@మనోగతం@
ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నసాహిత్య ప్రక్రియ లేఖాసాహిత్యం.
నా ప్రైమరీ స్కూలు రోజుల్లో అసలు ఉత్తరం ఎలా రాయాలో బడిలో మాష్టారు నేర్పారు. సెలవు చీటీ రాయటం, ఉద్యోగానికి దరఖాస్తు లేఖ రాయటం లాంటివేవో నేర్చుకున్నానప్పుడు.
ఏ వ్యక్తి పట్లనైనా లేదా ఏ రచన పట్లనైనా స్పాంటేనియస్‌గా కలిగే పరిమళ భరిత పుష్ప గుచ్చాల్లాంటి భావాలు లేదా అసంకల్పిత అద్వితీయ స్పందనలు మనసు మడతల్లో నలిగి బందీ అయి మాటలు పెగలక మూగబోతే క్రమేపీ వాటి సుగంధం కోల్పోతాయి. సత్వరమే ఆ సంకెళ్ళు విడగొట్టి అక్షర సౌరభాలు విరజిమ్మేట్టుగా పదాల రెక్కలు విప్పదీసి ఆస్వాదయోగ్యమైన వాక్యాలుగా కాగితం పైన పేర్చి లేఖారూపం ఇస్తే…?
ఆ లేఖను అందుకున్న హృదయం రసామృతం అవుతుంది.
దూరాలు దగ్గరవుతాయి. బంధాలు చిక్కబడతాయి.
ఒక అభిమానికో, స్నేహితునికో, ప్రియునికో, భర్తకో, సోదరునికో… చివరాఖరకు కడుపున పుట్టిన పిల్లలకో లేఖలు రాయగలగటం, మన మనోగతాన్ని వ్యక్తపరచ గలగటం అదృష్టమనే చెప్పాలి.
ముఖ్యంగా ఎఫెక్టివ్‌గా ఇంప్రెసివ్‌గా ఎదురుపడి మాట్లాడలేని నాలాంటి వాక్కు హీనులకు ఉత్తరం ఓ వరమనే చెప్పాలి.
దురదృష్టవశాత్తూ లేఖలు రాసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. నా నుండి దూరంగా నివసించే, నేను లేఖలు రాయగలిగే అనుబంధీకులు నాకు ఎవరూ లేరు.
మంచో చెడో ఒకసారి ఆ అవకాశం వచ్చింది. దొరికిన ఒక్క అవకాశాన్ని తత్ఫలితాలోచన లేకుండా సంపూర్ణంగా ఉపయోగించుకున్నాను.
అది నాకు నవలా పఠనం వ్యసనం అయిన తరుణం… కలలు కనటం పరిపాటి అయిన కాలం. వయసుతో పాటు సమపాళ్ళలో మెదడు ఎదగక లోకజ్ఞానం కరువై ఆలోచనలు లాజిక్కుకి అందని దుస్థితిలో వున్న సమయం. యద్దనపూడి నవలా నాయకులు కలగాపులగంగా కలల్లో కల్లోలం సృష్టిస్తూ కలకలం రేపుతున్న సందర్భం.
అప్పట్లో సున్నితమైన భాషలో మృదువైన భావాలను అంతే మార్దవంగా జీవితంలో నుండి చేది ఎంతో సహజసిద్ధంగా కథల రూపంలో అలవోకగా వెన్నెల పిండార బోసినట్టు ఆరబోసే ఒక రచయిత సాహిత్యంలో నేను తలమునకలయ్యేదానిని. అతని కలం నుండి జాలువారే సుందర అక్షరాల సుమధుర భావాల కూర్పుకు తాదాత్మ్యం చెందుతూ అతని నవలల్లోని నాయకులలో అతనినే ఊహించుకుంటూ తబ్బిబ్బవుతుండే దానిని. యద్దనపూడి నవలా నాయకుల సరసనే ఈ నవలా రచయితా నా మనో పీఠాన్ని అధిష్టించాడు.
ఏ పుస్తక పరిచయంలోనూ, ఏ పుస్తకం అట్ట వెనుకా కూడా అతను ఏనాడూ తన చిత్రం పెట్టే వాడు కాడు. ఎలా వుంటాడో కూడా ఊహకందని ఆ రచయితను అతను సృష్టించిన ప్రతీ నాయకునిలోనూ ఊహించుకోవటం నాకు అలవాటై పోయింది. ఒకసారి నేను చదివిన ఒక నవలలోని ఒక పాత్ర నన్ను వెంటాడగా ఒక పాఠకురాలిగా విభిన్నమైన భావోద్వేగాలకు లోనయి తమాయించుకోలేక ఆ పుస్తకంలో ఇచ్చిన అతని అడ్రసుకు ఒక లేఖ రాసాను.
