Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గోమాలక్ష్మికి కోటిదండాలు-5

గోమాత గురించి మహాభారతంలో తెలియచేసిన వివరాలతో ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.

రంతిదేవుడు యజ్ఞపశువులై గోలోకానికి వెళ్లిన గోవులు – అమ్మాయిల రూపంలో ఉన్న ఆవులు చెప్పినట్లు మిగిలిన ఆవులు రంతిదేవుడి దగ్గరికి వెళ్లి “మాకందరికి మంచి గతి కలిగించు. మమ్మల్ని నీ యజ్ఞంలో పశువులుగా బలి ఇయ్యి” అని మనిషి భాషలో ప్రార్థించాయి.

అది విని రంతిదేవుడు “మిమ్మల్ని చంపి నేను ఉత్తమగతి ఎలా పొందుతాను” అని అడిగాడు.

ఆవులు రాజుతో “సూర్యుడితో సమానమైనవాడా! ఈ పనికోసం నిన్ను కలవమని జ్ఞానులే మమ్మల్ని పంపారు. కాబట్టి దేవతలు కూడా గౌరవించే గతి నీకు సిద్ధిస్తుంది. నీ కీర్తి లోకాల్లో విస్తరిస్తుంది” అన్నాయి.

ఆవుల మాటలు విని  రాజు “మీలో ఒక్క ఆవైనా చావుకి వెనుకాడితే..  వెంటనే నా యజ్ఞం ముగిసిపోతుంది. ఆ ఒడంబడికని మీరు అంగీకరించండి” అన్నాడు.

రాజు మాటలకి ఆవులు ఒప్పుకున్నాయి. రంతిదేవుడు పెక్కు ఆవులమందల్ని విధిననుసరించి చంపి యజ్ఞపు అగ్నిలో హోమం చేశాడు.

ఒక రోజున ఒక ఆవు తన చిన్న దూడకి పాలిస్తూ “అయ్యో బిడ్డా! దయలేనివాళ్లు చంపడానికి వస్తారు. నువ్వెక్కడికి వెడతావు?” అని అడిగింది.

గొప్ప మహిమ కలవాడు కనుక ఆ రంతిదేవుడు ఆవు మాట విని యాగాన్ని ఏ లోపం లేకుండా ముగించాడు. అలా కొన్ని ఆవులు మిగిలిపోయి భూమి మీదే ఉండిపోయాయి.

యజ్ఞంలో ఉపయోగాన్ని పొందిన ఆవులు గోలోకానికి వెళ్లాయి. వాటి చర్మాలూ, ఎముకలూ ఒడ్డులుగా; వాటి నెత్తురు, మెదడులోని తడి ఏరై ప్రవహించి చర్మణ్వతి అనే పేరుతో ఒప్పింది.

రంతిదేవ మహారాజు యజ్ఞఫలం పొంది ఇంద్రుడితో చెలిమి కలిగి సుఖంగా స్వర్గంలో మంచి కీర్తి పొందుతూ ఉన్నాడు. ఫేనవుడు (సుమిత్రుడు) కూడా గోలోకంలో శాశ్వతంగా నివసించాడు.

ఈ ఫేనవుడి కథని బదరికాశ్రమంలో శ్రీ వేదవ్యాసుడు నారాయణమునికి ప్రీతితో చెప్పాడు. ఆ మహానుభావుడు గో యజ్ఞం చెయ్యాలని అనుకుని దీన్ని గురించి అందరికీ చెప్పాడు. అది లోకంలో క్రమంగా అందరికీ తెలిసింది.

ఎంతో పుణ్యమైందీ, పావనమైందీ అయిన దీన్ని చదివినా, విన్నా పాపాలు కలగవు.  ధర్మరాజుని కూడా గోవుల విషయంలో గొప్ప భక్తి కలిగి ఉండమని, గోవుల్ని సేవించమని, ఆ విధానం ఎటువంటిదో ఎప్పుడూ చదువుతూ, వింటూ ఉండమని భీష్ముడు చెప్పాడు.

