నేను క్రైస్తవుడినేనా..!!
మతాలూ-మతసామరస్యాలూ అనే అంశాలు అవగాహన లోనికి వచ్చేసరికి సమాజం అన్ని విషయాలలోనూ కులాలుగా, మతాలుగా, ప్రాంతీయవాదులుగా విడిపోవడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఎవరి కులాన్ని వారు, ఎవరి మతాన్ని వారు, ఎవరి ప్రాంతాన్ని వారు బలపరచుకోవడం మొదలు పెట్టేశారు. ‘మనమంతా ఒక్కటే, మన ద్యేయం ఒక్కటే..!’ అన్న మూలసూత్రం మూలన పడిపోయి, అది ఒక నినాదంగా మిగిలిపోయింది. సాహిత్యం, కవిత్వం, సాహిత్య సాంస్కృతిక సంస్థలు సైతం, కులాలవారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోవడం భవిష్యత్తు ఊహించనంత భయాందోళనలకు గురి కావడం అందరూ గమనిస్తున్న విషయమే. ఇలాంటి సున్నితమైన విషయాలను వ్యతిరేకిస్తున్న వారూ వున్నారు, సమర్థిస్తున్నవారూ వున్నారు, విశేషం ఏమిటంటే ఈ రెండు పక్షాలూ మేధావి వర్గానికే చెందినవారు కావడం. ఈ పరిస్థితి రాజకీయంలోకి కూడా ప్రవేశించి, ఓటర్లను కులాలవారీగా, మతాల వారీగా, ప్రాంతాలవారీగా విడదీసి లెక్కగట్టడం బాధాకరమైన విషయం.
ఇది రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి, ప్రపంచ శాంతికి ఎంతవరకూ ఉపయోగం, ఎంతవరకూ అపాయకరం అన్నది తిరిగి మేధావులే నిర్ణయించవలసి వుంది. మన భారతదేశం హిందూ దేశంగా కొనియాడబడుతున్నప్పుడు, ఇతర మతాలూ మన దేశంలోకి ఎలా ప్రవేశించాయో విశ్లేషించుకుంటే చాలా బాధాకరమైన విషయాలు బయట పడతాయి, అందుచేత ఇలాంటి విషయాల గురించి పరిశోధనలు చేయరు, చేసినా ఆ ఫలితాలు సామాన్య ప్రజానీకానికి చేరనివ్వరు. అందుచేత అసలు విషయాలు ఎప్పటికీ మరుగున పడే ఉంటాయి. మా నాయన స్వర్గీయ కామ్రేడ్ కానేటి తాతయ్యగారు, మా ఇంటికి ఎవరైనా క్రిస్టియన్స్ (మా బంధువులే కావచ్చు) వస్తే, వారిని ముందుగా ఒక ప్రశ్న వేస్తే; వారు తికమక పడి పోయేవారు.
ఆ ప్రశ్న ఏమిటంటే “అసలు క్రైస్తవ మతం మన దేశం లోనికి ఎలా వచ్చిందో తెలుసునా?’’ అని. మాకు బాగా చిన్నతనం, ఆయన ప్రశ్న విన్నాక నా మట్టుకు నాకు ఏమి అనిపించింది అంటే ఇది మనదేశానికి సంబందించిన మతం కాదని. నాకు తెలిసి ఆయన అడిగిన ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్పేవారు కాదు. చివరికి ఆయనే సమాధానం కూడా చెప్పేవారు.