అదే నేను నా జీవితంలో రాసిన తొలి లేఖ.
నన్ను అబ్బుర పరుస్తూ తిరుగు టపాలో ఎంతో ఆత్మీయంగా అతని నుండి జవాబు. నా చేతి వ్రాత, నేను వెలిబుచ్చిన భావాలు ఎంతో బావున్నాయంటూ ప్రశంసిస్తూ రాసిన ఆ ప్రత్యుత్తరాన్ని అందుకున్న నా ఆనందానికి అవధులు లేవు.
ఆ ప్రశంసలకు మురిసిన నేను మళ్ళీ మరో ఉత్తరం రాయాలని ముచ్చట పడ్డాను.
ఏమి రాయాలి… ఏ నెపంతో రాయాలి..?
అప్పటికప్పుడు అర్జంటుగా అతని మరి కొన్ని ఇతర రచనలు కొన్నాను. ఎంతో ఏకాగ్రతతో పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థిలా అతని రచనల పఠనం మొదలెట్టాను. నేను చదివే అతని కథ నా పరీక్షా విషయం. నేను అతనికి రాయబోయే ఉత్తరం నా పరీక్షా పత్రం. అతను తిరిగి రాసే జవాబులో అతని మెచ్చుకోలు మోతాదు నా ఉత్తీర్ణతను నిర్ణయించే కొలమానం. అలా నిరంతర విద్యార్థినై నిత్య పరీక్షలకు అలవాటు పడిపోయాను.
నా లేఖలు ప్రత్యేకంగా వుండేలా విశిష్టమైన లేత గులాబీ రంగు లెటర్ ప్యాడ్ వాడేదానిని. ఆ లెటర్ ప్యాడ్ పైన పూల బొకేలతో పాటు జీవన తత్వం ప్రేమ తత్వం కలగలిపిన అద్భుతమైన కోట్స్ వుండేవి. ముత్యాల సరాలు పేర్చినట్టుగా అక్షరాలను మురిపెంగా చెక్కి ముదురు గులాబీ ఎన్వలప్లో పెట్టి పోస్ట్ చేసేదానిని. నేనెంత ప్రత్యేకతను కనబరిచినా అతను మటుకు పది పైసల పోస్టు కార్డే రాసేవాడు. చీమల బారులా సన్నటి చిన్న క్రిక్కిరిసిన అక్షరాలతో దగ్గర దగ్గర లైనులతో ఒక పెద్ద వ్యాసమంత విషయం ఆ చిన్ని పోస్టు కార్డులో ఇరికించి రాసేవాడు. అక్షరాల కూర్పు, స్పష్టతలో మటుకు ఏ లోపమూ వుండేది కాదు.
నాలో మంచి భాషా పటిమ, భావ ప్రకటనా కౌశలము వున్నాయని పొగిడితే సిగ్గుల మొలకనయ్యేదానిని. నా ప్రతి లేఖలో నేను రాసే విషయం అతనికి ఒక కొత్త కథకు స్ఫూర్తిని ఇస్తోందంటే గర్వపడేదానిని.
కథల్లో విషయ చర్చే నేపథ్యంగా ఉద్విగ్న భావ ప్రవాహంతో లేఖలు యేరై పారాయి మా మధ్య. అలా సుదీర్ఘ కాలం మా కలం స్నేహం కొనసాగింది.
నిజానికి పెన్ ఫ్రెండ్షిప్ వెనుక నాకు ప్రత్యేక ఉద్దేశ్యాలంటూ ఏమీ లేవు. అదొక జోష్. కాకపోతే ఒక అద్భుతమైన ఊహాజనిత నాయకుడితో నా కలం స్నేహం కొనసాగుతోందన్న ఊహే నాకు మనోరంజకంగా వుండేది.
అతనెలా ఉంటాడన్నది ఒక మిస్టరీ. మిస్టరీలంటే హిస్టరిక్గా ఊగిపోయే ప్రాయమది. ఉత్తరాల ట్రాన్స్‌లో జోగుతూ ఆ ఉత్తరాల వెనుక ఓ ఆరడుగుల అందమైన ఆజానుబాహుని ఊహిస్తూ కాలం కొంత కాలం ఉత్సాహంగా పరుగులు తీసింది.
కాలక్రమేణా నా కలం స్నేహం కాస్తంత ప్రగతి సాధించి నేను అతనిని మా ఇంటికి విందుకు ఆహ్వానించే వరకూ ఎదిగింది. మొదటిసారిగా అతనిని చూస్తున్నానన్న ఊహే నన్నెంతో ఉద్వేగానికి గురి చేసింది.
