బోసినవ్వులతో. వీళ్ళు అనాథలు కారు, అనాథ శరణాలయంలో ఉండడానికి. అపురూపంగా చూసుకనే నాయనమ్మ ఉంది. వీళ్ళకు గుండెల మీద ఆడించుకునే తాతయ్య ఉన్నాడు. అవును రక్త సంబంధం కాదు. నర్సు చెప్పింది. ఆమె వెళ్ళిపోయే ముందు చెప్పింది. ఆమె చెప్పేనాటికే ఆ పిల్లలు మా ప్రాణమైపోయారు. వీళ్ళు  నా రక్తం సంబంధమో కాదో నాకనవసరం. ఆ పిల్లల కులమేమిటి? తల్లెవరు? ఇవ్వన్నీ ఇప్పుడు నాకనవసరం. నా అజ్ఞానం తొలగించి జ్ఞానదీపాలు వెలిగించిన పరమాత్మ స్వరూపాలు వీళ్ళు! చీకట్లలో మునిగిపోయిన మనింట్లో కొండంత వెలుగులు నింపిన గోరంత దీపాలు వీళ్ళు…!”

తల్లి ఉద్విగ్నభరితంగా అంటుంటే అలా… అలా గాలిలో తేలిపోయే దూదిపింజెలా అయింది అనురాగ్ మనసు.

Exit mobile version