తాళికట్టు శుభవేళ..!!
ఈ పేరుతో ఒక పాత సినిమా పాట ఉన్నట్టు గుర్తు. పేరు వినడమే గాని సినిమా కథ తెలియదు, అందులోని పాటలూ గుర్తుకు లేవు. పెళ్లి మీద పెళ్లి, మళ్ళీ పెళ్లి, అనే పాత సినిమాలు కూడా ఉన్నట్టు గుర్తు. మళ్ళీ పెళ్లి అంటే, మరోసారి పెళ్లి అని, లేదా రెండో పెళ్లి అని అర్థం చేసుకోవచ్చు. పెళ్లి మీద పెళ్లి చేసుకున్నా, రెండో పెళ్లి చేసుకున్నా ఆ పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అలాంటి కారణాలు ఎదురుపడడానికి అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా కొన్ని కల్పించుకున్నవి, మరికొన్ని మనకు సంబంధం లేకుండానే మనల్ని ఇబ్బంది పెట్టేవి.
‘పెళ్లంటే నూరేళ్ళ పంట..’ అనేవారు. ‘వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది’ అని బైబిల్ (హెబ్రీ 13:4) చెబుతున్నది. అంటే పెళ్లి అనే తంతుకు అంత విలువ వున్నది. ఒకప్పుడు తెలిసిన కుటుంబాల మధ్య, పెద్దల సమక్షంలో పెళ్లి సంబంధాలు కుదిరేవి. పూర్తి వివరాలు సేకరించి, నచ్చితేనే గాని సంబంధాలు కుదిరేవి కావు. దీనికి తోడు పెళ్లి అయిన తరువాత, మన భారతీయ సంప్రదాయం ప్రకారం, ‘తాళి’ని పవిత్రంగా భావించేవారు. భార్యను భర్త, భర్తను భార్య ప్రేమించుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటివి బాగా ఉండేవి. అంతమాత్రమే కాకుండా సమాజంలో కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో, మంచి – మర్యాదలకు ఎంతో విలువనిచ్చేవారు. కొందరు సహజంగాను, మరికొందరు బలవంతంగాను, భర్తలపట్ల భయభక్తులతో మెలిగేవారు. అలాగే భర్తలు కూడా భార్యలను ప్రేమగా చూసేవారు. భార్యాభర్తల మధ్య అవగాహనా లోపం అప్పుడూ వుంది, ఇప్పుడూ వుంది, లేదంటే ఇప్పుడు కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. అంతమాత్రమే కాదు, ‘ఆడది ఆబల’, ‘ఆడది వంటింటి కుందేలు’ వంటి పదాలు చెల్లుబడి అయ్యేవి. అత్తింటి ఆరళ్ళు కూడా అధికంగా ఉండేవి. స్త్రీ ఆర్థికంగా అస్వతంత్రురాలు కావడమే దీనికి ప్రధాన కారణం కావచ్చు!
అలాగే ఒకసారి పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులు సైతం కష్టమైనా, నష్టమైనా అత్తింటివారితో సర్దుకుపోవాలి అని నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు వున్నా సర్దుకుపోయేవారు. ఎంతో నరక ప్రాయం అయితే తప్ప విడాకుల గురించి ఆలోచించే పరిస్థితి వచ్చేది కాదు. సకాలంలో పిల్లలు పుడితే వివాహబంధం మరింతగా బలపడేది. ఒక చింతలు లేని కుటుంబం ఉంటే అది పూర్తిగా ఆ ఇంటి కోడలు వ్యవహార శైలిమీద ఆధారపడి ఉండేది. స్త్రీల పక్షాన సమస్యలు కూడా వుండేవి గాని, బహుతక్కువగా ఉండేవి. అలా మొత్తం మీద వివాహ బంధానికి ఎక్కువ విలువ, ప్రాధాన్యత ఉండేవి. అందుకే ఆ రోజుల్లో వ్యవహారం విడాకుల వరకూ వచ్చిందంటే, అదొక పెద్ద సంచలనమే! ఇరుపక్షాలవారు జనావళికి దోషులుగా కనిపించేవారు. అలాంటి కుటుంబాలను జనం వింతగా చూసేవారు. అప్పట్లో భార్యాభర్తల మధ్య ప్రధాన సమస్య ‘వరకట్నం’ ఉండేది. అత్తమామల నుండి, భర్త నుండి, స్త్రీకి వరకట్నం అనేది, ప్రాణసంకటంగా ఉండేది. ఆ వేధింపులతోనే సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమయ్యేవి. దానికోసం ప్రభుత్వ పరంగా ఎన్ని శాసనాలు వచ్చినా వరకట్నం చికిత్స లేని పెద్ద జాడ్యంగానే మిగిలిపోయింది.