మేమేమీ ప్రేమికులం కాదు. అంత కాలంగా నిరాటంకంగా సాగిన లేఖా సాహిత్యంలో ఎప్పుడూ ఒక్క అక్షరం కూడా అపశ్రుతి పలకలేదు. మా లేఖల్లో కథా చర్చ, పరస్పర స్నేహాభిమానమే తప్ప అంతకు మించి ఏ ప్రేలాపనలు లేవు. అటువంటప్పుడు ఎందుకు నాలో కలవరం…
ఎంతో ప్రేమాభిమానాలతో ప్రత్యేక వంటకాలు చేసాను. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్న ఏదో సామెత గుర్తు రాగా ఇల్లంతా అందంగా తీర్చి దిద్దాను. అతనిని విపరీతంగా అభిమానించే నా మరో ఇద్దరు స్నేహితురాళ్ళను కూడా విందుకు ఆహ్వానించాను.
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్…
వీలయినంత అందంగా అలంకరించుకున్నాను. ఇంట్లో తాలింపుల మసాలాల వాసనలేవీ తెలీకుండా ఇల్లంతా అత్తరు చిలకరించాను. అత్తరు గుభాళింపు ఆలోచనలతో తెలియని భావోద్వేగంతో ఎదురు చూపులు ఆరంభమయ్యాయి.
హీరోగారి కోసం హీరోయిన్ ఎదురుచూపులంటూ నా స్నేహితురాళ్ళు వేళాకోళమాడారు. పిచ్చి వాగుళ్ళు కట్టిపెట్టమని వాళ్ళను కసురుకున్నాను.
ఆ ఆశనిపాతపు ఘడియ రానే వచ్చింది. గేటు తీస్తూ నా ఊహలకు అతీతమైన ఒక మనిషి రూపం ప్రత్యక్షమయ్యింది. ఆ సమయంలో అతను ఎవరై వుండవచ్చునని మేము ముగ్గురమూ నోళ్ళు వెళ్ళబెట్టాము.
“మీలో సౌజన్యగారు….” అంటూ ప్రశ్నార్ధకంగా మా వంక చూసాడు.
చామనఛాయగా, పొట్టిగా, లావుగా, కుండలాంటి పొట్టతో, కాటుక పులుముకున్నట్టు కళ్ళ చుట్టూ దళసరి కారు నలుపు వలయాలతో వున్న ఆ రూపాన్ని చూసి ఖంగు తిన్నాము. చాలా సాదా సీదా బట్టల్లో, కాళ్ళకు అరిగిపోయిన చెప్పులతో, భుజానికి తగిలించుకున్న గుడ్డ సంచితో వున్న అతని నుండి బిగ దీసుకు పోయిన దృష్టిని మరల్చుకుని సంస్కారాన్ని మేల్కొలిపి అతనిని సాదరంగా ఆహ్వానించాను.
భోజనం వడ్డిస్తున్నానన్న మాటే కాని నా మనసక్కడ లేదు. నా స్నేహితురాళ్ళు అతనితో ఏదో సాహిత్య చర్చ చేస్తున్నారు కాని నా మెదడుకి ఏమీ ఎక్కటం లేదు. ఎంతో గ్రహణ శక్తి కలిగిన, మైండ్ రీడింగులో ఆరితేరిన అతను నా మాటల్లో నిరుత్సాహం గమనించాడు. నా కళ్ళల్లో నిరాశను చదివాడు. అతను జీవితాన్ని కూలంకుషంగా చదివిన స్థితప్రజ్ఞత కలిగిన విజ్ఞాన ఖని. చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు.
అసలు నా నిరాశకు కారణం ఏమిటి… అతనికీ నాకూ సంబంధమేమిటి… అతను ఎలా వుంటే నాకు ఒరిగేదేమిటి. అతనిని చూసిన నాలో నిరుత్సాహమెందుకు. అతను నేను ఊహించుకున్నంత అందంగా లేకపోవటమా… లేక జీర్ణించుకోలేనంతటి అతని పేదరికపు ప్రదర్శనమా…
అంటే నా ప్రాధాన్యత సౌందర్యానికి, స్థితిగతులకేనా…?
కాదు. కానే కాదు. నా ఆలోచనల్లోనే క్లారిటీ లేదు.