భీష్ముడు చెప్పింది విని ధర్మరాజు “పుణ్యాత్మా! గోవుల మహిమ ఇంత విన్నా కూడా ఇంకా నా మనస్సు తృప్తిపడలేదు. నీ మాటలతో మరింతగా తెలుసుకోవాలని ఉంది. దయతో నాకు చెప్పు” అని ప్రార్థించాడు.

భీష్ముడు పట్టరాని సంతోషంతో “నాయనా! మనవడా! నువ్వు ఆవుల గొప్పతనాన్ని గురించి నన్ను అడిగినట్లే, శుకుడు తన తండ్రి వ్యాసుణ్ని అడిగాడు. వ్యాసుడు శుకుడికి ప్రేమతో చెప్పిన మాటలు చెప్తాను, విను” అన్నాడు.

వ్యాసమహర్షి చెప్పిన గోమహిమ– సృష్టిలో ఉన్న కదలని పదార్థాలు, కదిలే ప్రాణులు అన్నింటి చక్కని స్థితి అవుల్ని ఆశ్రయించినందువల్లే కలుగుతోంది. ఆవులు బ్రహ్మకి తొలి బిడ్డలు. అంతేకాదు, సిద్ధులు, సాధ్యులు మొదలైన దేవయోని గణాలకి కూడా ఆవులు తల్లులు.

ఈ విషయం తెలిసినవాడు బ్రహ్మలోకం, ఆవులోకం మొదలైన లోకాలకి సొంత ఇంటికి వెళ్లినట్లు వెడతాడు. అత్యుత్తమ గతిని కోరేవాళ్లు కాలితో, పిడికిలితో, కర్రతో, మాటతో, మనస్సుతో కూడా ఆవుని బాధించకూడదు.

ఇది ఆత్మను పవిత్రం చేసేది, ఉత్తములు సేవించవలసినది బ్రహ్మ చెప్పిన విద్య. ఆవునాశ్రయించి దేవతలు తక్కిన అన్ని ప్రాణులకంటే గొప్పవాళ్లయ్యారు. కాబట్టి గోవుల మహిమకి హద్దు ఉండదు.

ఆవుల కంఠనాదాలు వీణా, కాహళ, వేణు నాదాల వంటివి. ఆ ధ్వని అతి స్వచ్ఛమైనది. దాన్ని వినడమూ, చెప్పుకోడమూ తరగని పుణ్యాన్ని ఇస్తాయి.

పాలు, పెరుగు, నెయ్యి అమృతస్వరూపాలు కనుక దేవతల్ని తృప్తిపరిచే యజ్ఞకార్యాలు ఆవుల పాల వల్ల మాత్రమే సాధ్యాలవుతున్నాయి.

వేదాలూ, జ్ఞాన విషయాలైన ఉపనిషత్తులూ గో స్వరూపాలే అని బ్రహ్మ చెప్పాడు. ఆవుల్ని భక్తితో పూజించడం ధర్మానికి చివరి మెట్టు. ఈ వాక్యాలు బ్రాహ్మణుల సమీపంలో చదివేవాడు పుణ్యమూర్తి అవుతాడు. విన్నవాళ్లు అప్పటికప్పుడు పాపవిముక్తి పొందుతారు.

ఆవు నెయ్యి లోపలికి పుచ్చుకునీ, ఆవుపేడ కలిసిన నీళ్లల్లో స్నానం చేసీ, మహాభక్తితో ప్రతిదినమూ గోమతీ పఠనం చేసే బ్రాహ్మణుడి దగ్గరికి పాపాలు చేరవు.

దేవతలు, మహామునులు గోమతిని పఠించిన పుణ్యం వల్లే ఆయా గొప్ప స్థితుల్ని పొందారు. దాన్ని పఠించడం వల్ల సంపదా, శత్రువుల్ని జయించడం, అభివృద్ధీ, పుత్రులు ఎక్కువగా కలగడం సిద్ధిస్తాయి. వాళ్ల చుట్టాలకి కూడా పాపాలు నశిస్తాయి. ప్రయాణాల్లో క్రూరమృగాల బాధా, దొంగలబాధా తప్పిపోతాయి – అని చెప్పాడు వ్యాసుడు.

Exit mobile version