ఇప్పుడు రోజులు మారాయి. మహిళ వంటింటి నుండి బయట పడింది. పురుషుడితో సమానంగా, ఒక్కోసారి పురుషుడిని మించి ఉన్నతస్థాయి ఉధ్యోగాలు చేసే స్థాయికి ఎదిగింది. ఆమెకు ఆర్థిక స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభించాయి. అయితే ఇంటి పని, బయటి పని కలిసి తడిసి మోపెడయింది. ఇక్కడ పురుష అహంకారం సమస్యలకు ఆజ్యం పోసింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే (ముఖ్యంగా సాఫ్ట్వేర్ అయితే), మరింత జటిల సమస్యలు ఉత్పన్నమై, ఇంట్లో పని పంచుకునే విషయాల్లో తేడాలు వచ్చి, ‘నువ్వెంత?’ అంటే ‘నువ్వెంత?’ అనే పట్టుదలలు పెరిగి, చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకూ వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పైగా ఇందులో ఎక్కువశాతం ప్రేమ వివాహాలు, ఆ తర్వాత పెద్దలు ఏర్పరచిన వివాహాలూనూ. ఎంత, పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద ఉద్యోగం వెలగబెట్టినా, జీవితం అంటే ఏమిటో, ప్రేమ, సంసారం, కుటుంబం, వాటి విలువలు ఏమిటో తెలుసుకోలేని అజ్ఞానులుగా మారి నేటి యువత సమాజానికి ఒక క్లిష్ట సమస్యగా తయారయింది. కేవలం సంపాదనకు మాత్రమే విలువనిచ్చి, మిగతా విషయాలను అశ్రద్ధ చేయడం వల్ల, పెళ్ళైన పది రోజులకే విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతున్నది. ఓర్పు, సహనం నశించడం, పనికిరాని పట్టుదలలు పంతాలు-పట్టింపులు పెరగడం, భవిష్యత్తును గురించిన అవగాహన అసలు లేకపోవడం మూలాన, పండంటి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. ప్రస్తుతం, ఇక్కడ ఈ విషయాల్లో, ఆడ-మగ అనే తేడా లేనేలేదు, ఎవరూ తక్కువగా లేరు. విద్యావిధానంలో కేవలం పాఠ్య పుస్తకాంశాలకు తప్ప, జీవితానికి సంబంధించిన, మానవీయ అంశాలు కూడా లేకపోవడం ఈ సమస్యకు కారణం కావచ్చు. ఈ నేపథ్యంలో జరుగుతున్న నష్టాన్ని ఎవరూ గమనించక పోవడం, అంచనా వేయకపోవడం బాధాకర విషయం. ఒకప్పుడు సమస్యలను సృష్టించడంలో, యువకుల పాత్రనే ఎక్కువగా చెప్పుకునేవారు. కానీ,ఇప్పుడూ మేమూ ఉన్నామంటూ, యువతులు సైతం సమస్యలు సృష్టిస్తున్నారు, తెలియకుండానే తమకు తాము సమస్యలు సృష్టించుకుంటున్నారు. ఇది దురదృష్టకరం!