లేకపోతే అంతకాలంగా ఎన్నో విషయాల పైన ఎంతో స్నేహపూర్వకంగా చనువుగా చర్చించుకున్న మా దగ్గరితనంలో అమాంతం ఒక్కసారిగా ఎడం ఎందుకు ఏర్పడుతుంది. ఊహించని దిగ్భ్రమ వలన నాకు కలిగిన షాకు కారణంగానా…
అతనికి వీడ్కోలు ఇచ్చిన తరువాత ఎంత మానసికోద్వేగానికి గురయ్యానంటే నాలో చెలరేగిన భావ పరంపరలో యాదృచ్ఛికంగా తన్నుకొచ్చిన ఒక భావావేశం ఆ రాత్రి కథారూపం దాల్చింది. అది స్వాతిలో ప్రచురితమైన నా తొలి కథ. నన్ను రచయిత్రిగా అరంగేట్రం చేయించిన నేపథ్యం.
కొసమెరుపు ఏమిటంటే నా కథను చదివి, దాని నేపథ్యం ఎరిగిన ఆ రచయిత నా కథనానికి, నా శైలికి నన్ను మనస్ఫూర్తిగా అభినందించటం.
ఇంకా విశేషమేమిటంటే దాదాపు పాతికేళ్ళ తరువాత నా తొలి నవల ఆవిష్కరణ సమాచారం తెలిసి ఆ సభకు అతను వచ్చి నాకు పునర్దర్శనం ఇచ్చి నన్ను హృదయపూర్వకంగా అభినందించటం.
రాతల్లో దొరికే అతి కొద్దిమంది ఆదర్శ రచయితల్లో అతనొకరు. నన్ను రచయిత్రిగా మలిచిన ఆ సహృదయ ఆదర్శ రచయితకు నేను ఆజన్మాంతమూ ఋణపడి ఉంటాను.
(మళ్ళీ కలుద్దాం)

ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
23 Comments
Sagar
ఊహ వేరు, వాస్తవం వేరు అనే విషయానికి చక్కని ఉదాహరణ మీ రచన మేడమ్ . ఎన్నోరోజుల తరువాత మీ రచన ఆవిష్కారానికి వారు వచ్చారు అంటే అది మీ పట్ల వారికున్న గౌరవం. మీకు నా అభినందనలు మరియు ఇలాంటి మంచి రచనలు అందిస్తున్నందుకు ధన్యవాదములు మేడమ్
Jhansi koppisetty
Thank you Sagar garu
మంజు
చాలా బాగా మెుదలు పెట్టారు…
Jhansi koppisetty
ధన్యవాదాలు మంజుగారూ

డా.కె.ఎల్ వి.ప్రసాద్
లేఖల(ప్రేమ లేఖలే కానక్కర లేదు)ప్రభావం మనిషి మీద చాలా ప్రభావం వుంటుంది.అయితే అది లే ఖ రాసేవాళ్ల మీద,దానిని అందుకునే వాళ్ల మీదా ఆధార పడి వుంటుంది.
లేఖల విలువ నాకు బాగా తె లుసును.అప్పుడే కాదు,ఇప్పటికీ నాకు లేఖలు రాసే అలవాటు పోలేదూ.
తెలియని ఆడ-మగ,మధ్య ఈ లే ఖాయ ణం
కొన సాగినప్పుడు,ఇరువైపుల వూహల గుసగుసలు
తప్పవు.తెలియని ఉట్కంట త ,క్రమంగా మనసును
పెనవేసుకు పోతుంది.
కొన్ని పరిచయాలు జీవితంలో పెను మార్పులు తీసుకు వస్తాయి.ఆ మార్పు జీవితానికి ఉపయొగ పడే ద యితే…ఇలా జీవితాంతం గుర్తుంచుకునేలా మిగిలిపోతుంది.
ఇలాంటి జ్నాపకాలు చాలా మందికి వుంటాయి గాని
హృదయం విప్పేవాళ్లు బహు తక్కువ.ఝాన్సీ గారు
ఈ విషయం లో అభినంద నీయులు.
Jhansi koppisetty
డాక్టర్ ప్రసాద్ గారూ, బాగా సెలవిచ్చారు… ధన్యవాదాలండీ

వేణుగోపాల నాయుడు
ఊహలు ఆశలైతే, ఆ ఊహల ఆశలు తిరగబడితే కలిగే నిరాశ మానసిక ఆందోళన, కళ్ళకు కట్టారు.ఊహాలోకం లో బ్రతకడం అచేతనం మాత్రమే. చేటనావస్తలో చేసే ఆలోచనలు, చర్యలు మానసిక,వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. పడుచు వయసు పిల్లలు తెలుసుకోవలసిన విషయాలు పరోక్షంగా సూత్రీకరించారు. గువ్వ కేక బాగుంది.