తరచుగా మా నాయన దీని గురించి మాట్లాడినదానిని బట్టి నేను గ్రహించింది ఏమిటంటే, ఆనాడు ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం మనదేశానికి వచ్చినా ఇక్కడ వాళ్ళు గుర్తించిన ‘అస్పృశ్యత’ అంశంతో దళిత వర్గాలకు జరుగుతున్న వివక్షతను సొమ్ముచేసుకునే ప్రయత్నంలో, సమాజంలో చిన్నచూపుకు గురి అవుతున్న వర్గాలను దగ్గరకి తీశారు. వాళ్ళ చదువు విషయంలో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. పాఠశాలలు ప్రారంభించి ఉచితంగా చదువు అందించారు. ఆసుపత్రులు నిర్మించి ఉచితవైద్యం అందించారు, మంచి తిండి, బట్ట సమకూర్చారు. ఇంత దగ్గరితనంతో, ప్రేమాభిమానాలు అందించడమే కాక సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశం కల్పించడంతో, ఆయా పేదవర్గాలలో అనూహ్యమైన స్పందన దానికదే వచ్చేసింది. అలా వారి మాటకు విలువ దక్కింది, వాళ్ళు చెప్పకుండానే ఎక్కువమంది క్రైస్తవం వైపు మొగ్గు చూపడం జరిగిపోయింది. ఆంగ్లేయులకు మాత్రం ‘మత ప్రచారకులు’గా అపకీర్తి దక్కింది. ఈ సమాచారం తెలుసుకున్న తరువాత, విద్యాపరంగా వారు చేసిన మహత్తర సేవలకు గుర్తుగా ఇప్పటికీ, తూర్పు గోదావరి జిల్లాలోని, సఖినేటిపల్లిలో వున్న ‘లూథరన్ హై స్కూల్’; పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో వున్న ‘మిస్సమ్మ ఆసుపత్రి’ చిన్న ఉదాహరణలు మాత్రమే! ఎంతోమంది పేదపిల్లలు లూథరన్ హై స్కూల్లో చదువుకుని పెద్ద పెద్ద హోదాలలో స్థిరపడిన వారు వున్నారు. అందులో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా వున్నారు. మిస్సమ్మ ఆసుపత్రిని ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలూ వినియోగించుకోగలగడం గమనించ దగ్గ విషయం!
ఇటువంటి కొన్ని ప్రజోపయోగకరమైన పనులు సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించడంలో ఆశ్చర్య పడనక్కరలేదు. ఆ పరిస్థితులు రావడానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
ఇటువంటి నేపథ్యంలో మాది నూటికి నూరుశాతం ‘నాస్తిక కుటుంబం’. మా వూరిలో ‘చర్చి’ ఒక్కటి కూడా లేదు. మా పక్క గ్రామమైన రామరాజులంక’ (మా అమ్మమ్మ వూరు)లో మాత్రం ఒక చర్చి ఉండేది. ఆ గ్రామంలో తొంబై శాతం పైన క్రైస్తవులు ఉండేవారు. ఇక్కడ వింత ఏమిటంటే మా అమ్మ ‘చొప్పల’ వారి ఇంటి ఆడపడుచు. వారిది క్రైస్తవ కుటుంబం. కానీ మా అమ్మ కానేటి (చొప్పల) వెంకమ్మ వచ్చి నాస్తిక కుటుంబంలో పడింది. అది ఎలా జరిగిందో తెలీదు కానీ మా ఇంట్లో ‘దేవుడు’ అనే పదం అసలు వినిపించేది కాదు. మా మేనమామలు, పెద్దమ్మ, పిన్ని, క్రైస్తవం లోనే ఉండేవారు. నేను పెద్దగా ఎదిగి కాస్త లోకజ్ఞానం వచ్చిన తర్వాత కూడా, ఈ మతాల సమస్య నన్ను ఇబ్బంది పెట్టలేదు. పైగా అన్ని మతాలను నేను గౌరవించేవాడిని,
ముస్లింలలో, క్రైస్తవులలో, హిందువులలో నాకు మంచి మిత్రులు ఉండేవారు. స్నేహానికి తప్ప మరి ఏ ఇతర అంశాలకు ప్రాధాన్యత నిచ్చేవాడిని కాదు. అయితే ఈ మత సమస్య నాకు పెళ్లి సమయంలో అంకురించింది. నాకు నచ్చిన అమ్మాయి, క్రైస్తవ మతస్తురాలు కావడంతో సమస్య ఉత్పన్నమైంది. అవతలి వాళ్లకి నేను క్రైస్తవుడిని కాకపోవడం వల్లనే ఇబ్బంది వచ్చింది. వాళ్ళ కుటుంబంలో తొంబై తొమ్మిది శాతం నా పట్ల వ్యతిరేకత వచ్చింది. మతం తప్ప అన్ని విషయాలలోనూ నేను వాళ్లకు నచ్చాను. మతపిచ్చి ఎంత లోతుగా వేళ్లూనుకుందో అప్పుడే నాకు అర్థం అయింది.


తల్లిదండ్రులతో. రచయిత శ్రీమతి (నిలబడ్డ వారిలో కుడి)అరుణ
అమ్మాయి (ఇప్పుడు నా శ్రీమతి) నన్నే చేసుకుంటానని పట్టుపట్టడం, అమ్మాయి తల్లి కూతురికి అనుకూలంగా మారడంతో సన్నివేశం సుఖాంతం వైపు మళ్లింది. నేను కూడా తగ్గి క్రైస్తవ వివాహానికి తలఒగ్గక తప్పలేదు. పెళ్లి వరకూ అంతా సజావుగానే సాగిపోయింది.