ఇలాంటి వాతావరణంలో నా అనుభవాన్ని కూడా ఇక్కడ ఉదాహరించవలసిన అవసరం వుంది. నాకు ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం అబ్బాయి, రెండవ సంతానం అమ్మాయి. ఇద్దరినీ నా స్థాయిలో క్రమశిక్షణలోనే పెంచాను. వాళ్ళు కూడా నా జీవన శైలిని అర్థం చేసుకుని, సద్వినియోగం చేసుకుని పైకి వచ్చారు. మొదట అమ్మాయికి ఘనంగా పెళ్ళి చేసాను. ఆమె ఆకాశవాణిలో ఉద్యోగం సంపాదించుకుని తన ఆనందమయ జీవితాన్ని గడుపుతోంది. తరువాత నాలుగు సంవత్సరాల తేడాతో అబ్బాయి పెళ్లి ఘనంగా జరిపించాను. ఇంచుమించు నా బంధువులని ఆత్మీయులనీ, నా శ్రేయోభిలాషుల్ని, మిత్ర పరివారాన్నీ ఎక్కువ సంఖ్యలో పిలిచాను.
పెద్ద సంఖ్యలో పెళ్ళికి అందరూ తరలివచ్చారు. ఇద్దరు పిల్లలకు తృప్తిగా, ఘనంగా పెళ్లి చేయగలిగానన్న ఆనందంలో మునిగిపోయాను. కొడుకు కోడలూ అమెరికా వెళ్లిపోయారు. అక్కడ వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారని, త్వరలోనే వారి సంతానాన్ని కూడా కళ్లారా చూస్తానని కలలు కన్నాను.
కానీ నా ఆనందం ఎంతో కాలం నిలవలేదు. మా కొడుకు సంసారిక జీవితం సజావుగా నడవడం లేదని చాలా ఆలస్యంగా తెలుసుకోగలిగాం. మేము ఎక్కడ బాధ పడతామోనని మా అబ్బాయి అంతా గోప్యంగా ఉంచాడు. తనకు తాను హింసించుకున్నాడు. ఆ అమ్మాయి తన స్వార్థం కోసం ఈ పెళ్లిని ఉపయోగించుకుంది. అబ్బాయి స్నేహితులతో భర్త మీద అర్థం పర్థం లేని అభియోగాలు రుద్దడం మొదలు పెట్టింది. దీనిని పెద్ద సమస్యగా చిత్రించి అబ్బాయికి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టింది, మాకు కూడా ఫోన్ చేసి భర్తపై అనేక నిందలు మోపింది. తల్లిదండ్రులను మా వద్దకు పంపి,వాళ్ళతో ‘విడాకులే’ సరైన మార్గమని తేల్చి చెప్పించింది. ఇద్దరి ఒప్పందంతో అమెరికాలోనే విడాకుల ఎపిసోడ్ ముగిసిపోయింది. అప్పటి మాబాధ వర్ణనాతీతం. నా శ్రీమతి డిప్రెషన్ లోకి వెళ్లినంత పనిచేసింది. విషయం గుర్తుకు వస్తే చెప్పలేనంత దుఃఖం పెల్లుబికి వచ్చేది.
తన బాధను పక్కన పెట్టి మమ్ములను ఓదార్చే పనిలో ఉండేవాడు మా అబ్బాయి. ఈ సందర్భంగా రెండవసారి అమెరికా (బోస్టన్) వెళ్లి నెలరోజులు బాబుతో వుండి వచ్చాము. విడాకుల తంతు అమెరికాలో ముగిసిపోయింది. అబ్బాయికి త్వరగా పెళ్ళిచేయాలని నా శ్రీమతి, మా అమ్మాయి ఆరాటం. కొంత వ్యవధి అవసరం అని నా వాదన. నా వల్ల త్వరగా పని కాదని వాళ్లకి అర్థం అయిపొయింది. మధ్యలో ‘కరోనా’ బాబుని స్వదేశానికి రాకుండా కట్టడి చేసింది. మేము మూగ వేదన లోనే తల్లడిల్లిపోయాము. మా అమ్మాయి మాత్రం తన ప్రయత్నాలు మానలేదు. ‘ఆన్లైన్ మాట్రిమోనీ’ ద్వారా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. ఆ విషయంలో వాళ్ళమ్మను మాత్రమే సంప్రదిస్తూ ఉండేది. గత సంవత్సరం మధ్యలో ఆమె ప్రయత్నాలకు ఫలితం లభించింది అనుకూలమైన సంబంధం చేతికి చిక్కినట్లు అయింది. వాళ్ళతో సుదీర్ఘ సంభాషణలు జరిపింది. ఇరు పక్షాలకు ఇద్దరూ నచ్చిన తర్వాత విషయం నా దృష్టికి తీసుకు వచ్చింది. అప్పటికి ఆ అమ్మాయి (పెళ్లి కూతురు) చెల్లితో, తల్లిదండ్రులతో అమెరికాలో వుంది. వాళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత అమ్మాయిని చూడడానికి వెళ్ళాము. మా అమ్మాయి ఇంటికి వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉండడం విశేషం. అమ్మాయిని చూడగానే నా మనసులో ఆమె పట్ల మంచి అభిప్రాయం ముద్రపడిపోయింది. నా కొడుక్కి సరిపడ భార్య దొరికిందని మనసులో యమ సంతోషపడిపోయాను.
