Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

టీనేజర్ల అంతర్మథనానికి ప్రతీక ‘గుడ్ గర్ల్’

[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా అరియా అబెర్ రాసిన ‘గుడ్ గర్ల్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]

రియా అబెర్ రాసిన ‘గుడ్ గర్ల్’ నవల ఒక అద్భుతమైన తొలి నవల, ఇది యువతలోని గందరగోళాన్ని, వలసదారుల గుర్తింపు లోని సంక్లిష్టతలను, సమకాలీన బెర్లిన్‌లో ఉనికి కోసం అన్వేషణను ప్రదర్శిస్తుంది. ఈ నవల జర్మనీలో ఆఫ్ఘన్ శరణార్థులకు జన్మించిన ‘నీలా’ అనే 19 ఏళ్ళ యువతి కథ. ఈ నవల – బెర్లిన్ నగరపు ‘అండర్‌గ్రౌండ్ టెక్నో సీన్’ (క్లబ్‌లలో వాయించే ఎలెక్ట్రానిక్ మ్యూజిక్)ని, కుటుంబ అంచనాలని, ఇంకా తొలి ప్రేమని, కళాకారిణి కావాలనే ఆశయాన్ని – ప్రదర్శిస్తుంది. ఇప్పటికే కవయిత్రిగా గుర్తింపు, ప్రశంసలు పొందిన అబెర్, తన గద్య రచనకీ పదునుబెట్టి, ‘గుడ్ గర్ల్’ నవలను బెర్లిన్ వాతావరణ చిత్రణగా, ఒక సన్నిహిత పాత్రని అధ్యయనం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దారు.

అరియా అబెర్

నీలా ప్రస్థానం – వైరుధ్యంతో, అభిలాషతో నిర్వచించబడింది. జర్మనీలో తమ వైద్య అర్హతలు గుర్తింపబడని తల్లిదండ్రులతో, ప్రాజెక్టులలో పెరిగిన ఆమెకు, తన కుటుంబ జీవితంలోని త్యాగాలు, నిరాశల గురించి బాగా తెలుసు. ఆమె నివసించే నగరం అవకాశాలతో పాటు ముప్పుని కూడా తెస్తుంది – గోడలపై స్వస్తిక్ చిహ్నాలు, టర్కిష్ దుకాణాలపై బాంబు దాడులు, నిరంతరం అంతర్లీనంగా వ్యక్తమయ్యే జాతి ఉద్రిక్తత వంటివి ఆమె తప్పించుకోలేనివి. ఈ వాస్తవాలు, కొన్నిసార్లు ప్రధాన కథనపు పరిధిలోనివే అయినప్పటికీ, 1989 తర్వాత బెర్లిన్‍కు వలస వచ్చిన నీలా ప్రత్యక్ష అనుభవంలో కథను ముందుకు నడుపుతాయి.

ఈ నవల అత్యంత అద్భుతమైన లక్షణాలలో ఒకటి – వచనం. కవయిత్రిగా తన నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, రచయిత్రి బెర్లిన్ రాత్రి జీవితంలోని – మోతాదు మించిన భోగాసక్తిని వ్యక్తం చేసేందుకు – స్వరావృత్తి (assonance)ని, అనుప్రాసని, స్పష్టమైన కల్పనలను ఉపయోగిస్తూ; నీలా అంతర్గత ప్రపంచంలోని భావోద్వేగ తీవ్రతను వెల్లడిస్తారు. దాంతో రచన సజీవంగా అనిపిస్తుంది, వాస్తవికంగా ఉంటుంది. బంకర్ క్లబ్‌లోని టెక్నో వాయిద్యాల ధ్వనిని లేదా జ్యూయిష్ మ్యూజియం లోని ‘వేదనా ప్రతిమ’ని (colossus of sorrow) రచయిత్రి ఎంత గొప్పగా వర్ణిస్తారంటే, ఆ భాగాలు పాఠకుల మనస్సులో నిలిచిపోతాయి. భాషపై ఉన్న ఈ శ్రద్ధ కథనాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది, నిరాశ లేదా గందరగోళ క్షణాలను కూడా అర్థవంతం చేస్తుంది.