క్రైస్తవ పద్ధతిలో రచయిత వివాహం
తర్వాత ఆచార వ్యవహారాలతో ఆమెకు సమస్య వచ్చిపడింది. పెళ్లి సమయానికి నేను మహబూబాబాద్ ఆసుపత్రిలో పని చేస్తున్నాను. ‘బొట్టు’, చర్చికి వెళ్లడం విషయంలో ఆంక్షలు విధించేవాడిని. కొన్నాళ్ల తర్వాత నేను చేస్తున్న పని సరియైనది కాదని నాకే అనిపించింది. నన్ను ప్రేమించి, నా మీద నమ్మకంతో నా అడుగులో అడుగు వేసి నా కూడా వచ్చిన వ్యక్తిని అలా వేధించడం, మానసికంగా హింసించడం సబబు కాదనిపించింది. తక్షణమే నా ఆంక్షలు తొలగించి ఆ విషయాలలో ఆమెకు స్వేచ్ఛను ఇచ్చాను. నా మూర్ఖత్వానికి నేనే సిగ్గుపడ్డాను, అలాగే బాధపడ్డాను కూడా. ప్రతి క్రిస్మస్కు విజయవాడ వెళ్ళేవాళ్ళం, అలాగే ప్రతి సంక్రాంతికి, మా పెద్దక్క (దక్షిణ విజయపురి, నాగార్జున సాగర్) దగ్గరికి వెళ్ళేవాళ్ళం. పండగ కోసం అనే కాక, నా పుట్టిన రోజు ‘భోగి’ పండుగ రోజున వచ్చేది, అందువల్ల అలా ఆ సమయం అక్క దగ్గర గడిపేవాళ్ళం.
హన్మకొండ వచ్చిన తర్వాత నా శ్రీమతిని కారులో నేనే చర్చికి తీసుకు వెళ్ళేవాడిని. అయినా నన్ను ఎవరూ క్రిస్టియన్‌గా గుర్తించేవారు కాదు. కానీ మా పిల్లల పెళ్లిళ్లతోనే,నా స్నేహితులు చాలామంది నేను ‘ఫలానా’ అని తెలుసుకున్నారు. కొందరు ఆశ్చర్యపోయారు, ఎందుకో నాకు ఇప్పటికీ తెలియదు. మేము మా స్వార్థం కోసం చేసిన పని వల్ల ఏ రూపంలోనూ పిల్లలకు ఇబ్బందులు రాకూడదన్నదే నా అభిమతం. అందుకే నేను మతం విషయంలో మొండి వైఖరి ప్రదర్శించలేదు. సంసారం చల్లగా, ఆనందంగా సాగిపోవడమే ముఖ్యం అన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం వల్ల, ప్రతివిషయము లోనూ పరస్పర అవగాహనా, ఆలోచనా విధానం మా ఇద్దరిలోనూ ఉండడం మూలానా ఎలాంటి సమస్యలకూ తావు లేకుండా పోయింది. అందుచేత నేను ఏమిటో నాకు బాగా తెలుసును, ఇతరులు ఏమనుకున్నా నాకు అభ్యంతరం ఉండదు.


రచయిత కూతురి క్రైస్తవ వివాహం


క్రిస్మస్ సంబరాలలో రచయిత కుటుంబం


రచయిత కూతురు, అల్లుడు, మనవరాలు ‘ఆన్షి’
సంసారంలో సుఖశాంతులే ముఖ్యమని భావించేవారిలో నేనూ ఒకడిని. ఎలాంటి ఇజాన్ని తలకు చుట్టుకోకుండా, చేతనయినంత సహాయం ఏదో రూపంలో సమాజానికి అందించాలన్నదే నా ధ్యేయం! నేను బ్రతికి ఉన్నంత కాలం ఇదే కొనసాగుతుందేమో!
ఇప్పటికీ ఈ అరవై ఎనిమిదేళ్ల వయసులోనూ నేను అనుకుంటాను, ఇంతకీ నేను క్రైస్తవుడినేనా? ఏమో..!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
23 Comments
Sagar
మతం,కులం అనే పట్టింపులు నేటికీ కొనసాగుతున్న జాడ్యమే సర్. కానీ ఇది అన్నీ రంగాలకు వ్యాపించమే విచారకరం. ఇక మీ విషయంలో ము హుందాతనం మేడంను బాధపెట్టకుండా స్వేచ్చనివ్వడం ముదావహం. మన అభిప్రాయం ఇంకొకరిపై రుద్దకూడదనేది మంచి సాంప్రదాయం సర్. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022*
డా. సిహెచ్. సుశీల
చాలా బోల్డ్ గా, లోతైన అవగాహన తో, బాల్యం నుండి ఎదలో మొదలైన ప్రశ్నలతో ఇప్పటి వరకూ అన్వేషణ కొనసాగిస్తున్న మీకు అభినందనలు డాక్టర్ గారు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలు మేడం
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Gd Mng Doctor garu,
As a doctor (kanipinche దైవం) you are above all the religions.