అమ్మాయి తల్లిదండ్రులు కూడా నా కుటుంబంలో చక్కగా కలిసిపోయేవారిగా మొదటి పరిచయం లోనే తెలిసిపోయింది. తర్వాత ఒకరోజు వాళ్ళని కూడా మా ఇంటికి పిలిచాము. పనిలో పనిగా రిజిస్ట్రార్ ఆఫీసులో అమ్మాయి చేత పెళ్లి కోసం అప్లికేషన్ పెట్టించాము. విజయవాడ నుండి పెద్ద బావమరిది కూడా వచ్చాడు. మా గురించి మా కుటుంబం గురించి అమ్మాయి తల్లిదండ్రులకు తెలియజేశాము. వాళ్ళు ఎంత గానో తమ తృప్తిని వెలిబుచ్చారు. ముందు కలిసినప్పుడే చిన్న చిన్న సాంకేతిక సర్దుబాట్లు గురించి వియ్యంకుడు విజయకుమార్ గారు అమ్మాయి వాళ్లకి వివరణ ఇవ్వడం వల్ల మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకునే అంశాలేవీ తెరమీదికి రాలేదు.
పెళ్లి రోజు కూడా 29 – డిశంబర్ గా నిర్ణయించుకోవడం, తర్వాత అమెరికా నుండి రావడం, సోదరుడు, జిల్లా ట్రేసరరీ ఆఫీసర్ సహకారంతో, చాలా బాగా రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి జరిగి పోయింది.
మా కుటుంబానికి ఇదొక పెద్ద ఊహించని అనుభవం. అదే రోజు మధ్యాహ్నం అతి కొద్దీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో స్వగృహంలో, పాస్టర్ నిరంజన్ బాబు, మైకేల్ పాస్టర్, చిన్నాన్న కుసుమ వెంకటరత్నం గార్ల ఆశీస్సులతో రిసెప్షన్ జరిగింది. ఇక్కడ నేను ఎంత విశ్లేషణ చేసినా, ఈ ఎపిసోడ్‌కు ప్రధాన సూత్రధారి నా కూతురు నిహార కానేటి. కుటుంబానికి ప్రత్యక్షంగానూ, పరోక్షం గాను శ్లాఘనీయం. ఈ విధంగా నా పిల్లలు ఇద్దరూ ఆణిముత్యాలే!
మా కోడలు, మా కుటుంబంలో ప్రవేశించి, మాతో సుమారుగా నెలకు పైగా గడపడం వల్ల ఆమె ఏమిటో మాకు పూర్తిగా తెలిసిపోయింది, నా కొడుకు అదృష్టవంతుడిని తేలిపోయింది. ‘అంతా మన మేలుకొరకే’ అన్న నానుడి నిజమని తేలింది. మా కోడలు అతి తక్కువ సమయంలోనే మా అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ విధంగా మా రెండు కుటుంబాలు అదృష్టానికి నోచుకున్నాయి. కొడుకు – కోడలు, సంసారిక జీవితం ఆనందమయం కావాలనే నేను ఎప్పుడూ కోరుకుంటాను, విధివ్రాతకు తల వంచక తప్పదని నమ్ముతాను!
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.