ఒకప్పుడు ప్రఖ్యాతిపొందిన అమెరికన్ రచయిత మార్లోకి నీలా సన్నిహితమవటం నవలకి కీలకం. అతని మోసపూరిత ఆకర్షణ – ఆమెకి అతని పట్ల మోహాన్ని కలిగిస్తుంది, అంతేకాదు, ప్రమాదంలో పడేస్తుంది. బెర్లిన్ ‘రేవ్ కల్చర్’ నేపథ్యంలో సాగే వారి వ్యవహారం, నీలా స్వీయ-ఆవిష్కరణకీ, స్వీయ-విధ్వంసానికీ కారణమవుతుంది. విషపూరితమైన ఈ సంబంధం లోని శక్తి అసమతుల్యతని; దాని ద్వారా నీలా ఎలా అణచివేయబడిందో చిత్రీకరించడానికి అబెర్ వెనుకాడలేదు. ఈ సంబంధం చక్రీయమైనది, కొన్నిసార్లు నిరాశపరిచే విధంగా ఉంటుంది, ఇతరుల అంచనాలకు అతీతంగా తనను తాను నిర్వచించుకోవడానికి నీలా చేసే పునారావృత ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది.

అయినప్పటికీ, నవలో కథనాత్మక ప్రేరణ ఉన్నప్పటికీ, ‘గుడ్ గర్ల్’ సులభమైన పరివర్తనని ప్రదర్శించే నవల కాదు. నీలా కథ నిజమైన ప్రారంభంలా అనిపించే విధంగా పుస్తకం ముగుస్తుందని విమర్శకులు గుర్తించారు – ఆమె నిర్ణయాత్మక మార్పు క్షణాల వద్ద నవల ముగుస్తుంది, దాంతో అసంపూర్ణంగా పూర్తయిన భావన పాఠకులకు కలుగుతుంది. ఈ రకమైన నిర్మాణాత్మక ఎంపిక కొంతమందిని నిరాశపరచవచ్చు, కానీ ఇది వాస్తవికత పట్ల రచయిత్రి నిబద్ధతను ప్రస్ఫుటం చేస్తుంది: ముఖ్యంగా నీలా వంటి చిన్న, సంఘర్షణ నిండిన వ్యక్తికి, మారే ప్రక్రియ అరుదుగా – ఒకే సంవత్సరంలో లేదా నవల వ్యవధిలో సాధ్యమవుతుంది లేదా పూర్తవుతుంది.

పుస్తకం అంతటా అవమానం, వాంఛ లోని రాజకీయాలు ఇతివృత్తాలుగా ఉన్నాయి. తన ఆఫ్ఘన్ వారసత్వాన్ని జర్మన్ పెంపకంతో, తన కళాత్మక ఆశయాలను తన కుటుంబ అంచనాలతో సమన్వయం చేసుకోవడానికి నీలా చేసిన పోరాటం, కపటం లేని నిజాయితీతో వ్యక్తీకరించబడింది. అవమానపు మూలాలు ఎలా లోతుగా పరిణమిస్తాయో; సహవాసం, ప్రేమ, కళాత్మక వ్యక్తీకరణల అవసరం వాటిని ఎలా నయం చేయగలవో, ఏ రకంగా హానికారకమో రచయిత్రి అన్వేషిస్తారు. తమకంటూ ఓ ఇంటిని ఏర్పాటు చేసుకోడంలో అలసిపోయిన వారికి, సాన్నిహిత్యం కోసం ఆరాటపడేవారికి కూడా ఈ నవల ఒక భావగీతం.

చివరగా, ‘గుడ్ గర్ల్’ నవల దాని భావోద్వేగ లోతుకి, కవితాత్మక భాషకి, అస్తిత్వపు సూక్ష్మ అన్వేషణకు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ నవలలోని కథానాయికని ఎల్లప్పుడూ ఇష్టపడకపోవచ్చు, కానీ ఆమె లోని వైరుధ్యాలు, దుర్బలతలు ఆమెను ఓ బాధాకరమైన వాస్తవ యువతిగా నిలుపుతాయి. అబెర్ తొలి నవల – యువత, కళ, ఆమోదించబడాలనే తీవ్ర వాంఛలపై అద్భుతమైన అభిభాషణ. ఈ నవల అరియా అబెర్‌ను సమకాలీన కాల్పనిక రచయితలలో శక్తివంతమైన కొత్త స్వరంగా నిలిపింది.

***

Book Title: Good Girl
Author: Aria Aber
Published By: Bloomsbury Publishing
No. of pages: 358
Price: ₹ 699/- Paperback
Link to buy:
https://www.amazon.in/Good-Girl-Aria-Aber/dp/1526679043
https://www.amazon.in/Good-Girl-Shortlisted-Womens-Fiction-ebook/dp/B0DL9YSBCL/

Exit mobile version