—–suryanarayana rao
Hyderabad.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you somuch sir.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
బాగుంది సార్… నేను ముందు ముందు చర్చించ బోయే విషయాలు….





కులాలు, మతాలు
వర్గాలు… ఈ వైషమ్యాల విషయాలన్నీ…
ఎన్నో కవితల ద్వారా నా అభిప్రాయాలను తెలియజేసాను ! ఈ విషయాలపై ఎందరితోనో…
వాదోపవాదాలు కూడా జరిగాయి ! ఆ విజయాలన్నీ నా బ్రతుకు బాటలో ముందు ముందు వస్తాయ్… !
మీ ఆలోచనలు… అనుభవాలూ బాగు న్నై !
–కోరాడ నరసింహారావు
విశాఖపట్నం.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
శ్యామ్ కుమార్ చాగల్
నాకు తెలిసినంత వరకూ రచయిత డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారి లో ఎక్కడా ఒక మత ఛాయలు కనపడవు. మత మౌఢ్యం మన భారతీయ జీవితాల్లోకి ప్రవేశించడానికి అనేక కారణాలు వున్నాయి. వాటి విశ్లేషణ అంత తేలిక కాదు. అందుకే ప్రసాద్ గారు ఆ విషయాన్ని ప్రస్తావించి వదిలేసారు. భారతీయ జీవన ప్రమాణాలు , సాంఘిక దురా చారాలు, ఉన్నత వర్గాల దోపిడీ , బీదరికం, విదేశీ దురాక్రమణలు ఇలా చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద శాస్త్రమే.
వ్యక్తిగత మైన ఉన్నత విలువలు, ఎదుటి వారి పట్ల , ముఖ్యంగా సహచరి విషయం లో మార్చుకున్న పద్ధతులు అందరికీ ఎంతో ఆచరణీయం. మతం అన్నది ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగతం . ఇతరులకు దాన్ని పులమడం, లేదా దాన్ని కించపరచడం ఆమోదనీయం కాదు.
సమాజం పట్ల రచయిత ప్రసాద్ కు వున్న ద్యేయం మరియూ భాద్యత చాలా గొప్పది.
తనకు నచ్చిన అమ్మాయిని చేసుకోవటానికి పడిన ఇబ్బందులు, అధిగమించిన తీరు చాలా బాగున్నాయి. అందుకే అంటారు ‘ మ్యారేజెస్ అర్ మేడ్ ఇన్ హీవెన్’ అని. డాక్టర్ ప్రసాద్ లాంటి వ్యక్తి స్నేహ సాంగత్యం లభించటం మా అదృష్టం. ఇంటర్మీడియట్ లో తనతో కలిసి చదువుకోవటం నా అదృష్టం.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలు మిత్రమా
Rajendra+Prasad
చాలా పెద్ద సబ్జెక్ట్ ను మీ మధుర స్మృతిలో చేర్చారు. క్రైస్తవం మొదటి శతాబ్దం లోనే యేసు ప్రభువు శిష్యుడు తోమా ( Thomas) కేరళ రాష్ట్రానికి వచ్చి సువార్తను ప్రకటించటం ద్వారా మొదలైందని కొద్ది మందికే తెలుసు. Subsequently we know christian missionaries in the British rule spread the gospel which aattracted the socially opressed classes OF THE HINDU Religion. LATER SOME People IN THE managed In Constitution, THESE OPPressed people lose the benefits if they accept the Christian faith . SURPRISINGLY WE SEE LOT OF hate Towards chrisTIANS and Christianity now adays. One of the reasons could be some selfisf people luring the people for conversions. But this is very less. People need to give importance to humanity and stop hating
In your case you did a good thing not to force your opinion on family. May God bless you all sir
– Rajendra Prasad
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
డి. వి. శేషాచార్య
మతం విషయంలో మీ అభిప్రాయం నూటికి నూరుశాతం కరెక్ట్. క్రైస్తవ మతం ఎలా వ్యాపించినదనే విషయం కూడా సహేతుకమే. సంసారంలో మతం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవడంలో మీ ఔదార్యం అన్నిటికంటే గొప్పది.అన్ని మతాలను గౌరవించే మీ మనస్తత్వానికి నమస్సులు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
,91 వ సంచిక చదివిన సర్.ఈసంచిక చర్చకు అనుకూలమైనది కాదని నా అభిప్రాయం.మతం అంటేశఇష్టం అనే అర్థం ఉన్నది.ఎవరి ఇష్టం వారిది.బలవంతపెట్టేదేమీ లేదు.వివిధవర్గాల మధ్య సన్నిహిత సంబంధాలుంటాయి.స్నేహం విలువ తెలిసిన వారు వర్గ వర్ణ,మతాలకు ప్రాముఖ్యత ఇవ్వరు.