Jhansi koppisetty
మీ అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలండీ వేణుగోపాల్ గారూ…..
spmahaboobhussain18@gmail.com
ఒక వ్యక్తికి మరో వ్యక్తిపై కలిగే అభిప్రాయం
ఎలాంటిదైనా ఆ ఒక వ్యక్తి వ్యక్తిత్వం పై ఆధారపడి ఉంటుంది.భావాలు పంచుకోవడానికి
లేఖ సులభమైన మార్గం.సహజమైన అంశాన్ని ఎంతో సున్నితంగా చెప్పారు రచయిత్రి.
వ్యక్తీకరణ ఎంత ఉద్వేగమో స్వీకరణ కూడా
అంతే ఉద్వేగంతో ఉన్నప్పుడే ఆ భావం స్నేహ
రూపం దాల్చగలుగుతుంది.
Jhansi koppisetty
ధన్యవాదాలు మెహబూబ్ హుస్సేన్ గారూ…
Sambasivarao Thota 9shiva@gmail.com
Jhansi Garu!
Chaalaa chakkagaa vivarinchaaru..
Chaalaa Baagundandi..
Jhansi koppisetty
సాంబశివరావుగారూ ధన్యవాదాలండీ..
బసవరాజు వేణుగోపాల్
లేఖా సాహిత్యం… చాలా బాగా రాశారు.. మీతొలి నవల ఆవిష్కరణ కు వచ్చారంటే నేను చూసే ఉంటాను మేడం






Jhansi koppisetty
చూసి వుండొచ్చు… గీతా వెల్లంకి వారిని గుర్తించి వెళ్ళి పలకరించారు సార్


చిట్టె మాధవి
ఊహలోని భావాలన్నీ లేఖలై ఆసాంతం ఇంకో ఊహకు రూపం ఇస్తే ఇంత అద్భుతమైన రచనగా రూపొందుతుందని మీ రచనా శైలి తో నిరూపించారు ఝాన్సీ..అభినందనలు
Jhansi koppisetty
మాధవీగారూ.. ధన్యవాదాలండీ
విజయ్
ఝాన్సీ గారు చాలా చక్కగా రాశారు తొలిసారి చూసినప్పుడు ఊహించుకున్నట్టు లేరు కదా అని కొంచెం సేపు అనుకున్నా, తరువాత ఊహ మరియు నిజం వేరు వేరు అని చక్కగా చెప్పారు. రూపానికి మనసుకు తేడా ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చెప్పారు ఇలాంటి మరెన్నో మంచి రచనలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను.
Jhansi koppisetty
విజయ్ గారూ ధన్యవాదాలండీ
విజయ్ కుమార్
ఝాన్సీ గారు చాలా చక్కగా రాశారు తొలిసారి చూసినప్పుడు ఊహించుకున్నట్టు లేరు కదా అని కొంచెం సేపు అనుకున్నా, తరువాత ఊహ మరియు నిజం వేరు వేరు అని చక్కగా చెప్పారు. రూపానికి మనసుకు తేడా ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చెప్పారు ఇలాంటి మరెన్నో మంచి రచనలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను.
Jhansi koppisetty
Thank you Vijay garu
మొహమ్మద్. అఫ్సర వలీషా
అద్భుతమైన రచనా శైలిమీది ఝాన్సీ గారు. మీ రచనలు చదవడం మొదలు పెట్టగానే చాలా ఆద్యంతం సక్తికరంగా పాఠకులను ఇట్టే కట్టి పడేస్తాయి.ఉన్నది ఉన్నట్లు వ్రాయడం చాలా గొప్ప కళ మీది.చక్కని కోఇన్సిడెంట్ కదా అతను మంచి రచయిత కాబట్టి మీరో మంచి రచయిత కావడానికి కారణం అయ్యారు.మీ లేఖనే అడ్వాన్స్ గా తీసుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. ఏమైనా మీ అనుభవం అందరికీ ఓ ఆదర్శ ప్రాయం, చక్కని కధానికం.ఇంత మంచి రచనా వ్యాసంగాలను అంద చేస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఝాన్సీ గారు













Jhansi koppisetty
మీ ఆత్మీయస్పందనకు ధన్యవాదాలు డియర్ వలీషా
Mannem sarada
జీవితంలో అనేకానేక సంఘటన లు ఎదురవుతుంటాయి. కొన్ని చేదుని పంచితే మరికొన్ని జ్ఞాపకం వచ్చినప్పుడు సంతోషాన్ని కలిగిస్తాయి. వాటిని అందంగా మలచి అక్షరాలతో జాజి మాలలు కట్ట గల నేర్పు నీ కలానికి వుంది. . నీ అనుభవం గమ్మత్తుగా వుంది. అభినందనలు