మాదగ్గర రహమాన్ అని ఓ మిత్రుడుండేవాడు.ఆయన ఒక బ్రాహ్మణ యువతిని పెండ్లి చేసుకున్నాడు.ఆయన రోజూ నమాజ్ చదువుకుంటేశఈమె తులసి పూజ చేసుకునేది.మతం వారి సహజీవనానికి అడ్డురాలేదు..మారాలి అని వత్తిడి చేయటమూ సరి కాదో .ముఖ్యంగా ఇష్టపడి వివాహం చేసుకున్న వారు.అంతా సామరస్యం మీద ఆధారపడి ఉంటదీ అనుకుంట.
ఇందులోనూ రాజకీయాలు ప్రవేశించి మనిషి జీవితం ఇక్కట్లకు గురి ఔతున్నది.ఇవేవీ పట్టించుకోకుండా సామరస్యంతో బతుకుతున్న వారికి బతూక గల్గిన వారికి నమస్కారాలు.
అంతే
—నాగిల్ల రామశాస్త్రి
హన్మకొండ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
శాస్త్రి గారు ధన్యవాదాలండీ.
Bhujanga rao
మతాలు మత సమరస్యాలు అనే అంశం మీద చక్కని వివరణ ఇచ్చారు.పట్టింపులకు పోకుండా మేడం విషయంలో స్వేచ్ఛనివ్వడం మంచి పరిణామం.మీలో ఎక్కడ మత ఛాయలు కనపడలేదు.మీ అమ్మాయి వివాహం జరిగిన రోజు పరిస్థితుల ద్వారా తెలిసింది. ప్రతి విషయంలో పరస్పర అవగాహన,ఆలోచనా విధానం వల్ల మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలకు తావులేదు. మంచి విషయాలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
D. Umashanker
Well articulatd episode Sir. I never know about your religion so far. True friendship is above all religion. Even though I was born in Hindu Brahmin family, i was an atheist till I was married. I had close friends in Muslim, Christian and so called Harijan community. I used to go their houses on Eid, Christmas and other festivals and enjoyed their hospitality. My colleague Mr. K.A Paul never failed to invite me for Christmas. Like was another colleague Mr.Sayeeduddin. During my stay at Mahabubabad, my driver who is a muslim used bring my dinner from his home every day. Like you said, true friendship and love is above all religions. Humanity is our religion. Practicing one’s faith without hinderene to others and mutual respect and love should be our goal. Festive and New Year greetings to you and all your family members.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
చిన్ననాటి నుండి ఎదురైన ప్రశ్నకు అందమైన పరిష్కారమే ఇచ్చారు సర్.మతం మనస్సుకు సంబంధించింది అని మీ శ్రీమతి గారి విషయంలో మీరు చేసుకున్న సర్దుబాటు, వారి భావాలకు ఇచ్చిన ప్రాధాన్యత నాకు చాలా చాలా నచ్చాయి.మీ వ్యక్తిత్వం మీద ఉన్న గౌరవం ఈ జ్ఞాపకం చదవడం ద్వారా రెట్టింపుఅయ్యింది.జీవితం హాయిగసాగేందుకు కావలసిన వెసులుబాటులతో జీవనాన్ని మరింత మధురంగసాగిస్తూ నేటి యువజంటలకు తగిన మార్గదర్శనం చూపే మంచి జ్ఞాపకాన్ని పంచారు.మనస్సెరిగిన మీ దాంపత్యం మాకందరికీ ఆదర్శం సర్.మీకు ధన్యవాదాలు



—డి.నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అమ్మా
మీ విశ్లేషణ/స్పందన
అద్భుతం.
మీకు ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Sir.e jnapakam inka chala nachindi .
Kontha informative ga,
Kontha alochimpa chese,vidham ga ,
Aruna Gari lo unna maroka unnatha konam kuda telisindi.
Mee idhari ki aneka subhakankshalatho subha abhi vandanalu.
——-సుజనా పంత్
భీమారం హన్మకొండ
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మేడం ధన్యవాదాలండీ